top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

“దీప్తి” ముచ్చట్లు

మాయావి’లాసం

Deepthi Pendyala, madhuravani, Deepthi Pendyala madhuravani

దీప్తి పెండ్యాల

నీలి మేఘాలలోంచి శివుడు చిరుమందహాసంతో నవ్వుతున్నాడు. అభయమిస్తున్నట్టుగా! నాన్నగారు పంపిన వాట్సప్ ఫార్వర్డు ఫోటో లో. 

 మరో ఫోటోలో - పౌర్ణమి చంద్రుడిలోనించి సాయిబాబా ఆశీర్వదిస్తున్నాడు చల్లగా! చంద్రుడిలో ఉన్నంత చల్లదనం ఆ నవ్వులో. 

"నాన్నగారూ, ఇదంతా ఫోటో షాప్ మాయ. నిజంగా కనబడింది కాదు" చెప్పాలని చేతులవేళ్ళలోకి జారిన మాటలని 'బ్యాక్ స్పేస్ ' కీ చెరిపేసింది. ఉహూ.మునుపెపుడో చెప్పిన గుర్తు. తెలీక కాదు. ఆ ఫోటోషాప్ నైపుణ్యానికీ అచ్చెరువొంది పంపిస్తూండొచ్చు. నాన్నగారితో రోజూ ఎన్నో చెప్పించుకుంటూ, వింతగా వింటూ, ఆ పరిజ్ఞానానికి అచ్చెరువొందుతూ పెరిగినదాన్ని, నడిచే ఎన్ సైక్లోపీడియా మా నాన్నగారంటూ గర్వంగా  తనకి  తెలీనిదంటూ ఉంటుందనీ తెలీకుండా పెరిగినదాన్ని, ఇపుడెపుడయినా ఈ టెక్నాలజీ తెలివిడికి సంబంధించి ఏ మాటయినా చెప్పాలంటే మనసే రాదు.

 

మరి ఇప్పటి పిల్లలో... అసలు పుడుతూనే తల్లిదండ్రులకి బుద్దులు చెబుతున్నారు. కిండర్ గార్టెన్ లోనే అమ్మ ఆంగ్ల పదాలలో యాసకి కిసుక్కున నవ్వేస్తారు.

 

పొద్దునే అర్ణవ్, వాడి ఫ్రెండు పేరుని తప్పుగా పలికినందుకు ఎంతగా నవ్వాడనీ? "సారీ మాం, ఐ డోన్ట్ మీన్ట్ టు హర్ట్ యూ. బట్, యు ఆల్ ఇండియన్ మామ్స్ ఆర్ ఫన్నీ, యు నో? .” అట. ఏ? వీడు ఇండియన్ కాక ఏమయ్యాడో మరి? చిన్నప్పటి నుంచీ నాకు నేను మేధావి కార్డు మెదడుకి తగిలించుకుని తెగ ఫీలయినదాన్ని? ఈ బుడంకాయగాడొచ్చి పేరు పలకటం చెప్పాలా నాకు?

 

మురిపెంగానో, కినుకగానో నాకు నేనే విసుక్కుంటున్న సమయంలో ఫోనొచ్చింది. ఫోన్ పైనెక్కడో ఉంది. పలికేలోపే ఆగింది. మళ్ళీ చేద్దామని ఎవరా అని చూస్తే విన్నూ ఫోన్. అది నా ప్రాణ స్నేహితురాలు సుజిత చెల్లెలు. ఉండేదిక్కడే. ఒకే ఊర్లో ఉన్నా, కలవటమే అవదు. ఎమ్మెస్ అవుతూనే ఇక్కడే ఓ అమెరికన్ తో ప్రేమలో పడి పెళ్ళి చేసుకుంది. అప్పట్లో అబ్బాయి-రిక్ తరఫు వాళ్ళంతా హైదరాబాదెళ్ళి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన పెళ్ళివేడుకల్లో ఇష్టంగా పాల్గొని కోడలితో పాటుగా ఆ అమ్మాయి మతాన్ని, పద్ధతులనీ ఇంటికి తెచ్చుకున్నారు. 

 

తన పిల్లల పేర్లు కూడా ఒకరు అధర్వణ్ అయితే మరొకరు అలివియా. ముచ్చటైన వారి సంసారంలాగే మహా ముద్దుగా ఉంటారు.

 

తిరిగి మాట్లాడటానికి డయల్ చేసాను. విన్నూ సంతోషంగా చెప్పింది "అక్కా! మా సుజీ హాలిడేస్ కని మనూరు వచ్చింది. నిన్ను అర్జెంట్ గా కలవాలంటుంది. తీసుకొచ్చేయనా?" సంబరంగా అడిగింది. "నిజమా!" సంభ్రమంగా అరిచి, " ఇప్పుడే, వెంటనే వచ్చేయండి. ఏదీ, ఓ సారి దానికి ఫోన్ ఇవ్వు." అనటంతోనే, సుజీ గొంతు వినబడింది. కుశల సమాచారాలు, ఆనందాశ్చర్యాలు అయ్యాక వాళ్ళని ఇంటికి రమ్మనమని చెప్పి,  వంటింట్లోకి దూరాను.వచ్చేలోపు వంట చేస్తే, వాళ్ళొచ్చాక తీరిగ్గా మాట్లాడొచ్చని.

 

రెండు గంటల్లో వచ్చేసిన సుజీని చూసి నమ్మలేకపోయాను. పెళ్ళికి ముందు గుమ్మటంలా ఉండేదని మేమంతా ఏడిపించేవారిమి. ఇపుడేమో రివటలా ఉంది. అసలదేనా? అనిపించింది. పేద్దగా వాట్సప్, ఫేస్బుక్ లాంటివాటిలోనూ యాక్టివ్ గా ఉండదు కనుక, దాన్నీ మధ్యకాలంలో చూడనేలేదు. 

ఏంటీ, సైన్యంతో వచ్చావా? ఒక్కదానివే దిగావా? అన్న ప్రశ్నకి బదులుగా తన మార్కు నవ్వొకటి విసిరింది సుజీ. 

'పిల్లలు, నేనూ వచ్చాము. విజయ్ రావాల్సింది.  కానీ, అత్తయ్య గారికి ఇష్టం లేకపోవటంతో సమయానికి ఏదో పనుందంటూ మమ్మల్నే పంపారు.'

నాకెందుకో తేడాగా అనిపించాయి దానిమాటలు. 'ఆవిడ ఆరోగ్యం బానే ఉంది కదా?' అనుమానంగా అడిగాను. 

“బాలేకేం. బావున్నారు. ఈ తెలంగాణా వాళ్ళ ఇంటికి పంపరావిడ.”.  విన్నూని చూపుతూ, చిన్నగా నవ్వుతూ చెప్పింది. 

పకాల్న నవ్వాను. "ఎవరు తెలంగాణా? విన్నూయా? నువ్వు మారిన లెక్కప్రకారం, విన్నూ కూడా అమెరికన్ వాడిని చేసుకున్నాక, అమెరికన్ అయిపోయిండాలే? " నవ్వుతూ అన్నాను. 

సుజీ అత్తగారి చాదస్తం పెళ్ళికి ముందే చూసాను. ఆవిడకి, తన కులం, తన ప్రాంతం కానివేవయినా చిన్నచూపే. విజయ్, సుజీ ప్రేమవివాహం. ఒకే కులం, గత రెండు తరాలుగా నివసిస్తూంది ఒకే నగరం.  కానీ, పూర్వీకుల భాష, పద్ధతులు వేరవటం వారి పెళ్ళికి పెద్ద  అవరోధమయింది. సుజీ వాళ్ళ అమ్మావాళ్ళు ఆస్థిపరులు. అబ్బాయికి ఉద్యోగం తప్ప వేరే ఆస్థులేవీ లేవని మొదట్లో అభ్యంతరపెట్టినప్పటికీ, కూతురు ఇష్టాన్ని కాదనలేకపొయారు. సుజీ అత్త గారికీ, ఆడపడుచుకీ సుజీ వారింటి భాష నచ్చలేదుట. ససేమిరా అన్నారు. అప్పట్లో విజయ్ మొండికేయటంతో పెళ్ళి జరిగింది కానీ,కోడలిని మాత్రం ఇంట్లో మనిషిగా స్వీకరించలేకపోయారావిడ. 

 

చూస్తుంటే పెళ్ళయి పదిహేనేళ్ళయినా పరిస్థితిలో మార్పు లేనట్టుంది. కాసేపు విశేషాలు, ముచ్చట్లూ, వగైరాలయ్యాక అదే అడిగాను.  

నిట్టూర్చింది సుజీ. 

“ ఏం చెప్పను?  ఆవిడ మారరు. నేను పూర్తిగా మారినప్పటికీ, అమ్మావాళ్ళు ఏ రెండు సంవత్సరాలకొకసారో కలిసినప్పటికీ, ఆయా రోజుల్లో వాళ్ళా యాసలో పలికిన పదాలని తప్పుపడుతూ, మర్యాదకు లోటు జరిగిందని రోజుకొకసారి గుర్తుచేసుకుంటారు. మా అమ్మమ్మెపుడో విజయ్ ని "కొడుకా" అని సంబోధించిందట. అదావిడకి కోపకారణం. అంతే. అప్పటినుండీ విజయ్ మా పుట్టింటికి రావటానికి లేదంతే. విజయ్ హైదరాబాదులో పెరిగినవాడే. స్నేహితుల ఇళ్ళలో అలా పిలిపించుకున్నవాడే. ఆ పదం వెనకున్న మమతనూ, అమ్మమ్మ ఆప్యాయతనూ అర్థం చేసుకున్న వాడే. అయినప్పటికీ,  తల్లికేదయినా చెప్పటానికి మొహమాటం.  పోనీ, నేనయినా మా అత్తగారున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని మా అమ్మావాళ్ళకి చెబితే, వాళ్ళకీ చిరాగ్గానే ఉంటుంది. "ఈ గారులూ, బూరెలూ, దీర్ఘాలు, రాగాలు తీస్తూ నువ్వు మాట్లాడుతూంటేనే పరాయి పిల్లెవరో వచ్చి మాట్లాడుతున్నట్టుంది, ఇక మేము కూడానా?" అంటూ విసుక్కుంటున్నారు.అడకత్తెరలో పోకచెక్క అంటారే? అలాగే ఉంది నా పరిస్థితీ! పరస్పర అసహనం అనాలేమో దీన్ని? " 

 

పరస్పర అసహనం -ఆ మాట వినగానే నాకు నవ్వొచ్చింది. అమెరికాలో పెరుగుతున్న మా పిల్లలు, ఇక్కడి అమెరికన్  స్నేహితుల ప్రభావంతో  ఓ వింత యాక్సెంట్ లో సాగదీస్తూ కొన్ని పదాలు పలుకుతుంటే, "మామూలుగా మాట్లాడలేవా? ఆ దీర్ఘాల్లేకుండా?" అని విసుక్కుంటూనే ఉంటాము.  అందునా మా అమ్మాయిలు 'నో" అనే ఒక్క అక్షరాన్ని అర్ధనిమిషానికి తగ్గకుండా సాగదీసినప్పుడల్లా, మా తల్లులకి చిరాకు, పిల్లలకి చీవాట్లే.  ఒక్కోసారయితే,  ఇంట్లోనే గ్రహాంతరవాసులున్నట్టు ఊపిరి పట్టేసినట్టుంటుంది. పాపం. పిల్లలకేమో మన సమస్యేంటో అర్థం కాదు.  బహుశా మనకు సహజంగా అలవాటుకానిదేదయినా, కృతకంగానే ఉంటుందేమో? ఇందులోంచే "పరస్పర అసహనం" పుడుతుందేమో? 

 

 

ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఎన్నో భాషలకి, యాసలకి అలవాటుపడి, ఎవరికి తగ్గట్టుగా వారి వద్ద పలు భాషలు మాట్లాడుతూ నెగ్గుకొచ్చే మా తరానికే,  ఒక్కోసారి పిల్లలు ఇంట్లో  మన సహజమైన  మాతృభాష మాట్లాడితే  బావుండనిపిస్తుంది. అలాంటిది, వారి చట్రంలో వారుండిపోయిన మా ముందు తరం వారి ఆక్షేపణలూ, అసహనాలూ వింతగా ఏమీ తోచలేదు. ఎటొచ్చీ, ఎదురుగా ఒకర్నొకరు చిన్నబుచ్చుకోవటాలు మాత్రం సరికాదుగా? 

 

నా ఆలోచనల్లో నేనుండగానే, సుజీ మాటలు అయిపోవచ్చినట్టున్నాయి. విన్నూ మాటలు వినబడ్డాయి.

 

- "సుజీ, మీ తోటికోడలు శ్రీలత అయితే మీ అత్తగారి ఊరమ్మాయేగా ? తనని బానే చూస్తారా మీ అత్తగారు?" ఆరాగా అడిగింది. డిటెక్టివ్ లా పోజు పెట్టి. 

 

సుజీ ఠక్కున చెప్పింది- "సరేలే. ఆవిడకి చిన్నకోడలు శ్రీలత పుట్టింటి భాష, యాస బాధ విషయంలో ఏ బాధా లేదు కానీ, పాపం వాళ్ళ పుట్టింటి వాళ్ళ పెట్టిపోతల విషయం లో ఎప్పుడూ ఎతీపొడుస్తూనే ఉంటారు. మా పుట్టింటి మాటల్లో మర్యాద తగ్గిందనటమూ,  శ్రీదేవి పుట్టింటి పెట్టిపోతల్లో మర్యాద తక్కువైందని సాధించటం ఆవిడకి రోజూవారీ కార్యక్రమాలే.  నాకయినా అలవాటయిపోయింది కానీ, ఆ అమ్మాయయితే ఈవిడ ధోరణికి విస్తుపోతూంటుంది. ఈ కాలంలోనూ ఈ ఆరళ్ళేంటని?  ఈ మధ్యే, ఈవిడతో పడటం నా వల్ల కాదంటూ తేల్చేసి, ట్రాన్స్ ఫర్ చేయించుకుని బెంగళూర్ వెళ్ళిపోయింది. 

 

విన్నూ వెంటనే అంది - " నువ్వూ అదే పని చేయొచ్చుగా? ఆవిడనే మాటలు పడుతూ ఎంతకాలమిలా?"

 

సుజీ కాసేపు మౌనంగా ఉండిపోయింది. ఆ పై మెల్లిగా అంది. "పాపం, నా వెంట అలా పడతారు కానీ, మా పిల్లలంటే ప్రాణమావిడకి. ఒక్కపూట పిల్లలకి  ఒంట్లో బాలేకపోతే  నానా హైరానా పడతారు. అది తిననూ, ఇది తిననూ అని మారాము చేస్తుంటే కూడా విసుక్కోకుండా ఏదోటి చేసిపెడతారు. ఉద్యోగాన్నుంచి ఏ రాత్రి ఇంటికి తిరిగొచ్చినా, నా పిల్లలకి ఆవిడున్నారనే భరోసా. పిల్లలకూ అంతే. బామ్మంటే ప్రాణం. వాళ్ళని విడదీయలేనుగా? ఒకటీ,రెండూ లోపాలని భరించుకోలేక, మనుషులనే వదులుకుంటామా? సరేలే, ఈ ముచ్చట్లు ఎపుడూ ఉండేవే కానీ, మరేవయినా ఇక్కడి విషయాలు చెప్పు. చాలారోజుల తర్వాత కలిసాము." అంటూ టాపిక్ మార్చేసింది.

 

ఆ మాటతో కబుర్ల పంథా మారింది. కానీ, నా ఆలోచనలు అక్కడే చిక్కుకుపోయాయి. 

 

పొద్దునే అర్ణవ్ ఇండియన్ మామ్స్ ని ఒకే గాటన  కట్టటం గుర్తొచ్చింది. వాడి ఫ్రెండు పేరు తప్పు పలికినందుకు ఎంత తేలిక చేసాడూ? అయితే మాత్రం, వాణ్ణి వదులుకుంటానా?  సుజీ వ్యక్తిత్వ పరిధి పెరిగింది. తన అనుకుంటే, తప్పు చేసినా, తప్పు పట్టినా తప్పనిపించదేమో. 

 

అంతట్లో తెగేలా లేవనిపించిన ఆలోచనలన్నిటినీ, ఆ కాసేపటికలా పక్కనబెట్టి సుజీతో గడిపాను. 

 

సుజీ, విన్నూ ఇంటికెళ్ళాక మళ్ళీ ముసురుకున్నాయి ఆలోచనలు.

అసహనాలు, అహాలు ఏ విపరీతానికీ దారి తీయనంతవరకూ ఫర్లేదు. చిన్న చిన్న సర్దుబాట్లతో కలిసిఉండవచ్చు. హద్దు మీరితేనే సమస్యలు. 

 ప్రేమించి పెళ్ళి చేసుకుని సుఖంగాఉన్న కూతురినీ, అల్లుడినీ అంగీకరించలేక, అల్లుడిని హతమార్చిన మామగారి నిర్వాకం ఎన్ని ఛానళ్ళు చూపించలేదూ? చక్కని జీవితాలెన్నిటినో ఛిద్రం చేసిందీ ఓ రకమైన అంతరమేగా?  

 

ప్రపంచం చిన్న కుగ్రామంగా అవుతున్నప్పటికీ, కనిపించని సరిహద్దు రేఖలు ఎక్కడికక్కడికి మరిన్ని పెరిగిపోతున్నాయేమో? మనం చెరిపేందుకు వీలులేనన్ని సన్నని రేఖలు. అదృశ్యంగా విడదీసేవి కొన్నయితే, రేఖల ఆధారంగా గోడలు వెలిసి ఎక్కడికక్కడ విడగొట్టేవి మరికొన్ని. ఇవన్నీ చెరిగేదెలాగ? పరస్పర అసహనాలు తగ్గేదెలాగ? ఆడ/మగ అనీ, కులం అనీ, భాష అనీ, ఆస్థులనీ, ప్రాంతం అనీ, యాస అనీ, రాష్ట్రం అనీ, దేశం అనీ...వర్ణం అనీ ఇలా ఎన్ని ఫిల్టర్లు? వేరు చేసేందుకు? అన్నిటిమధ్యా పరస్పర గౌరవంతో ఏ ప్రెజ్యూడీస్ లేకుండా హాయిగా బతికేయలేమా? 

 

నా ఆలోచనలని తెగ్గొడుతూ,  ఆఫీస్ మెసెంజెర్ లో క్లయంట్ నుంచి మెసేజ్ వచ్చింది. వారం నుంచీ మా పని ముందుకు సాగకుండా యాక్సెస్ ని అడ్డుకుంటున్న ఫాల్స్  ఫైర్-వాల్ ని కనిపెట్టి తొలగించామనీ, ఇక, ప్రాజెక్టు సాఫీగా ముందుకు సాగవచ్చనీ. 

 

ఇలా, మనసుల మధ్య అంతరాల అడ్డుగోడలనీ నీ తొలగించేసి ప్రపంచాన్నీ హాయిగా ముందుకు సాగనిచ్చేవారెవరుంటే బాగుండునేమో కదా?

*****

bottom of page