
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మా వాణి ...
సాహితీ బంధువులందరికీ నమస్కారం.
మొదటగా, శ్రీకృష్ణాష్టమి, గణేశచతుర్థి పండుగలకై ముందస్తు శుభాకాంక్షలు.
ఇటు ఆంధ్రరాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, అటు కేంద్రంలో పాత ప్రభుత్వమే తిరిగి కొత్తగా ఏర్పడి అపుడే నెలరోజులయిపోయింది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రజాస్వామ్యాన్ని చిత్రంగా నిర్వచిస్తారు. రెండు తోడేళ్ళు, ఒక గొర్రెపిల్ల కలిసి ఆ రోజు భోజనానికేమి కావాలో సమిష్టిగా ఎన్నుకునే ప్రక్రియే ప్రజాస్వామ్యమంటారు. ఏ దేశ ప్రజాస్వామ్యమెలా ఉన్నా-మన భారత దేశంలో గొర్రెపిల్లల్లాంటి బడుగు జీవులు ఒకరిద్దరు కారు. వీరి సంఖ్యే అధికం. అసంఖ్యాకం. వీరంతా కలిసికట్టుగా, ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ఈ ప్రభుత్వాలు ప్రజలిచ్చిన తీర్పుని గౌరవించి, వారికి తాము ఎన్నుకుంటున్న నేతల పట్ల ఉన్న విశ్వాసాన్ని ఆయా నేతలు పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంటారని ఆకాంక్షిస్తుంది madhuravani.com సంపాదక బృందం.
ఇక,సాహితీరంగంలో లబ్దప్రతిష్టులయినవారు, ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత - అబ్బూరి ఛాయాదేవి గారు జూన్ 28, 2019 న కాలగతిని పొందారు. వారి దివ్యస్మృతికి ఈ సంచికని అంకితమిస్తున్నాము. వారికి వంగూరి చిట్టెన్ రాజు గారు సమర్పించిన అక్షర నివాళి ఈ లంకెలోచూడవచ్చును.
https://www.madhuravani.com/nivali-jul19
అలాగే, అలనాటి మధురాలలో అబ్బూరి చాయాదేవి గారు రచించిన కథ, వారికి నచ్చిన కథ -"బోన్ సాయ్ బ్రతుకు" అశేష సంఖ్యాకులైన సాహిత్యాభిమానులకై ప్రత్యేకంగా అందిస్తున్నాము.
https://www.madhuravani.com/alanati-jul19
మరో విశేషమేమిటంటే- ఈ సంచికలో "అర్చన ఫైన్ ఆర్ట్స్" వారు నిర్వహించిన కథలపోటీలో బహుమతి పొందిన కథలనీ, పద్యకథలనీ అందిస్తున్నాము. ఈ క్రింది లంకెలో ఆ కథలని చదివి, అభిప్రాయాలు చెప్పగలరు. https://www.madhuravani.com/archana-kathala-potee19
madhuravani.com తొలిసంచికనుంచీ, ఇప్పటివరకూ నిరంతరాయంగా అలరించిన గొల్లపూడి గారి 'డైరీలో పేజీలు ' ఈ సంచిక మటుకూ అనివార్య కారణాల చేత అందించలేకపోతున్నాము. పత్రిక అభిమానులు ప్రతీ సంచికలో ఎంతో ఇష్టంగా చదివే ఈ శీర్షిక వచ్చే సంచికనుంచీ తిరిగి నిరంతరాయంగా అందించగలము.
ఎప్పటివలెనే, పునరుధ్ఘాటించాల్సిన అవశ్యకత ఉన్న మరో మాట- పత్రికకి రాస్తున్న రచయితలందరూ పత్రికకి మూలస్థంభాలు. వారితో పాటే, ప్రపంచం మూలమూలనా ఎన్నో దేశాలలో పత్రికని క్రమం తప్పకుండా చదువుతూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న ఎందరో సాహిత్యాభిమానులకీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
మీ ఆదరణ ఇలాగే సాగాలని కోరుకుంటూ...

మధురవాణి నిర్వాహక బృందం
MADHURAVANI TELUGU MAGAZINE మధురవాణి
