top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు

పోతన గారి భాగవతము - భక్తి తత్వము

ప్రసాద్ తుర్లపాటి 

శ్రీకృష్ణుని లీలలను మధుర భక్తి ఉట్టిపడేలా లలితమైన పదబంధలతో పోతనామాత్యుడు మనకందించాడు. ఇది ఆబాల గోపాలానికి నిత్య పారాయణ గ్రంథమై భాసిల్లుచున్నది.

వేదాలను విరచించి, అష్టాదశ పురాణాలు రచించి, భారతాన్ని మనకందరకు అందచేసి, వ్యాకులతతో  వున్న సమయాన, నారద ప్రభోదితుడై, నానావిధ భక్తి పార్శ్వాలను సమ్మిళితం చేస్తూ భాగవత రచన కొనసాగించాడు. భక్తి మూల సూత్రముగా " వేద కల్పవృక్ష విగళితమై, శుక ముఖ సుధా ద్రవమున మొనసి యున్న భాగవత పురాణ ఫల రసాస్వాదాన్ని " మనకందరకూ అందించాడు. పోతన భాగవత అవతారికలో శ్రీమన్నారాయణ కథా రచనా కుతుహలంతో  భాగవత ప్రారంభములో ఇలా ప్రవచించాడు.

 

“ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర

క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో

ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా

నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.”

 

పోతన భాగవత అవతారికలోనే ఈ పద్యములో భాగవత వస్తు నిర్దేశము చేయబడినది. భాగవత కథానాయకుడు నందనందనుడు. అతడు అవతారపురుషుడు. లోకరక్షణే ఆ అవతార లక్ష్యం. అతడు ప్రహ్లాద, గజేంద్రాది భక్తులను రక్షించాడు. హిరణ్య కశిపు ప్రభ్రుతి దానవుల ఉద్రేకాలను స్థంభింప చేసాడు. ఈ రెండు అంశాలే, శ్రీమన్నారాయణుని శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ కు మూల కందాలు. ఈ రెండు అంశాల చుట్టూనే భాగవత కథా  చక్రము పరిభ్రమిస్తూ వుంటుంది. మరియొక విశేషమేమిటంటే, నాయకుడైన కృష్ణ పరమాత్మ కేవలం స్థితి కారుడే కాడు, సృష్టి కారకుడు కూడ. "కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు” అన్న ప్రయోగము లోనే సృష్టి కారత్వము ధ్వనించింది. " దానవోద్రేక స్థంభకు " అనే మాటలో లయకారత్వము సూచించబడింది. ఈవిధముగా, త్రిగుణాలయిన సృస్ఠి, స్థితి, లయ కారలు ధ్వనించాయి. శ్రీకైవల్య ప్రాప్తియే ప్రధాన లక్ష్యముగా ఆంధ్ర మహాభాగవతా రచన కొనసాగింది.

అందుకే పోతన వినమ్రతతో ఇలా అన్నాడు -

పలికెడిది భాగవతమట

పలికించు విభుండు రామభద్రుండట నే

పలికిన భవహరమగునట

బలికెద వేరొండు గాధ పలుకగనేల !!

 

నవ విధ భక్తి మార్గములు -

శ్రీమద్భాగవతము లో ప్రహ్లాదుని చే ఈ క్రింది విధముగా నవవిధ భక్తి మార్గములను చెప్పించారు –

 

శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనమ్‌

అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనమ్‌

“తనుహృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనా

ర్చనముల్ సేవయు నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్ చింతనం

బనునీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స

జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలతున్ సత్యంబు దైత్యోత్తమా “

 

ఉదాహరణలు:

శ్రవణము - పరీక్షిన్మహారాజు (భాగవతాన్ని విని తరించాడు),  కీర్తనము - శుక బ్రహ్మ, (భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు), నారదుడు (సదా సంకీర్తనా పరాయణుడు),  స్మరణము - ప్రహ్లాదుడు (ఎప్పుడూ విష్ణు నామం చెప్తూ తరించిన మహనీయుడు), పాదసేవనము - లక్ష్మీదేవి, అర్చనము -పృథు మహారాజు,  వందనము - అక్రూరుడు, దాస్యము - గరుత్మంతుడు, సఖ్యం - అర్జునుడు, కుచేలుడు, ఆత్మనివేదనము – రుక్మిణి.

ప్రహ్లాదుడు, గజేంద్రుడు, అంబరీషుడు, కుచేలుడు, ధ్రువుడు, అక్రూరుడు, రుక్మిణి, గోపికలు ఆయా భక్తిశాఖల నుంచి విరబూసిన కుసుమాలు.  

 

ప్రహ్లాదుడు - సదా విష్ణు స్మరణం -

 

“మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వూవునే మదనములకు

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే తరంగిణులకు

లలిత రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు

పూర్ణేందు చంద్రికా స్ఫురిత చాకోరకంబరుగునే సాంద్రనీహారములకు

 

“అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పానవిశేషమత్త

చిత్తమేరీతి నిరతంబు జేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయనేల!”

 

“కమలాక్షు నర్చించు కరములు కరములు,

శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ

సుర రక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు,

శేషశాయి కి మ్రొక్కు శిరము శిరము

విష్ణునా కర్ణించు వీనులు వీనులు,

మధు వైరి దవిలిన మనము మనము

భగవంతువలగొను పదములు పదములు,

పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

దేవదేవుని చింతించు దినము దినము

చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు

కుంభీనీధవు జెప్పెడి గురుడు గురుడు

తండ్తి! హరి జేరు మనియెడి తండ్రి తండ్రి”

 

గజేంద్రుడు - ఆత్మనివేదనం

“ఎవ్వనిచేజనించు జగమెవ్వని లోపలనుండు లీనమై

యెవ్వని యందు డిందు, పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం

బెవ్వడనాది మధ్య లయుడెవ్వడు, సర్వము తానయైన వా

డెవ్వడు, వానినాత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్.

 

లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నాలోకం బాగు పెం

జీకటి కవ్వల నేవ్వడేకాకృతి వెలుగు నతని నేసేవింతున్.” 

గోపికలు - మధుర భక్తి

 

“నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు గృపారసంబు పైఁ

జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా

జిల్లెడు మోమువాఁ డొకఁడు చెల్వల మానధనంబుఁ దెచ్చె నో!

మల్లియలార! మీ పొదలమాటున లేఁడు గదమ్మ! చెప్పరే! “

 

కుంతి స్తుతి -

 

యాదవు లందుఁ బాండుసుతులందు నధీశ్వర! నాకు మోహవి

చ్ఛేదము సేయుమయ్య! ఘనసింధువుఁ జేరెడి గంగభంగి నీ

పాదసరోజచింతనముపై ననిశంబు మదీయబుద్ధి న

త్యాదరవృత్తితోఁ గదియునట్లుగఁ జేయఁ గదయ్య! యీశ్వరా!

 

శ్రీకృష్ణా! యదుభుషణా,నరసఖా శృంగార రత్నాకరా!

లోకద్రోహినరేంద్రవంశదహనా లోకేశ్వరా! దేవతా

నీక బ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణ సంధాయకా!

నీకున్ మ్రొక్కెద త్రుంపవే భావలతల్ నిత్యానుకంపానిధీ!! “

 

భీష్మ స్తుతి :

“ త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ బ్రాభాత నీ

రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక

వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప మా

విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

 

హయరింఖాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై

రయజాతశ్రమ తోయబిందుయుతమై రాజిల్లు నెమ్మోముతో

జయముం బార్థున కిచ్చువేడ్క నని నాశస్త్రాహతిం జాల నొ

చ్చియుఁ బోరించు మహానుభావు మదిలోఁ జింతింతు నశ్రాంతమున్.

 

నరుమాటల్ విని నవ్వుతో నుభయసేనామధ్యమక్షోణిలో

బరు లీక్షింప రథంబు నిల్పి పరభూపాలావళిం జూపుచుం

బరభూపాయువు లెల్లఁ జూపులన శుంభత్కేళి వంచించు నీ

పరమేశుండు వెలుంగుచుండెడును హృత్పద్మాసనాసీనుఁడై.

 

కుప్పించి యెగసినఁ గుండలంబుల కాంతి; గగనభాగం బెల్లఁ గప్పికొనఁగ;

నుఱికిన నోర్వక యుదరంబులో నున్న; జగముల వ్రేఁగున జగతి గదలఁ;

జక్రంబుఁ జేపట్టి చనుదెంచు రయమునఁ; బైనున్న పచ్చనిపటము జాఱ;

నమ్మితి నాలావు నగుఁబాటు సేయక; మన్నింపు మని క్రీడి మరలఁ దిగువఁ;

 

గరికి లంఘించు సింహంబుకరణి మెఱసి

నేఁడు భీష్మునిఁ జంపుదు నిన్నుఁ గాతు

విడువు మర్జున యనుచు మద్విశిఖ వృష్టిఁ

దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు “


 

ఈ విధముగా భాగవతము లో ఎన్నో స్థుతుల ద్వారా, పాత్రల ద్వారా పోతన భక్తి సుధారసాలను పంచారు. ప్రహ్లాదుడు " ఇందు గలడందు లేడని " అన్నాడు. గజేంద్రుడు " కలడు కలండనెడివాడు, కలడో, లేడో" అన్నాడు. కానీ వీరిద్దరికి మోక్షాన్ని పోతన ప్రసాదించాడు. యెన్నో స్తు తుల ద్వారా మనకందరకు మహామంత్రాలను అందించారు.  

ఈవిధముగా భాగవతము భక్తి సుధారసా సమ్మిళితము. భక్తి సాహిత్యము లో భాగవతము ఎంతో  ప్రాధాన్యత సంతరించు కొన్నది.

అందుకే భక్తి కి మారు పేరు భాగవతమే!  బ్రహ్మ సాక్షాత్కారానికి భక్తి మార్గమే సులువైన మార్గము. " నీవే తప్ప నిత:పరం బెరుగ, మన్నింపదగున్ దీనునిన్, రావే ఈశ్వర సంరక్షింపు భద్రాత్మకా " అని శరణాగతి వేడితే, భగవంతుడు తప్పక ప్రత్యక్షమవుతాడు. భాగవతములో సత్వ (ఉదా: ప్రహ్లాదుడు), తమో (ఉదా: గజేంద్రుడు), రజో (ఉదా: ధ్రువుడు) గుణ ప్రధానులైన భక్తులు మనకు కానవస్థారు. రుషులు, రాజర్షులు, రమణులు, గృహిణులు, రాజులు ఎంతో మంది మనకు కనిపిస్తారు. వీరందరూ భక్తిమార్గము ద్వారానే అనుగ్రహింపబడినారు.

అందుకే భాగవతము భక్తి ప్రసూనాలను ఇచ్చే కల్పవృక్షము.

“లలితస్కంధము, కృష్ణమూలము, శుకాలాపాభిరామంబు, మం

జులతాశోభితమున్, సువర్ణసుమనస్సుజ్ఞేయమున్, సుందరో

జ్జ్వలవృత్తంబు, మహాఫలంబు, విమలవ్యాసాలవాలంబునై

వెలయున్ భాగవతాఖ్యకల్పతరు వుర్విన్ సద్ద్విజశ్రేయమై”

 

“నిగమములు వేయుఁ జదివిన

సుగమంబులు గావు ముక్తిసుభగత్వంబుల్

సుగమంబు భాగవత మను

నిగమంబుఁ బఠింప ముక్తినివసనము బుధా!"

 

తరువాతి సంచికలో భాగవతము లోని ఇతర విశేషాలను తెలుసుకుందాము.

Bio

ప్రసాద్ తుర్లపాటి

సాహిత్యం పట్ల, అందునా ప్రాచీన సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కల ప్రసాద్ తుర్లపాటి గారు విభిన్న కవితా శైలులని, కవులు మరియు రచనలని చక్కగా విశ్లేషిస్తారు. 

మూడు దశాబ్ధాలుగా సాంకేతిక రంగంలో కీలక పదవులెన్నో నిర్వహించి, టీ.సీ.యెస్ లో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు.

సాహితీ విభాగంలో కృషికి గానూ 2016 లో NATA వారి Excellence Award అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం శాన్ ఆంటోనియోలో వాస్తవ్యులైన వీరు నగరంలోని హిందూ టెంపుల్ పాలకమండలి సభ్యులు గా వ్యవహరిస్తున్నారు. 

***

bottom of page