
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
కథన కుతూహలం: మామ్మ మొదటి ఉత్తరం

ఇంద్రాణి పాలపర్తి
అవని గడ్డ
తేదీ: నవంబరు7,1992
అమ్మడూ,
ఆశీస్సులు.పదవ తరగతి ప్రధమ శ్రేణిలో పాసయ్యావు.నేనూ తాతయ్యా ఎంత సంతోషించామో,బంగారు తల్లి! ముందు ముందు గొప్ప చదువులు చదవాలి.
నీ ముందు ఉత్తరంలో కథలు ఎలా రాయాలో చెప్పమని అడిగావు.మంచి కథలు రాయాలని ఉత్సాహపడుతున్నావు.ఈ సెలవుల్లో కథలు రాయడానికి ప్రయత్నిస్తావా? చాలా సంతోషంరా చిట్టి తల్లీ.
ఒక కథ చదవగానే అది చాలా మంచి కథ అని,లేదా గొప్ప కథ అని లేకపోతే చాలా నాసిరకంగా ఉందని అభిరుచి గల పాఠకుడికి చప్పున తోచడం కద్దు.కదూ? అయితే అలా ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు ఫలానా కథ బాగులేదని అనిపిస్తుంది? నూటికి తొంభై శాతం కథలు గొప్ప కథలు ఎందుకు కాలేవు?
ప్రతి రచయితా మంచి కథ రాయాలని ప్రయాసపడతాడు.ఎంతో ఆలోచిస్తాడు,హింస పడతాడు ఒక్కోసారి.చివరకు తాను మంచి కథ రాసానని సంతోషపడతాడు,సంతృప్తి పడతాడు.ఇది ప్రతి రచయితా అనుకునేదే. కానీ ప్రత్రి రచనా మంచి రచన ఎందుకు కాలేకపోతోంది?
పై ప్రశ్నలకు సమాధానాలను ఈ ఉత్తరంలో రేఖామాత్రంగా వివరిస్తాను.అవి నీకు మంచి కథలు రాయడానికి కొంచమైనా ఉపయోగపడవచ్చు.తీరిక చేసుకుని నెమ్మదిగా చదువు. చదువుతూ చదువుతూ ఆలోచించు.
మొదటిది: భాష
కథకునికి భాష మీద మంచి పట్టు ఉండడం చాలా ముఖ్యం. భాష పేలవంగా ఉండడం అనేది అతి పెద్ద లోటే అనుకో. అలాగే పొడుగైన వాక్యాలు రాయడం,వాక్య నిర్మాణం సరిగ్గా లేకపోవడం,ఆంగ్ల పదాలను,వాక్యాలను తెలుగులో రాయగల అవకాశం ఉన్నా ఆంగ్లంలోనే రాయడం ఎన్నడూ చేయకు.పద సంపదను పెంచుకుని సుసంపన్నమైన తెలుగు భాష మీద పట్టు పెంచుకో. అలాగని భాషతో విన్యాసాలు చేయిస్తే,భాషను పల్టీలు కొట్టిస్తే,అది గొప్ప కథ అయిపోదు. తెలిసిందా. భాషా విన్యాసాలతో కథ గందరగోళం కిచిడీలా తయారయ్యే ప్రమాదం ఉంది. రుచి తెస్తోంది కదా అని కూరని నూనెతో నింపవు కదా. సమపాళ్ళలో భాషని అవసరానికి తగ్గట్టుగా వాడుకోవడం ఒక కళ.
రెండవది: శిల్పం
శిల్పం మీద చక్కగా శ్రద్ధ పెట్టాలి.అక్కర లేని వర్ణనలు,సాగతీత,నిడివి పెంచివేయడం ఎన్నడూ చేయకు. క్లుప్తత మీద నిరంతరం దృష్టి పెట్టు.అక్కర లేని వాక్యాలు,అడ్డదిడ్డమైన వర్ణనలు కత్తిరించి వేయి. కథ రాయడానికి పూనుకున్నప్పుడు,ప్రారంభ వాక్యం చాలా ముఖ్యం. తెల్లవారింది,కోడి కూసిందిలాంటి పేలవమైన వాక్యాలతో కథ ప్రారంభించకు. అలాగే కథ చివరి వాక్యం-కథలో మెరుపు అంతా ముగింపు వాక్యంలోనే ఉంటుంది. ముగింపుని ఒక పేరలాగా సాగదీసి, ఆ కథ యొక్క సారాంశం మొత్తం చెప్పడం,సందేశాలు ఇవ్వడం,ఉపదేశాలు చెప్పడం వంటివి ఎన్నడూ చెయ్యకు. గుర్తుంచుకో, కథ మొదటి వాక్యం నువ్వు చెప్పబోయే కథ గురించి గొప్ప ఆసక్తి కలిగించేదిగా,చివరి వాక్యం నీ కథ గుర్తుండిపోయే విధంగా ఉండాలి.
మూడవది : నవరసాల పోషణ
నవరసాలను సరిగ్గా పోషించడం రాలేదనుకో కథ అంతా రసాభాస అయిపోతుంది చూసుకో మరి. ఇప్పుడు హాస్యం ఉందనుకో,హాస్యాన్ని పండించడం కత్తి మీద సాములాంటిది. హాస్య కథ రాయడానికి పూనుకున్నావనుకో, అతి ధోరణిలో,వెకిలితనానికి దిగిపోయేటట్టు రాయడం,లేదూ చప్పగా నవ్వు పుట్టని విధంగా రాయడం అనే ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తగా సునిశితమైన హాస్యాన్ని పండించగలిగలగాలి.వ్యంగ్యంగా రాయదలిస్తే చదివే పాఠకుడికి వెగటు పుట్టకుండా చూడాలి. కరుణ,అభిమానం,ప్రేమలాంటివి తీవ్రంగాను,అతిగానూ వ్యక్తీకరించడం కథకు వన్నె తెచ్చే విషయం కాదు. అప్పుడు కథ కృతకంగా తయారవడానికి ఎంతైనా అవకాశం ఉంది,జాగ్రత్త.
నాలుగవది : కథాంశాలు
కథాంశాలు ఎన్నుకోవడంలో నవ్యత లేదనుకో, ఇది వరకు వచ్చిన వేలాది కథల్లో నీదీ ఓ కథగా మిగిలిపోతుంది మరి. ఉదాహరణకి చాలామంది రచయితలు ప్రేమ కథలు,కుటుంబ కథాంశాలు రాస్తుంటారు.ఇలాంటి కథలు ఎవరైనా ఎంతో కొంత అలవోగ్గా రాసెయ్యగలరు.అయితే ఇటువంటి కథాంశాలు తీసుకోదలచుకుంటే ఎంత విభిన్నంగా చెప్పగలవో చూసుకోవాలి.సందేశాలు,ఉపదేశాలు నేరుగా చెప్పడాన్ని పరిహరించాలి.
అయిదవది : పాత్రల చిత్రీకరణ
పాత్రలు ఒకే మూసలో ఉండడం,మూస ధోరణిలో సంభాషణలు కొనసాగించడం పనికిరాదు.కొన్ని కథల్లో పాత్రలన్నీ తెలివి తెలివిగా మాటకి మాట మాట్లాడుకుంటూ తర్కించుకుంటూ ఉంటాయి.కొన్నిట్లో అన్నీ స్వగతాలే.కొన్ని కథల్లో పాత్రలు స్థిరత్వం లేకుండా వాటి స్వభావాన్ని మార్చేసుకుంటాయి. ఇవేవీ పనికి రాదు. చేవ గలిగిన పాత్రలు సృష్టించే సత్తా కావాలి. తెలిసిందా?
పాఠకులని తక్కువ అంచనా వేయడం,మేధావీతనం,అహంభావం,సంకుచిత స్వభావం,అతి భావుకత,అస్పష్టతలను వర్జించాలి.
సూక్ష్మంగా చెప్పాలంటే:
1. గిరిగీసుకున్న ఆలోచనా ధోరణి (మూసపాత్రలు పుట్టే లోయ).
2.సంతృప్తి చెందిన జీవన విధానం (చప్పిడి కథలు,ఎక్కడో చదివినట్టుండే కథలు ఇక్కడే ఈదులాడతాయి).
3.కృత్రిమ గొంతుక (ఏ కథ రాస్తే అందరూ ఒప్పుకుంటారో,ఆహా ఓహో అంటారో ఆ రకమైన సాధు గొంతుకతో జనామోదాన్ని పొందే వెన్న దొంగ గొంతుక).
4.వ్యామోహంతో కూడిన ఆలోచనా ధోరణి ( ఒక్కోరకం పాత్ర పట్ల పక్షపాత ధోరణి,వాస్తవదూరమైన పాత్రలతో అల్లికలో పోగులు అక్కడక్కడా పోయి లోపాలుగల చీరల్లా కథలు అల్లబడే నేత మగ్గం).
5.భావోద్వేగాలకు బానిస (భావోద్వేగాలలో తాను కొట్టుకుపోతూ పాఠకుడిని కూడా సుడిగుండంలోకి లాగే తన మీద తనకు అదుపులేని కవిలాంటి రచయిత).
పైన నే చెప్పిన విషయాల గురించి బాగా ఆలోచించు.మనసులో కొన్ని రోజులు నానపెట్టు.అప్పుడు నీకు నిలకడ మీద విషయం తెలుస్తుంది.మనసులో ఓ మెరుపు మెరుస్తుంది.అప్పుడు తెలుస్తుంది మంచి కథ ఎలా రాయాలో.
భాష మీద పట్టు,కథలు చదువుతూ ఉండడమే కాదు,జీవితాన్ని చదవాలి.
జీవితాన్ని చదువుతూ స్పష్టమైన ఆలోచనా ధోరణి పెంచుకోవాలి. జ్ఞానాన్ని సముపార్జించాలి.వివేకము,నిస్వార్థము,తార్కిక దృష్టి,ఆత్మ విశ్వాసము,ఖచ్చితత్వము నీ సంస్కారంలో మిళితమైపోయి ఉండాలి.
కేవలం కథలు రాయడానికి ఇన్ని అర్హతలు కావాలా అని నీకు ఈపాటికే ఆశ్చర్యం కలుగుతోందని నాకు తెలుసు. నేను చెప్పేది అల్లాటప్పా రచనల గురించి కాదు,కాలాలు మారినా పాఠకుల హృదయాల్లో నిలిచిపోయే రచనల గురించి.అటువంటి గొప్ప రచనలు చెయ్యాలంటే ఎంత ఉన్నత వ్యక్తిత్వం ఉండాలి చెప్పు?
ఇంకా రాయవలసిన విశేషాలు చాలా ఉన్నాయి. ఇవాళ వడియాల పని పెట్టుకున్నాను. ఇంకో ఉత్తరంలో ప్రముఖ రచయితల గొప్ప కథలను ఉదాహరణలుగా పైన నేను ఉటంకించిన విశేషాలను మరింత విపులంగా రాస్తాను.
ఉంటాను బంగారు తల్లీ. అందరినీ మరీ మరీ అడిగినట్టు చెప్పు.
ఇట్లు నీ మామ్మ,
పూర్ణాంబ.