
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
అద్వైత మాన్మథము
(సీత రాముని యెడల తనకు కలుగు ప్రేమానురాగాములను ఆత్మానుబంధమును చెప్పుచున్నది.)
నా మదిలోని దీపమవు నాదు ముదర్ణవ శేషతల్ప లీ
లా మధుకైటభారివి విలాసి మదీయ వయోమయూర వ
ర్షా ముఖ నృత్యఖేలనకు రాయిడిగొన్నమెయిళ్ల పాటవో
స్వామి! సమస్త మద్భువనశాలకు రత్నపు మేలు కట్టువున్
తెలతెలవార నా యెడద తీర్చిన మ్రుగ్గుల త్రొక్కివచ్చు శీ
తల పవనమ్ము వీవు, కను దమ్ముల నవ్వయి సోకి లోతులో
తుల దిగిపోవు రత్నఖచితోజ్జ్వల హేతివి, మద్గవాక్ష వీ
థుల పొగమబ్బులౌ అగరు ధూపము తావివి నీవు రాఘవా!
గగనము వంటి నా బ్రతుకుగాథల రూపకమందు చంద్రమ
స్స్వగతమ వీవు , సంక్షుభిత సాగర సంధుల వంటి కన్నులన్
తిగిచిన పక్ష్మమాలికల తీయగ నొత్తిన స్వప్న వేలవో
దృగభినవాభిరామ! యెల దేనియ కాల్వవు గుండె తోటలో
నే కల గాంచగా మును వినీలమణిచ్చవి జిమ్ము నిద్రవై
నా కాను వంపు మంపు కలనన్ బడిపోవు ద్వి రేఫమాలవై
నాకయి నేనుగా నిను వినా ఒక యేమియు కానిదాని నీ
కృతిజేసి సుప్రథిత సీతగ మల్చిన దివ్య శిల్పివై
నా యానందపు మేడలో మొదటి వీణా నాదమై మ్రోగి , నా
ప్రాయోధ్యానమునందు మందపవన ప్రాలంబమై వ్రేలి , నా
యీ యేకాంతమునందు సిగ్గువయి నన్నిట్లేచి, నా స్త్రీత్వపున్
సాయాహ్ణమ్ముల రాగరంజిత దిశా సందోహమై వ్రాలినన్
ఏమయిపోయినానొ యిటు లేమరిపోయిన నన్ను నేనుగా
నీ మెయి చీకటింట గురుతింపగ నెట్టుల నేర్తు నీ హిమా
నీ మృదితావనీజముల నీడల నా తొలి యూర్పు సవ్వడుల్
నీ మృదు పాదపద్మ రమణీయత వెంబడినే చరించుటై
కనుల కన్నులు నిల్పి కాంచితివేని ని
దేమి ద్వాదశసూర్య దీప్తి ముంచు
నను వీడి యడుగిడ నాలోన నిదియేమి
భవమెల్ల కదిలించు బాధ పొంగు
బిగ్గకౌగిలి చేర్చువేళ బ్రతుకు చివ
రల నిదియేమి క్రొన్నలుపు మంట
ప్రేమార నను పేర బిల్వగా నిదియేమి
గగనాన మ్రోగె నక్షత్ర ఘంట
నేను నీలోన నన్ను సృజించుకొనగ
నీవు నాలో లయింతు వెంతేని వింత,
ఇది యపూర్వక్రమము, సృష్టి మొదలు తుదలు
కలిసికొన్నవి మనలోన కాలమాగి!
("గోరువంకలు" పద్య సంపుటి నుండి)
సంపాదకుల ప్రత్యేక ఎంపిక

దేవరకొండ బాల గంగాధర తిలక్
రుతు శిల్పం
ఎర్రని రుతువు లాంటి నీ తనువు
నొప్పుల కొలిమిలా మండుతూ ఉంటుంది.
నువ్వెప్పుడూ నీ పెదవుల నేలపై గులాబీ తోటను నాటుతూ ఉంటావు.
నువ్వొక ముచ్చెమటల దిగులు బావివి
చేదకు దొరకని చెలెమవి.
సృష్టి ధర్మానికి ప్రతీకవై పలాయనంలోకి నెట్టబడుతూ ఉంటావు.
నీ చుట్టూ పెరిగిన ఈ అరణ్యం
నీలోపలి మైలపు విత్తనపు మొలకలేనని మరిచినారేమో...
నిన్నొక కట్ల పువ్వుని చేసి శుద్ధి చేస్తున్నారక్కడ.
ఈ మట్టిలో ఎన్నో టెక్నాలజీ వాసనలు గుప్పుమంటుంటే....
నీపై మాత్రం బురద అలుకును చల్లుతూనే ఉంటారు.
నువ్వొక శిల్పి చెక్కని రుతుశిల్పానివవుతూ...
పొక్కిలైన నీ గుండెలో
ఈ దేశ ముఖ చిత్రాన్ని దాచుకుంటూనే ఉంటావు

గట్టు రాధిక
యుద్ధం చేయాల్సిందే??
అతడిని
కొన్ని పువ్వుల్ని ప్రేమించుమని పంపాను
వాటి భాష అర్థం కావడంలేదని తిరిగొచ్చాడు
పోనీ
తన గుమ్మం ముందు అటు ఇటు కదలాడుతు
అరుస్తున్న పిచుక గొంతును వినుమన్నాను
దాని భాష అర్థం కావడంలేదని అన్నాడు
కనీసం
కుండీలో ఒక్కొక్కటిగా ఆకుల్ని రాల్చుతున్న
పూలమొక్క ముందు కాసేపు మోకరిల్లుమన్నాను
కూర్చున్నంతసేపు ఏమీ అర్థం కాలేదని చెప్పాడు
ఐతే
ఇప్పుడిక నీతో నువ్వు
యుద్ధం చేయాల్సిందేనంటూ వెళ్ళిపోయాను

బిల్ల మహేందర్
కవిత్వం-జీవితం
కవిత్వాన్ని సృజించటం వేరు
జీవితాన్ని స్పృశించటం వేరు
ఆలోచన ఆవహిస్తే చాలు కవిత్వం మొదలౌతుంది.
ఆలోచనను ఆచరిస్తేనే జీవితం మొదలౌతుంది.
కవిత్వంనిన్నుఊహలఊయలలో ఊపుతుంది.
కానీ,జీవితం నిన్నుచేదునిజాల లోయలలో పడతోస్తుంది.
కవిత్వం కడవరకూ నీతో చరించక పోవచ్చు
కానీ,జీవితం నువ్వు తరించేవరకు నీతోనే ఉంటుంది.
కవిత్వం అలలాంటిది,జీవితం సంద్రం లాంటిది.
జీవితానికి కవిత్వం ఒక ఆకర్షణ అవుతుంది,
కవిత్వానికి జీవితం ఆలంబన అవుతుంది.
కవిత్వం సృశించని జీవితం ఉండవచ్చు
కానీ,జీవితంసృజించని కవిత్వం ఉండదు.
జీవితం కవిత్వాన్నికల్పించ గలదు,
కానీ,కవిత్వం జీవితాన్నిసృష్టించలేదు.
భావనాకాశంలోస్పందనలతో మెరిసే తార కవిత్వం,
సహజత్వంతో కురిసే సంఘటనల ధార జీవితం.
కవిత్వం జీవితానికి ఆహ్లాదాన్నిస్తే,
జీవితం కవిత్వానికి ఆదరణ ఇస్తుంది.

భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
ఏకాంతం నుండి ఏకాంతం లోనికి
చూపంచున
పుత్తడి వెలుగుల సవిత్రోదయం
నెత్తి మీద
తెలిమబ్బుల ఓడల నీలి సముద్రం
కాళ్ళ కింద
హిమ తారలు మెరిసే హరితాకాశం
ఎదుట
గాత్రం నిండా నిర్ఝరు లురికే తరు గాలవం
దాని కొమ్మల శిఖల్లో
విచ్చుకొనే పక్షుల మొగ్గలు
శిశిరం
దిక్కులకు అమూర్త చిత్రాలు గీస్తూ
దారుల్ని రంగుల సొరంగాలుగా తొలుస్తూ
అంతటా కొత్తదనం , అనిర్వచనీయం!
ఈ ప్రాతర్వేళ
'మోదం' ఉచ్చ్వాసనిశ్వాసలై
దృశ్యం నుండి దృశ్యంలోకి జన్మమెత్తుతూ
ఎగిరిపోతోంది మనో విహంగం
ఏకాంతం నుండి ఏకాంతం లోనికి

వి.ఆర్. విద్యార్థి
ఎలా చెప్పేది?
ఆటోలో ఇరుకిరుకు ప్రయాణం
పక్కనే పసివానితో పసిడి దంపతులు
పసి పాదాల పూవుల తన్నుల ప్రసాదం నాకు
తప్పు తప్పు అంటూ
అడ్దకునే తాపత్రయపు తండ్రి
ఎలా చెప్పేది?
తన్నులతో నేను తన్మయత్వం పొందుతున్నానని...
తాకిడికై నేను తపిస్తానని, తహతహలాడుతానని...
దిష్టి చుక్క
అమ్మమ్మ ఒడిలో పాపాయి
పాపాయి బుగ్గపై దిష్టి చుక్క
దివ్యలోకాల్లోని చుక్కల్లోని
అమ్మ, అమ్మమ్మ పొత్తిళ్లలోకి
చేర్చింది నన్ను

లలితానంద్