మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

కంచర్ల గోపన్న

ప్రసాద్ తుర్లపాటి 

కుతూబ్ షాహి కాలము (1518-1687) లో తెలంగాణా ప్రాంతములో విలసిల్లిన సాహితి మూర్తులలో ప్రాముఖ్యత పొందినది, భక్త రామదాసు గా పేరుగాంచిన కంచర్ల గోపన్న(1620-1680), మల్కిభిరాముడు మొదలగువారు. 

 

తెలుగు వాగ్గేయకారుడు, రామభక్తాగ్రేసరుడైన రామదాసు ఇప్పటి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అనే గ్రామములో 1620 సంవత్సరములో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించారు, వీరి భార్య కమలమ్మ.  తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు రామదాసు నుండి సంక్రమించిన పెన్నిధులు.

"కదళీ ఖర్జూరాది ఫలముల కన్ననూ, పాలు తేనెల కన్నా, పంచదార పలుకులకన్నా" ఆ రామనామమే మధురమైనదని కీర్తించి తరించాడు శ్రీరామ దాసు. 

మొదటగా " భద్రగిరి దాశరధీ కరుణాపయోనిధి" అన్న మకుటముతో ఆ రామచంద్రునికి పద్య సుమాలను సమర్పించాడు.  

 

శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ, ఆ రామ నామ స్థుతి తో ప్రారంభించి, తన గోత్ర నామాలతో ముగించాడు.

 

“శ్రీ రఘురామ! చారుతులసీదళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ ! త్రిజ గన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ ! జగజ్జన కల్మషార్నవో

త్తారకనామ ! భద్రగిరి,  దాశరథీ కరుణాపయోనిధీ”

…………………

…………………

“అల్లన లింగ మంత్రి సుతుడత్రిజగోత్రజడాదిశాఖ కం

 చెర్ల కులోద్భవుండన బ్రసిద్దుడనై భవ దంకితంబుగా 

 నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ

 ద్వల్లభ: నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ”

 

“ ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్,  గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్, గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే, తప్పకచేతు మీభజన”  దాశరథీ కరుణాపయోనిధీ.. ,, అని వేడుకొన్న పరమ భక్తాగ్రేసరుడు శ్రీ రామదాసు.

 

“కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్, గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణ శంఖ చక్రముల్, గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ  నైతి నో జగత్కంటక  దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ.” .. అన్న పద్యము లో, ఆ రామ లక్ష్మణులను దర్శించాడు.


 

“ భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో

దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే

దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ “

అని శ్రీరామ కీర్తిని ఎలుగెత్తి చాటాడు.

 

తెలుగులో కీర్తనలకు ఆద్యుడు కంచెర్ల గోపన్న.  శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?"

 

“అంతా రామమయం ఈ జగమంతా రామమయం…

 

…సోమ సూర్యులును సురలు తారలును,  ఆ మహాంబుధులు నఖిల జగంబులు, అండాండంబులు పిండాండంబులు, బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ, నదులు వనంబులు నానా మృగములు, విదిత కర్మములు వేదశాస్త్రములు, అష్ట దిక్కులును ఆదిశేషుడును, అష్ట వసువులును అరిషడ్వర్గము…..”  

అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపమున వింతలు సలుపగ..

 

 ఈ సమస్త ప్రకృతి లో ఆ శ్రీరామ చంద్రుని కాంచిన పుణ్యమూర్తి గోపన్న.

“దశరధరామ గోవింద నన్ను - దయజూడు పాహి ముకుంద” అన్నా, “ననుబ్రోవమని చెప్పవే నారీ శిరోమణి, జనకుని కూతుర జనని జానకమ్మ” అని అమ్మని వేడుకున్నా, రామదాసు హృదయ కమలాలలో యెప్పుడూ ఆ సీత రాములను నిలుపుకున్నాడు.

“ తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడ నైతిని ఓ రన్నా అని ఆ శ్రీ రామ చంద్రుని  " చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి" అని వేడుకున్న భక్త శిఖామణి కంచెర్ల గోపన్న

 

“భజరే మానస రామం

భజరే మానస రామం

కరధృతశర కోదండం

కరితుండాయుత భుజ దండం”

 

 

"తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన

చక్రధారియై చెంతనె యుండగ"  

అని ఆ రామ మూర్తిని నమ్మిన పరమ భాగవతోత్తముడు, వాగ్గేయకారుడు, సాహితీ వేత్త కంచెర్ల గోపన్న.

భద్రాచల రామ మందిరాన్ని నిర్మించి తెలుగు వారికి ముక్తి కలిగించాడు. 

"అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి 

ముదముతో సీత ముదిత లక్ష్మణుడు

కదసి కొలువగా కలడదె రఘుపతి 

చారు స్వర్ణ ప్రాకార గోపుర

ద్వారములతో సుందరమై యుండెడి 

అనుపమానమై అతిసుందరమై

తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి 

కలియుగమందున నిల వైకుంఠము

నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి 

పొన్నల పొగడల పూపొద రిండ్లతొ

చెన్ను మీరగను చెలగుచునున్నది 

శ్రీకరముగ శ్రీరామదాసుని

ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము"

 

రామదాసు జన్మించిన నేలకొండపల్లి సమీపాన (ఖమ్మం లో) జన్మించుట, భద్రాద్రి సమీపములో ఆ పవిత్ర గోదావరీ తీరం లో, బాల్యము మరియు విద్యాభ్యసము, నా పూర్వజన్మ సుకృతాలు.

 

 

"రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ

మామకాభీష్టదాయ మహితమంగళం

కౌసలేశాయ మందహాస దాసపోషణాయ

వాసవాది వినుత సద్వరాయ మంగళం"

 

 “రామదాసాయ మృదుల హృదయ కమల వాసాయ, 

స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం”

 

ప్రసాద్ తుర్లపాటి

సాహిత్యం పట్ల, అందునా ప్రాచీన సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కల ప్రసాద్ తుర్లపాటి గారు విభిన్న కవితా శైలులని, కవులు మరియు రచనలని చక్కగా విశ్లేషిస్తారు. 

మూడు దశాబ్ధాలుగా సాంకేతిక రంగంలో కీలక పదవులెన్నో నిర్వహించి, టీ.సీ.యెస్ లో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు.

సాహితీ విభాగంలో కృషికి గానూ 2016 లో NATA వారి Excellence Award అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం శాన్ ఆంటోనియోలో వాస్తవ్యులైన వీరు నగరంలోని హిందూ టెంపుల్ పాలకమండలి సభ్యులు గా వ్యవహరిస్తున్నారు. 

***

Website Designed
 &  Maintained
by
 Srinivas Pendyala