
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వంగూరి పి.పా.
తెలుగు భాషా, సాహిత్యం, సాంస్కృతిక వికాసం కోసం కార్యాచరణ - 2019 - 2024
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి గారికి బహిరంగ లేఖ

వంగూరి చిట్టెన్ రాజు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి దివ్య సముఖమునకు,
ఇటీవలి ఎన్నికలలో ఘన విజయం సాధించి, అంధ్ర ప్రదేశ్ లో మీరు నూతన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నెలకొల్పడం పట్ల ముందుగా మీకు అభినందనలు తెలుపుతున్నాం. రాజకీయాల మాట ఎలా ఉన్నా, మీ విజయాన్ని తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక విషయాలపై “కబంధ హస్తాల నుంచి విడుదల” గా మేము భావిస్తున్నాము. తెలుగు భాష భారీ ఎత్తున “ఆంగ్లీకరణ” 1980 దశకంలోనే ప్రారంభం అయి, “ఇంగ్లీషు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. దానికి తెలుగు ప్రతిబంధకం” అనే విద్యా విధానంతో ప్రజలని మభ్య పెట్టి మన తెలుగు వారి ఆస్తిత్వం నిర్వీర్యం అయిన నేపధ్యంలో ఇప్పుడు ఆ విధానాలని సరిదిద్ది, మీదే అయిన ముద్ర వేస్తూ ఎక్కువ ఖర్చు లేకుండానే తెలుగు భాషా సాంస్కృతిక వికాసాన్ని పునరుద్దరించే ఒక చారిత్రక సదవకాశం మీకు దక్కింది. ఇది కేవలం అవకాశమే కాదు. చారిత్రిక అవసరం కూడా.
ప్రధాన ధ్యేయం:
మీ ప్రస్తుత పాలనా కాలం అయిన నాలుగేళ్ళలో ప్రాధమిక స్థాయి నుంచి పట్టభద్రుల స్థాయి దాకా అటు ప్రభుత్వ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, లాభాపేక్ష లేని సేవా సంస్థల రంగంలో కానీ నిర్వహించబడుతున్న అన్ని విద్యాలయాల లోనూ చదివిన ప్రతీ విద్యార్ధికీ రాష్ట్ర భాష అయిన తెలుగు వ్రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి తీరాలి. అచిరకాలంలోనే తెలుగు నాట ఉద్యోగ అవకాశాలు పెరగడానికీ, తెలుగు భాషనీ, సాహిత్యాన్నీ, సంస్కృతినీ, ఆస్తిత్వాన్నీ సగర్వంగా చాటుకోడానికి అదొక్కటే మార్గం.
రాబోయే నాలుగు సంవత్సరాలలో అంచెలంచెలుగా ఈ ధ్యేయాన్ని సాధించే దిశగా కొన్ని సూచనలు ఇవ్వడమే ఈ ఉత్తరం సారాంశం.
ప్రధాన సూచనలు:
-
రాష్ట్రంలో ఉన్న ప్రతీ పాఠశాలలోనూ...అంటే, ప్రభుత్వ రంగం, విద్యా వ్యాపార రంగం, లాభాపేక్ష లేని సంస్థల నిర్వహణలో ఉన్న ప్రతీ పాఠశాలలోనూ ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ దాకా రాష్ట్ర భాష అయిన తెలుగుని ప్రధాన భాషగానూ, ప్రపంచ భాష అయిన ఆంగ్ల భాషని రెండవ భాషగానూ బోధించాలి. ఈ విషయం మీద తక్షణం జీ.వో ఇచ్చి, ఆ జీ.వో అమలుకి తగిన ప్రాధాన్యత ఇస్తూ జిల్లా యంత్రాంగాలని నిర్దేశించాలి. చిత్త శుద్ధి లోపం వలన ఇలాంటి జీవోలు ఇది వరలో వచ్చినా అమలుకి నోచుకో లేదు. తెలంగాణా లో ఈ ప్రక్రియ ప్రారంభం అవడం ముదావహమే కాక ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అత్యవసరంగా అనుసరించ వలసిన విధానం.
-
తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలకి ఒక కేబినేట్ స్థాయి మంత్రిని నియమించాలి. లేదా విద్యా శాఖా మంత్రికి పూర్తి బాధ్యత అప్పగించాలి.
-
రాష్ట్రం లో ఉన్న అన్ని వాణిజ్య ప్రభుత్వ, లాభాపేక్ష లేని ట్రస్ట్ పాఠశాలలలోనూ ఒకే పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాలూ ఉండాలి.
-
ఏ పాఠశాలకి అయినా తెలుగు మాధ్యమం అని కానీ, ఇంగ్లీషు మాధ్యమం అని కానీ ఒకే భాష నిబంధన ఉండ కూడదు. ఒక పాఠశాలలో అన్ని పాఠ్యాంశాలూ ఒకే భాషలోనే బోధించాలి అనే విధానం సరి అయినది కాదు. ఏ సిలబస్ లో అయినా, ముఖ్యంగా స్టేట్ సిలబస్ లో ఆ సిద్దాంతం అసలు సమంజసం కాదు. సెంట్రల్ సిలబస్ లో కూడా అంతా ఆంగ్లమే ఉండాలి అనేది కూడా అసమంజసమే.
5. ఏ పాఠ్యాంశం ..అంటే ఏ సబ్జెక్ట్ ఏ భాషలో బోధిస్తే విద్యార్ధులకి మంచిదీ అన్నదే ప్రధానం.
ఉదాహరణకి “భారత దేశ చరిత్ర, ఆంధ్రుల చరిత్ర, ప్రపంచ చరిత్ర” లాంటివి అంగ్లంలో ఎందుకు బోధించాలి? ఆంధ్ర ప్రదేశ్ లో అది తెలుగులోనే బోధించాలి. ఏ రాష్ట్రం లో అయినా ఆ రాష్ట్ర భాషలోనే బోధించాలి. ప్రాధమిక, మాధ్యమిక, ఉన్నత విద్య: తెలుగు భాషా శాస్త్రం, వ్యాకరణం, సరళమైన తెలుగు సాహిత్యం (శతకాలు, పురాణ గాధలు, జానపద కథలు మొదలైనవి), ప్రాచీన, ఆధునిక సాహిత్యం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, కళా రూపాలు, సంగీతం, మత సిద్దాంతాలు & చరిత్ర , మానసిక శాస్త్రం, తత్వ శాస్త్రం, మొదలైనవి కేవలం తెలుగులో మాత్రమే నేర్పించ వలసిన తప్పని సరి పాఠ్యాంశాలు.
ప్రస్తుత ప్రజాభిప్రాయం అలా ఉండడమే కాక తెలుగులో ఆయా శాస్త్రాల ఉన్నత స్థాయి పాఠ్య పుస్తకాలు అందుబాటులో లేక పోవడం వలన కంప్యూటర్, గణిత శాస్తం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బోటనీ, బయో టెక్నాలజీ, ఆర్ధిక శాస్త్రం, వైద్య శాస్త్రం, ఇంజనీరింగ్ మొదలైన కొన్ని శాస్త్ర పరమైన పాఠ్యాంశాలు ఆంగ్లం లో బోధించ వచ్చును.
న్యాయ శాస్త్రం, వాణిజ్యం, వాణిజ్య ప్రకటనలు, సినిమా, టెలివిజన్, ఫోటోగ్రఫీ, భారత రాజ్యాంగం మొదలైన అనేక పాఠ్యాంశాలు మిశ్రమ పద్దతిలో అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటునట్టుగా తెలుగులోనూ, ఆంగ్లం లోనూ కలిపి బోధించ వచ్చును.
6. ప్రతీ ప్రవేశ పరీక్షల లోనూ (ఎంసెట్ లాంటి entrance examinations) తెలుగుతో పాటు అన్ని పాఠ్యాంశాలలో నుంచీ ప్రశ్నలు ఉండాలి.
7. పై విధానాలు నాలుగేళ్ళలో అమలు పరచ గలిగితే, భవిష్యత్తులో తెలుగు నాట విద్యార్ధులు అందరూ హాయిగా తెలుగు వ్రాయ గలరు, చదవ గలరు, మాట్లాడగలరు, సాహిత్య వికాసానికి తోడ్పడగలరు, మన సంస్కృతిని పెంపొందించి ప్రపంచంలో తెలుగు జాతి ఆస్తిత్వాన్ని సగర్వంగా చాటుతారు.
ఈ ఉత్తరం ఎలాగో అలాగ, ఎవరో ఒకరు మీకు చేరుస్తారు అనీ, మీరు చదివి ఆకళించుకుని, సరి అయిన అవగాహనతో తగిన విద్యా విధానాలని రూపొందించి, అమలు పరిచి, తెలుగు భాషాసాహిత్యాలకి పునర్జీవితం ప్రసాదించి చరిత్రలో నిలిచిపోయే ముఖ్యమంత్రి అవుతారు అనీ ఆశిస్తున్నాను.
భవదీయుడు,
వంగూరి చిట్టెన్ రాజు
***