top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వంగూరి పి.పా.

డా. సి. నారాయణ రెడ్డి గారి జ్ఞాపకాలు

వంగూరి చిట్టెన్ రాజు

ఇటీవల (జూన్ 12, 2017) ప్రముఖ కవి డా .సి. నారాయణ రెడ్డి గారి మరణ వార్త వినగానే ఒక మంచి శ్రేయోభిలాషిని కోల్పోయానే అని బాధ కలిగింది. ఆయన జ్ఞాన పీఠ్ బహుమతి గ్రహీత అనీ, పద్మభూషణ్ బిరుదాంకితులు అనీ, 3500 పైగా మంచి సినిమా పాటలు వ్రాశారు అనీ, ఘంటసాల పాటలలో అధిక శాతం వ్రాసినది సినారే అనీ, ఆయన రచించిన కావ్యాలు, గజళ్ళు, నాటకాలు, ట్రావెలాగ్స్ వగైరా వివరాలు అందరికీ తెలిసినవే. అంచేత ఈ వ్యాసం లో కేవలం ఆయనతో నాకున్న దశాబ్దాల అనుబంధాన్ని, కొన్ని సంఘటనలనీ మాత్రమే నెమరు వేసుకుంటున్నాను. తద్వారా  ఆయనకి నా నివాళి అర్పిస్తున్నాను.

నేను అమెరికా వచ్చాకే ఆయనతో నా మొదటి పరిచయం అయింది. బహుశా 1979 అని లీలగా జ్ఞాపకం నారాయణ రెడ్డి గారు హ్యూస్టన్ మొదటి సారి వచ్చారు. అదే ఆయన మొదటి అమెరికా పర్యటన అని కూడా జ్ఞాపకం. ఆ రోజుల్లో హ్యూస్థన్ లో మొత్తం 50 తెలుగు కుటుంబాలు ఉంటే అందులో సాహిత్యాభిమానులు సుమారు పాతిక మంది ఉండే వారు.  ఈ రోజుల్లో సుమారు పది వేల కుటుంబాలు ఉన్నా, సాహిత్యాభిమానులు అదే పాతిక సంఖ్యలోనే ఉన్నారు. మన తెలుగు భాషాభిమాన తిరోగమనానికి అది ఒక నిదర్శనం.

ఆ రోజు సినారే ని సినీ కవిగా పిలవ లేదు. కేవలం ఒక తెలుగు కవి గానే పిలిచి గౌరవించాం. ఆయన కూడా కవిత్వం మీదే మాట్లాడారు కానీ సినిమా పాటల గురించి ఎక్కువగా ప్రస్తావించ లేదు. అప్పటికే ఆయనకి సాహిత్య ఎకాడెమీ అవార్డు (మంటలు -మానవుడు కవిత సంకలనం -1973),  “పద్మశ్రీ” గుర్తింపు (1977) లాంటి గుర్తింపులుపొందారు కానీ జ్ఞానపీఠ్ అవార్డు రాలేదు. ఆ నాటి ఆ చిన్న ఆత్మీయ సభ ఫోటో ఇక్కడ జతపరుస్తున్నాను. అప్పటి ఆయన అమెరికా పర్యటన లో భాగం గా నేష విల్ లో ఆకునూరి రామయ్య గారు సినారె గారి స్వంత కంఠస్వరంలో తను రచించిన “కర్పూర వసంత రాయలు” గేయాన్ని 78 RPM రికార్డు గా విడుదల చేశారు. అమెరికాలో ఒక తెలుగు కవి కి జరిగిన అతి గొప్ప గౌరవం అది. ఆ రోజుల్లో ఏ కులం వారూ ఏ కవినీ, సినీ తారలనీ సొంతం చేసుకునే వారు కాదు. అలాంటి వన్నీ తానా నుంచి ఆటా కులాల ప్రాతిపదిక మీద విడిపోయాక ..1990 ల నుంచీ ప్రారంభం అయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రాంతీయత ప్రాబల్యం కూడా బలం పుంజుకొంది. దురదృష్టవశాత్తూ ఈ నాడు ఏ కవి, పండితుడు, రచయిత, సినీ నటుడు, బుల్లి తెర నటులు, గాయనీ గాయకులూ...ఒకరేమిటి అందరికీ తెలుగు వారు అనే కంటే ఏ కులం వాడు, ఏ ప్రాంతం వాడు అనే దాన్ని బట్టే వారి ప్రావీణ్యత గుర్తింపు ఆధారపడి ఉందేమో అని నాకు అనుమానం గా ఉంది.

     

ఇక ఎప్పుడైతే 1988 లో జ్ఞానపీఠ్ బహుమతి వచ్చిందో అప్పటి నుంచీ నారాయణ రెడ్డి గారు ఒక్క మెట్టు కూడా క్రిందకి దిగ లేదు.   ఏ సభలో అయినా పద్మ భూషణ్, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత, ఇంకా మరికొన్ని విశ్లేషణాలతో ఆయన్ని పరిచయం చెయ్యక పోతే ఆయనకి కోపం వచ్చేది. ఒకసారి నేను ఆయన్ని డా. నారాయణ రెడ్డి గారు అని టూకీగా పరిచయం చెయ్యగానే “నేను ఎవరో మర్చిపోయావా?” అని సరదాగానే కోప్పడ్డారు. ఒక సారి ఆయనతో నేను మాట వరసకి “మీ తరువాత జ్ఞాన పీఠ్ అవార్డుకి తెలుగు కవుల్లో ఎవరు అర్హులు మీ ఉద్దేశ్యంలో” అని అడిగితే “ఎవరూ లేరు. ఉన్నా నేను బతికుండగా ఇంకొకరికి ఆ గుర్తింపు వస్తే జనం అంతా వాళ్ళ భజన మొదలుపెట్టి నన్ను మర్చి పోతారు” అన్నారు.  కానీ మూడేళ్ల క్రితం రావూరి భరద్వాజ్ గారికి ఆ అవార్డు వచ్చినా, అప్పటికే ఎంతో ఎత్తుకి ఎదిగిన సినారె గారి ప్రఖ్యాతి కి ఏమీ లోటు రాలేదు. ఇటీవలి కాలం లో ఆరోగ్యం సహకరించక పోయినా, అడుగులో అడుగు వేసుకుంటూనే అన్ని సభలకీ వచ్చి తన బాణీ ప్రసంగం చేసే వారు. నిజానికి కనీసం ఒక దశాబ్దం పాటు హైదరాబాద్ లో నానా బాధితుల” సంఘం అని చెప్పుకునే వారు. అంటే ఎటువంటి సభలో అయినా సరే నారాయణ రెడ్డి (నా), నాగేశ్వర రావు (రెండో నా), నాదెళ్ళ భాస్కర రావు (నా. భా) లలో యా ముగ్గురూ కానీ కనీసం ఒక “నా” గారైనా లేని సభలు ఉండేవి కాదు.

నారాయణ రెడ్డి గారితో నేను కనీసం యాభై సభలలో పాల్గొన్నాను. ఆ మాటకొస్తే హైదరాబాద్ లో వంగూరి ఫౌండేషన్ తరఫున ఏ సభ పెట్టినా నారాయణ రెడ్డి గారే ఆద్యంతాలు. అంటే ప్రారంభ ఉపన్యాసం ఆయనదే, ముగింపు కూడా ఆయన ఉపన్యాసమే. ఆయన సుగుణం ఏమిటంటే ఏ సభలో అయినా సరే...అది అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా....ఆ సభకి సరి అయిన అంశం మీద తగిన సమయంలో అనర్గళం గా మాట్లాడి, శ్రావ్యమైన కంఠస్వరంతో కవితలు వినిపించి అందరినీ అలరించడం...చమత్కార బాణాలు సంధించడం... ఆయన్ని మొత్తం సాహిత్య ప్రపంచం, సినీ ప్రపంచం ఒక పెద్ద దిక్కుగా వేలాది సభలకి అన్ని దేశాల వారూ పిలవడానికి ఆయన వాక్చాతుర్యం ఒక ముఖ్య కారణం. విసిగించే ప్రసంగం ఆయన చెయ్యడం నేను ఏ నాడూ విన లేదు.

హైదరాబాద్ లో అనేక సాంస్కృతిక సంస్థలు సినారె ని “సొంతం” చేసుకున్నట్టే ఆయన కూడా ఆయా సంస్థలకి వెన్నెముకలా నిలిచారు. అవి సాహిత్య సంస్థలే కానక్కర లేదు. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గదీ, నేను కూడా చిన్న పాత్ర వహిస్తున్నదీ అయిన వంశీ రామరాజు గారి వేగేశ్న వికలాంగుల సేవా సంస్థ. సినారె గారు రాజ్య సభ సభ్యులు గా ఉన్నప్పుడు తన నిధులలో నుంచి నలభై లక్షలు కేటాయించి వేగేశ్న ఫౌండేషన్ సంస్థకి అత్యవసరమైన భవనం నిర్మించారు.  ఆయన సహాయానికి, బీద వికలాంగుల సేవలో ఆయన నిరంతర ప్రోత్సాహానికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ భవనానికి ఆయన పేరే పెట్టడం జరిగింది.

మా చిన్నప్పుడు కవి అనగానే రెండు రూపాలు కనపడేవి. ఒకటి నారాయణ రెడ్డి, శశాంక, ఆవంత్స సోమసుందర్ మొదలైన వారు. వీరందరూ  రింగులు తిరిగిన నొక్కుల జుట్టు, జులపాలు, సిల్క్ జుబ్బా, జువ్వాజి, చందనం పూతలతో సువాసనలు వెదజల్లుతూ అచ్చు దేవులపల్లి వారిలా కనపడే వారు. చాలా మటుకు భావ కవిత్వం వ్రాసే వారు. రెండో రకం శ్రీశ్రీ లా లాల్చీ, పజామాలతో రెండు వేళ్ళ మధ్య సిగరెట్ తో కనపడక పోయినా ఆయన భావజాలం, తిరుగుబాటు ధోరణి కనపడేటట్టు కనపడేవారు. ఆ రోజుల్లో కవిగా చెలామణీ అవడానికి నేను ఆ పంచె కట్టు, గోదావరి, కృష్ణా తీరాల నుడి కట్టు పదాలతో మాట్లాడడం నేర్చుకున్నాను అని సినారె స్వయంగా ఒప్పుకున్న మాట. ఈ క్రింది కవిత చదివితే ఆయన మనస్తత్వం అందులో దాగి ఉందేమో అని  అనిపిస్తుంది.

“కులాభిమానం వీరుల లక్షణం

కుల దురభిమానం ధూర్తుల లక్షణం

కుల నిరభిమానం నిర్వీర్యుల లక్షణం”

ఇదే కవితని తన ప్రాంతీయతకి కూడా అన్వయిస్తూ, ఇటీవలి రాజకీయ పరిమాణాలని దృష్టి లో పెట్టుకుని సినారె తనని తెలంగాణా కవిగా ప్రస్తావించుకొనడం మొదలుట్టారు.  అలా అని ఆయనని సంకుచితవాది అనుకోడానికి లేదు. ఎందుకంటే తెలంగాణా రాష్ట్ర అవతరణ తరువాత ముఖ్య మంత్రి కెసిఆర్ సినారె ని “రాష్ట్ర కవి” గా పె గుర్తిస్తాం. తద్వారా ఆయన కారుకి గులాబీ జెండా ఎగురుతుంది” అన్నప్పుడు నారాయణ రెడ్డి గారు “నేనైమైనా పక్షినా? ఏదో రాష్ట్ర పక్షి ని గుర్తించినట్టు రాష్ట్ర కవి గా జెండా తో ఊరేగుతూ ఉండడానికి. నేను విశ్వ కవిని.  అలా గుర్తిస్తే అంగీకరిస్తాను” అని ఆ ప్రతిపాదనని తిరస్కరించారు అని విన్నాను.

ఆయనతో మొదటి సారి నేను ఒకే వేదిక మీద పాల్గొనడం... బహుశా 1985 ప్రాంతాలలో. అప్పుడు హైదరాబాద్ లో వంశీ రామరాజు గారు రేలంగి ఆర్ట్ ఎకాడెమీ తరపున రేలంగి వెంకట్రామయ్య గారి పుట్టిన రోజు సభకి హాస్య నటులందరినీ ఆహ్వానించారు. ఆ రోజు సభలో రాజేంద్ర ప్రసాద్, పేకేటి శివరాం, బ్రహ్మానందం, మల్లికార్జున రావు (బట్టల సత్యం), అల్లు రామ లింగయ్య, నటి ఆమని, మధ్యలో నేను… మధ్య లో అంటే నిజానికి మధ్యలో కాదు.  నటి ఆమని పక్కనే నేను కానీ అందరికీ మధ్యలో అగ్రపీఠం లో ఉన్నదీ, జ్యోతి ప్రజ్వలన తో మొదలు పెట్టి సభ నిర్వహించినదీ నారాయణ రెడ్డి గారే. ఆ రోజు నాకు ఆశ్చర్యం కలిగించిన అంశాలు రెండు. వేదిక మీదకి వచ్చిన హేమాహేమీలంతా ముందు రేలంగి ఫోటో కి మామూలు నమస్కారం చేసి, సినారే గారి కాళ్ళకి నమస్కారం చెయ్యడం మొదటిది. ఇక రెండోది సినారె మాట్లాడుతూ “ఇవాళ అమెరికా లో హాస్యం పండిస్తున్న హాస్య బ్రహ్మ వంగూరి చిట్టెన్ రాజు ఈ సభలో ఉండడం సంతోషంగా ఉంది” అని ప్రస్తావించడం. ఏ ముహూర్తాన ఆయన ఆ మాట అన్నారో కానీ  ఆ మాట అలా, అలా అమెరికా దాకా వచ్చి నన్ను అమెరికా హాస్య బ్రహ్మ లా నిలబెట్టింది.  ఆ సభలో సినారె దీప ప్రజ్వలన, హేమా హేమీ హాస్య నటులతో నేను ఉన్న ఫోటో ఇక్కడ జతపరిస్తున్నాను.

నాకే కాదు.  ఏ కళాకారులకైనా ఆయన తగిన పేరు పెట్టి ప్రోత్సహించే వారు. ఉదాహరణకి అసలు పేరు విజయలక్ష్మి అయిన ఒక గాయనికి “శివశంకరి గీతాంజలి” అనీ, హెరాల్డ్ విల్సన్ అనే ఘంటసాల బాణీ గాయకుడికి “చంద్ర తేజ” అనీ ఆయనే తన ఆశీస్సులు అందజేశారు. అలా ఎందరో !

     

మరొక చిన్న జ్ఞాపకం. అమెరికాలో ఒకానొక ద్విసహస్రావధాని (పేరు చెప్పదలచుకోలేదు) గారి త్రిగుణిత అవధానానికి ఎస్. పి. బాలూ, నేనూ, యడవల్లి రమణ మూర్తి, డి. హెచ్. ఆర్. శర్మ అప్రస్తుత ప్రసంగీకులం. కె విశ్వనాథ్ గారు సంచాలకులు. యండమూరి వీరేంద్రనాథ్, సామవేదం షణ్ముఖ శర్మ మొదలైన వారు ప్రధాన పృచ్చకులు. ఆ సభలో మొదటి వరసలో కూచుని మధ్యలో లేచి వెళ్లి పోయారు సినారె. నేను ఆశ్చర్యపోయి ఆ తరువాత “ఏం, గురువు గారూ. అవధానం బాగా లేదా?” అని అడగగానే “అవధానికి అటు పద్య ఛందస్సు సరిగా తెలీదు. పైగా ఉచ్ఛారణ దోషాలు. నీ పని బాగానే చేశావులే. నీ స్పాంటేనిటీ మెచ్చుకోవాలి” అన్నారు.    

 

నేను ఆయనని ఎప్పుడు కలుసుకున్నా ఎంతో అభిమానంగానే ఉండే వారు. అప్పుడప్పుడు నాకు “ప్రెవేటు” కూడా చెప్పే వారు. మొదటి సారి అలాంటి ప్రెవేటు మా ఇద్దరు అమ్మాయిలూ హైదరాబాద్ లో కూచిపూడి నృత్య ప్రదర్శన చెసినప్పుడు. 2002 సంవత్సరం అని జ్ఞాపకం. అప్పటికి మా అబ్బాయికి పదేళ్లు. నారాయణ రెడ్డి గారు హాల్ లోకి రాగానే వాడు ఆయన్ని చూసి “హాయ్. ఐ నో యు. యు కేమ్ టు అవర్ హౌస్... రిమెంబర్?” అన్నాడు కుడి చెయ్యి చూపుడు వేలు ఊపుతూ.  ఆ చిన్నపిల్లవాడు తన కాళ్ళకి నమస్కారం పెడతాడేమో అని ఎదురు చూస్తున్న నారాయణ రెడ్డి గారు హతాశుడై పోయి, నన్ను పక్కకి పిలిచి “ఏమన్నా బుద్ధుందా. అమెరికా లో పిల్లల్ని ఇలా పెంచుతారా. మంచీ, మర్యాదా అక్కర లేదా” అని క్లాస్ పీకారు. ఏం చెయ్యాలో తెలియక నేను ఆయనకి సాష్టాంగ ప్రమాణం చేసి, క్షమాపణలు చెప్పుకుని ఆ గండం నుంచి బయట పడ్డాను. ఆ సభలో మా రెండో అమ్మాయి అమూల్య సినారె గారు రచించిన “ఆనంద తాండవం” కూచిపూడి నృత్యాన్ని అద్భుతంగా చేసింది. అది చూసి ఆయన మురిసిపోయారు. తరువాత ఆ సభలో ఆయన కూచిపూడి నాట్య ప్రమాణాల గురించి, అందులో సాహిత్య ప్రమాణాల గురించీ అనర్గళంగా మాట్లాడారు. అదే నృత్యాన్ని మా అమ్మాయి అమెరికాలో అట్లాంటా లో చేసినప్పుడు కూడా ఆయన చూసి వేదిక మీదకి వెళ్లి ప్రత్యేకంగా ప్రశంసించారు.

 

ఇక రెండో సారి... జనవరి 1, 2007 నాడు. ఈ సారి పాత్రధారులు బాపు -రమణ... సతీమణులతో సహా. ఆ రోజు మేము నిర్వహించిన మొట్ట మొదటి ప్రపంచ సాహితీ సదస్సుకి ముగింపు సమావేశం. అందులో బాపు-రమణ ల మైత్రీ షష్టి పూర్తి సన్మానం. ముందుగా జరిగిన పొరపాటు ఏమిటంటే... ముళ్ళపూడి గారి మొదటి కథకి బాపు గారి మొదటి బొమ్మ వేసి అప్పటికి 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా రచన శాయి గారి సూచన మీద దానికి “బాపు -రమణ జంట షష్టి పూర్తి” అనే పేరు పెట్టడానికి నేను ఒప్పేసుకున్నాను. నారాయణ రెడ్డి గారు ప్రధాన అతిథి. బేనర్లు, కర పత్రాలూ అన్నీ వేసేసిన తర్వాత నారాయణ రెడ్డి గారికి ఈ జంట షష్టి పూర్తి అనే మాట వాడినట్టు తెలిసింది. ఇక అసలు విషయానికి వస్తే “మీ సన్మానం ఎలా చెయ్యమంటారు. ఏమన్నా మీకు నచ్చిన పద్ధతులు ఉన్నాయా?” అని బాపు గారిని అడిగాను రెండు రోజుల ముందే. దానికి ఆయన “ఏది ఏమైనా మా గురించి వేదిక మీద ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మేము... అంటే నేనూ ఆవిడ భాగ్యమతీ, రమణ గారూ ఆయన భార్య శ్రీదేవి చస్తే స్టేజ్ మీద కూచోం. అదే మై కండిషన్. ఇక పుష్ప గుచ్చాలు, కాళ్ళకి సాష్టాంగ ప్రమాణాలు అన్నీ మానెయ్యండి. మా కాళ్ళు మా ఇష్టం ” అన్నారు బాపు గారు. అది విని నేను నవ్వగానే “ఎందుకో తెలుసా?” అని అడిగి, నా వెర్రి మొహం చూసి “స్టేజ్ మీద మైక్ ముందు ఉంటుంది. మేము కూచునే కుర్చీలు వెనకాల ఎక్కడో ఉంటాయి. అంచేత ఆ మాట్లాడేవాడు ఏం వాగుతున్నాడో మాకు వినపడి చావదు. వాడు తిడుతున్నాడో, పొగుడుతున్నాడో మాకు తెలీదు కదా. అంచేత వెర్రి మొహం పెట్టుకుని స్టేజ్ మీద కూచోవాలి. అంచేత వాళ్ళు మాట్లాడినది వినడానికి ఆడియన్స్ లో కూచుంటేనే కరెక్ట్. స్పీచ్ లన్నీ అయిపోయాక... స్టేజ్ మీదకి వస్తాం ఆ తరువాత చెక్క ముక్క ఇస్తావో, శాలువా కప్పుతావో నీ ఇష్టం. అన్నట్టు నేను మాట్లాడను. నాకు జనగండం. మా అందరి తరఫునా రమణ గారు మాట్లాడతారు” అన్నారు బాపు గారు. ఆయన చెప్పింది సమంజసం గానే ఉంది కానీ ప్రధాన అతిథి అయిన నారాయణ రెడ్డి గారు ఏమంటారో అని నాకు అనుమానం వచ్చి సినారె గారిని పిలిచి బాపు గారి నిబంధన చెప్పాను. “బాపుకి లేక పోతే నీకైనా తెలీదా. లేక ఇది ఏమైనా అమెరికా సాంప్రదాయమా. సన్మానితుడు వేదిక మీద లేక పొతే అది సన్మాన సభ అవదు. సంతాప సభ అవుతుంది” అని క్లాస్ పీకారు సినారె గారు. నేను అర కత్తిలో పడ్డ పోక చెక్క లా బాపు -సినారె మధ్య ఇరుక్కుని, దిక్కు తోచక  “ఏమో సార్. నేను మీ ఇద్దరినీ ఒకే సారి వేదిక మీదకి పిలుస్తాను. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం” అని బాపు గారికీ , సినారె గారికీ చెప్పేశాను.  “సరేలే. నువ్వు చెప్పినట్టే మమ్మల్ని ఒకే సారి పిలు.  నేనే బాపునీ, రమణనీ పైకి తీసుకొస్తాను” అన్నారు సినారె గారు. నేను సరిగ్గా అలాగే చేశాను. ఆ క్షణం నుంచీ పది నిముషాలు సినారే గారు బాపు-రమణ లని వేదిక మీదకి రమ్మనడం, వాళ్ళు అడ్డంగా బుర్ర ఊపి మొదటి వరసలో భీష్మించుకుని కూచోడం, నేను వేదిక మీద నుంచి ఈ చోద్యం చూడడం... ఇప్పటికీ తల్చుకుంటే తమాషాగా ఉంటుంది.

మొత్తానికి ఆ రోజు సినారె గారు బాపు-రమణలు ముందు వరసలో కూచుని వింటూ ఉండగా వారి ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో  “గోగులు పూచే, గోగులు పూచె ఓ లచ్చా గుమ్మడి”, సీతాకళ్యాణం లో గంగావతరణ ఘట్టం రమణ గారి సూచనలకి తగ్గట్టుగా ఆశువుగా చెప్తూ ఉండగా బాపు ఆ చిత్రీకరణ కి తగిన బొమ్మలు అప్పటికప్పుడు వేయడం గురించి అత్యద్భుతంగా ప్రసంగించి ఆ మొట్ట మొదటి  ప్రపంచ సాహితీ సదస్సుకి ఎనలేని శోభ చేకూర్చారు. పనిలో పనిగా “అది బాపు-రమణ మైత్రీ షష్టి పూర్తి అనీ, ఏదో హాస్యం కోసం వంగూరి చిట్టెన్ రాజు జంట షష్టి పూర్తి అన్నాడు కానీ జంటలు వేరు. భార్యా భర్తలు జంటలు. బాపు-రమణ జంటలు కాదు. జంట కవులూ కాదు. వాళ్ళు  అరవై ఏళ్ళుగా సాహిత్య పరంగానూ, వ్యక్తిగతంగానూ  ఆప్త మిత్రులు. అంచేత ఇవాళ వారి మైత్రీ షష్టి పూర్తి. జంట షష్టి పూర్తి కాదు… ” అని నన్ను కాస్త చివాట్లు వేసారు. అది ఆయన నాకు రెండో సారి క్లాస్ పీకడం. ఆ సభలోనే ఆయనా, బాపు -రమణా నా “అమెరికాలక్షేపం” పుస్తకం, మా “అమెరికా తెలుగు కథానిక – సంకలనం “ ఆవిష్కరించారు. ఆయా ఫోటోలు ఇక్కడ జతపరుస్తున్నాను.

మొత్తం పదేళ్ళగా యుట్యూబ్ లో ఉన్న ఆ ప్రసంగం లంకె ఇక్కడ ఇద్దాము అనుకుని చూస్తే ఇప్పుడే తెలిసిన తాజా సమాచారం ప్రకారం ఇటీవల ఎవరో ప్రబుద్ధులు అందులో ఏదో తమ కాపీ రైట్స్ ని ఉల్లంఘిస్తోంది అని ఘోషించి మాటలు వినపడకుండా ఆ అద్భుతమైన వీడియోని నిషేధించారు. నేను తంటాలు పడి దాన్ని సరిదిద్ది మాటలు పునరుద్ధరించి ఆ లంకె ఈ క్రింద ఇస్తున్నాను.

https://www.youtube.com/watch?v=EB7w42Y2QN4&t=1974s

కారణ జన్ముడైన ఒక కవీంద్రుడు కారణ జన్ములైన బాపు -రమణ ల ను తనదైన శైలి లో ప్రశంసలు అందించడం, అదీ నా చేతుల మీదుగా జరగడం నా అదృష్టం. వీలున్నప్పుడు పై వీడియో చూసి తరించండి. నిజానికి ఈ వీడియో అంతా  బాపు-రమణ ల గురించే కాబట్టీ, ఈ వ్యాసం సినారె గారి గురించి కాబట్టీ దాన్ని ఎడిట్ చేసి సినారె గారి ప్రసంగం ఒకటీ ఉంచుదాం అనుకున్నాను కానీ సమయాభావం వలన యధాతథంగా మీ ముందు ఉంచుతున్నాను. అంతా చూసే ఓపిక, ఆసక్తి లేని వారు సినారె గారి ప్రసంగం ఎంపిక చేసుకుని వినవచ్చును.  మళ్ళీ ఎవరైనా మాటలు నిషేధిస్తారేమో... తొందర పడండి.

 

ఇక 1996 లో హ్యూస్టన్ లో ఆటా మహా సభలు జరిగినప్పుడు ఉత్తమ సాహితీవేత్తగా సినారె గారి చేతుల మీదుగా ఆటా వారి జాతీయ స్థాయి అవార్డు పుచ్చుకోవడం మరొక మరపురాని అనుభూతి. ఆ ఫోటో కూడా ఇక్కడ జతపరుస్తున్నాను.

   

మా నిర్వహణలో ఒకసారి కేంద్ర సాహిత్య ఎకాడెమీ వారి బహుమతులు పొందిన తెలుగు రచయితలు అందరినీ... ఒకరా ఇద్దరా… సుమారు ముప్పై మందిని, అనేక నగరాల నుంచి  ఒకే వేదిక మీదకి రప్పించి వారికి సత్కారం చేసిన సందర్భంలో సినారె గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. “ఇలాంటి ఆలోచనలు నీకే వస్తాయి. రాగానే ఆచరణలో పెడతావు.  మాకు వచ్చినా నీకు సహకరించినంతగా మాకు అందరూ సహకరించరు.” అని  కాస్త పొగడ్తా, మరి కాస్త ఆవేదనా వెలిబుచ్చారు. ఆ సభలోనూ ఆయనదే ప్రధాన భూమిక. అలాగే అనేకానేక సభలకి ఆయనే ప్రధాన అతిథి. ముఖ్యంగా ఆ సభకి మాలతీ చందూర్ గారు మద్రాసు నుంచి రావడం ఆయన్ని చాలా కదిలించింది. మాలతీ చందూర్ గారు మాట్లాడుతూ “నాకు సాహిత్య ఎకాడమీ పురస్కారం వచ్చినప్పుడు నేను ఢిల్లీ వెళ్ళకుండా పోస్ట్ లో తెప్పించుకున్నాను. కానీ ఇవాళ ఆ లోటు తీరింది” అనగానే అందరూ ఆశ్చర్య పోయారు... సినారె తో సహా. 

      

ఏ మాటకామాటే చెప్పుకోవాలీ అంటే తెలుగు కవులు, సాహితీవేత్తల ప్రపంచంలో సినారె ని గొప్ప కవిగా గుర్తించడానికి చాలా మంది ఇబ్బంది పడతారు. ఆఖరికి ఆయన విశ్వంభర కానీ, కర్పూర వసంత రాయలు కానీ సాధారణ కవిత్వమే అనే వాళ్ళు ఉన్నారు. ఇక సినీ కవిత్వం విషయంలో ఆయన ఎటు వంటి ప్రలోభాలకీ లొంగకుండా, ద్వందార్థాల  జోలికి పోకుండా  “కేవలం ఉన్నత స్థాయి తెలుగు” లో మాత్రమే తన  సినీ కవిత ప్రస్థానం సాగించారు అని ఆయన వ్రాసిన 3500 పాటలు ఋజూవు చేస్తాయి.  అలా అని “మాయదారి సిన్నోడు” లాంటి జనరంజకమైన “మాస్” పాటలు కూడా ఆయన వ్రాశారు. 

ఉర్దూ మాధ్యమంలో చదువుకుని తెలుగుని ప్రేమించి, ఒక కవిగా, సాహితీవేత్తగా అత్యున్నత శిఖరాలని అధిగమించిన మహా మనీషి  సి.నారాయణ రెడ్డి గారి గురించి సాహిత్య పరంగా, కవిత్వ పరంగా, మరే విధంగానూ విశ్లేషించడానికి నాకు అర్హత లేదు కానీ వ్యక్తిగతంగా నా కృషిని గుర్తించి నన్ను అక్కున చేర్చుకున్న మహానుభావుడు డా. సి. నారాయణ రెడ్డి గారు. ఆయన నిర్యాణం బాధాకరం. తెలుగు సాహిత్య ప్రపంచంలో, సినీ రంగంలో ఆయన స్థాయి ఆయనదే.  “కండువా లేనిదే గడప దాటని వాడు. ఎవడయ్య వాడు. తెలుగు వాడు”... అన్న ఆ తెలుగు వాడు గడప దాటేశారు.

సుమారు ఎనభై పుస్తకాలు ప్రచురించిన సినారె గారు గత కొన్నేళ్ళగా ప్రతీ ఏడూ తన పుట్టిన రోజు సందర్భంగా ఒక కొత్త కవితా సంకలనం ప్రచురించడం.. తన ఆఖరి పుస్తకంగా “మరణం పైనే నా రణం” అనే పుస్తకం క్రందటేడు విడుదల అయినప్పుడు ఎవరో అడిగితే “ఇప్పుడు నా పరిస్థితి అదే కదా” అని సమాధానం చెప్పారు నిజాయితీగా.  ఆతన ఆఖరి పుస్తకం ఇప్పుడే ముద్రణ పూర్తి చేసుకుని విడుదలకి సిద్దంగా ఉన్న సమయంలో ఆయన రణం నుంచి విరమించుకుని....లేదా జయించి అమర లోకాలకి తరలి వెళ్ళడం  దైవ నిర్ణయం.

అడపా దడపా 40 ఏళ్ల ఆయన సాహచర్యం తో, ఆయన ప్రోద్బలంతో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన అభిమానానికి అర్హుడిని అయినందుకు గర్విస్తూ... సినారె గారెకి ఇదే నా నివాళి.

***

bottom of page