top of page
adannamaata.png

సంపుటి  5   సంచిక  2

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

నవీన రీతులలో పౌరాణిక సాహిత్యం

janaki-prabhala.JPG

డా|| ప్రభల జానకి

''పురాణాలలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సమ్మోహనశక్తి ఉంటుంది. ఎందువల్లనంటే సమస్త మానవజాతి యొక్క సమిష్టి బాల్యం వాటిల్లో ఇమిడి ఉంటుంది కనుక'' అంటారు మార్క్స్‌.

 

వివిధ పరిస్థితులలో ఆ పౌరాణిక పాత్రలు చేసిన సంఘర్షణ వల్లనే ఒక ఉదాత్తత - సంపూర్ణత - సార్వకాలీనత వాటి స్వంతమై సీత-రాముడు, ద్రౌపది-కర్ణుడు మొదలైన పాత్రలు పండిత పామర హృదయాల్లో శాశ్వతత్వాన్ని పొందాయి. కానీ మనిషి ఎల్లకాలం పురాణయుగంలోనే ఆశీనుడు కాలేడు. నెమ్మదిగా ఆధునికత వైపు దృష్టి మరల్చి, పురాణగాథలలోకి తొంగిచూస్తూ, గతకాలపు గాథలను సంఘర్షణ రూపంలో విశ్లేషిస్తున్నాడు. కేవలం పురాణ కాలక్షేపంగా కాకుండా నూతన అర్థాలను, భావసంపదను అందించి మన ఆలోచనలను విస్తృతపరుస్తున్నాయి.


అసలు ఈ రకమైన ఆలోచనా స్రవంతికి కాళిదాసు మహాకవికి పూర్వుడైన ''భాసమహాకవి''నే ఆద్యునిగా పేర్కొనాలి. భాసుని ''పంచరాత్ర'' నాటకం స్త్రీ పాత్రలు లేని, మహాభారత పాత్రలతో కూడిన కల్పితేతివృత్తం. అంతేకాదు కొంత స్వతంత్రించి తనదైన 'లో'చూపుతో భారత మహిళల జీవితానుభవాలను కాలానుగుణంగా తన నాటకాలలో చిత్రించాడు. మహాభారత ద్రోణపర్వంలో వ్యాసమహర్షి ధర్మరాజుతో ''యతో ధర్మ స్తతో జయః'' అన్న మాటను, భాసుని 'దూత ఘటోత్కచం' నాటకంలో గాంధారి తన మాటగా అంటుంది. కురుపాండవ యుద్ధంలో దుస్సల తన భర్త సైందవుడు అభిమన్యుణ్ణి వధించాడని తెలియగానే, ఉత్తర రాజప్రసాదానికి వెళ్ళి పరామర్శించాలనుకొంటుంది. ఆ పరామర్శలో ''ఇక నేను కూడా నీలాగే వైధవ్య వేషధారణకు సిద్ధమవుతున్నానని చెప్పాలని'' ఆమె ముఖ్య ఉద్దేశ్యం. ఇది మహాభారతంలో లేదు. భారత రచన జరిగిన మూడువేల సంవత్సరాలలో క్రమక్రమంగా స్త్రీ పాత్రల వ్యక్తిత్వాలు మనోధర్మాలు మార్పుచెందుతూ వచ్చాయని స్పష్టమౌతోంది.


క్రీ.శ.1920 ప్రాంతంలోనే ఆనాడు ప్రచారంలోకి వస్తున్న హేతువాదాన్ని ఆర్షధర్మ నిరసన ప్రవృత్తిని వ్యతిరేకిస్తూ వాటిలోని డొల్లతనాన్ని విమర్శిస్తూ భారతీయతకు విరుద్ధంగా సాగుతున్న ముమ్మర ప్రచారాన్ని ఒక బాధ్యతాయుత కవిగా ఎదుర్కొనే ప్రయత్నం చేసేరు కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ. భాగవత గ్రంథంలో కేవలం 40 పద్యాలు కథావస్తువుగా గల 'వేనరాజు' కథను తీసికొని ''వేనరాజు'' అనే విషాదాంత నాటకాన్ని వ్రాసేరు. కానీ త్రిపురనేని రామస్వామి చౌదరి ఈ నాటకాన్ని ఖండిస్తూ ''ఖూనీ'' నాటకం వ్రాసి ప్రదర్శించటం కూడా జరిగింది. ఖూనీ నాటకానికి తిరిగి జవాబుగా విశ్వనాథవారు ''ఉరి'' అనే నాటకాన్ని వ్రాసి ప్రదర్శించారు.


భారతీయ భాషలన్నిటిలో పురాణ కథలను, నూతన కోణాలలో ఆవిష్కరించటం క్రీ.శ.1990 ప్రాంతంలోనే ఉధృత రూపం దాల్చింది. బహుప్రాచుర్యం పొందిన మహాభారత 'శర్మిష్ఠ-దేవయాని-యయాతి' కథను నవలారూపంలో ''యయాతి'' పేరుతో ప్రముఖ మరాఠా కవి విష్ణు సుఖారామ్‌ ఖండేకర్‌, మరాఠీ భాషలో వ్రాసేరు. ఈ నవల 2000 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డును పొందగా, శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలుగులోకి అనువదించారు. భోగలాలసత, నైతిక విలువల పతనం, ఎంతో హృద్యంగా వర్ణితమైన ఈ గ్రంథం బహువిధాలుగా ప్రశంసలు పొందింది. మరొక మహాభారత ఆధార నవల ఎస్‌.ఎల్‌. భైరప్ప కన్నడభాషలో వ్రాసిన 800 పేజీల ''పర్వ'' నవలను మహాభారత కథకు అంతిమ నిర్వచనంగా పెద్దలు ప్రస్తుతించారు. అంతేకాదు మహాభారత కథ జరిగిన ప్రాంతాలన్నీ పరిశీలించి, కథామూలాల్ని అన్వేషించి 'మిత్‌' నుంచి చరిత్రను విడదీసిన గ్రంథంగా సుస్థిర స్థానాన్ని పొందింది. ఈ గ్రంథాన్ని గంగిశెట్టి లక్ష్మీనారాయణగారు తెలుగులోనికి అనువదించారు. ''యయాతి'', ''పర్వ'' ఈ రెండూ సాహిత్య అకాడమీ ప్రచురించిన ప్రామాణిక గ్రంథాలు.
శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు 1970లో వ్రాసిన వ్యంగ్య కథ ''బకాసుర''ను నెమలికంటి తారకరామారావు 'బకాసుర' అనే నాటకంగా తీర్చిదిద్ది 1991లో ప్రదర్శించారు. విషమ సమస్యల్ని ఎదుర్కోవలసివచ్చినపుడు పాలకులు స్వార్థపరులై, భీరువులై ఎలా తప్పించుకొనే ప్రయత్నం చేస్తారో రచయిత బయటపెడతారు. 'బకాసుర' నాటకంలో 'బకాసురుడు' కథలో పాత్రగానే ఉంటాడు గానీ సభాస్థలిపైకి రాడు. మహాభారతంలో బకాసురుడు బలవంతుడు, క్రూరుడు ఐతే, కొడవటిగంటి వారి బకాసురుడు ''ముసలివాడు, బలహీనుడు, ముఖమంతా ముడతలతో ఏమాత్రం కాంతిలేని ఏడుపుగొట్టు ముఖం''. ఈ ముసలి రాక్షసుడ్ని అడ్డం పెట్టుకొని ఇరుగుపొరుగు రాజ్యాల నుండి రక్షణ పొందవచ్చని, రాక్షసుడి భయం వలన దేశంలో ఆందోళనలు, విప్లవాలు, రూపురేఖలు లేకుండా పోతాయని ఆ విధంగా తమకు రాక్షసుడివల్ల మేలే జరుగుతుందని రాజు, మంత్రి సంతోషిస్తారు. అంతేకాదు, రాజు, మంత్రి కలిసి ''ఆ ముసలి రాక్షసుడ్ని చెక్కతో నాలుగుదెబ్బలు కొడితే చస్తాడని'' నిజం చెప్పిన భటుడి నాలిక కోయిస్తారు. ఉచితంగా ఆహారం లభిస్తూంటే (మన ఉచిత ప్రభుత్వ పథకాలన్నమాట) సోమరిపోతులై ఇతరుల్ని బాధించరని, రాక్షసుడ్ని ఇలాగే మేపి మంచి చేసికోవటం మంచిదని, మంత్రి రాజుగారికి సూచించటం పాలకుల నైజాన్ని రాజకీయ కుతంత్రాన్ని తెలుపుతుంది. ఈ ముసలి నీరసపు బకాసురుడ్ని చంపిన బలభద్రుని సత్కరించకపోగా, బలభద్రుడే రాక్షసుడని ప్రచారం చేస్తూ ప్రజలను బలభద్రునిపై ఉసికొలిపే ప్రయత్నం చేయటం మన పనికిమాలిన రాజకీయ వ్యవస్థలోని దుర్మార్గాన్ని పట్టి చూపుతుంది. చచ్చిన రాక్షసుడి జాగాలో కొత్త రాక్షసుడు ఎవడైనా దొరుకుతాడేమోనని ప్రయత్నం చేయమనటం ఇక పరాకాష్ఠ స్థితి. ఈ బకాసుర నాటకం అనేక ప్రదర్శనలతో ప్రజల మన్నన పొందింది. శ్రీమతి శాంతసుందరి హిందీలోకి అనువదించారు.


ఈ మధ్యకాలంలో 'బర్బరీకుడ''నే భిల్లుని కథ - నాటకంగా చాలా ప్రఖ్యాతి చెంది, ప్రజల సానుభూతి పొందింది. సౌదా అరుణ రచించిన ఈ జానపద రాజకీయ నాటకం అనేక కేంద్రాలలో కిక్కిరిసిన జనంతో, నాటకప్రియులు వీక్షించారు. ''బర్బరీకుడు'' దండకారణ్యపు మూలవాసి. కురుపాండవులిద్దర్నీ జయించగల వీరుడు. కాని 'బర్బరీకుడు' ధర్మానికి వశుడై, పాండవులు ధర్మపరులని నమ్మి తను యుద్ధం చేసి రాజ్యాన్ని వారికి అప్పజెబుతానంటాడు. కానీ, రాజ్యం వీరభోజ్యం కనుక రాజ్యం బర్బరీకునిది అవుతుందని ధర్మరాజు ఆలోచన. భారత యుద్ధం క్షత్రియులది కాబట్టి భిల్లులకు ప్రవేశం లేదని శ్రీకృష్ణుని వాదం. శ్రీకృష్ణుడు, ధర్మరాజు కలిసి ఆలోచనలను కలబోసికొని, బర్బరీకుని వంటి వీరుని బలి ఇస్తే యుద్ధంలో పాండవులకు జయం తప్పదని యుద్ధానికి ముందే బర్బరీకుని నమ్మించి బలి ఇస్తారు. అమాయక భిల్లుడు ఆనందంగా ఈ వధకు ఒప్పుకొన్నాడు. భారత యుద్ధం ఎవరిది? అన్నదమ్ములైన కౌరవులు, పాండవులు కొట్టుకుంటే మధ్యలో అమాయక భిల్లుడిని బలి ఇవ్వడం ఏమిటి? విజయం పాండవులది... వీరస్వర్గం బర్బరీకుడిదా?... ఇలా ఈ నాటకం చాలా ప్రశ్నలు రేకెత్తించింది. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం అటువంటి ప్రశ్నల్ని ప్రజల మీద సంధించి తమ పబ్బం గడుపుకుంటున్నాయి.


శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రచించిన 'ద్రౌపది' నవల 2009లో సాహిత్య అకాడమీ అవార్డును పొందింది. ఈ నవల 'ఆంధ్రజ్యోతి' వారపత్రికలో ప్రచురిస్తున్న సమయంలోనే దూషణ, భూషణ తిరస్కరాధుల్ని - ప్రశంసల్ని సంపాదించిపెట్టిందని రచయితే స్వయంగా చెప్పుకొన్నారు. ఒప్పుకొన్నారు. గత జన్మలో నాలాయనిగా ఉన్నప్పుడు కామవాంఛలు తీరని కారణంగా తీవ్రమైన తపస్సు ఆచరించి ''భర్త-భర్త'' అని ఐదు పర్యాయాలు ఉచ్చరించినందువలన ద్రౌపదిగా పంచభర్తృకయైందన్న విషయం మహాభారత గ్రంథంలో ఉన్నదే!... అందులో వివాదం లేదు. ఐదుగురు భర్తలతో ఉన్నా కన్యత్వం పోని విధంగా, పాతివ్రత్యం మహిమకు ఆటంకం రాని విధంగా వరాలు పొందిన విషయం కూడా గ్రంథస్థమే... కానీ, ఈ ద్రౌపది నవలలో 'పాణిగ్రహణాలు, పంచరాత్రులు'' అనే అధ్యాయంలో ''రవి గాంచని చోట కవి గాంచున్‌'' అన్న విధంగా ద్రౌపది పంచపాండవులతో విడివిడిగా గడిపిన మొదటి రాత్రులు, ద్రౌపది శృంగార ఆంతరంగిక జీవితాన్ని వర్ణించటం సంప్రదాయవాదులకు కొరుకుడు పడలేదు. కనుబొమ్మలు ముడిపడ్డాయి. ''అవ్వ...'' అంటూ 'రచ్చ-రచ్చ' చేసేరు. ఎవరెన్ని విధాలుగా ఆవిష్కరించినా, చివరికి తిక్కన ఆవిష్కరణే తుదినిర్ణయం. ''ఇమ్మగువ... ఇంద్ర... తనయుదెసంబక్ష పాతిని...'' పాండవులూ-ద్రౌపదీ ఎవరూ రాగద్వేషాలకు అతీతులు కారు. స్త్రీపురుష సంబంధాలలో ఇది మరీ ప్రస్ఫుటమౌతుంది.


కురుక్షేత్రం యుద్ధం తరువాత పాండవుల పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? అనే ఆలోచనలకు రూపం కల్పించిన ఎస్‌. మునిసుందరం నవల, ''ఒక యుద్ధం తరువాత'' 2012 జూలైలో చతుర నవలగా పాఠకుల మన్ననలు పొందింది. ''ధర్మరాజా! మా భూముల్ని సుజలాం-సుఫలాం చేస్తామన్నారు. భయంకరమైన ఆగ్నేయ-నాగ- పాశుపత-బ్రహ్మాస్త్ర ప్రయోగాలతో మసైపోయిన ఈ పుడమిపై గరిక పోచయినా మొలుస్తుందా? ఈ మట్టి అగ్గిలా మండుతోందే! ఈ అగ్గిలో పచ్చని పైరులు మొలకెత్తుతాయా? మీ వెఱ్ఱిగానీ, ఎందుకీ శుష్క వాగ్దానాలు? దండం పెడతాం. మీ దారిన మీరు వెళ్ళండి. మా తిప్పలేవో మేం పడతాం. పదండ్రా పోదాం...'' ధర్మరాజు తలపై ఎవరో సుత్తితో మోదినట్లయింది. ఏ యుద్ధమైనా అనంతర ఫలితాలు ఒక్కటే అన్నది సమాధానం.


రామాయణంలో కొన్ని స్త్రీ పాత్రల ఆంతరంగిక ఆవిష్కరణ ''విముక్త'' గ్రంథం. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా కలం నుండి రూపుదిద్దుకొని 2015 సాహిత్య అకాడమీ అవార్డు పొందింది. మనకు తెలిసిన శూర్పణఖ రాక్షసి-కురూపి అయితే, ఓల్గా సృష్టించిన శూర్పణఖ రూపసి, స్నేహమయి. రాజ్యానికి దూరంగా అరణ్యాన్ని, ప్రకృతిని ప్రేమించటంలో సీత-శూర్పణఖ చేరువయ్యారు. శూర్పణఖను చూసిన సీత మనసు ఆర్ద్రమైంది. 'సమాగమం' కథలో సీత-శూర్పణఖల మధ్య స్నేహాన్ని ఓల్గా ప్రతిపాదించటం జరిగింది.


''సీతా నీకు తెలియదు... నేను అమిత సౌందర్యగర్వితను, నా ముక్కు చూసికొని ఎంత మురిసిపోయేదాన్నో... పచ్చని తెల్లని గడ్డిపూలని నా ముక్కుకి ఆభరణాలుగా ధరించేదాన్ని. ఆ పూలు నా ముక్కుపుటాలకు అటూ, ఇటూ నక్షత్రాల్లా మెరిసేవి. అంత అందమైన ముక్కును కోల్పోవటమంటే... ఏమిటో... నాకు తప్ప ఎవరికీ అర్థం కాదు. ఈ రూప-అరూప సారాంశాన్ని కనుగొనటానికి నాతో నేను పెద్ద యుద్ధమే చెయ్యవలసి వచ్చింది'' అంటూ ఓల్గా సృష్టించిన శూర్పణఖ తన జీవనయాన సత్య సౌందర్యాన్ని సీత ముందుంచింది.


''మృణ్మయనాదం'' కథలో అహల్య వేదనను ఓల్గా కొత్తకోణంలో చూపిస్తారు. ''స్త్రీ'' పురుషుల భోగ్యవస్తువని అందరూ భావించిన విధంగానే ఇంద్రుడూ భావించాడు. నేను లోబడనని తెలిసి... నా భర్త రూపంలో చీకటిలో వచ్చాడు. అతడు నా భర్త కాడని నేను గుర్తించానా లేదా? అనేదే లోకంలో అనేకమందిని వేధించే ప్రశ్న... నా భర్తకు మాత్రం ఆ తేడా లేదు. నాకు తెలిసినా తెలియకపోయినా ఆయనకు ఒక్కటే... ఆయన వస్తువు తాత్కాలికంగానైనా పరహస్తగతమైంది. మైల-శౌచం-పవిత్రం-అపవిత్రం-శీలం-పతనం, ఈ పదాలను ఈ పురుషులెంత బలంగా సృష్టించారంటే ఇందులో సత్యాసత్యాల ప్రసక్తే లేదు. విచక్షణ అంతకన్న లేదు. భార్యల విషయంలో ఈ భర్తలంతా ఒకటే సీతా!...'' ''గౌతమ మహర్షి మిమ్మల్సి పరిత్యజించారటగా?...'' సీత నెమ్మదిగా ప్రశ్నించింది. ''పాపం... నన్ను అతను పోగొట్టుకున్నాడు!'' దృఢంగా పలికింది అహల్య.


'సైకత కుంభం'' కథలో జమదగ్ని మహర్షి భార్య, పరశురాముని తల్లియైన రేణుక మాతృహృదయాన్ని ఓల్గా ఎంతో ఆర్ద్రంగా ఆవిష్కరించిన విధం చూడండి. ''భర్త తప్ప వేరే ప్రపంచం లేదని, మాతృత్వాన్ని మించిన పరమార్థం లేదని బ్రతుకుతున్నాం సీతా మనం...'' కానీ ఏదో ఒకరోజు భర్త తన ప్రపంచంలో నీకు చోటు లేదంటాడు. పుత్రులకు జన్మనిచ్చి మన జన్మ ధన్యమైందనుకొని సంతోషిస్తూండగానే ఆ పుత్రులు వంశాంకురాలై మనం గ్రహించే లోపే మన చెయ్యి వదిలి తండ్రి అధీనంలోకి వెడతారు. వారే మన జీవితాలకు శాసనకర్తలవుతారు. ఈ విషయం నాకు అనుభవమైనంత కఠోరంగా మరింకెవరికీ అవదు... ప్రపంచాన్ని చూసినకొద్దీ నా మాటల్లోని సత్యం నీకు బోధపడుతుంది సీతా!'' దృఢంగా అంది రేణుక. ఈ విషయం సీతకూ అనుభవంలోకి వచ్చిందిగా!
 

***


డా|| రేవూరి అనంత పద్మనాభరావు ''అంతరంగ తరంగాలు'' అనే గ్రంథంలో 18 రామాయణ పాత్రల హృదయాలను స్వగతంలా ఆవిష్కరించారు. ''నేను తాటకను, అందంగా యక్షిణీ రూపంలో ఉన్న నేను సుందుని వివాహం చేసికొని, మారీచుని కని ఆనందంగా ముగ్గురం కాలం గడుపుతున్నాం. మలద-కరూశ దేశాలకు సమీపంలోనే మా తాటక వనం ఉంది. నా కుమారుడు మరీచుడి భయంకర ఆకారాన్ని చూసి, మా వనానికి రెండు ఆమడల దూరం వరకూ ఎవరూ సంచరించనే సంచరించరు. అలా దూరంగా బ్రతుకుతున్న మా పై ఈ ఋషులకు అకారణవైరం. ఒకరోజు నా భర్త సుందుడు అగస్త్యమహర్షి శాపానికి లోనై మరణించాడు. అగస్త్యుని చంపెయ్యాలన్న కసితో అతని మీదకు వెళ్ళాను. నా అందమైన యక్షణి రూపం నశించి వికృతమైన రూపంగా నన్ను మార్చి మానవుల్ని మింగేలా మమ్మల్ని శపించాడు. మునుల కోపాలకు, శాపాలకు అర్థంపర్థం ఉండదు. తాము సంపాదించిన తపశ్శక్తిని ఇలా వృథా చేసికొంటారు. మళ్ళీ ఈ విశ్వామిత్రుని చూడండి. ముక్కుపచ్చలారని రామలక్ష్మణులకు నన్ను చూపి 'చంపుమని' ప్రోత్సహిస్తున్నాడు. వారికి నా రాక్షసత్వాన్ని గుర్తుచేస్తున్నాడు. విశ్వామిత్రుడు నిజానికి విశ్వానికి మిత్రుడు కాడు. విశ్వానికి - అ - మిత్రుడు. రామునికైనా నేను స్త్రీనన్న గౌరవం లేదు. అందమైన యక్షరూపాన్ని పోగొట్టుకుని ఇలా క్రూరరూపం ధరించానన్న కనికరం లేదు. నాపై విధించిన శాపానికి విరుగుడు లేదు. స్త్రీ హత్య పాతకమని మాటిమాటికి గుర్తుచేయాలా? రఘువంశ చరిత్రలో ఈ స్త్రీ హత్యాపాతకం ఎక్కడికీ పోదు. ఈ రఘువంశ స్త్రీలు దుర్భర శోకానికి-దుఃఖానికి లోనౌతారు. తాటక స్వగతం విన్నపుడు మన మనసు ఆర్ద్రమౌతుంది.


''సాహిత్యానికి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది'' అని గట్టిగా నమ్మిన రచయిత డా|| చింతకింది శ్రీనివాసరావు. మహాభారత కథ నుండి 'వికర్ణుని' పాత్రను తీసికొని ఆదర్శవంతునిగా చూపిన వైనం ఇది. ఎవరీ 'వికర్ణుడు?'. మహాభారతంలో ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పెద్దలందరూ తలలు వంచుకొని మాట పెగలక మొద్దుల్లా కూర్చున్న సమయంలో ''ఇది అన్యాయం, అక్రమం'' అని గొంత్తెత్తి అరచి సభను గడగడలాడించినవాడు వికర్ణుడు. వదినగారిని వివస్త్రను చేసి నగ్నత్వాన్ని వీక్షించాలని ఆశతో అఱ్ఱులు చాస్తున్న దుర్యోధన, దుశ్శాసనులకు స్వయంగా తమ్ముడు. ఏకోదరుడైనా వారి దుర్బుద్ధికి అడ్డు తగిలిన వికర్ణుడు, అందుకు ఫలితంగా రాజ్యభ్రష్టుడయినా కించిత్‌ బాధ పడలేదు. ఆనాటి భారతంలో ఒకే వికర్ణుడున్నాడు గానీ ఇప్పటి భారతావనిలో వీధికో వికర్ణుడుండాలని, ఉంటేగానీ, కాంతల కష్టాలు తీరవంటాడు రచయిత. ''పురుషుడంటే ఎలా ఉండాలి? వికర్ణునిలా ఉండాలి. ధర్మంవైపు నిలవాలి. ఆడకూతురు అన్యాయమైపోతుంటే చిరుతలా చెలరేగాలి. సింహంలా చెలగాటమాడాలి. అసహాయురాలిగా నిలిచిన మహిళలో అమ్మను చూడాలి... చెల్లెల్ని వీక్షించాలి... ఇది ఈనాటి అవసరం'' రచయిత ఎలా ఆలోచించాలో... సమాజానికి ఏం అందించాలో సూక్ష్మంగా తెలియచెప్పాడు.
''42 తరాల చంద్రవంశ రాజుల చరిత్రలో ఏ రాణికీ లేని అనాగరిక బహుభర్తృత్వ ఆచారాన్ని ద్రౌపదికి ఏ విధంగా ఆపాదిస్తారు?'' అని తన నవీన విశ్లేషణాత్మక పౌరాణిక నవల, ''పాంచాలి పంచభర్తృక కాదు - సవ్యసాచి అర్జునుని సతీమణి''లో ప్రశ్నించారు పారుపల్లి వెంకటేశ్వరరావుగారు.. నిజమే! ఆలోచించవలసిందే!
ఈ వ్యాస పరమార్థం ఒక్కటే! సాహిత్యం జీవనదిలా ప్రవహిస్తూ, నూతన కోణాలు ఆవిష్కరించాలి. మహాత్ముడైనా, రాక్షసుడైనా వారి గుండెచప్పుడు వినగలిగే సంస్కారాన్ని యువతకు సాహిత్యం ద్వారా దిశానిర్దేశం చేయాలి.

bottom of page