
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు

ఎన్. గోపి
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఫ్రీడమ్ ఫైటర్
అతడు నాకు రోజూ కనిపిస్తాడు
రెపరెపలాడని పాతబడ్డ ప్రత్యేక సంచికలా
చకచకా నడవలేని కాంస్య విగ్రహంలా ఉంటాడు
రెట్టలతో ముగ్గుబుట్టయిన తలతో
కనిపించినప్పుడల్లా 'మూడ్ ' పాడుచేస్తాడు
నాలుగురోడ్ల కూడలిలో నలభై రెండోసారి
గాంధీగారికి గద్దె కట్టడానికి సిద్ధమైన
చాదస్తపు శిల్పిలా ఉంటాడు
వేళ్ళకొసల మీద వందేమాతరం పూసల్ని దొర్లిస్తూ
కనపడ్డ ప్రతివాణ్ణీ అపరాధిని చేస్తాడు
ఆదర్శం పేరా ఆశయం పేరా
జీవితాన్ని రోడ్లపాలు చేసుకున్న వెర్రివాడు
సమస్తాన్నీ తృణంగా ఊదేసి
గోచీగుడ్డ కోసం యాచిస్తున్నాడిప్పుడు
లక్షల్తో త్యాగాన్ని వెలిగించి
ఇంట్లో ఎండిన డొక్కల కోసం
ఇల్లిల్లూ తిరుగుతుంటాడు
అర్థరాత్రి మెట్లు దిగిపోయిన సిద్ధార్థుడు
కపిలవస్తులో రొట్టె దొంగిలిస్తూ పట్టుబడ్డాడు
అతడితడే!
వేలాది మైళ్ళు నడచిన సర్వవ్యాపి
వాహనాలు చల్లిపోయే మురికిని ఉతుక్కుంటాడు
రూపాయి సూర్యోదయం కోసం
యోగ నమస్కారాలు చేస్తాడు
అమ్మటాని కేమీ లేదు చరిత్ర తప్ప !
అతని సంతానం గత గాథల బరువుతో వొంగిపోయి నడుస్తారు
ఆధునిక విపణి వీధుల్లో అలనాటి సాహసాలు అమ్ముడుపోవు
చరిత్ర - గోల్డు అట్టల మధ్య అలమార్లలో నిద్రపోతుంది
చరిత్ర - సావనీర్ అడ్వర్టైజుమెంట్ల మధ్య
తలొంచుకుని బక్క చూపులు చూస్తుంది
వాళ్లంతా ఒకే చెట్టు ఆకులు
వాళ్లంతా ఒకే స్వార్థం దూసిన చాకులు
ముసిలాడి ఉపన్యాసానికి చప్పట్లు మోగవు
వేదనకు త్రిల్లును జోడించలేడు కదా !
కన్నీళ్ళలో ఇంద్రధనుస్సుల్ని పూయించలేడు
రంగంలో చెలామణి అయ్యే సరుకును
ఛలోక్తులతో అందించలేడు
వొట్టి ఔటాఫ్ డేట్ రాట్!
రోజూ రోడ్లను దగ్ధం చేస్తూ నడుస్తుంటాడు
చిటపటల శబ్దాల్తో పెళ్ళలు రాలి పడ్తుంటాయి
జైలు ముఖం చూడని కుర్ర మంత్రి
జైలు సర్టిఫికెట్టు కోసం తిప్పుతాడు
వీధి జనం జండా ఎగరే స్తుంటే
ఆఖరున నిలబడి కన్నీళ్లు కారుస్తాడు!
అతడు నాకు రోజూ కనిపిస్తాడు
కనపడ్డ ప్రతివాణ్ణీ అపరాధిని చేస్తాడు
అతణ్ణి తప్పుకుపోవటానికి
దారులు వెతుకుతాను నేను!
(‘చిత్ర దీపాలు’ కవితా సంపుటి నుండి)
బొల్లు లలితానంద ప్రసాద్

గండు చీమలు
కిక్కరిసిన పుష్పక విమాన బస్ లో
అదృశ్య హస్తం ఎవరిదో!?
వీపుపై మృదువుగా పారాడింది
అసంకల్పితంగా వెను తిరిగాను
ఓ మాతృమూర్తి ఆప్యాయంగా అన్నది
‘ ‘గండు చీమ పాకుతుందని
లోపల పాకే గండర గండు చీమల్ని
ఏ తల్లి దివ్య హస్తం పారదోలుతుంది?!
*****
అలంకారం
సహనమే సంస్కృతి
సహనమే సంస్కారం
సహనమే సర్వ జ్ఞానం
సహనమే సపరిణత
ఆధునిక ఆహార్యంలో
అసహనమే అలంకారం
నోరు పారేసుకోవడమే నాగరికత
*****
అనుబంధం
రెండు కోడె గిత్తలు
రెండు నిండు ప్రాణాలు
విధి లేక ఇల్లు విడిచాయి గిత్తలు
బంధం ఉంచుకోలేక - తెంచుకోలేక
తల్లీ, బిడ్డ --
ఇహ లోకం విడిచిపోయాయి
కాసులు బదులు
తండ్రి తనువంతా
ఆరని అగ్ని కీలలు
కనిపించని కోడెల
కడలేని కన్నీటి కాలువలు
కాంచ గల వారెవరు?
(మా గ్రామం పెరుకలపూడి (గుంటూరు జిల్లా) లో ఓ రైతు తన గిత్తలను అమ్మగా, ఆ విషయం తట్టుకోలేక అతని భార్య, కుమారుని ఆత్మహత్యలకు విచారిస్తూ)

~బండారి రాజుకుమార్
కూడికకు రొండుపక్క
1.
బైలెల్లుడుకే తీర్మానంజేసుకున్నంక వత్తవత్త ఇంటిని కాలబెట్టి అడుగు బైటపెడుతం.తిరిగి వచ్చేదన్క ఇంటికుంపటిల కుతకుత ఉడికిపోతయి లోపలి పానాలన్నీ!మంటపెట్టందే సందు దొరకదు.
ఆత్మీయంగ అల్లుకున్న ప్రేమపాశపు తీగలన్నీ కాళ్లకు అడ్డంబడుతయి.బెల్లంగొట్టిన రాయిలెక్క ఒక్కకాన్నే వుండలేనితనం.కాలు నిలువదు.తెగదెంపులు జేసుకున్నంత పనైతది.
2.
తొవ్వపొడుగూతబోతాంటె కలవబోయే ఆరాటాలను మంచానికి నులకనల్లినట్టు వొడుపుగ ఇగురంతోటి మ్యానిఫెస్టో తయారై మెడకోలు బరువైతది.
గున్నగున్న నడ్శి బిన్నబోయినా సుతభారీ బహిరంగసభల రాజకీయ నాయకుడి ఆగమనం తీరైతది.వాడిపోవడానికి తయారుగున్న పువ్వుల్లా సోపతిగాళ్లు ఎదుర్కోల్ల మతాబులు పేల్చి అలాయ్ బలాయ్ దీసుకుంటరు.మందలిచ్చె తీరుగ మందలిచ్చి ఇంకోపాలి తీరుబడి యవ్వారం కూడదని మాటదీసుకుంటరు.
3.
ఎప్పుడు మాటల బుడుగులో దిగబడిపోతమో అస్సలు పెయి మీద సోయి వుండదు.మొగలి పొట్టెల కమ్మటి వాసనల్ని గుండెల నిండుగ నింపుకుంట కాలపరీక్షకు హాజరై ఎదురు నిలబడతం.
పొంటెలు పొంటెలు ముచ్చట్లల్ల మునిగి బతుకు గొప్పదనం మీద దీర్ఘకావ్యాలల్లి పాడుకుంట సాగిపోతనే వుంటం.గిందుకే గద గంటలు గంటలు తీరుబడిగొచ్చే దోస్తుకోసం ఆగమాగమై సందులు గొందులు కలెదిరిగింది! బీరపువ్వు నవ్వులకోసం పెయ్యంత కండ్లేసుకుని కొత్త సాలుకు ఎదురుసూశినట్టు ఎంత సంబురం? ఎంత ఉత్కంఠ?
4.
ఇంటిబెల్లుగొట్టిన సూరన్న ముసుగుదన్ని పన్నంక సుత ఒడ్వని ముచ్చట్లే కాపలాగాత్తంటయి.పిట్టలు రాయభారం మోసుకొచ్చే యాల్లయితాంటది.ఆడిబిడ్డను అత్తగారింటికి సాగదోలినట్టు మనసంతా ఒకటే బుగులైతాంటది.ఒక్కొక్కలుగ తలో తొవ్వబట్టుకుని బోతాంటె బడిల వీడ్కోలు సమావేశం యాదికొత్తది.కండ్లనీళ్లొత్తుకునుడే దక్కువ.
5.
ఇల్లుజేరేటాల్లకు ఏ నడిజాము రాతిరైతదో దెల్వదు.అప్పటికే కర్ఫ్యూ కొనసాగుతున్న ప్రాంతమది.అల్లర్లు జరిగే అవకాశమున్నందున పైలంగుండమని ఆకాశరామన్న సంకేతాలు అందుతయి.