top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

“అసమాన అనసూయ” గారితో పిచ్చా పాటీలు – గంటల తరబడి

vanguri.PNG

వంగూరి చిట్టెన్ రాజు

వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారం-20
అసమాన అనసూయ.jpg
వంగూరి చిట్టెన్ రాజు , ఎస్.పి. బాలూ .jpg
బాపు, వంగూరి చిట్టెన్ రాజులతో.jpeg
బంగారు పాప సినిమా సంగీత దర్శకురాలిగా ముం

మొన్న ..అంటే మార్చ్ 23, 2019 నాడు మా హ్యూస్టన్ లో 42వ టెక్సస్ సాహిత్య సదస్సు పెమ్మరాజు లక్ష్మి శిష్య బృందం పాడిన “జయ జయ ప్రియ భారతి” తో ఆహ్లాదంగా ప్రారంభం అయింది. ఆ తర్వాత అరగంట అయిందో లేదో నాకు డుంబు నుంచి ఫోన్ వచ్చింది.”అమ్మ పోయింది ఇందాకా” అదీ ఆ ఫోన్ సారాంశం. డుంబు అంటే “కళా ప్రపూర్ణ” డా. అవసరాల అనసూయా దేవి గారి పెద్ద కొడుకు. అంతకు ముందు రోజు రాత్రే అనసూయ గారి పెద్ద కూతురు రత్న పాప వాషింగ్టన్ నించి ఆవిడ అనారోగ్యం గురించి వాట్సాప్ లో చెప్పినా, ఈ వార్త వినగానే నిర్ఘాంత పోయాను. ఏం చెయ్యాలో తెలియ లేదు. కాస్సేపయ్యాక తేరుకుని, నిర్వాహకుల అనుమతితో వేదిక మీదకి వెళ్లి ఈ దుర్వార్త ప్రకటించాను. అందరం ఒక నిముషం మౌనం పాటించి మా “అసమాన అనసూయ” గారికి నివాళులు అర్పించాం. అనసూయ గారిని, ఆమె గాత్రాన్ని ఆరాధించని  తెలుగు వాళ్ళు ఆ సభలోనే కాదు, మా హ్యూస్టన్ మొత్తం మీదే కాదు, యావత్ ప్రపంచంలోనే లేరు. ఆ రోజు పిల్లలు పాడిన “జయ జయ ప్రియ భారత” ఆవిడ 1935లో కాకినాడ పి.ఆర్. కాలేజ్ లో సాంస్కృతిక వారోత్సవాల ప్రారంభ కార్యక్రమం కోసం ఆమె మేనమామ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు వ్రాసిన పాట. దానికీ బాణీ కట్టి పాడిన అనసూయ గారు అప్పుడు 5వ ఫారం చదువుతున్నారు..అంటే 10th గ్రేడ్. అప్పటి నుంచి ప్రపంచంలో ఇప్పటికీ ఎవరు పాడినా అదే బాణీ. ఆ పాట భారత దేశం జాతీయ గీతానికి జనగణ మన తో ఆఖరి దాకా పొటీ పడి ఓడిపోయింది. ఇంతకీ ఆ జనగణ మన పాట బ్రిటిష్ మహా రాజు కింగ్ జార్జ్ ని పొగుడుతూ మన మదన పల్లెలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పాట! ఇదేమో అసలు సిసలు దేశభక్తి గీతం!

అనసూయా దేవి గారి పేరు వినగానే ఎవరికైనా టక్కున జ్ఞాపకం వచ్చేవి ఈ జయ జయ ప్రియ భారతి, మొక్క జొన్న తోటలో, నోమీన మల్లాల, బండి పాట, పల్లకీ పాట మొదలైన అసంఖ్యాకమైన జానపద గేయాలే. కానీ నాకు మటుకు అవే కాక, నా జీవిత కాల అనుబంధమే కాక అనసూయ గారితో గంటల కొద్దీ గడిపిన పిచ్చా పాటీ కబుర్లు జ్ఞాపకం వస్తాయి. ఆవిడ చెప్పే కబుర్లకి సాధారణంగా ప్రధాన శ్రోతలం నేనూ, ఆవిడ పెద్దల్లుడు అనిల్ కుమారూ. పెద్దమ్మాయి , సుప్రసిద్ద నర్తకి రత్న పాపకి ఆవిడ మాకు చెప్తున్న విశేషాలన్నీ చాలా మటుకు ప్రత్యక్షంగానే తెలుసు కాబట్టి అనసూయ గారిని అప్పుడప్పుడు సరిదిద్దేది. మేమే చాలా సార్లు కాక వసంత & మల్లిక్ పుచ్చా, చంద్రకాంత & డేవిడ్ కోర్న్టీ, దువ్వూరి నారాయణ రావు గారు, సీత & ముత్యాల భాస్కర రావు గారూ మొదలైన వారు ఆవిడ దర్బారులో ఉండేవారు.

నన్ను చూడగానే ఆవిడ ఎప్పుడూ “మా రాజు” అనో “మా కాకినాడ రాజు” అనో ఎంతో వాత్సల్యం తో పిలుస్తూ “ఇదిగో రాజూ, 1926 లో ఓ రోజు ఏమయిందనుకున్నావ్...నాకు అప్పుడు ఆరేళ్ళు” అంటూ మొదలు పెట్టేవారు. ఆవిడ జ్ఞాపక శక్తి ఆఖరి రోజులలో కూడా అమోఘమే. ఇంతకీ ఆ రోజు ఏమయిందంటే...ఆరేళ్ళ అనసూయ గారు పిఠాపురంలో వాళ్ళ ఇంటి బయట అరుగు మీద కూచుని ఆడుకుంటూ ఉంటే ఓ కుర్రాడు చెరుకు గెడ తింటూ, చెడ్డీ పైకి లాక్కుంటూ “ఇక్కడెవరో అమ్మాయి కళ్ళకి గంతలు కట్టుకుని, కాలి వేళ్ళతో కూడా హార్మోనియం వాయిస్తుందిట.నీకు తెలుసుసా?” అని అడిగాడు. “అది నేనే” అని అనసూయ గారు అనడం, “ఐతే వాయించు” అని అ కుర్రాడు రెచ్చకొట్ట్టడం, ఆ అమ్మాయి లోపలినించి హార్మోనియం పట్టుకొచ్చి వాయించడం అన్నీ జరిగి పోయాయి. ఆ అమ్మాయి కంటే ఆర్నెల్లు పెద్దయిన ఆ కుర్రాడి పేరు బాలాంత్రపు రజనీ కాంత రావు. అప్పటి నుంచీ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళ లా తెలుగు సంగీతాన్ని 90 ఏళ్ళు పైగా సుసంపన్నం చేశారు. రజని గారు కూడా ఇటీవలే కాలం చేశారు.  

బాల మేధావి కావడంతో బాగా చిన్నప్పటి నుంచే తనవే కాక రాయప్రోలు, బసవరాజు అప్పారావు, నండూరి వారి ఎంకి పాటలు మొదలైన వాటికి కూడా అనసూయ గారి చేత బాణీలు కట్టించి సభల్లో పాడించేవారు కాక మేనమామ దేవులపల్లి గారు. ఒక సారి ఒక బక్క పలచని కుర్ర కవిని తీసు కొచ్చి “ఇదిగో ఈయన వ్రాసిన ఈ గేయానికి బాణీ కట్టి పాడు” అని కృష్ణ శాస్త్రి గారు అనగానే హార్మోనియం ముందు కూచుని ఆ గేయం చదివి “ఇదేమిటి మామయ్యా, చాలా డిఫరెంట్ గా ఉంది” అని మొత్తానికి ట్యూన్ కట్టి వినిపించారుట. ఆ గేయం “పదండి ముందుకు, పదండి తోసుకు”. ఆ యువ కవి శ్రీరంగం శ్రీనివాస రావు. అప్పటికి మహా ప్రస్థానం ప్రచురణ అవలేదు. ఆ తర్వాత మహా ప్రస్థానం గేయాలకి బాణీలు కట్టి రికార్డు ఇచ్చిన తొలి గాయనీ మణి అనసూయ గారే.  అప్పటికి ఆవిడ వయసు పదిహేను ఏళ్ళు ఉంటాయేమో.

ఆవిడ యుక్త వయసులో మద్రాసులో ఉన్నప్పుడు రోజూ ఇంటి ముందు ఆవిడ కోసం కారు వదలి పెట్టేవారు, ప్రేమ లేఖలు రాసే వాళ్ళు, ఐ లవ్యూ లు చెప్పేసే వాళ్ళు..  ఒకరేమిటి, ఇలా చాలా మంది ఆవిడ వెనకాల పడేవారని భలే గర్వంగా ఆ విశేషాలన్నీ చెప్పేవారు అనసూయ గారు. ఒక చిన్న తమాషా విశేషం ఏమిటంటే...“ఇవాళ ఈ పాట రాశాను” నిన్న దీనికి ఇలా ట్యూన్ కట్టాను. విని ఎలా ఉందో చెప్తారా” అని ఆ రోజుల్లో ఒకాయన రోజూ ఇంటికి వచ్చి గంటల కొద్దీ పడిగాపులు పడి కూచునే వాడుట.  “ఇదిగో నీ కోసం గుండబ్బాయ్ మళ్ళీ వచ్చాడు.” అని చెప్పినా ఆయన్ని అనసూయ గారు ఎప్పుడూ కలవ కుండా బయటకి వెళ్ళిపోయే వారుట. ఒక సారి మటుకు ఇంటికి రాగానే లోపలి నుంచి శ్రావ్యమైన పాట వినపడుతూ ఉంటే ఆగి, పాట అయ్యాక లోపలి వెళ్లి పరిచయం చేసుకున్నారట. తనని కలుసుకున్న మరుక్షణం “సిస్టర్” అని ఆయన పిలిచారుట. ఆ గుండబ్బాయ్ పేరు ఘంటసాల వెంకటేశ్వర రావు. అప్పటి నుంచీ ఆయన ఆవిడకి రాఖీ తమ్ముడు. ఇంతకీ ఆయనకీ గుండు ఎందుకో తెలుసా? నాగయ్య గారి త్యాగయ్య సినిమాలో త్యాగయ్య గారి శిష్యుల్లో ఒకరిగా వేషం వేశారు కాబట్టి జుట్టంతా తీసేశారుట ఘంటసాల గారికి.

60, 70 ఏళ్ల క్రిందట పెదాలకి రంగే కాకుండా, వేసుకున్న బట్టలూ, నగలూ, జోళ్ళు,  వేళ్ళ రంగూ అన్నీ ఖచ్చితం గా మేచింగ్ గా కుదిరితేనే కానీ బయటకి రాకుండా మొత్తం మేకప్ కల్చర్ ని తెలుగు నాట ప్రవేశ పెట్టిన మొదటి మహిళగా అనసూయ గారికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉండేవి. అది ఆవిడకి చాలా గర్వ కారణంగా ఉండేది. అప్పుడే కాదు. మొన్న 99 ఏట  పరమ పదించే దాకా కూడా ఆవిడ పూర్తి మేచింగ్ లేకుండా బయటకి రావడం ఎప్పుడూ ఎవరూ చూడ లేదు. దానికి సంబంధించిన చిన్న చురక...1977 లో ఆంధ్రా యూనివర్శిటీ వారు అనసూయ గారికీ, అక్కినేని నాగేశ్వర రావుకీ “కళా ప్రపూర్ణ” బిరుదు ప్రదానం, ఆనరరీ డాక్టరేట్ ఒకే సారి ఇచ్చినప్పుడు ఒక చిన్న తమాషా జరిగింది. బిరుదు ప్రదానానికి ముందు వరసలో అక్కినేని గారూ, పక్కనే అనసూయ గారూ కూచున్నారు. పూర్తి మేకప్ లో ఉన్న అనసూయ గారు తన హేండ్ బేగ్ లో దేని కోసమో వెతుకుతూ ఉంటే “ఏమిటి అనసూయ గారూ, లిప్ స్టిక్ మర్చిపోయారా?” అని అక్కినేని వేళాకోళం చేశారు. వెంటనే అనసూయ గారు “కాదు, లిప్ స్టిక్ ఉంది కానీ అద్దం మర్చిపోయాను. కాస్త ముందుకు వంగు. లిప్ స్టిక్ సరి చేసుకుంటాను” అన్నారు అనసూయ గారు తక్షణం. అక్కినేనిది అప్పటికే నిగ నిగలాడే బట్ట తల కదా....అదీ అక్కడ అనసూయ గారి చమత్కారం.        

ఇక సినిమా వాళ్ళు తనకి చేసిన అన్యాయాలు అనసూయ గారు చెప్తూ ఉంటే వినాల్సిందే. ఉదాహరణకి ‘మల్లీశ్వరి’ లో భానుమతి పాట “మనసున మల్లెలు” అనసూయ గారు 1937 లో రికార్డు ఇచ్చిన “చందన చర్చిత” పాట కి అనుకరణే. మల్లీశ్వరికి తను నాలుగు బాణీలు ఇచ్చారు అనసూయ గారు.  ఆ మాట భానుమతే చాలా సభల్లో చెప్పిందిట. అలాగే ‘రోజులు మారాయి’ లో “ఏరువాకా సాగారో” పాట అనసూయ గారు 1932 లో.....అంటే తన 12వ ఏట ఇచ్చిన రికార్డులో ‘చుకకాల చీర కట్టుకునీ” పాట బాణీ యే. అనసూయ గారి మరణ వార్త విన్న వి.ఏ.కే. రంగారావు గారు కూడా ఇవన్నీ ధృవీకరిస్తూ, తన దగ్గర ఆ రికార్డులు ఉన్నాయి అని The Hindu పేపర్ కి చెప్పారు. ఇక ‘బంగారు పాప ‘ సినిమా విషయాని కొస్తే అనసూయ గారు గంటల కొద్దీ మాట్లాడే వారు. అన్ని పాటలకీ తన చేత బాణీలు కట్టించుకుని, తను ఊళ్ళో లేనప్పుడు ఆ మ్యూజిక్ కండక్ట్ చేసిన అద్దేపల్లి రామారావు పేరు సంగీత దర్శకుడి గా బి.ఎన్. రెడ్డి గారు వెయ్యడం అనసూయ గారిని చాలా బాధించేది. ఆ నాటి బంగారు పాప సినిమా యూనిట్ ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను. అలాగే తను సంగీత దర్శకత్వం వహించిన అగ్గి రాముడు, కనక దుర్గ మహాత్మ్యం, పెంకి పెళ్ళాం, బొమ్మ రిల్లు మొదలైన సినిమా విశేషాలు కూడా పూస గుచ్చినట్టు చెప్పేవారు అనసూయ గారు. మరి మీరు అంద గత్తె కదా...హీరోయిన్ వేషాలు రాలేదా అంటే..”రాకేం..సంగీతాన్ని వదులుకోవడం ఇష్టం లేక అవన్నీ పక్కకి పెట్టాను. మ్యూజిక్ ఈజ్ మై లైఫ్” అనే వారు. సరిగ్గా అలాగే చిన్నప్పుడు సినిమాల్లో వేసినా “డాన్స్ ఈజ్ మై లైఫ్” అంటుంది ఆమె పెద్ద కుమార్తె రత్న పాప.  

ఇక బాల మురళి గారూ, అనసూయ గారూ చాలా మంచి స్నేహితులు. పరస్పర అభిమానులు. ఒక సారి బాల మురళి గారు హ్యూస్థన్ వచ్చినప్పుడు పాప ఇంట్లోనే ఉన్నారు అనుకుంటాను. అనసూయ గారు కూడా అప్పుడు ఆయన కచేరీకి వచ్చారు. అప్పుడు బాల మురళి వేదిక మీద నుంచి మొదటి వరసలో కూచున్న అనసూయ గారిని ఉద్దేశించి శ్రోతలతో “నాకు అనసూయ అంటే అసూయ. కోపం. ఎందుకంటే మద్రాసులో ఎప్పుడు నా కచేరీ పెట్టినా సరిగ్గా ఎదురుగుండా హాల్ లో అనసూయ కచేరీ కూడా పెట్టేవారు. దాంతో జనం అంతా అక్కడికే పోయే వారు. నా హాలు ఖాళీగా ఉండేది” అని తన అభిమానాన్ని చాటుకున్నారు బాల మురళి.        

ఏమైతేనేం...మన “అసమాన అనసూయ” గారు మనల్ని విడిచి వెళ్లి పోయినా....నాకు మటుకు ఆవిడ కబుర్లు, జ్ఞాపకాలు కలకాలం నాతోనే ఉంటాయి. ఆవిడ చెప్పిన ఆకాశ వాణి ప్రారంభం, దేవులపల్లి వారి బ్రహ్మ సమాజం పాటలకి ట్యూన్స్ కట్టి అన్ని సభల్లోనూ పాడడం, బెజవాడ గోపాల రెడ్డి గారి పెళ్లి, గాంధీ గారు కాకినాడ వచ్చినప్పుడు భోరున వర్షంలో హార్మోనియం మీద గుడ్డ కప్పి “హే భారత జననీ” పాడడం, కాంచనమాలతో స్నేహం, నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రాధాకృష్ణన్ మొదలైన వారి ముందు కచేరీలు,  రత్నపాప బారసాల నుంచి అరంగేట్రం సంగతులు, ......ఒకటేమిటి ఒకదాని కంటే మరొకటి భలే ఆసక్తికరంగా ఉండేవి. అవన్నీ విని సతాయించి, బతిమాలి, ఎడా పెడా పొగిడి ఆవిడని రచనా వ్యాసంగం లోకి దించి ఆమె జీవితానికి సంబంధించిన అనేక అంశాలని..కొన్ని కథల రూపంలో...ఆవిడ 83 ఏట, 2003 లో “నేనూ -నా రచనలూ”, 2007 లో “గతానికి స్వాగతం”, తన 95 ఏట “అసమాన అనసూయ” అనే పేరిట ఆవిడ ఆత్మ కథనీ రచించగా...వాటిని అపురూప గ్రంధాలుగా ప్రచురించే అదృష్టం ఆవిడ నాకు కలిగించారు. నా జన్మ ధన్యమయింది. వీటిల్లో ఆమె ఆఖరి పుస్తకం..

 

ఆమె ఆత్మ కథ అయిన “అసమాన అనసూయ” ఒక్కటే ఆన్-లైన్ లో ఈ-బుక్ లా ఈ క్రింది లంకె లో దొరుకుతుంది.

http://kinige.com/book/Asamana+Anasuya

మిగిలిన రెండు పుస్తకాలూ హైదరాబాద్ లో నవోదయా లో కానీ, విశాలాంధ్రా లో కానీ దొరక వచ్చును.

నా ప్రస్తుత మానసిక స్తితి నుంచి కోలుకున్నాక  “అసమాన అనసూయ” గారితో నా జీవిత కాల అనుబంధం గురించి నా కోసం నేనే మరొక వ్యాసం లో వ్రాసుకుని పంచుకుంటాను...త్వరలో...

(“కళా ప్రపూర్ణ” డా. అవసరాల అనసూయా దేవి గారి దివ్య స్మృతికి అంకితం)

*****

bottom of page