top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

అదన్నమాట సంగతి - ఎండలు బాబోయ్ ఎండలు

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

ఎండలు ఎండలు ఎండలు…

మండుతున్న ఎండలు… మంటలు పుట్టిస్తున్న ఎండలు...

నేలమీది రాళ్లను, తలమీద బుర్రను కాల్చేస్తున్న ఎండలు...

ఇలా ప్రతీ సంవత్సరం పెరుగుతున్న ఎండలను వామ్మో, వాయ్యో అనుకుంటూ తిట్టుకుంటూనే ఉంటాం. చెట్లను పెంచేబదులు నరికేస్తుంటే నీడ ఎక్కడ, ఆ పచ్చదనం ఇచ్చే చల్లదనం ఎలా దొరుకుతుంది? ఎండాకాలం లేదా వేసవి అనగానే బాబోయ్ ఎండలు అనుకుంటూనే ఆకుపచ్చని మామిడికాయల ఆవకాయలు, పసుపుపచ్చని మామిడిపళ్ల రుచులు, మత్తెక్కించే మల్లెపూల ఘుమఘుమలు… అప్పుడప్పుడు వచ్చే పెళ్లి, పేరంటాల పిలుపులు... ఇవన్నీ మధురాతిమధురాలే కదా.

మరి ఆ  ముచ్చట్లు కాసిన్ని మీకు కూడా చెప్పేదా?

అదేంటోగాని వేసవి వస్తుందంటే ఎన్నో జ్ఞాపకాలు ముసురుకుంటాయి. ముఖ్యంగా చిన్నప్పటి ఆ మధుర జ్ఞాపకాలు ఇక నా మనసులో దాగుండలేక బయటకొచ్చేస్తాయ్… నిజంగా అవి ఎంత మధురమైనవి! మరపురానివి!! చదువుతోపాటు, ఆటలు, సినిమాలు,ఊర్లు తిరగడం,వివిధ కాంపిటీషన్లలో పాల్గొనడం... ఓహ్! అవి మన మనసులోని ఒక అరలో దాగుంటాయి కదా... ఎప్పటికి మరవలేము. ఇలా ఎన్నో ఎన్నెన్నో ముచ్చట్లు ప్రతీ వేసవిలో చర్వితచరణమే…

స్కూలు ఫైనల్ పరీక్షలంటే ఇప్పటిలా ఎక్కువ టెన్షన్ ఉండేది కాదు. ప్రతినెలా ఎస్సైన్మెంట్స్, మంత్లీ టెస్టులు రాయడం అలవాటై అంత కష్టంగా ఉండేది కాదు చివరికొచ్చేసరికి. ఒక్కో పరీక్షా ఐపోతుంటే ఆ సబ్జెక్ట్ పుస్తకాలు మళ్ళీ చూడాల్సిన పనిలేదుకదా అనే ఆనందం కలిగేదీ ప్రతిరోజూ పరీక్షలప్పుడు. హమ్మయ్య పరీక్షలైపోయాయి. తర్వాత ఏం చేయాలి. అది చేయాలి ఇది చేయాలి. రెండు నెలలు స్వేచ్చ దొరికింది అని అందరి ముఖాలు వెలిగిపోయేవి. చాలా మంది తమ స్వంత ఊర్లకు వెళుతున్నాము అని చెప్తుంటే నాకు బాధేసేది. ఎందుకంటే నేను పుట్టింది పెరిగింది అంతా హైదరాబాదులోనే. చుట్టాలందరూ ఇక్కడే. మా పెద్దాళ్ళని తిట్టుకునేవాళ్ళం ఎవ్వరూ ఊర్లో లేరు వెళదామంటే అని.

తెల్లారింది. స్కూలు ఉన్నప్పుడు పొద్దున్నే లేవాలంటే  చచ్చే విసుగొచ్చేది. ఇంకా నిద్రొచ్చేది. కాని సెలవులు మొదలు కాగానే రోజు కంటే ముందే మెలకువ వచ్చేది. ఎండాకాలం కదా. మళ్ళీ పడుకుందామన్నా నిద్రొచ్చేది కాదు. సరే లేచి బ్రష్ చేసుకుని పాలు తాగి పేపర్ చూసేవాళ్ళం నేను మా తమ్ముళ్ళు. ఆ తర్వాత సెలవుల్లో ఏం చేయాలి అని ప్రోగ్రాం తయారు చేసుకునే వాళ్ళం. ముందుగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం. అమ్మకు వీలు దొరికేది అప్పుడే. నాన్న దగ్గర మెల్లిగా అనుమతి తీసుకుని, సాయంత్రం పయనం. అమ్మమ్మ ఇల్లు కూడా సిటీలోనే. అమ్మమ్మ, మావయ్యలు మాకు కావల్సినవి తెచ్చేవారు. అక్కడ మాకు వింతగా ఉండేది. పెంకుటిల్లు. మట్టితో అలికిన వంటిల్లు. మావయ్య రంపపు పొట్టుతో పొయ్యి తయారు చేస్తుంటే వింతగా చూసేవాళ్ళం. అమ్మమ్మ ప్రతి శుక్రవారం వంటిల్లు పేడతో అలికి ముగ్గులు పెట్టేది. మేము శ్రద్దతో చూసేవాళ్ళం. అక్కడ ప్రొద్దున్నే ఇంటిముందుకే ఇడ్లీలు అమ్మేవాడొచ్చేవాడు. ఇంటి ముందు అరుగుమీదే కూర్చుని తినేవాళ్ళం. ఏదైనా సినిమాకి వెళ్ళడం. అలా కనీసం మూడురోజులైనా ఉండేవాళ్ళం. ఎక్కువ రోజులుంటే నాన్నకి భోజనానికి కష్టం కదా!

తర్వాత మా నాన్నమ్మని రమ్మని పిలవడం. ఆవిడ మా పెదనాన్న దగ్గరుండేది. ఆవిడ వస్తుందంటే మాకు పండగే. రోజు కథలు చెప్పించుకోవడం, దగ్గరలోని థియేటర్లో సినిమాలకెళ్ళడం. ఆవిడకి సినిమా పిచ్చి ఉండేది. రాగానే ‘నాన్నమ్మ సినిమాకెళదామా’ అని పేపర్ తిరగేసి, ఏం సినిమా నడుస్తుందో చూసి మరుసటిరోజే ప్రోగ్రాం ఫిక్స్ చేసేవాళ్ళం. అత్తగారిని ఒక్కదానిని పంపడం బాగుండదు కనుక అమ్మ నన్నే తోడు పంపేది. అప్పట్లో పాత సినిమా మార్నింగ్ షో టికెట్ ధర యాభై పైసలు. బాల్కనీ ఐతే ముప్పావలా. కొత్త సినిమా ఐతే రూపాయిన్నర, బాల్కనీ ఐతే రెండు రూపాయలు. మార్నింగ్ షో లో మంచి జానపద, ధార్మిక చిత్రాలు చాలా వచ్చేవి. పదకొండు గంటల సినిమాకు తొమ్మిది గంటలకే వెళ్ళీ చెప్పులు లైనులో పెట్టి ఒక్కరు కాపలా ఉండి టికెట్లు ఇచ్చే పది నిమిషాలు ముంది అందరు వెళ్ళి లైన్లో నిలబడటం. అక్కడ లైన్లో చెప్పులు లైన్లో పెట్టి ఆడాళ్ళు మరో పక్కన నీడలో కూర్చుని ముచ్చట్లాడుతూ ఉంటారు. ఒకరికొకరికి పరిచయం ఉండదు కాని దగ్గరి బంధువులు అన్నట్టుగా మాట్లాడుతుంటారు.

అప్పట్లో టీవీ లేదు. రేడియోనే దిక్కు. నేనైతే శనివారం, ఆదివారం మద్యాహ్నం కొఱకు వేచి చూసేదాన్ని. బాలానందం, బాలవినోదం కార్యక్రమాల కోసం. ఆదివారం మూడుగంటలకి రేడియోలో సంక్షిప్త చిత్రం వచ్చేది. సెలవుల కొత్తలో బానే ఉండేది. పోనూ పోనూ విసుగొచ్చేది. ఎండలో ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. సీతాఫలం సీజన్‌లో దాచి పెట్టుకున్న గింజలు, కొత్త చింతపండులో నుండి చింతగింజలు తీసి డబ్బాలో పోసి పెట్టుకునేదాన్న. ఎన్ని ఆటలో ఆ రోజుల్లో. నాకు స్నేహిరాళ్ళెవరు లేరు మా ఇంటిదగ్గర. తమ్ముళ్ళతోనే ఆడుకోవడం.

సీతాఫల గింజలను రాసిగా పోసి గట్టిగా వూదాలి. చెల్లాచెదురైన గింజలని పక్కదానికి తాకకుండా తీసుకోవాలి. ఎవరెక్కువ పోగు చేస్తే వాళ్ళే గెలిచినట్టు.

ఇవే గింజలతో వనగండ్లు(గుజ్జనగుళ్ళూ) ఆడుకోవడం. అందులో ఎన్నో రకాలు. అప్పుడప్పుడు అమ్మ కూడా ఆడేది.

నేలపై చాక్‌పీసుతో గళ్ళూ గీసి అష్టాచెమ్మా ఆడడం. చింతగింజలే పావులుగా.

ఎక్కడో దాచిపెట్టిన కైలాసం(పరమపద సోపానం) తీసి ఆడుకోవడం. మా నాన్నమ్మ ఐతే ఇందులో మోసం(తొండి) చేయొద్దు పాములు తినేస్తాయి అని భయపేట్టేది. మేము నిజమే అని నిజాయితీగా ఆడేవాళ్ళం.

 

కాళ్ళు జాపుకుని కాళ్ళా గజ్జే కంకాళ్ళమ్మా అని ఆడుకోవడం అప్పుడప్పుడు.

అరచేతిని నేలపై పరిచి వేళ్ళు దూరంగా పెట్టి a b c d అని d అన్న వేలుని లోపలికి మడిచేయడం. అలా ఎవరి వేళ్ళు అన్నీ ముడుకుంటాయో వాళ్ళే గెలిచినట్టు. చివరగా మిగిలినవారు ఓడిపోయినట్టు.

పేపర్ పెన్సిల్ తీసుకొని గల్లూ గీసుకొని చుక్కలాట ఆడుకోవడం,లేదా Name, Place, Animal ,Thing ఆడడం.

ఐదు రాళ్ళను ఒకే సైజులో కొట్టుకుని గచ్చకాయలు ఆడుకోవడం.

అప్పుడప్పుడు చదరంగం, మా పెద్ద తమ్ముడైతే ఆడినంతసేపు బానే ఆడేవాడు. తను ఓడిపోతున్నట్టు అనిపించగానే బోర్డ్ ఎత్తేసేవాడు. మళ్ళీ అక్కడ కొట్లాట.

ఎండాకాలం సరిగ్గా ఒంటిగంటకు పుల్ల ఐస్‌క్రీం వాడొచ్చేవాడు. వాడి గొంతు రెందు వీధుల అవతల ఉన్నా వినపడేది. రంగు పుల్ల ఐతే ఐదు పైసలు .పాలది ఐతే పదిపైసలు. అమ్మ రోజు ఇప్పిచ్చేది కాదు. పాత స్కూలు పుస్తకాలు తీసి బండి మీద వచ్చే పీచు మిఠాయివాడికి ఇచ్చి దాని బదులు పీచు మిఠాయి తీసుకుని కొంచం కొంచం తినేవాళ్ళం.

ఎండాకాలం అనగానే ఆడపిల్లలకు తప్పకుండా చేయాల్సిన పని మల్లెపూల జడ వేసుకోవడం. అప్పట్లో మార్కెట్లో పూలజడ దొరకడం అంత సులువేమీ కాదు. కొనుక్కొచ్చి జడకు కుట్టడం కంటే ఒక్కో మల్లెమొగ్గను ప్రేమగా గ్రుచ్చి జడకు కుట్టడం ఒక అద్భుతమైన ప్రక్రియ. పూలజడ అందానికి మాత్రమే ప్రతీక కాదు. అనుబంధానికీ,  ఆప్యాయతకీ మారుపేరు. ఇప్పుడంటే డబ్బులు  పెడితే నిముషాల్లో బ్యూటీషియన్లు పెళ్లికూతురు జడను అలంకరిస్తున్నారు. కానీ ఏం లాభం? అవి ఎంత అందంగా ఉన్నా అమ్మ కుట్టే పూలజడకు సాటి వస్తాయా? ఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లెపూలతో పూలజడ తయారు చేయించుకోవడం నాకు అలవాటు. అయితే, పూలజడ వేసుకోవడం పెళ్ళితోనే అంతమైనా ఆ మధుర జ్ఞాపకాలు ప్రతి వేసవిలో వెంటాడుతునే ఉంటయి. ఎండాకాలంలో మల్లెపూలు వచ్చాయంటే చాలు ఇప్పటికీ ఆ చిన్నప్పటి పూలజడ ముచ్చట్లు గుర్తుకొస్తాయి.

 

అందరి సంగతి ఏమో కానీ మా అమ్మ మాత్రం ప్రతీ వేసవిలో మల్లెపూలు మొదలయ్యాయంటే చాలు కనీసం రెండు మూడుసార్లైనా పూలజడ వేసేది. ఇప్పట్లా రెడీమేడ్‌గా దొరికే విస్తరాకు మీద కుట్టి జడకు అతికించేది కాదు మా అమ్మ, అచ్చంగా నా జడకు డైరెక్టుగా కుట్టాల్సిందే. ఆ అనుభూతే వేరు! పూలజడ వేసుకునే రోజు కూడా ఒక ప్రత్యేకమైన రోజుగా ఉండేది. ఎండాకాలం సెలవుల్లో ఒకరోజు ఖరారు చేసుకొని పొద్దున్నే త్వరగా వంటపని, ఇంటిపని పూర్తి చేసుకొని అమ్మ మొజంజాహి మార్కెట్లో ఉన్న హోల్‌సేల్ పూల దుకాణాలకు వెళ్లేది. గట్టివి, పెద్దవి మల్లె మొగ్గలు ఓ అరకిలో, కనకంబరాలు, దవనం కొనుక్కొని వచ్చేది. ఇక మా అమ్మ స్నేహితులు వచ్చి జడ వేయడంలో సాయం చేసేవారు. నా జుట్టు లావుగా, పొడుగ్గానే ఉండేది. అయినా, ఇంకొంచెం పొడుగు ఉంటే బావుంటుందని అమ్మ చిన్న సవరం, చివర జడగంటలు పెట్టి గట్టిగా జడ అల్లేది. అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ చీపురు పుల్లలకు మొగ్గలు గుచ్చి ఇస్తే ముందు అనుకున్న డిజైన్ ప్రకారం నా జడకు కుట్టడం... నేను అసహనంతో కదిలితే ఓ మొట్టికాయ వేయడం... అటు ఇటూ తిరిగే తమ్ముళ్ళు నన్ను ఏదో ఒకటి అంటూ గేళి చేయడం-కనీసం మూడు గంటలు కూర్చుంటే కానీ జడ పూర్తయ్యేది కాదు.

 

ఒక్కోసారి ఒక్కో డిజైన్‌లో కుట్టేది అమ్మ. ఇక సాయంత్రం కాగానే మొహం కడుక్కొని పట్టు లంగా వేసుకుని, అమ్మ నగలు పెట్టుకుని ఫొటో స్టూడియో కెళ్ళి వెనకాల అద్దం పెట్టి మరీ ఫొటో దిగడం. (అద్దం ఉన్న స్టూడియో కోసం తిరిగేవాళ్ళం). అదో మరపురాని అనుభూతి. ఆనాటి ఫొటోలు చూసుకుంటుంటే ఆప్పటి జ్ఞాపకాలు గిర్రున తిరుగుతాయి. డిసెంబర్‌లో వచ్చే నా పుట్టినరోజు నాడు కూడా పూలజడ వేసుకోవాలనిపించేది. స్కూలుకు బోలెడు మల్లెపూలు పెట్టుకొని వెళ్ళాలని చాలా కోరికగా ఉండేది. కానీ డిసెంబర్‌లో చామంతి పూలు మాత్రమే వచ్చేవి. దాంతో కూడా పూలజడ వేసుకోవచ్చు. కానీ, చాలా బరువు అని నిరాశ పడేదాన్ని. ‘నా పుట్టినరోజు మల్లెపూలు దొరికే ఎండాకాలంలో వస్తే ఎంత బాగుండో’ అని కూడా అనుకునేదాన్ని!చిన్నప్పుడు. బరువైన పూలజడతో నిద్రపోవడం కూడా కష్టంగానే ఉండేది. అయినా ఇష్టంగా భరించేదాన్ని. పొద్దున లేవగానే వాడిన, రంగు మారిన పూవులను చూసి ‘అయ్యో! అప్పుడే తీసేయాలా’ అని బాధ కలిగేది. పూలు తీసేసినా కూడా వాటి గుబాళింపు మూడునాలుగు రోజుల వరకు వెంట్రుకలను వదిలేది కాదు

.

ఎండలు తగ్గగానే బయటపడడం. మా తమ్ముళ్ళూ వాళ్ళ ఫ్రెండ్స్‌తో నేనూ కూడా కర్రా బిళ్ళంగోడు (గిల్లీడండా) ఆడేదాన్ని. గోళీలాట, రంగు రంగు గాజు గోళీలు, అందులో ఒక పెద్ద తెల్లని గోలీ. కాని నాకు ఇందులో ఎక్కువ ప్రావీణ్యం ఉండేది కాదు. ఐనా ఆడేదాన్ని. బొంగరం కూడా ప్రయత్నించేదాన్ని కాని అంతగా అబ్బలేదు. వదిలేసా. ఇక బాలభవన్ మాత్రం సెలవుల్లో తప్పనిసరి. మా తమ్ముళ్లేమో తబలా, నేను వీణ క్లాసులు, art and craft క్లాసులలో… ఇలా చేరేవారిమి.

పరీక్షా ఫలితాలు రాగానే అమ్మ చేసే పని లెక్కల పుస్తకం కొనడం. మే నెల మా ట్యూషన్ సార్ రాడు. అయినా లెక్కలు మాత్రం చేయమనేవాడు. కొత్త క్లాసులోని పుస్తకం కొని రోజు చేయడం, లైబ్రరీకెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవడం, అవి గంటలోనే చదివేయడం. అదే రోజు మార్చుకునే వీలులేదు. వేరే పుస్తకాలు అద్దెకిచ్చే లైబ్రరీకెళ్ళి కామిక్స్, జానపద కథల పుస్తకాలు తెచ్చుకునేవాళ్ళం. పుస్తకాలకంటే అమ్మ డబ్బులిచ్చేది. ఏమీ అనేది కాదు. చాలా చిన్నప్పుడు మేము ఉండే కాలనీలో వీధి దీపాలుండేవి కావు. ఏదన్నా పుస్తకం తెచ్చుకోవాలంటే సందు చివర ఉన్న దుకాణం కెళ్ళాలంటే ఇళ్ళలోని దీపాల కాంతులలో చూసుకుంటూ భయం, భయంగా వెళ్లి కొనుక్కునేదాన్ని. ఐతే తిరిగొచ్చేటప్పుడు మాత్రం చచ్చేంత భయం. వెనకాల ఎవరన్నా వస్తున్నారేమో, చెట్లమీద దయ్యాలున్నాయేమో అని. అంటే పుస్తకం గట్టిగా పట్టుకుని వేరే ఆలోచన లేకుండా ఒకటే పరుగు. ఇంటిముందుకొచ్చాక గాని గుండె డడ తగ్గేది కాదు.

రాత్రిపూట ఇంట్లోనే. అప్పట్లో టీవీ లేదు, కంప్యూటర్ లేదు రేడియో తప్ప. వేడి  తగ్గదు. అంత తొందరగా నిద్ర పట్టదు. లోపలినుండి క్యారం బోర్డ్ తీసి ఆడడం లేదా బాల్కనీ సీలింగుకు తాడు కట్టి ఊయలలూగడం. జూన్ రాగానే స్కూళ్ళూ తెరిచే రోజులు దగ్గరపపడేవి. పుస్తకాలు తెచ్చుకుని వాటికి అట్టలు వేసుకోవడం, లేబుల్స్ అతికించి పేర్లు రాసుకోవడం. కొత్త పెన్సిళ్ళు, రబ్బర్లు, కంపాస్ బాక్స్, షూస్, సాక్స్, రిబ్బన్లు,బ్యాగులు మన శరీరం తప్ప అన్నీ కొత్తవే. ఇంకా రెయిన్‌కోట్ కూడా రెడీగా ఉండేది.

స్కూల్ తెరిచే రోజు కోసం ఎదురుచూడడం. అన్నీ కొత్తవి వేసుకుని స్నేహితులకు చూపెట్టాలనే కుతూహలం. సెలవుల్లో ఎవరేం చేసారొ తెలుసుకోవాలనే ఆత్రుత. స్కూలు మొదటిరోజు కొత్త క్లాస్, కొత్త బట్టలు, పుస్తకాలు, బాగు, షూస్, సాక్సులతో అంతా కొత్త కొత్తగా వింతగా, సంతోషంగా ఉండేది.

ఇన్ని అనుభూతులు, జ్ఞాపకాలు, ముచ్చట్లు ఉన్న ప్రతీ ఎండాకాలం నాకు అపురూపమే.

అదన్నమాట సంగతి...

౦                  ౦                  ౦

Bio
bottom of page