top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

MADHURAVANI TELUGU MAGAZINE  మధురవాణి

మా వాణి ...

ఎంతో అభిమానంతో మధురవాణి.కాం పత్రికని ఆదరిస్తున్న అశేష సాహిత్యాభిమానులకి కృతజ్ఞతాపూర్వకంగా, ఈ పత్రికలో ప్రత్యేక విశేషాలు పంచుకోబోతున్నాము.

 

అంతకుముందు... కృష్ణం వందే జగద్గురుం ! జగత్తుకంతటికీ గురువట కృష్ణుడు. అంతేగా మరి! భగవద్గీత ద్వారా సమరాంగణంలోని అర్జునుని సందేహాలని తీర్చే నెపంతో,  సంసారచట్రం లోని సామాన్య మానవులకీ, సమాజరణరంగంలోని సర్వ మానవాళికీ కలిగే ప్రతీ ఒక్క సందేహానికి సమాధానం చెప్పిన కృష్ణభగవానుడు జగద్గురువే!

అశేష సందేహాలకీ సమాధానం గీత, సకల సమస్యలకీ పరిష్కారం గీత. అసలు మనకి తొలి మేనేజ్ మెంట్ గురు- మన కృష్ణుడే. తొలి వ్యక్తిత్వవికాస గ్రంధం గీత. గీత చెప్పిన జగద్గురువు కృష్ణుడిని,  రానున్న గురుపౌర్ణిమ సందర్భంగా తలుచుకోవటం ఎంతయినా సముచితం. ఇక వ్యాసమహర్షి విరచితమైన మహాభారతం మరో ఉత్కృష్ట గ్రంధం. వ్యాసపౌర్ణిమగా తొలుతనుంచీ పిలువబడిన ఈ గురుపౌర్ణిమ రోజు గురు వ్యాసమహర్షికి ప్రణమిల్లుతూ ఈ సంచిక విశేషాలు చెప్పుకుందాము.

ప్రత్యేకంగా ఈ సంచికలో చాలా చాలా విశేషాలున్నాయి. 

ప్రప్రథమంగా... సంపాదకులుగా కవితావాణి బాధ్యతలు పంచుకోవటానికి అంగీకరించిన విన్నకోట రవిశంకర్  గారికి కృతజ్ఞతలు! సాహితీ ప్రపంచంలో విన్నకోట గారిని ఎరుగని వారుండరంటే అతిశయోక్తి కాదు. గీతని ఊరకే ఉటంకించలేదు. గీతాసారం అంతటినీ ఒక్క మాటలో కుదించేందుకు వీలయితే- "స్థితప్రజ్ఞత" ఆ మాటవుతుంది. అలాంటి స్థితప్రజ్ఞత కల వ్యక్తుల్లో, అందునా- సాహితీ స్థితప్రజ్ఞతని  సాధించిన వ్యక్తుల్లో ముందువరుసలో ఉంటారు- రవిశంకర్ గారు.  అమెరికాలోని ప్రముఖ కవులలో అగ్రగణ్యులైన విన్నకోట రవిశంకర్ గారు పాతికేళ్ళుగా కవిత్వ రచన చేస్తున్నారు. వీరి అభిమాన కవి శ్రీ ఇస్మాయిల్. నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలను గాఢంగా ఆవిష్కరించడానికి కవికి స్పష్టత, నిజాయితీ అవసరమని విశ్వాసం. వీరి మార్గదర్శకత్వంలో, అపార అనుభవంతో పత్రికలో  మరింత నాణ్యమైన కవితలని అందివ్వబోతున్నామని చెప్పేందుకు సంతసిస్తున్నాము.

మధురవాణి.కాం పత్రికకి మరిన్ని వన్నెలద్దేందుకు కొన్ని కొత్త శీర్షికలు ఈ సంచికనుంచీ ప్రారంభమవబోతున్నాయి. నూతన శీర్షికా రచయితలు- భువనచంద్ర, బలభద్రపాత్రుని రమణి, సత్యం మందపాటి, జ్యోతి వలబోజు గార్లకి కృతజ్ఞతాభినందనలు.

ఇక, దసరా దీపావళి-2017 రచనలపోటీ గురించిన ప్రకటన ని గమనించారు కదా! మరెందుకాలస్యం! పోటీకై మీ రచనలు పంపండి!

చివరగా- సమభావం కలిగిఉండమంటూ సమతాభావాన్ని నిర్దేశించిన మహాగ్రంధాలని ప్రస్తావించిన క్రమంలో ఒక్క మాట...

రచయితలందరి పట్లా సమభావంతో వర్తిస్తూనే, పాఠకులకి నాణ్యమైన రచనలు అందించటం సంపాదకులకి అసిధారా వ్రతమే. ఎన్నో గంటలు శ్రమించి విడుదల చేసే పత్రిక అందరికీ చదివేందుకు ఆసక్తికరంగా ఉండాలన్న తపనలో ఒక్కోసారి కొన్నిటిని త్యజించక తప్పదు. అందుకు నిందించకుండా, అర్థం చేసుకుంటూ మాతో పాటు సాగుతూ, మరింత మంచి రచనలు పంపేందుకు సిద్ధమయే ప్రతీ సాహిత్యాభిలాషీ  మా దృష్టిలో ఉన్నతులే! సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ వ్యక్తీ మాకు గౌరవనీయులే! పత్రికకి పెరుగుతున్న ఆదరణతో పాటుగా, రచనలూ అధికసంఖ్యలో రావటం జరుగుతుంది. ఒక్కోసారి స్పందన ఆలస్యమయినా అర్థంచేసుకు సంయమనం పాటించే ప్రతీ రచయితకి పేరు పేరునా వినమ్రంగా గౌరవాభినందనలు.   

మధురవాణి నిర్వాహక బృందం

madhuravani.com  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దసరా, దీపావళి రెండవ ఉత్తమ రచనల పోటీలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు రచయితలందరికీ సాదర ఆహ్వానం!

వివరాలకై... క్లిక్ చేయండి

Click here for details.... 

దసరా దీపావళి ఉత్తమ రచనల పోటీ!

bottom of page