top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

సత్యాన్వేషణ-6

భూగోళం బ్రద్దలవుతున్నది!  

సత్యం మందపాటి

అనగా అనగా ఒక రాజుగారు. ఆయనకి తెలియకుండా రాజకుమార్తెకి ఒక వెర్రిబాగులవాడినిచ్చి పెళ్లి చేయాలని, అలాటి వాడి కోసం వెతుకుతున్నారుట. దానికి కారణం, ఈ రోజుల్లోలాగానే, అప్పుడు కూడా పదవీ వ్యామోహాలు.

ఒకచోట ఎత్తైన చెట్టు మీద కూర్చుని, తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటున్నాడుట ఒక అసలు సిసలైన వెర్రిబాగులవాడు. కొమ్మ విరిగితే తను క్రింద పడి చనిపోతాడని కూడా ఆలోచనలేని ఒక వెర్రి వెంగళప్ప.

తర్వాత అతన్ని మించిన మహాగొప్ప వెర్రివాడెవరూ వుండరని, అతన్నే రాజకుమారికి ఇచ్చి పెళ్లి చేశారనీ, కాళికాదేవి అనుగ్రహం వల్ల అతనే మహాకవి కాళిదాసు అయాడనీ మనకొక కథ తెలుసు. ఈ కథ నిజమో, కల్పితమో తెలియదు కానీ, ‘వెర్రిబాగులవాడు’ అనే మాటకి మాత్రం మంచి నిర్వచనం చెబుతుంది.

ఇలా తాము కూర్చున్న చెట్టుకొమ్మని తామే నరుక్కుని, చావుని కొనితెచ్చుకునే వెర్రిబాగుల వాళ్ళు, మరి ఈ సాంకేతిక యుగంలో కూడా వుంటారా అని ప్రశ్న. ఉన్నారా ఏమిటి, వున్నారు.

అంతకన్నా పెద్ద వెర్రిబాగులవాళ్ళం, మీరూ, నేనూ, మనందరి చుట్టూ వున్న ఈనాటి ప్రపంచ ప్రజానీకం.

కోపం తెచ్చుకోకండి, ఆమాట ఎందుకు అన్నానో కొంచెం ఓపిక పడితే మీకే తెలుస్తుంది.

౦ ౦ ౦

ఇప్పటిదాకా మన ఖగోళ శాస్త్రజ్ఞులు, నక్షత్ర శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా కనుక్కున్నదేమిటంటే, ఈ విశాలవిశ్వానికి పధ్నాలుగు బిలియన్ సంవత్సరాల పైన వయసున్నది అని. దరిమిలా భూమి, సూర్యుడు మొదలైన ఈనాటి మన కక్ష్యలోని గ్రహాలు, గ్రహాలుగా కాక చల్లటి ధూళి, దుమ్ముతో కూడిన మేఘాలుగా అంతరిక్షంలో తిరుగుతూ వుండేవని తెలుస్తున్నది. క్రమంగా ఈ ధూళి, దుమ్ము ఒకదానికొకటి ఆకర్షించబడి, ఒక చోట చేరి తన చుట్టూ తనే తిరిగే ఒక పెద్ద పళ్ళెంలా (Spinning Disk) రూపాంతరం చెందింది. కొన్నాళ్ళకి వాటి మీద వుండే, రకరకాల వాయువులు, మండుతున్న ఘనపదార్ధాలూ ఆ వేడికి కలిసిపోయి చిన్న చిన్న గ్రహాలుగా తయారయాయి. వాటికి మధ్యలో వున్నది సూర్యగ్రహమయితే, దాని చుట్టూ భూమి, అంగారకం, శుక్రగ్రహం మొదలైనవి అవతరించాయి. ఇలా జరిగింది దాదాపు నాలుగున్నర బిలియన్ల సంవత్సరాల క్రితం.

అప్పుడు మన భూమి మీద ఇప్పటిలా ప్రాణవాయువుగానీ, నీరుగానీ లేదు. ఎన్నోరకాల వాయువులతో వేడిగా, మండిపడుతూ వుండేది భూమి. కాలక్రమేణా భూమికి గుద్దుకున్న చిన్నచిన్న గ్రహాల ద్వారా భూమి మీదకి నీరు చేరి నదులుగా, తర్వాత సముద్రాలుగా మారాయి. మూడున్నర బిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మీద ప్రాణకోటి, అంటే ఒకే జీవకణంగల ప్రాణం (Single Cell Life) మొదలైంది. రెండు బిలియన్ల సంవత్సరాల క్రితం పత్రహరిత జీవనం (Photosynthetic Life) ఆరంభమైంది. దానితో భూమి మీద ప్రాణవాయువు పెరిగి, మిగతా జీవరాసులు బ్రతికే అవకాశం కలిగింది.

అప్పటిదాకా ఏకకణ సూక్ష్మజీవాలు (Single cell micro-organism) జీవించిన భూమి మీద, క్రమేణా అంటే ఆరు వందల మిలియన్ సంవత్సరాల క్రితం, బహుకణ జీవరాసులు అవతరించాయి. అంటే ముందు తరాల ఆంత్రోపాడ్స్ అన్నమాట. 500 మిలియన్ సంవత్సరాల క్రితం నీటిలో బ్రతికే జీవరాసులు (చేపలు) అవతరించాయి. తర్వాత చెట్లూ, చేమలూ వచ్చాయి. 400 మిలియన్ సంవత్సరాల క్రితం పురుగూ పుట్రా, 300 మిలియన్ సంవత్సరాల క్రితం జల-భూచరాలూ, పాములూ, 150 మిలియన్ సంవత్సరాల క్రితం పక్షులూ అవతరించాయి. 65 మిలియన్ సంవత్సరాల క్రితం, ఉల్కల వర్షపాతంలో డైనాసోర్లు చనిపోవటం జరిగింది. నాలుగు మిలియన్ల సంవత్సరాల క్రితం, రెండు కాళ్ళ మీద నడిచే జంతువులు (Australopithecus Afarensis) అవతరించాయి.

రెండున్నర మిలియన్ల సంవత్సరాల క్రితం, మనుష్యులను పోలిన హోమో హాబిలిస్, క్రమేణా హోమో ఎర్గ్ స్టర్, తర్వాత అంటే లక్ష సంవత్సరాల క్రితం మనిషికి దగ్గర పోలికలు కలిగిన హోమో సెపియన్లు అవతరించారు. క్రమేణా మొట్టమొదటి ఆదిమానవుల అవతరణ జరిగింది. అంటే మన భూమి అవతరణంలో మనిషి జీవిత కాల సమయం 0.004 శాతం మాత్రమే. 50,000 సంవత్సరాల క్రితం దాకా ఆది మానవుడికి అంతగా తెలివితేటలు లేవనీ, ఆత్మరక్షణ కోసం జంతువులని చూసి మనుగడ తెలివితేటలు (Survival Intelligence) నేర్చుకున్నాడనీ పరిశోధన ద్వారా తెలుస్తున్నది. దీన్ని బట్టి మనిషి జన్మ కన్నా ఎంతో ముందుగానే ఈ గ్రహాలూ, చెట్లూ, జంతువులూ అన్నీ వున్నాయి. మనిషి చిట్టచివరగా వచ్చిన వాడు మాత్రమే.

మరి చిట్టచివరిగా ఈ భూలోకంలో అవతరించిన మనిషి, మొదట్లో ఎన్నో వేల సంవత్సరాలు బాగానే ప్రకృతిలో కలిసిపోయి వున్నా, గత రెండు మూడొందల సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడయ్యా అంటే..

తను కూర్చున్న కొమ్మని తనే నరుక్కుంటున్నాడు. ఎందుకు? వట్టి వెర్రిబాగులవాడు కనుక.

తన నాశనానికీ, తన పుట్టినిల్లు అయిన భూగోళం నాశనానికీ నాంది పలుకుతున్నాడు.

అది ఎలాగమ్మా అంటే..

౦ ౦ ౦

పంచభూతాలు అంటే - గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూమి.

ప్రపంచమంతటా ప్రజలు తాము సృష్టించుకున్న కొన్ని వందల మతాలలో ఈ పంచ భూతాల గురించి మనం చదువుతూనే వున్నాం. ఎందుకంటే అవే అందరికీ ప్రకృతిలో కనిపించేవి కనుక. ఈజిప్షియన్, రోమన్, గ్రీక్, లాటిన్, ఇండియన్, చైనీస్, మాయన్ లాటి ఎన్నో సంస్కృతులలో, వీటిని దేవుళ్ళుగా భావించి పూజులు చేయటం కూడా మనకి తెలుసు.

అవును, మన మనుగడకి అవసరమైన ఈ ఐదింటినీ గౌరవించటంలో తప్పులేదు. అంతే కాదు, ఎంతో అవసరం కూడా. అదీ బాగానే వుంది.

కానీ, మనం కూర్చున్న కొమ్మల్ని మనం నరుక్కోవటం మనకి సరదా.. సరదా ఏమిటి? ఇది సరదా కాదు, దురద.. అందుకే...

గాలిని గౌరవించటం మానేశాం. మనకే కాక, మనతోపాటు కలిసి వుండవలసిన జంతువులకి కూడా, తగిన ఊపిరి అందకుండా కాలుష్యం పెంచేశాం. నీటిని ప్లాస్టిక్ సీసాలతో, చమురుతో, ప్రమాదకరమైన రసాయనాలతో నింపేశాం. ఆకాశంలో ఓజోన్ లేయర్లో చిల్లులు పెట్టాం. అగ్నికే మంట పెట్టేశాం. కోట్ల ఎకరాల చెట్లనీ చేమల్ని నేలపాలు చేశాం. తగలబెట్టేశాం. చమురు కోసం, బొగ్గు, బంగారం, ఇతర ఖనిజాల కోసం భూమిని లోతుగా తవ్వి పారేస్తున్నాం. డొల్ల చేస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ గురించి మన శాస్త్రజ్ఞులు చెబుతున్న మాటలు గట్టునపెట్టి, ఆ గ్లోబల్ వార్మింగుకి కారణం మనమే అయినా, ఇదంతా దేవుడి చేతుల్లో వుంది, మన చేతుల్లో ఏమీ లేదు అని మన అజ్ఞానాన్ని మనమే సిగ్గు లేకుండా బయట పెడుతున్నాం. పేరంటానికి వచ్చి పలువురిలో కూర్చున్న పెద్ద  ముత్తయిదువు, ఏదో చేసి ఏమీ తెలియనట్టు గమ్మున కూర్చున్నదిట!

రకరకాల రసాయనిక విష కాలుష్య పవనాలను, వాటి పొగ గొట్టాలలోనించీ వదులుతున్న ఎన్నో దేశాల్లోని ఫాక్టరీలు కార్బన్ మొనాక్సైడ్, కార్బన్ డైయాక్సైడులను అమితంగా వదులుతున్నాయి. రోడ్లమీద నడుస్తున్న కార్లు, బస్సులు రోడ్ల మీద నడిచే పొగ గొట్టాలుగా తయారయాయి, సముద్రాల్లో చమురు వదిలిపెట్టి, దాన్ని తగలబెడుతున్న ఎక్సాన్ లాటి పెద్ద కంపెనీలు, మనం తగలబెడుతున్న వనాలూ వనరులు... ఇలాటి వన్నీ మనం పీలుస్తున్న గాలిని కల్మషం చేస్తున్నాయి. కార్బన్ డైయాక్సైడుని తీసుకుని, ప్రాణవాయువుని ఇచ్చే చెట్టూ చేమలని నరికి పారేస్తున్నాం.

గాలిని కాలుష్యం చేసేవి ముఖ్యంగా సల్ఫర్ డైయాక్సైడ్, ఓజోన్, కార్బన్ మొనాక్సైడ్, మెతిన్ గాస్, Particulate Matter PM10 – అంటే ఇది ఇంగ్లీషులోనే చెబితే బాగుంటుంది. Small suspended particles of varying sizes. ఇవన్నీ గాలిలో చేరితే, మన మనుగడకీ, మన నివాస గ్రహానికీ ప్రమాదకరమైనవే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చిన లెఖ్కల ప్రకారం, ఒక ఘన మీటరు వైశాల్యం గాలిలో Particulate Matter PM10, 60 మైక్రో గ్రాముల కన్నా తక్కువ వుంటే క్షేమం అనీ, అంతకన్నా ఎక్కువ వుంటే ప్రమాదం అనీ చెబుతున్నారు. ఇలా చెప్పిన దానికన్నా మరీ ఎక్కువ  కాలుష్య నగరాలలో ఢిల్లీ (292 PM10), సెనగాల్ దేశంలో వున్న డాకర్ (146), ముంబై (104), బైజింగ్ (92) వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో వున్నాయి.

కాలుష్యమైన గాలిని పీల్చి మనుష్యులు చనిపోతున్న దేశాలలో, ఏటేటా ప్రతి లక్షమంది జనాభాలో వరుసగా ఆఫ్గనిస్తాన్ 406 మరణాలతోనూ, పాకిస్తాన్ 207మరణాలతోనూ, భారతదేశం 195 మరణాలతోనూ  మొదటి మూడు స్థానాల్లో వున్నాయి.

ప్రపంచం మొత్తం మీద ఇలాటి ప్రమాదావస్తలో వున్న మొదటి ఇరవై నగరాల్లో, మన భారతదేశంలోనే 13 వున్నాయి. ప్రపంచంలో కల్లా అతి కాలుష్యమైన నగరం మన ఢిల్లీ.

ఒక్క బొగ్గు మండించటం వల్లనే, ఆ గాలి పీల్చి ప్రపంచంలో దాదాపు ఐదు లక్షలమంది ప్రతి ఏటా చనిపోతున్నారని అంచనా. అమెరికా గాలిలో వదులుతున్న కార్బన్ డయాక్సైడ్ ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఎక్కువ. చైనా కన్నా రెండు రెట్లు, ఇండియా కన్నా తొమ్మిది రెట్లు ఎక్కువ. మన ట్రంపుగారు, ఇంతకుముందు ప్రెసిడెంట్లు బొగ్గు మీద పెట్టిన ఆంక్షలన్నీ తీసివేయటమే కాకుండా, ‘I want to end the war on beautiful and clean coal’ అన్నాడు. అమెరికాలోని కార్లు, ట్రక్కులూ ఏటా 1.7 బిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడుని గాలిలో వదులుతున్నాయి. 2014 దాకా కొంచెం తగ్గుముఖం పట్టిన ఈ కాలుష్యం, ట్రంపు గారి ధర్మమా అని మళ్ళీ పుంజుకున్నది.

ఈమధ్య గ్లోబల్ వార్మింగ్ అనే మాటని ఎక్కువగా వింటున్నాం. ఇటు ధరలే కాదు, భూగోళం కూడా మనిషి స్వార్ధాన్ని చూసి మండిపడుతున్నది మరి. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుందంటే, ఈ కాలుష్యపు గాలులు బయట వారావరణంతో కలిసి, భూమి మీద నించీ పరావర్తనం చెందిన సూర్యరశ్మిని తమలో ఇముడ్చుకుంటాయి. ఇలా జరగుతున్న కొద్దీ, అలా ఇముడ్చుకున్న వేడి మళ్ళీ మన భూమిని ఇంకా వేడి చేస్తుంది. దీనికి మంచి ఉదాహరణ ఏమిటంటే, మనం పడుకుని ఒకదాని మీద ఇంకొక రగ్గు వరుసగా కప్పుకుని పడుకుంటే, మన శరీరం భరించలేనంతగా ఎంత వేడెక్కి పోతుందో, మనకి తెలుసు.

అదీకాక, ఏటేటా ఎన్నో అడవులు, నేల మీద గడ్డీ తగలబెట్టేసుకుంటున్నాం. ఆకాశంలోకి green house gases వదిలిపెడుతున్నాం. ఒక్క కాలిఫోర్నియాలోనే ఈమధ్య లక్షల ఎకరాల నేల మీద చెట్లూ, గడ్డితోపాటూ అన్నీ తగలబడిపోయాయి. నలభై వేలమంది ప్రజలని ఇతర ప్రదేశాలకు తరలించారు. ప్రతి సంవత్సరం అమెరికా లోని పధ్నాలుగు రాష్ట్రాలలో కనీసం వందసార్లు మంటలు ఆకాశాన్నందుకుంటాయి. మిలియన్ల ఎకరాలు అగ్ని పాలవుతాయి. ప్రపంచమంతటా ఇలాటి నిత్యాగ్నిహోత్రాలు ఎన్నో. మరి ఇంత అమితమైన వేడి, భూమిని ఏం చేస్తుంది?

భూమిమీద దాదాపు 71 శాతం నీరు వుంది అంటున్నారు. దానిలో 96.5 శాతం సముద్రపు నీరే వుంది. అలాటి సముద్రాలు ఇంతకుముందు కన్నా ఇప్పుడు మూడు డిగ్రీలు వేడెక్కాయి. మూడు డిగ్రీలేనా అనకండి. మన సువిశాల భూగోళంలో వున్న అంత నీటిని మూడు డిగ్రీలు పెంచటానికి ఎంత వేడి చేయాలో ఊహించండి. కాఫీ పెట్టుకునేటప్పుడు ఒక గిన్నెడు నీళ్ళు వేడి చేసుకోవటానికే ఎంతసేపు మంట పెట్టాలో (Heat) చూస్తే, మన సముద్రాలను వేడి చేయటానికి ఎంత మంట పెట్టామో తెలుస్తుంది. ఈ గ్లోబల్ వార్మింగ్ ఎంత ప్రమాదకరమైనదో అర్ధమవుతుంది.

సముద్రంలో వున్న వేడి వల్ల, ఎక్కువ తుపానులు వస్తాయి. అంతేకాదు మామూలు తుపానులు, ఇంకా ఉధ్రుతమవుతాయి. ఉదాహరణకి కేటగిరీ మూడు తుపాన్, నాలుగు లేక ఐదు కేటగిరీ తుపానుగా మారటం మనం చూస్తూనే వున్నాం. ఈమద్య అమెరికా భూభాగాన్ని తాకిన కట్రీనా, శాండీ తుపానులు అలాటివే. అంటార్క్టికాలో 2002నించీ ఈరోజు దాకా, సంవత్సరానికి 134 బిలియన్ మెట్రిక్ టన్నుల మంచు కరిగిపోతున్నది. ఇది ప్రతి సంవత్సరం ఎక్కువవుతున్నదే కానీ, తగ్గటం లేదు. దీనివల్ల సముద్రాలలో ఈ నీరు చేరి, అవి పొంగుతాయి. నారు పోసినవాడే నీరు పోస్తాడని నమ్మేవారికి, ఆయన పోసే నీరు సునామీల రూపంలో వూళ్ళకి వూళ్ళే కాక, దేశాలకి దేశాలనే ముంచుతుంది. ఈ మధ్యనే చూశాం, జపానులో మొదలయి శ్రీలంక దాకా వచ్చిన సునామీని.

కొన్ని చోట్ల ఈ వేడి గాడ్పుల వల్ల, కొన్ని చోట్ల సునామీల వల్ల ఎన్నో జంతువులు చనిపోతాయి. పొలాలు బీడు కట్టిపోవటమో, వరదలకు ముణిగిపోవటమో జరుగుతుంది. ఏది జరిగినా పంటలు నాశనమై, ఆహారం కష్టమై పోతుంది. కొంత కాలానికి మానవ మనుగడ కూడా, ఒకనాటి డైనాసోర్ల చరిత్రలా మిగిలిపోయే అవకాశం వుంది.


ఈ సంవత్సరమే అమెరికాలో 41 నగరాల్లో రికార్దు ఉష్ణోగ్రత వచ్చింది. ఆరిజోనా రాష్ట్రంలో 121 నూట ఇరవై డిగ్రీలు, లాస్ ఏంజలెస్ 117 నమోదయింది. చల్లగా వుండే కెనడాలో 70 మంది వేడిగాడ్పుల వల్ల చనిపోయారు.   భరించలేనంత చల్లగా వుండే సైబీరియా కూడా వేడెక్కింది. స్వీడెన్లో గత 260 సంవత్సరాలలో చూడని ఉష్ణోగ్రతని ఇప్పుడు చవిచూశారు. మరి మీ వూరెలా వుంది, మాష్టారూ?

ఇక ప్లాస్టిక్ అనే పదార్ధం మనకెంత సహాయం చేస్తున్నదో చూద్దాం.

2016వ సంవత్సరం లెఖ్ఖల ప్రకారం, ప్రతి సంవత్సరం 480 బిలియన్ ప్లాస్టిక్ సీసాలు, ఒక ట్రిలియన్ ప్లాస్టిక్ సంచులు, 141 మిలియన్ టన్నుల పాకేజింగ్ ప్లాస్టిక్, 269,000 టన్నుల ఆహార పదార్ధాలను వుంచే ప్లాస్టిక్,   500 మిలియన్ల ప్లాస్టిక్ కప్పులు, 16 బిలియన్ల ప్లాస్టిక్ కాఫీ కప్పులు, 14 మిలియన్ల ఫోమ్ కప్పులు, ఇలాటివింకా ఎన్నో, ప్రపంచవ్యాప్తంగా అమ్ముతున్నారు. వీటిలో దాదాపు 90 శాతం సముద్రాల పాలవుతున్నది. అంటే ప్రతి చదరపు మైలుకీ నలభై ఆరు వేల ప్లాస్టిక్ సరుకులు, మన సముద్రాల్లో పరచవచ్చుట! ఈ ప్లాస్టిక్ సామాన్లు తిని, నలభై నాలుగు శాతం సముద్రపు పక్షులు, తాబేళ్ళు, చేపలు తదితర సముద్ర జీవాలు చనిపోతున్నాయి.

నేను పైన చెప్పిన విషయాలు, నేను సేకరించిన సమాచారంలో సగం మాత్రమే. మన భూగోళం మీద ప్రేమ వున్నవారిని భయపెట్టటం కానీ, మన చేతుల్లో ఏమీ లేదు అని దులిపేసుకునే వారికి బోరు కొట్టించటం కానీ నా ఉద్దేశ్యం కాదు. మనం వుంటున్న ఇంట్లో, ఒక పక్కన వాన నీళ్ళు కారుతుంటే, వెంటనే బాగు చేయిస్తాం. మరి మనం వుంటున్న ఈ భూగోళాన్ని మనమే కాలుష్యం చేసుకుని, ఆకాశానికీ భూమికీ చిల్లులు పెట్టి, ఎలా నాశనం చేసుకుంటున్నామో చూపించటమే నా ముఖ్యోద్దేశ్యం. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుని, ఎలా మన పతనాన్ని మనమే కోరుకుంటున్నామో చూపిద్దమని నా ఆశ.

చెట్టు మీద కూర్చుని, మనం కూర్చున్న కొమ్మలని మనమే ఎలా నరుక్కుంటున్నామో చెబుదామనే తపనతో వ్రాస్తున్న వ్యాసం ఇది.

‘ఇవన్నీ పిచ్చి కబుర్లు, గురువుగారూ. మన భూగోళం, మనం బ్రతికుండగా బ్రద్దలవదు. కొన్ని వేల ఏళ్ళో, ఇంకా కొన్ని మిలియన్ల సంవత్సరాలో పడుతుంది పూర్తిగా పాడయిపోవటానికి. వచ్చే శుక్రవారం ఏ చెత్త తెలుగు సినిమాకి వెడతానో కూడా తెలియదు, అలాటిది ఇప్పుడే ఎందుకు మన భూగోళం గురించి ఆలోచించటం?”

అవును. నిజమే. మీరు భలే వారు సార్! బాగా చెప్పారు. మీకు మీరే సాటి.

కానీ నా చిన్నప్పుడు విన్న ఒక కథ గుర్తుకి వస్తున్నది.

ఒక పండు ముసలతను, తన కష్టార్జితం అంతా ఖర్చు పెట్టి, రోడ్డు పక్కన వరుసగా ఎన్నో మామిడి చెట్లు నాటుతున్నాడుట.  

ఒక తెలివిగల చదువు’కొన్న’ కుర్రవాడు, అతను చేస్తున్న పని చూస్తూ, “తాతా! నిన్ను చూస్తే ఇవాళో రేపో పోయేట్టు వున్నావు. ఎందుకు అలా బుధ్ధీ బుర్రా లేకుండా అన్ని చెట్లు నాటుతున్నావు? ఆ చెట్లు ఏపుగా పెరిగేదెప్పుడు? కాయలు కాసేదెప్పుడు? అవి పండేదెప్పుడు? నువ్వు తినేదెప్పుడు?’ అన్నాడుట ఎగతాళి చేస్తూ.

ఆ అమాయకపు ముసలివాడు, తన బోసి పళ్ళతో నవ్వుతూ, ‘నేను ఏమాత్రం చదువుకున్న వాడిని కాదు బాబూ. నాకవేమీ తెలియవు. నాకు తెలిసిందల్లా ఒక్కటే. మన తండ్రులూ, తాతలూ వేసిన చెట్ల నించే మనం ఈ రోజు తీయటి మామిడి పళ్ళు తింటున్నాం. ఇప్పుడు నేనూ, నువ్వూ కొత్త చెట్లు పాతితే, మన పిల్లలూ, మనుమలూ, మన పేరు చెప్పుకుని కొన్ని తరాల పాటు తింటారు’ అన్నాడు.

౦ ౦ ౦

bottom of page