top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

దగ్ధగీతం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య (జననం: 1938)

సుమారు 30 సంవత్సరాలకు పైగా రచనలు సాగిస్తూ "ధృవతార", "పంజరం", "సూర్యోదయం" వంటి నవలల ద్వారా "నయన తార, "నీళ్లు" వంటి కథా సంపుటాల ద్వారా పాఠక హృదయాలను చూరగొన్న పెద్దిభొట్ల సుబరామయ్య వృత్తిరీత్యా అధ్యాపకులు. ఎన్నో కథలు పలు బహుమతులు అందుకున్నాయి. భారతీయ భాషలలోనే కాక రష్యన్‌లోకి కూడా అనువదించబడ్డాయి. మనిషి అంతరాంతరాలలోని ఆవేదనకు కథా రూపకల్పనే యీ "దగ్ధగీతం"....

ఆరోపణ పర్వం    -ఘంటసాల నిర్మల

1996 లో ఆంధ్రప్రభ డైలీలో ముద్రితం

తగాదాలతాడు తయారించి తెచ్చి

అవతలి కొన నువ్వూ

ఈవలి కొన నేనూ

మూర్ఖంగా లాగుతూ

పరస్పర గౌరవం దిగజారుతూ మనం!

 

విభేదాల విషపాత్రకు తోడు

నిత్యం లోలోపల రగులుతున్న అసహనాగ్ని ప్రజ్వరిల్లి

అంటకాగిన కోపం తక్షణ కారణమేదో దొరికి పొంగి

నోరు పామై విసిరిన బుసకు లోలో కుంగి-

చేతులు కలిపి నేరం పంచుకున్న పెద్దల్నీ

మత్పితరుల్నీ

మృత్పిండాలైన అలనాటి కలల్నీ

నిష్టూరాల తరాజులో తూచీ తూచీ

తలచీ వగచీ

విసురుగా నేనూ

రుసరుసగా నువ్వూ

మాటలు చిటిలే మౌనంలో

చెరో దినపత్రికనీ చీల్చి చెండాడుతున్న దుర్ముహూర్తాన

రుద్రవీణానావాదనంలో నిషిద్ధ నిక్వాణంలా

తలవాకిట పలకరింపు సరాగం

 

అంతే-

తృటిలో ఎటులో

మాటలూ మారణాయుధాలూ మాయం చేసి

సాధ్వీమతల్లి వూసరవెల్లిలా నువ్వు-

పురుగులు సొరుగుల్లో తోసి

పూర్ణానురాగ పురుషుడిలా నేను!

అగ్ని పర్వతాగ్రాన మొలుచుకొచ్చిన గంధం మొక్కల్లా

రెండు వేర్వేరు చిరునవ్వులతో

     నం ! !

Anchor 1

దగ్ధగీతం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య (జననం: 1938)

సుమారు 30 సంవత్సరాలకు పైగా రచనలు సాగిస్తూ "ధృవతార", "పంజరం", "సూర్యోదయం" వంటి నవలల ద్వారా "నయన తార, "నీళ్లు" వంటి కథా సంపుటాల ద్వారా పాఠక హృదయాలను చూరగొన్న పెద్దిభొట్ల సుబరామయ్య వృత్తిరీత్యా అధ్యాపకులు. ఎన్నో కథలు పలు బహుమతులు అందుకున్నాయి. భారతీయ భాషలలోనే కాక రష్యన్‌లోకి కూడా అనువదించబడ్డాయి. మనిషి అంతరాంతరాలలోని ఆవేదనకు కథా రూపకల్పనే యీ "దగ్ధగీతం".

"అనవసరంగా చాలా కాలం బ్రతికాను నేను" అనుకున్నాడు సేతురామన్.

ఆ చిన్న వరండాలో స్తంభానికి ఆనుకొని కూర్చుని ఉన్నాడు. తల అక్కడక్కడ నెరిసింది. కళ్లు లోతుకుపోయి, ముఖం ముడతలుబడి అకాల వార్ధక్యం పైబడినవాడిలా ఉన్నాడు. నిన్న రాత్రి ఆ సన్నటి వరండాలో చాపమీద నిద్రపోదామని విశ్వప్రయత్నం చేశాడు. కానీ ఫలించలేదు. పైగా కన్నుమూస్తే అన్నీ పీడకలలూ, వికృతమైన దృశ్యాలూ.. నిన్ననే కాదు, నాలుగు రోజులనుంచి అంతే.

ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది. తలతిప్పి చూస్తే డాక్టరు.. సేతురామన్ లేచి నిలబడ్డాడు. డాక్టరు యువకుడు. సేతురామన్ వంక పలకరింపుగా చూసి నవ్వాడు. సేతురామన్ కళ్ళలో అకస్మాత్తుగా నీటిపొర కమ్మింది. స్తంభానికి ఆనుకుని అలాగే నిలబడ్డాడు. డాక్టరు గుమ్మంలోనే నిలబడి కొద్దిక్షణాలు చూశాడు. లోపలికి పోలేదు. లోపలికి పోనవసరం లేదని సేతురామన్‌కి తెలుసు. డాక్టరు చివాలున వెనుదిరిగి సేతురామన్ ప్రక్కగానే నడిచి అవతలివైపుకి వెళ్లిపొయాడు. డాక్టరు బూట్ల శబ్దం అతని నోటివెంట వెలువడిన మాటలను పూర్తిగా అణచలేకపోయింది. సేతురామన్‌కు, ఆ మాటలు స్పష్టంగానే వినబడ్డాయి. 'పూర్ సోల్', షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ డెత్." సేతురామన్ మళ్లీ స్తంభానికి ఆనుకుని కూలబడ్డాడు. వెనక రెండు గదులు.. మరీ పెద్దవేమీ కాదు. ఎడమవైపు గది ఖాళీ .. కుడివైపు గదిలో.. సేతురామన్ కళ్లు తుడుచుకున్నాడు.

కుడివైపు గదిలో అతని సంగీత సామ్రాజ్యం శిథిలమై, దగ్ధమై బూడిదయిపోతున్నది. ఇవాళ్టికి సరిగా నాలుగు రోజుల నుంచీ.. నాలుగు పగళ్ళూ, నాలుగు రాత్రులు..

ముందు పెద్ద ఆస్పత్రి భవనం.. అందులో మామూలు మనుషులకు మామూలు సౌకర్యాలున్న గదులు.. ప్రత్యేక వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలున్న గదులున్నాయి. అక్కడ ఎక్కడా ఖాళీ లేదు. వెనక ఈ రెండు గదుల కట్టడం ఎందుకు ఉందో తెలీదు. ఇక్కడే ఖాళీ దొరికింది. సేతురామన్ చేతివ్రేళ్ళు విరుచుకున్నాడు. పొద్దున ఆసుపత్రి బయట తాగిన టీ తాలూకు ఆ రుచి నాలుకను ఇంకా అంటిపెట్టుకూనే ఉంది. నీరసంగా ఉంది. మనసంతా వికారంగా ఉంది.

అకస్మాత్తుగా ఆస్పత్రి వెనక రైలు ఒకటి కూత వేసుకుంటూ రణగొణ ధ్వని చేస్తూ వెళ్లింది. అది చాలా దూరం పోయిన తరువాత కూడా ఆ వికృత శబ్దం అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.

ఎప్పటెప్పటివో దృశ్యాలు.

ఎండాకాలం... మధ్యాహ్నం.. విశాలమైన పెరటిలో పెద్ద సీమ చింతచెట్టు.. (లేక బాదం చెట్టా?) కింద వెలుగును ముక్కలు ముక్కలుగా కత్తిరించి పోసినట్టున్న ఎండ .. చెట్టు మొదట్లో కూర్చున్న పంకజవల్లి.. సన్నసన్నగా కబుర్లు.. చిరుతిళ్లు.. చిరుచిరు తగవులు.. చిరునగవులు.

సేతురామన్ ఉలిక్కిపడి చూశాడు. ప్రహరి గోడమీద రంగు రంగుల పక్షి ఏదో కూర్చుని పెద్ద గొంతుతో అరుస్తున్నది. ఒకప్పుడెప్పుడో ఎండాకాలం, మధ్యాహ్నం వేళ.. చెట్టు కొమ్మల్లో ఎక్కడో కోయిల కూస్తుంటే తామిద్దరూ రెట్టించేవారు. తాము రెట్టించే కొద్ది కోయిల మరీ రెచ్చిపోయి కూస్తూ ఉండేది. చివరకు తామో, కోయిలో ఎవరో ఒకరు అలిసిపోయి మానేసేవరకూ కొనసాగేది ఆ సంబరం. కోయిలను చూద్దామని ఎన్నోసార్లు ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఎప్పుడూ వారికి కనబడలేదు. అవును.. కోయిల అలిసిపోయింది.. అలిగిపోయింది.. కృంగిపోయింది.. ఆ చిన్ని మేనులో వీసమెత్తు కూడా శక్తి మిగల్లేదు.

సేతురామన్ లేచాడు. నెమ్మదిగా అడుగులు వేస్తూ గుమ్మంలోకి వెళ్ళి నిలబడ్డాడు. కిటికీ పక్కన ఇనుప మంచం.. కిటికీలో నుంచి ఉమ్మెత్త చెట్టు ఒకటి మాత్రం గోడ పక్కన కనిపిస్తున్నది. గది గోడలు తెల్లగా ఉన్నాయి. మంచం పక్కన పాత చెక్క బీరువా. సేతురామన్ గుండెలు చేత్తో రుద్దుకున్నాడు. అంతలో దగ్గు వచ్చింది. ప్రయత్నపూర్వకంగా దగ్గు ఆపుకుంటూ మళ్లీ కళ్లెత్తి చూశాడు.

తెల్లని దుప్పటిలో శుష్కించిన శరీరంపైన ముంజేతులు, తల మాత్రం కనిపిస్తున్నాయి. ఒక చేతికి ఒకే ఒక ఎర్రరంగు గాజున్నది. గుండెల మీద ఉన్న రెండో చేతికి ఏమీ లేదు. పైన సన్నని కంఠం.. నల్లని కంఠం.. దేశం అంతటా సంగీత మాధుర్యాన్ని పంచిన కంఠం.. బండరాళ్లవంటి హృదయాలను జలజల కరిగించిన కంఠం.. ఆ పైన చామనచాయ ముఖం.. సన్నని ముక్కు.. తెల్లని పెద్ద పెద్ద కళ్ళు..( అవి ఇపుడు మూతపడి ఉన్నాయి. మళ్లీ తెరుచుకుంటాయో లేదో తెలీదు.) ముంగురులు సన్నని గాలి విసురుకు బలహీనంగా కదులుతున్నాయి. శుష్కించిన చెక్కిలి మీద ఒకవైపు సన్నని చెమట...

సేతురామన్ ఇవతలికి వచ్చాడు. ఆస్పత్రి ప్రక్కగా యెవరో పెళ్లికి తరలి వెడుతున్నారులా వుంది. సన్నాయి మృదువుగా గాలిలో తేలి తేలి వస్తున్నది.

అతనికి అంతలో బీడీ కాల్చాలనిపించింది. చొక్కా జేబులో ఒక్కటే బీడీ మిగిలి వుంది. కానీ అగ్గిపెట్టె లేదు. అందువల్ల ఆ కోరికను అణచుకున్నాడు. బీడీని అవతల పారేద్దామనుకున్నాడు. కానీ మళ్లీ మనసు మార్చుకుని జేబులోనే వుంచుకున్నాడు. తన ఆస్తి, గొప్పదేమీ కాదుగానీ అంతా వీటికే హరించుకుపోయింది. పెళ్ళి చేసుకుని ఒక యింటివాడివి కమ్మనీ, కుదురుగా వుండమనీ ఎంతగానో నచ్చజెప్పిన తల్లీతండ్రీ పోయారు. ఇంకెవరూ మిగల్లేదు. ఆస్తి హారతి కర్పూరంలా కాకపోయినా నెమ్మది నెమ్మదిగా హరించుకుపోయింది. సన్నాయి వాద్యం పూర్తిగా దూరమైపోయింది. ఇపుడేమీ శబ్దం లేదు.

సేతురామన్‌కు పంకజవల్లి పెళ్లి గుర్తుకువచ్చింది. అప్పటికే ఆమె సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలించే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. ఆమె రవిని ప్రేమించింది. మూర్తీభవించిన పురుష సౌందర్యానికి అబ్బురపడి అతన్ని ఆరాధించింది. వారి పెళ్ళి అట్టహాసంగా జరిగింది. పలువురు ఆ వివాహాన్ని ఆదర్శవివాహమని కొనియాడారు. ఎక్కువమంది పెళ్లికుమారుణ్ణే మెచ్చుకున్నారు. ఎంత సంగీత సరస్వతి అయితే మాత్రం, అంత అందగాడు చేసుకోదగిన పిల్ల కాదని కొందరు అనుకున్నారు. మరి కొందరు అతని కళాప్రియత్వాన్ని కొనియాడారు. ఎందరెన్ని అన్నా, ఎందరెన్ని అనుకున్నా రవి చిరునవ్వుతోనే వున్నాడు తప్ప ఎవరికీ ఏమీ తెలియనీయలేదు. సేతురామన్ మాత్రం అంత హడావిడిలోనూ ఒంటరిగా కూర్చుని తన ఆలోచనల్లో తానుండిపోయాడు. తాను చిన్నప్పటి నుంచీ ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని ప్రేమించాడో ఆమె తనకు దక్కకుండా పోయినందుకు అతడేమీ బాధపడలేదు. ఆమె ప్రేమించినవాణ్ణి చేసుకుంటున్నందుకు ఆనందించాడు కూడా. ఇదంతా జరిగి దాదాపు పదేళ్ళు. రవి చాలా జాగ్రత్తపరుడు. తనకు ఏమేమి కావాలో వాటిని సాధించి సమకూర్చుకోగల తెలివితేటలు పుష్కలంగా వున్నవాడు. భార్య చేయవలసిన కచేరీలు, అక్కడ వసూలు చేయవలసిన మొత్తాలూ.. చెక్కులు, అకౌంట్లు అన్నీ అతడే చూసుకునేవాడు. ఆ విషయాల్లో బహు జాగ్రత్తగా, ఖచ్చితంగా ఉండేవాడు. ఎప్పుడన్నా పనకజవల్లి "నాకు వొంట్లో బాగులేదు జ్వరం.. కచేరీకి వెళ్లలేను. ఓపిక లేదు" అంటే "అమ్మమ్మా! అంత మాట? అలా అనకు. వాళ్ల దగ్గర ముందే డబ్బు కూడా తీసుకున్నాను. వెళ్లకపోతే వీల్లేదు. మామూలు జ్వరానికే కచేరీ ఎగ్గొట్టేస్తే .. తప్పు డియర్.." అనేవాడు. మరొకప్పుడెప్పుడన్నా "ఏమండి ఎవరో అనాధశరణాలయం సహాయం కోసం కచేరీ యివ్వమంటున్నారు పాపం. వందమంది అనాధలైన పిల్లలు తిండి తిప్పలూ లేక మాడిపోతున్నారట" అంటే .. అందంగా నవ్వి.." భలేదానివే. ఇలా ఇవ్వలేని వాళ్ల కోసం కచేరీ చేస్తే నీ ఆరోగ్యం ఏం కాను? వీటినన్నింటినీ పెట్టుకోవద్దు. అనాధలకు ఎవరో డబ్బున్నవాళ్ళు దానం చెయ్యాలి గాని మనం ఎంతని చేస్తాం? అలాంటీ విషయాలు నాకొదిలెయ్ డియర్" అనేవాడు.

సేతురామన్ జేబులు వెతుక్కున్నాడు. బాగా నలిగిపోయిన రూపాయి నోట్లు రెండు, కొంత చిల్లరా మిగిలి ఉంది. అంత ఆస్తికి ఈనాటికి మిగిలిదిది. పెద్ద యిల్లూ. పల్లెటూర్లో మూడెకరాల మాగాణీ, పొగాకు పండే నాలుగెకరాలు మెట్ట, ఇంతకు మిగిలింది ఇదే.

ఆమె పెళ్లయినప్పటి నుంచీ, సేతురామన్ వారి యింటి ఎదురుగానే ఒక రెండు గదుల వాటా అద్దెకు తీసుకుని అందులో ఉండేవాడు. పై పనికి ఒక కుర్రవాణ్ణి, ఒక వంటమనిషిని కుదుర్చుకుని ఉండేవాడు. పంకజవల్లిని గురించి చాలా మాటలు విన్నాడు. ఎవరూ రవిని ఏమీ అనలేదు. ఆమెను గురించే అందరూ అన్నారు. ఆమె డబ్బు మనిషయిపోయిందనీ, సంగీతాన్ని అమ్ముకుంటుందనీ, ఇలా చాలా విన్నాడు. జనానికి ఆ డబ్బంతా ఏ ఖాతాలోకి వెడుతున్నదో, ఎవరి చేతుల్లోకి వెడుతున్నదో తెలిస్తేగా? చాలా తక్కువసార్లు ఆమె సేతురామన్‌తో మాట్లాడింది. మాట్లాడినపుడు చాలా తక్కువగా మాట్లాడింది. రవి పట్ల ఉన్న అకర్షణ, రవి అంటే తన్మయత్వం ఆమెలో తగ్గడం సేతురామన్ గమనించాడు. ఆమె ఉదాసీనంగా అప్పుడప్పుడూ దీనంగా, ఒంటరిగా ఇంట్లో ఉండటం అతడు గమనించాడు.  వేలకు వేలు డబ్బు చేసిపెట్టే ఆమె కంఠం రవికి కావాలి. అందవిహీనమైన ఆమె, ఆమె శరీరం ఆ శరీరంలోని మనసు ఇవేవీ అతనికి అక్కర్లేదు. అతనికి కావల్సిన అందమైన శరీరం అతడు వేరే ఏర్పాటు చేసుకున్నాడు. క్రమక్రమంగా కచేరీ ఏర్పాట్లు తారీఖులు, వగైరాలు తప్ప ఆమెతో అతనికేమీ సంబంధం లేకపోయింది. ఇల్లు మాత్రం గడుపుతూ ఉండేవాడూ. ఇల్లంటే, ఉన్నది ఎంతమంది గనుక? భార్య, ఆమెను కనిపెట్టుకుని ఉండే మరొక మనిషి. అంతే.. కచేరీకి వెళ్లవలసి వచ్చినపుడు కారులో వచ్చి తీసుకుపోయేవాడు. అది పూర్తి కాగానే తీసుకొచ్చి దించి వెళ్లిపోయేవాడు. ఇటీవల ఒకసారి "గొంతు మంటగా ఉంది. నేను కచేరీ చెయ్యలేను" అంటే పెద్దగా మాట్లాడి కోపగించి భయపెట్టి తీసుకువెళ్లాడు. ఆమె తిరిగి వచ్చి బాధతో మెలికలు తిరిగిపోతుంటే సేతురామన్ గబగబా వెళ్లాడు. ఆమె దగ్గి దగ్గి చివరకు చారెడు రక్తం కక్కింది. అతనికి అప్పుడు గుండెలు దడదడ లాడాయి.

సేతురామన్ కాళ్లు బారజాపుకు కూర్చున్నాడు. పది గంటలవుతుందేమో ఈ చుట్టుపక్కల మంచి హోటలు ఏదీ లేదు. రాత్రి ఆస్పత్రి ముందు చిన్న హోటల్లో తిన్నది  యింకా కడుపులో అలాగే ఉన్నట్టుంది.

అయిదరు నెలల క్రిందట ఒకనాడు రవి కారులో వచ్చి భార్యను తీసుకుపోవడం చూసాడతను. తన వాటా వరండాలో నిలబడి ఉంది, తానలాగే నిలబడి  ఉన్నాడు. అరగంటలో వాళ్లు తిరిగి వచ్చేశారు. తర్వాత రవి ఒంటరిగా బయలుదేరి వెళ్ళిపోయాడూ. "ఏం జరిగిందో తెలుసుకుందామ"ని ఎంతగానో ఆశించినా ఆ సాయంకాలం వరకూ అతనికి వీలుపడలేదు. సాయంకాలం ఆరుగంటల వేళ పంకజవల్లితో వుండే నలభై ఏళ్ల వనజమ్మ బైటికి వచ్చింది. సేతురామన్ ఆమెని పిలిచి కబుర్లలో పెట్టి నెమ్మదిగా విషయం తెలుసుకున్నాడు. వనజమ్మ గది బయట వుండి అంతా విన్నది. అందువల్ల ఆగలేక సేతురామన్‌కు చెప్పేసింది. సేతురామన్ అది విని ఎండుటాకులా నిలువునా గడ్డకట్టుకుపోయాడు. క్యాన్సర్... ఆ చిన్ని గొంతులో క్యాన్సర్.. అతనికి ఏడుపొచ్చింది.

ఇక ఆ తరవాత కథంతా చాలా త్వరగా జరిగిపోయింది. రవి పది రోజులు గడిచాక ఒకసారి మాత్రం వచ్చి ముక్తసరిగా ఒక అరగంట ఉండి వెళ్లిపోయాడు. తర్వాత పది రోజులు పత్తాలేడు. మళ్లీ వచ్చి వనజమ్మ చేతికి కొంచెం డబ్బిచ్చి వెళ్లిపోయాడు. అదే చివరిసారి అతను వూళ్ళోనే మళ్లా కనిపించలేదు.

సేతురామన్ అప్పుడప్పుడూ ఎదురింటికి వెళ్లి మాట్లాడి వచ్చేవాడు. మామూలు  మాటలు. మధ్య మధ్యలో చిన్నప్పటి కబుర్లు.. ఆమె ఎక్కువసేపు నిశ్శబ్దంగా వుండేది. మాట్లాడేందుకు బాధపడేది. మాట్లాడకపోతే దగ్గు తెరలు తెరలుగా వచ్చేది. దగ్గి దగ్గి నెత్తురు కక్కి నిశ్శబ్దంగా పడుకుండిపోయేది. ఒకటి రెండు మాటలు మాట్లాడినా స్వరం తెగిపోతూ వికృతంగా వినిపించేది. "నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు.!" "ఏమీ ఉద్యోగం లేకుండా.. ఎందుకిలా వున్నావు?" ఇలాంటి తెగిన ప్రశ్నలు.

అతడు ఒకనాడామెతో అన్నాడూ. "వల్లీ! ఇలా చూడు. రవిని గురించి కనుక్కున్నాను. అతను ఇల్లు ఖాళీ చేసి బెంగుళూరులో యెక్కడికో వెళ్ళిపోయాట్ట. బ్యాంకులో డబ్బంతా విత్‌డ్రా చేసుకుపోయాడు. అసలు నీకు తెలీదేమో, మీ పెళ్లయిన అర్నెళ్లకే అతనింకొక పెళ్ళి చేసుకున్నాడు. అది ఎటువంటి పెళ్ళో తెలీదు కాని మొత్తం మీద మరో అమ్మాయితో వున్నాడిన్నాళ్లూ. ఇప్పుడిక వెళ్లిపోయాడు" ఆమె వింటూ నవ్వుతూ తల వూపింది. సేతురామన్ ఆశ్చర్యపోయి "అయితే యిన్నాళ్లనుంచీ అంతా నీకు తెలుసా? అని అడిగాడు. ఆమె మళ్లీ తల వూపింది. సేతురామన్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కొన్ని క్షణాల తరవాత లేచి "డాక్టరు దగ్గరికి తీసుకు వెడతాను రా.. నేనంతా కనుక్కున్నాను. ఇప్పుడేమీ ముంచుకుపోలేదు. ఇప్పుడైనా ఆపరేషను చెయ్యొచ్చు. ఆపరేషన్ చేస్తే ప్రాణం దక్కుతుందన్నాడు డాక్టరు.." అన్నాడు.

ఆమె చివాలున తలయెత్తి "ప్రాణం దక్కుతుంది కానీ గొంతు పోతుంది. జీవితాంతంతం మూగగా.. గొంతు లేకుండా బతకాలి.." అన్నది.

"అవును.. గొంతు లేకపోతేనేమి? నువ్వు బతుకుతావు... బతకాలి" అన్నాడతను.

ఆమె లేచి నిశ్చయంగా అన్నది. "గొంతు వుండదు. కూనిరాగం తీయడానిక్కూడా వీల్లేదు. మాట్లాడేందుకు వీళ్ళేదు. కానీ, తినొచ్చు. తిరగొచ్చు. అంతేగా?" ఆమె కళ్లలో చిత్రమైన వెలుగు.. ఆ వెంటనే పెద్ద పెద్ద కళ్లలో నీళ్ళు.

కొద్ది క్షణాలాగి.. "చిన్నప్పటి స్నేహితుడివి. నీకు తెలియాలి. గొంతుపోయిన తరవాత నేను బ్రతకనక్కర్లేదు. బ్రతకడం అనవసరం. గొంతు ఉండగా త్వరగా పోతేనే మంచిది.." ఈ మాటలని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇక చెప్పేదేమీ లేదన్నట్టు.

సేతురామన్ లేచాడు.

అతని ఎదురుగా పెద్ద డాక్టరు వచ్చాడు. ఈయనకు నలభై అయిదేళ్ళుంటాయి. అంత ప్రసిద్ధ గాయని పంకజవల్లి ఆస్పత్రిలో ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఆయన అనుకోకుండా రిజిష్టర్లో చూసి మూడు రోజుల క్రిందటే వచ్చాడు.  ఫలానా అని తెలుసుకొని ఆశ్చర్యంతో  ఉక్కిరిబిక్కిరై  అన్ని వివరాలు సేకరించి, ఇతర డాక్టర్లతో మాట్లాడి కేసు పూర్వాపరాలు విచారించాడు. తరువాత మళ్లీ వచ్చి కోపంతో "అంతా అయిపోయిన తరువాత తీసుకొచ్చారా భార్యని ఇక్కడికి" అని అడిగాడు. సేతురామన్ అంతా వివరంగా చెప్పగా విని నిట్టూర్చి వెళ్ళిపోయాడు. నిన్నా మొన్నా కూడా వచ్చాడు.

ఇప్పుడు  రాగానే "మీరిక్కడే వున్నారా" అని అడుగుతూ గుమ్మం దాటి లోపలికెళ్ళాడు.

 

"మరెక్కడుంటాను!!" గొణుక్కున్నాడు సేతురామన్. "కథ ముగిసేవరకూ ఇక్కడుండాల్సినవాణ్నే.. తరవాత ఏమో" అనుకున్నాడు.

 

చేతి వ్రేళ్లు విరుచుకుంటూ "ఆమెకొక్కసారి తెలివి వచ్చి కళ్ళు తెరిస్తే... తాను ఒక్క మాట చెప్పగలిగితే.. తన గుండె చప్పుడు వినిపించగలిగితే.. ఎంత బాగుండును.." అనుకున్నాడు. "వల్లీ! మై హార్ట్!!" నేను మొదటినుంచీ నిన్ను ప్రేమిస్తున్నాను.నిన్నే ప్రేమిస్తున్నాను.

 

అంతలో అకస్మాత్తుగా వెచ్చని గాలి కెరటం ఒకటి వింతగా.. వెర్రిగా వీచింది. చెట్ల ఆకులు జలజల రాలాయి.

 

మరుక్షణంలో  డాక్టరు బయటికివ్ వచ్చి చప్పట్లు చరుస్తూ పెద్దగా.. అక్కడ రంగయ్యగార్ని రమ్మను.. అర్జెంట్.." అని లేచాడు.

సేతురామన్ కాళ్ళు వణికాయి. వొణుకుతున్న వ్రేళ్ళతో జేబు తడిచి బీడీ బయటకు తీశాడు. డాక్టరు అంతలో అతని వంక చూసి తల అడ్డంగా ఊపాడు.

 

సేతురామన్ వొణికే కాళ్లతో నాలుగు అంగల్లో లోపలికి వెళ్లాడు. గాలి విసురుకు పంకజవల్లి ముఖం మీది దుప్పటి కొద్దిగా తొలగించి వొణుకుతున్న వ్రేళ్లతో శుష్కించిన ఆమె చెక్కిళ్ళు నిమిరాడు 'ఇదే నిన్ను నేను తాకడం' అనుకున్నాడు. కళ్లవెంట నీళ్ళు ధారాపాతంగా వచ్చేవే. కానీ అంతలో దుప్పటి కప్పి, దుఃఖం మింగుకుని యివతలికి వచ్చాడు.

 

డాక్టరు నిన్న, యెవరో తెలిసిన పత్రికా విలేఖరికి ఈ విషయం మాటల సందర్భంలో చెప్పాడు. అతడిప్పుడు వచ్చాడు. డాక్టరు అతన్ని చూసి "నేన్నిన్న చెప్పలేదూ? ఆమె... ఇప్పుడే పోయింది" అన్నాడు.

 

"అరె" అన్నాడు పత్రికా విలేఖరి ఆశ్చర్యంతో.

పది పదిహేను నిమిషాలు అలాగే స్తంభానికి ఆనుకొని నిలబడి చూస్తున్నాడు. లోపలి నుంచి శవాన్ని తీసుకురావడం, స్ట్రెచర్ మీద పడుకోబెట్టడం, అయిదారుగురు చేరారు. సన్న సన్నగా గొంతులు వినిపిస్తున్నాయి.. ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

"ఎవరు? ఎవరుట పోయింది?"

"మొగుడేం చేస్తుంటాడు?"

"పిల్లల్లేరా? ఏం జబ్బు?"

"పాటలు పాడుతుందా?"

"ఏవైనా సినిమాల్లో పాడిందా?"

స్ట్రెచర్ తోసుకుంటూ వెళ్లిపోయాడొక వ్యక్తి. డాక్టరు అలాగే వరండాలో నిలబడి ఉన్నాడు.

 

సేతురామన్ కళ్లు అప్పుడు నీళ్లతో నిండాయి. చొక్కా చివరతో కళ్ళు తుడుచుకుని, వొణికే వ్రేళ్లతో బీడీ నోట్లో పెట్టుకొని, గబగబా ప్రక్కనే వ్రేలాడుతున్న తాడుతో బీడీ ముట్టించుకున్నాడు. ఒక్కసారి గుండెల నిండుగా పొగ పీల్చి వదిలాడు. అంతలో బీడీ విసిరి.. స్టేషన్ పక్క పేవ్‌మెంట్ మీద కూర్చుని కొంతమేర చేత్తో తుడుచి అక్కడే పరుచుకు పడుకున్నాడు. నీళ్లూరుతున్న కళ్లను మూసుకున్నాడు. అంతలోనే అతనికి నిద్ర పట్టింది.

 

నిద్రలో గుంపులు గుంపులుగా, పచ్చపచ్చగా కళకళ్ళాడుతున్న గంధపు చెట్లు తగలబడిపోతున్నట్టు కల...

***

bottom of page