top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 8

ఖుషీ కార్నర్

దాశరధిగారికి జన్మదిన వందనాలతో

భువనచంద్ర

"ఏమిటీ.. జనాభా తక్కువగా వున్నారూ?" ముక్తేశ్వర్రావుని అడిగారు కో.రం.గారు. కోరంగారి పూర్తి పేరు కోదండ రంగారావు. ఆస్తి వున్నది గనక పని చెయ్యడు. గోదావరి నీళ్ళు తాగాడు గనక వ్యంగ్యం పాలు ఎక్కువే.

ముక్తేశ్వర్రావు కృష్ణా జిల్లావాడు. మాట మధ్యస్తం, ఒక్కోసారి పెళుసు. ఎక్కువపాలు ముక్తసరిగా వుంటాడు.

"ఏవుందీ..! ఎన్నికల గోలకదా!" ముక్తసరిగా అన్నాడు.

"పిచ్చాళ్లు కాకపోతే, ఏ పార్టీవాడయినా జనాన్ని ఉద్ధరించడానికేం రారు కదా. కోట్ల మీద ఖర్చు. అదంతా తిరిగి రాబట్టుకోవడానికే కదా వాళ్లు ఇల్లిల్లూ తిరిగి ఓటు భిక్ష పెట్టమనేదీ" సహజమైన చిరాకు స్వరంలో అన్నాడు కోరంగారు.

"పండగ పండగే. అదీ ఓట్ల పండగ, అదే ఎన్నికలంటే రెండు విశేషాలు. గెలిచినవాళ్లకి పండగ. ఓడినవాళ్లకి విషాద పండగ." పేపరు మడిచి పెట్టి అన్నారు నంది నరసింహంగారు.

భయంకరమైన ఎండాకాలం. చీమ చిటుక్కుమననడం లేదు. ఆకులు ‘మహా’ డిసిప్లిన్ మండబెట్టే కార్పోరేట్ స్కూల్లో విద్యార్థుల్లా భయంభయంగా కదలకుండా బిగుసుకుపోయి వున్నాయి.

సూర్యుడు జనాలకి ఫుల్లుగా మద్యం పోయించి, చేతుల్లో నోట్లు కుక్కి, దేవుడి మీద ప్రమాణం చేయించుకుని జబర్దస్త్ ధైర్యంతో వున్న పార్టీ ఎం.పి లా చండప్రచండంగా ఎండ కురిపిస్తున్నాడు.

సాయంత్రం ఆరు గంటలయినా అస్తమించే ప్రయత్నం చెయ్యడం లేదు. చంద్రుడేమో అంతరాత్మకి జవాబిచ్చుకోలేని ఓటరులాగా వద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఎండలోనే వెన్నెల్ని వేడి చేసుకుంటున్నాడు. 

'బరాబర్' పొదిగిన ప్రత్యర్థుల్లాగా సూర్యచంద్రులు ఒకే ఆకాశంలో అటూ ఇటూ వేలాడ్డం చూస్తే విచిత్రంగా వుంది.

"ఇంతకీ ఎవరు గెలుస్తారూ?" అప్పుడే వచ్చిన అమూల్యగారన్నది.

"ఆ ఒక్కటీ అడక్కు!" సైకిల్ స్టాండు వేసి అన్నాడు సైకిల్ మూర్తి.

"అయ్యా.. ప్రజాస్వామ్యం అనేదే ఓ పెద్ద భ్రమ. ఏనాడయినా గెలిచేది ధనబలం వున్నవాళ్ళే. ధనం ధనాన్ని అర్జిస్తుంది. నిర్ధనుడి గోడు ఎప్పుడూ నిష్ఫలమే!" నిట్టూర్చాడు ముక్తేశ్వర్రావు.

"అదేమిటండీ అట్లా అంటారూ.. ప్రజాప్రతినిధులందరూ మేడిపళ్ళనా మీ ఉద్ధేశ్యం?" కోపంగా అన్నాడు సైకిల్ మూర్తి.

"అయ్య.. నేనన్నది ప్రజాస్వామ్యమూ, 'బై ది పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్' అన్న స్లోగన్ గురించి. ఒక్కసారి ఆలోచించండి. అసలు మన ఆలోచనా శైలి ఎంత డొల్లో. కోర్టుకు పోయిన ప్రతివాడు భగవద్గీత మీదో, బైబిలు మీదో, ఖురాన్ మీదో చెయ్యి పెట్టి మరీ ప్రమాణం చేస్తాడు. నేను చెబుతున్నదీ సత్యమేననీ, అసత్యం కాదనీ, ప్రమాణం చేసేవాడు ప్రతీవాడూ "నిజమే చెబితే యీ కోర్టులూ, లాయర్లూ, జడ్జీలూ, బిళ్ళ బంట్రోతులూ ఎందుకూ? అలాగే పదవీప్రమాణం చేసే ప్రతివాడూ సిన్సియర్‌గా ప్రమాణం ప్రకారం నడుచుకుంటే ఇంత అవినీతి, ఇంత అధికార దుర్వినియోగం, ఇంత హింస ఎలా జరుగుతుందీ?" తీవ్రంగా ప్రశ్నించాడు గుంటూరు గాలిబ్‌గారు.

"అయ్యా.. పైన ఎండ వేడి.. కిందనించి నేల భగభగలు. దానికి తోడు యీ పాలిటిక్సు కూడానా? హాయిగా నాలుగు పాటలు పాడుకుందాం, ప్రకృతిని చల్లబరుద్దాం" చల్లగా అన్నది అమూల్య.

"అవునవును" ఇంకా చల్లగా అన్నది సావిత్రి.

"ఓకే బాస్. ఇవ్వాళ చాయిస్ నీది" కూర్చుంటూ అన్నాడు రమో.(రవీంద్ర మొక్కపాటి. జూనియర్ బాలు) అమూల్యతో.'

"థాంక్యూ. నాకు ఇష్టమైన కవి డా. దాశరధి కృష్ణమాచార్యులవారు. ఆయనంటే చెప్పలేనంత ఇష్టం. ఆయన వ్రాసిన పాటల్లో నూటికి ఎనభైకి పైగా సూపర్ హిట్లే. అదీగాక మరో ప్రత్యేకత వుంది" ఆగింది అమూల్య.

"ఏమిటీ?" కుతూహలంగా అడిగాడు రమో

"జులై 22 ఆయన పుట్టినరోజు"నవ్వుతూ అన్నది అమూల్య.

"ఓహ్. ఇంకొన్ని వివరాలు చెప్పు" అడిగారు కోరంగారు.

"పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లా, గూడూరు మండలం, పెదగూడూరు గ్రామంలో. తేదీ జులై 22, 1925 న. గొప్ప ప్రజాస్వామ్యవాది. స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్ళినవాడు. అటు బ్రిటిష్ వారినీ, ఇటు నిజామ్‍ని ఎదిరించి పోరాడిన ధీరుడు. అటు కలం, ఇటు కత్తీ (సాయుధ పోరాటం కాదు.. కానీ కత్తి లాంటి సునిశిత విమర్శలతో ప్రసంగాలు) ఒకేసారి ప్రయోగించిన అద్భుత సాహిత్య, సమరశీలి"గర్వంగా అన్నది అమూల్య. 

"అంతేనా?" కావాలని అన్నాడు ర.మో.

"పిచ్చివాడా…  దాశరధి నిజంగా ఓ సముద్రం. మిగతావాళ్లంతా కవితలు జల్లుతుండగా యీయన జనంలో విప్లవ బీజాల్ని నాటారు. అంతే కాదు. ఎవరెన్నెన్ని మాటలన్నా తన దారిన తాను అనుకున్న పద్ధతిలో మౌనంగా సాగిన మహామనిషి దాశరధి. అయితే మరో పార్ష్యం ఏమంటే, గీతాలు, ముఖ్యంగా సినీ గీతాలు అల్లడంలో ఆయనదో ప్రత్యేక శైలి" ఆకాశం వంక భక్తితో చూస్తూ అన్నది అమూల్య.

"ఆ కవితేజం ముందు రవి తేజం ఎంతా? అని పక్కకి తప్పుకుని లోకాన్ని చల్లదనానికి వదిలాడు సూర్యుడు. వాతావరణం ఆహ్లాదమయమయింది.

"ముందేదన్నా పాట పాడి వినిపించండర్రా పిల్లలూ" చనువుగా అన్నారు గుంటూరు గాలిబ్‌గారు.

"ఆహా! రవీంద్రగారూ.. 'పాట పాడనా ప్రభూ' సాంగ్ జ్ఞాపకం వుందా?" అన్నది అమూల్య.

"ఎందుకు లేదూ. అదో అద్భుత గీతం.. 'తల్లిదండ్రులు' చిత్రంలోనిది కదూ. ఘంటసాలగారు సంగీత దర్శకులు" మురిసిపోతూ అన్నాడు ర.మో. 

చిత్తగించండి..

చిత్రం: తల్లిదండ్రులు(1970) సంగీతం: ఘంటసాల , గాయని: పి.సుశీల

పల్లవి : పాట పాడనా ప్రభూ. పాట పాడనా.

నీ కౌగిట వీణను నేనై.. నీ పెదవికి వేణువును నేనై

పాత పాడనా ప్రభూ.. పరవశించనా...  //పాట//

చరణం: పాదాలను పూజించుటకై.. పారిజాత కుసుమం నేనై

పరిమళాలు దోసిట నింపీ.. మురిసిపోదునా ప్రభూ..

పరిమళాలు దోసిట నింపీ...మురిసిపొదునా ప్రభూ.. పొంగిపోదునా..  //పాట//

చరణం: నీ చూపుల వెన్నెలలోనా.. నిదుర లేచు కలువను నేనై

నాలోని తరగలమీదా. నిలిచి ఆడనా.. ప్రభూ.. నిన్ను వేడనా... //పాట//

చరణం: గుడిలోపల నీ సన్నిధిలో... గోరంతటి దీపము నేనై

కొండంత నీ వెలుతురులో.. నిలిచిపోదునా ప్రభూ.. 

కొండంత నీ వెలుతురులో.. నిలిచిపోదునా నీలో.. కలిసిపోదునా..

*****

"అయ్యా అలతి అలతి పదాలలో అద్భుతమైన భావచిత్రం అందించిన గీతం ఇది. జీవుని ఆర్తి, జీవుని ప్రేమా, ఆత్మ నివేదన అన్నీ కళ్లముందు కదలాడతాయి. 

"నీ కౌగిట వీణను నేనై.. నీ పెదవికి వేణువు నేనై

పాదాలను పూజించుటకై.. పారిజాత కుసుమం నేనై"

ఆహా.. ఎంత చక్కని భావన" ఆనందంగా అన్నాడు గుంటూరు గాలిబ్.

"అయ్యా.. అసలు ఆనందం ఎక్కడుందంటే "పరిమళాలు దోసిట నింపీ" అనే పదాల్లో. ఆవకాయ అన్నం తిని చేతులు వాసన చూసుకుంటూ, ఆవకాయ వాసనొస్తే.  మరి పారిజాతాలు దోసిట పట్టిందా? లేదే... తానే 'పారిజాత కుసుమం' అవుతుందట. ఎంత చమత్కారం "చిరునవ్వుతో అన్నది సావిత్రి.

"అసలు విషయం వినండి. 

"నీ చూపుల వెన్నెలలోనా..  నిదురలేచు కలువను నేనై, 

కొలనులోని తరగల మీదా.. నిలిచి ఆడనా' అంటారు దాశరధి.

ఓ కొలను.. నీటిపైన వెన్నెల ప్రతిఫలిస్తుండగా నిలువుగా నిలిచి చిరుగాలికి అటూ ఇటూ వూగుతూ ఆడుతున్న కలువ.. వాహ్. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన 'డాఫడిల్స్' కవిత గుర్తుకు రావడం లేదూ?" తన్మయంగా అన్నాడు సైకిల్ మూర్తి.

"ఆగండాగండి. చౌద్‌వీ కా చాంద్ హో అనే పాటలో 'చెహ్రా హై జైసే ఝీల్ పె ఖిల్తా హువా కవల్' అంటాడు కవి. ఇక్కడ తనే వెన్నెల్లో కలువనని అంటుంది నాయిక. ఎంత హాయిగా వుందండీ.. కొలనులోని తరగల మీద నిలిచి ఆడడం." మధురంగా నవ్వింది అమూల్య.

"అఫ్‌కోర్స్. ఆ పాటకీ, యీ పాటకీ సంబంధం లేదు. అసలు చివరి చరణం చూడండి.

తను గోరంత దీపమంట... ప్రియుడు కొండంత వెలుతురు అంటూ చివరిగా, నిలిచిపోదునా నీలో కలిసిపోదునా అంటుంది. గోరంత దీపం కొండంత వెలుగులో కలిసిపోవడం అంటే గోరంత శరీరంలోకి ఇమిడిన ఆత్మ విశ్వమంతా నిండిన పరమాత్మలో కలిసిపొవడమేగా. వెలుగు వెలుగులో కలిసినట్టు ఆత్మ పరమాత్మలో కలిసిపోతుందన్నమాట. అద్వైతాన్ని అద్భుతంగా అక్షరాల్లో ఇమిడ్చుకున్న పాట ఇది. దాశరధి విశ్వరూప కవి. "అచ్చెరువుగా అన్నాడు ర.మో.

"అక్కడే ఆగితే ఎలా.. పదండి ముందుకు. పదండి తోసుకు" ఉత్సాహపరుస్తూ అన్నారు కోరంగారు.

'అదేమిటి శ్రీశ్రీని మధ్యలోకి తెచ్చారూ?" అన్నది సావిత్రి.

"శ్రీశ్రీకీ, దాశరధికీ మధ్య చాలా కవితా యుద్ధాలు నడిచాయి. అయినా లోపల్లోపల ఒకరంటే ఒకరికి గౌరవమే."

"శ్రీశ్రీగారేమన్నారు దాశరధిగార్ని?" కుతూహలంగా అడిగాడు రెమో.

"ఇదో నిందాస్తుతి.

దాశరధీ

నవ్య కళానిధి

కావ్యపర్యోనిధి

ఐనా చైనా అంటే అది

కాదిక భయం అతని దుర్విధి " అన్నారు తన సిప్రాలిలో (సి.ప్రా.లిఅంటే శ్రీశ్రీ రచించిన సిరిసిరిమువ్వలు - ప్రాసక్రీడలు -లిమరిక్కులు)

"సరే.. సరే.. ముందుకు పదండి.." అన్నారు ముక్తేశ్వర్రావుగారు.

"కవుల గురించి ప్రస్తావన వచ్చింది గనక  'దాశరధిగారి మొదటి పాట' వ్రాయించింది ఎవరో తెలుసా?" అడిగింది అమూల్య.

"ఎవరూ?" కుతూహలంగా అడిగింది సావిత్రి.

"ఇంకెవరూ. మన మనసు కవి ఆత్రేయగారు. 'వాగ్ధానం' చిత్రంలో సాటి కవులు మల్లాది రామకృష్ణ శాస్త్రి,  శ్రీశ్రీ, ఆరుద్రలతో  పాట వ్రాయిద్దామనుకున్నారట ఆత్రేయగారు. 'వాగ్ధానం' చిత్రానికి నిర్మాత ఆయనే. ఆరుద్రగారికి కుదరకపోతే, హైదరాబాదు నించి దాశరధిగారిని పిలిపించి మరీ మద్రాసులో పాట వ్రాయించారు. అదీ మామూలు పాటగాదు. నవరంగ్ (హిందీ సినిమా)లోని 'ఆధాహై చంద్రమా రాత్ ఆదీ' పాటని స్ఫూర్తిగా. జవాబిచ్చింది అమూల్య.

"ఓహ్. నిజంగా ఇది నాకు తెలీదు. ఆ పాట వినిపించవూ" అడిగారు ర.మో.

"సరే. చిత్రం పేరు వాగ్ధానం. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు (1960)

పల్లవి: 

నా కంటి పాపలో నిలిచిపోరా

నీవెంట లోకాల గెలువనీరా //నా కంటి//

ఎంత అందంగా హిందీ ట్యూన్‌లో తెలుగు ఒదిగిపోయిందీ!

"శభాష్. ఆయన సూపర్ హిట్స్ చెప్పు" 

"ఒకటా రెండా.. వందలకొద్దీ ఉన్నాయి. ఆయన మామూలు కవి కాదు. డా.మంగళంపల్లి బాలమురళీకృష్ణగారిచేత 'శకపురుషుడు, మహాకవి' అనిపించుకున్నవాడు.

ఇది వినండి.."అన్నది అమూల్య. ర.మో వంక సైగ చేస్తూ.

 

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961). అన్నపూర్ణ స్టూడియో వారిది. 

సంగీతం: ఎస్.రాజేశ్వరరావు, గానం: ఘంటసాల , సుశీల.

పల్లవి :

ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ

హుషారు గొలిపేవెందుకే - నిషా కనుల దానా

ఖుషీ ఖుషీగా నవ్వుతూ - చలాకి మాటలు రువ్వుతూ

హుషారు గొలిపేవెందుకే - నిషా కనుల దానా

చరణం 1:

మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది - నా చెలి మీనా

నింగిదాటి ఆనంద సాగరం - పొంగిపొరలె నాలోన

//ఖుషీ //

 

చరణం 2:

ఒహో చెలియా నీవు కూడ - ఓ పెళ్ళి పల్లకీ చూసుకో

హాయికొలుపు సన్నాయి పాటలో - వలపుబాటలే వేసుకో

నే వెళితే మరి నీవు, - మజ్నువవుతావూ

మజ్ను నేనైతే ఓ లైలా - లోకమే చీకటై పోవునే

//ఖుషీ// 

 

చరణం 3:

ఆకాశంలో ఇంద్రధనస్సుపై - ఆడుకుందమా నేడే

నీలి నీలి మేఘాల రధముపై - తేలిపోదామీనాడే

చంద్రుడు నేనై నీవు వెన్నెలై - కలసిపోదమా హాయిగా

నేను వీణనై నీవు నాదమై - ఏకమౌదమా తీయగా

//ఖుషీ//

అంటూ అలతి అలతి పదాలతో పాటకి అమరత్వాన్ని ప్రసాదించారు దాశరధిగారు. 58 సంవత్సరాలయింది ఈ పాట పుట్టి. అయినా చూడండి. ఎంత నిత్యనూతనంగా వుందో" ఆనందంగా అన్నారు పాట మొదలుపెట్టినప్పుడు వచ్చిన గురయ్యగారు.

"నిజం.. అసలు ఆ పదాల సౌందర్యం, పొందికా, ఇప్పటి పాటల్లో మచ్చుకయినా కనిపిస్తాయా.. పదాలన్నీ గులకరాళ్ల గుట్టలో అన్నీ ఒక చోటే వుంటాయి. ఏ ఒక్కటీ మరోదాన్ని అంటుకోదు. మరి యీ పాట చూడండి. ప్రతీ పదం మరో పదాన్ని తనలో ఐక్యం చేసుకుంటోంది. అందుకే దాశరధిగారి పాటలు అమరం" భక్తిగా అన్నది అమూల్య.

"అసలు సినీగీతాలు వ్రాయాలంటే అతి సున్నితమైన మనసుండాలి. అంతే కాదు అంతే సున్నితమైన పదాలు కూర్చుకోగలగాలి" అన్నాదు కోరంగారు.

"దాశరధిగారి గురించి 'స్వరాధి దేవత'(యీ బిరుదు దాశరధిగారు సుశీలగారికి ఇచ్చింది) పి.సుశీలగారు ఏమన్నారో తెలుసా. 'మదిలొ వీణలు మ్రోగించే ఆయన కవితా విపంచి నా గొంతులో ఎన్నో మధురగీతాలు పలికించింది. దాశరధిగారు వీణపాటలు వ్రాయడంలో స్పెషలిస్టు అన్నారు "అన్నది అమూల్య.

"నిజం. నా చిన్నతనంలో నేను మొదట ప్రేమించిన అమ్మాయిని తలుచుకున్నప్పుడల్లా నాకు దాశరధిగారి పాటే గుర్తొస్తుంది" నిట్టూర్చి అన్నాడు కోరం.

"ఏ పాట అదీ?" అడిగాడు రెమో.

'నన్ను వదలి నీవు పోలేవులే' అనే మంచి మనసులు సినిమాలోని పాట" తల వొంచుకుని అన్నాడు కోరం. ప్రేమ అనేది ఓ అద్భుతం. దానికి మనసే తప్ప వయసనేది ఉండదు. 

"అయితే వినండి." ఉత్సహంగా అన్నారు సావిత్రి.

చిత్రం: మంచి మనసులు  (1962) సంగీతం: కె.వి.మహాదేవన్, గానం: ఘంటసాల, సుశీల

నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే...

పూవులేక తావి నిలువలేదులే లేదులే  

తావిలేని పూవు విలువ లేనిదే ఇది నిజములే

నేను లేని నీవు లేనె లేవులే లేవులే

 

చరణం 1

నా మనసే చిక్కుకొని నీ చూపుల వలలో

నా వయసు నా సొగసు నిండెను నీమదిలో 

చిరకాలపు నా కలలే ఈనాటికి నిజమాయె 

దూరదూర తీరాలు చేరువైపోయె ||తావిలేని||

 

చరణం 2

సిగ్గుతెరలలో కనులు దించుకొని తలను వంచుకొని

బుగ్గమీద పెళ్ళిబొట్టు ముద్దులాడ 

రంగులీను నీమెడలో బంగారపు తాళిగట్టి

పొంగిపోవు శుభదినము రానున్నదిలే

ఓ... ||నన్ను వదలి||

చరణం 3

తొలినాటి రేయి తడబాటు పడుతూ

మెల్లమెల్లగా నీవు రాగ

నీ మేని హొయలు నీలోని వగలు

నాలోన గిలిగింతలిడగా

హృదయాలు కలసి ఉయ్యాలలూగి

ఆకాశమే అందుకొనగా

పైపైకి సాగే మేఘాలదాటి

కనరాని లోకాలు కనగా

ఆహా ఓహో ఉహు ఆ... ఓ...

నిన్ను వదలి నేను పోలేనులే అది నిజములే

నీవు లేని నేను లేనె లేనులే లేనులే

"ఒక మాట చెప్పి తీరాలి. కృష్ణశాస్త్రిగారిలా దాశరధి ప్రకృతి ప్రేమికుడు. వెన్నెల, కలువలు, చిరుగాలి. ఏటి తరగలు, జాబిలి పూవులు ఇలా ప్రకృతిని పాటలలో అక్షరీకరిస్తూ, మనో చిత్రాల్ని కళ్లకు కట్టించినవాడు దాశరధి." ఓ తన్మయత్వంతో అన్నది అమూల్య.

"అవును. మల్లెలు, మమతలు, వేణువు, వీణ, ముత్యాలు ఇలా అన్నీ ఆనందకరమైనవే. ఆయన వ్రాసిన వీణ పాటల్ని మరోసారి మనఃస్ఫూర్తిగా ప్రస్తావించుకుందాం. ఆయన వ్రాసినదే మరపురాని పాట నేను పాడాలనుకుంటున్నాను" అన్నాడు ర.మో

"ఆలస్యం ఎందుకు నాయనా.. అందరం రెడీ.." ఉత్సాహంగా అన్నారు ముక్తేశ్వరరావు.

"దీనికో ప్రత్యేకత వుంది. దాశరధి హృదయంలో పుట్టిన పాటకి ఘంటసాలగారు ఊపిరి పోశారు. ఇదో అమరగీతం "అని గొంతు సవరించుకున్నాడు రెమో.

 ఓ బుల్లి దూడ పార్కులోకి వచ్చి ఖుషీ కార్నర్ ముందు ఆగింది. దాని పెద్ద పెద్ద కళ్లతో అందర్నీ చూస్తోంది. "శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటారు గదా.. ఓ బుల్లి దూడగారు కూడా వచ్చారు వినడానికి.. ఇక మొదలుపెట్టు"అన్నారు కోరా గారు.

 

చిత్రం: రాము (1968), సంగీతం: ఆర్. గోవర్ధన్.. గానం: ఘంతసాల

సాకీ :

 దీనులను కాపాడుటకు దేవుడే ఉన్నాడు

 దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు

 ఆకలికి అన్నము వేదనకు ఔషదం

 పరమాత్ముని సన్నిధికి రావే ఓ... మనసా

 పల్లవి :

 రారా కృష్ణయ్యా! రారా కృష్ణయ్యా!

 దీనులను కాపాడ రారా కృష్ణయ్యా

 ॥రారా కృష్ణయ్యా॥

 చరణం : 1

 మా పాలిటి ఇలవేలుపు నీవేనయ్యా

 ఎదురుచూచు కన్నులలో కదిలేవయ్యా

పేదల మొరలాలించే విభుడవు నీవే

 కోరిన వరములనొసగే వరదుడవీవే

అజ్ఞానపు చీకటికి దీపము నీవే

 అన్యాయమునెదిరించే ధర్మము నీవే

 నీవే కృష్ణా... నీవే కృష్ణా... నీవే కృష్ణా...

 ॥రారా కృష్ణయ్యా॥

 

 చరణం : 2

 కుంటివాని నడిపించే బృందావనం

 గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం

మూఢునికి జ్ఞానమొసగు బృందావనం

 మూగవాని పలికించే బృందావనం

అందరినీ ఆదరించు సన్నిధానం

 అభయమిచ్చి దీవించే సన్నిధానం

 సన్నిధానం! దేవుని సన్నిధానం! సన్నిధానం

 ॥రారా కృష్ణయ్యా॥

 కృష్ణా... కృష్ణా... కృష్ణా... కృష్ణా...

 

 చరణం : 3

 కరుణించే చూపులతో కాంచవయ్యా

 శరణొసగే కరములతో కావవయ్యా

మూగవాని పలికించి బ్రోవవయ్యా

 కన్నతల్లి స్వర్గములో మురిసేనయ్యా

నిన్ను చూచి బాధలన్ని మరిచేనయ్యా

 ఆధారము నీవేరా రారా కృష్ణా...

కృష్ణా... కృష్ణా... రారా... కృష్ణా...

 ॥రారా కృష్ణయ్యా॥

*****

"అయ్యా రవీంద్రా.. కడుపు నిండిపోయింది" తృప్తిగా అన్నారు గుంటూరు గాలిబ్.

"గాలిబ్ సాబ్.. భగవంతుడి భాషలు రెండు. ఒకటి మౌనం. రెండోది సంగీతం. ఓ చిత్రం చూడంది. ఇదే ట్యూన్‌కి ప్రపంచంలో ఎన్ని భాషలున్నాయో అన్ని భాషల్లోనూ పాట వ్రాయగలం. అందుకే సంగీతం భగవంతుడి భాష. మనిషి దేవుడి భాషల్ని మరిచి తన భాషని తాను సృష్టించుకున్నాడు. అదీ ఒకటి కాదు. లక్షా తొంబై భాషలు. అందుకే బెంగాలీవాడికి తెలుగూ, తెలుగువాడికి తమిళం, ఫ్రెంచివాడికి చైనీసూ, చైనీసువాడికి రష్యనూ అర్ధమవవు. ఇక్కడ చూడండి. మౌనం తప్ప మరో భాష తెలీని ఆవుదూడ కూడా చెవులు విప్పార్చి వింటొంది." దూడ గంగడోలు నిమురుతూ అన్నది అమూల్య. 

"అవునమ్మా.. అది నిజం. దేవుడికి వున్నది మౌనం, సంగీతం అనే రెండు భాషలే కాదు. మరో భాష వుంది. దాని పేరు 'ప్రేమ'. ఇప్పుడు నువ్వు ఆ దూడకి  నీ చేతుల ద్వారా అందిస్తున్న భాషే ఆ ప్రేమ" నవ్వి అన్నారు కోరంగారు.

"మంచి మాట అన్నారు సార్. అన్నట్టు దాశరధిగారిదే ఓ చల్లని ప్రేమ పాట వున్నది. అది మీరు వద్దన్నా పాడాలని వుంది. అయ్యా బీ రెడీ. అమ్మా సావిత్రమ్మ గొంతు కలపండి" అన్నాడు ర.మో.

చిత్రం: ఆత్మగౌరవం (1966), సంగీతం: ఎస్.రాజేస్వరరావు, గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే

 

ఒక పూలబాణం తగిలింది మదిలో

తొలి ప్రేమదీపం వెలిగిందిలే... నాలో వెలిగిందిలే...

చరణం 1:

అలనాటి కలలే ఫలియించే నేడే

అలనాటి కలలే ఫలియించే నేడే

మనసైన వాడే మనసిచ్చినాడే

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి

వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి

//ఒక// 

చరణం 2:

 

ఏ పూర్వబంధమో అనుబంధమాయే

ఏ పూర్వబంధమో అనుబంధమాయే..

అపురూపమైన అనురాగమాయె....

నీ కౌగిట హాయిగా సోలిపోయి...

నీ కౌగిట హాయిగా సోలిపోయి ...

సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలోయి

//ఒక// 

 

పాఠకులకి నమస్కారం. నా ఖుషీ కార్నర్‌ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నమోవాకాలు. నా ముందు తరపు గీత రచయితలందరూ ఎంత 'ఆస్తి'పరులంటే, తరతరాలకీ తరగని సాహితీ సంపదని మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. అలాగే మన సంగీత దర్శకులు కూడా. నేను వ్రాస్తున్న యీ ఖుషీ కార్నర్ వారిని విశ్లేషించడానికి కాదు. వారందరూ హేమాహేమీలు. నేనో గులకరాయిని. అంతే . ఈ ప్రయత్నం దేనికంటే వారి పాటల్ని మళ్లీ మళ్లీ తలుచుకుని , పాడుకుని, గుండెనిండా ఆ మహానుభావులకు కృతజ్ఞతలు అర్పించడం కోసం. ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ

జులై 22 దాశరధిగారి పుట్టినరోజు. దాశరధిగారికి కృతజ్ఞతాపూర్వకంగా యీ వ్యాసం రాసే అవకాశమిచ్చిన 'మధురవాణికి మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 

నమస్సులతో 

మీ

భువనచంద్ర

bottom of page