
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
పుస్తక పరిచయాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
పుస్తక విశ్లేషణ
మేము ఎంపిక చేసుకున్న కొన్ని పుస్తకాలు ఈ ‘పుస్తక పరిచయాలు’ శీర్షికలో విశ్లేషించబడతాయి.
సంక్షిప్త పుస్తక పరిచయం
పుస్తక రచయితలకి ఉచితంగా ప్రచారం కలిగించడంకోసం మరియు పాఠకులకి కొత్త పుస్తకాల అందుబాటు గురించి క్లుప్తంగా పరిచయం చేయుట కొరకు "సంక్షిప్త పుస్తక పరిచయం" శీర్షిక ఉద్ధేశ్యింపబడింది. ఈ శీర్షిక లో తమ సరికొత్త గ్రంధాలని పరిచయం చెయ్యదల్చుకున్న వారు, ప్రచురించబడ్డ కొత్త పుస్తకాల ముఖ చిత్రం (స్కాన్ చేసిన ఫ్రంట్ కవర్), రచయిత వివరాలు, పుస్తకం గురించి ఐదు వాక్యాలు మించకుండా సంక్షిప్త సమీక్ష, కొనుగోలు వివరాలు మాకు పంపగలరు.
పంపించవలసిన చిరునామా:
సంక్షిప్త పుస్తక పరిచయం విషయాలలో అంతిమ నిర్ణయం మధురవాణి నిర్వాహకులదే.
'ప్రేమకు ఆవలి తీరం'
ఈ మధురవాణి సంచికలో రెండు పుస్తకాల గురించి మాట్లాడదామనుకుంటున్నాను. ఒకటి పాత పుస్తకమే, అంటే 2016 లో విడుదలయినది. రెండవది సరికొత్తదిఒకటి 'ప్రేమకు ఆవలి తీరం'. ఇది అంపశయ్య నవీన్ గారు రాసిన చలం జీవితాత్మక నవల. రెండో పుస్తకం 'హజ్బెండ్ స్టిచ్'. ఇది గీతాంజలి గారు తను చూసిన స్త్రీల లైంగిక విషాద గాధలు ఆధారంగా రాసిన కథలు. ఇద్దరు రచయితలకీ 'స్త్రీ' ప్రాతిపదిక అవడం ఒక విశేషం.
‘ప్రేమకు ఆవలి తీరం’ పుస్తకాన్ని ఇండియా వెళ్ళినప్పుడు మా స్నేహితుడి ఇంట్లో చూసాను. చలం గారి (1894-1979) జీవితాత్మక నవల అని చూడగానే నా కళ్ళు ఒక్కసారి మెరిసాయి. మా స్నేహితుడి పుస్తకాన్ని అమాంతం తీసేసుకుని, తనని కొత్త పుస్తకం కొనుక్కోమని చెప్పాను. అదీ అంపశయ్య నవీన్ గారు రాసినది అని చూసినప్పుడు ఆ పుస్తకం గురించిన నా అంచనా మరింత అయింది.
మా హరికి, నాకు, యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో చలంగారంటే ఎందుకో ఎనలేని భక్తి, అభిమానం, తెలియని గౌరవ భావం. స్త్రీలకు సంఘం ఇవ్వని గౌరవం, స్వేచ్చా గురించి ఆయన రాతలు చూస్తే ఏదో ఆవేశం వచ్చేది. ఆయన రాసిన మ్యూజింగ్స్ చదువుతూ చర్చించుకొనే వాళ్ళం. ఆయన జీవితం గురించి తెలిసినా ఎందుకో తెలియనట్లే మా ప్రవవర్తన. పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. ఆయన రాసిన రాతలే ముఖ్యం. ఆయన సంఘాన్ని ఎదురించిన విధానమే ముఖ్యం మాకు. అమెరికా వచ్చిన తర్వాత కూడా చలం గారు రాసిన ఎన్నో పుస్తకాలని తెప్పించుకుని చదివాను. ఆయన బయోగ్రఫీలు వచ్చినా చదవలేదు. ఆయన రాసుకున్న రాతల్లో తెలియకపోతే కదా అన్న ఆలోచన కాబోలు!
ఇన్నాళ్ళకు అంపశయ్య నవీన్ గారు చలం గారి జీవితాన్ని ఒక నవలగా తీసుకురావడం బాగుందనిపించింది. ముఖ్యంగా పుస్తకానికి ఆయనిచ్చిన పేరు నాకు చాలా నచ్చింది. చలం గారి జీవితమంతా ప్రేమకు ఆవలి తీరంలోనే నడిచిందా? ప్రేమ కోసం ఆయన పడిన తహ తహ ఆయన రాసిన ప్రతీ వాక్యంలోను కనిపించేది. ఎందుకలాంటి భావాలు ఆయనలో కలిగేవి అన్న ప్రశ్నకు సమాధానం దొరికేది కాదు. అందుకే ఈ పుస్తకం చదవాలనుకున్నాను.
అనుకున్నట్లుగానే ఆశగా, విడవకుండా పుస్తకం చదివాను. పూర్తయిన తర్వాత చలం గురించి మరి కొంచెం అర్ధమయిందేమో. ముఖ్యంగా చిన్నప్పుడు తండ్రి కొట్టే విపరీతమైన దెబ్బలు, తల్లి మంచం కింద దాక్కోవడం, తండ్రంటే పెంచుకున్న అసహ్యం ... లాంటి కొన్ని విషయాలు చలం బయోగ్రఫీ చదువుతున్నప్పుడు గ్రహించీ గ్రహించక వదిలేసిన విషయాలు కొంచెం అవగాహనలోకి వచ్చేయి. అప్పుడనిపించింది, చలానికి స్త్రీలపై ప్రేమ, స్త్రీ తో ఉన్నప్పుడు, తను చెందే తాదాత్మ్యంలో తండ్రి, అసహాయురాలైన తల్లి ఇవ్వలేని భద్రతా భావం పొందడానికి చూసాడా తనకు తెలియకుండా? తనకు నచ్చిన స్త్రీ అంటేనే ఆమెను ప్రేమిస్తున్నట్లు భ్రమ పడేవాడా? చలానికి ప్రేమ కోసం చివరి క్షణం వరకూ పొందిన ఆరాటం, జీవితంతో చేసిన పోరాటం, ఎప్పుడైనా తను చిన్నతనంలో అనుభవించిన ప్రేమ రాహిత్యానికీ, సంబంధం ఉందని తెలిస్తే మార్పొచ్చేదా? అప్పుడు తను పొందిన ఆ వ్యధ తగ్గి సమాజానికి తన రాతల ద్వారా ప్రశ్నించిన తీవ్రత ఉండేది కాదా?
చలం జీవితాన్ని నవలగా చదివినా ప్రశ్నలే, ఆయన రాసిన మ్యూజింగ్స్ చదివినా ప్రశ్నలే, ఆయన ఆత్మ కథ చదివినా ప్రశ్నలే. ఆయన మనకి ప్రశ్నిచడం నేర్పేడా? ఆయన జీవితం ఎవరికైనా ప్రశ్నే, ఎందుకంటే, ఆయన ఎందరిలాగో సాంప్రదాయాన్ని పాటించలేదు. ప్రశ్నించాడు. ముఖ్యంగా స్త్రీల పట్ల సమాజం ప్రవర్తించే తీరుని ఏవగించుకున్నాడు. స్వతంత్రంగా ఆలోచించగలిగే స్త్రీలను ప్రేమించాడు. బ్రహ్మ సమాజం లాంటి సంస్థ కూడా సమకాలీన సమాజానికంటే కొంచెమే ముందుండేది. అందుచేతే అక్కడనుండి కూడా వెలివేయ బడ్డాడు చలం.
చేతిలో డబ్బు లేమి వల్ల ఎన్నో కష్టాలకు గురి అయ్యాడు. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా తను నమ్మిన ఆలోచనలను విడువలేదు. తు చ తప్పకుండా ఆచరించాడు. తన భార్య అక్కను చదివిస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఆమెను చదివించాడు.
పుస్తకం చదివిన తరువాత కూడా చలం గారి మీద అభిప్రాయం తరగ లేదు వీసమంతైనా. తరగాలన్నది చలం జీవితాన్ని నవలగా రాసిన అంపశయ్య నవీన్ గారి ఉద్దేశ్యం కాదు కూడా.
పుస్తకానికి ప్రవేశిక రాస్తూ, నవీన్ గారు విషయ సేకరణలోనూ, నవలగా రూపొందించడంలోనూ, మూడేళ్ళ పైబడి చేసిన కృషిని గురించి రాసారు. రచనలు చేయడంలో ఎంతో చెయ్యి తిరిగిన నవీన్ గారికే ఎంతో కష్టమైనదని చెప్పారు. స్క్రిప్టు రెండు సార్లు తిరిగి రాయవలసొచ్చిందని అన్నారు. అర్ధం చేసుకోవచ్చు.
నవీన్ గారి కష్టమెంతైనా, పుస్తకం ఎడిట్ చెయ్యడంలో ఇంకొంచెం శ్రద్ధ వహించి ఉంటే బాగుండునేమో అనిపించింది. ఎన్నో పేరాలు పునరావృతి కావడం చదవడానికి బాగానే ఇబ్బంది కలిగించింది. నవల వ్రాయడంలో సంభాషణలు చలం గారి జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి కల్పించబడినవే అయినా, ఏదో పేలవత్వం కనిపించింది. రాయాలి కాబట్టి రాసినట్లుంది కాని సహజంగా లేవు.
చలం గారి చిన్నప్పటి అనుభవాల దగ్గరనుండి రమణాశ్రమ జీవితం వరకూ నవీన్ గారు చాలా క్రమభద్ధంగా రాసుకొచ్చారు. అయితే కొన్ని కొన్ని సందర్భాలలో చలం గారి బయోగ్రఫీ చెబుతున్నట్లుగా అనిపించింది, నవలగా కాకుండా.
ఇంకో మాట. నవలగా రాస్తున్నప్పుడు కొంత మానోవిశ్లేషణ కూడా చేసుంటే బాగుండేదనిపించింది. దానికింకొంచెం టైము పట్టచ్చునేమో కాని పాఠకుడుకి ఉపయోగపడేది.
చలం జీవితాన్ని నవలగా రాయించాలనే మొదటి తలపు కలిగిన వావిలాల సుబ్బారావు గారు రాస్తూ, "సంఘ నీతికి వ్యక్తిగత జీవిత సాఫల్యతకు, స్వేచ్ఛాప్రీతికి - ద్వేషాసూయల సంయమనానికి; ఆశయానికి-ఆచరణకు; సౌందర్యభావనకు-సుందర జీవనానికి మధ్య ఉండే ఘర్షణలను, అవి చలం జీవితాన్ని ఎట్లా కల్లోల పరచాయో చిత్రించటానికి నవీన్ ప్రాధాన్యం ఇచ్చారు" అని అన్నారు. ఈ విషయంలో నవీన్ గారు కొంత వరకు సఫలీకృతులయ్యారనే చెప్పుకోవాలి.
మొత్తం మీద చలం గారంటే ఇష్టమున్న పాఠకులు తప్పక చదవాలీపుస్తకం. చలం గారి రచనలు చదివినా, ఆయన జీవితం గురించి ఇంత స్పష్టత నాకు రాలేదు. బహుసా నేను చదివినప్పుడు ఆ క్షణంలో ఆయనేమి చెప్పారా అనే చూసా కానీ ఆయన అంతరంగం, ఆయన జీవితం గురించి వెతకలేదు.
ఈ పుస్తకం ఈపాటికి రెండవ ముద్రణ చేసుకుందనీ, అందులో ఎన్నో సవరణలు జరిగి ఉంటాయనీ అనుకుంటాను.
ప్రత్యూషా ప్రచురణలు, వరంగల్ వారు ప్రచురించిన ఈ పుస్తకానికి నవోదయా, విశాలాంధ్రా, మరియు నవచేతనా వార్లు పంపిణీదారులు. ఈ పుస్తకం ఖరీదు భారత దేశంలో రూ. 250.00, బయట 20.00 డాలర్లు.
-శాయి రాచకొండ
*****
హస్బెండ్ స్టిచ్
‘స్త్రీకి స్వతంత్ర భావాలుండాలి, చదువు కావాలి, ఆమెకూ ఇష్టాయిష్టాలుంటాయి, వాటిని గౌరవించాలి’ అన్న స్పృహ కూడా లేని కాలంలో గుడిపాటి వెంకట చలం సహ సమాజంతో ఒంటరిగా పోరాడాడు. సమాజం ఆయన్ని వెలి వేసింది. కాలం గడచిన కొద్దీ ఆర్ధిక అవసరాలవల్లనైతేనేమి, పాశ్చాత్య ప్రభావం అయితేనేమి, కొన్ని మార్పులు వచ్చాయి. ఈ రోజు స్త్రీలెందుకు చదువుకోవాలి, ఉద్యోగాలెందుకు చెయ్యాలి అన్న ప్రశ్నలు లేవు. కాని ఇంకా ఎంతో మారవలసి ఉంది. స్త్రీలపై అత్యాచారాలు, మానభంగాలు, ముఖాల మీద ఏసిడ్ పోసి వయసులో ఉన్న అమ్మాయిల్ని కురూపిని చేసిన సంఘటనలెన్ని వినడం లేదు? ఇవేకాదు, కుటుంబాల్లో స్త్రీలు ఎన్ని లైంగిక విషాద సంఘటనలకు గురి అవుతున్నారో ఈ 'హస్బెండ్ స్టిచ్' అన్న కథల సంపుటిలో తాను డాక్టరుగా, థెరపిస్ట్ గా చూసిన ఎన్నో కేసుల్ని సమీకరించి రాసిన నిజ సంఘటనల దర్పణం. ఆడవాళ్ళు. ఎవరికైనా లైంగిక సంబంధమైన అత్యాచారమే జరిగితే, మగ మహారాజెవరో కూడా చెప్పలేదా స్త్రీ. ఆ పాశవిక చర్యకి తనే బాధ్యురాలనుకుంటుంది. అంతె కాదు తను స్త్రీ అవడమ్మూలకంగా గర్భం రావచ్చు. రహస్యంగా ఆ గర్భాన్ని అతి కౄరంగా, ఆ స్త్రీ శరీరానికి విపరీతమైన హాని కలిగిస్తూ తీసివేయించేది ఆ మగవాడో, చుట్టుపక్కల సమాజమో. శారీరకంగా, మానసికంగా కృంగిపోయేది స్త్రీయే.
మార్చ్ ఇరవై మూడవ తేదీని హ్యూస్టన్ నగరంలో జరిగిన టెక్సాసు సాహితీ సదస్సులో గీతాంజలి (డా. భారతి) గారు రాసిన ఈ 'హస్బెండ్ స్టిచ్’ పుస్తకం ఆవిష్కరించబడింది. పుస్తకం పదమూడు కథల సంపుటి. ఈ కథలన్నీ సారంగ అంతర్జాల పత్రికలో నెల నెలా ప్రచురితమైన కథలు.
ఈ కథలు ఎందుకు రాసోరో చెబుతూ రచయిత్రి "స్త్రీల లైంగికత చుట్టూ పురుష లైంగిక రాజకీయాలు పొరలు పొరలుగా ఘనీభవించినాయి అనుకుంటే - వాటిని పగలకొడ్తూ వెళితే వాటికింద చితికి పోయి రక్తమోడుతున్న స్త్రీ గుండెలో - గర్భ సంచిలో లేదా యోనులో భీభత్సంగా కంపిస్తాయి. వాటిని చూస్తూ... వాళ్ళని వింటూ తట్టుకోలేని స్థితిలో..." ఒక థెరపిస్టుగా తరచూ చూస్తున్న కేసుల్ని, ఆవేశంతో, బాధతో, పాఠకుల ముందుంచారు రచయిత్రి.
గీతాంజలి గారికి కేవలం ఆవేశం మాత్రమే లేదు. ఎన్నో కథలు రాసిన అనుభవం ఉంది. అన్నీ జోడించి, ఒక సంస్కరణ తేవాలనే తలపుతో ఎన్నో సాంప్రదాయవాదుల విమర్శలను ఎదుర్కొంటూ ఈ కథలను ప్రచురించారు..
ఈ సమస్యలకి సమాధానం ఒక్కటే. సమాజం మారాలి. పురుషాధిక్యత, స్త్రీని వస్తువగా చూసే ఆలోచన మారాలి. కేవలం అక్షరజ్ఞానం కాదు, ఎడ్యుకేషన్ కావాలి.
ఈ పుస్తకంలోని ప్రతి కథలో హింసకు లోనైన స్త్రీ ఆక్రందన వినిపించక మానదు. చాలా మంది మగవారు అనుకోవచ్చు, 'నేను కాదు’, 'నేను అలాంటి పనులు చెయ్యను ' అని. కథలు అందరి మగవారూ చేస్తారని కాదు, కాని సగటు భారతదేశంలో స్త్రీలకు తమ శరీరంపై హక్కు మగవాడిదే! ఆ మగవారు చేసే లైంగిక హింసలు ఎన్ని రకాలో ఈ కథలు చదివితే అర్థమవుతుంది. ఆరేళ్ళ పిల్లలపై లైంగిక అత్యాచారం చేసేవాళ్ళూ (ప్రశ్న), కొడుకు కావడం కోసం, భార్య జీవితం పణం పెట్టైనా ఎన్ని కాంపులైనా ఎదురుచూసే భర్తా, అత్తగారూ (హత్య), ఇలా సాగుతాయి. కథలలో రచయిత్రి కొన్ని సందర్భాలు, సమస్యల్ని పాఠకులకు చెప్పడంలో ఉపయోగించిన భాష చాలా ఆవేశంతో ఉంటుంది. అలా చెబితే కాని నిజంగా అర్థమవదు. స్త్రీలు తమకి సమస్యలున్నా చెప్పుకోరుఈ లైంగిక హింసకు కుల మత భేదాలు లేవు. ఇంకా కొనసాగుతూన్న ఫ్యూడలిస్ట్ వ్యవస్థాపరమైన పురుషాధిక్యత ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటాయి. ఈ అత్యాచారాలు ఆపాలంటే, సమాజానికి తప్పుల్ని ధైర్యంతో ఎత్తి చూపే రచయితలూ, సంఘ సంస్కర్తలూ కావాలి.
రచయిత్రి ఎంత ఆవేదన పడుతూన్నా, ఆమె కేవలం సమస్యనెత్తిచూపడమే కాదు, స్త్రీ పురుషుల మధ్య కావలసిన అనురాగాన్ని మరచిపోలేదు. సమస్యకి పరిష్కారం అవగాహనే అన్నది ఆమె సందేశం.
త్వరలో వెలువరించనున్న ఈ పుస్తకాన్ని ప్రచుంచింది ‘మలుపు’. వెల కేవలం నూటయాభై రూపాయలు. ఆడ, మగ, తప్పులు చేసినవారూ, చెయ్యని వారూ, చెయ్యబడి బలి అయిన వారూ, ఈ పుస్తకం తప్పక చదవాలి.
-శాయి రాచకొండ
*****
సంక్షిప్త పుస్తక పరిచయం
"ఎక్కడికీ పయనం"
రచయిత్రి :డా.వెలువోలు నాగరాజ్యలక్ష్మి
సమీక్షకులు: 'నానా'
"ఎక్కడికీ పయనం" పుస్తకం ఓ అద్భుత ప్రపంచం. ఈ పుస్తకాన్ని చదివితే ప్రపంచాన్ని చదివినట్టే. ప్రశ్నిస్తే పోయేదేం లేదు ప్రశ్నించినవాడి స్వరము సర్వస్వమూ తప్ప. నిత్యం మారణహోమం జరిగే నగరాలకన్నా అగ్ని పర్వతాలే నయం! మానవత్వాన్ని మంటగలిపే కులరోగం కన్నా అంటువ్యాధులే నయం! సరుకుల కరువును సృష్టించే బ్లాక్ మార్కెట్ కన్నా ఉప్పెనలు, కరువులే నయం! మహిళలపై చూపే అసహజ అమానుషత్వ చర్యలకంటే వరద భీభత్సాలే నయం! మనిషిని హింసించే మనిషికంటే అడవి మృగాలే నయం!
ఈ మాటలు తూటాలై ఎదను తూట్లు పొడిచేలా, పిడిబాకులై గుండెల్లో దిగేలా నవనాగరిక సమాజాన్ని "ఎక్కడికీ పయనం" అంటూ కలాన్ని కరవాలంగా మార్చి ప్రశ్నించిన రచయిత్రి డా.వెలువోలు నాగరాజ్యలక్ష్మి అభినందనీయులు, ఆదర్శప్రాయులు.
*****