top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... 12

గొల్లపూడి మారుతీ రావు

ఉద్యోగ పర్వం

 

సెప్టెంబరు 23: ఉద్యోగానికి రాజీనామా యిస్తున్నట్టు బి.కె.రావు ఐ.ఏ.యెస్ గారికి ఉత్తరం రాశాను.

నవంబరు 13: నాకు మద్రాసు బదిలీ ఆర్డర్లు వచ్చినట్టు శంబల్పూరు నుంచి శివాని ఫోన్‌లో చెప్పింది.

ఈ మధ్య దాదాపు 30 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి ఒక ఫోన్ వచ్చింది. దాదాపు నేను 58 సంవత్సరాల కిందట చిత్తూరులో తొలి ఉద్యోగం చేస్తున్నప్పుడు అక్కడ కలెక్టరుగా ఉన్న బి.కె.రావు ఐ.ఏ.యెస్ దగ్గర్నుంచి. ఆశ్చర్యం, ఆనందం. నా జీవితమంతా వారితో అనుబంధం విచిత్రంగా కొనసాగింది. ఆయన కలెక్టరుగా చిత్తూరులో ఉన్నప్పుడు నేను ఆంధ్రప్రభలో ఉపసంపాదకుడిని. ఆయన హైదరాబాదులో పంచాయితీరాజ్‌లో అసిస్టెంటు సెక్రటరీగా ఉన్నప్పుడు నేను ఆలిండియా రేడియోలో ఉద్యోగిని. నేను శంబల్పూరులో రేడియోలో ఉంటూ  ఉద్యోగానికి రోజులు లెక్క పెడుతున్నప్పుడు ఆయన ఆలిండియా రేడియో (డిల్లీ)లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (సిబ్బంది). అన్ని దశలలోనూ ఆయన ఊతం పరోక్షంగా నాకు దక్కింది.

ఆయనకి నాటకం అంటే ప్రాణం. దాదాపు 52 సంవత్సరాల కిందట ప్రముఖ నటుడు కె.వెంకటేశ్వరరావు హైదరాబాదులో నా 'మహానటుడు' నాటకాన్ని ప్రదర్శించాడు. అప్పుడాయన ప్రేక్షకుల్లో ఉన్నారు. ఎందుకనో  ఆ నాటకంలో పాత్రీకరణల్లో మార్పు అవసరమని ఆయన భావించారు. అలా భావించిన కొందరం ఆ రోజుల్లో మా యింట్లో కలిశాం. వారిలో బి.కె.రావు గారున్నారు. కె. వెంకటేశ్వరరావు నాటకాన్ని చదివాడు. మార్పుల్ని చర్చించాం.

ఆ మధ్య - ఓ పదేళ్ల కిందట రావుగారిని అమెరికా వెళ్లినప్పుడు కలిశాను. ఆయన ఒక సభకి అధ్యక్షత వహించారు. ఇప్పుడు ఉన్నట్టుండి 52 సంవత్సరాల కిందట జరిగిన సవరణ గురించి ఫోన్ చేశారు. ఆయన వయస్సు ఇప్పుడు 87. ఒక మనిషి ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండడానికి, మెదడులో ఆలోచనలు మురిగిపోలేదనడానికి  ఇది అద్భుతమైన నిదర్శనం.

ఇప్పుడు ఆయనతో ముడిపడిన, ఆయనకు ముఖ్యపాత్ర ఉన్న ఒక సంఘటన. 1972లో నా జీవితంలో చిన్న అవ్యవస్థ ఉంది. నేను ప్రమోషన్ మీద శంబల్పూరు బదిలీ అయాను. ఒక పక్క సినిమా పని. మద్రాసుకి నేను దాదాపు వెయ్యి మైళ్ల దూరంలో ఉన్నాను. పిల్లల్నీ, భార్యని వదిలి వారాల తరబడి మద్రాసులో. శంబల్పూరు జీవితం కేవలం ఉద్యోగాన్ని నమ్ముకున్నవాడికి కొంగు బంగారం. నేను సినిమాను నమ్ముకుంటున్నవాడిని. ఇబ్బందిగా ఉండేది. పిల్లలు చిన్నవాళ్లు. భార్య ఒంటరిగా వాళ్ల అజాపజా చూసుకునేది.

ఈ దశలో ఎన్.టి.రామారావుగారితో పరిచయం. వారి నిర్మాతలు అట్లూరి పుండరీకాక్షయ్యగారికి కథారచన సాగేది. రామారావుగారికీ, అక్కినేనికీ మధ్య్ ఆ రోజుల్లో వైరం. వివరాలు నాకు తెలియవు. నేను ఇద్దరికీ పని చేసేవాడిని. ఇద్దరూ గౌరవించేవారు.

ఈ లంక మేత, గోదావరి ఈత భరించలేక - ఈ నిర్వీర్యత ఏర్పడినాక - ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలనే నిర్ణయానికి వచ్చాను. అయితే ఇందుకు వ్యతిరేకులూ,  ప్రోత్సహించినవారూ చాలా మంది ఉన్నారు. హోటల్ సుధారాలో నా పక్క గదిలో ఉంటూ పాటలు రాసే సినారె నన్ను రాజీనామా చెయ్యమని ప్రోత్సహించేవారు. ఇంకా తాతినేని రామారావు, ముళ్ళపూడి వెంకటరమణ, నవభారత్ ప్రకాశరావుగారు - ఇలా సినిమా మిత్రులు నన్ను ఉద్యోగానికి రాజీనామా చెయ్యమనేవారు.

శంబల్పూరు సెంట్రల్ స్కూలు ప్రిన్సిపాలు ఎన్.షణ్ముగంగారు - ప్రత్యేకంగా ఉత్తరం రాశారు. ఎట్టి పరిస్థితులలోనూ ఉద్యోగానికి రాజీనామా చెయ్యవద్దు అని.

ఎన్.టి.రామారావుగారికి నా ఇక్కట్లు చెప్పాను. ఆయన  ఒక్క క్షణం ఆలోచించి "మీ జీతమెంత?" అన్నారు. ఆయన ఒకప్పుడు గవర్నమెంటు ఉద్యోగం చేసిన వ్యక్తి తొలిరోజుల్లో. చెప్పాను. "కొంచెం ఆలోచించి చెయ్యండి. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు. అంతా గొర్రెదాటు వ్యవహారం" అన్నారు. వారి నుంచి ఈ సలహా రావడం అప్పటికి విశేషం.

ఆ దశ చాలా అవ్యవస్థతో కూడిన దశ. సినిమాల మీద నమ్మకంతో ఒక గెజిటెడ్ ఆఫీసరు ఉద్యోగం రాజీనామా చెయ్యడం తేలికయిన పని కాదు. అయితే రాను రాను మద్రాసులో పని ముమ్మరంగా పెరగడం, గత కొద్దికాలంగా ఆఫీసు జీతం లేకపోయినా కుటుంబాన్ని నిర్వహించుకోగలగడం, కుటుంబాన్ని ఎక్కడో మనది కాని దేశంలో వదిలి రావదం - యివన్నీ ఎక్కువగా ఉద్యోగానికి రాజీనామా యిస్తే మంచిదనే ఆలోచనని బలం చేస్తూ వచ్చాయి.

ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే విధి ఎంత బలీయమైనదో అర్ధమవుతుంది. ఉద్యోగానికి రాజీనామా ఒక్క కాగితం మీద సంతకం. ఆ క్షణంలో రేడియోలోనే డిల్లీలో పని చేస్తున్న నా హితులూ, ఆత్మీయులూ బి.కె.రావుగారు గుర్తొచ్చారు. ఎందుకనో ఆయనకి నా మనసులో మాట చెప్పి రాజీనామా కాగితాన్ని పంపాలన్నా ఆలొచన వచ్చింది. ఇవాళ ఆలోచిస్తే అది దైవికం. సెప్టెంబరు 23న ఒక ఆత్మీయునికి, నా హితునికి వ్రాస్తున్నట్లు నా సాధక బాధకాలు , నా ఆలోచనా సరళిని విపులంగా ఒక అధికారికి వ్రాసినట్టు కాక, 12 సంవత్సరాలు ఎరిగిన  పెద్దాయనకి చెప్పినట్టు ఉత్తరం రాసి దాని గురించి మర్చిపోయాను. ఆ ఉత్తరంలో ఎటువంటి సహాయమూ కోరలేదు. ఆత్మీయునికి మనస్సు విప్పి చెప్పుకోవడం లాంటిది. ఉద్యోగానికి రాజీనామా చెయ్యాలన్న తలంపుకి అది మొదటి కార్యరూపం. ఆ తర్వాత నా చర్యలన్నీ ఆలోచన వైపుకే నడిచాయి. శంబల్పూరునుంచి కుటుంబాన్ని తరలించాలి. ప్రయాణానికి గవర్నమెంటు ఖర్చులు ఇవ్వదు. మద్రాసులో ఇల్లు కావాలి. ఇంతవరకూ సరిపెట్టుకున్న ఆదాయంతో ఇల్లూ, ఇంటి ఖర్చులూ జరగవు. ఇలాంటివన్నీ మనసులో కదులుతున్నాయి.

అయితే ఆ ఆలోచనల్ని ఎవరితో పంచుకోలేదు. ఇంట్లో ఎవరికీ ఈ ఆలోచన నచ్చలేదు. మా ఆవిడ ముందుగా కంగారు పడుతుందేమో. విజయవాడలో రాజీనామా చెయ్యడం వేరు. ఎక్కడో శంబల్పూరులో చెయ్యడం వేరు.

ఆలోచనలూ, జరగవలసిన తతంగం.. ఇక్కడ ఎంత పని చేస్తున్నా మనస్సులో కదులుతూనే ఉంది. ఎన్నాళ్ళు? సెప్టెంబరు 23 నుంచి నవంబరు 13 వరకు. ఏమిటా ముహూర్తం? ఆ రోజు మా ఆవిడ ఫోన్ చేసి నాకు మద్రాసు  బదిలీ చేస్తున్నట్టు, వెంటనే రిలీవ్ చెయ్యమంటూ ఆర్డర్లు వచ్చాయని తెలిసింది. నాకు తల తిరిగిపోయింది. ఇది ఊహించని మలుపు. రొట్టె విరిగి నేతిలో పడడం ఆంటే ఇదే. నేను మద్రాసులో సినిమా వ్యాసంగాన్ని కొనసాగించడానికి రాజీనామా చెయ్యాలనుకున్నాను. సరిగ్గా నన్ను మద్రాసుకే అర్జంటుగా బదిలీ చేస్తూ డిల్లీ నుంచి ఆర్డర్లు. నేను కాక మరొక్కరికే ఈ వ్యవహారం ఇంత క్షుణ్ణంగా తెలుసు. ఎవరు? బి.కె.రావుగారు. నన్ను బదిలీ చెయ్యగలిగే కుర్చీలొ ఆయన డిల్లీలో ఉన్నారు .అయినా నేను బదిలీ కోరలేదు. ఇది గడుసుదనం కాదు. అంత గడుసుదనం నాకేనాడూ లేదు. నా వ్యవహారాన్ని, సాధక బాధకాల్నీ ఆయన ముందు పరిచాను. దీనికి ఒకటే పరిష్కారం అని ఆయన ఆలోచించి ఉండాలి. ఫలితం ఈ బదిలీ.

ఒక పక్క ఆనందం. నేను పూనుకున్న విపత్తు.. రాజీనామా.. ఇంత సుళువుగా పరిష్కారమైనందుకు . ఇప్పుడేం చేయాలి? ఎలాగ ప్రొసీడ్ అవ్వాలి? అప్పుడు మద్రాసు రేడియోలో మిత్రులు, హితైషి దాశరధిగారు పని చేస్తున్నారు. వారికి ఫోన్ చేసి నా బదిలీ సంగతి చెప్పాను. ఆయన ఆనందించి. " ఫోన్ పెట్టేయ్. నేను మళ్లీ చేస్తాను" అన్నారు. కాస్సేపటికి ఫోన్ చేశారు. "అవును అబ్బాయ్! నీ బదిలీ మాట నిజమే. ఇక్కడికీ సమాచారం వచ్చింది. ఇక్కడ చాలా మంది దుర్మార్గులున్నారు. ఏం చేసిన చేస్తారు. నువ్వు వెంటనే శంబల్పూరు వెళ్ళి , రిలీవ్ అయ్యి ఇక్కడ జాయిన్ అయిపోవడం మంచిది. అప్పుడు కాని నేను సంతోషించను." అన్నారు.

అంతే, అందవలసిన సూచన అందింది. ఆఘమేఘాల మీద శంబల్పూరు చేరిపోయాను. అక్కడ అందరికీ ఆశ్చర్యం. మా అసిస్టెంటు స్టేషన్ డైరెక్టరుగారు సాగర్ మిస్త్రీ ఆపుకోలేక అడిగేశారు. "ఎలా సాధించావయ్యా బదిలీనీ?" అని. నవ్వి ఊరుకున్నాను.

ఈ విధంగా 1972లో ఉద్యోగానికి చెయ్యాలనుకున్న రాజీనామా మరో పది సంవత్సరాలు వాయిదా పడింది. ఈ పదేళ్లలో మద్రాసులో ఎన్నో సినిమాలు రాశాను. 1981లో కచ్చేరీ రోడ్డులో పెద్ద ఆక్సిడెంటు. కాలూ,, చెయ్యీ విరిగాయి. ఆసుపత్రిలో ఉండగానే "ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య" రచనకు వచ్చింది.

ఈలోగా కడప రేడియో స్టేషన్‌కు బదిలీ. మళ్ళీ ఈ రేడియో ఉద్యోగాన్ని ఎలా వదిలించుకోవాలి అనుకొంటున్న రోజుల్లో అసిస్టెంటు స్టేషన్ డైరెక్టరుగా ప్రమోషన్. కడప స్టేషన్ ఇన్‌చార్జిగా బాధ్యత.

"ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య"లో ప్రధాన పాత్ర నటించే ఆహ్వానం. ఇంట్లో మనస్తాపాలు. తప్పనిసరిగా, సందేహంగానే నటనా జీవితం ప్రారంభం. 1982 ఏప్రిల్ 23న సినిమా రిలీజు. ఇంటర్వెల్‌కే స్టార్‌ని. వెనువెంటనే "ఇది పెళ్లంటారా?" నేనూ, చిరంజీవి, రాధిక; మురళీమోహన్ హీరోగా నా ద్విపాత్రాభినయంతో  చిలకలూరిపేటలో "భాగ్యలక్ష్మి" సినిమా. వెంటనే "తరంగిణి" షూటింగ్.

అప్పటికి నా క్రమశిక్షణా రాహిత్యం రూఢీగా డిల్టీకి  పాకింది. నా మీద క్రమశిక్షణ చర్యకి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.  1982 జులై 9 నా ఉద్యోగానికి ఏమాత్రం సంకోచం చేకుండా రాజీనామా చేశాను. ఈసారి ఒక్కరికి ఈ విషయం చెప్పాను.. మా ఆవిడకి.

వెరసి.. నా జీవితంలో ఆ పదేళ్ళూ పెద్ద సంచలనం.

*****

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

bottom of page