top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

జ్ఞానం [ప.రా.జ్ఞాన సమేతం]

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

ఆ రోజు.

రాత్రి 11 గంటలు. 

తెల్లారిందంటే నా పుట్టినరోజు. ఆందోళనగా ఉంది.  నిద్రపట్టట్లేదు. 

 

కాలం తరుముకొస్తుంది. 

గడుస్తున్న కాలాన్ని వెనక్కి తోసేస్తూ, గతంగా మార్చేస్తూ, 

నన్ను వీడలేనని మొరాయిస్తున్న కొన్ని క్షణాలను మాత్రం నన్నలాగే పట్టుకునుండే జ్ఞాపకాలుగా మార్చేస్తూ...

కాలం అదేపనిగా తరుముకొస్తుంది.

 

వయసు పెరిగిపోతుంది. బరువూ పెరిగిపోతుంది. ఇంతవరకూ ఓకే. 

 

కానీ, వీటితో పాటు జ్ఞానం కూడా  అంతే వేగంగా పెరిగిపోతుంది. ఇదే సమస్య. జ్ఞానం అంటే అదేదో పనికొచ్చే జ్ఞానం అయితే సంతోషమే. దీనితోపాటే పనికిరాని[ప.రా.] జ్ఞానం ప్రతీ సంవత్సరానికీ ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఫేస్బుక్లోనో, వాట్సప్లోనో పంచబడ్డ కొటేషన్ల జ్ఞానం, కథల  జ్ఞానం కాదు. ఆ జ్ఞానం మహా  అయితే రెండురోజులు మనసులో నిలుస్తుందేమో.. ఇది మరో రకం జ్ఞానం. మాటల్లో చెప్పేంత జ్ఞానం రానట్టుందింకా. ప్రాక్టికల్ గా చూపిస్తాను. నా తరువాయి దినం లోకి వెళదాము రండి. 

 

"హ్యాపీ బత్డే!" 

వీకెండ్ పొద్దునే బద్దకంగా లేచిన నాకు  రంగురంగుల బెలూన్స్, ఓ పేద్ద గులాబీ పూల బొకే ని పట్టుకుని ఎదురుగా ముద్దుగా నిల్చున్న పిల్లలు, వారి వెనుకే ఆ పిల్లల తండ్రీ కనబడ్డారు. తండ్రి చేతుల్లో నాలుగు  గిఫ్టుప్యాకెట్లు. అవి చూడగానే కుడికన్ను అదరటం మొదలయింది. 

 

మమ్మీ, గిఫ్ట్స్ తెరిచిచూడు... ప్రేమగా అడుగుతున్నబాబుని దగ్గరకి  తీసుకుంటుంటే, నేను వారిస్తున్నా వినకుండా,  అసంకల్పితంగానే బొకే ధర  ఊహించింది మెదడు. మొన్న ఓ ఫ్రెండుకి సరిగ్గా ఇదే  తీసుకెళ్ళాను. ఇరవయ్యారు డాలర్లు. అప్పుడు కనబడని ధర ఇప్పుడు కళ్ళెదురుగా రంగురంగుల్లో కనబడుతుంది. అదేంటో. వేరే ఎవరికి కొంటున్నా దండగనిపించదు కానీ, నాకోసం కొంటే దండగ ఖర్చులా అనిపిస్తుంది. వెనుక తోటలో ఉన్న పూలు  ఇంతకంటే అందంగా ఉంటాయి కదా. అవి ఇచ్చినా బావుండేది.  వేరే రోజయితే ఆ మాట అనేద్దును కానీ, నా బత్డే రోజు ప్రేమగా తెచ్చినపుడు అలా అనేసి  నిరుత్సాహపరచటం అమానవీయం కదా. ఏమీ అనలేక “వావ్” అనేసాను.

 

ఈ పూలఖర్చు దండగన్నమాట వింటే మా నాన్న గారు బాధపడిపోతారు- “పాపం, బొకే షాపు వాళ్ళెలా బతకాలి మరి” అని. మన చిన్న ఖర్చు ఒకరికి జీవికనిస్తుందని. ఆ సమయానికి నేనూ “అంతే, అంతే” అనుకుని బహుమానాల వైపు చూసాను. గుండెలు దడ దడలాడుతున్నాయి. పెళ్ళైన కొత్తలో జీవిత భాగస్వామి అటెన్షన్ ని కొలవటం  కోసమనుకుంటా...ఈ బర్త్డే గిఫ్టులవీ కోరుకున్నట్టే గుర్తు. రాన్రానూ, ఇలా తండ్రీ పిల్లలు కట్టేసి (ప్రేమతోనే లెండి) మరీ ఇస్తున్న గిఫ్టులు అంతులేని వేదననీ, కొండంత ఆందోళననీ కలిగిస్తున్నాయి.

 

 “ఏం మాయ రోగం, ప్రేమగా ఇచ్చినవి తీసుకోక, మరీ చెప్పక!” అంటారేమో? మీరు కనుక అలా అన్నారనుకొండి. అనుభవంలోకి వచ్చేవరకు నేనూ అలా అనుకున్నదాన్నే అంటాను.  అనలేదనుకొండి. ఈ రకం బాధ బహు బాగా ఎరిగిన వారయి ఉంటారు. ఈ రెండు కేసుల్లోనూ నే చెప్పేదేమీ లేదిక. అలా... ఆ బహుమానాల ధరలూ, అదే బహుమానాన్ని నేనయితే ఏ సేల్ లో, ఏ డీల్ లో, ఎన్నెన్ని కూపన్లు అప్లై చేయించి, ఎంతెంత  ధర తేడాతో కొనేదాన్నో  తలుచుకుంటూ లోపలెంత గింజుకున్నా బయటకి మాత్రం బయటపడనీయకుండా బోల్డన్ని ధన్యవాదాలు చెప్పి, హగ్గులిచ్చి, వాళ్ళ ముఖాల్లో చూద్దును కదా. వెలుగు! ఆహా,. అనుకుంటాం కానీ, ఈ వెలుగు వెనుక  ఆనందాన్ని మించిన ధనమేముందండీ? “అంతే, అంతే” అనేసుకుని,  తరువాయి సన్నివేశానికెళ్ళాను.

 

ఇంతకీ మన టాపిక్ జ్ఞానం కదా?ఈ పీనాసి కబుర్లేంటంటారా? అయ్యో రాత. నా రాత ఇలాగే మోకాలిపై  (‘కె’ మూగబోయిన) ‘నీ’క్యాపుకీ,  గుండుమీదున్న టోపీకి ముడిపెడుతూంటుంది. పీనాసితనమనేది జ్ఞానానికి మొదటి దశ. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడో పదేళ్ళ క్రితమే వచ్చి ఇంకా వదులుతున్న సూచనలేమీ ఇవ్వని  జ్ఞానమిది. 

 

సరే, మీరు చెబుతున్నారు కనుక, పాత జ్ఞానాన్ని జ్ఞాపకాలకొదిలేసి మనం ఈ సంవత్సరం పెరగనున్న జ్ఞానాలని గురించి మాట్లాడుకుందాము.


అలా గిఫ్టుల కార్యక్రమం, యధావిధి కొత్త బట్టలు, పూజ, పాయసం కార్యక్రమం, అమ్మా వాళ్ళకీ, అత్తయ్యవాళ్ళకీ ఫోన్ల కార్యక్రమం ఇవన్నీ అయ్యాక, అతి ముఖ్యమైన  కార్యక్రమం గుర్తొచ్చింది. అది- హస్త భూషణంలో కి తొంగి చూడటమనే కార్యక్రమం. దీన్ని మాత్రం  అత్యంత శ్రద్ధతో, అనన్య సామాన్య బాధ్యతతో  నిర్వర్తించాను. అందులో ఫేసు బుక్కు, వాట్సప్ వగైరాలన్నీ కొత్త కళ సంతరించుకున్నాయి- నా బంధు, మిత్రుల శుభాకాంక్షల వల్ల.

 

నా పుట్టినరోజని చెప్పి, నా తరఫున నా స్నేహితులని నా ఫేస్బుక్కు గోడపైకి  శుభాకాంక్షలు చెప్పవలిసిందిగా ఆహ్వానించిన  జుకెన్ బర్గుకి  ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఆ తర్వాత, జుకెన్ బర్గ్ మాటను తీసేయకుండా,  ఏ లైకుల లెక్కలూ వేయకుండా  స్వచ్చంగా, ఆప్యాయంగా శుభాకాంక్షలు చెప్పిన మిత్రులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్న సమయంలో - మెదడులో జరిగిందో జ్ఞాన విస్ఫోటనం.  ఈ సంవత్సరం వయసుతో పాటు రావాల్సిన జ్ఞానం తాను విచ్చేసిన సంకేతాలిచ్చేసింది.

 

ఆ సంకేతాలు సరిగ్గానే అందిన కనులు ఓ పోస్టు దగ్గరే ఆగిపోయాయి. ఈ సంకేతాలేవీ అందకముందు ఆ పోస్టుని మామూలుగా చదివేసి మురిపెంగా లైకు కొట్టేయమన్న మెదడు, దాన్ని మళ్ళీ ఓ సారి చదవమంది. చదివాను. ..  బాబోయ్.  ఫేస్బుక్కులో అనర్థం తెచ్చే శుభాకాంక్షలు పెట్టేసాడు పతీదేవుడు[ ప.దేవ్.].  పూర్తి గా శుభాకాంక్షలు చదివేసాను. అయిపోయింది, అంతా అయిపోయింది. మానవజాతిని కనీసం పదితరాలు వెనక్కి పంపించేసే పోస్టది. 

 నా జ్ఞానవిస్ఫోటనం గురించి ఆట్టే సమాచారం లేని పతిదేవ్ -తల పట్టుకుని కూర్చున్న నన్ను చూసి, ఆశ్చర్యానందములకు లోనైతినని అనుకున్నాడేమో... చిన్నగా నవ్వి "నా సర్ప్రైజు రైటప్పు! బావుంది కదా!" అన్నట్టు మొహం పెట్టాడు.

నిర్వికారంగా అడిగాను- "ఏంటిది? ఎంత పని చేసారు?"

నవ్వు స్థానే ప.దేవ్. మొహంలో అయోమయం వచ్చి కొలువయింది. "బావుంది కదా? 'ఈ రోజు ప్రత్యేకమైనది. రోజూ ఉదయాన్నే లేచి ఇంటిల్లిపాదికీ ఆ రోజు సవ్యంగా గడిచేలా చేసే నా సతీమణి పుట్టినరోజు నేడు--.తనకిలా-" అంటూ తెలుగువర్షన్ మొదలెట్టాడు. భావుక హృదయంతో మొదలెట్టిన ఆ తర్జుమా ప్రక్రియ నాలో జ్ఞానాన్ని మరింత ప్రజ్వరిల్లింపచేసింది.

మళ్ళీ చేతులు తల పైకి చేరాయి. -"అంటే... పొద్దునే లేచి, తలస్నానం చేసి, మిమ్మల్ని లేపి, బెడ్ కాఫీ తెచ్చి, బ్రస్షుపై పేస్టు వేసిచ్చి, బాత్రూం లోకి పంపి, టవల్ అందించి, స్వహస్తాలతో అంతకుముందు రోజే ఉతికి, ఇస్త్రీ చేసిన ప్యాంటూచొక్కా ఇచ్చి, వేడిపొగలు కక్కే ఇడ్లీలు, సాంబార్ తినిపించి, పిల్లల బాక్సులు సర్దుతూ, మరో పక్కన నాలుగు స్టవ్వులపై నాలుగు వంటకాలు చేస్తూ సహస్రావధానం చేస్తూన్న ఒక స్త్రీగా చిత్రీకరిస్తూ, అలా ఉంటున్నందుకు  నాకు ధన్యవాదాలు చెప్పావన్నమాట. ఇలాంటి పోస్టుల ద్వారా ఈ సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నావు??

" అవునా, అంత అర్థం, ఓ మెసేజూ ఉన్నాయా,నా పోస్టులో. అందులో సగం పనులు నేనూ చేస్తానుగా." ఆశ్చర్యపోతూ అడిగాడు.ప.దేవ్.

 జ్ఞానం ప్రశ్నించాలనే తప్ప సమాధానం చెప్పమని చెప్పట్లేదు నాకు.

 "అదే. అలా పనులు పంచుకోవటం ఇష్టం లేకే, నన్ను ఇలాంటి శుభాకాంక్షల ద్వారా ట్యూన్ చేసుకుందామని ప్రయత్నిస్తున్నావు. అవునులే. నువ్వూ ఓ పురుషుడివేగా? . తరతరాలుగా మగవాళ్ళ బుర్రలని కండీషనింగ్ చేస్తున్న మనువాదం నేర్పించిన 'మంచి ఇల్లాలు ' అనే బానిస చట్రాల్లో నన్ను ఇమడ్చేందుకు ఈ శుభాకాంక్షలొక నెపం. అంతేగా" నాలో జ్ఞానం, ప.రా.జ్ఞానం ఏకమై మరీ నన్ను శెహభాష్ అంటూ భుజం తట్టాయి. . ఉప్పెనలా వచ్చేస్తున్నాయి ప్రశ్నలు.

"మనువాదమేంటీ? బానిస చట్రంలో నేను నిన్ను ఇమడ్చటమేంటీ. నాకేమీ అర్థం కావట్లేదు. కాస్త క్లియర్ గా చెప్పవా?" మరింత అయోమయంగా అడిగాడు ప.దేవ్.

 

సమాధానాలివ్వటం జ్ఞానుల పని కాదుగా, అందుకే నా ధోరణి ఆపలేదు.

 

"ఇలాంటి ట్యూనింగు తరహా శుభాకాంక్షలు ఇపుడిప్పుడే సమానత్వం నేర్చుకుంటున్న స్త్రీ జాతి పురోగతిని ని మరో వందడుగులు వెనక్కి వేయిస్తుంది."

 

ఏమీ అర్థంకాక ప.దేవ్. అలా వెర్రిగా చూస్తుండిపోతే జాలేసిందేమో, నాలో  జ్ఞానానికి.  సరిగ్గా చెప్పమని సలహా ఇచ్చింది.

 

మరీ. ఇపుడూ- రోజూ మీ చెల్లి కి బోల్డంత పని ఉంటుందా? పాపం, ఇద్దరూ ఏదో తంటాలు పడి పనులు చేసుకుని వెళతారా? ఈ ట్యూనింగు పోస్టు -  మీ చిన్నారి చెల్లి భర్త చూసాడనుకో. "అదిగో చూడు, నువ్వెపుడూ ఇలా సావిత్రి  లా చేయలేదు" అంటాడు. అసలివన్నీ కాదు. మీ కలీగ్  ఉన్నాడే? అసలే బద్ధకిష్టి. తన సాకర్ ఆటలు, తన పూల్ క్లబ్స్ కాక,  క్రిస్టీకింత సాయం చేయాలన్న ధ్యాసే ఉండదు. అతనూ మీ  పోస్టు చదివి, తన కంఫర్ట్స్ కోసం -"చూడు. అందరూ పొద్దునే లేచి ఇంటిపనంతా చేసుకుంటారట." అని క్రిస్టీకి ఫేక్ ఉద్భోధ చేస్తాడు. క్రిస్టీ  చిరాగ్గా నాకు ఫోన్ చేసి నా వెనుకబాటుతనాన్ని వేలెత్తి చూపుతుంది. ఇదంతా అవసరమా? ఆ పోస్టు తీసేయ్ ముందు."

 

"అయ్యో. అంత ప్రమాదముందంటావా? తీసేస్తాను." ప.దేవ్. వెంటనే పోస్టుని ఎడిట్ చేసుకున్నాడు.

 

నా కొత్త జ్ఞానానికి థ్యాంక్స్ చెప్పాను. నన్ను ఓ రెండు అడుగుల ఆవలకి ఆలోచించేలా చేసినందుకు. మరి నిజమే కదండీ. ఎంత కష్టపడి తెచ్చుకున్న సమానత్వం? తుమ్మితే ఊడే ముక్కులాంటిదిది. ఒకరు పెడగా వాడినా స్త్రీ స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం వీటిని, మొత్తానికని దుమ్మెత్తిపోసి, తమ అనుకూల జీవనం కోసం స్త్రీల పరిస్థితిని మళ్ళీ మొదటికి తెచ్చేసే మగవాళ్ళెందరుంటారో మనచుట్టూరా. ఒడ్డు మీదున్నవాళ్ళు తమ ప్రయోజనాలు చూసుకోవటమే తప్ప బాధితుల గురించి ఆలోచించనూ లేరు. మరలాంటప్పుడు, ఇపుడిపుడే పెరుగుతున్న పరిణతిని చేతనయినంత పదిలపరుచుకోవాలని  చెప్పే జ్ఞానం మంచిదేగా? ఇదిగో ఇలా పనికొచ్చే జ్ఞానం ఎన్ని రెట్లు పెరిగినా బాధ లేదు. నేను మొదట్లో చెప్పిన పనికిరాని[ప.రా] జ్ఞానం అన్నానే... అది మహా తెంపరిది. తగవులు పెట్టి చోద్యం చూస్తుంది. 


ఈ ప. రా. జ్ఞానం ఆ విషయాన్ని అంతటితో వదిలేయక, ప.దేవ్. అంగీకారాన్ని మరో కోణం లో చూపెట్టి నన్ను గట్టిగా గిల్లింది. 

 

 నేను వెంటనే హింట్ గ్రహించి, "హమ్మయ్య. ఇప్పటికర్థమయిందా. చూసారా? నేనంతసేపూ కంఠశోష వచ్చేలా చెబితే ఎక్కలేదు కానీ, ఆ క్రిస్టీకి కష్టమనగానే వివరం తెలిసొచ్చిందే?" అని మూతితిప్పేసి,  ప.రా. జ్ఞానాన్ని ఆ రోజుకి సంతుష్టిపరిచి బజ్జోపెట్టాను.

 

|ఇతి  జ్ఞాన సమేత ప.రా. జ్ఞాన పారాయణం సంపూర్ణం.|

*****

bottom of page