top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

భలే, ఇతనొక భవభూతి!

రచయిత: టి. జానకిరామన్

అనువాదం: ఏండీ సుందరేశన్  

అరవైలలో టి. జానకీరామన్ గారు రచించిన ఈ తమిళ మూలకథ "కోయంబత్తూర్ భవభూతి" ప్రసిద్ధ తమిళ మాస పత్రిక- "కళైమగళ్" ప్రచురించబడింది. 
సుందరేశన్ గారు చేసిన ఈ తెలుగు అనువాదం - మన అలనాటి మధురాలకై ప్రత్యేకం.

అబ్బా, ఏం ఎండ? ఎండ నిప్పులు చెరుగుతోంది! ఒక ఆకూ కదిలినట్టు కనిపించదు. ఇంటిలో ఒకచోట స్థిరంగా కూర్చుందామంటే మనసు ఒప్పదు; ఉక్కగావుంది. బయటికి వెళ్లి సిమెంటు వసారాలో కొంచెం చల్లార్చుకుందామని గబగబ నడిచి వెళ్ళాను.

 

అమ్మ ఎవరితోనో మాటాడుతోంది. అతనొక ముసలాయన - కుడికాలు వసారామీద ముడుచుకొనివుంది, ఎడంకాలు నేల వేలాడుతోంది - మాటాడుతున్నారు. నేను ముందెప్పుడూ చూడని మొహం, కాని అందులో కానవచ్చిన కాంతి, తేజస్సు, నాకు పరిచయమే. వివేకం, అనుభవం, నీతి, నిజాయితీ - ఇవన్నీ వర్ధిల్లే చాలా మనుషుల మొహాల్లో నేను ఆ కాంతి చూసివున్నాను.

 

వయసు అరనైఐదుకి తగ్గదు. పొడుగాటి మొహం. నిక్కబొడుచుకున్న దేహం, కాని కంఠధ్వనిలో, వైఖరిలో ముసలితనం వచ్చేసింది. తల ముందు భాగంలో వెండ్రుకలు లేపు. వెనుక భాగంలో దండిగా పెరిగిన నెఱసిన జుత్తుని ఒక పిలకగా  - ఒక పోకచెక్కకి పరిమాణంకి - లాగి కట్టినట్టుంది. ఆ పొడుగాటి ముఖం, ఆ పిలక - ఆ రెండు ఎంత జోడుగా కనిపిస్తున్నాయ్! నుదుటమీద తీర్చిదిద్దిన ఒక చందన బొట్టు, కుంకుమ బొట్టు. చెవిలో ఎర్ర ముత్యంతో ఒక ఆబరణం. చేతిలో రెండు ఉంగరాలు:చూపుడు వేలులో వెండిది. ఉంగరం వేలులో ఒక పవిత్రం.

 

అమ్మకి అరవైఐదు నిండాయి. కాని సిగ్గు, బిడియంలో ఇరవైఏళ్ల యువతి అనే చెప్పాలి. కళ్ళద్దాలని మీదమీదకి సర్దుకుంటూ అతని మాటలు వింటోంది.

“నా ఉపన్యాసం ఈ రోజులకీ తగినట్టుగా ఉంటుంది. ఉత్తినే ఏదో చెప్తే ఎవరు వింటారు? ‘ఆడంబరాణి పూజ్యంతే,’ అన్నట్టువుంది ఈ లోకం. మూడణాలు ఇస్తే చాలు, జనులు రాత్రిపూటంతా  సినిమా చూడవచ్చు. ‘ఎందుకీ పురాణం, వేదాంతం?’ అని ఉంది జనుల వాలకం. అందుకే ప్రవచనంతోబాటు నేను సంగీతంకూడా చేర్చుకున్నాను,” అని అతను అంటున్నారు.

బగ్గుమనే ఈ ఎండలో ఇతను ఎలా నడిచివచ్చారో నాకు బోధపడలేదు; చెమటకూడా ఇంకా పూర్తిగా పోలేదు! ఇంత శ్రమలోకూడా అతను మాటాడం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది.

“సంగీతమంటే, నేపధ్య గీతం, మృదంగం, అవన్నీ ఉంటాయి కదూ?” అని అమ్మ అడిగింది.

“అవేవీ లేవు. అటువంటి ఆడంబరాలు నా వసతికి వీలు కాదు. నేను చేతాళమే వాడుతాను. జాలరా వుంది.  సంస్కృతం, తమిళం, మహారాష్ట్రం భాషలనుంచి ఉదాహరణలు చూపి, తగిన సంగీతం సమకూర్చి కధ చెప్పుతాను.”

“కూర్చూనే చెప్తారా, లేక నిలబడుతూనే ఉపన్యాసం చేస్తారా?”

“కూర్చూనే చెప్పవచ్చు; నిలబడికూడా ఉపన్యాసం చెయ్యగలను. ఇప్పుడు నాకు డెబ్బైనాలుగు నిండాయి. వరుసగా రెండుమూడు గంటలు నిలబడమంటే సాధ్యం కాదు.”

“అపును. నిజం.”

“ఎలా చెప్పినా సరే, తరం ఒకేలాగుంటుంది. నిలబడి చెప్తే భాగవతుడు, కూర్చుంటే పౌరాణికుడు. కాని మూలవస్తువు ఒకటే!”  

“ఏ కధలు చెప్తారు?”

“ఎది కావాలో అది: సీతా కల్యాణం;  రుక్మిణీ కల్యాణం; వత్సలా కల్యాణం; పాదుకా పట్టాభిషేకం; లక్ష్మణ శక్తి; వాలి వధం; విభీషణ శరణాగతి; నందనార్ చరిత్ర; ఇయర్ పగై నాయనార్; వళ్ళీ  కల్యాణం; కుమార సంభవం, ఇంకా ఎన్నో. చెప్పే కధ కాలం, దేశం, శ్రోతల అభిరుచికి తగినట్టుగా ఉంటుంది; రసాభాసం ఉండదు. ‘ఎందుకురా ఇతన్ని పిలిచాం?’ అని ఎవరికీ అనిపించదు.  ఒక ఉపన్యాసంలో శ్రోతలందరూ లేచి వెళ్ళిపోయారట; ఒకతను మాత్రం ఉన్నచోటు కదల్లేదు. ‘నువ్వొక్కడే నా రసికుడువి!’ అని భాగవతుడు అంటే అతను ‘ఈ లైటూ, తివాసి నాకు సొంతం, అందుకే ఉన్నాను’ అని అన్నాడట. నాదలా ఉంటుందని భయపడకండి. నా ఉపన్యాసం ఒక సారి వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, అదే నా అనుభవం. ఐతే మొట్టమొదట వినిపించడానికి మనమేకదా అన్నీ చెయ్యాలి? నేనీ చుట్టుపక్కలకి కొత్త; నాకెవరితోనూ పరిచయం లేదు. ‘ఇదిగో శాస్త్రులు బయలుదేరారు, త్వరలో  వస్తారు’ అని మనగురించి అడ్వర్టైస్మెంటు చెయ్యడానికి ఎవరూ లేరు. అవునా? మన రధం మనమే ముందు జరపాలి . . . ఇతనెవరు? మీ అబ్బాయా?”

“అవును.”

“నమస్కారం!” అని అంటూ చెయ్యెత్తాను కాని, మరేం చెయ్యక, అతనికి నా మర్యాద తెలియజేసాను. అతను నా ఉద్యోగం, జీతం, మరేవో అడిగిన ప్రశ్నలకి బదులుచెప్పాను.

“నాకు సొంతవూరు కోయంబత్తూర్ పక్కన ఒక గ్రామం. స్కూల్లో తమిళం, సంస్కృతం పండితుడుగా పనిచేసి రిటైరయ్యాను. అప్పటినుంచి ఇలా కాలక్షేపం చేస్తున్నాను. Provident Fund అని రెండు వేలిచ్చారు, అది నా రెండమ్మాయిల పెళ్ళిళ్ళకి ఐపోయింది. ఇప్పుడు ఉపన్యాసమే నా ఆదాయం, అదే దేవుడు నాకు చూపిన వృత్తి. ఇంకొక అమ్మాయికి పెళ్ళి చెయ్యాలి. ఒకే ఒక అబ్బాయి. వాడుకూడా టీచర్ ఉద్యోగంకోసం చదువుతున్నాడు. వాడికేదో స్టైఫండ్ ఇస్తున్నారు, కాని అది చాలదే? అదీ నేనే చూసుకుంటున్నాను,” అని అతను తన పురాణం చెప్పి ముగించారు.

“ఈ ఊరులో ఉపన్యాసానికి  ఏమైనా ఏర్పాటు అయిందా?”

“లేదు. అందుకే ఈ ప్రయత్నమంతా. చెప్పండి. మనకి ఎవరు సాయం చెయ్యగలరు?”

“ఈ ఊరులో పడమటి దిశలో ఒక బ్యాంకు మేనేజరున్నారు. అతనిపేరు నాగమణి. అతన్ని తప్పిస్తే మరెవరికీ ఇలాంటి కార్యక్రమాల్లో అపేక్ష లేదనవచ్చు.”

“పడమటి దిశలోనా? పందిరివున్న ఇల్లా?”

“అవును.”

“అతన్ని పొద్దుటే వెళ్ళి చూసాను. ‘రాత్రి రండి. నా స్నేహితుడ్ని కలుసుకొని చెప్తాను’ అని అన్నారు.”

“అంటే ఈ రాత్రికి ఏమీ లేదన్న మాట!”

“దానికేం? మనం రాగానే సాధ్యమవ్వడమంటే ఎలాగ? అందరికీ వాళ్ల వాళ్ల సదుపాయం ఎలాగుందో?

“మీకతను ముందే తెలుసా?”

“లేదండీ! అసలు ఈ ఊరు పేరే నేను మొన్ననే విన్నాను. మొన్న రాత్రి తిరుమాంగుడిలో నా కాలక్షేపం జరిగింది. నేనక్కడ బస చేసిన ఇంట్లో ఆ యజమాని నన్ను ఈ ఊరికి వెళ్ళమని చెప్పారు. అతనే ఒక ఉత్తరమూ ఇచ్చారు. రిటైర్టు తాసిల్దారు దాశరధి అని పేరు చెప్పారు. అతనే ఈ వీధి చివరలో ఉన్నారు.”

“అవును.”

“నేను అతని ఇంట్లోనే ఉంటున్నాను. నా మూటాముల్లె - పడకా, శ్రుతిపెట్టె, అన్నీ- అక్కడే ఉన్నాయి. అతనే బ్యాంకు మేనేజర్ ని చూడమని చెప్పారు. ఇంకొక పేరు కూడా చెప్పారు. ఇక్కడ చెరువు పక్కన ఒక శివాలయం ఉందికదా, అతను దానికి ట్రస్టీ అని చెప్పారు. పేరు పరమేశ్వర పంతులట.”

“అవును.”

“అతన్నీ చూడమన్నారు. వెళ్ళి చూసాను. అతను ఊళ్ళో లేరు. సాయంకాలం వస్తారని విన్నాను. అతన్ని తప్పకుండా వెళ్ళి చూడాలి.”

“వెళ్ళి చూడండి.”

ఇంతలో అమ్మ కాఫీకోసం రమ్మని పిలిచింది. ముసలాయనతో లోపలికి వెళ్ళాను. అతను కాఫీ తాగారు. “అబ్బా, ఈశ్వరీ!” అని అలసట తీర్చినంతవరకూ నిట్టూర్పు వదిలి, వొంగి, ఒకసారి పరసరాలు చూసారు. “ఎండ చాలా తీవ్రంగా ఉంది!” అని అంటూ మళ్ళీ మీదకి చూసారు.

“ఇక్కడ ఎవరో తమిళ పండితులు - రామయ్యా అని పేరు - ఉన్నారని విన్నాను. అతనికి మంచి పలుకుబడి ఉందని అన్నారు.”

“ఆ పేరుతో ఒకరున్నారని నాకు తెలుసు.”

“స్టేషన్ పక్కనే ఒక పెద్ద రైస్ మిల్ ఉందికదా, దాని యజమాని గణపతి చెట్టియార్ కి ఈ రామయ్యతో పొత్తుందని విన్నాను. ఆ చెట్టియార్ బర్మాషెల్ ఏజంటు వైదీశ్వరయ్యర్ కి మంచి స్నేహితులన్నారు.”

“స్వామీ, మీకోసం జయలక్ష్మి కాచుకొనివుందంటాను! పొద్దునే వచ్చానన్నారు, ఈ సీమకి కొత్త అని అన్నారు. మధ్యాహ్నం ఇంకా మూడుగంటలుకూడా అవలేదు! అందులోనే నాలుగు పెద్దమనుషులని కలుసుకొని, మరెవరున్నారు, ఎవరికి ఎవరితో పరిచయం, స్నేహం అని అన్నీ తెలుసుకున్నారు! అబ్బా, మీరు తలచుకంటే మీకంతా సాధ్యమే అనిపిస్తోంది!”

“అలాగైతే మంచిదే!  అవన్నీ జరిగిన తరువాతనేకదా మీరు నన్ను మెచ్చుకోవాలి!”

ముసలాయన కొంతసేపు నిద్రపోయి, నాలుగు గంటలకి బయలుదేరారు.

ముసలాయనకి ఎత్తైన ఆకారం. మోకాలుకింద మలుపు లేకపోతే ఇంకా ఎత్తుగా కనిపించేవారు. బయట ఎండ తీష్ణత తగ్గినట్టు కనిపించలేదు.

“సరే, వస్తాను. అతని పేరేంటి? . . . పరమేశ్వర పంతులుకదూ?”

“అవును.”

“ఈ వేళకి అతను వచ్చివుంటారు. మూడున్నర ట్రెయిన్ లో వస్తానని చెప్పారట.”

“అలాగైతే వచ్చివుంటారు.”

“సరే. నేను వస్తాను.”

అతన్ని చూసి నాకు జాలి కలిగింది. అవును, ఈ ఊరుగురించి  నాకు తెలియదా? ఎవరో అన్నారు: దేవుడు సృష్టించినది గ్రామం; మానవుడు సృష్టించినది నగరం; దెయ్యం సృష్టించినది అసందర్భమైన ఒక పంచాయతీ అని. ఆ పంచాయతే ఈ ఊరు. ఇక్కడ నీరు పాలుగా అమ్ముతారు; ఆవాలు కొనాలంటే కర్పూరం కొన్నట్టు. కూరగాయల ధరలు కస్తూరి సువాసనలతో సమానం. ధాన్యం కొనాలంటే ఒక కొలమానం; అమ్మాలంటే వేరే కొలమానం. ఈ ఊరుకి పేరు మోసిన స్థలపురాణం ఉందని చెప్పుకుంటారు, కాని కోవిలకి ఎదురుగా నివసించే జనులుకూడా దాన్ని తిరిగిచూడరు! కోవిల ఘంటారావంకీ, రైసుమిల్లులో వినిపించే కూతకి భేదం తెలియని చెవులు. కోవిల ప్రాకారంలో దండిగా పెరిగిన పొదళ్ళున్నాయి. వాటిలోవుండే పాములే ఆ ఘంటారావం వినాలి! అసలు మనుషులెవరూ రారని తెలిసే పాములు అక్కడ కాపురం చేస్తున్నాయామో? లేదంటే, ‘మనకి ఈమనుషులెవరూ వొద్దు!’ అని ఆ పరమశివుడే పాములని కావలికాయాలని వదిలేసాడేమో? ఎవరికి తెలుసు? ఆ భగవంతుడ్నే అడగాలి. పగటివేళలో బయటికి వస్తే భూస్వాములు రైతులను పచ్చిబూతులతో తిట్టడం నిత్యమూ వింటాం. సూర్యాస్తమయం జరిగిన ఆ మరుక్షణమే ఊరంతా నిద్రపోతుంది. జనులెవరూ వీధిలో నడవరు! ఏ కుక్క మొరుగుడూ వినిపించదు! అసలు మనిషెవడైనా కనిపిస్తేకదా కుక్క మొరుగుతుంది!

పోయిన వేసవిలో నరహరిరావు పడిన అవస్థ నాకు తెలుసు; అతని రెండేళ్ళ పిల్లవాడు కన్నుమూసాడు. భార్య ప్రసవించి మూడు రోజులూ గదిలోనే ఉంది. పిల్లవాడి శరీరంతో అతను కాచుకొనివున్నారు. ఎవరూ వచ్చి చూసారా, లేదు! అతని నాన్నగారు కాలంలో అతని దయతో బతికిన ఏ మనిషీ ఇప్పుడు జోక్యం చేసుకోలేదు! ఆఖరికి అతను సిగ్గు, మోమాటం వొదులుకొని స్నేహితులకి తెలియజేసారు. స్నేహితులైనా మానవతా దృష్టి ఉంటేకదా వాళ్ళు వస్తారు? ఆఖరికి కొత్తగా ఈ ఊరుకి వచ్చిన నాకు తెలియజేసారు; నేనే  పిల్లవాడ్నిశ్మశానంకి తీసుకెళ్ళడమైంది. “సార్, మీరే నన్ను కాపాడాలి!” అని నన్ను చూడగానే అతను మొరబెట్టుకొని ఏడ్చారు. తరతరాలుగా ఈ ఊరులో ఉన్న మనిషికే ఆ గతి; మరి ఈ ముసలాయన రధం ఎలా కదల్చుతారో నాకు అర్ధం కాదు!

ఇతనికి పరమేశ్వర పంతుల్ని చూడాలట! ఒక సంవత్సరం నేను అతనింటి పొరుగున కాపురం చేసాను. అతనికి చాలా భూములూ, పంటలూ ఉన్నాయి. అంతా వడ్డీ వ్యాపారంతో స్వయాన ఆర్జించిన డబ్బు. పిల్లలెవరూ లేరు. చెడుప్రవర్తనతోపాటు రోగాలుకూడా సంపాదించుకున్న మనిషి అతను. ఇక స్త్రీలమాటకొస్తే - అందం, ఘోరం, వయస్సు, సంపర్కం - వీటిగురించీ అతనికి ఎటువంటి పక్షపాతమూ లేదు. పొద్దునించి సాయంత్రం వరకూ వసారాలో కూర్చొని పనిమనుషులని ఇలాగా అలాగా మొరుగుతుంటారు. వీధిలో నడిచే పడుచులు, నడివయస్సు స్త్రీలు ఆ తిట్లు విని, సిగ్గుతో తల వంచుకొని, ఆఖరికి అలవాటుపడిపోయారు. ఎవరూ ఒక్కమాటకూడా అతనికి ఎదురుచెప్పరు. ఎవరైనా చెప్తే, వాళ్ళ ఇంట్లో రాళ్ళు వచ్చి పడతాయి. నేను పొద్దున లేచినప్పుడు అతను పనిమనుషుల పిల్లల్ని అరటిచెట్టు పట్టతో బాదడం, వాళ్ళు కివ్వున అరవడం వినడం నాకు అలవాటైపోయింది. ఇక ముష్టివాళ్ళ మాటకొస్తే ఇవన్నీ మామూలే! ఈ పుణ్యాత్ముడిని కలుసుకోడానికే ఈ ముసలాయన  వెళ్ళారు! వొద్దని నేను ముందే హెచ్చరిక చేసివుండవచ్చు, కాని నా మాటలు అతని ఉత్సాహంకి భంగం చేసినట్టు కనిపించవచ్చు. ఇవన్నీ స్వానుభవంలోనో ఎవరికైనా అర్ధమయే విషయాలు. అంతేకాదు. పంతులొక స్వయంప్రభు. నా ఆలోచనకి విరుద్ధంగా, కంసుడికి దయ కలిగినట్టు అతని మనసు మారి, ఈ ముసలాయన్ని కరణించుతే? అందుకే నేను మరేం అనక, ‘ఎది జరగుతో జరగనీ’ అని ఊరుకున్నాను.

దేవుడా! ఇతను - ఈ కోయంబత్తూర్ ముసలాయన - ఈ కావేరీ ప్రాంతంలో, కళ, కపటం, ధర్మం, క్రూరం అల్లాడుతున్న ప్రదేశంలో - తన ప్రావీణ్యం చూపబోతున్నారు!

ఆరు గంటలకి అతను తిరిగివచ్చారు.

“చూసారా అతన్ని?”

“చూసాను, వచ్చేసాను.”

“ఏమన్నారు అతను?”

“వసారాలో కూర్చొని కేకలు పెడ్తున్నారు; నేను వెళ్ళి నిలబడ్డాను. ‘ఎవర్రా అది?’ అని అరిచారు. నేను చెప్పినదంతా విన్నారు. ఆఖరికి ‘మాకిక్కడ మరేం పని లేదనుకున్నావా? . . . హరికధంట హరికధ! . . . అదేం జరగదు! . . . ఇంకా ఎందుకు నిలబడతావ్? వెళ్ళు!” అని తేటగా, చిక్కగా, చెప్పేసారు,” అని అంటూ నవ్వారు. అన్నిటీని గుటుక్కున మింగే ధోరణి అది; రాతిబండలోనున్న పురుగైనా సరే, ఎడారిలోనున్న ఖర్జూర చెట్టైనా సరే, వాటికికూడా దేవుని కరుణ తప్పక దొరుకుతుందనే నమ్మకంతో బతికే మనిషి ఈ ముసలాయన.

“నేను ముందే చెప్పాలనుకున్నాను . . .” అని ఆరంభించాను.

“మీరు చెప్పినా నేను వింటానా? నేనే వెళ్ళి తెలుసుకుంటేనేగాని నాకు తృప్తివుండదు. అతన్ని చూడడమైంది, ఐపోయింది. ‘కాలో హయ్యం నిరవతి, విపులాచ పృధ్వీ!’ అన్నాడు భవభూతి. కాలం వ్యాపించివుంది. ఇతను లేకపోతే మరెవరి ఆదరణా మనకి  దొరకదా ఏమిటి? నేను వెళ్ళిన సమయం సరిగ్గా లేదు!” అని అతనే చెప్పి ముగించారు.

ఒక నిమిషం ఆగి నేను అతనికి చెప్పాను:

“ఇప్పుడు ఈ గ్రామాల్లో ఇవేవీ లేవు. సంగీతం, కళ, ధర్మబుద్ధి, డబ్బు - వీటిని మించి ఈ జన్మలో ఎన్నోపున్నాయన్న భావనలు యిప్పట్లో బొంబాయి, మద్రాసు అనే నగరాలికి తరలిపోయాయి. ఈ గ్రామాల్లో మనం ఇప్పుడు చూసే గుసగసలు, అహంకారం, అసూయ, కపటం, అజ్ఞానం తప్ప మరేంలేవు. వాళ్లేం చెయ్యరు, ఇతరులు చేసినా తప్పొప్పులు కనిపెడతారు. ‘వాడికేం తెలుసు? వీడికేం తెలుసు?’ అని ఇంట్లో కూర్చోనే విమర్శ చేస్తారు. ముందుకు ఎవరినీ వెళ్ళనివ్వరు; వెనక్కి ఎవరినీ తరుమరు. ఈ గ్రామాలని రక్షించడానికి ఎవడైనా అవతార పురుషుడు రావాలి!”

“అలా చెప్తే ఎలాగ? గ్రామాల్లోకూడా పెద్ద మహానుభావులు ఉన్నారే?”

“వాళ్ళందరూ ఈ ఊరు వొదిలి వెళ్ళినతరువాతే మహానుభావులుగా ఐవుంటారు. ఇక్కడేవుంటే అది సాధ్యం కాదు. నాగరికం అని మనం వాడే పదం నగరంనుంచే వచ్చిందని మనం గుర్తించాలి. ఎప్పుడూ గ్రామాల్లో ఉదాసీసత, అజ్ఞానం చేటుచేసుకున్నట్టు నాకనిపిస్తోంది. ఇప్పుడేమో పరిస్థితి మరీ చెడిపోయింది. కరుణ, పరోపకారం అంటే మచ్చుకైనా కనిపిస్తేనా? అవన్నీ పట్ణంకి పారిపోయాయి. మీరేమో ఇక్కడకి వచ్చి కాలక్షేపం, సంగీతం అని మాటాడుతున్నారు. ఎవరు వింటారు, చెప్పండి?”

“మీరన్నది నిజం. కాని నాకేమో పూర్తిగా విశ్వాసం పోలేదు. నేనూ అన్నీ చూస్తున్నానుగా, అందుకే చెప్తున్నాను.  మంచి విషయాలు వినాలి, తెలుసుకోవాలి అనే ఆశ ప్రజలకి ఇక్కడావుంది, కాని వాళ్ళకి అది తెలియదు. ఎవరైనా జాడచూపించాలి. అందుకే ఈ కాలక్షేపం, హరికధ, సత్సంఘం అన్నీ మన పెద్దలు  ఏర్పాటు చేసారు,” అని అతను మొండిగా వాదించారు.

“సార్!” అని ఎవరో పిలిచారు.

“ఎవరు?”

ఒక పిల్లవాడు వచ్చి నాకొక నోటీసు అందించాడు. నేను చదివాను; నాలో నవ్వుకున్నాను. నా పక్షంని బలపఱచే సందేశం అది.

 

“ఏం నోటీసు?”

 

“సత్యభామా పదకేళి పోటీలో ఈ ఊరి హోటల్ వెయిటర్ కి ముప్పదివేల రూపాయలు బహుమతి దొరికిందట. అందుకు అతన్ని గౌరవిస్తున్నారు.”

 

“అలాగా? మంచి అదృష్టవంతుడు!”

 

“ఒక కాలేజీ ప్రిన్సిపాలు వచ్చి అతనికి ఆ చెక్కు ఇస్తున్నారట; అందుకని రేపు పొద్దుట ఒక ఉత్సవం జరుపుతున్నారు. నేను చెప్పినది ఇదే! కంబన్, వాల్మీకి, త్యాగరాజస్వామి - వాళ్ళగురించి శ్లాఘించుతూ, వీధికి, వీధికి, మీరు ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా - దేనికి గౌరవం దొరుకుతుందని?

చీకటి కప్పేసింది. భోజనంకి ముసలాయన తను బసవున్న దాశరధి ఇంటికి వెళ్ళారు. నేను వాహ్యళికి కొంచెసేపు బయటికి వెళ్ళాను. తిరిగిరాగానే మేజాకింద ఒక, సంచె, పడక, శ్రుతిపెట్టె చూసాను.

“ఎవరమ్మా ఇవి తెచ్చారు?”

“ఆ ముసలాయనే తెచ్చిపెట్టారు. ‘తాసిల్దారు ఇంట్లో అందరూ రేపు మద్రాసు    వెళ్తున్నారు, అందుకే తీసుకొచ్చాను,’ అని అన్నారు. రాత్రి మనింటి వసారాలో నిద్రపోవచ్చునా? అని అడిగారు. నేను సరే అన్నాను.”  

“అతనెక్కడ ఇప్పుడు?”

“నాగమణిని చూడడానికి వెళ్ళారు.”

“పాపం, అతన్ని చూస్తే జాలిగా వుంది. తనే వెళ్ళి ‘నాకిది తెలుసు, నాకది తెలుసు,’ అని చెప్పి బతికే మనిషి. మంచి జ్ఞానం ఉంది. మంచి వాచాలత కూడా ఉంది. ఎవరికో ముప్పైవేలరూపాయల బహుమతి దొరికిందట. చూసావా, ఏ పనీ చెయ్యకుండా అంత డబ్బు సంపాదించేసాడు! అందుకు ఈ ఉత్సవం, వేడుక అంతా! ఈ లోకంలో ప్రజల వివేకం, తరతరాలు ఎలాగున్నాయో చూసావా అమ్మా! ఈ ముసలాయన జ్ఞానం జీర్ణం చేసిన మనిషి, సిద్ధంగావున్నారు, కాని అది వినడానికి ఎవరూ లేరు!”

“నాకేమో ఈ కాలంలో పురాణాలు, కాలక్షేపాలు గొప్పగా కనిపించడం లేదు. ఉత్తికే ఏపనీ చెయ్యని మనిషికి ఇంత డబ్బు ఎలా వచ్చింది చెప్పు? దానికేదో కారణం ఉండితీరాలి! వాడెవడికో ఎప్పుడో మంచి పని చేసివుండాలి. కర్మ అంటే ఇదే! ఇంతకన్న మరెవరు బాగా చెప్పగలరు?”

“అంటే జనులు ఈ జూదాలు ఆడాలన్నమాట! అవునా?”   

“నేనలా వాదించడం లేదు. ప్రజలకి అది ఒక పాఠం నేర్పించుతోంది. అదే నేను చెప్పేది.”

“అలాగేం కాదమ్మా! ప్రజలు నాలుగణాలు వేసి నాలుగు వేలు రూపాయలు సంపాదించాలని ఆలోచిస్తే ఎలాగ? దురాశ దేశమంతా  ఆవరించుకుందన్న మాట. న్యాయంగా డబ్బు సంపాదించడానికి సాధ్యం కాదు; కష్టపడి బతుకుదామంటే అదీ వీలుకాదు; వీళ్ళ ఆశలన్నీ యీడేరినట్టు వీళ్ళ కృషికి తగిన ఆదాయం లేదు. అందుకే అందరూ అడ్డదారుల్లో దిగిపోయారు. నాలుగువేల రూపాయలు రొక్కంగా దొరుకుతే ఇన్ని రోజులుగా ఉన్న చిన్న చిన్న అప్పులు తీర్చవచ్చు; రేడియో, వాచీ, నగలూ అన్నీ కొనవచ్చు.”

“ఇది కావాలి, అది కావాలి అని ఆశ పడకుండా ఉంటే ప్రజలు న్యాయంగా పని చేసి ఉన్నదానితో తృప్తి పడతారు కదా? ఆ నాలుగణాలు పోగొట్టుకొన్నతరువాత బుద్ధి వస్తే  అదీ ఒక మంచి పాఠం కదా?” అని అమ్మ మొండిగా వాదించింది.

ముసలాయన తిరిగివచ్చేసారు. నాగమణిని చూసారట. రేపు రాత్రి పెరుమాళ్ కోవిలలో ఒక భక్త మహాసభ ఆరంభమవుతందని, దాని ప్రారంభ సమావేశంకి డిల్లీనుంచి ఒక పార్లమంటు సభ్యులు వస్తున్నారని చెప్పారట. అది సమాప్తమవడానికి పదిగంటలవుతందని, ఆ తరువాత ముసలాయన కధ చెప్పవచ్చు అని అన్నారట.

“నాగమణి ఇష్టపడితే చాలు, తప్పక జరుగుతుంది. అతను మీకు సాయం చేసారు” అని నేను అన్నాను.

“అవును. నిజం. కాని ఇందులో ఒక చిక్కు ఉంది. సమావేశం పూర్తి అవడానికి పదిగంటలవుతుంది. పార్లమెటు సభ్యులు వస్తున్నారు, అందువలన ఆడంబరం కొంచెం ఎక్కువగానే వుంటుంది. అన్ని ముచ్చటలూ పూర్తవడానికి పది, పదకొండు కూడా అవచ్చు. ఆ తరువాత మన కధ ఎవరు వింటారు, చెప్పండి? దేవుడే వినాలి. అంటే రేపు కూడా మనకి చాన్సు లేదన్నమాట. అందుకే నేనొక మార్గం ఆలోచించాను. రేపు ఏకాదశి. నేను తప్పక కధ చెప్పి తీరుతాను. ఇక్కడ పక్కనే సెవ్వాయ్ పాడి  అనే ఊరు ఉందట. అక్కడ ఒకతన్ని చూడడానికి ఒక ఉత్తరం తీసుకొచ్చాను. రేపు పొద్దున్నే వెళ్ళి అతన్ని కలుసుకుంటాను. రేపు రాత్రికి ఈ ఊరులో మన హరికధ; అదే నా ప్లాను.” అతని కంఠంలో నాకొక నిర్ణయం వినిపించింది. ఆ రాత్రి మా ఇంటి అరుగులో నిద్రపోయి పొద్దునే కాఫీకూడా తాగకుండా అతను బయలుదేరి వెళ్ళిపోయారు.

ఆ ముసలాయన అన్నట్టే జరిగింది. ఆ రాత్రి పార్లమెంటు సభ్యులు వచ్చి, బాగా మాటాడి భక్తసభని మొదలుబెట్టారు. అతని ప్రసంగం పూర్తవడానికి రాత్రి పన్నెండుగంటలైపోయింది. అతనికి బదులు మరెవరైనా మాటాడివుంటే శ్రోతలకి ఆది జోలపాటగా అనిపించివుంటుంది. ముసలాయన మున్నెరుక చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.  

మరునాడు, పొద్దున్న ఎనిమిది గంటలకి “ఏమండీ, మీ అబ్బాయి ఉన్నారా?” అని ఎవరో అడిగే కంఠధ్వని వినిపించింది.

“ఉన్నాడు. ఏం సంగతి? ఏమైనా ఏర్పాటయిందా?” అని అమ్మ అడిగింది.

నేనూ బయటకి వచ్చి చూసాను.

“వెళ్ళాను. నేనొక ఉత్తరం తీసుకొని వెళ్తానని చెప్పానుకదూ, అతను ఊర్లో లేరు. ఆతనికి ఏడువందల ఏకరాలకిపైగా భూస్థితి ఉందట. ఇంట్లో అతని భార్యని చూసాను. ఆవిడ ఉన్నచోట కదలకుండా ఎవరని అడిగారు; ఉత్తరం ఇచ్చాను. చదివారు. ‘అతను ఊరులో లేరు. రావడానికి నాలుగురోజులు పడుతుంది. మీరు కాచుకోడంలో ఏం లాభమూ లేదు. కావాలంటే ఒకపోట భోజనం చేసి వెళ్ళండి,’ అని అన్నారు. మరేం చెయ్యడం? భోంచేసాను. తరువాత నాకొక ఆలోచన తట్టింది. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి “ఇవాళ ఏకాదశి. నేను కోవిలలో ఒక హరికధ చెప్పబొతున్నాను,’ అని నన్ను పరిచయం చేసుకున్నాను. ‘మీరు నాకేం పైసా ఇవ్వనక్కరలేదు, వచ్చి వినండి, అది చాలు!” అని చెప్పి వచ్చేసాను. ‘ఈశ్వరీ!’ అని అమ్మవారి తలమీద భారం పోసేసి, కోవిలలో రాత్రి ఆరు గంటలకి శ్రుతి పెట్టె, చిడతలతో కధ చెప్పడానికి సిద్ధమైయ్యాను. ఆ ఊరులో నలభై ఇళ్ళు ఉన్నాయట. నలుగురు మగవాళ్లు, ఐదుగురు స్త్రీలు వచ్చారు. ‘ఇది చాలు,  బ్రహ్మాండంగా ఉంది,’ అని తృప్తిపడి వాళ్ళకి రుక్మాంగద చరిత్ర చెప్పాను. మధ్యన ఒక పిల్లవాడు లేచి వెళ్ళాడు. రెండురూపాయలు తీసుకొచ్చాడు. తక్కినవాళ్ళు కూడా అణా, అర్ధణా, బేడా, పావలా అని ఏదో ఇచ్చారు. ఆఖరికి పళ్ళెంలో మూడు రూపాయలు, నాలుగణాలు జమా ఐంది. దానితో వచ్చేసాను. అదే జరిగింది. అవునా? రెండు గంటలు కధ చెప్పడమైంది. నాకు డబ్బు ముఖ్యంకాదు. ఏకాదశి దినం వ్యర్ధమవకుండా ఏవో నాలుగు మంచి మాటలు చెప్పానన్న తృప్తి చాలదా?” అని ముసలాయన చెప్పి ముగించారు.

ఆ మధ్యాహ్నం ముసలాయన నాగమణిని కలుసుకున్నారు. నాగమణి బొంబాయి వెళ్తున్నారట. ఆఖరికి ముసలాయనకున్న ఒకే ఆధారం కూలిపోయింది. కాని అతను నిరుత్సాహపడినట్టు కనిపించలేదు. రోజంతా ఎండలో తిరిగి, ఎవరెవరినో కలుసుకొని, చీకటి కమ్ముకునే వేళకి ఇంటికి వచ్చారు. “మీరు నాకొక చిన్న సహాయం చెయ్యాలి,” అని అన్నారు.

“ఏంకావాలి?”

“మరేం లేదు. మీ ఇంటి వసారాలోనే ఈరాత్రి కాలక్షేపం చెయ్యాలనుకుంటున్నాను. కోవిల మానేజరు ఒక నూరు వాట్ బల్బు ఇస్తానని చెప్పారు. దానికి మీ ఇంటి ప్లగ్ వాడాలి. కరంటు చార్జ్ ఏమవుతుందో అది నేను మీకు ఇచ్చేస్తాను.”

నాకేం చెప్పాలో తెలియలేదు. ఆవేశంతో నా నాలిక కదల్లేదు,

“ఎందుకండీ? ఆ కరంటు చార్జ్ నేనే ఇచ్చేస్తాను.”

“సరే. మీకు చాలా ధాంక్సు!”

ముసలాయన తనే ఒక పఠం తీసుకొనివచ్చి వసారాలో పెట్టారు. అమ్మ ఒక దీపం వెలిగించింది; త్వరగా వెళ్లి పళ్ళు, కర్పూరం అన్నీ తెచ్చిబెట్టింది.

తొలిగా వచ్చిన మనిషిని చూసి నమ్మలేకపోయాను. సత్యభామా పదకేళి పోటీలో ముప్పైవేలు రూపాయలు గెలిచిన హొటలు వెయిటరు నారాయణన్ వచ్చాడు; అతనితోబాటు సహోద్యోగులు ముప్పైమంది కనిపించారు.

“రండి, రండి!” అని ముసలాయన వాళ్ళకి స్వాగతం చెప్పారు.

“మీకితను ముందే తెలుసా?” అని అడిగాను.

“సాయంకాలం అతనే వచ్చి, ‘కాలక్షేపం జరుగుతోంది, తప్పక రావాలి,’ అని పిలిచారు,” అని చెప్పి నారాయణన్ నవ్వాడు.  

“ఇతనికి మహాలక్ష్మీ కటాక్షం ఉంది. మంచి మనిషి. ఉదారగుణముంది. నేను పిలవగానే తప్పకుండా వస్తానన్నారు! అని ముసలాయన అతన్ని పొగడారు.

ఇంతవరకూ మా ఉరులో ఇటువంటి జనసమూహం - అంటే నలభైమంది ఒకే జాగాలో కలుసుకోవడం - నేను చూడలేదు. ముసలాయన రెట్టింపు ఉత్సాహంతో ఉల్లాసంగా కనిపించారు. కుడిచేతిలో చిడతలు పట్టుకొని, తాళం వేస్తూ పాట ఆరంభించారు. వొణుకుతున్న కంఠధ్వనిలో శ్రుతి కలపడానికి ప్రయత్నించారు. ఆ పోరాటంలో అతనూ, అతని వయసూ, మారి మారి గెలవడం, ఓడిపోవడం శ్రోతలందరూ గుర్తించారు.

హోటల్ నారాయణన్ చాలా ఇష్టపడి హరికధ వింటున్నట్టు కనిపించాడు. అందరూ అతన్నే చూస్తూవున్నారు. కొన్నిచోట్ల ముసలాయన హాస్యం పేలగొట్టినట్టు ఉచ్చరించారు. ఎంత రమణీయంగా ఉంది అతని ప్రవచనం!  చతురతా, రక్తి కట్టే సామర్ధ్యం అతనికుంది. నవరసాల్లో ఎదీ అతను విడచిపెట్టలేదు! హోటల్ నారాయణన్ని బాగా ఆకర్షించాలని అతని ఉద్దేశం; అది బాగా నెరవేరింది.

శ్రీరాములవారిని అడవికి పంపించిన ఘట్టం వచ్చినప్పుడు పదకొండు గంటలైపోయింది. ముసలాయన ప్రయాసపడుతున్నట్టు కనిపించారు.

“చెప్పండి, ఏం చేద్దాం? చాలా సేపైంది. ఇక పాదుకా పట్టభిషేకం చెప్పాలంటే రెండు గంటలు పట్టుతుంది. భరతుడు రావాలి, కైకేయితో దెబ్బలాడాలి. వసిష్టుడితో వాదించాలి. అందరినీ చిత్రకూట పర్వతంకి తీసుకొని వెళ్ళాలి. జాపాలి చెప్పే నాస్తికవాదం వినాలి, ఇవన్నీసరసమైన విషయాలు. విపులంగా చెప్పాలంటే రెండు గంటలవుతుంది.”

అందరూ ఏమీ అనక కూర్చున్నారు. నేనూ ఎంగిలి మింగుతూ వింటున్నాను.

“ఏమంటారున్నారు? త్వరగా చెప్పండి! ఇక్కడ ఆపేసి రేపు సాగించడమా, లేకపోతే అర్ధగంటలో చిందరవందరగా ఇక్కడే చెప్పేయమంటారా?”

ఒక నిమిషం నిశబ్దం. శ్రుతిపెట్టె మాత్రం మ్రోగుతూవుంది.

“నారాయణన్ సార్, చెప్పండి,  ఏం చేద్దాం?”

నారాయణన్ నన్ను చూసాడు. నేను అమ్మను చూసాను. అమ్మ కళ్ళద్దాలని సర్దుకొని, నా మనసులో ఏముందో తెలియక, మళ్ళీ నన్ను చూసింది.

 

“సరే, దయచేసి మీరు రేపు మా ఇంట్లో బాకీ కధ చెప్పాలి,” అని  నారాయణన్ ముసలాయన్ని వేడుకున్నాడు. తరువాత శ్రోతలని చూస్తూ “రేపు మా ఇంటి వసారాలో పాదుకా పట్టాభిషేకం. మీరందరూ దయచేసి వచ్చి నన్ను దీవించాలి!” అని కొంచెం బిగ్గరగానే అందరినీ కోరుకున్నాడు.

 

“ఎంత ఉదారగుణం! నారాయణన్ సార్, మీకూ ఆ భరతుడులాగ పేరూ, పొగడ్తా రాబోతున్నాయి! వచ్చే సంవత్సరం నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకున్నప్పుడు మీరు ఒక పెద్ద హోటలుకి యజమానిగా. సిరిసంపదులతో, ధర్మాత్ముడుగా, కీర్తితో మెలగాలని నా ప్రార్ధన!.”

 

“అంతా మీ ఆశీర్వాదం!” అని అంటూ నారాయణన్ ఒక పది రూపాయల నోటు ముసలాయన కాలుముందు పెట్టి ఒక సాస్టాంగ నమస్కారం చేసాడు.

 

“దీర్ఘాయుషు భవ! చూసారా ఇతన్ని? ఎంత మంచి మనసు, ఎంత అణకువ!” అని అంటూ ముసలాయన నన్ను చూసి నవ్వారు. ఆ చిరునవ్వులో నాకా భవభూతే కనిపించాడు; ఆ భవభూతికి ఇంత సామర్ధ్యం ఉందా అని నాకు అనుమానం కలిగింది.

********

bottom of page