Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
దాంపత్య జీవనం
ఎర్రాప్రగడ రామకృష్ణ
పరమాద్భుత కళాకారుడైన భగవంతుడి సృజనపౌరుషానికి సజీవ సాక్ష్యమే ఈ సృష్టి.
ఇది ఆయన గీసిన బొమ్మ. ఆయన చేసిన రచన. ఆయన భావుక మహాసౌందర్య శోభ.. ప్రకృతిలోని ప్రతి అణువునా ప్రతిఫలిస్తుంది. సమ్మోహనంగా తోస్తుంది. దాని శ్రేష్తతకు సౌందర్యమే ప్రమాణం.
భగవంతుడి సృజనలో ఒక పరమ రహస్యం దాగి ఉంది. ఈ సృష్టిలో సజీవ సౌందర్య స్పర్శతో అలరారే ఉదాత్త సోయగాలన్నీ స్త్రీ ప్రకృతికి చెందిన అపురూప చిహ్నాలే. స్త్రీత్వపు స్పర్శలేని సౌందర్యమే లేదు. దేవుడు స్త్రీ పక్షపాతి అనిపించడానికి కారణం. ఈ సృష్టిలో సొగసైనవన్నీ స్త్రీ ప్రకృతి రమణీయకతలో రంగులద్దుకున్నవే. సోయగం, సొగసు, లాలిత్యం, సౌకుమార్యం వంటి సృష్టి శ్రేష్టలన్నీ స్త్రీ ప్రకృతి సొత్తులు. వాటి అన్నింటినీ గొప్పగా రంజింప చేయాలనీ, స్వంతం చేసుకుని, వాటిని తనివిదీరా వాదించాలని తహతహలాడటం. పురుష ప్రకృతి లక్షణం. సౌందర్యమూర్తిమత్వం -స్త్రీతత్వం. సౌందర్య పిపాస - పురుషతత్వం. అటువైపుది ఆకర్షణ - ఇటువైపుది ఆరాధన. వారిది సమర్పణ - వీరిది లాలన. స్త్రీ పురుష ప్రకృత్తుల మధ్య ఈ శృంగార సంఘర్షణలోనే సృష్టి యావత్తూ ప్రభవిస్తుంది. క్రీడిస్తుంది. చివరకు లయిస్తుంది. సరికొత్త చిగుళ్ళతో మళ్ళీ పుడుతుంది. ఆనందిస్తుంది. నశిస్తుంది. ఇది సృష్టి చక్రభ్రమణ సూత్రం. యుగయుగాలుగా సకల జీవరాశుల మధ్యా ఈ తంతు సజావుగా సాగిపోతూ వస్తోంది.
మానవజాతి దగ్గరకు వచ్చేసరికి ఆకర్షణ - లాలన క్రమంగా అడ్డదారుల్లో పరుగులు ఆరంభించాయి. వావీ, వరుసా, సమయం సందర్భం, ఉచితం అనుచితం, ఇష్టాయిష్టాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయి. స్త్రీ పురుష ప్రకృతులలోని వికృత స్వభావాన్ని నియంత్రించవలసిన ఆగత్యం ఏర్పడింది. నాగరీకమైన ఒక కట్టుబాటు అవసరమైంది. ఫలితంగా వివాహ వ్యవస్థ నిర్మాణమైంది. వేదం నిర్దేశించిన ఈ వ్యవస్థ మానవజాతి శారీరక అవసరాలను తీర్చింది. మానసిక బంధాలను కూర్చింది. అనురాగ మాధుర్యాన్ని జతపర్చింది ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చింది. భారతీయ వివాహ వ్యవస్థ వాస్తవానికి స్త్రీ, పురుష సర్వేంద్రియ సంతర్పణకు దోహదకారి. ఆత్మీయ శిఖరాయమాన పరిపూర్ణ దాంపత్య అపూర్వ అద్వైత అనుభూతికి సహాయకారి.
భారతీయ సంస్కృతిలో వివాహమనేది ఒకానొక గొప్ప సంస్కార విశేషం. అగ్నిసాక్షిగా బలపడే ఏడడుగుల బంధం. అద్భుతం అనే మాటను ఒకే అక్షరంలో చెబితే అది స్త్రీ ఆ అద్భుతాన్ని పురుషుడికి సొంతం చేసే రెండక్షరాల ప్రక్రియ పేరు పెళ్ళి. మూడుముళ్ళతో మొదలయ్యే నూరేళ్ళ బంధాన్ని మూడు అక్షరాలలో పలికితే అది దాంపత్యం. దాంపత్య జీవనంలో స్త్రీ అనే వీణను అమోఘంగా శ్రుతి చేయగల గొప్ప విద్వాంసుడి నాలుగు అక్షరాల పేరు - పురుషుడు. అలా వారిద్దరి మధ్య ఏర్పడే ఆత్మీయ బంధానికి అయిదక్షరాల మాట - భార్యాభర్తలు. ఆడ, మగ - ఆలుమగలయ్యే క్రమానికి ప్రామాణికతను ఆపాదించే ఆరు అక్షరాల తంతు పేరు "వైదిక ప్రక్రియ". వేద ప్రమాణాన్ని ఆచరించే భార్యాభర్తలు తమ తలకెత్తుకునే ఏడక్షరాల గొప్ప బాధ్యత - గృహస్థాశ్రమ ధర్మం. ఇదే సప్తపది. ఏడు అంచెల జీవన మాంగల్య మహాసూత్రం.
ఏడు అడుగులతో పురుషుడి జీవితంలోకి ప్రవేశించే స్త్రీ. అప్పటిదాకా తన వెంట వచ్చిన ఇంటిపేరును, గోత్రాన్ని, ప్రాణమింత్రుల్ని, అన్నదమ్ముల్ని, ఆఖరికి తన తల్లిదండ్రులను, వారి గారాబాన్ని అన్నీ విడిచిపెట్టి వస్తుంది.
ఇకపై తన భర్త నుండి ఆ వదులుకున్నవన్నీ పొందగలనన్న నమ్మకంతో వస్తుంది. అందుకే పెళ్ళిచూపులలో 'భావం' కలగాలని వేదం అంటుంది. 'ఈమె నా కోసం పుట్టింది' అనే భావం పురుషుడికి కలగాలి. "ఇతడు నాకొరకై ఉన్నాడు" అన్న భరోసా స్త్రీకి కలగాలి. సప్తపది మంత్రాలలో పురుషుడి నోట పలికించే వాగ్ధానం అదే. "ఏడడుగులు నాతో నడిచి మిత్రురాలివికా. ఒకరినొకరు చక్కని స్నేహితులమై జీవిత పర్యంతం కలసి నడుద్దాం" అని పురుషుడు పలుకుతాడు.
నిజానికి సుమూహర్తం అంటే.. బెల్లం, జీలకర్ర తంతు కాదు. తొలిచూపులో పురుషుడి కంటి నుండి స్త్రీకి సర్వభద్రంకరమైన ఆ భరోసా ప్రసారమయ్యే క్షణాన్నే శుభముహూర్తం అనాలి.
తెర తొలగించాక జరిగే ఈ తంతునే చక్షుసంయోగం అంటారు. అది చూపుల కలయిక. ఆ సమయంలో మంచి మనసుతో చేసిన ఆ వాగ్ధానాన్ని పురుషుడు జీవితాంతం నిలబెట్టుకోవాలి. భర్త సమక్షంలో ఉండే సమయంలో స్త్రీకి తండ్రి గుర్తొచ్చినా బెంగ కలగకూడడు. తల్లి దగ్గర లేదన్న లోటు తెలియకూడదు. తోబుట్టువులు, స్నేహితులు.. ఎవరి గురించీ దిగులు పుట్టకూడదు. వారి నుండి గతంలో ఆమె ఎన్నెన్ని రకాల ఆప్యాయతలను పొందిందో, అన్ని రకాలనూ ఆమె తన భర్త నుండి అందుకోగల్గాలి. పురుషుడు స్త్రీకి అన్ని రకాల చుట్టం అవ్వాలి. అన్ని కోణాల్లోంచీ బంధువు అవ్వాలి. స్పర్శతో, మాటలో, చేతలో, చూపులో, అంతెందుకు "తన" పురుషుడి స్మరణ మాత్రం చేత స్త్రీ మనసు రాగరంజితం, రసస్ఫోరకం కావాలి. పురుషుడు స్త్రీకి సఖుడవ్వాలంది వేదం. సఖ్యం అనే మాట పెళ్ళి మంత్రాలలో విశేషంగా ధ్వనిస్తుంది. పైన చెప్పిన ప్రతి చేష్టలోనూ స్త్రీకి "సఖ్యత" అనేది అనుభవంలోకి రావాలి. అతని లాలనలో ఆమె అనుక్షణం పరవశం చెందుతూ ఉండాలి. ఆమె గుండెలో అది ఒకానొక ఆకుపచ్చని పులకరింతగా స్థిరపడి, అతడు ఎక్కడున్నా చెంతనే తనకు తోడుగా ఉన్నాడన్న భావం కలిగిస్తూ, అనుభూతి పరిమళాన్ని పంచుతూ ఉండాలి. దీన్నే "సర్వేంద్రియ సంతర్పణం" అంటారు. స్త్రీలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుందంది. అటువంటి పురుషుడికి స్త్రీ తన సర్వస్వాన్నీ ఇష్టంగా ధారపోస్తుంది. ఆమె అలా చేయాలంటే పురుషుడు రసజ్ఞ మనోజ్ఞ ప్రతిభామూర్తి (రొమాంటీక్ పర్సనాలిటీ) అయి ఉండాలి. "ఈ సృష్టిలో కృష్ణుడొక్కడే పురుషుడు" అని మీరాబాయి అనడంలో అంతరార్ధం అదే. "మొగుడవడానికి మొలతాడు ఒక్కటే చాలదు"అన్న మోటు సామెత అందుకే పుట్టింది. భార్య పస్తులుంటే భర్తకు అన్నం సహించని స్థితి కలగాలి. ఆమెకు కష్టమొస్తే తనకు నొప్పి తెలియాలి. ఇంటి దగ్గర ఆమె ఒంటరిగా ఉందని ఏదో తెలియని దిగులులాంటిది మనసుకు తోడాలి. త్వరగా ఇల్లు చేరాలన్న ఆరాటం కలగాలి. తహతహ పుట్టాలి.
ఇవన్నీ మళ్ళీ స్త్రీకి వర్తిస్తాయి. దాంపత్యబంధంలోని చమత్కారం అదే. స్త్రీకి గౌరవ వాచకం ఇల్లాలు. ఇల్లాలికి గౌరవ వాచకం తల్లి. ఆ రెండు హోదాలనూ స్త్రీకి కట్టబెట్టేది వివాహబంధమే.
స్త్రీ జీవితంలో సర్వశ్రేష్టమైన ఆనందం అనుభవమయ్యేది. అమ్మ అయినప్పుడే. స్త్రీ జన్మకు తల్లి అవడమే ధన్యత. తనకు సర్వేంద్రియ సంతృప్తిని చేకూర్చి, తన పుట్టుకను పునీతం చేసే భర్తకు తనను తాను సంపూర్ణంగా సమర్పణం చేసుకుని స్త్రీ తరించాలి. తనకు అమ్మదనాన్ని కట్టబెట్టి, భర్త తన ఒడిలో బిడ్డడయ్యాడన్న ఒకానొక అపురూప భావనతో స్త్రీ అద్వైత స్థితిని పొందాలి. అ స్థితిలో జన్మించిన సంతానాన్ని 'ఆనందగంధి' అన్నాడు భవభూతి.
భార్యాభర్తలను వేదం దంపతులు అనదు. 'దంపతి' అంటుంది. ఆలాంటి అద్వైతస్థితిలో అతడు పూవయితే ఆమె పరిమళం. అతడు చంద్రుడైతే ఆమె వెన్నెల. అతడు దీపం.. ఆమె వెలుగు. అతడు వాక్కు అయితే ఆమె దాని అర్ధం.
కుమారసంభవంలోని వాగర్ధా శ్లోకంలో శివపార్వతుల బంధాన్ని కాళిదాసు అలానే కీర్తించాడు. ఆలుమగలు ఆడది మగాడిగా మిగిలిపోకుండా దంపతిగా మారినప్పుడే - సమభాగం, సమయోగం అన్న అద్భుత భావన సార్ధకం అవుతుంది.
ఇది భారతీయ దాంపత్య రసయోగంలోని సారాంశం.
స్త్రీ పురుషులు తప్పనిసరిగా అధ్యయనం చేయవలసిన పాఠ్యాంశం.
*****
ఎర్రాప్రగడ రామకృష్ణ
ఎర్రాప్రగడ రామక్రిష్ణ గారు ఈనాడు ఆదివారం పత్రిక 'అంతర్యామి ' శీర్షికకి సంపాదకులుగా సాహితీబంధువులందరికీ సుపరిచితులు.
తిరుపతి లో శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలలోనూ, భద్రాచలం లో సీతారామకళ్యాణ మహోత్సవాల్లోనూ వ్యాఖ్యాతగా వ్యవహరించే వీరికి ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ఆసక్తికరంగా ప్రజల్లోకి తీసుకెళ్ళటం వెన్నతో పెట్టిన విద్య.
తెలుగు పద్యాలపై పట్టు, వాటిని పలకటంపై సాధికారత వీరి సొంతం.
