top of page
sanchika 2.png
hasya.JPG

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సాహితీ సౌరభాలు-2

తెలుగు సాహితీ శోభ 

ప్రసాద్ తుర్లపాటి 

తెలంగాణాలో విరిసిన తెలుగు సాహితీ శోభ - 1

గోన బుద్ధారెడ్డి

తెలుగులొ మొట్ట మొదటి రామాయణము ద్విపద శైలి లో 1240లో  గోన బుద్ధారెడ్డి విరచిత "శ్రీ రంగనాధ రామాయణము".  

 

మార్గ - దేశి చందస్సులలో ఈ గ్రంధము రచింపబడటము చేత, పండిత పామర రంజకమైనది.

“ పదములర్ధంబులు భావముల్గతులు

పదశయ్య లర్ధ సౌభాగ్యముల్ అతులు

రసముల కల్పన ప్రాస సంగతులు

నసమాన రాతియు నన్నియు గలుగ

నాది కవీశ్వరుడైన వాల్మీకి

యాదరంబున పూర్వులందరు మెచ్చ

జెప్పిన తెలుగున శ్రీరామ చరిత

యొప్ప జెప్పెద కథాభ్యుదయమెట్లన.

అని ఆంధ్రభాషాదీశ విభుడు

వినుత కావ్యాగమ విమల మానసుడు

పాలితా చారు డ పర దాశరధి

భూలోక నిధి గోన బుద్ధ భూవిభుడు “

 

అని దేశీ కవితా పద్ధతిలో ద్విపద కావ్యంగా శ్రీమద్రామాయణ రచన సాగించాడు. సామాన్య జన బాహుళ్యమయిన స్త్రీల పాటలు, పదములనూ, భజన కీర్తనలనూ ఎన్నో ఈ కావ్యంలో చూడవచ్చును.

 

“ రాతి నాతిగా జేసే పదమటంచు ను ఖ్యాతి గాంచి

 ప్రీతితో నెర నమ్మితి, నా పాతకము కడ చాపు తండ్రి “

 

అన్నీ ఎన్నో కీర్తనలు జనబాహుళ్యములో ప్రసిద్ధి నొందినవి.

పాల్కురికి సోమనాధుడు, గోన బుద్ధారెడ్డి ఇంచుమించు ఒకే కాలములో రచనలు చేసిననూ, ఒకరు శైవ భక్తి ప్రభోధకంగా, మరియొకరు పరమ వైష్ణవముగా రచించినా ఇద్దరూ సారస్వత లోకమున ప్రభవించినారు.

క్లిష్టతరమయిన కథాంశమును ద్విపదలో సరళముగా రచించవచ్చని నిరూపించాడు బుద్ధారెడ్డి.

మాయ లేడి వర్ణన -

“ ఆంతంత పొడసూపు అట చేరవచ్చు

నంతలొ బెదరి బిట్టదరి కుప్పించు

తరుల నీడల కేగు తగ పర్ణశాల

జొరబారు నంతంత స్రుక్కి కెళ్ళుర్చు

వసుధ మార్కొని చూచు వాల మర్లార్చు

దెసలకు చెవి చేర్చి తెలియ నాలించు

గంచు మించై పారు గ్రమ్మర చేరు

కుంచి దాక్రుతి చెలికొన కదిలించు

పచ్చిక పవళ్ళపై పవళించు లేచు ..

మచ్చిక నచ్చోటి మౌనుల జేరు

ఖరముల చెవి గోకు కొమ్మల తుదల

విరుల తీగ కదల్చి విరులెల్ల రాల్చు “

..

వాల్మీకి చెప్పిన విషయములనే కాక ఇతర అంశాలను కూడ ఈ రామాయణములో పొందుపర్చారు. ఉదాహరణకు, సులోచన వృత్తాంతము. సులొచన ఇంద్రజిత్తు సతీమణి. ఆమె సహగమన వృత్తాంతాన్ని, ఇతర రామాయణముల నుండి, జనశ్రుతుల నుండి గ్రహించి ఇందు చేర్చాడు.

 

శ్రీరాముని ధనుర్విద్యా కౌశల్యాన్ని ఈ విధముగా ప్రతినాయకుడి చే చెప్పిస్తాడు -

" నల్లవో రఘురామ నయనాభిరామ - విలువిద్య గురువా వీరవతారా,

 బాపురే రామ ! భూపాల లోకముల - నీ పాటి విలుకాడు నేర్చునే కలుగ

 పాటించి పురముల పై పడ్డ హరుని - యెటొప్పు నిందా యెటొప్పు గాక !! "

 

రావణుడు, పలుకగా, అతని మంత్రులంటారు -

" పగవాని పొగడుదురే దైత పుంగవా.. "

అంటే, రావణుడు అంటాడు - " మేటి శూరుల మెప్పు మెచ్చంగ వలదె "

ఈవిధముగా, ప్రతినాయకుడైన రావణుని కూడ, లోక శూరునిగా, మహోదారునిగ చిత్రించాడు.    

చక్కని అలంకారముల చే ఈ కవి వర్ణనలు కధ తో పెనవేసుకొని వుంటాయి.

రంగనాధ రామాయణములో 17,290 ద్విపదలు వున్నాయి, మొత్తము ఆరు కాండములు. తరువాతి కాలములో బుద్దా రెడ్డి కుమారులయిన కాచ విభుడు, విట్టల నాధుడు ఉత్తరకాండము కూడ 5,640 ద్విపదలతో పూర్తిచేసారు. రంగనాధ రామాయణము మాత్రమే తెలుగులో వచ్చిన ద్విపద కావ్యము.

 

తరువాతి సంచికలలో ఇతర ప్రముఖ కవుల గురించి తెలుసుకుందాము..

****

సశేషము.

Bio

ప్రసాద్ తుర్లపాటి

సాహిత్యం పట్ల, అందునా ప్రాచీన సాహిత్యం పట్ల విశేషమైన ఆసక్తి కల ప్రసాద్ తుర్లపాటి గారు విభిన్న కవితా శైలులని, కవులు మరియు రచనలని చక్కగా విశ్లేషిస్తారు. 

మూడు దశాబ్ధాలుగా సాంకేతిక రంగంలో కీలక పదవులెన్నో నిర్వహించి, టీ.సీ.యెస్ లో ఉన్నతోద్యోగం చేస్తున్న ప్రసాద్ గారు ఖమ్మం జిల్లాలో జన్మించారు.

సాహితీ విభాగంలో కృషికి గానూ 2016 లో NATA వారి Excellence Award అందుకున్నారు. ఇంకా మరెన్నో అవార్డులు సాధించారు. ప్రస్తుతం శాన్ ఆంటోనియోలో వాస్తవ్యులైన వీరు నగరంలోని హిందూ టెంపుల్ పాలకమండలి సభ్యులు గా వ్యవహరిస్తున్నారు. 

***

bottom of page