top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

మెల్ బోర్న్ సాహితీ సదస్సూ మరియు

 మసాలా దోశలూ...

వంగూరి చిట్టెన్ రాజు

vanduripipa-oct_edited.jpg
vanguri-dosa_edited.jpg

గత ఆగస్ట్ నెలలో మొదటి సారిగా నేను ఆస్ట్రేలియాలో మెల్ బోర్న్ నగరానికి వెళ్లి వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చుటకు కారణాలు మళ్ళీ నవంబర్ లో అక్కడికి వెళ్ళాలి కాబట్టిన్నీ, అక్కడ మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండే అవకాశం ..అనగా డబ్బు..లేదు కాబట్టిన్నీ, ఇక్కడ మా క్వీన్ విక్టోరియా వంటింట్లోకి వెళ్ళినా, వర్క్ లోకి వెళ్ళినా కారములు, మిరియములు నూరుచుండుట వలనా వెనక్కి వచ్చాను. అయినా మళ్ళీ నవంబర్ లో అక్కడికి ఎందుకు వెళ్ళాలోయ్, మీ ఆవిడ నిన్ను అక్కడికి నుంచి అలాగే అండమాన్స్ పంపించడానికా లేక  అసలు ఇంగ్లండ్ వాళ్ళు కరుడుకట్టిన ఖైదీలని అక్కడ వదిలి పెట్టారు కాబట్టే ఆస్ట్రేలియా దేశం పుట్టింది కాబట్టే నిన్ను కూడా అక్కడ శాశ్వతంగా పంపించే ఏర్పాటా అని ఎవరూ అనుమాన పడక్కర లేదు. ఎందుకంటే ఈ సారి తను కూడా వస్తానని బెదిరిస్తోంది. నువ్వు పెట్టే ప్రపంచ ఈ సదస్సులకి నేనెప్పుడూ రాలేదు కదా... సాహిత్యాన్ని ఎలా ఉద్దరిస్తున్నావో స్వయంగా చూద్దాం అనిపించింది అని కుండ బద్దలు కొట్టింది మా క్వీన్ విక్టోరియా. అనగా మెల్ బోర్న్ లో నా బండారం బయట పడిపోయే అవకాశం ఉంది అన మాట.

క్రిందటి సారి మెల్ బోర్న్ వెళ్ళినప్పుడు ఒక తమాషా జరిగింది. మొదటిది ఏమిటంటే వెళ్ళిన రోజు పొద్దున్నే మమ్మల్ని ..అంటే “పద్మ భూషణ్” యార్లగడ్డ వారినీ, ‘భూషణ ధూషణ తిరస్కారములు ఆశీస్సులుగా తలచే” నన్నూ మెల్ బోర్న్ తెలుగు సంస్థ పెద్దాయన ఒకాయన “మీకు మంచి టిఫిన్ పెట్టిస్తా’ అని ఆశపెట్టగానే నేను ఆవేశపడి ఒక గొప్ప ప్రఖ్యాతి గల రెస్టారెంట్ కి వెళ్ళాలి కాబోలు అనుకుని సెంటు కొట్టుకుని రెడీ అయిపోయాను.

 

తీరా చూస్తే ఆయన బాగా ఖరీదైన ప్రాంతాలన్నీ దాటి పోయి ఊరవతల మా గైగోలు పాడు లాంటి చిన్న చోట “దోశ గుడిశ” అనే కాకా హోటల్ కి తీసుకెళ్ళారు. ఇక్కడ ఫోటో పెట్టిన ఆ హోటల్ వారు తెరవడానికి అర గంట ముందే వెళ్లి పోయిన మేము అక్కడే ఉన్న “అన్నీ ఆర్గానిక్” అనే తెల్ల ఆస్ట్రేలియన్ వాళ్ళ  కొట్లో తారట్లాడాం. నిజానికి ఇక్కడ ‘తెల్ల’ ఆస్ట్రేలియన్ అని వేరే రాయక్కర లేదు. ఎందుకంటే అమెరికా లాగా ఇక్కడ నల్ల వాళ్ళు లేరు. అయితే కావలసినంత మంది రక రకాల పసుపు, గోధుమ రంగు వాళ్ళు ఉన్నారు. ఈ ఆర్గానిక్ కొట్టు లో నాకు ఆశ్చర్యం వేసింది ఏమిటంటే బియ్యం, మిరప కాయల దగ్గర నుంచి అరటి పళ్ళు, రొట్టె ముక్కలూ అన్నీ ఆర్గానిక్ మట్టి కొట్టుకు పోయే ఉన్నాయి. అంటే మొత్తం పరిశుభ్రతా లోపమే. అందుకే గైగోలు పాడు అన్నాను. ఆస్ట్రేలియాలో కూడా అలా ఉండడం చూసి మన పవిత్ర భారత దేశం మీద శుభ్రత విషయంలో ఇక ముందు ఆర్గానిక్ చూపు చూడకూడదు అని అనుకుంటుంటూ ఉండగా దోశ గుడిశ వారి తలుపులు తెరుచుకున్నాయి. నా అంత పొట్టి వెధవ కూడా తలవంచుకుని లోపలకి వెళ్ళాల్సిన ఆ హోటల్ లోకి వెళ్ళగానే “అనిల్ గారు ఉన్నాడా?” అని తలుపు తీసి పట్టుకున్న కుర్రాడిని అడిగారు మమ్మల్ని తీసుకెళ్ళినాయన. అప్పటికే ఆ కుర్రాడు మొహం వేళ్ళాడేసి మాకేసి విచిత్రంగా చూస్తున్నాడు. నేను కొట్టుకున్న కునేగా మరి కొళుందు పరిమళం ఏమైనా ఆ హోటల్ సహజమైన వాసనకి డేమేజ్ చేసిందా అని నేను అనుకున్నాను కానీ ఆ కుర్రాడు అలా నోరు వెళ్ళబెట్టడానికి కారణం పూర్తి తెలుగు పంచెకట్టులో నా పక్కనే ఉన్న యార్లగడ్డ మహాశయుల వారు అని కనిపెట్టేశాను.

ఇక మేము కుర్చీలలో కూచుని “కంగారు”  ఇడ్లీలు తెప్పించుకున్నప్పుడు మా హోస్ట్ గారు చెప్పిన విషయం ఆశ్చర్యం కలిగించింది. విషయం ఏమిటంటే ఇలాంటి చిన్న చిన్న దోశ గుడిశలు మెల్ బోర్న్ లో నలభయ్యో, యాభయ్యో ఉన్నాయిట. అన్నింటికీ యజమాని అయిన అనిల్ అనే ఆయన అక్కడి తెలుగు వారికి చాలా అండదండలుగా ఉంటారుట. ముఖ్యంగా ఆయన అక్కడ చదువుకుంటున్న సుమారు 400 మంది తెలుగు విద్యార్ధులకి ఈ రెస్టారెంట్స్ లో ఉద్యోగాలు ఇచ్చి, వారి చదువుకి ఆటంకం లేకుండా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇస్తారుట. ఇది విని ఆశ్చర్య పోయి మాకు తలుపు తీసి, తరవాత  ఇడ్లీలు పట్టుకొచ్చిన యువకుడిని “నువ్వు ఏం చేస్తుంటావు?’ అని అడిగాం. ఆ కుర్రాడు నవ్వుతూ “ఇక్కడ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నాను” అన్నాడు, ఏదో పదో క్లాసు లాగా. “వావ్” అనుకుని “ఎందులో?” అంటే “ఎలెక్ట్రానిక్స్ ఇంజనీరింగ్” అనీ, మరో మూడు, నాలుగుగేళ్ళు ఇక్కడే పని చేస్తే తన పిహెచ్.డి పూర్తి అయిపోతుంది అనీ చెప్పాడు. ఆ యువకుడి పేరు రాజేష్. మేము వెళ్ళిపోయే ముందు “మీతో ఫోటో తీయించుకుంటాను, సార్ “ అని ఫోటోలు దిగాం. అతను దిగదల్చుకున్న ఫోటోలు “పద్మ భూషణ్” గారి తోటే కానీ, నేను కూడా సంతోషంగా దూరి పోయాను వాటిల్లో ! ఆ ఫోటో ఒకటి ఇక్కడ జతపరిచాను.

 

మరింత ఆశ్చర్యం ఏమిటంటే మేము బిల్లు కట్టబోతుంటే “మీ లాంటి వారు వచ్చినప్పుడు డబ్బు పుచ్చుకో కూడదండి”  అంటూ డబ్బు తీసుకో లేదు. “మరి మీ ఓనర్ గారు ఏమీ అనరా?” అని అడిగితే “నేను చెప్పుకుంటానండి. ఏం పరవా లేదు. అ యామ్ ఎమ్ పవర్డ్” అనగానే నేను ఈ మధ్య ఇండియా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఒకటి గుర్తుకి వచ్చింది.

విషయం ఏమిటంటే నాకు పాడడం ఎలాగా రాదు కాబట్టి..లేదా అత్యంత ఘోరంగా తప్ప పాడలేను కాబట్టి బాగా పాడించే వాళ్ళ చేత ఆ పని చేయించి, ఆ తరవాత వాళ్ళని భోజనానికి తీసుకెళ్ళి ఆనందించడం ఇండియా వెళ్ళినప్పుడు నా అలవాటు.ఆ రోజు కూడా చిక్కడ్ పల్లి లో పాటల కార్యక్రమం అయ్యాక అందరం రాత్రి భోజనాలకి ఏదో ఎయిర్ కండిషన్డ్ రెస్టారెంట్ కి వెళ్లాం.

ఆ రోజు మాతో పాటు నిర్వాహకులలో ఒకరైన మరొక పెద్ద మనిషి కూడా వచ్చాడు. అందరం కుర్చీలలో సెటిల్ అవగానే ఆయన స్టేజ్ మీద షోకు కోసం వేసుకున్న కోటు తీసేసి కుర్చీకి తగిలించి చెమట్లు తగ్గగానే “హమ్మయ్య” అని పైకే ఆనందపడ్డాడు. కానీ ఐదు నిముషాల ఏసీ అనుభవించగానే చలితో వణకడం మొదలు పెట్టి అప్పుడే వచ్చిన రాజేష్ లాంటి వెయిటర్ ని “ఒరేయ్. ఆ ఏసీ కాస్త తగ్గించు” అని ఆర్డర్ వేశాడు. హోరినీ, “ఏమండీ అనో, కనీసం ఏమోయ్ అని అయినా అనకుండా ఏకంగా ఒరేయ్ అని ఆ వెయిటర్ ని పిలిచిన ఆ పెద్ద మనిషి నాకు చాలా చిన్నగా కనపడ్డాడు. రాజేష్ ఏసీ ఎంత తగ్గించాడో లేదో తెలీదు కానీ ఈ చిన్నాయన ప్రతీ ఐదేసి నిముషాలకీ అతన్ని అలాగే పిలవడం, ఒక సారి మాటల స్థాయి పెంచి “ఏరా, రాస్కెల్. తగ్గించావా లేదా? లేక పోతే మీ బాస్ ని రమ్మను. నా తడాఖా చూపిస్తాను” అన్నాడు. రాజేష్ కి మండింది అంటే మండదూ. వెళ్లి బాస్ ని తీసుకొచ్చాడు.

 

ఈ బాస్ గారు వేసుకున్న కోటు చిన్నాయన కోటు కన్నా బాగా ఖరీదైన మూడు భాగాల సరుకు. బాస్ ని చూడగానే ఈ చిన్న బాస్ “నేను ఎవరో తెలుసా. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా?” అని గొంతు మరి కొంచెం పెంచాడు. అప్పటికే పక్కన కూచున్న నేను సిగ్గుతో కుచించుకు పోయాను. అయితే నేను అనుకోని విధంగా ఆ బాస్ వారు అలా పైకి చెయ్యి ఊపగానే ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో.. అరి వీర భయంకరంగా ఉన్న ఒక బాడీ గార్డ్ రంగ ప్రవేశం చేశాడు. అతని వాలకాన్నీ, బొడ్డులో ఉన్న పిస్టల్ నీ చూడగానే పెద్ద నిర్వాహకుడి గారి శరీరం ఉష్ణోగ్రత ఎందుకైనా మంచిదని మామూలు స్థాయికి అర్జంటుగా వచ్చేసింది. పైగా ఆ అంగ రక్షకుడు నిర్వాహకుడి కుర్చీకి వేలాడేసిన కోటు తీసి ఆయనకీ సగౌరవంగా కప్పి సలాం కొట్టి నిష్క్రమించాడు. పులి కాస్తా పిల్లి అయిపోయింది. నాకు మటుకు ఆ పెద్దాయన తాలూకు స్కాచ్ బిల్లు తడిపి మోపెడయింది.  

ఏమైతేనేం.... రాబోయే నవంబర్ 3-4, 2018 తారీకులలో జరగబోయే 6వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకి మాకు ఒక ప్రధానమైన సమస్య తీరిపోయింది.  దోశల సప్లై ఎవరిదో నిర్ణయం జరిగిపోయింది. ఇంకా చాలా నిర్ణయాలు ఉన్నాయి. ఒక్కొక్కటీ నరుక్కుంటూ వస్తున్నాం.

 

ఇప్పటికి ఆ ప్రపంచ సాహితీ సదస్సుకి ఇండియా నుంచి 40 మంది, సింగపూర్ నుంచి ఆరుగురు, మలేషియా నుంచి 30 మంది వచ్చేలా ఉన్నారు. ఇతర దక్షిణ ఆసియా దేశాల నుంచీ, న్యూ జీలాండ్ నుంచీ కూడా స్పందన బావుంది.

ఉన్న చోటే కాక తెలుగు సాహిత్యాన్ని వెతుక్కుంటూ ప్రపంచంలో అన్ని చోట్లకీ వెళ్లి ఆ వెన్నెల కురిపిద్దాం మనందరం....ఏమంటారు?    

   

***

bottom of page