top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

నా డైరీల్లో కొన్ని పేజీలు... 

గొల్లపూడి మారుతీ రావు

రెండు నాటకాలూ - ఒక నాటిక

1971 నవంబరు 27:

కె. వెంకటేశ్వరరావుకి హార్ట్ ఎన్‌లార్జ్ అయి ఆసుపత్రిలో చేరాడు. నేనూ, నాన్నగారూ చూడడానికి వెళ్లాం. అంత ఇబ్బందిలోనూ హుషారుగా ఉన్నాడు వెంకు. నేనలా పిలుస్తాను. నవ్వుతూ ఒక మాటన్నాడు. "నాకొక్కటి తెలిసిందిరా. ఎప్పటికయినా నేనీ కారణంగానే పోతాను. ఎంత గొప్ప? కొందరు రోగమేమిటో తెలీకుండా పోతారు. నేను నాకు తెలిసిన రోగంతో,  ప్రిపేర్ అయి పోతాను"

నిజంగానే వెంకటేశ్వరరావు మరో 17 నెలలకి 1973 మే 7 న కన్నుమూశాడు.

నా నాటకం ఒకటి అతని దగ్గర  ఉండిపోయింది. అంతకు దాదాపు సంవత్సరంన్నర ముందు నన్ను ఇబ్బన్ "ఎనిమీ ఆఫ్ ది పీపుల్" నాటకం రాయమని రెచ్చగొడుతూ నవ్వాడు. కారణం అప్పటికి శంభుమిత్ర నాటకాన్ని చూసి ముగ్ధుడయి ఉన్నాడు. నాకు మరో ఆంగ్లనాటకం మాతృకగా వ్రాయడం ఇష్టం లేదు. కారణం ఆ నాటకం వెంకటేశ్వరరావు ప్రదర్శన ద్వారా పాపులర్ అయితే (తప్పకుండా అవుతుంది. నాకు తెలుసు) సగం గొప్పతనం మాతృకకి పోతుంది. కాగా ఇబ్బన్ ప్రతిభను కాదనేవారెవరుంటారు? అలాంటి పని ముందు జరిగింది. నా 'రాగరాగిణి'కి యూజినీ ఓ నీల్ -"బియాండ్ ది హొరైజన్" మాతృక.  1970 ఏప్రిల్ 4 న నేను విజయనగరం మహారాజా కాలేజీలో ఉపన్యసించాలి. బస్సు తప్పిపోయింది. వెంకటేశ్వరరావు తన మోపెడ్ మీద తీసికెళ్లాడు. ఆ సమయంలో ఇబ్బన్ పుస్తకం కొని నాకు బహూకరించాడు. దాని మీద ఇలా రాశాడు.

“మనం 'రాగరాగిణి' శకాన్ని ప్రారంభించాం. మళ్లా మరో యుగం మరో తరహాగా ఆంధ్ర నాటకరంగ చరిత్రలో ఉత్పన్నం కావాలి. అందుకే ఈ ఇచ్చి పుచ్చుకోవడం. పెద్దవాణ్ణి కనుక  ఆశీర్వాదంతో – వెంకు”

మొత్తానికి కొత్త నాటకం రాశాను. ఇబ్బన్ మాతృకగా. “సత్యంగారిల్లెక్కడ?” అనారోగ్యమో మరే కారణాలకో ఆ నాటక ప్రయోగం ఆలశ్యమయింది. ఈలోగా వెంకటేశ్వరరావు శిష్యుడూ, నా మిత్రుడూ చాట్ల ఫోన్ చేశాడు. తాను ప్రదర్శిస్తానని. "నేను వెంకటేశ్వరరావు కోసం నాటకాన్ని రాశాను. ప్రదర్శించి అతను చరిత్రని సృష్టించకపోతే ఎదురుచూడడంలో నేను చరిత్ర సృష్టించదలుచుకున్నాను" అని రాశాను. ఆసుపత్రిలో ఆ నాటక ప్రసక్తి వచ్చింది. చేస్తానన్నాడు. కాని చెయ్యకుండానే వెళ్ళిపోయాడు. చాట్లకి ఉత్తరం రాశాను. "వెంకు పోయాడు. అతనితో ఓ తరం నాటకరంగం అంతరించిపోయింది. ఇప్పుడు శాడిస్టులాగా నిన్ను గుర్తు చేసుకున్నాను. కావాలంటే ఇప్పుడు 'సత్యంగారిల్లెక్కడ?' నీది" అని. తిరుగు టపాలాగ వచ్చి నాటకాన్ని పట్టుకుపోయాడు చాట్ల.

 

1972 జనవరి 11.

నార్ల వెంకటేశ్వరరావుగారి సమక్షంలో చాట్ల "లావాలో ఎర్రగులాబి" నాటకాన్ని ప్రదర్శించాడు.

ఆ నాటకాన్ని చాట్లకోసం ప్రత్యేకంగా రాశాను. అతను లండన్‌లో కోర్స్ చేసి వచ్చాక, ఆషామాషీ నాటకం కాదు. కథానాయకుడు నాటకం ఆసాంతం చక్రాల కుర్చీలో ఉంటాడు. శీర్షిక సూచించినట్టే నాటకంలో ఇతివృత్తం అగ్నిపర్వతం.

"నువ్వు నాకో సవాలుని విసిరావు. నేను ఆత్మవిశ్వాసంతో తీసుకున్నాను. నాటకం అయ్యాక అంతా బ్రహ్మరథం పట్టారు. నార్ల నిన్నూ, మమ్మల్ని ఏకధాటిగా పొగిడారు." అని రాశాడు.

ప్రొఫెసర్ జేమ్స్ బ్రాండన్ నాటకం చూశాడట. He felt as if he was witnessing a series of events taking place inside four walls and was reminded of Anton Chekhov అని రాశాడు.

వీరంతా నాటకరంగ దిగ్గజాలు, రంగస్థలానికి సేవలందించిన మహానటులు. మరో ఆరేళ్ల తర్వాత చాట్ల, మళ్ళీ అతని కోసం రాసిన నా 'గో టు హెల్' నాటకాన్ని ప్రదర్శించాడు. అందులో అతని కూతురు మణి  నటించింది. అప్పటికి ఆవిడకి 46. దరిమిలాను రక్తానికి సంబంధించిన వ్యాధితో ఆమె కన్నుమూసింది.

జనవరి 18: మామగారు శివానికి ఉత్తరం.

మా మామగారు చాలా ప్రసిద్ధులు. అలనాటి రచయిత , విమర్శకులు శ్రీపాద కామేశ్వరరావుగారి పెద్ద కొడుకు. ప్రసిద్ధ రచయిత, విమర్శకులు శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు, పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణిగారి అన్నగారు. నా జీవితంలో ఏనాడూ నన్ను ప్రశంసించలేదు. కాని ఒక్కసారి ఒకే ఒక్కసారి మా అ విడకి ఉత్తరం రాశారు. ఆయనెప్పుడూ పోస్టుకార్డులే రాసేవారు. ఇంగ్లీషులోనే రాసేవారు. ఇదీ ఉత్తరం:  very glad to inform you that "Chelleli Kaapuram" (నేను రాసిన సినిమా) is spoken very highly particularly dialogues. Now I too join the rest in admiring your husband in his achievement. You know I do not see pictures. Yet, I saw this picture. It is very good. 

ఇది ఆ రోజుల్లో నాకు పద్మశ్రీనే.

 

జనవరి 26: నీలయ్యగారి దయ్యం Play Reading.

నేను శంబల్‌పూర్ రేడియోలో పనిచేస్తున్న రోజులవి. కుటుంబ నియంత్రణ మీద ఒక నాటిక రాశాను. అది బాగా అరిగిపోయిన ఇతివృత్తమయినా - 'నీలయ్యగారి దయ్యం' నాటిక కేవలం టెక్నిక్ కారణంగా వినూత్నమయింది. గొప్పది. అంతవరకూ అలాంటి ప్రయత్నమెవరూ చెయ్యలేదు.

జంషెడ్‌పూర్ ఆంధ్రసంఘంలో 'నీలయ్యగారి దెయ్యం' చదివాను.  Play Reading ఒక అపూర్వమైన ప్రక్రియ - ముఖ్యంగా విదేశాలలో. ఆనాటి ప్లే రీడింగ్ బాగా రాణించింది. ఆనాటి ప్రేక్షకులలో యర్రమిల్లి సూర్యనారాయణగారని రిటైర్డ్ ప్రిన్సిపాల్ - 76 ఏళ్ళ వ్యక్తి అధ్యక్షత వహించారు. నాటిక విన్నాక ఆయన ఆవేశంతో లేచి నిలబడ్డారు. నాటిక విని నేను చాలా థ్రిల్ అయ్యాను. ఒక యువ స్నేహితుడి దగ్గర చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. Tagore heard D.C.Roy's Durga Das ఇలా అన్నారు. He has ransacked my heart. I have been trying to search for a fault. But now I know that there is one fault - that is, to be faultless. మారుతీరావు నాటిక విషయంలో నేనామాట నిస్సందేహంగా అంటున్నాను.

తర్వాత ఆంధ్రా లిటరరీ సొసైటీ నన్ను సత్కరించారు.

.

Bio

గొల్లపూడి మారుతీ రావు

గొల్లపూడి మారుతీ రావు గారి పేరు తెలియని తెలుగు వారు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. గొల్లపూడి మారుతీరావు గారు సుప్రసిద్ధ రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాత, విలేఖరి.  తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగానూ సుపరిచితులు. శతాధిక నాటకాలు, కథలు, నవలలు, వ్యాసాలు, కవితలూ రాశారు.  రేడియో ప్రయోక్తగానూ, అసిస్టెంట్ స్టేషను డైరెక్టరుగానూ, ఆంధ్రప్రభ (దినపత్రిక) ఉపసంపాదకుడిగానూ పనిచేశారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి కి ఉత్తమ రచయితగా నంది అవార్డుతో బాటు మరో మూడు నందులు అందుకున్నారు. తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధనాత్మక రచనలు, నాటకాలు ఆంధ్రప్రదేశ్ లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి. విజయనగరంలో జన్మించిన మారుతీ రావు గారి ప్రస్తుత నివాసం విశాఖపట్నం. ప్రపంచవ్యాప్తంగా శతాధిక పురస్కారాలు అందుకున్నారు.

***

bottom of page