top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కవితా  మధురాలు

నిర్వహణ 

విన్నకోట రవి శంకర్ | మధు పెమ్మరాజు | చిలుకూరి సత్యదేవ్

kavita@madhuravani.com 

ఆకాంక్ష

~ఆకెళ్ళ రవి ప్రకాష్

చెవులకి వేళాడే

బుట్ట రింగుల్లా

చెట్లకి వేళాడే

పిట్ట గూడుల్లా

రెండు చక్రాల బండి తక్కెడకి

తలక్రిందులుగా వేళాడుతూ

నగరానికి వస్తున్నాయి కోళ్ళు.

 

గంటలు నిమిషాల్లా

ఈకలు గాలికి ఎగిరిపోతుంటే

ఆకలి, దాహం తోడుగా

నగరం ఆకలి తీర్చడానికి

రాత్రంతా చలి బుట్టలో

వణుకుతున్న కోళ్ళు.

 

యుద్ధంలో చిక్కడిన శరణార్థుల్లా,

గమ్యం తప్పిపోయిన కాందిశీకుల్లా

ఏ తప్పు చేయకుండానే మరణం కోసం

ఎదురు చూస్తున్న వీటిని

ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని

ముద్దాడాలన్పిస్తోంది.

 

పంజరాల్లో బంధింపబడ్డ

పక్షులన్నిటినీ

ఆకాశంలోకి వదిలేసి

భయం మరణం లేకుండా

వెయ్యేళ్ళు బతకాలని దీవించాలన్పిస్తోంది

Poondla Mahesh

కొత్త బొమ్మ

~పూండ్ల మహేష్

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన

కవితలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కవిత.

...హడావిడి రోడ్డున పోతుంటే,

వ్రేలాడేసిన రంగుల బొమ్మల్లో

అప్పట్లో మోజుపడీ మారాం చేసి కొనిపించుకున్న

బాల్యమ్ ఒకటి పదునుగా కనిపిస్తుంది...


వెంట తెచ్చుకునీ,

దాని ప్లాస్టిక్ మేనిపై జారే వెలుగుల్ని ముద్దాడీ,
విశ్వమ్ లో అది నాకొక్కడికే సొంతమనీ
సన్నిహితులకు అప్పట్లో చూపుకున్న గర్వమ్ పొడుస్తుంది...


క్రమంగా అందరూ ఆసక్తి చూపడం మానేసాకా,
అందరికీ తమవైన కొత్త బొమ్మలు వొచ్చాకా 
నా బొమ్మ నాకే భారంగా మారిపోయీ
వొదల్లేక మోసుకుతిరిగిన దిగులు వెంటాడుతుంది...

 

రంగు తగ్గీ, లోపలి చక్రాలు అరిగిపోయాక 
కదలని బొమ్మని అటకపై విసిరికొట్టి 
మరో తిరుణాల కోసం కలగన్న ఎదురుచూపు బాధిస్తుంది..

ఉన్మత్త అతిశయాలూ, ఎగతాళిలో ఆనందాలూ చూపిస్తూ 
నాదీ, నేను మాత్రమే శాశ్వతం అని  నువ్ నవ్వుతున్నప్పుడల్లా 
మనమందరం కనపడని ఎవరి ఆటకో బొమ్మలమనే నిజం తెలిసీ 
ఇప్పుడు నవ్వాపుకోవాలనున్నా ఆ అవసరం నీముందు లేదనిపిస్తుంది...

Ajantha

అనుభూతి గీతాల నుంచి...

~ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

అట్టలూడి చెరిగినా

ఆత్మీయంగా తోచే

పాతపుస్తకం వార్థక్యం.

గోడలమీద వెలిసిపోయి మిగిలిన

పటాలలోని మనుషుల

జ్ఞాపకాల సాక్షిగా –

అప్పుడెప్పుడో చిగురు తొడిగిన మొక్కలు

బలంగా ఎదిగి, విస్తరించి

యౌవన స్వప్నాలతో ఊగిపోతున్న

సందర్భం సాక్షిగా –

శిశిర వృక్షం మాదిరి నిలబడితే

పూల ఋతువు గాలిసోకి

ఈ శరీరం మళ్ళీ చిగురిస్తుందనే?

ఎంత ఆశ!

 

తోడుగా మసలిన వాళ్ళు , నీడగా నిలిచినవాళ్ళు,

ఉద్యమిస్తూ తిరిగిన వాళ్ళు

ఉద్రేకాలతో నినదించిన వాళ్ళు

ప్రేమకోసం పరితపించిన వాళ్ళు

రహస్యపు కౌగిళ్ళతో లాలించిన వాళ్ళు

జీవితాన్ని ఆస్వాదించిన వాళ్ళు

వారేరీ?

సిరి మూటగట్టుకొని –

వట్టి స్పర్షలూ అనుభవాలూ మిగిల్చి

ఏ చీకటి తూరలలోకి వెళ్ళిపోయారు?

 

మాయ కాదు, మర్మం కాదు

కళ్ళతో చూసినవే ,

మనస్సుతో అనుభవించినవే –

పొగమంచు వేళల తడుముకుంటూ

చలిగాలులు చప్పరిస్తూ,

వేసవి వడగాలుల ఉక్కపోతల

ఉస్సురంటూ,

వానాకాలపు నీటి తుంపరల

రవజల్లు సోకి పులకించిపోతూ,

గోదావరి రేవుల్లో, కోనసీమ తోటల్లో

గడిపిడిన , వడపోసిన

నానా సూనవితాన వాసనల

దివసావసానాలెక్కడ?

చలవ గదుల్లో, చత్వారాలలో

సభావేదికల దండల సందడిలో

‘చెప్పాలి, చెప్పా’ లంటూ

తహతహ పుట్టిస్తూ, క్రిక్కిరిసి

మనస్సును స్తిమితంగా ఉండనివ్వని

గాథలతో, వ్యథలతో సందడించిన కాలం

ఈ అంచున దింపి

రెక్కలు విదిల్చి

మరి, కనపడకుండా ఎటు ఎగిరిపోయిందో?

 

ఇప్పుడు

దారివెంట నడుస్తుంటే

ఎందరో అపరిచితులు!

పక్కపక్కనే సంరంభంగా

వెళ్లిపోతుంటారు.

సంచుల్లో, మనస్సుల్లో

బహుశా – భావికాల ఉత్సాహాలను,

తాత్కాలిక ఉద్రేకాలను,

తనివితీరని కాంక్షలను వహిస్తూ –

ఎరిగిన భాషే అయినా

మాటలు అర్థంకావు,

అపరిచితుల ఇంట

రాత్రివేళ విలాసపు విందుకు వెళ్లి

తలుపువార ఇబ్బందిగా

ఒంటరిగా నిలబడినట్టుంటుంది!

కాలం మారదు,

అవే గంటలు, ఘడియలు, ముహూర్తాలు...

సూర్యగమన వేళల్లో

సుతారపు సోయగాలు మారవు.

అవే గరికపచ్చ మైదానాల

సాయంకాలపు నీరెండలు –

రాత్రి వేళ నీలాకాశపు వెన్నెల

నీలి పరదాల మాటు జాలి ఓదార్పులు –

 

ఇవాళ –

విడిచి వెళ్ళిన వాళ్ళు,

నిలిచి తిరుగుతున్నవాళ్ళు,

ఉభయులూ అపరిచితులే –

మాయ లేదు, మర్మం లేదు.

చూస్తున్నదీ, అనుభవిస్తున్నదే.

ఏడుపు రావటం లేదు

ఎంతో వింతగా మాత్రం వుంది!!

***

సంపాదకుల ప్రత్యేక ఎంపిక

ధ్యాన ముద్ర

~శైలజామిత్ర

Sailajamitra

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన

కవితలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కవిత.

నేను సముద్రపు అలల్లోనే దాగి ఉంటాను

ఎగసి పడినా తలెత్తుకుని తిరుగుతాను..

ఎంత అందమైన స్త్రీ అయినా నాతోనే తనని పోల్చుకుంటుంది

నాపై ప్రసరిస్తున్న చందమామ వెన్నెల ఒక్కసారిగా

గర్వంగా దిక్కుల్ని కలియచూస్తుంది.

ఆకాశం, నేల కలసి ఉన్నట్లున్న భ్రమ

వణుకుతున్న చేతులతో నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటుంది.

  

నాలుగు మూలలున్న గదిలో చేరిన

అమ్మవారి చిత్రపటాన్ని నేను.. ఎపుడూ నవ్వుతుంటాను

నాపై ఉన్న జిలుగుల అద్దం ముక్కలైనా సరే

నా స్థితిని నేను మార్చుకోకుండా నా ఎదురుగా

ధ్యానముద్రలో ఉన్న గోడకేసి తదేకంగా చూస్తుంటాను.

గోడ నా ఎదలో ఎపుడూ ఒక భాగమే!

చీకటి మిమ్మల్ని విడదీస్తున్నపుడు కూడా దాని స్థిరత్వం

నా హృదయానికి తాకుతూనే ఉంటుంది..

 

జాతీయ పతాకం గుర్తుతో తయారు చేయబడిన వస్తువు నేను..

నిఖార్సుగా, నిటారుగానే ఉంటాను

ఎంత ఈదురుగాలి వీచినా సరే రెప రెప లాడతాను

అందులోని రంగులు స్వచ్ఛమైనట్లే నా మనసు పొరల్ని కాపాడుకుంటాను

నేను ఎత్తైన దాన్నే తప్ప నేలబారు తత్త్వం నాకు లేదు..

 

ఇపుడు నేను దేశమాతకు చాలా ముఖ్యమైన దానిని

నిత్యం నన్ను పలకరిస్తూనే ఉంటుంది.

ప్రతి ఉదయం నా ముఖంలో విచారాన్ని తుడిచేస్తుంది

నా వదనం ఇపుడు ఒక జెండా ఎగరవేసే కూడలికి సంకేతంలా ఉంది

సంవత్సరాలు గడుస్తున్నాయి.

ఇపుడు నాలో ఒక వృద్ధురాలు తలెత్తుతోంది..

తుఫాను బీభత్సంలా..

మరో మొదటి కథ

~లక్ష్మీ నారాయణ తుట్టగుంట

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన

కవితలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కవిత.

నక్షత్రాల క్రింద

నడి చీకటి వెలుగులో

నీ జ్ఞాపకం... ఒక దీపపు పురుగు రెక్క

 

ఏరుకుని తెచ్చుకున్న

రెండు రెప్పల సముద్రంలో...

తెరచాపల్లేని నావలపై, నీ నవ్వు  - జోరువాన

 

దాటేసేందుకు రెండు రెక్కలున్నా,

ఆవలి తీరాలు లేని ఆకాశమంతా...

వలలుగా పరుచుకున్న నీదే కనుదోయి

 

కలువపూవునైనా కనని కొలను గట్టూ,

నడకరాని నారికేళ వృక్షమూ,

తెగని గాలిపటమూ...నా మనసు  

 

సదా చెంపలపై ఇంకిపోయే స్వప్నానివో, 

నెలవంక కళ్ళలోంచి జారిపడే,

నీడ దొరకని నిజానివో...మరి నువ్వు !

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన

కవితలపోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన కవిత.

ప్రతీపదం ఎక్కడో విన్నట్టే ఉంటుంది

ప్రతీ ముఖమూ చిరపరిచిత కథను మోస్తూ

కళ్ళ ముందే నడుస్తూ ఉంటుంది. 

ఏం చెయ్యాలో ముందే నిర్ణయించుకున్నట్టు, 

భుజాలు తిప్పుకుని

ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోయాక,

గది లోపలి గది లోపలి గదిలో

కళ్ళు పొడుచుకుని వెదుక్కుంటాను

తప్పిపోయిన ఏ మనిషి కోసమో

తెల్లవార్లూ కలల దారుల్లో కలియదిరుగుతాను 

 

చీకటి గడప దాటడానికి,

కలలు చిట్లే వేకువలోకి లేవడానికి

ఎన్నాళ్ళైనా భయపడుతూనే ఉంటాను

నది నిరంతరం ముద్దాడినా లొంగిపోని చేపపిల్లలా

స్వాధీనంలోకి రాని ఆలోచనను 

మెదడులో మోసుకు తిరుగుతూనే ఉంటాను. 

 

ఆశ పుట్టిన రాత్రుల్లో, ఆశ చావని రాత్రుల్లో,

ముడుచుకుపోతున్న వేళ్ళన్నింటినీ పైకెత్తి

ఊహల్లోని బొమ్మలను విస్తరించి చుసుకుంటాను 

పెదాల మధ్య నలిగి నెత్తురోడే పదాలని

అరచేతుల్లోకి తీసుకుని ప్రాణం పోసి చుసుకుంటాను

 

వెలుగు నన్ను తాకినప్పుడల్లా ఓడిపోతున్నానని

రాత్రి వెనుక రాత్రి జారినప్పుడల్లా

నా పాదాల ముందు గడియపడ్డ తలుపులు

కొత్తగా పుట్టుకొస్తున్నాయనీ

గమనించుకుంటూనే ఉంటాను. 

 

ఒకరెళ్ళినా, మరొకరు వచ్చి చేరినా

ఏ ఇబ్బంది లేని ప్రాణమని అనుకుంటాను కానీ,

నా అరచేతుల్లో ఓ ప్రపంచముందనీ

నా వేలి చివరల్తో నా లోకాన్ని 

శాసించగలననీ అనుకుంటాను గానీ,

నేనొక ఒంటరి ద్వీపాన్నేనని

నా లోపలి సముద్రం తీరం దొరక్క 

విరుచుకుపడినప్పుడు గానీ తెలీలేదు.

వేళకాని వేళ, బహుశా అకారణంగానే కావచ్చు,

ఆకాశం నాలుగు మేఘపు తునకలుగా విరిగి

నను ముంచెత్తేదాకా తెలీదు.

నిజం నగ్నమై నా ముందుకొచ్చి

నిలువరించేదాకా, నన్ను నిలదీసేదాకా

నాలోపలి నిజమేమిటో నాకూ తెలీదు.

 

ఇప్పుడు,

చుట్టూ కదులుతున్న నీటి ముఖం మీద,

రెప్పలు విప్పుతోన్న నా బొమ్మను

ఈ వేళలో ఇంత నింపాదిగా గీస్తున్నదెవరు?

 

నేనైతే కాదు.

నిశ్చయంగా చెబుతున్నాను. 

నేనంటే నేనే కాదు.

Manasa Chamarthy

నేనంటే నేనే కాదు

~మానస చామర్తి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన

కవితలపోటీ లో ప్రశంసా  బహుమతి సాధించిన కవిత.

ఒక్క తొలి కిరణపు చిరునవ్వు

గిలిగింతల చెలిమి కలుపుతోంది

మండుతున్న సూర్యుడికీ

చిన్ని మంచు బిందువుకీ…

 

ఒక్క తెలి నురగల చిరునవ్వు

కౌగిలింతల చెలిమి కలుపుతోంది

పడి ఉండే ఇసుక తిన్నెకీ

పడి లేచే సముద్రానికీ…

 

ఒక్క ఆకు చాటు చిరునవ్వు

పులకరింతల చెలిమి కలుపుతోంది

గండు రెక్కల తేనెటీగకీ

పట్టు రేకల పూల కన్నెకీ…

 

ఒక్క లేచిగురుల చిరునవ్వు

పూలగుత్తుల చెలిమి కలుపుతోంది

మోడువారిన శిశిరానికీ

కొత్త ఆశల వసంతానికీ…

 

ఒక్క ఉలి అంచుల చిరునవ్వు

చలువ చూపుల చెలిమి కలుపుతోంది

కఱకు  గుండెల కొండ  ఱాతికీ

గర్భ గుడి లో దేవి మూర్తికీ…

 

ఒక్క గుండె లోతుల చిరునవ్వు

వెలుగు రేకల చెలిమి కలుపుతోంది

మండుటెండల బ్రతుకుకీ

నిండు పున్నమి కలలకీ!

చిరునవ్వు

~ఫణీంద్రరావు కొనకళ్ళ

1

ఇంద్రగంటి శ్రీకాంతశర్మ

కవి, పండితులు అయిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు కవిత్వం, కథ, నవల, నాటకం, యక్షగానం మొదలైన అనేక సాహిత్య ప్రక్రియలలో విశిష్టమైన రచనలు చేసారు. తెలుగులో అభ్యుదయ, విప్లవ కవిత్వాలు రాజ్యమేలుతున్న రోజుల్లో విభిన్నమైన కవిత్వం రాసి, అనుభూతివాద కవుల్లో ఒకరుగా పేరు పొందారు. ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వహణాధికారిగా, ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక సంపాదకునిగా పనిచేసారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం, నూతలపాటి పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. ఆయన రూపొందించిన అనేక సంగీత రూపకాలు జాతీయ పురస్కారాలు పొందాయి. ప్రస్తుతం నవ్య వార పత్రికలో ‘సంగతులూ! సందర్భాలూ!’ అనే కాలమ్ రాస్తున్నారు.

Jada Subba Rao

పూండ్ల మహేష్

పూండ్ల మహేష్ గారి కలం పేరు "సుపర్ణ మహి". ఉండేది ప్రకాశం జిల్లా - అద్దంకి. 

కవిత్వంతో  నాకున్న బంధం, ఆప్త మిత్రత్వం. కవిత్వాన్ని చదవడం, అర్థం చేసుకోవడం, కొత్త కొత్త ప్రయోగాలు చెయ్యడం, ముఖ్యంగా మరింత నేర్చుకోవడం నాకెంతో నచ్చిన పనులు

Anjali Ramakantha Reddy
3
4

కొనకళ్ల ఫణీంద్రరావు

ఆంధ్రప్రదేశ్ పేపరుమిల్స్ లో డెప్యూటీ జెనెరల్ మేనేజర్‌గా పనిచేసి రిటైర్అయ్యారు. సాహిత్య సంగీత కళా రంగాలలో విశేషంగా కృషి చేస్తూ, సాహిత్య పరంగా, కధలు,వ్యాసాలు, కవితలు, ద్విపదలు, హైకూలు, పాటలు, గజళ్ళు, చందోబద్ధంగా పద్యాలు,  వ్రాస్తున్నారు. పాటలు,గజళ్ళను స్వరపరచి పాడుతారు. జ్యోతిర్మయి  గజల్ అకాడెమీ లో సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఫేస్‌బుక్కులో "హృదయస్పందన" అనే ఒక సాహిత్య గ్రూపును నిర్వహిస్తున్నారు.

Anjali Ramakantha Reddy
2

మానస చామర్తి

విజయవాడలో పుట్టి పెరిగి. ఇంజనీరింగ్ పూర్తి చేసి తొమ్మిదేళ్ళ పాటు ఇన్ఫోసిస్‌లో చేసిన మానస చామర్తి గారి ప్రస్తుత నివాసం బెంగళూరు. “తమ రచనలనూ, తమను ప్రభావితం చేసిన మహారచయితల రచనల మీద అభిప్రాయాలనూ, "మధుమానసం" అన్న బ్లాగులో పొందుపరుస్తూ ఉంటారు..

Anjali Ramakantha Reddy
5

ఆకెళ్ళ రవిప్రకాష్

ఆకెళ్ళ రవిప్రకాష్ కవిగా సుపరిచితులు. ఇసుక గుడి, ప్రేమ ప్రతిపాదన అనే కవితా సంకలనాలు ప్రచురించారు. పాండిచ్చేరి ప్రభుత్వంలో యానాం నిర్వహణాధికారిగా, ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ గిరిజనాభివృద్ధి సంస్థ మెనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.  

Anjali Ramakantha Reddy
bottom of page