
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
మధురవాణి ప్రత్యేకం
నా డైరీల్లో కొన్ని పేజీలు...
గొల్లపూడి మారుతీ రావు
కొత్త నాటకానికి శీర్షిక
1972 ఫిబ్రవరి 5:
నాటకానికి పేరు పెట్టడంలో నాకూ, చాట్లకి ఎప్పుడూ తగాదా తప్పేది కాదు. రెండు ప్రముఖమయిన ఉదాహరణల్లో ఇది మొదటిది. శంబల్పూరులో ఉన్నప్పుడే ఒక నాటిక( లేదా నాటకం) రాశాను. దానిని నాకు తెలిసి ఒక్కరే స్టేజి మీద ప్రదర్శించారు. అద్భుతంగా చాట్ల. నేను చూడలేదు. మరొకరు అద్భుతంగా రేడియో నాటికను చేశారు. అది తరువాతి కథ. జె.ఎం.బారి అనే ఆంగ్ల రచయిత "ది ట్వెల్వ్ పౌండ్ లుక్" అనే నాటిక స్ఫూర్తి ఈ రచనకి ఉంది. పూర్తిగా కాదు. ఏమైనా నాటకానికి "భారతనారీ! నీ మాంగళ్యానికి మరో ముడి వెయ్యి" అని పేరు పెట్టాను. చాట్లకి ఇది సుతరామూ నచ్చలేదు. నాతో తగాదా పడ్డాడు. రచన పూర్తయ్యాక, ఏనాడయినా ప్రయోక్తదే పై చెయ్యి. కాగా అతను చాట్ల. తప్పనిసరిగా తలవొంచి "మాంగళ్యానికి మరో ముడి" అని మార్చాను. సంవత్సరాల తర్వాత దాదాపు అలాంటి ఇదివృత్తాన్నే నేనూ విశ్వనాధ్‌గారూ సినిమాగా చేశాం. హేరంబ చిత్రమందిర్ శేషగిరిరావుగారు .. నా అభిమాన నిర్మాత. ఆ సినిమాకి "మాంగళ్యానికి మరో ముడి" అని పేరు పెట్టాం. అందులొ జయప్రద హీరోయిన్. ఆమెని హింసించే ప్రధాన పాత్రధారి కనకాల దేవదాస్. తీరా సినిమా అయాక చాలా మంది చూసి " ఓ పదేళ్ళు తొందరపడి ఈ సినిమాని తీశారు సార్" అన్నారు. తీరా పదేళ్ల తర్వాత ఎందుకనో నేనూ, విశ్వనాథ్‌గారూ మళ్లీ సినిమా చూశాం. థియేటర్‌లోంచి బయటికి వస్తూ"ఇంకో పదేళ్ళ తర్వాత రావలసిన సినిమా మారుతీరావ్" అన్నారు విశ్వనాథ్.
అలాంటి మరో మంచి నాటకం.. నాకు గొప్ప నాటకం... మళ్లీ చాట్ల కోసమే రాశాను. ఈసారి మళ్లీ నా ధోరణిలోనే "మహాత్ముడూ, మైనపువత్తి, మరో కన్నీటి చుక్కా" అని పేరు పెట్టాను. యథాప్రకారంగా చాట్లకి నచ్చలేదు. నేను గుంజాటన పడి పడీ మరో పేరుని సూచించాను.. "రా నేస్తం, నీకూ ఈ పిచ్చాసుపత్రిలో చోటుంది" అని. ఇది మరీ దరిద్రంగా ఉంది అన్నాడు. మళ్ళీ చాట్లతో తగాదా. ఇది నా మనస్సుకి మరీ దగ్గరయిన రచన. చస్తే అతని సలహాకు తలవొగ్గలేదు.. ఎన్ని చెప్పినా. అతనూ రాజీ పడలేదు. చివరికి నేను విసిగి.. ఒక కార్డు మీద "గో టు హెల్" అని రాసి పోస్టు చేశాను. వెంటనే వాడి నుంచి (క్షమించాలి చాట్లతో నాకున్న బంధుత్వమది) సమాధానం వచ్చింది. "ఒరేయ్.. ఈ టైటిల్ బాగుందిరా!" అంటూ. ఆ విధంగా "గో టు హెల్" అనే పేరు ఆ నాటకానికి నిలిచింది.
అప్పుడు మా పెద్దబ్బాయికి పదేళ్ళు. మరో 35 ఏళ్ళ తర్వాత నేను ఊహించని రీతిలో మద్రాసు విశ్విద్యాలయ్యంలో ఎం.ఏ. పరీక్ష(ఇంగ్లీషు) ప్రైవేటుగా రాసి మొదటి ప్రయత్నంలోనే పాసయిపోయాడు. తర్వాత నా నాటకం మీద తిరుపతి వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్ డిగ్రీ చేసి పట్టా పుచ్చుకున్నాడు. చెయ్యాల్సిన పరిశోధన ఇంగ్లీషులో.. నా నాటకం తెలుగు నాటకం. అందులో సంభాషణలు ఉదహరించాలన్నా ఇబ్బంది. అతని రిసెర్చి కోసం నాటకాన్ని పూర్తిగా ఇంగ్లీషులో రాశాను. అతని పరిశోధనకి గైడ్.. మిత్రులు మధురాంతకం నరేంద్ర. అంటే ఓ తెలుగు రచయిత కొడుకు మరొక తెలుగు రచయిత కొడుకు మధురాంతకం రాజారాంగారి కొడుకు దగ్గర ఎం.ఫిల్ చేశాడు. ఇది చాలా సరదా అయిన విషయం. ఇక్కడ నలుగురు రచయితల ప్రమేయం.. రాజారాంగారు, నేను, నరేంద్ర, తరువాత మా అబ్బాయి ఇంగ్లీషులో మంచి రచనలు చేశాడు. చేస్తున్నాడు. ఇంత చెప్పడానికి కారణం. అతని సబ్జెక్టుని నిర్ణయించడానికి, చాలా విచిత్రమైన అంశమిది. "The color of anger in John Osborne's "Look back in Anger" and Gollapudi Maruthi Rao's "Go To Hell". ఈ సందర్భంగా చాట్ల ఒకరోజు మద్రాసుకి ప్లేన్‌లో వచ్చి మా అబ్బాయితో చర్చించాడట. నేను అప్పుడు లేను. ఒక పి.హెచ్.డి.కి తగినంత కృషి చేశాడని నరేంద్రగారు తన శిష్యుడిని మెచ్చుకున్నారు. ఇంత కథ ఉంది ఈ నాటకాలకి.
ఫిబ్రవరి 13: కలకత్తాలో ప్రవాసాంధ్రుల ఉత్సవాలు:
కలకత్తాలో నా నాటకాలను ప్రదర్శించే అభిమాని పద్మసోల సుబ్బారావుగారు, శంబల్పూరు నుంచి వచ్చిన నన్ను, మా ఆవిడని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. బహుశా మొదటిసారి బేలూరు, దక్షిణేశ్వర్ చూసిన సందర్భం అదేనేమో.
ఆనాటి ఉత్సవాలకి నేను ప్రధాన అతిథిని. సభలో మా ఆవిడ చేతుల మీదుగా బహుమతులు ఇప్పించారు. మా యిద్దరికీ వేదికల మీద ఎన్నోసార్లు సన్మానాలు జరిగినా బహుమతి ప్రధానోత్సవం ఆమె చేతుల మీదుగా జరగడం అదేనేమో. అయితే విశేషం అది కాదు. ఆ ఉత్సవాలలో జరిగిన నాటికల పోటీలలో న్యాయనిర్నేతల నిర్ణయం ప్రకారం ఉత్తమ ప్రదర్శన బహుమతి "కాలం వెనక్కు తిరిగింది" ప్రదర్శకులకి. ఆ రచన నాది. ఉత్తమ నటుడు పద్మసోల సుబ్బారావు. నా నాటికలో ప్రధాన పాత్రని నటించాడు. ఉత్తమ నటి.. పద్మసోల సుబ్బారావు నటీమణి. ఉత్తమ దర్శకుడు. పద్మసోల సుబ్బారావు. ఇలాంటి ఆనందోత్సవాలు ఆ దశలో, నా జీవితంలో బోలెడు. డైరీల్లో వెదికి పట్టుకుంటే కాని జ్ఞాపకాలలో నిలవనివి.
మార్చి 5: శంబల్పూరులో ఆలిండియా రేడియో తరఫున చైన యుద్ధం సందర్భంగా రక్షణ నిధి వసూలుకు ప్రదర్శన.
శంబల్పూరు రేడియో స్టేషన్ చరిత్రలో ఇలాంటి కార్యక్రమం అంతకు ముందెన్నడూ తలపెట్టలేదనుకుంటాను. ఊరిలో పురప్రముఖులందరినీ ఆహ్వానించాం. నగరంలో ఒక వేదిక మీద సాంస్కృతిక ప్రదర్శన. ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరి (అప్పట్లో బుర్లాలో వారి భర్తగారు డి.ఐ.నరసింహంగారు విద్యుచ్చక్తి శాఖలో సూపరింటెండెంటుగా ఉండేవారు. ఆమె వ్రాసిన "కన్నీటి విలువెంత?" కథని నాటకీకరించి, అప్పటి కేంద్ర సమాచార శాఖ మంత్రి నందిని సత్పతి బావగారు(శంబల్పూరు విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు( పేరు గుర్తు లేదు) వారి చేత ఒరియా భాషలోకి అనువాదం చేయించాను. శ్రవ్యనాటికను రేడియోలో ఎలా ప్రదర్శిస్తామో, దృశ్యంగా అంటే ఆయా కళాకారులు మైకు ముందు నిలబడి నటించారు. అదొక కొత్త ఆకర్షణ అయింది. ఒడిస్సీ నృత్యంలో ఒరిస్సాలోనే కాక దేశమంతా లబ్ద ప్రతిష్టురాలయిన సంజుక్తా పాణిగ్రాహిని కటక్ నుంచి రప్పించాను. ఆమె భర్త రఘునాధ్ పాణిగ్రాహి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచితులు (ఎల్.వి.ప్రసాద్‌గారి "ఇలవేలుపు" చిత్రంలో "చల్లని రాజా ఓ చందమామ"గాయకులలో ఒకరు) ఆయన తన శ్రీమతి సంజుక్త పాణిగ్రాహి నృత్యానికి పాటకుడు. ఆయనా వచ్చారు. కటక్ రేడియోలో వయొలిన్ ఆస్థాన విద్వాంసుడు భుబనేశ్వర్ మిశ్రా ద్వారం వెంకటస్వామి నాయుడుగారి శిష్యుడు. అద్భుతంగా గురువును తలపిస్తూ వాయించేవాడు. ఆయన్ని రప్పించాను.
భుబనేశ్వర్ మిశ్రాని మా రేడియోలో విన్నాను. నాకు చాలా ఇష్టమైన వాద్యకారుడు. ఒక్క సందర్భం బాగా గుర్తుంది. ప్రోగ్రాం మధ్యలో తన ఐటెంకి వేదిక మీదకు వెళ్లాలి. "నా వయొలిన్‌ని ఎవరయినా తీసుకొచ్చి స్టేజి మీద పెట్టాలి" అన్నాడు. ఒక పక్క ప్రోగ్రాం జరుగుతుంది. నాకు కోపం తోసుకొచ్చింది. అయినా ఆపుకున్నాను. నేను ఆయనకి సంబంధించినంతవరకు పెద్ద ఆఫీసర్ని. చెప్పాను. "మిశ్రాజీ, మీకు చాలా మంచి నౌఖర్ని ఇస్తాను. పెద్ద గెజిటెడ్ నౌఖరు. ఎక్కడ పెట్టాలో చెప్పండి" అని వయొలిన్ పట్టుకున్నాను. ఆయనకి అర్ధమయింది. కాస్సేపు బెంబేలు పడి వయొలిన్‌ని అందుకున్నాడు. యధాప్రకారంగా ఆయన్ ఆద్భుతంగా వాయించాడు.
కార్యక్రమం బాగా రక్తి కట్టింది. మా స్టేషన్‌కి పెద్ద అసిస్టెంట్ డైరెక్టరు సాగర్ బుస్తీ. ఆ విజయానికి తబ్బిబ్బయ్యాడు. ఆ కార్యక్రమానికి కలెక్టరు ఘోష, కమర్షియల్ టాక్స్ ఆఫీసరు పాఠి వచ్చారు. వెళ్తూ పాఠి నా భుజం తట్టి: "You have brought new thought to Oriya Theatre"అన్నాడు.
జీవితంలో ప్రతీ దశని అలంకరించుకోవడంలో నేనెన్నడూ ఓడిపోలేదు. అలసిపోలేదు. వృద్ధాప్యాన్ని గురించి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఒక మాటన్నారు.
ఉదయాన మగత నిదుర చెదిరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసిలితనపు అడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడని చెప్పించు, వీలు లేదని పంపించు
శీతవేళ రానీయకు రానీయకు
శిశిరానికి చోటీయకు చోటీయకు..
ఈ సూచనని అక్షరాలా పాటించిన అదృష్టవంతుడిని నేను.
గొల్లపూడి మారుతీ రావు
గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి. తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు. రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.
***
