top of page

మధురవాణి ప్రత్యేకం

పాండి బజార్ కథలు - 7

srinivyasavani.PNG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఖుషీ కార్నర్- కొసరాజు

భువనచంద్ర

అర్ధవంతమైన హాస్యగీతలకీ, చురుక్కుమనిపించే వ్యంగ్య గీతాలకీ కేరాఫ్ అడ్రస్సు కొసరాజు రాఘవయ్య చౌదరిగారు. బహుషా ఆయన కలం సృశించినన్ని సాహితీ కోణాల్ని ఏ కలమూ సృశించి వుండదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన చదువుకున్నది చాలా తక్కువ. కానీ, పరిశోధన చేసింది మాత్రం చాలా చాలా ఎక్కువ. వాచి కథ, బుర్ర కథ, జముకుల పాటలు, రాజకూలి పాటలు, గంగిరెడ్ల గీతాలు, యక్షగానాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో  జానపద సాహిత్యాన్ని పరిశోధన చేయడమే కాకుండా తానూ వ్రాసి నిష్ణాతులైన కవుల్ని మనం చూడలేము. అవి ఒక్క కొసరాజుగారికే చెల్లింది.

 

దాదాపు 5 దశాబ్దాలు (50 సంవత్సరాలకు పైగా) ఆయన గీతాలు తెలుగు సెల్యులాయిడ్ (వెండితెర మీద) అద్భుతమైన వెన్నెల పరిచాయి.

*****

"అయ్యా.. నాకు కొసరాజుగారి పాటలంటే ప్రాణం" అన్నారు గురయ్యగారు. ఆయన వైజయంతీ మూవీస్‌కి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివే కాక అపారమైన అనుభవం వున్న పెద్ద మనిషి. చాలా కూల్ పెర్సన్.

"ఆయనంటే ఎవరికిష్టం వుండదండీ. మహానుభావుడు. వారిది మా వూరి దగ్గరి వూరే. అప్పికట్ల. అయితే పుట్టింది బాపట్ల తాలూకా కర్ణపాలెం మండలంలోని చింతాయపాలెంలో. తల్లిదండ్రులు లక్ష్మమ్మ, సుబ్బయ్యగార్లు" సంబరంగా అన్నాడు సైకిల్ మూర్తి.

"చదువేమిటో?" ఆరా తీశారు కోదండ రంగారావుగారు.

 

"చదువుకీ విద్యకీ సంబంధం ఏమిటండీ? అయినా అడిగారు గనక చెబుతా. నాలుగో తరగతి పాసయ్యారు. ఆయన తల్లిగారి మేనమామ వెంకప్పయ్యగారు గొప్ప పండితులు. ఇహ త్రిపురనేని రామస్వామిగారు వరసకి పెదనాన్న. ఇంకేం కావాలి? వాళ్ల దగ్గరే తెలుగు భాష నుడికారం నేర్చుకుని, తెలుగు భాష మీద మమకారం పెంచుకున్నారు. అందుకే "నా పేరు కొసరాజు, తెలుగంటే పెద్ద మోజు" అని గర్వంగా చెప్పుకునేవారు!." వివరించాడు సైకిల్ మూర్తి.

"ఆహా..! ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు. ఆయన సంస్కృతాంధ్రాలు నేర్చుకున్నది కొండముది నరసింహ పంతులుగారి దగ్గర. పన్నెండేళ్లకే అష్టావధానాలు చేసిన ఘనత కొసరాజుగారిది. అందుకే ఆయన్ని చిన్నతనంలోనే 'బాలకవి' అనే బిరుదు వరించింది."అన్నారు గుంటూరు గాలిబ్‌గారు.

"మీకెలా తెలుసు?"

"అయ్యో... నన్ను సరదాగా గాలిబ్ అని అంటారు గానీ, నేనూ కొండముది వారి తాలూకా వాడినే. నా పేరు కొండముది వరప్రసాద్" నవ్వాడు గుంటూర్ గాలిబ్.

"నేనూ ఓ మాట చెబుతా. ఆయన వ్రాసిన పాటలు పాడి నేను ఆరో తరగతిలోనూ, మళ్ళీ పదో తరగతిలోనూ ఫస్టు ప్రైజు తెచ్చుకున్నా" సంబరంగా అన్నది సావిత్రి.

సావిత్రిగారు AVR లో పని చేసి రిటైరయ్యారు.

"ఏమా పాట? వినిపించుడీ" సావిత్రి వంక చూస్తూ అన్నారు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణానంద.

"అది 1954లో విడుదలైన 'రాజు - పేద' చిత్రంలోది. సంగీతం. ఎస్. రాజేశ్వర్రావుగారు. పాడింది జిక్కిగారు." అని చెప్పి కంఠం సవరించుకున్నారు సావిత్రి.

 

*****

 

పల్లవి :

కళ్లు తెరిచి కనరా. సత్యం ఒళ్ళు మరచి వినరా

సర్వం నీకే బోధపడురా..

మేడల మిద్దెల మెలిగేవారిలో

పూరి గుడిసెలొ తిరిగేవారిలో

రక్తమాంసములు ఒకటే గదరా..

హెచ్చు తక్కువలు హుళక్కి గదరా.

||కళ్ళు||

 

చరణం:

పరమాన్నం తిని మురిసేవారికి

పట్టె మంచముల పండేవారికి

అంబలి తాగి ఆనందించే

పేదలకున్న హాయి లేదురా

||కళ్ళు||

 

చరణం:

పదవుల కోసం జుట్టు ముడేసి

పేదల నెత్తిన చేతులు పెట్టీ

కన్నూ మిన్నూ కానని వారికి

ఎన్నటికైనా ఓటమి తప్పదు

||కళ్ళు||

 

చరణం:

కాలచక్రమూ మారిందంటే.

కథ అడ్డంగా తిరిగిందంటే

రాజె పేదైన బాధలు పడునూ..

పేదే రాజై సుఖము జెందునూ

||కళ్ళు||

 

"వావ్.. ఎంత చక్కగా చెప్పారు. ఆ 'పదవుల కోసం' చరణంలో చెప్పినవి నగ్నసత్యాలు కావూ? ప్రజల మనోభావాలతో ఆడుకుంటే, వందేళ్ల చరిత్ర వున్న పార్టీలైనా మన్ను గరవక తప్పదని నిరూపణ కూడా అయిందిగా. ఎక్కడి 1954 ఎక్కడి 2019. ఇప్పటికీ కవి వాక్కు స్థిరంగానే వుంది" మెచ్చుకున్నారు నంది నరసింహంగారు.

"అసలా పదం 'హుళక్కి' అనేది ఎంత బాగుందో. ఎంత మంచి హుషారైన పదాల్ని మనం మరచిపోయాం"నిట్టూర్చారు దూర్వాసరావు.

"ఇదిగో రమో.. మా కాలంలో కాలేజీ పాట అంటే వెలుగు నీడల్లోని కొసరాజుగారి పాటే అనుకో. దానికి సంగీతం సాలూరివారే. పాడింది ఇంకెవరూ.. ఘంటసాల & బృందం. ఆ పాట పాడవయ్యా.. గుర్తుంటే!" ఉత్సాహంగా అడిగారు కోదండరంగారావు.

"అవును. ఇప్పటికీ ఆ పాట తాలూకు పరిమళం తగ్గలేదు. ఒక విధంగా చెబితే ఇది టీజింగ్ సాంగ్ కాదు. నాటి కాలేజీ విద్యార్థుల సమస్యల్నీ, నాటి పరిస్థితుల్నీ వ్యంగ్యంగా, సరదాగా, హాస్యంగా చెప్పిన పాట."వివరించాడు గుంటూర్ గాలిబ్.

"అంతే కాదండోయ్. హైస్కూలు మెట్లు కూడా ఎక్కని కొసరాజుగార్ని అమరంగా నిలిపిన కాలేజీ సాంగ్ అది " ఉత్సాహంగా అన్నది సావిత్రి.

OK..OK..  నాకాపాట కంఠతా వొచ్చు. మీరు కూడా కోరస్ పాడేయండి!" మూడ్‌లోకి వచ్చేశాడు ర.మో.

*****

సాకీ..

ఒకరు: కర్నూలు ఎక్కడా.. కాకినాడెక్కడా

ఏలూరు సాలూరు ఆలూరు ఎక్కడా

వరంగల్లు ఎక్కడా

రెండు: స్టాప్!! రైల్వే గైడు చూడరా గురూ

మూడు: శిష్యా శాంతి శాంతి

వాడవాడలనించి వాలాము ఇక్కడా

లక్కా బంగారంలా అతుక్కుపోయామురా మై డియర్...

పల్లవి:

భలే భలే మంచి రోజులులే.. మళ్ళీ మళ్ళీ ఇక రావులే

స్టూడెంట్ లైఫే సౌఖ్యములే... చీకూ చింతకు దూరములే ||భలే||

చరణం:

పంపు నీళ్లు బందైతే స్నానానికి నోచుకోమూ

గుయ్యిమని దోమలు దాడి చేస్తే శివరాత్రి జాగారణ చేస్తాము.

ఉప్పూ కారం లేని హోటలు సాపాటుతో

చప్పబడిపోయామురా బ్రదర్...

ఎన్ని కష్టాలురా నా తండ్రీ

భయపడకు రా పుత్రా

కష్టాలను దిగమింగేస్తాం.. కలకల నవ్వుతూ బ్రతికేస్తాం ||భలే|

చరణం:

ఇంటికి పోతే పెళ్ళీ పెళ్ళి అని వెంటబడతారు పెద్దలు

పెళ్లి చేసుకుంటే మేమూ మేమని పుట్టుకొస్తారు పిల్లలు

ఈ ఝంఝాటంలో విద్య నాశాయ

సర్వ నాశాయ నమో రా బ్రదర్

హా.. హతవిధీ..

సహనం.. సహనం.. ఉపాయం ఉంది నాయనా..

పెళ్లికి బకాయి పెట్టేస్తాం

బాధ్యతలన్నీ నెట్టేస్తాం ||భలే||

బాధ్యతల నెన్నడూ మరచిపోరాదు

ప్రగతి మార్గమునెపుడూ వదలి పోరాదు.

క్రమశిక్షణ పాటించి కదలిపోవాలిరా బ్రదర్..

హియర్.. హియర్..

ఆదర్శంగా నడవాలీ.. అందరు భేషని పొగడాలీ ||భలే||

 

*****

“సూపర్బ్ గా  పాడేవోయ్ రమో.. వినడానికి చాలా సరదాగా వున్నా విషయం చాలా వుంది బ్రదర్.

ముఖ్యంగా 'కష్టాలను దిగమింగేస్తాం.. కలకల నవ్వుతు బ్రతికేస్తాం' అనేదీ, 'బాధ్యతలనెన్నడూ మరచిపోరాదూ, ప్రగతి మార్గము నెపుడూ వదలిపోరాదు  క్రమశిక్షణ పాటించి కదలిపోవాలిరా బ్రదర్..

ఆదర్శంగా నడవాలీ అందరు భేషని పొగడాలీ'

అనే పంక్తుల్ని చూడండి. యూత్‌కి మార్గం చూపుతూ, బోధన చెస్తున్నట్టు లేదూ? అదీ చాలా సహజంగా. అంతకు ముందు 'పెళ్ళికి బకాయి పెట్టేస్తాం, బాధ్యతలన్నీ నెట్టేస్తాం అన్న హీరోనే మళ్లీ తనే 'బాధ్యతలని ఎన్నడూ మరచిపోరాదూ' అని చెప్పడం సినిమాలోని హీరో పాత్రని అద్దం పట్టడమే కాదు, యువకుల్లో ఒకడుగా మసలుతున్నవాడే, అదే యువతకి మార్గనిర్దేశం చెయ్యడం కనపడుతుంది. దాన్నే ధీరోదాత్తత అంటే, కొసరాజుగారు నవ్వి, 'ధీరోదాత్తత కాదు హీరో దాత్తత' అన్నారట"వివరించాడు గుంటూరు గాలిబ్.  

"నిజంగా బాగుంది గాలిబ్‌జీ. సరే.. మరో పాట అందుకోండి. కొసరాజుగారిదే సుమా!" నవ్వి అన్నది అమూల్య.

"ఒక్క నిముషం ఆగండి. మీరందరూ కొసరాజుగారి గురించి విన్నారు. నేను వారిని చూశాను. వారితో మాట్లాడాను."నవ్వుతూ అన్నారు గురయ్యగారు.

"మీరు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అని తెలుసుగానీ.."ఆగారు కో.రం.గారు.

"వైజయంతీ మూవీస్ కన్నా ముందు 'సత్యచిత్ర'లోనూ, 'రాంజీ' ప్రొడక్షన్స్‌ లోనూ, ఆర్.కె ప్రొడక్షన్స్ లోనూ ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేశా. ఆ అదృష్టం వల్లే అలనాటి భానుమతి, కన్నాంబ, ఎస్వీఆర్, ఎన్టీఆర్ వంటి  మహానటులతోనూ, మహా రచయితలు, గాయనీ గాయకులతోనూ పరిచయం కలిగింది. కొసరాజుగారి విషయానికొస్తే ఆయన నిలువెత్తు తెలుగుదనానికి నిదర్శనం వంటివారు."భక్తిగా అన్నారు గురయ్యగారు."అబ్బా.. ఇకనించీ ఎన్నో విషయాలు వినొచ్చన్నమాట" మురిపెంగా అన్నది అమూల్య.

"పాట పాడటానికి నేను రెడీ" చేతులు కట్టుకుని అన్నాడు సైకిల్ మూర్తి.

"యా.." స్టైలుగా అని అమూల్య చెవిలో ఓ రహస్యం చెప్పాడు సైకిల్ మూర్తి.

"యా. నాకు వొచ్చు ఆ పాట. అదీ వెలుగునీడలు లోనిదే. రెడీ..!" అన్నది అమూల్య..

 

*****

 

సినిమా: వెలుగు నీడలు (1961), సంగీతం: పెండ్యాల, గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:

సరిగంచు చీర గట్టి బొమ్మంచి రైక దొడిగి

జలసాగ నాతో రాయే వయ్యారి రంగుల బొమ్మ

సినిమాకు పొదాం రాయే గయ్యాళి ముద్దుల గుమ్మ

 

నిలపర సిన్నోడొ నీ సోకు నీ ఠీకు

యాడ నేర్చినావురో యీ నీటూ యీ గోటూ

మింగ మెతుకు లేదాయె మీసాలకు సెంటాయే

ఏటేటా బిడ్డాయే ఓపిక ఉడికిపాయే

ఇంట్లో యీగల మోత బైట పల్లకి మోత ||నిల||

 

ఎహే.. సంపాదన చేసుకోను సత్తవున్నాదీ

సక్కనైన సుక్క నాకు పక్కనున్నాదీ

సావి సల్లగా జూసి సంతు వున్నాదీ

ఇంతకన్న సొర్గమంటె ఎక్కడున్నాదీ..

నిలపవె నా రాణీ నీకేల భయమింక

ఆపవె బడాయీ అల్లిబిల్లి కూతలింక

 

కనగానే ఏమాయే  గాలికి వదిలావాయే

బిడ్డలంటె పట్టదాయె చదువు గొడవ ఎత్తవాయె

బండ చాకిరితో వాళ్ల బతుకే తెల్లారిపోయె ||నిలపర||

 

సంతానం పెరక్కుండ సూసుకుందామే

సంసారం సాగుమాను చేసుకుందామే

సిల్లరంత కూడబెట్టి దాచుకుందామే

పిల్లగోళ్ళ సదువులకు వాడుకుందామే

నిజమేనా రాణీ, నువ్వు చూపిన బాట

ఇంటాను లేవే ఇకపైన నీ మాట

 

సంతోషమే.. సంతోషమే.. సింతలేని కాపురమే శ్రీరంగమే

ఆలుమగలు ఒక్కటైతే ఆనందమే..

 

"అబ్బా. ఎంత అందమైన భాషండీ మనదీ! ఎన్ని చక్కని పదాలు వాడారో కొసరాజుగారు" పులకరించిపోయింది సావిత్రి.

"అవును. బొమ్మంచు రైక, గయ్యాళి ముద్దుల గుమ్మ, వయ్యారి రంగుల బొమ్మ, నీ సోకూ నీ ఠీకు, యీ నీటు యీ గోటు, ఆపవే బడాయీ ఇవన్నీ ఆనాడు జనాలు వాడుకున్న ముచ్చటైన పదాలు. అదలా వుంచితే , 'సంసారం సాగుమాను సేసుకుందామే' ఎంత అందమైన పంక్తి. అలాగే 'చింతలేని కాపురము శ్రీరంగమే' అనడం కొసరాజుగారికే చెల్లింది. "మైమరచిపోతూ అన్నారు సైకిల్ మూర్తి.

"అంతే కాదు 'మింగ మెతుకు లేదాయె మీసాలకు సెంటాయె' అనీ జనంలో పుట్టిన నానుడిని సినిమాలో వాడటం మరింత వన్నె తెచ్చింది పాటకి" అన్నది అమూల్య.

"అయ్యా.. నాకైతే ఈ పాటలో ఓ గొప్ప సందేశం వుంది.

1. పొదుపు గురించి (చిల్లరంత కూడబెట్టుకుందామె)

2. పిల్లల్ని చదివించాల్సిన బాధ్యత గురించి: ప్రతి బిడ్డ చదువుకోవడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని (సిల్లరంత కూడబెట్టి పిల్లల చదువులకి వాడటం)

3. ఫేమిలీ ప్లానింగ్: 'సంతానం పెరక్కుండ సూసుకుందామే'

4. జాగ్రత్తలు: జల్సాలు సినిమాలు కాదు.. అన్నిటికంటే ముఖ్యం పిల్లల చదువు, జనాభా నియంత్రణ, పొదుపు.

ఒక హాస్యపూరితమైన పాటలో ఇన్ని గొప్ప విషయాల్ని పొదుగుతూ, ఆ పాటకి ప్రాణం పోయడం సామాన్యమైన విషయం కాదు. కవియొక్క సమర్ధత, నిబద్ధత తెలిసేది ఇలాంటి సందర్భాలలోనే." వివరించారు గుంటూరు గాలిబ్ గారు.

"ఏమైనా, మూర్తిగారూ! మీరూ అమూల్య అద్భుతంగా పాడారు. అదీ ఓ పర్పస్‌ఫుల్ పాటని" మెచ్చుకున్నారు దూర్వాసరావుగారు.

"కొసరాజుగారు ఉత్తేజపరిచే పాటలు వ్రాయడంలో స్పెషలిస్టు. నా వరకు నాకైతే ఆయన వ్రాసిన ఓ పాట భగవద్గీత లాంటిది. చిన్నతనంలోనే కాదు. ఇప్పుడు కూడా నిరాశలో కృంగిపోయేటప్పుడు ఆ పాట పాడుకుంటాను. బస్. క్షణాల్లో మనసుకి బలం చేకూరుతుంది."భక్తిగా అన్నాడు రా.మో.

"ఏ పాట అది. చెప్పవూ" ఉత్సాహంగా అన్నది సావిత్రి.

"జయమ్ము నిశ్చయమ్మురా పాట. ఓ చిన్న సంగతి చెప్పనా. ఘంటసాలగారి అబ్బాయి ఘంటసాల రత్నకుమార్‌గారు యీ పాటమీద అద్భుతమైన ప్రసంగం చేశారు. హాలంతా చప్పట్లతో మారుమ్రోగిందనుకో!" అమూల్యతో అన్నాడు రా.మో.

"ఆ పాట నాక్కూడా చాలా ఇష్టం. రవీ.. హాయిగా పాడదామా" ఉత్సాహంగా అన్నది సావిత్రి.

"ఇంకేం కావాలి. యీ చల్లని సాయంత్రపు వేళ కొసరాజు పాటని మించిన పరవశం ఇంకెక్కడ దొరుకుతుందీ.. స్టార్ట్" అన్నారు నంది నరసింహం గారు. ఆయన ఒకప్పటి టాప్ హీరోయిన్‌కి పర్సనల్ కాస్ట్యూమర్.

 

చిత్రం: శభాష్ రాముడు (1959). సంగీతం: ఘంటసాల, గానం: ఘంటసాల , లీల & కోరస్.

 

పార్ట్ 1.

పల్లవి: జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా

చరణం: ఏనాటికైన స్వార్ధము నశించి తీరునూ

ఏ రోజుకైన సత్యమే జయించి తీరునూ. జయించి తీరునూ

కష్టాల కోర్చుకున్ననాడే శుభాలు దక్కునూ..శుభాలు దక్కునూ ||జయమ్ము||

చరణం. విద్యార్థులెంత విజ్ఞానం సాధించాలీ

విశాల దృష్టి తప్పకుండ బోధించాలీ.. బోధించాలీ

 

పార్ట్ . 2

పల్లవి:

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా

జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా.. సాగిపొమ్మురా || జయమ్ము||

చరణం: కష్టాల కోర్చుకొన్ననే సుఖాలు దక్కునోయ్.. సుఖాలు దక్కునోయ్

యీ లోకమందు సోమరులై వుండకూడదూ.. వుండకూడదూ

పవిత్రమైన ఆశయాల మరువకూడదూ. మరువకూడదూ. ||జయమ్ము||

చరణం:

గృహాన్ని స్వర్గసీమగ చేయుము దేవా.. బ్రోవుము దేవా

కుటుంబమొక్క త్రాటిపై నిలుపుముదేవా.. నడుపుము దేవా

బీదసాద నాదరించు బుద్ధి నొసగుమా.. శక్తినొసగుమా.. ||జయమ్ము||

చరణం:

గాఢాంధకారమలముకొన్న భీతిచెందకూ

సందేహపడక వెలుగు చూసి సాగు ముందుకూ .. సాగు ముందుకూ

నిరాశాలోన జీవితాన్ని కృంగదీయకూ. కృంగదీయకూ ||జయమ్ము||

చరణం: పరాభవమ్ము కల్గునంచు పారిపోతువోయ్

జయమ్ము నిను వరించుదాక పోరి గెల్వవోయ్.. పోరి గెల్వవోయ్

స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్. నిల్వబెట్టవోయ్. ||జయమ్ము|

 

*****

"అయ్యా... యీ సినిమా పాట నిజంగా సంసారానికి భగవద్గీతే. 'బీదసాదనాదరించు బుద్ధి నొసగుమా .. శక్తి నొసగుమా' అన్నది ఎంత గొప్ప ప్రార్ధన. అలాగే ఓ గొప్ప మనిషి అన్నాడు. ఓటమి అంటే యుద్ధం చేసి ఓడిపోవడం కాదు. యుద్ధానికి ముందే భయపడి పారిపోవడం.  యుద్ధంలో పోరాడి ఓడినా అది గెలుపే. అసలు యుద్ధమే చెయ్యకపోవడం నిఖార్సైన ఓటమి. ఆ మాటని ఎంత గొప్పగా చివరి చరణంలో కొసరాజుగారు చెప్పారో చూడండి . ఓహ్.. ఇదో అద్భుత గీతం." పులకించి పోయారు పూర్ణానందంగారు.

"అవును సార్. Thanks to this  ఖుషీ కార్నర్. ఎవరి గోలలో వారుండేవారు ఇవ్వాళ మా పాటలు వినడానికి చుట్టూ చేరారు"ఆనందంగా అన్నారు కోదండ రంగారావుగారు.

P.S.: పాటలు పూర్తిగా ఇస్తున్నాను. ఏదో ఓ పల్లవి చరణం కాకుండా. ఎందుకంటే హాయిగా మీరు దాచుకుని పాడుకోవచ్చని.

నమస్తే..

మళ్లీ మరోసారి

మీ భువనచంద్ర

bottom of page