srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

Anasuya.jpg

“అసమాన అనసూయ” ‘కళా ప్రపూర్ణ’ డా. అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారి కి అక్షర నివాళి.

                                                                                                                                                                                                      -వంగూరి చిట్టెన్ రాజు 

 

మార్చ్ 23, 2019... మా అనసూయ గారిని తన 99 వ ఏట పరమపదించారు అనే ఆ వార్త తో ఆ మహా మనీషితో అవినాభావ సంబంధం ఉన్న మా మధురవాణి బృందమే కాక, యావత్ తెలుగు సంగీత, సాహిత్య, సాంస్కృతిక, సినీ రంగాలలో ఉన్న కళాకారులందరం ఒక పెద్ద దిక్కుని కోల్పోయాం. ఎనిమిది తరాలకి  చెందిన ఆఖరి ధృవతార శాశ్వతంగా వెలుగులు నింపడానికి గగనానికి చేరారు.  1930 దశకంలో కామెడీ పాటలు అనబడే ఈ నాటి జానపద గేయాలకి సభా గౌరవం కలిగించిన తొలి గాయని గానూ, “దిగిరాను దిగిరాను దివి నుండి దిగి రాను” అనే  దేవులపల్లి, రాయప్రోలు, నండూరి సుబ్బారావు, శ్రీశ్రీ మొదలైన కవుల కవితలని “నేలకు దించి”  బాణీలు కట్టి ఆ నాడు లలిత శాస్త్రీయం అనబడే సంగీతానికి “భావ గీతాలు” అనే స్వర రూపాన్ని రేడియోలోనూ, రికార్డుల ద్వారానూ నిక్షేపించి ఈ నాడు లలిత సంగీతం అనే స్పష్ట స్వరూపానికి అద్యురాలిగానూ అనసూయమ్మ గారు కలకాలం నిలబడే సంగీత చరిత్ర సృష్టించారు. అంతే కాదు, 1940 దశకం నుంచే నొక్కుల జుట్టుతో, గోళ్ళకు రంగుతో, లిప్ స్టిక్ తో సహా పూర్తి మేచింగ్, మేకప్ తో కానీ ఇంటి బయటకి అడుగుపెట్టని అనసూయ గారు “స్టార్లని మించిన స్టార్” గా వెలుగు వెలుగుతూ తెలుగు నాట సౌందర్య రాశిగా  మహిళా లోకానికి స్పూర్తి ప్రదాత అనసూయ గారు.

1980 లలో ఇప్పటి ‘మధురవాణి’ పూర్వ రూపమైన వ్రాత ప్రతితోనే అనసూయమ్మ గారికీ ఈ పత్రికతో  అనుబంధం ప్రారంభం అయిందని చెప్పవచ్చు. ‘తెలుగు వారి జానపద సంగీతం’, మామయ్య మాట-నానోట పాట” మొదలైన అనేక వ్యాసాలు అనసూయ గారు అప్పటి “మధుర వాణి” లో ప్రచురించబడినవి.  అలాగే ఆమె వ్రాసిన కథలు కూడా మొదటి ప్రచురణ అలనాటి మధురవాణి లోనే జరిగేవి. ఇక మా హ్యూస్టన్ తో ఆ మహా గాయని అనుబంధం ప్రధానంగా ఆమె పెద్ద కుమార్తె, సుప్రసిద్ధ నర్తకి రత్న పాప దగ్గరా, పెద్ద కొడుకు కృష్ణ గిరి ల దగ్గర నివశించడం ముఖ్య కారణం కాగా అన్ని సాంస్కృతిక కార్యక్రమాలలోనూ ఆమె తన పాటలు నేర్పి పాడించడం, మా అందరి పట్లా అసమానమైన ఆత్మీయతని చూపించడం ప్రధానమైన కారణం. అనసూయ గారి మీద ఉన్న అపార గౌరవంతో ప్రతీ ఏడూ మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి వారు అనేక సంవత్సరాలుగా ఆమె పుట్టిన రోజు నాడు (మే 12) “జానపదోత్సవం” సంగీత కార్యక్రమం నిర్వహిస్తున్నారు.  

తెలుగు తిధుల ప్రకారం అనసూయమ్మ గారి 100 వ పుట్టిన రోజు సందర్భంగా మా మధురవాణి విడుదల చేసిన ప్రత్యేక సంచిక ఆ మహా గాయనికీ మాకూ ఉన్న ఆత్మీయ అనుబంధానికి  చిన్న ఉదాహరణగా ఈ క్రింది లంకె చూడండి.  అందులో మా సంపాదకులు శ్రీనివాస్ పెండ్యాల గారు సంగీత ప్రియులకోసం 1978 లో అమెరికాలో రికార్డు చెయ్యబడిన మొట్ట మొదటి 78 rpm "మన పల్లె పదాలు*" (ప్రొడ్యూసర్లు వంగూరి చిట్టెన్ రాజు, అనిల్ కుమార్) పాటలన్నీ మధురవాణి లోనూ, యూట్యూబ్ లోనూ అందుబాటులో ఉంచారు. ఆ జానపద గీతాలు ఈ క్రింద ఆమె పాటలు వినండి.

https://www.madhuravani.com/blank-53

https://www.youtube.com/watch?v=ls9FXBHuX-s

 

పైన పేర్కొన్న madhuravani.com పేజీ లంకెలో పాటలు, టీవీ ఇంటర్వ్యూ , మెడ్లేతో పాటుగా అనసూయమ్మ గారు తన 95 ఏట వ్రాసిన ఆత్మ కథ “అసమాన అనసూయ” పుస్తక పరిచయం (శాయి రాచకొండ గారు) కూడా పొందుపరుచబడ్డాయి. ఆ పుస్తకం ఇప్పుడు ఈ క్రింది లంకెలో దొరుకుతుంది.

http://kinige.com/book/Asamana+Anasuya

 

మాకెంతో ఆత్మీయురాలు,  జానపద గాన సామ్రాజ్ఞి “కళా ప్రపూర్ణ” డా. అవసరాల అనసూయా దేవి గారి జ్ఞాపకాలతో ఈ మధురవాణి సంచిక అంకితం​.

[*మన పల్లె పదాలు : ప్రధాన గాయని & సంగీత దర్శకురాలు అనసూయా దేవి గారు. సహ గాయని వింజమూరి సీత (చెల్లెలు), హ్యూస్టన్ వాసులైన వసంత లక్ష్మి పుచ్చా, హీరా & సూరి దువ్వూరి, వంగూరి చిట్టెన్ రాజు, బిలకంటి గంగాధర్ (గాత్ర సహకారం), అనిల్ కుమార్, డేవిడ్ కోర్ట్నీ, రవి తమిరిశ (వాద్య సహకారం), కుమార్తె రత్నపాప (వ్యాఖ్యాత) ]

-మధురవాణి నిర్వాహక బృందం