top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సంపుటి  4   సంచిక  4

adannamaata.png

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

కూచిమంచి తిమ్మకవి శతకసాహిత్యం – సమకాలీనత

mallipudi ravichandra.JPG

డా. మల్లిపూడి రవిచంద్ర

సంకేతపదాలు: వివరణ
కుక్కు.   = కుక్కుటేశ్వరశతకము
చిర.     = చిరవిభవశతకము
భర్గ.     = భర్గశతకము


0. సంక్షిప్తి
ప్రాచీనసాహిత్యపు పరమ ప్రయోజనం ఉపదేశం. అలాంటి ప్రాచీన తెలుగు సాహిత్యంలో శతకాలకు ఒక విశిష్ట స్థానముంది. సర్వకాల సర్వావస్థలలోనూ అన్వయయోగ్యమైన మనిషి నైతికజీవనం, మానవత్వపువిలువలు వంటి అనేక విషయాలనే శతకకవులు ఎక్కువశాతం వర్ణించారు. అందుకే ఉపదేశాత్మక కవిత్వంలో శతకాలకు, అందునా నీతిశతకాలకు ఉన్నతపీఠం వేయబడింది. ఇటువంటి విషయాలను స్పృశిస్తూ, 17-18 శతాబ్దుల కాలానికి చెందిన కూచిమంచి తిమ్మకవి ఏ కాలంలోనైనా చెప్పుకోదగిన దురాశ, అవకాశవాదం, దోపిడి, మూర్ఖప్రవృత్తి, డాంబికం, లోభం, మోసం, క్రూరత్వం, కాపట్యం, సాంఘిక అసమానత... మొదలైన సామాజిక విషయాలను తన శతకాలలో నీతి ఉపదేశంగా చెప్పిన తీరును ఈ వ్యాసం విశ్లేషిస్తుంది. 

1. ఉపోద్ఘాతం
ఉపదేశాత్మక కవిత్వంగా చెప్పాల్సి వస్తే మొత్తం తెలుగుసాహిత్యంలో శతకసాహిత్యానిదే అగ్రతాంబూలం. శతకంలో ఉండే ముక్తకలక్షణం వల్ల అది మిగిలిన సాహిత్యం కంటే విశిష్టంగానూ, తెలుగుప్రజల విశేష ఆదరణ పొందిన, పొందుతున్న శక్తిమంతమైన ప్రక్రియగానూ పేరుకెక్కింది.


శతకాలలో భక్తి, స్తుతి, వేదాంత, తత్త్వ, శృంగార, వైరాగ్య, హాస్య, అధిక్షేప శతకాలుగా అనేక భేదాలున్నాయి. కానీ, శతకాలు అనగానే తెలుగువారికి వెంటనే స్ఫురించేవీ, వారి లోగిళ్ళను వరించేవీ నీతిశతకాలు మాత్రమే. అందకు కారణం సమాజంలోని ఏ స్థితికైనా, ఏ సందర్భానికైనా అన్వయించుకుని, వక్రమార్గంలో నడుస్తున్న మనిషి జీవన స్థితిగతులను సన్మార్గంవైపు మళ్ళించేందుకు కారణభూతమైన ఉపదేశం నీతిశతకాలకు జీవం కావడమే. ఆ జీవ లక్షణమే నీతి శతకాలను నేటికీ సజీవంగా, సమకాలీనతకు దగ్గరగా నిలిపి ఉంచింది.
 

ఉపదేశం అంటే హితవచనం అని నైఘంటికార్థం. అంటే మంచిమాట. సమాజం (మనుషుల)లో విభిన్నరూపాలలో విజృంభిస్తున్న అధర్మాన్ని ఎత్తి చూపించి, ఆ సమాజం ధర్మానికి కట్టుబడి ఎలా నడుచుకోవాలో చెప్పడమే ఉపదేశం. అందుకు ద్రష్టలు, మునులు, ధర్మశాస్త్రజ్ఞులు, సూత్రకారులు, సంస్కర్తలు, కవులు మొదటి నుండీ సాహిత్యాన్ని వాహకంగా వాడుకున్నారు. ప్రభుసమ్మితంగా కొందరు, మిత్రసమ్మితంగా కొందరు, కాంతాసమ్మితంగా కొందరు ఉపదేశిస్తూ వచ్చారు.
 

తెలుగుసాహిత్యంలో తొలినాళ్ళలో జగద్ధితమైన భారతభాగవతాలు, కావ్యాదులు ఉపదేశానికి ఆలంబనమయ్యాయి. ఉపదేశమే వాటి పరమావధి అయ్యింది. కానీ పరిణామక్రమంలో మాత్రం శతకాలే దానికి ఎక్కువ ప్రాచుర్యాన్ని కల్పించాయి. 1600 - 1800 ప్రాంతంలో శతకాలు, అందునా నీతిశతకాలు విశిష్టస్థాయిలో వెలుగు చూశాయి. ఆ కాలం శతకసాహిత్యానికి ఒక స్వర్ణయుగంలాంటిది. ఆ కాలపు కవులు ఉపదేశానికి శతకాలను ఉపకరణంగా ఎన్నుకుని, అందులో నీతిని చొప్పించి, సమాజానికి అందించారు. అలాంటి మహాకవులలో కూచిమంచి తిమ్మకవి విశిష్టుడు.
 

కూచిమంచి తిమ్మకవి 17- 18 శతాబ్దుల కాలానికి చెందిన కవి. ఈయన చిరవిభవ, భర్గ, కుక్కుటేశ్వరశతకాలను మూడిటిని రచించాడు. పరమ శివభక్తుడైన తిమ్మకవి శివుని పేరును మకుటాలుగా మార్చుకుని ఈ మూడు శతాకాలను కూర్చాడు. ఇవి నీతిశతకాలు. వీటిలో తిమ్మకవి భక్తిప్రపత్తులకు కూడా స్థానముంది. ‘ఉత్తరోత్తర బలీయం’ అన్నట్లుగా మొదటి శతకమైన చిరవిభవశతకంలో నీతి చాలా తక్కువగానూ, భక్తి ఎక్కువగానూ, రెండవదైన భర్గశతకంలో నీతి, భక్తి రెండూ సమతూకంగానూ, కుక్కుటేశ్వరశతకంలో భక్తి సముచితరీతిలోనూ, నీతి చాలా ఎక్కువగానూ కనిపిస్తాయి. పాడైపోతున్న సమాజం(మనుషుల)లో మార్పు తీసుకురావాలనే తిమ్మకవి కాంక్ష చిరవిభవశతకంలో బీజప్రాయంగా కనిపించి, భర్గశతకంలో కాండమై, ఆకులు తొడిగి, కుక్కుటేశ్వరశతకంలో చిలవలు పలవలువేసి పుష్ప ఫల శోభితమయ్యింది. 
 

శతకకవులందరి మాదిరిగానే తిమ్మకవి కూడా తనకాలపు సమాజంలో తామరతంపరగా పెరిగిపోయిన దురాశ, అవకాశవాదం, దోపిడి, మూర్ఖప్రవృత్తి, డాంబికం, లోభం, మోసం, క్రూరత్వం, కాపట్యం, సాంఘిక అసమానత... వంటి వాటిని సునిశితంగా పరిశీలించాడు. కానీ, వాటిని తెలియజెప్పే విషయంలో మాత్రం అందరూ ఎన్నుకునే సాధారణ నీతి మార్గాన్ని కాకుండా అధిక్షేపనీతి మార్గాన్ని ఎన్నుకుని తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ‘మన శాస్త్రాలలోని సామ దాన భేద దండోపాయాలలాగే ఈ అధిక్షేపనీతి కూడా ఒకటి. మంచిని సామాన్యరీతిలో చెప్పడం నీతి. విననివారికి అదే మంచిని మందలించి, పరిహసించి, ఎత్తిపొడిచి, విమర్శించి, ఎగతాళి చేసి, ఖండించి చెప్పడం అధిక్షేపం’(గోపాలకృష్ణారావు, కె.1976:422 ). అదే తిమ్మకవి తన శతకాలలో పాటించాడు. 
 

తిమ్మకవి శతకాలలో వర్ణించబడిన తన సమకాలీనాంశాలు నేటికీ మనకు అనేకం కనిపిస్తాయి. ఆయన శతకాలలో ప్రతిపద్యంలోనూ నేటిసమాజం ప్రతిబింబిస్తుంది. అయితే, వ్యాస పరిమితుల దృష్ట్యా వాటిలో కొన్నిటిని మాత్రమే ఇక్కడ చర్చిస్తున్నాను.

 

2. దురాశ
అవసరానికి మించిన ఆశ ఉండడమే దురాశ. ఆ ఒక్క కారణంగానే మనిషి సర్వభ్రష్టుడై, లోకంలో అనేక అనర్థాలను సృష్టిస్తున్నాడు. ఈ కాలపు మనిషికి అది మరీ మితిమీరిపోయింది. అటువంటి వారిని ఉద్దేశిస్తూ తిమ్మకవి ఆనాడే ఇలా-

 

సీ. కొండంత విత్తంబు గూడఁ బెట్టిన నైనఁ, బొదలు ధనాపేక్ష వదలిపోదు
    స్వర్గాధిపత్యంబు సంభవించిన యేని, బహురాజ్య కాంక్ష యెప్పటికిఁ జనదు.(కుక్కు.: 64) అంటూ ‘కొంతంత ధనాన్ని సంపాదించినా, మనిషికి ఇంకా

ధనం కావాలి అనే ఆశ చావదు. అతనికి ఇంద్రపదవిని కట్టబెట్టినా పదవీవ్యామోహం, రాజ్యాధికార కాంక్ష విడిచిపోవు.’ అని అధిక్షేపించాడు. అలాంటి భావననే మరో రూపంలో కింది పద్యంలో పొందుపరిచాడు.

 

చ. హరహర మేరు భూధరమునంత పదార్థము సంగ్రహించిన
    న్సురనగరాధిపత్యము త్రిశుద్ధిగనబ్బిన రంభయంత సుం
    దరి నిజభార్యయైన మది తార్కొను తృష్ణయడంగదేరికిన్. (చిర.: 70). మనిషికి కొండంత ఆశకు తగ్గట్టు పర్వతాలంత కలిమి కలిగినా, అతనిలో ఇంకా కావాలి అనే దురాశ మాత్రం పోదు. అది నిరంతరం జ్వలిస్తూనే ఉంటుంది. నేటి సమాజంలో ఆ దురాశ డబ్బుదస్కం పట్ల ఉండడం ఒక ఎత్తైతే, పరాకాష్ఠకు చేరిన ఆ దురాశ రంభలాంటి భార్య ఉన్నా పరస్త్రీలను, పసిపిల్లలను వాంఛించడం, తుంచడం వైపు మళ్ళడం మరో ఎత్తు. ఇలాంటి దుష్పరిణామాలకు కారణాన్ని కూడా చూపించాడు కవి.

 

సీ. సిరికిఁ దోఁ బుట్టువౌ జ్యేష్ఠామహాదేవి, దీనతనింటింటఁ దిరుగఁ సాగె
    హరికిఁ గూరిమి పట్టియగు మకరాంకుడు, మెయిలేక సోఁకుడై మెలఁగుచుండె. (కుక్కు.: 84) అంటూ నేటి సమాజంలో విష్ణుమూర్తి కొడుకైన మన్మథుడు (కామం) తనకు శరీరం లేకపోయినా ఏదో ఒక శరీరాన్ని ఆశ్రయించి, దాదాపు ప్రతి ఇంటిలోనూ తిరుగుతుండడమే కారణం అన్నాడు. అలాగే లక్ష్మీదేవి అక్క జ్యేష్ఠామహాదేవి అంటే దరిద్రదేవత (పేదరికం) దీనంగా ప్రతి ఇంట్లోనూ తిరుగుతోందనీ పై పద్యంలో చెప్పాడు. భారతీయ సమాజాలలో కామవాంఛ, పేదరికం వంటివి పెను సమస్యలుగా పరిణమిస్తున్నాయనే ఎరుకను ఆనాడే తిమ్మకవి సమాజానికి తెలిపే ప్రయత్నం చేశాడు. అవి కాస్తా నేడు విపరీతరీతిలో పెరిగిపోయాయి. ముఖ్యంగా మన్మథుడిని జయించడంలో మనిషి పూర్తిగా విఫలమయ్యాడనడానికి నేటి సంఘటనలే ప్రత్యక్షసాక్ష్యాలు. పేదరికాన్ని ఇంట్లో నుండి, కామాన్ని ఒంట్లో నుండి పారదోలాల్సిన అవసరం నేడు చాలా ఉందని పై పద్యం నర్మగర్భంగా తెలియజేస్తోంది.

 

3. దోపిడి
సమాజంలో కేవలం అందరూ అనుకునే దొంగలు మాత్రమే దోపిడి చెయ్యడం లేదు. అమాయకులైన, చదువులేని పేదప్రజల దగ్గరనుండి అధర్మంగా పాలకులు, అధికారులు కూడా దోచుకుంటున్నారు. ఇది తిమ్మకవి కాలపు మాట మాత్రమే కాదు ఈ కాలపు మాట. సర్వకాలాలకూ సమకాలీనమైన మాట. కరణాలు ప్రజల దగ్గర ఎలా దోచుకొనేవారో! అలాంటివారి పట్ల ప్రజలభావాలు ఎలా ఉండేవో! అచ్చతెలుగులో వారి యాసలోనే వివరించాడు తిమ్మకవి.

 

సీ. కరణాలటంటను కైలకట్టల యిప్పి, పాతికలంటను పరిగలంట
    కాన్లంట గీన్లంట కలయి లేనియి కొన్ని, సెల్లులు బాకీలు సెప్పుకుంట
    బిరబిర గంటాలు గిరగిర దిప్పుతా, నాకులన్నియు నెడు గోఁకుకుంట
    యెగరాసి దిగరాసి సగమేసి ఎగదొబ్బి, కొంపలు పడదోసి సంపుతారు
      తే.గీ. దయ్యమా కాయ కసరైన దక్కనియ్య, రేమి సేయుదు మను మోటులిలను గలరు...(కుక్కు.: 31) ‘కరణాలమంటూ వచ్చి, లెక్కల పుస్తకం విప్పి, పాతికనీ పరిగనీ, ఉన్నవి లేనివి కల్పించి, తీర్చిన అప్పు, తీర్చాల్సిన బాకీ గురించి చెబుతూ, వెంటవెంట గంటం తిప్పుతూ, పైన, కింద ఏవేవో రాసి, తప్పుడు లెక్కలు చూపించి, కొంపలు కూలుస్తారు. చివరికి కాయలను, పిందెలను కూడా దక్కనీయరు. ఏం చేయగలం?’ అంటూ కరణాల దోపిడి గురించి చదువులేనివారు (మోటులు) ఎలా చెప్పుకొనేవారో తాను ఒక కరణమై ఉండి కూడా నిర్భయంగా చెప్పాడు. వాళ్ళ మాటలకు అక్షర రూపమిచ్చి ప్రజల పక్షాన నిలిచాడు. తెలుగు సాంఘికచరిత్రకు ముడిసరుకులాంటి ఎన్నో విషయాలను తన కవిత్వం ద్వారా అందించాడు.


అలాగే రైతులను దోచుకొనే విధానాన్ని కూడా పూసగుచ్చినట్లు కింది పద్యంలో వివరించాడు.

సీ. ఎద్దుమందను గూర్చి యెగసాయమిడితేనిను, తుదనది యధికారి దోసుకొనియె
    దావుదప్పుల కంట దర్మకర్చులకంట, కాసువీసములాగె కరణపయ్య
    సల్లమ్మి సవకమ్మి సిల్లర దాసితే , కోమటి నాబంటు కొడుకు దొబ్బె
    కళ్ళము కంకులు గాలిఁ బట్టగఁ బోతె, బట్టి బాపనవోళ్ళు బతకనీయ
    రహహ... (కుక్కు.:32)
‘ఎద్దులను జతచేసుకొని వ్యవసాయం చేస్తే పంట చేతికందే సమయానికి అధికారులు దోచుకుపోతున్నారు. ఆ ఖర్చులకనీ, ఈ ఖర్చులకనీ ఉన్న డబ్బులను కాస్తా కరణాలు లాక్కొంటున్నారు. చల్ల, సరుకులు అమ్మి చిల్లర కూడబెడితే వ్యాపారులు దోచుకొంటున్నారు. కళ్ళంలోని ధాన్యమైనా పోగుచేసుకొందామంటే బ్రాహ్మణులు బతకనీయడం లేదు’ అంటూ రైతులు తమ గోడును విన్నవించుకొనే విధానాన్ని వారి మాటల్లోనే చెప్పాడు. చెడ్డవారివల్ల పేదరైతులు ఎన్ని రకాలుగా దోపిడీకి గురవుతున్నారో కూడా కళ్ళకు కట్టినట్లు వర్ణించాడు. ఇక్కడ కవి రైతుల మాటగా కులాల ప్రస్తావన చేశాడు. తద్ద్వారా ఆయా కులాలకు కళంకం తెచ్చే దోపిడిదారులను నిరసించాడు తప్ప నేరుగా కులాలను నిరసించలేదు. అయితే, నేటి సమాజంలో ఇలా దోపిడీ చేసేవారి స్థానాలు మారాయి. దోపిడీ చేయడం మాత్రం మారలేదు. ప్రజాసంక్షేమాన్ని చూసుకోవలసిన పాలకులలో ఇప్పుడది మరీ విచ్చలవిడిగా తయారయింది. ‘ఇంతింతై వటుడింతయై...’ అన్నట్లుగా విస్తరించుకుపోయింది. చిరుతిళ్ళు తిన్నంత తేలికగా భూములను మింగే స్థాయికి ఎదిగిపోయింది. అలాంటి వారిని గూర్చి సుమారు 250 సంవత్సరాల క్రితమే వివరంగా వర్ణించాడు తిమ్మకవి. ఆయన ద్రష్ట అని చెప్పడానికి ఇదొక తార్కాణం. 

 

శా. మన్నెల్లం దన సొమ్మటంచు వసుధా మర్త్యోత్తమ క్షేత్రముల్
     కన్నారంగని యోర్వలేక దిగమ్రింగం జూతురల్పప్రభుల్
     వెన్నప్పంబులో బూరెలో వడలో భావింపంగ బొబ్బట్లొకో
     యన్నా! యెన్నగ వారి పాలికవి? భర్గా! పార్వతీవల్లభా! (భర్గ.: 71) ‘ఈ మట్టంతా తన సొమ్ము అన్నట్టుగా సమస్త భూమండలంలోని విలువైన ప్రాంతాలను చూసి, కన్నుకుట్టి దిగమింగాలని అధికారులు చూస్తున్నారు. అలా మింగడానికి అవేమైనా అప్పాలా? బూరెలా? వడలా? బొబ్బట్లా?’ అని నిలదీశాడు. ఆ కాలానికే కాదు ఈ కాలానికీ ఆ పద్యం సరిగా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే మైనింగ్, యురేనియం... వంటి భూగర్భ వనరుల కోసం విచ్చలవిడి ఆక్రమణలకు పాల్పడుతున్న ఈ కాలపు అధికారులకు, రాజకీయనాయకులకు వందశాతం అన్వయమవుతుంది. ఇలాంటి ఆక్రమణలకు 17- 18 శతాబ్దుల కాలంలోనే భూమిక ఏర్పడిందని చెప్పడానికి తిమ్మకవి శతకాలే సాక్ష్యాలు.

 

4. డాంబికం
ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకోవడం డాంబికం. కొంతమంది పొరుగువారికి సహాయం చేయరు. మరికొంతమంది చేసింది కొంచెమైనా దానికి రెండింతలు జోడించి, చాలా గొప్పగా చెప్పుకుంటారు. తమంతటి వారు లేరని వాపోతారు. అలాంటి వారు మన సమాజంలో కోకొల్లలు. కవి వారిని ఇలా అభివర్ణించాడు.
సీ. అబ్బబ్బ కిందటేఁడప్పయ్య తీర్తాన, జోలె జంగముకిస్తి సోలెఁడుప్పు
    సాతాని జియరయ్య సతికితే పోయిస్తి, కొల్లఁగా గుల్లెఁడు సల్లబొట్టు
    లంక సత్తెల వాఁడు పొంకాన పొగిడితే, మాలదాసరికిస్తి మానెఁడూద
    వేదాలు వాగితే యెల్లు బొట్టయ్యకు, కొలకుండ దోసెఁడు కొఱ్ఱలిస్తి
      తే.గీ. నౌర తమకన్న కూసుగాఁ డవల నింకఁ, గలఁడె యను మూర్ఖుఁడిద్ధరఁ గామవైరి. (కుక్కు.: 25)
‘అబ్బబ్బ! కిందటి ఏడాది అప్పయ్య తిరునాళ్ళలో జంగమయ్యకు సోలెడు ఉప్పు ఇచ్చాను. సాతాని జియ్యరుకు గుల్లెడు చల్లబొట్లు పోయించాను. మాలదాసరికి మానెడు ఊద ఇచ్చాను. వేదాలు చదివిన బొట్టయ్యకు దోసెడు కొఱ్ఱలిచ్చాను. అలాంటి నాకంటే దానం చేసే గొప్పవాడు ఎవడున్నాడు?’ అనే వాళ్ళను నిరసించాడు కవి. అయితే, కాలం మారంది. ఆ కాలానికి, ఈ కాలానికి చేసే పనులలో మార్పు వచ్చింది. కానీ గప్పాలు చెప్పుకోవడంలో ఎటువంటి మార్పూ లేదు. అలాంటి వారు ఈ కాలంలో ఇంకా ఎక్కువే కనిపిస్తారు. చేసింది కొంచెమైనా వాళ్ళ గొప్పకోసం మరికొంత జోడించి ప్రచారం చేసుకొంటూ ఉంటారు. అలాంటివారికి తిమ్మకవి పద్యాలు గట్టి చురకలు. పై పద్యంలో తెలుగువాళ్ళు ఆ కాలంలో ఉపయోగించిన కొలమానాలను, ధాన్యవిశేషాలను కూడా గమనించవచ్చు.

 

5. సమానత్వం
సమాజంలో అంటరానితనం అనేది ఒక మహమ్మారిగా మారి నిమ్నకులాల వారిని ఒకప్పుడు ఎంత పీడించిందో అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో సమసమాజ స్థాపన కోసం సంస్కర్తలే కాదు కవులు కూడా చాలా కృషి చేశారు. సమాజంలో అందరూ సమానులేననీ, నిమ్నకులాలవారు కూడా మనుషులేనని కవులు తమ రచనల ద్వారా చాటి చెప్పారు. తిమ్మకవి కూడా ఆ కాలంలోనే దళితులను అస్పృశ్యులుగా ఎంచిన వారికి తన కవిత్వం ద్వారా గుణపాఠం నేర్పాడు. 

 

చ. మెరమరలేక నీవు మును మేదరి సెట్టియు బోయలెంకయున్
             బెరసు కులంపు చాకలియు బెట్టిన యోగిర మారగించి తౌ
             సరిసరి నిన్ను నర్చనలు సల్పెడుచో నియమంబులేలయా
             చిరవిభవా భవా విజిత చిత్తభవా యభవా మహాభవా! (చిర.: 39) ‘నిష్ఠతో, నియమంతో పెట్టిన ఆహారం తినాల్సిన నీవు ఎటువంటి అనుమానం లేకుండా నియమాలను ఉల్లంఘించి పూర్వం మేదరి, బోయ, చాకలి... మొదలైన వెనుకబడిన తరగతులవారు పెట్టిన ఆహారాన్ని ఆరగించావు. నిన్ను పూజించడమనే నియమం కలిగినవారికి బాహ్య నియమాలెందుకు?’ అంటూ దేవుడికి విన్నవించుకొన్నాడు. భగవంతుని ఆరాధన అనే నియమం ఉన్నవారికి మిగిలిన నియమాలు అవసరం లేదనీ, దేవుడి ముందు అందరూ సమానులే అని తేల్చి చెప్పాడు. ఒక కులంవారే దేవుని పూజించడానికి అర్హులు, మిగిలిన కులాలవారు అర్హులు కాదు అనే నియమాలు లేవనీ, ఆత్మశుద్ధి కలిగి పరమేశ్వరుడిని పూజిస్తే చాలని నిర్ధారించి, సమానత్వాన్ని చాటాడు. అంతేకాదు దళితులను సమానభావనతో చూడాలని చెప్పడం కింది పద్యంలో కనిపిస్తుంది.

 

శా. డాయన్రాద యటండ్రు మాదృశులు చండాలాదులన్డాసినన్
     బాయుం బుణ్యచయంబు లంచుఁ జదువుల్పల్కంగనీ వయ్యయో
     బోయండెంగిలి మాంసమిచ్చుటకు లోబుల్పూని చేకొంటి వే
     ప్రాయశ్చిత్తము కద్దు దీనికిక? భర్గా! పార్వతీవల్లభా! (భర్గ.: 41) 
‘నాలాంటివారు (అగ్రకులస్థులు) దళితులను తాకరాదనీ, తాకితే అగ్రకులస్థుల సంచిత పుణ్యఫలం పోతుందనీ శాస్త్రాలు చెబుతున్నాయి. అయినా నీవేమో బోయవాడు పెట్టిన ఎంగిలి మాంసాన్ని ఇష్టంగా స్వీకరించావు. నువ్వు చేసిన పనికి ఏ ప్రాయశ్చిత్తముంది? (లేదని భావం)’ అని శివుడిని నేరుగా ప్రశ్నించాడు. అంటే శివుడు చేసిన పనికి ప్రాయశ్చిత్తం లేదంటే ఆ పని అసలు పాపమే కాదు. మరి పాపం కానప్పుడు  తనబోటి వాళ్ళకు ఈ అంటరానితనం ఎందుకు? అనే గూఢమైన భావాన్ని చొప్పించాడు. నేటికీ అసమానతను, అంటరానితనాన్ని పాటిస్తున్నవారు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇంతకు మించి ప్రేరేపించే ఉపమానం వేరే ఉండదని నిర్ద్వంద్వంగా ఆనాడే చెప్పాడు. ఆ రోజుల్లోనే తిమ్మకవికి సమసమాజ కాంక్ష ఎంత గాఢంగా ఉండేదో పై పద్యం సాక్ష్యమిస్తుంది.

 

6. లోభం 
లోభి గురించి కవులు అనేకరకాలుగా వర్ణించారు. తిమ్మకవి కూడా ఆ తరహాలోనే అనేకపద్యాలు చెప్పాడు. వాటిలో ఈ కింది పద్యం లోభివ్యక్తిత్వాన్ని స్థాలీపులాకంగా పట్టి చూపిస్తుంది. 

 

మ. కలుముల్నిక్కమటంచు నమ్మి తులవల్గర్వాంధులై యెన్నఁడున్
     బలి భిక్షంబులు పెట్టకుండ్రు పిదపం ప్రాణంబులంబాసి యా 
     ఖలులేమౌదురొ? వాండ్రు గూరిచిన రొక్కంబెల్ల నే మౌనొకో?
     కలుషోద్గాఢ తమస్సహస్రకర! భర్గా! పార్వతీ వల్లభా! (భర్గ.: 88)
‘లోభులు ధనమే శాశ్వతమని భావిస్తూ, పిల్లికి కూడా భిక్షం పెట్టకుండా కూడబెడతారు. ఆ సంపదవల్ల కలిగిన గర్వంచేత విర్రవీగుతారు. కానీ చనిపోయిన తర్వాత ఆ గర్వాంధులు ఏమవుతారు? వాళ్ళు కూడబెట్టిన ధనం ఏమవుతుంది?’ అని కవి పరిహసించాడు. ఏదీ శాశ్వతం కాదనే విషయాన్ని ఎరిగి ఉంటే మనుషులు లోభులు, అహంకారులు కారనే విషయాన్ని నిక్షిప్త పరిచాడు.


కలియుగ సమాజంలో సంపద ఎటువంటి స్థానాన్ని ఏర్పరచుకొందో వివరించే ఈ కింది పద్యం తిమ్మకవి నిశిత పరిశీలనకు ప్రబల ఉదాహరణ.
 

సీ. కులమునకెల్ల మిక్కిలితనం బొనఁగూడు, నాడిన మాటయే పాడి యెసఁగు
    నిఖిల విద్యాభ్యాస నిపుణత లభియించుఁ, జేసిన పనులెల్ల వాసికెక్కు
    మనుజేశ్వరాస్థాన మాన్యత సమకూఱుఁ, గడ లేని తేజంబు గలిగి యుండు
    కవి బుధ వంది మాగధులు చెల్మి ఘటించుఁ, బగర యైనను వెంటఁ బడి చరించుఁ
    తే.గీ. గలియుగంబున నబ్బబ్బ కలిమి వంటి, మంచి వస్తువు కలదె యోచించి చూడ. (కుక్కు.: 51) 
అంటూ ‘డబ్బు వల్ల మొత్తం వంశానికే గొప్పతనం ఒనగూరుతుంది. డబ్బున్నవారు ఆడిన మాటే చెల్లుబాటు అవుతుంది. అన్ని విద్యలను నేర్చుకొన్నంత నైపుణ్యం వస్తుంది. ఏ పనిచేసినా తేలికగా ప్రాచుర్యం లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా గౌరవం దక్కుతుంది. కవులు, మేధావులు డబ్బున్నవారిని ఎల్లప్పుడు పొగుడుతూ ఉంటారు. శత్రువులు కూడా చెలిమి చేసుకోవడానికి వెంట తిరుగుతూ ఉంటారు. అలాంటి డబ్బువంటి గొప్ప వస్తువు కలియుగంలో మరొకటి ఉన్నదా?’ అని సర్వకాల సర్వావస్థలలోనూ సంపదకున్న గొప్పతనాన్ని, దాని వల్ల కలిగే ప్రయోజనాలను అద్భుతంగా వర్ణించాడు.

 
నిజానికి పై పద్యంలో సంపదకు సంబంధించిన ప్రయోజనాలను అనుకూలంగా చెప్పినట్టు కనిపించినా అందులో దెప్పిపొడుపు ఉంది. మనుషులు డబ్బు మాత్రమే సంపాదించి సమాజంలో ఎలా చక్రం తిప్పుతున్నారో? సమాజాన్ని వాళ్ళ చుట్టూ ఎలా తిప్పుకొంటున్నారో వ్యంగ్యంగా చెప్పాడు. ఎన్ని సుగుణాలున్నా, ఎంత విద్య ఉన్నా దక్కని గౌరవం డబ్బు అనే ఒక వస్తువు వల్ల కలుగుతోంది కదా! అనే బాధనూ వెళ్ళబుచ్చాడు. అప్పటి సమాజం సంగతి పక్కన పెడితే నేటి సమాజానికి మాత్రం పై పద్యం చక్కగా అన్వయించబడుతుంది. నేటి సమాజంలో డబ్బుకి, డబ్బున్నవారికీ ఉన్న గౌరవం మరెవ్వరికీ లేవనడం అతిశయోక్తి కానేకాదు.

 

అయితే, ఎప్పటికైనా మంచితనమే గెలుస్తుంది, నిలుస్తుంది అన్నట్టుగా సంపన్నుడి కంటే సత్సంపన్నుడే పది కాలాలు, పదుగురి హృదయాలు గెలిచి నిలచి ఉంటాడు. అతనే సజ్జనుడు. సజ్జనుడు మంచితనంతోపాటు ధనం కూడా సంపాదిస్తే దాని వల్ల సమాజానికి కలిగే మేలే వేరు. ధనం సంపాదించినంత మాత్రాన, దానివల్ల సమాజంలో గౌరవం దక్కినంత మాత్రాన అందరూ సజ్జనులు కాబోరని తెలియజేశాడు తిమ్మకవి. ఎంత సంపాదించినా శాశ్వతం కాదనీ, మనిషి మరణానంతరం ఏమీ తీసుకుపోడనే నగ్నసత్యాన్ని కింది పద్యంలో వివరించాడు. 
 

   “మొదవుల బదివేలు కదుపులు గూర్చిన, దూడ యొక్కటి యైనఁ దోడ రాదు
   మాడలసంఖ్యముల్ మాటుగా నించినఁ, బసిఁడి వీసమును వెంబడిని రాదు”(కుక్కు.: 63) ‘

పశువులు పదివేలు సంపాదించినా చనిపోయినప్పుడు ఒక్క దూడైనా తన తోడరాదు. లెక్కలేనన్ని మాడలు సంపాదించినా వీసమెత్తు బంగారమైనా వెంటరాదు’ అనే ఎరుక కలిగి, న్యాయంగా సంపాదించిన దానిలో కొంత ఇతరులకు దానం చేసే వారే సజ్జనులనీ స్పష్టం చేశాడు. 
 
మనిషి లోభాన్ని విడిచిపెట్టి, మూర్ఖత్వాన్ని వదిలిపెట్టి, గొప్పలు చెప్పుకోవడం కట్టిపెట్టి, ఉన్నదానిలో కొంత పంచిపెట్టి, లోకంలో అందరూ సమానమే అనే భావానికి పట్టంగట్టి వర్తించాలని తిమ్మకవి తన శతకాల ద్వారా ఉపదేశించాడు. కరుడు గట్టిన సమాజాన్ని తన పద్యాలతో అధిక్షేపించాడు. మనిషిలో మార్పు రావాలని నిండుగా ఆకాంక్షించాడు. అలాంటి గొప్ప లక్షణాలు కలిగిన తిమ్మకవి పద్యాలు మాత్రమే రాచపుళ్ళవంటి నేటి సమాజ రుగ్మతలకు చికిత్స చేయగలవు. ఆయన పద్యాలు మాత్రమే కాలం తీరిపోని (expiry లేని) ఔషధమై ప్రతి కాలానికీ సమకాలీనమై, స్వీకరణ యోగ్యమై మనగలవు.


7. ఉపయుక్తగ్రంథాలు
ఆరుద్ర. 2012. సమగ్ర ఆంధ్ర సాహిత్యం(సంపుటం- 3). హైదరాబాదు: తెలుగు అకాడమి.
గోపాలకృష్ణారావు, కె. 1976. ఆంధ్ర శతక సాహిత్య వికాసము. హైదరాబాదు: ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రచురణ.
తిమ్మకవి, కూచిమంచి. 1993. చిరవిభవశతకము. హైదరాబాదు: రమాప్రచురణలు.
1982. భర్గశతకము (అధిక్షేపశతకములు). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
1968. కుక్కుటేశ్వరశతకము (శతకసంపుటము- 2). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి.
నాగయ్య, జి. 2009. తెలుగుసాహిత్యసమీక్ష(సంపుటం-2). తిరుపతి: నవ్య పరిశోధక ప్రచురణలు.

*****

bottom of page