top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... 11

గొల్లపూడి మారుతీ రావు

 

1980 జనవరి 1:

 

దాదాపు హాంగోవర్‌తో లేచాను. ఫోన్ మోగింది.

"నేను రామారావునండి".

"ఏ రామారావు?"

నవ్వి "హ్హా..హ్హా. ఎన్.టీ.రామారావు" తుళ్ళిపడ్డాను. షాక్ అయాను.

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ముందు రోజు రాత్రి అందరూ చేసే పనే నేనూ చేశాను. పార్టీ ఎక్కడో గుర్తులేదు కాని, గతరాత్రి వైభవం తలలో ఇంకా ఉంది. పొద్దుటే ఎన్.టీ.రామారావుగారి బావమరిది రుక్మాంగదరావుగారి బావమరిది రాంబాబు నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చాడు. ఇంకా కొత్త సంవత్సరం మత్తుగా ఉంది. ఉన్నట్టుండి ఫోన్ మోగింది. పొద్దుటే మరీ ఆత్మీయులైన మిత్రులు అంత వేకువనే ఫోన్ చేస్తారు. మత్తుగానే ఫోన్ ఎత్తాను. "ఎవరు?"

"రామారావునండి"

ఆ చిన్ని వ్యవధిలోనే మెదడు పది, పన్నెండు రామారావులను గుర్తుకు తెచ్చుకుంది. ముందు రోడ్డులోనే మిత్రుడు తాతినేని రామారావు ఉన్నాడు. ఎక్కువ తాగడు.

"ఏమయ్యా, రాత్రి మందు దిగిందా?".. ఇదీ నా మనసులోకి వచ్చిన రెస్పాన్స్.

దేవుడు మేలు చేసి అనలేదు. కాని " ఏ రామారావు?" అన్నాను కాస్త నిర్లక్ష్యంగా, కొంచెం కొత్త సంవత్సరం సరదాతోనే. అటు బాంబు పేలింది.

"హ్హా. హ్హా.. నేను ఎన్.టీ.రామారావుని"

అంతే. చేతిలో ఫోన్ జారిపోలేదు. ఎదురుగా మా ఆవిడ. రాంబాబు. చెప్పీ చేయకుండా పొద్దున్నే.. అదీ కొత్త సంవత్సరం ప్రారంభించే ఉదయం.. ఎన్.టీ.రామారావుగారు.

"సార్! నూతన సంవత్సర..."మాటలు పెగిలాయి.

ఆయన పొద్దుటే 3 గంటలకి లేచి ఉంటారు. కొత్త సంవత్సరంలోకి 3 గంటల ముందే అడుగుపెట్టి ఉంటారు. గొంతు పవిత్రంగా, తుపాకీలాగ ఉంది.

సాధారణంగా ఆయన అడగని ప్రశ్న: "స్నానం చేశారా?"

కొత్త సంవత్సరంలో మొదటి అబద్ధం ఆడాను. "అయింది సార్"

"అయితే ఒకసారి ఇంటికి రండి"ఫోన్ పెట్టేసారు.

ఆదరాబాదరాగా స్నానం చేసి ఆయన ఇంటికి పరిగెత్తాను. అప్పటికే ఆయనకి శుభాకాంక్షలు చెప్పడానికి నిర్మాతలు, హితులు, అభిమానుల గుంపు ఉంది. కాని నేను ఆనాడు  ప్రత్యేక ఆహ్వానితుడిని. సరాసరి లోపలికి పంపాడు సెక్రటరీ. "మీకోసం ఎదురు చూస్తున్నారం”టూ.

గదిలో దర్శకుడు బాపయ్యగారున్నారు. ఎదురుగా పవిత్రమైన గంధ పరిమళంతో అన్నగారు. "రండి. వీరు మీకు తెలుసా?"అన్నారు బాపయ్యగారిని చూపుతూ. ఆయన  మా ఇంటికి ఎదురుగా ఉన్న ప్రముఖ దర్శకులు కె.ఎస్.ప్రకాశరావుగారి బంధువు. బాపయ్యగారికి ప్రకాశరావుగారు గాడ్ ఫాధర్. ఇద్దర్ని చాలాసార్లు కలిశాం. ఆ మాటే చెప్పాను.

ఎన్.టీ.రామారావుగారు ఆ రోజే.. బహుశా కొద్దిసేపట్లోనే హైదరాబాదు వెళ్తున్నారు. వారి పౌరాణిక చిత్రం షూటింగుకి. ఒక నెలరోజుల మకాం. ఈలోగా బాలయ్య (కొడుకు బాలకృష్ణ)తో కలిసి సినిమాకి ఏర్పాట్లు చేయాలి. బాపయ్యగారిని దర్శకులుగా నిర్ణయించారు. వారి మధ్య మాటల్లో సంభాషణా రచనకి నా పేరు స్థిరపడింది. అదీ ఫోన్ వెనుక కథ.

"బాలయ్య నటించే సినిమాకి వీరు దర్శకత్వం చేస్తారు. మీరు సంభాషణలు రాయాలి. మీ పేరు చెప్పగానే ఆయనా ఆనందించారు" అన్నారు ఎన్.టీ.ఆర్.(తరువాత నేను రాసిన చిత్రం పేరు "నిప్పురవ్వ")

బాపయ్యగారికి శలవిచ్చి పంపాక, తను కూర్చున టేబిలు సొరుగు తీశారు. చెక్కు బుక్కు తీసి నాకు అడ్వాన్స్ చెక్కు రాసి చేతిలో పెట్టారు. నూతన సంవత్సరం ఎన్.టీ.ఆర్ ఫోన్‌తో ప్రారంభం కావడం, కొత్త చిత్రానికి మొదటి చెక్కువారిదే కావడం ఎంత శుభసూచకం.

 

ఇంటికి వచ్చాక చెక్కుని చూసుకున్నాను. వెయ్యిన్నూట పదహార్లు. అన్నగారి చెక్కులు నీరసంగా ఉంటాయని ఒక మాట సినీవర్గాలలో ఉంది. ఆయన చేతి వ్రాత ముత్యాల కోవ. ఇక సంతకం సరేసరి. ఆ చెక్కుని ఆప్యాయంగా అందుకుని, కేవలం అన్నగారు ఇచ్చిన సెంటిమెంటుకి, ఆయన చేతివ్రాత, నా పేరుకి గుర్తుగా ఆ చెక్కుని భద్రంగా దాచిపెడతానంది మా ఆవిడ. చెక్కు సెంటిమెంటుకన్నా వెయ్యిన్నూట పదహార్లు ముఖ్యమని ఆవిడని ఒప్పించడానికి రెండు మూడు రోజులు పట్టింది.

సరే అంత ప్రముఖులు మాట్లాడాలనుకున్నప్పుడు ముందుగా సెక్రటరీనో, మరెవరో మాట్లాడి అవతలి మనిషిని సిద్ధం చెయ్యడం సబబు. కాని అన్నగారి విషయంలో అది కుదరని పని. కారణం ఆయన ఆవేశి. కాగా, అప్పటి ఆయన నిర్ణయం బయటపడడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఆయన కారణాలకి, ఏమైనా ఎన్.టీఆర్ సరాసరి ఫోన్ చెయ్యడం అస్మదాదులకు గర్వకారణమే కాని, ఇబ్బంది కూడా.

ఈ ఫోన్‌కాల్ తతంగం చూసిన ఎన్.టీ.రామారావుగారి బావగారి బావగారు రాంబాబు రెచ్చిపోయాడు. అప్పటికి ఎన్.టీ.ఆర్‌తో "టాక్సీడ్రైవర్" సినిమా వార్తలు గాలిలో ఉన్నాయి. "మీరు "టాక్సీడ్రైవర్" సినిమా ఎందుకు డైరెక్ట్ చెయ్యకూడదు. నేను నవ్వుకున్నాను. తరువాత "టాక్సీడ్రైవర్" రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.

వ్యాపార రంగంలో కొందరి చొరవ కొన్ని దశల వరకే చెల్లుతుంది.

 

*****

కొన్నేళ్ల కిందటిమాట. అఫ్పటికి నా ఇంట్లో ఫోన్ లేదు. ఇంటి ముందు వాటాలో యడవల్లి రమ కుటుంబం ఉండేవారు. నాతో అన్నగారు మాట్లాడాలి. ఎవరో యడవల్లి రమ ఇంటి ఫోన్ గురించి చెప్పి ఉంటారు. ఒక రోజు. బ్రహ్మయ్య అండ్ కో ఆడిటర్లలో ఒకరి(పేరు గుర్తు లేదు) సినిమా కోసం ఆయనే స్వయంగా యడవల్లి రమ ఇంటికి ఫోన్ చేసారు. తీరా అక్కడి మనిషి వచ్చి నన్ను పిలిచేదాకా అటువైపు ఫోన్ పట్టుకుని వేచి ఉన్నారు. ఇది చాలా ఇబ్బందికరమైన సందర్భం.

మరొక మధ్యాహ్నం.. ఆలిండియా రేడియోలో నా గదిలో (తెలుగు విభాగం) ఫోన్ మోగింది. ఆఫీసు ఫోన్ ముందు ఆపరేటర్ వడపోతకి గురయ్యాక మాకు చేరుతుంది. కనుక.. ఉపోద్ఘాతం లేకుండా నా పేరు చెప్పడం సంప్రదాయం. తీరా అటునుంచి "నేను రామారావుని" అని గొంతు.

పనిలో ఉన్నానేమో కాస్త అధికారమూ, విసుగూ, పెత్తనమూ కలిసి రాగా "ఏ రామారావు?" అన్నాను.

యధాప్రకారంగా చిన్న నవ్వు. "ఎన్.టి.రామారావు"

యధాప్రకారంగా తుళ్ళిపడ్డాను. ఆపరేటర్ ప్రశ్నలను దాటి.. నా దాకా ఆయనే స్వయంగా ఫోన్ చేసిన మూడో సందర్భమది.

 

అప్పటికి రీడర్స్ డైజెస్టులో సంక్షిప్త నవలగా వచ్చిన లూయీ థామస్ రచన "గుడ్ చిల్డ్రెన్ డోంట్ కిల్" ఆధారంగా హిందీలో నిర్మించిన "ఖేల్ ఖేల్ మే" చిత్రాన్ని బాలకృష్ణ హీరోగా తీయాలని నిర్ణయించి నాకూ, ప్రముఖ దర్శకుడు ఎస్.డి.లాల్‌కీ ఆ సినిమా ప్రొజెక్షన్ ఆ సాయంకాలం చూపించాలని ఫోన్. బహుషా ఈ నిర్ణయం ఇంకా కాలేదు కనుక, ఎవరికీ తెలియకూడదని ఆయన భావించవచ్చు. ఏమయినా.. రద్దీగా ఉండే ఆఫీసులో ముమ్మరంలో హఠాత్తుగా వచ్చిపడిన అన్నగారి ఫోన్.

ఇవన్నీ ఒక విధంగా అపురూపమయిన సందర్భాలు. ఆ క్షణంలో ఇబ్బందికరమైన క్షణాలు. అన్నగారి నిర్ణయాలు, చర్యలూ ఎప్పుడూ కొత్తగా, ఆవేశపరంగా, హఠాత్తుగా, కొండొకచో ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ విషయాన్ని తరువాతి కాలంలో రాజకీయ రంగంలో ఆయన నిరూపించారు. ఆవేశం, సంకల్ప బలం వారి సంతకం.

 

*****

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

bottom of page