top of page
srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సత్యాన్వేషణ-8

.సొమ్మొకడిది - సోకొకడిది!  

సత్యం మందపాటి

ఈ మధ్యన నా తెలుగు కథలకి ఇంగ్లీష్ అనువాదం చేసిన పదమూడు కథల పుస్తకం విడుదల చేశాం.

ఇది ఎప్పటినించో, అంటే నా అమెరికా బేతాళుడి కథల పుస్తకం విడుదల అయినప్పటినించీ, అమెరికన్ మిత్రులూ, తెలుగేతర మిత్రులూ బంధువులూ, ముఖ్యంగా కొందరు తెలుగు బడి పిల్లల కోరిక మేర అందించిన పుస్తకం ఇది.

ఇది విడుదల అయాక, కొందరు అమెరికన్ మిత్రులు నా పుస్తకం కావాలంటే, వాళ్ళతో కలసి పదిరోజుల క్రితం లంచికి వెళ్ళాను. ముఫై ఏళ్ళుగా నాకు మంచి స్నేహితుడైన డగ్ అడిగాడు, ‘తెలుగులో నీ పుస్తకాలు ఎన్ని ప్రచురించారు?’ అని.

‘ప్రింటు పుస్తకాల్లో ఇది పధ్నాలుగవది. తొమ్మిది ఈ-పుస్తకాలు కూడా రకరకాల వెబ్ సైట్లలో వున్నాయి’ అన్నాను.

‘అయితే నీ పుస్తకాల అమ్మకాలతో నువ్వొక మిలియనీరువి అయిపోయావన్నమాట. ఇంకా ఎందుకు అనవసరంగా ఉద్యోగం చేస్తున్నావ్?’ అన్నాడు నవ్వుతూ, అతని సహజ ధోరణిలో.

‘అవును, నేను కూడా ఇంగ్లీషులో ఏ ఓజే సింప్సన్ మీదో, ట్రంపు మీదో కొన్ని సెన్సేషనల్ పుస్తకాలు ఇంగ్లీషులో వ్రాస్తే నువ్వన్నట్టు మిలియనీరై ఉద్యోగం మానేసేవాడిని. కానీ తెలుగు పుస్తక ప్రచురణల కథ పూర్తిగా వేరు’ అని నవ్వి వూరుకున్నాను, అతనితో మన ఘోష వెళ్ళబెట్టుకోవటమెందుకని.

ఇదేమీ కొత్త విషయం కాదు. ఎన్నాళ్ళనించో కళ్ళారా చూస్తున్నది, సాటి రచయితల అనుభవాలు చదివినవి, నేను అనుభవిస్తున్నది, నాలాటి మిగతా రచయితలతో తరచుగా చర్చిస్తున్నదీ.

కొన్నిటికి చర్చలే వుంటాయి, ప్రశ్నలే వుంటాయి, పరిష్కారాలు వుండవు.

తర్వాత ఆ విషయం మీద ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నాను. మేము 1970లలో కేరళలో వున్నప్పుడు తిరువనంతపుతరంనించి ప్రచురింపబడే ‘మలయాళ మనోరమ’ టైమ్స్ ఆఫ్ ఇండియాలాటి ఇంగ్లీష్ పత్రికలతో కలుపుకుని, దేశమంతటి అన్ని భాషల దినపత్రికలలోను ప్రధమ స్థానంలో వుండేది. అప్పుడే కాదు, ఇప్పటి దాకా కూడా ఆ ప్రధమ స్థానం అలాగేవుంది. అలాగే హిందీ, బెంగాలీ, గుజరాతీ, తమిళ్, కన్నడ, మలయాళం పుస్తకాలకి ఈరోజునా ఎంతో ఆదరణ లభిస్తున్నది. మరి తెలుగు సాహిత్యం? ఆ ఆలోచనలే ఈ వ్యాస రచనకి స్పందన.

ఈ వ్యాసం నా గురించీ, నా పుస్తకాల గురించి కానే కాదు. తెలుగు రచయితలూ, వారి రచనల గురించి.

ఈ వ్యాసం ఎలా మొదలుపెట్టాలా అని ఆలోచిస్తుంటే, కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళక తప్పటంలేదు.

౦ ౦ ౦

1950వ దశాబ్దంలో నేను గుంటూరు మాజేటి గురవయ్యగారి స్కూల్లో చదివేవాడిని. అక్కడ గురువులు అందరూ చదువు ఎంత బాగా చెప్పేవారంటే, నేను క్లాసులో చెప్పేది విని మళ్ళీ పరీక్షల ముందే అవి నెమరేసుకునే వాడిని. అందుకని నాకు మిగతా పనులకి ఎంతో సమయం దొరికేది. మా ఇంటి పక్కనే డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీ వుండేది. స్కూల్ లేనప్పుడల్లా నేను క్రికెట్ ఆడుకోవటం లేదా ఆ లైబ్రరీలో చదువుకోవటం చేసేవాడిని. అక్కడ ఎన్నో వేల మంచి పుస్తకాలు వుండటం వల్ల, నేను ఐదారేళ్ళలో ఎన్నో గొప్ప పుస్తకాలు చదివాను అని గర్వంగా చెప్పుకోగలను. తెలుగు రచయితల పుస్తకాలే కాకుండా ఇంగ్లీషు, బెంగాలీ, హిందీ పుస్తకాల తెలుగు అనువాదాలు చదివేవాడిని. ముళ్ళపూడి వెంకటరమణగారు, మద్దిపట్ల సూరి.. ఇలా ఎంతోమంది అనువాదం చేసిని పుస్తకాలన్నీ చదివాక, నాకు ఆ ఇంగ్లీషు పుస్తకాల మీద కూడా మోజు పెరిగి, ఎనభై రోజుల్లో భూప్రదక్షిణంతో పాటు ఎరౌండ్ ది వర్డ్ ఇన్ ఎయ్టీడేస్, ఘంటారావంతో పాటు ఫర్ హూం ది బెల్ టోల్ల్స్, యుధ్ధమూ శాంతితోపాటు వార్ అండ్ పీస్.. ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.. చదివేశాను. ఆ పుస్తకాల చదువే, ఆ రచయితల చలవే నన్ను కూడా ఒక రచయితగా చేసింది. ఏ భాషలోనైనా ఆ సాహితీ అందాలు చూడటం నేర్పింది.

ఆరోజుల్లోనే ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలలో యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి సీరియల్స్ కోసం, క్యూలో నుంచుని ఆ వారపత్రికలు అయిపోయేలోపుగా కొనుక్కునేవాళ్ళు.

తరువాత 1960లలో నేను గుంటూరు హిందూ కాలేజీలోనూ, కాకినాడ, వైజాగ్ ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ చదివేటప్పుడు, పుస్తక ప్రచురణ విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ గవర్నర్ పేట సెంటర్లో వరుసగా ఎన్నో పుస్తక ప్రచురణ సంస్థలు వుండేవి. దరిమిలా ఎమెస్కో సంస్థ ఇంటింటా స్వంత గ్రంధాలయం అని పేరు పెట్టి, రెండు రూపాయలకే ఎన్నో మంచి పుస్తకాలు నెలనెలా విడుదల చేసేవారు. అమెరికాకి వచ్చే ముందర మా ఇంటి స్వంత గ్రంధాలయంలో రెండు వందల పై చిలుకు పుస్తకాలు వుండేవి. నేను వదిలిపెట్టలేని కొన్ని పుస్తకాలు మాత్రం ఇక్కడికి తెచ్చుకుని, మిగతావి బంధుమిత్రులకి ఉచితంగా ఇచ్చేసి వచ్చాను.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఆనాటి మన తెలుగు గ్రంధాలయ వైభవం, పుస్తక ప్రవచురణ వైభవం చెబుదామని.

మరి తరువాత ఎందుకిలా అయింది?

మన తెలుగు గౌరవాన్ని డిల్లీకి తీసుకుపోయ, తెలుగుదేశంలో తెలుగు పుస్తకాన్ని చంపేసిన ఒకానొక ముఖ్యమంత్రి వల్ల. ఎన్నో గ్రంధాలయాలకు ఫండ్స్ తగ్గించేసి, కొండొకచో పూర్తిగా రద్దుచేసి, చాల గ్రంధాలయాలను మూసివేశాడు. విజయవాడలోని ప్రచురణ సంస్థలు మూతబడటమో, క్లాసు పుస్తకాలు, నోట్ పుస్తకాలు వేసుకోవటమో చేసుకునేవారు. ఏవో కొన్ని పెద్ద సంస్థలు ఒకటీ అరా అలా అలా నిలబడ్డాయి కానీ, మిగతా వారు దెబ్బతిన్నారు. నేను అమెరికానించీ భారతదేశం వెళ్ళినప్పుడల్లా ముఖ్యంగా కలిసేది, పత్రికా సంపాదకులనీ, పుస్తక ప్రచురణకర్తలనీ, సాటి రచయితలనీ. ఆ స్వర్ణయుగం అలా ఒక్కసారిగా కూలిపోవటం కళ్ళారా చూశాను. నేనెంతో ఇష్టపడ్డ మా గుంటూరు లైబ్రరీ సైజులో మరీ చిన్నదయిపోయి, ఎక్కువగా వార్తాపత్రికలూ, వారపత్రికలకే అంకితమైపోయింది. పాత పుస్తకాలు పోషణలేక పాడై పోయీ, కొత్తపుస్తకాలకు డబ్బులు లేకా, గ్రంధాలయాలకు జనాదరణ కూడా తగ్గిపోయింది.

నేను ఇంతకుముందు స్నేహితులకి ఇచ్చేసిన, నాకు ఇష్టమైన పుస్తకాలు (గోపీచంద్, రావిశాస్త్రి, కొకు, రమణ, ఆరుద్ర, శ్రీశ్రీ, బుచ్చిబాబు..) మళ్ళీ కొనుక్కుందామని నేను కొన్ని పుస్తకాల షాపులకి వెళ్ళి అడిగితే, ‘ఇప్పుడు ఆ పుస్తకాలు ఎవరూ వేయటం లేదు సార్, లైబ్రరీలు దాదాపు వెయ్యి, రెండు వేల కాపీలు తీసుకునేవి. ఇప్పుడు ఎప్పుడో తప్ప మామూలుగా ఇరవై, ముఫై కన్నా తీసుకోవటం లేదు. అందుకని ఎవరూ ధైర్యం చేయటం లేదు’ అని జవాబు వచ్చేది.

౦ ౦ ౦

నేను 1970లలో ట్రివేండ్రం విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పనిచేసేటప్పుడు, అక్కడ కోవళం బీచిలో ఒక తెలుగు సినిమా షూటింగుకి నాగేశ్వర్రావు, జయప్రద, ఆ సినిమా దర్శకుడు (కథ, మాటలు, నిర్మాత కూడా ఆయనే. పేరు మీరే ఊహించుకోండి), వారితో పాటు ‘ఇంకో ఆయన’ వచ్చారు. మా తెలుగు అసోషియేషన్ తరఫున ఒక పెద్ద హోటల్లో వారితో ఒక చిన్న మీటింగ్ పెట్టాం. వచ్చిన వాళ్ళల్లో సగం మంది జయప్రద దగ్గర, మిగతా వాళ్ళల్లో ఎంతోమంది నాగేశ్వర్రావ్ దగ్గరా, కొద్దిమంది ఆ దర్శకుడి దగ్గరా చేరారు. ఆ ‘ఇంకో ఆయన’ ఒక్కరే కిటికీలోనించీ బయట వున్న కొబ్బరి చెట్లు చూస్తూ నుంచుని వున్నారు. నేనూ, నాలాగానే కాస్త సాహిత్య పైత్యమున్న మా కంప్యూటర్ సెంటర్ మేనేజర్ రాధాకృష్ణ ఆయన దగ్గరికి వెళ్ళాం.

ఆయన పరిచయం చేసుకున్నారు, ‘నాపేరు పాలగుమ్మి పద్మరాజు’ అని. గాలివాన కథతో తెలుగు కథని, మొట్టమొదటగా ప్రపంచ సాహిత్య వీధుల్లో ఎగరేసిన మహా గొప్ప రచయిత! వెంటనే నేనూ, రాధాకృష్ణ ఆయనకి నడుం వంచి పాదాభివందనం చేశాం.

ఆయన అక్కడికి ఎందుకు వచ్చారో, ఆయన పాత్ర ఏమిటో అడిగారు రాధాకృష్ణ. అడగ్గా అడగ్గా ఆ సినిమాకే కాక ఆ దర్శకుడి చాల చిత్రాలకి తను ‘దయ్యం’ రచయితననీ, కథా మాటలూ అన్నీ తనవేననీ ముఖమాటపడుతూ చెప్పారు. అంత గొప్ప రచయిత అయినా ఆర్ధికంగా ఎదిగే అవకాశాలు లేక, బ్రతుకుతెరువు కోసం, తన ఘనమైన పేరుని మరుగున పరుచుకుని రచనలు చేస్తున్నారు. ఆ మాట విని నేను, రాధాకృష్ణా చెరోపక్కకీ వెళ్ళి కళ్ళు తుడుచుకున్నాం. అంతకన్నా ఏం చేస్తాం?

తర్వాత అమెరికా వచ్చాక ఇంకో రెండు విషయాలు నన్ను బాగా కదిలించాయి.

మహా రచయిత, గొప్ప సాహిత్యవేత్త ఆరుద్రగారు అనారోగ్యంగా వున్నారనీ, డయాలిస్ చేయించుకోవాలనీ, ఎంతోకొంత ధన సహాయం కావాలనీ తెలిసింది. అలాగే ఎన్నార్ నందిగారు (‘మరో మహెంజోదారో’ గుర్తుందా?) అనారోగ్యంతో నీరసపడి ఇంటి అరుగు మీదనించీ క్రింద పడిపోయి చనిపోయారనీ, వారి కుటుంబం దీనస్థితిలో వుందనీ, కర్మకాండలకి ధనసహాయం కావాలనీ. ఏదో నాలాటి, మీలాటివారు కాస్తోకూస్తో ఇచ్చినా, అది ఆరోజు కష్టాలని గట్టెక్కిస్తుందేమోకానీ, అంతకన్నా వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగుచేయదు. ‘మా తెలుగు తల్లికీ మల్లె పూదండ’ వ్రాసిన శంకరంబాడి సుందరాచార్యగారు చివరి రోజుల్లో, మద్రాస్ సెంట్రల్ స్టేషన్ దగ్గర యాచకత్వం చేసేవారని, ఒకసారి గొల్లపూడి మారుతీరావుగారు చెబుతూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. గొప్ప నవలాకారుడు, వేయి పుస్తకాల రచయిత కొవ్వలి కూడా ఎంతో దీనస్థితిలో జీవితం చాలించారు.

అలాటి మహా రచయితలు ఆర్ధికంగా ఎదగలేక పోవటానికి కారణం ఏమిటి?

మన తెలుగువాళ్ళకి రచయితలనే కాదు, మిగతా కళాకారులుని కూడా గౌరవించుకోవటం తెలియదు. వెంపటి చిన్న సత్యంగారు మద్రాస్ వెళ్ళాకనే స్థిరపడ్డారు. అలాగే బాలమురళీ కృష్ణగారు. మన సంగీతాన్ని, నృత్యాన్నీ తమిళులు ప్రోత్సహించారు కానీ, భాషాబేధం వల్ల వాళ్ళు మన సాహిత్యాన్ని పోషించలేక పోయారు.

దేవులపల్లి, మల్లాది, శ్రీశ్రీ, పింగళి, సముద్రాల, కొసరాజు, ఆత్రేయ, ఆరుద్ర మొదలు సిరివెన్నెలదాకా సినిమాల్లో సాహిత్యాన్ని హిమాలయాల ఎత్తున నిలబెట్టారు, కానీ ఆర్ధికంగా వీళ్ళెవరూ పెద్ద ఎత్తున నిలబడలేదు.  

౦ ౦ ౦

తెలుగు భాషాభిమానంతో నాకు తెలుగులో పీహెచ్డీ చేసి, తెలుగు మాష్టారుని అవాలనీ, అలానే నా రచనా వ్యాసాంగం కొనసాగించాలనీ అభిలాషపడేవాడిని. మా నాన్నగారు, ‘వృత్తిగా ఇంజనీరవు, సాహిత్యాన్ని ప్రవృత్తిగా చేసుకో’మని చెప్పటం వల్ల, నేను ఇటు ఇంజనీరునయాను, అటు తెలుగు భాషాభిమానంతో రచయితనీ అయాను. నా ఇంజనీరింగ్ నన్ను నా కాళ్ళ మీద కుటుంబ పోషణలో ఆర్ధికంగా నిలబెడితే, నా సాహిత్యం నాకెంతో తృప్తిని, నా జీవితానికి ఒక సార్ధకతని ఇస్తున్నది. ఇలాటి రెండు గుర్రాల మీద పరుగెత్తే వారే, సవ్యంగా జీవనయాత్ర సాగిస్తూ, ఈనాడు రచయితలుగా కూడా నిలబడుతున్నారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటూ రచనలు చేసుకునే వారిని చాలమందిని చూస్తూనే వున్నాం. కానీ రచననే వృత్తిగా తీసుకున్న తెలుగువాళ్ళ మనుగడ కష్టమైపోతున్నది. ఆనాడు రాజులు కవులని పోషించేవారు. కానీ ఈనాడు పత్రికలూ, సినిమాలూ, ప్రచురణకర్తలూ పారితోషకాలు ఇస్తారేమో కానీ, కుటుంబాలని నిలబెట్టే స్థితిలో లేవు. ఏవో ఆర్ధికంగా స్థిరత్వం వున్న ఒకటి రెండు పత్రికలు తప్ప, మిగతావి మూణ్ణాళ్ళ ముచ్చట్లయిపోయాయి. వాటిలో చాల పత్రికలు, రచయితలకి పారితోషకం ఇచ్చే స్థితిలో లేకపోవటమే కాకుండా, కనీసం పత్రిక కాపీ కూడా రచయితకి పంపించరు. ప్రస్థుత కులగజ్జి సినిమారంగానికి సాహిత్యంతోగాని, రచయితలతోగాని పనిలేదు. దుక్కిపాటి మధుసూధనరావు, రామానాయుడు ఆరోజుల్లో తెలుగు, బెంగాలీ నవలా చిత్రాలు తీసి సాహిత్యానికి ఎంతో విలువనిచ్చారు. ఇప్పుడు ఆ ‘ఒకే ఒక్క చెత్త కథ’ మీద వెయ్యి సినిమాల వచ్చాయి. ఇంకా వస్తున్నాయి. తారలు తప్ప నటులు లేక, నవలా చిత్రాలు మరుగున పడ్డాయి.  

౦ ౦ ౦

మిత్రులు మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు ఏదో పత్రికలో కొన్నాళ్ళ క్రితం ఒక వ్యాస పరంపర వ్రాశారు. పత్రికలు, ప్రచురణకర్తలు, పుస్తకాల షాపులు రచయితల రచనలతో డబ్బు చేసుకుంటూ, డబ్బులివ్వకుండా ఎలా ఎగ్గొడుతున్నారో.

అదే సొమ్మొకడిది, సోకొకడిది అంటే!

ఇప్పుడు పుస్తక ప్రచురణలో జరుగుతున్న కొన్ని కథలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది.

ఇంతకుముందు లైబ్రరీలు వెయ్యి కాపీలకు తక్కువ లేకుండా తీసుకునేవనీ, ఇప్పుడు ఎక్కువగా ఇరవై, ముఫై కాపీలకు మించకుండానూ, కొండొకచో మాత్రమే ఎక్కువగానూ తీసుకుంటున్నాయని పైన చెప్పాను. ఆ ఇరవై కాపీలకు కూడా మిత్రులు సురేశ్ చెప్పినట్టు పెద్ద రాధ్ధాంతం వుంది. ముందుగా మూడు కాపీలను వాళ్ళకి ఉచితంగా పంపిస్తూ, దానితో పాటు ప్రాసెసింగ్ ఖర్చులు యాభై రూపాయలు పంపించి, పేపర్ వర్క్ చేయటం. మీ పుస్త‌కాన్ని ఎంపిక చేసినా, చేయ‌క‌పోయినా, క‌ల‌క‌త్తా, ఢిల్లీ, చెన్నై ప‌బ్లిక్ లైబ్ర‌రీల‌కు ఒక్కో కాపీ చొప్పున (రిజిస్ట‌ర్డ్ పోస్టు ద్వారా మాత్ర‌మే) ఉచితంగా పంపి, ఇలా పంపామ‌నేందుకు సాక్ష్యంగా ఆ పోస్ట‌ల్ రసీదుల తాలూకు ఫొటోకాపీల‌ను ఢిల్లీ లైబ్ర‌రీకి స‌మ‌ర్పించుకోవాలి. స‌మ‌ర్పించిన ప్ర‌తి పుస్త‌కానికీ క‌నీసం 20 కాపీల ఆర్డ‌ర్ వ‌స్తుంది. 20% పైన క‌నీస డిస్కౌంట్ ఇవ్వాలి. ఎంపిక చేసిన పుస్త‌కాలను మ‌ళ్లీ మీరే వెళ్లి అఫ్జ‌ల్‌గంజ్ లైబ్ర‌రీలో స‌బ్మిట్ చేయాలి. ఓ మూణ్నెళ్ల త‌ర్వాత‌ రాజారామ్మోహ‌న్ రాయ్ సంస్థ నుంచో, అఫ్జ‌ల్‌గంజ్ లైబ్ర‌రీ నుంచో మీ చెక్కులు  ప‌ట్టుకుపొమ్మ‌ని స‌మాచారం రాగానే, ముచ్చ‌ట‌గా మూడోసారి మ‌ళ్లీ అఫ్జ‌ల్‌గంజ్ లైబ్ర‌రీకి వెళ్లి (అక్క‌డి నిబంధ‌న‌ల మేర‌కు) మీ చెక్కును మీరు తెచ్చుకోవాలి. మీరు లైబ్రరీకి ఇచ్చే ప్రతి పుస్తకానికీ మీకు నిజంగా మిగిలేది మీ పుస్తకాలు లైబరరీలో పెడుతున్నారోచ్ అనే ఆనందం. తృప్తి. మరి మీ జాతకంలో ధన నష్టం అని వ్రాసి వుంది కదా! వాళ్ళేం చేస్తారు. మరచిపోయాను, మధ్యే మధ్యే బల్ల క్రింద చేతులు వున్నాయిట కానీ, ఇప్పుడు ఆ బల్లలు కూడా ప్రభుత్వోద్యోగులు ఎత్తుకుపోయి, బహిరంగంగానే జేబులు నింపుకుంటున్నారుట! అదే పెద్ద ప్రచురణ కంపెనీలైతే, వాళ్ళకి వేరే ‘వెసులుబాటులు’ కూడా వుంటాయేమో! మాలాటి చిన్నా చితకా బాపతులు, ఇన్ని కష్టాలు మనమేం పడతాం, వద్దులే అని ఈ సువర్ణావకాశాన్ని వదిలేస్తాం.

ఇది కూడా ఒకరకంగా సొమ్మొకడిది, సోకొకడిది!     

కొంతమంది చిన్న చిన్న ప్రచురణ కర్తలు నాలాటి రచయితల పుస్తకాలు వేస్తామన్నారు. రాయల్టీ కూడా ఇస్తాం, అమ్ముడు పోయాక అంటారు. పుస్తకం బజార్లోకి వస్తుంది, మనకి పది కాపీలు ‘ఉచితంగా’ ఇస్తారు. ఇక ఇంతే సంగతులు. తర్వాత కనీసం ఫోన్ కూడా ఎత్తరు. ఒకవేళ ఎత్తినా, రమణగారి భాషలో ‘ఆనక’ రమ్మంటారు! మనది రాయల్ ఫామిలీ కాదు కనుక, మరి రాయల్టీ ఇవ్వటానికి వాళ్ళకి మనసొప్పదేమో! అదే కొంతమంది పెద్ద ప్రచురణకర్తలయితే, ఒకేసారిగా ఓ ఐదో, పదో వేల రూపాయలు ఇచ్చేసి వాళ్ళు చేతులు వాళ్ళే కడిగేసుకుంటారు. లాభాలన్నీ వాళ్ళవే. పది కాపీలు మాత్రమే మనకి ఇస్తారు. మన చుట్టపక్కాల పంపకాలకి పదకొండో కాపీ నించీ, ఎన్ని కావాలంటే అన్నిటికి కుసింత తగ్గింపుతో ఆ రచయితే తన పుస్తకాలు తనే కొనుక్కోవాలి.

ఈ పధ్ధతి అనుకూలంగా లేదని చాలమంది రచయితలు ఎవరి పుస్తకాలు వాళ్ళే ప్రచురిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ పీత కష్టాలు పీతవి. డీటీపీలు, అట్ట మీద బొమ్మ, డిజైన్, పేపర్ ఖరీదు, ప్రింటింగ్, బైండింగ్, డెలివరీ ఖర్చులు.. ఇలా తడవకుండానే మోపెడవుతాయి. అందుకని వేయి కాపీల బదులు, ఇప్పుడు నాలుగు వందల కాపీలు వేస్తే పుస్తకం ఖరీదు ఇంకా పెరుగుతుంది. ఇవికాక పుస్తకావిష్కరణ.. హాలు, బానరు, ఆహ్వానపత్రాలు, బుకేలు, శాలువలు, పేపర్ వాళ్ళకి, స్టేజి మీదా, క్రిందా ఉచిత కాపీలు, ఆమ్యామ్యాలు, పుస్తకాల ఉచిత పంపిణీ.. లాభాల్ని గూబల్లోకి గుంజుతుంది. ఇంతా చేసి ఏ పుస్తకాల డిస్ట్రిబ్యూటరుకో ఇస్తే, నలభై శాతం కాదు, యాభై శాతం కమిషన్ ఇస్తే కానీ వీల్లేదంటారు. సరే అని రెండు వందల కాపీలు ఇస్తాం. ఇక ఇంతే సంగతులు. ఒక సంవత్సరం తర్వాత అమ్మకాలు ఎలా వున్నాయి అని అడిగితే, ఏదో వున్నాయి సార్ అంటారు కానీ ఒక్క పైసా వెనక్కి రాదు.

ఏ వ్యాపారం చేయాలన్నా, ఇన్వెస్ట్మెంట్ కాపిటల్ కావాలి. పుస్తకాల షాపులకి అదేమీ అవసరం లేదు. రచయితలు పుస్తకాలు ఉచితంగా ఇస్తారు. ఎన్ని అమ్ముడుపోతే అన్ని. ఆ యాభై శాతం గట్టెక్కి, వంద శాతం వాళ్ళదే అయిపోయి, మళ్ళీ సొమ్మొకడిదీ, సోకొకడిదీ అయిపోతుంది. స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా వదలకుండా వెంటపడితే, కాస్తో కూస్తో వచ్చే అవకాశాలున్నాయి కానీ, ఎంతమంది రచయితలకి అంత ఓపిక, సమయం వుంటుంది?

అందుకే మనకి వచ్చేది ఎలాగూ రాదు, కనీసం అందరూ చదువుకుంటారు అనే ఆలోచనతో ఎంతో చౌకగా పుస్తక ప్రచురణకి అయిన ఖర్చుకే తెలుగు దేశంలో అందిస్తే, దానిలో సగం కమిషన్ పోగా మిగిలిన సగమన్నా రాదు. అంటే డిస్ట్రిబ్యూటర్లకు పుస్తకాలు రచయితలు వూరికే ఇస్తున్నారన్నమాట.

ఇదే సొమ్మొకడిది, సోకొకడిది అంటే!     

నాలాటి అమెరికా రచయితలు, మళ్ళీ కొన్ని కాపీలు భారతదేశం నించీ అమెరికాకి తెద్దామంటే, ఆ కాకి వాహనం దొరకక, గరుడ వాహనంలో తెస్తే, వాళ్ళు మన చెవులు పిండేస్తారు. అసలే పుస్తకాలు బరువు. అది కూడా ఖర్చుల్లో కలుపుకుంటే, ఇహ లెఖ్కలన్నీ ఆకాశ వీధుల్లోనే!

కారణాలు ఏమైనా, అమెరికాలోనూ పుస్తకాలు కొని చదివే తెలుగువారిని వేళ్ళతో లెఖ్కపెట్టవచ్చు. నా పుస్తకాలే కాదు, మిగతా రచయితలవి కూడా కొనేవారు ఎప్పుడూ ఆ కొంతమందే! కొంతమంది వారంతట వారే అభిమానంతో అడిగి పుస్తకాలు కొనేవారు, కొంతమంది అడిగితే ముఖమాటం కొద్దీ సరే అనేవారు, ఎప్పుడూ వీరే ఈనాటి మహారాజ పోషకులు! అమెరికా రచయితల తరఫున ఆ అందరికీ ధన్యవాదాలు.

అమెరికాలో తెలుగులో అడపాదడపా కథలు, వ్యాసాలు, కవితలు, పద్యాలు వ్రాసేవారు యాభై అరవై మంది వుంటారేమో. వారిలో స్వంతంగా కానీ, తెలిసిన సంస్థల ద్వారా కానీ తమ పుస్తకాలు స్వంత ఖర్చుతో ప్రచురించేవారు పాతికమంది వుంటారేమో. వీరందరూ నాలాగానే తమ సాహితీ బంధువులతోపాటూ, తమ గూఢ మిత్రులకీ, గాఢ శత్రువులకీ ముఖమాట పెట్టో, బ్రతిమాలో, భయపెట్టో, కాసినో కూసినో పుస్తకాలు అమ్ముతారు. ఎక్కడయినా వాళ్ళ వూరికి దగ్గరలో ఏదో సాహిత్యసదస్సు జరిగితే అక్కడ ఒక పక్క బల్ల పక్కన గోడ కుర్చీ వేసుకుని, ఇంకో ఐదో పదో పుస్తకాలు అమ్ముతారు. అంతే. మిగిలినవన్నీ ముందు సేల్, తర్వాత క్లియరెన్స్, చివరికి ఫ్రీబీ. అన్నీ చరిత్రలో అలా మిగిలిపోతాయి.

మాకు ఎన్నో కుల సంఘాలు వున్నాయి కానీ, ఇండియానించీ వారి వారి కుల రాజకీయ నాయకులనీ, సినిమా గాళ్ళనీ డబ్బులిచ్చి తెప్పిస్తారు కానీ, అమెరికాలోని స్థానిక తెలుగు రచయితల పుస్తకాలు కనీసం పుస్తక ప్రచురణ ఖర్చులకు సరిపడా ఇచ్చి, రిజిస్ట్రేషన్ సంచుల్లో పెట్టి ప్రోత్సహించరు. అమెరికా రచయితలకి మా కుల సంఘాలు మిగిల్చేది ఒక్కటే.. వ్యాకులం!

సరేనయ్యా.. మరి ఇన్ని కష్టాలు పడి, నష్టపోయి ఆ పుస్తకాలు వ్రాయకపోతే ఏమిటి, అవి అమ్ముడు పోవటం లేదని వాపోవటమేమిటి అని మీరడుగుతారని తెలుసు. ఇరవై ఆరు మైళ్ళ మారథాన్ పరుగుపందెంలో గెలిచినా, లేకున్నా, ఓపికవున్నా, లేకున్నా, చివరి కాసిని మైళ్ళు కూడా కానిచ్చి, ఫినిష్ లైన్ దాటాలనుకుంటారు పరుతెత్తేవారు. దాన్నే ముళ్ళపూడివారి భాషలో ఏమంటారంటే ‘అదో తుత్తి’ అని.

ఒక గాయకుడికి, గాయనికి తమ పాటలు ఎందరో వినాలని వుంటుంది. ఒక చిత్రకారుడికి ఎన్నో చక్కటి  చిత్రాలు గీసి అందరితో పంచుకోవాలని వుంటుంది. ఒక నర్తకికి తన నృత్యం పలువురు చూసి ఆనందించాలని వుంటుంది. ఒకసారి ఇక్కడ సంగీత కార్యక్రమంలో బాలుగారు అన్నట్టు, ‘మీ చప్పట్లే మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవి’ అని, ఏ కళలో అయినా కావలసింది అదే. అలాగే ఒక పుస్తకం చదివి, ఒక్క మంచి మాట రచయితకి చెబితే అదే పది వేలు. ఆ పుస్తకం కూడా కొనుక్కుని చదివితే, రచయిత ఖర్చుల్లో అదొక ఆవగింజ అనుకోవటమే!     

ఇక్కడిలా ‘వాపోవటం’ మా మిత్రుడు డగ్ అన్నట్టు రచయితలని మిలియనీర్లుగా ఎందుకు చేయటం లేదు అనికాదు. చాలమంది తెలుగు రచయితలు కూడా లాభాపేక్షతో ఇలా చేయటం లేదు. ఇందాక చెప్పానుగా,.. ఇది వృత్తిగా కాదు, ప్రవృత్తిగా మాత్రమేనని.

కాకపోతే మన తెలుగు పుస్తక ప్రచురణారంగంలో జరుగుతున్న కథని, నాతోపాటు సాటి రచయితల అనుభవాలని అందరికీ చెబుదామని ఈ సొమ్మొకడిదీ, సోకొకడిదీ వ్యాసం వ్రాస్తున్నాను. అంతే!

*****

bottom of page