
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
అదన్నమాట సంగతి
బూచాడమ్మా .. బూచాడు... మాయలెన్నో చేస్తాడు..

జ్యోతి వలబోజు
బూచాడమ్మా బూచాడు పాట వినగానే మీకు గుర్తొచ్చింది ఫోన్ కదా. కాని అంతకంటే పెద్ద బూచాడు వేరే ఉన్నాడు. మాయల బూచాడు. తోడుగా ఉంటాడు. మనని సంతోషపెట్టాలని చాలావిధాల ప్రయత్నిస్తాడు. ఎవరికేది ఇష్టమో అదే ఇస్తాడు. ఒకప్పుడు చాలా పెద్ద సైజులో ఉన్నా రాను రానూ మన అరచేతిలో ఇమిడిపోయేట్టుగా మారి, ఎల్లప్పుడు మనకు అందుబాటులో ఉంటానంటాడు. ఇప్పుడైతే ప్రతీ మొబైల్ ఫోనులో కూడా దాగి ఉన్నాడీ బూచాడు.
అదేనండి మన రేడియో..
రేడియో వచ్చిన మొదట్లో కాదుగాని (అప్పటికి నేను పుట్టలేదు కదా) , నా చిన్నప్పటినుండి మా నాన్నగారి అలవాటుగా రేడియో వినడం మొదలైంది. ఎక్కువగా సినిమా పాటలు.. అసలు రేడియోలో పాటలు , మాటలు ఎలా వస్తున్నాయని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. శనాదివారాల్లో బాలానందం, బాలవినోదం కార్యక్రమాలప్పుడు అయితే మరీ వింత.. ఈ పిల్లలందరూ నా వయసువాళ్లే అయుంటారు. వీళ్లంతా ఇంత టాలెంటెడా? వీళ్లంతా ఇంత పర్ఫెక్టుగా ఈ పాటలు, నాటికలు, పద్యాలు ఎలా చేయగలుగుతున్నారు. నాకేమీ రావే అనుకునేదాన్ని. అలా అలా ఆ రేడియోతో పరిచయం పెరిగి, అపురూపమైన బంధంగా ఇప్పటికీ కొనసాగుతుంది.
ఎన్ని ఇష్టాలు, అభిరుచులు మారినా రేడియో మాత్రం ఎవర్ గ్రీన్.. ఎందుకంటే నేను పెరుగుతున్న కొద్దీ నా ఆలోచనలు, వయసుకు తగినట్టుగా కార్యక్రమాలు వస్తున్నాయి కదా. నేను వినేది ఎక్కువగా పాత పాటలు , వివిధ కార్యక్రమాలు వచ్చే వివిధభారతి. తెలుగు అయిపోతే హిందీ పాటలున్నాయిగా.. ఈ రేడియో మూలంగానే నాకు పాత హిందీ, తెలుగు పాటలమీద అభిమానం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది.
రేడియో! అంటే నేటితరానికి మొబైల్ పోన్లలో వినిపించే ఎఫ్ ఎమ్ చానెల్స్ మాత్రమే. కాని నాకు మాత్రం రేడియో అంటే రేడియోనే. ఆరుగంటలకు సుప్రభాతంతో మేలుకొలుపు పాడి, భక్తి పాటలతో రోజును ముందుకు కొనసాగిస్తూ మంచి మంచి సినిమా పాటలు వినిపించేది రేడియో.
శని, ఆదివారాలు బాలానందం , బాలవినోదం, సంక్షిప్త శబ్ధ చిత్రాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో అందరికి ఉన్న ఒకే ఒక వినోద సాధనం రేడియోనే. ఇక ప్రతీ బుదవారాలు కష్టపడి ముల్లు జాగ్రత్తగా తిప్పి సిలోన్ రేడియోని పట్టుకుని అమీన్ సయానీ గొంతులో బినాకా గీత్ మాలా లో ఎన్నో హిందీ సినిమా పాటలు వినడం .. అదో అద్భుతమైన అనుభూతి.
అప్పట్లో స్కూల్లో ఇంగ్లీషు చదువులైనా రేడియో మూలంగా తెలుగు, హిందీ బాగా ఒంటబట్టింది. ఇప్పటికీ వదలకుంది.. వయసు పెరుగుతున్న కొద్దీ అభిరుచులు, అలవాట్లు మారతాయంటారు. పుస్తకాల విషయంలో, టీవీ ప్రోగ్రాములు, సినిమాల విషయంలో నాలో కొంచెం మార్పు వచ్చినా. రేడియో అభిమానం మాత్రం అలాగే ఉంది. ఎన్ని ఎఫ్.ఎమ్ చానళ్లు వచ్చినా వివిధభారతి మాత్రం చాలా ఇష్టం.. ఇంతకుముందు రేడియో ఉదయం ఆరునుండి రాత్రి పదిన్నర వరకు మాత్రమే నడిచేది.
ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు ఏధో ఒక చానెల్ లో పాటలు వస్తుంటాయి. అందుకే నేను ఎంత పొద్దున లేచినా నాతోపాటు మేలుకుంటుంది నా రేడియో.. ఎంతపనైనా, ఎన్ని గంటలైనా నాతోపాటు పనిచేస్తూ అలసటను మరిపిస్తుంది నా రేడియో..
అలనాటి పాటలు వింటుంటే మా పిల్లలకు చిరాగ్గా ఉంటుంది. కొన్ని మరీ విసుగ్గా ఉంటాయి. అప్పట్లో అవి సూపర్ హిట్ పాటలు మరి. ఈ రేడియోలో వినేది ఎక్కువగా అలనాటి తెలుగు , హిందీ పాటలే.. స్కూలులో, కాలేజీలో రేడియో చిన్నగా పెట్టుకుని ఒక్కదాన్నే మేలుకుని రాత్రి ఒంటిగంటవరకు చదువుకున్న రోజులున్నాయి. ఆ అలవాటు నన్ను పెళ్లిలో రేడియోని కూడా సారెగా తీసుకెళ్లడం జరిగింది. అందరూ నవ్వుకున్నా మా నాన్నగారికి నా అలవాటు తెలుసు కాబట్టి ముందే కొనిపెట్టారు. అలా అలా ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతూ ఇప్పుడు కిచెన్ లో ప్రిజ్ మీద కూర్చుంది... ఎందుకంటే ఇదే నా సామ్రాజ్యం కదా. ఇందులో ఎవరికీ ప్రవేశం లేదు. నా ఆనందానికి అంతరాయం కలిగించే అవకాశం అస్సలు లేదు.. బయట ఉన్నప్పుడు, కరెంట్ పోయినప్పుడు మాత్రం మొబైల్ లో కూడా వివిధభారతి లేదా పాత సినిమా పాటలే. ... ఏ పరిస్ధితిలోనైనా మనసుకు ప్రశాంతతను ఇచ్చేది ఆ పాత మధురమైన పాటలే కదా..
అప్పుడూ, ఇప్పుడూ రేడియో ఇంటిల్లిపాదికీ చక్కని కాలక్షేపం. రేడియో ఎ మన పనికి ప్పుడూ అడ్డంరాదు. పైగా పనిచేసే ఉత్సాహం కూడా ఇచ్చేది.
విజయవాడ భక్తి రంజనిలో సోమవారం శివునికి సంబంధించిన గీతాలు ఆదివారం సూర్యనారాయణా వేదపారాయణా శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్య నారాయణా గీతాలు తప్పకుండా వచ్చేవి.
మనకు ఇంకా వివిధ భారతి రాని రోజుల్లో ప్రతి రోజూ సిలోన్ లో సాయంత్రం నాలుగున్నర కి ప్రాంతీయ భాషల్లో పాటలు అందులో తెలుగు పాటలు వచ్చేవి. ఆ రోజుల్లో గడియారంతో పనిలేదు. ఇంట్లో రేడియో నే అందరికీ సమయం చెప్పేది.
రేడియో అయినా,, మొబైల్ లో అయినా వివిధభారతి లేదా పాత పాటలు వస్తున్న చానెల్ పెట్టుకుని , ఆ మధురమైన గానలహరిలో మునుగుతూ తేలుతూ, ఒంటరిగానైనా ఎంతపనైనా అలసట లేకుండా చేసుకోవచ్చు.
*****