MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
వచన కవిత్వ వ్యాకరణం
విన్నకోట రవిశంకర్
ఈ అంశం మీద మాట్లాడటంలో ఒక చిన్న ఇబ్బంది ఉంది .
వచన కవిత్వమంటే పడనివాళ్ళకి, అందులో వ్యాకరణం వెతకటమంటే ఎండమావిలో నీళ్లు, ఇసుకలో తైలం వెతకటం వంటిదనిపించవచ్చు. వేరొక వైపు, వచన కవిత్వాన్ని అమితంగా ప్రేమించే వచనకవుల దృష్టిలో ఏ అధికరణాలకి, అధికార గణాలకి లొంగని తమ కవిత్వం వ్యాకరణానికి మాత్రం ఎందుకు లొంగాలనే భావన ఉండవచ్చు. ఐతే, ఈ రకమైన వెసులుబాటు, స్వేచ్ఛ వచన కవిత మీద కొంతమందికి చిన్న చూపు ఏర్పడటానికి కారణమా, అందులో వ్యాకరణం పాత్ర ఏమైనా ఉన్నదా అని పరిశీలించటమే ఈ వ్యాసం ఉద్దేశం.
వచన కవిత్వం వచ్చి 50 సంవత్సరాలైనా, ప్రజాబాహుళ్యంలో ప్రచారం పొందిన కవితా వాక్యాలు దాదాపుగా లేవు (కొన్ని శ్రీశ్రీ కవితా వాక్యాలు మినహాయిస్తే). ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ తన ఉపన్యాసాలలో శేషేంద్ర శర్మ కవిత్వం నుంచి కొన్ని వాక్యాలు ఉటంకించటం కొంత మార్పు. శర్మగారు ఇప్పుడు ఉంటే ఇటువంటి ఆదరణకు తప్పక సంతోషించేవారు. ఐతే, జన సేనాని వరకు వెళ్లిన ఈ కవిత్వం, జన సైనికుల వరకు చేరిందా అన్నది సందేహమే.
ఇప్పటికీ వాడుకలో ఉండేవి పద్య పాదాలే . వాటిలో కూడా ఒకటి రెండు నాటకాలను మినహాయిస్తే భారతం, భాగవతం వంటి సంప్రదాయ సాహిత్యం నుంచి వచ్చినవే ఎక్కువ. అవధాన పద్యాలు కూడా అవధానిగారికి తప్పదు కాబట్టి గుర్తుంటాయి గాని మిగతా వారికి అంతగా గుర్తుండే అవకాశం లేదు.
అయితే పద్య కవిత్వానికి ఒక సహజమైన ఆకర్షణ ఉన్న మాట వాస్తవం. ఆ ఆకర్షణ నిబంధనలకు సంబంధించినది. నిబంధనలకు, అవి ఉన్న ప్రక్రియ మీద ఏర్పడే ఆసక్తికి మధ్య సంబంధం ఉంటుంది. సైడ్ వాక్ మీద నడుస్తున్న మనిషిని ఎవరూ విచిత్రంగా చూడరు. అదే తీగ మీద నడిచే మనిషిని అందరూ చూస్తారు. నీటి మీద నడిస్తే మరింత ఎక్కువ మంది చూస్తారు. అంటే నిబంధనలు పెరిగేకొద్దీ దానికి జనాకర్షణ పెరుగుతుంది.
అంతమాత్రం చేత స్వేచ్ఛ ఉన్నంత మాత్రాన సులభం అనుకోవటానికి లేదు. ఎందుకంటే స్వేచ్ఛ కెప్పుడూ కొంత మూల్యం చెల్లించవలసి వస్తుంది.
వచన కవిత్వం వ్రాయటం ఒక అడవిలోనో, ఎడారిలోనో నడిచేటప్పుడు మన దారి మనం నిర్మించుకోవటం లాంటిది. స్థూలంగా చెప్పాలంటే చందోబద్ధ పద్యం లోహం లాంటిది - ఒక స్థిరమైన రూపం కలిగి ఉంటుంది. వచన కవిత మైనం లాంటిది. దానికి తగిన రూపం ఇవ్వగలిగే నేర్పు కవికి అవసరమవుతుంది. కట్టుబాటుకి అలవాటు పడిన వాళ్ళకిది కష్టంగా ఉండవచ్చు. మొదట కవులుగా ప్రసిద్ధులై, తరువాత గీత రచయితలైన వారు రాణించారు గాని, మొదట గీత రచయితలైన వారు తరువాత వచన కవిత్వం రాసి మెప్పించిన సందర్భాలు దాదాపు లేవు.
కవిత్వం రెండు రకాలుగా మనల్ని తాకవచ్చు అందరికీ అందుబాటులో ఉన్న ఒక సామాన్య అనుభవాన్ని ప్రతిభావంతంగా చెప్పటం వీటిలో మొదటిది.
దానివల్ల పాఠకుడికి “ఈ కవి నా గురించి చెప్తున్నాడు” అనుకోవటం సాధ్యమవుతుంది.
రెండవది - పాఠకుని ఊహకు అందని విధంగా చెప్పటం ద్వారా ఆశ్చర్యం కలిగించటం .
ఉదాహరణకి నేను ఇటీవల రాసిన ఒక కవిత ప్రస్తావిస్తాను. దీని శీర్షిక “కాలగమనం”
ఎవరెవరో వెళ్ళిపోతారు
సంబంధం ఉన్నవాళ్లు, లేనివాళ్లు,
సంతోషం పంచినవాళ్లు,
విచారం పెంచినవాళ్లు,
ప్రత్యేకంగా ఏ భావమూ కలిగించనివాళ్ళు ,
సుదూర బాల్య తీరాల్లో
చెదురుమదురు అడుగులతో
సంచరించినవాళ్లు,
యౌవన యవనిక మీద
బొమ్మలుగా కదిలినవాళ్ళు ..
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
స్మృతి పథంలో ఏనాడో కనుమరుగైనవాళ్ళు
మృతి వార్తతో మళ్ళీ కళ్ళల్లో మెదుల్తారు.
స్థలకాలాల దూరాలు
దారపు ఉండల్లా చుట్టుకొనిపోతాయి.
గతించిన అనుభవాలు
వర్తమానంగా భ్రమ కలిగిస్తాయి.
ఎగిరిపోయిన హంసల గురించి
కబురందించే కాకులు
చిందరవందర జ్ఞాపకాల
చిరుచీకట్లలోనుంచి
వెలుగు పాలను వేరుచేస్తాయి.
కాలం జారిపోతుంది
పలకరించే మొలకల గుసగుసల కంటే
ఏనాటి పాత చెట్లో
నేల కూలిన పరిచిత రవాలు
నిశ్శబ్ద వనంలో
నిలకడగా వినపడతాయి.
కొడగట్టని తలదీపాలేవో
కొలిక్కిరాని తలపుల్లో
నిరంతరం రెపరెపలాడతాయి.
ఈ కవితను ప్రచురించినప్పుడు బెంగుళూరులో ఉన్న ఒక పాఠకుడు తనకు సరిగ్గా ఇటువంటి ఆలోచనలు ఈమధ్య కలుగుతున్నాయని రాశారు.
నేను రాత్రి ని శాపంగా తాగుతున్నాను
దీనికి పూర్తి భిన్నంగా ఉన్న మరొక కవితను తీసుకుందాం.
ఇది కూడా మృత్యువు గురించి రాసినదే. దీని పేరు “కప్పల సముద్రం “ . ఇది ఎం.స్. నాయుడు రాసిన కవిత :
ఎత్తుపళ్ల సముద్రం
అలలు కొరుకుతున్న కలలు
నిద్ర తో మాట్లాడటం వరమే
నేను నీడలతో మాట్లాడలేను శత్రువు ఒంటరే , అందుకే ప్రేమిస్తున్నాను
....
గోడకానుకున్న నీడలు
గెడ్డాలు పెంచుకుంటున్నాయి
ఎవరైనా చనిపోతే
ఏమీ రాయను ఏడ్వను
నాన్న చనిపోతే ....
తీరంపైన పేరులేని ఇటుకలు
ఇసుక మేటలు, ఇసుక ఇళ్ళు
ఇసుక సమాధులు , ఇసుక కన్నీళ్లు
తడి లో అడుగులు మాయమవుతున్నాయి
ఇంకొక అడుగుగేయకుండా ఉండలేకున్నా
సముద్రం లోపలి కప్పలకి
జ్ఞానం ఎక్కువైనా పర్వాలేదు
వాటి గొంతుక మారదు
వాటి కలలూ మారవు
దూకలేను కన్నీటి బట్టలేసుకుని
కన్నే కన్నీరుని తుడుచుకుంటోంది
నేనింక ఏడ్వలేను
ఇందులో మనకు అంత తేలికగా అర్థంకాని పదచిత్రాలు, వ్యక్తీకరణలు ఉంటాయి. కవి దేనికోసమో బాధపడుతున్నాడని మనకు అస్పష్టంగా తెలిసినా, దానిని వ్యక్తపరచటానికి అతనెంత విభిన్నమైన పద్ధతిని పాటించాడో కదా అనిపిస్తుంది. ఒకరకంగా మన ఆలోచనల, ఊహల పరిధిని అతను విస్తరిస్తాడు. భావ పరిధిని అతిక్రమించినవాడు, భాష పరిధిని మాత్రం దాటలేడా అంటే, దాటతాడు. తన పుస్తకానికి ఆతను పెట్టిన పేరు “ఒక వెళ్ళిపోతాను”. వ్యాకరణరీత్యా ఇది ఒక అసంబద్ధమైన వాక్యం. ఐతే, ఒక అసంబద్ధ అవ్యవస్థను స్ఫురింపజెయ్యటానికి అది తోడ్పడుతుంది.
ఇలాగే, వ్యాకరణపరంగా సమ్మతంకాని పదప్రయోగాలు, సమాసాలు వచన కవిత్వంలో కనిపిస్తాయి.
ధ్యానం + చెయ్యటం = ధ్యానించటం ఐతే, స్నానం+చెయ్యటం = స్నానించటం , గానం+చెయ్యటం = గానించటం వంటి పద ప్రయోగాలు అక్కడ చూడవచ్చు. నిజానికి ఇటువంటి ప్రయోగాల్ని వడ్డెర చండీదాస్ గారు ప్రచారంలోకి తెచ్చారు గాని, వచన కవులు కూడా వాడారు.
దుష్ట సమాసాలు , వైరి సమాసాల వంటివి కూడా ఇటువంటి కోవలోకే వస్తాయి. ఒక ప్రత్యేక సందర్భంలోనో, ఒక నిరసనను తెలియజేసే పనిలో భాగంగానో అటువంటివి చెయ్యటం సమర్థనీయమే. సంస్కృతమే కాదు, ఇంగ్లీషు పదాలతోనూ పదబంధాలు చేసే వాళ్ళున్నారు. రేపు లాటిన్, స్పానిష్ పదాలతో కూడా ఎవరైనా "సంతోషంబున సంధి సేయుదురే" అంటే, పరమ సంతోషంగా ఆ పని చెయ్యటానికి మన వచన కవులు సిద్ధంగా ఉంటారు.
ఈ ప్రయోగాలవల్ల భాషకేదో అపచారం చేస్తున్నారని మనం భావించకూడదు. భాషకిదొక అలంకారంగానే చూడాలని నా ఉద్దేశం. మనందరికీ భాష తల్లివంటిది. ఒక్క కవికి మాత్రం అది కూతురు లాంటిది. మన పిల్లల్ని మనం రకరకాలుగా ముస్తాబు చేస్తాం. కొన్నిసార్లు ఫన్నీగా వాళ్ళని తయారు చెయ్యవచ్చు. అది ప్రేమతో చేసేదేగాని, వాళ్ళని తక్కువచెయ్యాలనే ఉద్దేశం మనకుండదు కదా. కవులు భాషతో చేసే ప్రయోగాలు కూడా అటువంటివే. కానీ, తెలియనితనంవల్ల ఎవరైనా అటువంటి పనిచేస్తే, ఇలా తెలుగు, సంస్కృత పదాల్ని కలపకూడదని వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. తను వాడిన పదప్రయోగంలో ఒక పదం తెలుగని , మరొకటి సంస్కృతమని కూడా తెలియని వాళ్ళెవరైనా కవిత్వం రాస్తున్నారంటే, మన కవిత్వ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించవలసి వస్తుంది.
పదాల్ని కలపటంలోనే కాదు, కలపకపోవటంలోనూ వచన కవులకి ప్రత్యేకత ఉంది. పద్యంలో విధిగా సంధిచేసే పదాల్ని వచన కవితలో విడివిడిగా రాయటం మనం తరచుగా చూస్తాం. అలాగే ఒక వాక్యంలో ‘ఉ’ వంటి అక్షరంతో మొదలయ్యే పదం వచ్చినప్పుడు, దానికి అచ్చు వాడాలా, హల్లు వాడాలా అనే సందేహం తరచుగా కలుగుతుంది. ఒకసారి శ్రీకాంత శర్మ గారెని ఈ విషయం అడిగితే, ఏదైనా ఫరవాలేదు. కానీ, పుస్తకంలో అన్నిచోట్లా ఒకలాగే ఉండేట్టుగా చూసుకోమని చెప్పారు.
ఇక భాషా భాగాల గురించి కొద్దిగా చెప్పుకుందాం. సాంప్రదాయ సాహిత్యంలో నామవాచకాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ధర్మరాజు, అర్జునుడు, ప్రవరుఁడు, వరూధిని, యామినీ పూర్ణతిలక - ఇలా ఎవరైనా ఒక పేరు కావాలి. దేవుడి గురించి రాసినా, ఆయనకున్న సహస్ర నామాల్లో ఏదో ఒకటి తీసుకునే చెప్పాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా, వచన కవిత్వంలో సర్వనామాలకే ప్రాధాన్యత ఎక్కువ. నేను, నువ్వు, వాడు, వాళ్ళు - ఇలా. వీటిలో సర్వనామాల్ని ఒక సమూహానికి ప్రతినిధిగా వాడటం తరచుగా జరుగుతుంది. ‘నేను’ అన్నప్పుడు కూడా, సాధారణంగా అది కవినే ఉద్దేశించినా, కొన్ని సందర్భాల్లో ఒక సమూహాన్ని సూచిస్తుంది. "నేనొక్కణ్ణే నిలిచిపోతే .." అన్నప్పుడుకవి చెబుతున్నది తన గురించి కాదు.
‘మీరు’ అన్నది కూడా అంతే. "అదృష్టవంతులు మీరు .. వెలుగును ప్రేమిస్తారు"అని రాసిన కవితలో మీరంటే పాఠకుడు కాదు. కొన్నిచోట్ల కర్త లోపించిన వాక్యాలు ఉండవచ్చు. ఇక్కడ పని చేస్తున్నది ఎవరన్నది పాఠకుని ఆలోచనకే వదిలిపెట్టబడుతుంది.
విషయానికి వస్తే, తెలుగు వాక్యం క్రియతో అంతం కావటం సహజమైన పధ్ధతి. కొత్తగా కవిత్వం రాసే కొందరు క్రియతో మొదలుపెడితే కవిత్వమౌతుందని పొరబడటం కద్దు. "నేను వస్తున్నాను" అంటే వచనమని, "వస్తున్నాను నేను" అంటే చాలు కవిత్వమని వాళ్ళ అపోహ. వచన కవిత్వంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, అసలు క్రియే లేకుండా కేవలం నామవాచకాలతోనే నడిచే కవితలు రాసే పధ్ధతి అక్కడ సాధ్యమౌతుంది. ఉదాహరణకి ముకుంద రామారావుగారి “పదవీ విరమణ” అన్న కవిత తీసుకుందాం.
అన్ని రోజుల్లా ఆ రోజు
అయినా...
తెలియనిదేదో అప్పుడే తెలిసినట్టు
తెలియకుండానే వయస్సు వచ్చేసినట్టు
తెలిసిన ప్రపంచం చాలా కొత్తగా వింతగా
కొట్టిపారేయలేని
కొత్త భయాల
సరికొత్త ఆందోళనలు
అలవాటయిన బతుకు ఆఖరై
అలవాటు కాబోయే సమీకరణాలు
దెబ్బతింటున్న ప్రతిక్షణం
అధికారం లేని ఒంటరి తనం..
ఎక్కడా క్రియాంత వాక్యాలు లేకుండానే ఈ కవిత సాగింది. పదవీ విరమణని నిష్క్రియగా రాయటంలో ఒక ప్రతీకాత్మక ఔచిత్యం కూడా మనకు ఇందులో మనకు గోచరిస్తుంది. (ఐతే, రామారావుగారి విషయంలో అది నిజం కాదనుకోండి. పదవీ విరమణ తరువాత ఇనుమడించిన ఉత్సాహంతో అనేక స్వీయ/అనువాద రచనలు ఆయన చేస్తూ వస్తున్నారు. )
సాంప్రదాయ పద్యంలో విశేషణాలకు కూడా విశేష ప్రాధాన్యత ఉంది. పద్యాల్లో వచ్చే సుదీర్ఘ సమాసాలు సాధారణంగా వివిధ విశేషణాలతో కూడుకున్నవిగానే ఉంటాయి. ఒకసారి విశ్వనాథ వారు ఏదో సందర్భంలో జడ గురించి పద్యం చెబుతున్నారట. అందులో ఒక సమాసం రెండు పాదాలకు విస్తరిస్తే, పక్కనున్నాయన "అబ్బా, ఎంతపెద్ద సమాసమో"అన్నాడట. దానికి విశ్వనాథ నవ్వుతూ "ఏం చెయ్యమంటావు, జడ అంత పొడుగ్గా ఉంది" అన్నారట.
వచన కవిత్వంలో వీటి వాడకం తక్కువ. ఒకటి రెండు విశేషణాలు తప్పితే, వరసగా అనేక విశేషణాలు వచన కవులు వాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.
మనం పరిశీలించవలసిన మరొక అంశం విరామ చిహ్నాలు. ఒక పాశ్చాత్త్యకవి గురించి ఒక కథ ఉంది. ఆయన రాసిన ఒక కవితలో ఒక చోట కామా ఉంచాలా, వద్దా అనే మీమాంస కలుగుతుంది. ఎటూ తేలక, కామా లేకుండానే పబ్లిషర్ కి పంపించేస్తాడు. కానీ, రెండు రోజులకి మళ్ళీ కామా ఉంచితే బాగుటుందనిపిస్తుంది. ఆవిషయం పబ్లిషర్ కి టెలిగ్రామ్ ఇస్తాడు. మళ్ళీ రెండు రోజులకి మనసు మారి ఇంకో టెలిగ్రామ్ ఇస్తాడు. ఇలా కొన్నిసార్లు జరిగాక, ఇక చివరికి ఆ పబ్లిషర్ " అయ్యా, ప్రపంచంలో ఉన్న సవాలక్ష సమస్యల్లో, మీ కవితలో ఆ కామా ఉండాలా, లేదా అన్నది పెద్ద సమస్యే కాదు. ప్రస్తుతం ఎలా ఉంటే అలాగే ఉంచేద్దాం" అని వేడుకోవలసి వస్తుంది.
అందువల్ల, తన కవిత super pefect గా ఉండాలనే చాదస్తం కలిగిన కవికి అవిరామమైన ఆందోళన కలిగించే శక్తి విరామ చిహ్నాలకుందని మనం గుర్తించాలి. దీనినుంచి బయట పడటానికి సులభమైన మార్గం వాటిని పూర్తిగా వదిలిపెట్టటమే . ఇటీవలి కాలంలో చాలా మంది అదేపని చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అది బహుశా సమర్థనీయమే. కామాల వంటివే కాకుండా ఒక స్టాన్జా ముగిశాక ఫుల్ స్టాప్ పెట్టటం వంటివి కూడా. ఈమధ్య విరామ చిహ్నాల గురించి వెతుకుతూ వివిధ కవుల కవితలతో కూర్చిన ఒక వార్షిక కవితా సంకలనాన్ని తిరగేస్తున్నాను. వాక్యాంతంలోగాని, స్టాన్జా చివరగాని ఫుల్ స్టాప్ ఎక్కడా కనిపించటంలేదు. చివరికి ఒక కవితలో స్టాన్జా చివర ఫుల్ స్టాప్ ఉండటం గమనించి “ఫరవాలేదు, ఈయనెవరో ఇంకా ఇది వాడుతున్నాడే” అనుకున్నాను.
తీరా చూస్తే అది నా కవితే ! “నేనెంత ఓల్డ్ స్కూల్ ఐపోయానో కదా!” అనుకోవలసి వచ్చింది. ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు మాత్రం చాలామంది వాడుతున్నట్టుగానే అనిపిస్తోంది. నిజానికి అవి మాత్రం ఎందుకు? ఒక వాక్యంలో ప్రశ్న ఉందని, లేదా ఆశ్చర్యంతో కూడుకొని ఉందని పాఠకుడికి అర్థమౌతూనే ఉంటుంది కదా. ఏనుగు బొమ్మ వేసి, ఏనుగుని రాసినట్టు, ఆ చిహ్నాలతో నూ పనిలేదేమో!
డబుల్ కోట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆధునిక వచన కవితలో సంభాషణలు చోటుచేసుకునే అవకాశం తక్కువ. ఒకవేళ ఉన్నా, ఒకొక్కరి డైలాగు ఒక లైనులో వస్తే, అప్పుడు కోట్స్ అక్కరలేకపోవచ్చు. ఉదాహరణకి శ్రీశ్రీ ప్రసిద్ధ కవిత “అవతలి గట్టు” తీసుకుందాం. ఇది ఇద్దరి మధ్య సంభాషణో, లేక కవి తనతో తాను జరుపుకునే సంభాషణో గాని ఇలా సాగుతుంది :
___ఇవేమిటి వింత భయాలు ?
___ఇంట్లో చీకటి !
____ఇవేమిటి అపస్వరాలు ?
___తెగింది తీగ !
___అవేమిటా రంగుల నీడలు ?
___చావూ, బ్రదుకూ !
___ఎచటికి పోతా వీ రాత్రి ?
___అవతలి గట్టుకు !
ఇందులో కొటేషన్లు లేవు. కానీ, ప్రతి లైను ఒక అడ్డగీతతో ప్రారంభమౌతుంది. ఇదొక ప్రత్యేక పధ్ధతి. నిజానికి “మహా ప్రస్థానం” లో అడ్డగీతలు, ప్రశ్నార్థకాలు, ఆశ్చర్యార్థకాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ప్రముఖ అమెరికన్ కవయిత్రి ఎమిలీ డీకేన్సన్ కూడా ఇటువంటి అడ్డగీతలకి ప్రసిద్ధి.
సంభాషణగా నడిచే మరొక కవిత వి.ఆర్.విద్యార్థి రాసిన “ఇది కథ కాదు”. వస్తురీత్యా ఇది ఒక shocking poem. ఇందులో కూడా ఒక విచిత్రమైన సింటాక్స్ పాటించారు. ఒక మగ మనిషికి, ఆడ మనిషికి జరిగే ఈ సంభాషణలో అతడి డైలాగ్ కోట్స్ లేకుండానూ, ఆమె జవాబు కొటేషన్ల లోనూ ఉంటాయి:
ఎవరు నువ్వు?
- "అబలను"
ఎందుకున్నా విక్కడ ?
- "మీ వంటి వాళ్ళ కోసం"
ఈ వృత్తినే ఎందుకు ఎన్నుకున్నావు?
-"ఈ దేశంలో మరో వృత్తి దొరకలేదు కనుక " …
ఇంకా ఎంతకాలం చేస్తావీ వృత్తిని?
-" మీవంటి వాళ్ళ కళ్ళకు నచ్చినంత కాలం!"
తర్వాత?
-"విషం తయారుగా ఉంది
... ...
నాతో వస్తావా?
-"రాను
ఈ నరకం నుంచి తప్పించాలనే ఉంటే
నన్నెందుకు అనుభవించారు?"
నన్నపార్థం చేసుకోకు
-"అయ్యా డబ్బివ్వండి వెళ్ళాలి,
పిల్లలు ఆకలితో ఎదిరి చూస్తుంటారు"
నీకు పిల్లలా ?!
-"ఆ ముగ్గురు"
నీ భర్త?
-"దేశం కోసం యుద్ధంలో పోయాడు"
బహుశా ఇప్పుడటువంటి పరిస్థితి లేకపోవచ్చు. అమెరికన్ సాంప్రదాయంలో గోల్డెన్ స్టార్ ఫామిలీగా చెప్పబడే కుటుంబం, ఏకాలంలోనైనా ఇండియాలో అటువంటి దుస్థితిలో ఉందంటే ఆశ్చర్యం,ఆవేదనా కలుగుతాయి. నన్నయ భారతంలో, ధర్మరాజు ఇంద్రప్రస్థం రాజధానిగా రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒకసారి నారదుడు చూడటానికి వస్తాడు. అప్పుడు, రాజ్యం ఎలా పరిపాలిస్తున్నాడో తెలుసుకోవటానికి ఒక ముప్ఫయి పద్యాలలో వివిధ ప్రశ్నలడుగుతాడు. వాటిలో ఒకటి, యుద్ధంలో అసువులు బాసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలిచి, వారి సంక్షేమం చూస్తున్నావా లేదా అన్నది. భారతకాలంలో ఉన్నా, లేకపోయినా, నన్నయగారి కాలంలో అటువంటి పధ్ధతి ఉండేదని దీనినిబట్టి అర్థమౌతుంది కదా. మరి 70లలో అటువంటి దుస్థితిని గురించి ఎందుకు రాయవలసి వచ్చిందో అని ఆశ్చర్యం కలుగుతుంది.
ఒక విధంగా చూస్తే, విరామ పాటించక పోవటమన్నది పద్య కవిత్వ సాంప్రదాయాన్ని కొనసాగించినట్టవుతుంది. ఎందుకంటే, పద్యాలలో ఎలాగూ వీటికి స్థానం ఉండదు. తాళపత్రాలు పొడవుగా ఉంటాయి కాబట్టి, వాటి మీద వరసగా రాసుకుంటూ పోతారని, పాదం చివరిలో ఒక నిలువు గీత, పద్యం పూర్తయిందని చెప్పటానికి రెండు నిలువు గీతాలు వాడతారని ఎక్కడో చదివాను.
ఇకపోతే, చివరిగా పాద విభజన గురించి. పద్యంలో ప్రతి పాదానికి పరిమితమైన గణాలుంటాయి. అందువల్ల పాదం ఎక్కడ ముగుస్తుందన్నది ముందే నిర్ణయించబడి ఉంటుంది . వచన కవితలో అలా కాదు. మరి దేని ఆధారంగా పాదం ముగిసి రెండో పాదం మొదలౌతుంది? ఇస్మాయిల్ గారు తన కవితలలో, పద్యాల మాదిరి ప్రాస, యతులవంటి అక్షర మైత్రిని పాటించారు. అప్పుడు, పాద విభజన సులభమే. అన్ని పాదాలు ఒకేలా ఉండవుగాని, మైత్రి ఆధారంగా అవి తెగుతాయి.
ఉదాహరణకి
బిడియంగా కాశీగారు
అడిగారొకనాడు
విస్మయమౌతుంది నాకు
ఇస్మాయిల్ గారు!
ఇంత కూల్ గా మీరు
ఎలా ఉండగలరు ?
ఐతే, 99% కవులు దీనిని పాటించరు కదా. మరి వారి విషయంలో ఏం జరుగుతోంది?
70లలో కోవెల సంపత్కుమారాచార్య గారు వచన కవిత లక్షణాల గురించి ఒక వ్యాసం రాశారు. దానికి జవాబుగా చేకూరి రామారావు గారు వేరొక వ్యాసం రాయటంతో వారిద్దరి మధ్య అది చర్చగా మారి అనేక వ్యాసాలు వెలువడ్డాయి. ఇద్దరూ మంచి స్కాలర్స్ కావటం వల్ల, చర్చ మర్యాదగా, ప్రయోజనకరంగా సాగింది. అది తరువాత పుస్తకంగా కూడా వచ్చింది. వారి చర్చ ప్రధానంగా పాద విభజన గురించినదే. సంపత్కుమార వచన కవితను వచన పద్యం అంటారు . దీనితో చేరా గారికి అభ్యంతరం లేదు. ఇస్మాయిల్ గారు కూడా కవిత అని కాకుండా పద్యం అనే వ్యవహరించేవారు. ఛందోబద్ధ పద్యాన్ని తీవ్రంగా నిరసించిన మొదటి తరం వచన కవి పఠాభి కూడా దానిని ఆ పేరుతోనే వ్యవహరించారు.
వచన పద్యాలనే దుడ్డుకర్రలతో
పద్యాల నడుములు విరగ్గొడతాను
(దుడ్డుకర్ర మాటేమోగాని, లైనుకి రెండు మూడు పదాలతో నిలువుగా రాసుకుంటూ పోయే కవితలను కొందరు రూళ్లకర్ర కవితలని వ్యవహరిస్తూ ఉంటారు)
ఐతే, సంపత్కుమార అలా అనటంలో ఒక ఉద్దేశం ఉంది. ఆయన వాదం ప్రకారం వచన కవిత కూడా ఛందస్సులో భాగమే. అదొక ప్రత్యేకమైన ఛందస్సు. తన వాదనకు ఆలంబనగా ఆయన ‘భావ గణాలు’ అనే కొత్త అంశాన్ని ప్రతిపాదిస్తారు. కవి చెప్పే ఒక భావాంశానికి ప్రతీక భావ గణం. ఒక భావాంశం పూర్తి కాగానే పాదం పూర్తవుతుంది. సాధారణ గణాలకి అక్షరాల/పాదాల పరిమితి ఉంటుంది. భావగణాలకి అలా కాదు. ఒక పదంలో భావాంశం తెలిస్తే, ఆ ఒక పదమే భావగణం. అలాకాకుండా, భావసస్ఫూరణకి కొన్ని పదాలు అవసరమైతే, ఆ పాదాల కూర్పే భావగణం.
ఐతే, చేరా గారు దీనికి అంగీకరించలేదు. ఈ రకమైన అమరిక వ్యాకరణ పరంగా వాక్య నిర్మాణంలో భాగంగా వచ్చినదే గాని, భావగణమంటూ విడిగా ఏదీ లేదని, అంటే గింటే దానిని వ్యాకరణ గణం అనవచ్చునని వాదిస్తారు. పాద విభజనలో ఏ రకమైన నిబంధనలూ లేకపోవటమే వచన కవిత్వ లక్షణమని, దీనినొక ఛందస్సుగా చూపాలనే ప్రయత్నం నిష్ప్రయోజనమని ఆయన ఉద్దేశం. అది నిజమే కావచ్చు. కొందరు కవులు తమ కవితలను ష్టాంజాలుగా కాకుండా, పేరాలు పేరాలుగా రాసేవాళ్ళున్నారు. శేషేంద్ర ఆధునిక మహా భారతం, నీరై పారిపోయింది, గెరిల్లా వంటివన్నీ ఇలా వచనంలా పేరాలుగా సాగేవే.
వీరిద్దరి మధ్య మౌలికమైన మరొక భేదం కూడా ఉంది. వచన పద్యం ఛందోబద్ధమైన పద్యం నుంచి వచ్చిందని సంపత్కుమారభావిస్తే, వచనం నుంచి వచ్చిందని చేరా వాదిస్తారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య వివాదం బిడ్డ కస్టడీకోసం విడాకులు తీసుకున్న దంపతుల మధ్య వివాదంలాగా తోస్తుంది.
ఈ చర్చలో సంపత్కుమార వాదంతోనే నేను ఏకీభవిస్తాను. పద్యం రాసేవాళ్ళు అది వదిలేసి వచన కవిత్వం రాశారుగాని, వచనం రాసేవాళ్ళు అది వదిలిపెట్టి వచన కవిత్వం రాసిన దాఖలాలు లేవు. వచన కవిత ప్రాథమికంగా కవిత్వమే, వచనం కాదు.
వచన కవితలో పాద విభజన ఒక ఊనిక కోసం జరుగుతుందని చెప్పటం సమంజసంగా ఉంటుంది. అంటే, కవితను బిగ్గరగా చదివేటప్పుడు అర్థ, భావ స్ఫూర్తి కోసం కవి ఎక్కడ ఆగుతాడో అక్కడ పాదం ముగిసి మరొక పాదం మొదలుకావటమన్నమాట.
మొత్తం మీద వచన కవిత్వం తనకంటూ ప్రత్యేకమైన వ్యాకరణం ఏర్పరుచుకోక పోయినా, పద సంయోజన, వాక్య నిర్మాణం, విరామ చిహ్నాల వాడకం, పాద విభజన వంటి విషయాలలో కొన్ని ప్రయోగాలతో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. తన భావాన్ని మరింత ప్రభావవంతంగా ప్రకటించటం కోసం ప్రయత్నపూర్వకంగా చేసే అటువంటి ప్రయోగాలు సమర్థనీయమనే చెప్పాలి. అవి భాషకు తోడ్పడి, కొత్త అలంకారాలుగా నిలుస్తాయని నేను భావిస్తాను.
(హ్యూస్టన్ నెల నెలా తెలుగు వెన్నెల నూరవ కార్యకమంలో చేసిన ప్రసంగం ఆధారంగా )
*****