
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
“శ్రీని” వ్యాస వాణి
Vote is your fate... Don't wait!

శ్రీనివాస్ పెండ్యాల
ఐదు సంవత్సరాలు వెనక్కి వెళితే రమా రమి ఈ రోజుల్లో దేశం మొత్త్తాన్ని ఏక తాటిపైకి తెస్తూ.. అవినీతిని పొలిమేరలు దాటిస్తాను, నల్ల ధనానికి తెల్లటి వెలుగు చూపిస్తాను, రాష్ట్రాలకు స్వయం సమృద్దినిచ్చే అచ్చేదిన్ తో స్వచ్ఛ భారతాన్ని తిరిగి సృష్టిస్తాను అని ఘనంగా చాటుతూ మాధ్యమం ఏదైనా తన అఖండ ప్రసంగ ఖడ్గప్రహారంలో మోడి రథ చక్రాలు కదిలిన రోజులు... "మాట ఇస్తున్నా, నమ్మండి...మంచి దేశాన్ని నిర్మిద్దాం కదలండి" అంటూ... మళ్లీ వస్తే నా ప్రోగ్రెస్ కార్డు చూపించే ఓటు అడుగుతా అని చేసిన భీషణ ప్రతిజ్ఞలు మన కర్ణభేరుల్లో ఇంకా మారు మ్రోగుతూనే వున్నాయి... కాలాన్ని కట్ చేస్తే.. నిజం స్వాప్నికం కాదు... సాక్ష్యం చెప్పకా మానదు...ప్రోగ్రెస్ కార్డు మాట దేవుడెరుగు.. కనీసం ఏ సబ్జెక్టులో మూల్యాంకనం చేయాలో కూడా చెప్పకుండా మళ్లీ ఎన్నికల ప్రసంగ హేళి అప్రతిహతంగా కొనసాగించే 'మొండి''షా'ల ధోరణి గత కాలపు కాంగ్రెస్ ప్రభుత్వాలకు నకలుగానే గోచరిస్తుంది.
దేశాన్ని కుదిపేసిన నోట్ల రద్దు, బ్యాంకుల జాతీయావినీతికరణ, ప్రధాని ప్రవాస విహార భారం, పొరుగు దేశాల స్నేహబంధం, ఏకీకృత పన్ను విధానం, నీతీ అ'యోగ్యం', ఆర్ధిక నేరగాళ్ళ సరిహద్దు దాటింపు, లాంటివేవీ ప్రచార సరళిని ప్రభావితం చేయకపోవడం ప్రధాని అసమర్ధతకి ఒప్పుకోలుగా లేదా ప్రతిపక్షాల పక్షవాతం గానే చూడవలసి వస్తుంది. పంచ్ ప్రసంగాలే ప్రమాణాలైతే మన సినిమాలలో అవి పుష్కళం. దానికి ఇంత ఖరీదైన ఎన్నికలు అవసరమా అని ఆలోచించవలసిందే. సమాఖ్య స్పూర్తిని కాలరాస్తూ రాష్త్రాలను సామంత రాజ్యాలుగా, భిక్షాటన కేద్రాలుగా మారుస్తున్న ప్రస్తుత విధానాలు విప్లవాలకు బీజాలుగాను, దేశ సమగ్రతకు రాబోయే పెను ముప్పుగానూ మారబోతున్న సూచనలు అందిస్తున్నాయి. బహుశా ఇలాంటి పరిస్థితిని రాజ్యాంగ నిర్మాతలు కూడా ఊహించి వుండరు.
ఇక 'తెగులు' రాష్ట్రాల విషయానికొస్తే...
ఇటు తెలంగాణాలో, పార్టీ ఏదైనా, ఎన్నికల తరువాత అంతా కలిసే పనిచేసుకుందాం... మనకు ప్రతిపక్షాలు అవసరమా అని పొలికేక పెడుతున్న తెలం'గానం' ప్రజాస్వామ్యానికి పట్టిన తెగులుగానే భావించాలి. తాను గత కాలంలో నష్టపోయిన నిజాన్ని ఒకమారు రుచి చూపించి సత్సంప్రదాయాలని పునరుద్దరించడం నాయకత్వ లక్షణం. ఇది మితిమీరి పెరిగితే, విరుగుట కు నాందిగా మారే ప్రమాదముంది.
అటు పేదాంధ్రప్రదేశ్ లో రాజకీయ విన్యాసాలు క్రొత్త పుంతలు తొక్కుతున్నవి. రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వుండాలో, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టాలో, స్థానిక ప్రజలు కాక కేంద్రం మరియు,పొరుగు రాష్ట్రాలు శాసించడం, దానికి రాజకీయ ప్రముఖులు నాట్యమాడడం భావదారిద్రానికి పరాకాష్ట. దోచుకోవడానికేమున్నది దమ్మిడీ ఆదాయం లేని బ్రతుకులు అనుకునే సామాన్య జనానికి, ఏది కుట్రో, ఏది నిజమో తేల్చుకునేలోపే తెల్లారి పోతుంది...ఏం చేసాం లేదా చేస్తాం లాంటి విషయాలు కాకుండా... ఎంత తిట్టాం అని లెక్కలేసుకునే రాజకీయాలకు ఇకనైనా సెలవు పలకాలని కోరుకుందాం.
ఇన్ని అవలక్షణాలతో పెనవేసుకున్న రాజకీయ చక్రబంధంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజాస్వామ్యానికి స్వాంతన నిచ్చే ఏకైక మార్గం- ఓటు! 'తీరాలు దాటి కాలాలు గడిచాయి ' అనుకొని నిట్టూర్చే సగటు అ'భారతీయులు' చేయవలసిన కనీస ధర్మం- దేశంలో వున్నా, లేకున్నా... ఓటు వున్నా, లేకున్నా... ఓపిక వున్నా లేకున్నా... తెలిసిన పది మందికి ఓటు ప్రాధాన్యాన్ని నాలుగు మంచి మాటల్లో చెప్పి దాన్ని ఆవేశానికి కాకుండా ఆలోచన దరికి చేర్చ గలిగితే జన్మనిచ్చిన అవని రుణం కొంతైనా తీరుతుంది... లేకపోతే అదేదో సినిమాలో చెప్పినట్లు లావైపోతారు సుమా!
Vote is your fate... Don't wait!!
****