![](https://static.wixstatic.com/media/db2537_42ac21b14753456ba22d53f0b5bb1291~mv2.jpg/v1/fill/w_1440,h_900,al_c,q_85,enc_avif,quality_auto/db2537_42ac21b14753456ba22d53f0b5bb1291~mv2.jpg)
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
![abboori.jpg](https://static.wixstatic.com/media/db2537_7faa8dc393e2431e86d808fcb7ae8d50~mv2.jpg/v1/fill/w_449,h_273,al_c,q_80,usm_0.66_1.00_0.01,enc_avif,quality_auto/abboori.jpg)
మంచి తెలుగు కథ అనగానే నాకు ముందు జ్ఞాపకం వచ్చే పేరు అబ్బూరి ఛాయా దేవి గారిదే. స్త్రీ వాదం అనే ముద్ర లేకుండా ఆమె రచించిన చాలా కథలు స్త్రీ వాదానికి గౌరవం తెచ్చిపెట్టిన కథలు.
ఆమెతో అనుకోని పరిస్థితులలో నాకు పరిచయం అయింది.
1993 లో ఆమె భర్త, ప్రముఖ రచయిత అబ్బూరి వరద రాజేశ్వర రావు గారు ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనకీ అమెరికా మందులు పంపించడానికి ఆయన సోదరి, మా హ్యూస్థన్ నివాసి, ఎంతో ఆప్తురాలు అయిన చాయా జానకి ప్రయత్నాలకి నేను సహకరించిన సందర్భంలో ఛాయా దేవి గారితో నాకు పరోక్షంగా పరిచయం కలిగింది.
వరద గారు పరమపదించిన తరువాత నేను ఇండియా ఎప్పుడు వెళ్ళినా హిమాయత్ నగర్ లో వారి ఇంటికి వెళ్లి పలకరించే వాడిని. ఎక్కడ చూసినా పుస్తకాలు, చిత్ర పటాలు, పువ్వులతో వారి ఇంట్లో అంతా పూర్తిగా సాహిత్య వాతావరణమే. ఆప్యాయంగా పలకరించడం, వరద రాజేశ్వర రావు, శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైన వారి హాస్య సంభాషణలని ఏకరువు పెడుతూనే తాము స్థాపించిన “కవిత” పత్రికకి ఆదిలోనే హంస పాదు లాంటి విఘ్నాలని సరదాగా పంచుకోవడం, తాము అమెరికాలో మేడిసన్ లో 1963 లో వరద రాజేశ్వర రావు గారు విస్కాన్సిన్ విశ్వ విద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నప్పటి అనుభవాలు, అన్నింటికన్నా ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళి.నా ఏదో ఒక మంచి పుస్తకం నాకు బహుకరించడం నాకు వ్యక్తిగతంగా మర్చిపోలేని జ్ఞాపకాలు.
అంతే కాదు. హైదరాబాద్ లో మేము ఎప్పుడు సాహిత్య సభ పెట్టినా, మా మొదటి ఆహ్వానం ఆవిడకే. పిలవగానే ఆమె ఏ విధమైన భేషజం లేకుండా సభకి వచ్చి, ఏ సాహిత్యపరమైన అంశం మీదనైనా తను కూలంకషంగా తయారు చేసుకుని వచ్చి, అనర్గళంగా ఉపన్యసించే వారు. ఆమె వ్రాసిన బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం, సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్‌రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. 2005లో ఆమెకి కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారు బహుమతి ఇచ్చి తమని తామే గౌరవించుకున్నారు. ఆమెని చూసినా, ఆమె వ్యక్తిగతంగా మనతో కానీ, వేదిక మీద కానీ మాట్లాడినా ఆమె అధిరోహించిన సాహిత్య శిఖరాలు ఎవరైనా చెప్తే కానీ మనకి తెలియకుండా జాగ్రత్త పడిన నిగర్వి అబ్బూరి ఛాయా దేవి గారు.
తెలుగు సాహిత్యానికి, ముఖ్యంగా కథా ప్రక్రియకి అబ్బూరి ఛాయా దేవి గారు చేసిన సేవ అనితర సాధ్యం. జూన్ 28, 2019 నాడు తన 86వ ఏట పరమపదించిన అబ్బూరి ఛాయా దేవి గారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్ధిస్తూ ఈ మధుర వాణి సంచిక ఆమె దివ్య స్మృతికి అంకితం ఇస్తున్నాం.
భవదీయులు
వంగూరి చిట్టెన్ రాజు
మధురవాణి సంపాదక బృందం