
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కవితా మధురాలు
నిన్నటి గోడమీద
ఒళ్లంతా కళ్లతో
రేపటికోసం ఎదురు చూస్తున్న నేడులా
అద్దం
***
అన్నన్ని తెరిచిన కళ్లతో
అబద్దం చెప్పలేకపోయినా
మారుతున్న మొహాన్ని
ఎప్పటికప్పుడు పోగొట్టుకుంటూనే ఉంది
***
నా దేశనిదీ
అద్దం లాంటి కథే
***
విరిగిన అద్దంలో ప్రతిబింబాల్లా
చిత్రచిత్రాలుగా సమయం
***
ఎదురెదురుగా ఎన్ని అద్దాలు ఉన్నా
ఎంత సందేహం
అన్నింటిలో కనిపించేవి
అవేనా కాదా అని
నన్ను నేను రోజూ కలుసుకుంటూనే ఉన్నాను
నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ వదలలేదు
ఒక్క క్షణం కూడా నాకు నేను కనుమరుగవలేదు
ఒకప్పటి నా ఫోటోలోని నాకు
ఇప్పటి నాకు
తెలియకుండా ఏమై ఉంటుంది
భాషకు సరిహద్దులు లేవు
తనను తాను కాపాడుకోలేదు
ఇతర భాషలేవో నెమ్మదిగా చొచ్చుకుపోయి
ఆ భాషని ఎంతగా మార్చేస్తాయో కదా
నేనూ అంతేనా
.
సంపాదకుల ప్రత్యేక ఎంపిక
ఆశ లేదు, ఆస్కారం లేదు
ఫలానా రోడ్డు గమ్యం చేరుస్తుందనే సూచన ఎక్కడా లేదు
జీవితం ఎప్పుడూ ఇలా కన్నీళ్ళ ప్రవాహంగానే సాగుతుందనుకుంటాను
రోడ్డు పుడుగునా చెట్లు కూలుతున్న దృశ్యాలనే చూపుతుందనుకుంటాను
లేకుంటే ఎంతో అందమైన సాయంత్రం కదా ఇలా అపస్వరాలు వినపడడం జరగదు
రోడ్ల మీద ధూళి, దారిద్ర్యం సమస్తం మిత్రుడు వెంకట్రావు ముఖం మీదనే పరవళ్ళు తొక్కడం జరగదు
ఐతే ఇప్పుడు నిర్ధారణగా చెప్పుకోవచ్చు
మిత్రుడు వెంకట్రావు నిరుద్యోగి అని రూఢిగా చెప్పుకోవచ్చు
తలక్రిందులైన స్వప్నం మీద శాల్యాకారంగా కూర్చున్న కుర్రవాడు
ఆపాదమస్తకం సూదులతో ముస్తాబై ఉన్నవాడు
అతని ముఖం నిండా స్ఫోటకం మచ్చలు
కళ్ళలో శిలావిగ్రహాల వీక్షణలు
అతని చుట్టూ పరాజయ భారంతో క్రుంగుతున్న వృక్షాలు
ఇదే దృశ్యాన్ని ఇంకా భారీ ఎత్తున భూతద్దాలతో చూడవచ్చు
వినీల గగనాల క్రింద విషాదాగ్ని ఆవిర్భావాన్ని కళ్ళారా చూడవచ్చు
మిత్రుడు వెంకట్రావు ఎక్కడ ఏ భంగిమలో తనను తాను ఆహుతి చేసుకుంటున్నాడో ఊహించుకోవచ్చు
ప్రస్తుతం వెంకట్రావు నివాసం ఆకాశం క్రిందనే
నిరుద్యోగి వెంకట్రావు నగరం నడి వీధిలో తన జీవితాన్ని ఆవిష్కరిస్తుంటే
ఎందుకో అకారణంగా సూర్యుడు ఖిన్నుడౌతాడు
చెట్ల మీద ఆకు సైతం అల్లల్లాడదు
టెలిఫోన్ తీగలలో వార్తా ప్రసారం సాగదు
నిరుద్యోగి వెంకట్రావు గాలిలో ధూళిలో ఎండుటాకులా సుడిగుండం తిరుగుతుంటే
గృహస్థులు ఆ రోజు సన్యాసం స్వీకరిస్తారు
పిల్లలు గల తల్లులు బావిలో దూకుతారు
విద్యార్థులు నడివీధిలో పుస్తకాలు తగులబెడతారు
నిరుద్యోగి వెంకట్రావు నగరం గుండెలలో సాలీడులా అల్లుకుంటూ ఉంటే
ప్రభుత్వ భవనాలలో ఎవరికీ ఒక క్షణం పాటు ఊపిరి ఆడదు
కలం కాగితం పట్టుకున్న అధికారి తనంత తానే రాజీనామా పత్రం మీద సంతకం పెడతాడు
ప్రభుత్వ భవనాల మీద జెండా సిగ్గుతో తల వాల్చుకోవచ్చు
నిరుద్యోగి వెంకట్రావు తన ఆకలిని రాళ్ళలో రప్పలలో దాచుకుంటూ ఉంటే
రాజకీయవేత్తలు వాటిని వేలం పాటలో కొనుక్కుంటారు
విషాదం రంగు ఎలా ఉంటుందో తెలుసుకొనేటందుకు
కవులు, చిత్రకారులు అతని కన్నీళ్ళపై పరిశోధనలు చేస్తారు
అతని పాద ధూళిలో చీకటీ పుట్టుపూర్వోత్తరాలు వెతుకుతారు
నిరుద్యోగి వెంకట్రావు తన బాల్య స్మృతులు తలుచుకుంటూ ఉంటే
నగరంలో పసిపిల్లలు ఆ పూట అన్నం ముట్టరు
పువ్వులు కోసుకుంటున్న పిల్లలల్ను పాము కరిచినా ఆశ్చర్యం లేదు
దొడ్లో గున్నమామిడి చెట్టు నేలకూలడం వైపరీత్యం కాదు
నిరుద్యోగి వెంకట్రావు ఈ నగరం మీద ఒక మచ్చ
బాధ అనే దీపం పట్టుకుని
సర్వనాశనం అనే తాళం చెవి పట్టుకుని
వెకట్రావు జీవితం అనే చీకటి నరక కూపంలో
భయంకరమైన ఆశ్చర్యాలు ఇంకా అనేకం చూడవచ్చు
జీవితం మీద నమ్మకం ఉన్నవాడు వెంటనే అక్కడే ఉరిపోసుకుని చావడం సంభవం కావచ్చు
నిరుద్యోగి వెంకట్రావు ఈ నగరం మీద ముమ్మాటికీ ఒక మచ్చ
నిరుద్యోగి వెంకట్రావు చావడు
చావడం అనే మహాపాపం చెయ్యకుండా
న్యాయాధిపతులు ఎల్లవేళలా అతన్ని కాపాడుతూనే ఉంటారు
రోడ్ల మీద భిక్షకులు సైతం అతనిలో కొత్త ఊపిరి పోస్తూనే ఉంటారు
జీవన మాధుర్యాన్ని గూర్చి చిన్న చిన్న చీమలు సైతం అతన్ని హెచ్చరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు
నిరుద్యోగి వెంకట్రావు చావడు
అందుకే అందమైన సాయంత్రం వేళ నగరం అంతటా అపస్వరాలు
వెంకట్రావు నడుస్తున్నంత మేరా చెట్లు కూలుతున్న దృశ్యాలు.
కాలం నదిలో పడి
ఒక గువ్వ కొట్టుకుపోయింది
గట్టు మీద ఒక
గోరువంక కుప్పకూలింది
అమావాస్య రాత్రి
ఒక మిణుగురు పురుగు
ఒక తెల్లకలువని
కుశల ప్రశ్నలు వేసింది
రాత్రి కలలో
భోరున వర్షం
పొద్దున్న చూస్తే చెక్కిలిపై
అక్కడక్కడా ఆరిన తడి
అటక మీద
బూజు పట్టిన ఒక పాత డైరీని
చెదలు ఆసాంతం చదువుతున్నాయ్!
పడమటి సంధ్యలో ఒక పక్షి
ఎవరినో వెతుకుతున్నట్టు
ఒంటరిగా ఎగురుతూ ఉంది!
అద్దంలో ఒక రూపం
అపరిచితంగా తోస్తోంది
ఏదో పాత రఫీ పాటని
కూనిరాగం తీస్తోంది
అటు తీరం
పంపించిన అల ఒకటి
ఇటు తీరం
చేరకముందే చెదిరిపోయింది
దూరం నుండి లీలగా
ఎవరో వినిపిస్తోన్న
ఆనందభైరవిలో
ఏదో అపశృతి దొర్లుతూనే ఉంది!
చీకటి చెప్పిన కథలు
~అంజలి
తమ్మినేని యదుకుల భూషణ్
"కవితాభూషణం" తమ్మినేని యదుకుల భూషణ్ కవి, విమర్శకుడు, బహు భాషా పరిజ్ఞానం గల సాహితీవేత్త. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే మొట్ట మొదటి కవితా సంకలనంతో తెలుగు సాహితీప్రియుల దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నారు.
శిల్పంలా పటిష్టమైన కవిత్వం, వజ్ర ఘాతం వంటి విమర్శ, మూలానికి ధీటైన అనువాదాలు, ఏకబిగిన చదివించే కథనాశైలి యదుకుల భూషణ్ గారిని సాహిత్య ప్రపంచంలో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ముకుంద రామారావు
ప్రముఖ కవి ముకుంద రామారావు గారు 1946 నవంబర్ 9 వ తేదీనాడు ఖరగ్‌పూర్ లో జన్మించారు. రైల్వే శాఖ, సాఫ్ట్ వేర్ రంగాలలో పనిచేసి 2006లో పదవీ విరమణ చేసారు. వలసబోయిన మందహాసం, ,మరో మజిలీలోకి ముందు మొదలైన సుప్రసిద్ద తెలుగు కవితలు అనేకం, The smile that migrated,and other poems అనే ఆంగ్ల కవితా సంపుటి, అనేక కథలు, వ్యాసాలు గ్రంధాలు ప్రచురించారు. “అదే గాలి” పేరిట ప్రపంచదేశాల కవుల, కవిత్వ చరిత్ర గ్రంధం ముద్రణలో ఉంది. వీరి కవితలు అనేక ఇతర భాషలలోకి అనువదించబడ్డాయి. టీవీ, రేడియోలలో మంచి వక్తగా పేరుపొందిన ముకుంద రామారావు గారు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం మొదలైన అనేక పురస్కారాలు అందుకున్నారు.

అంజలి (రమాకాంత రెడ్డి)
సగటు ప్రవాసాంధ్రుణ్ణి! మెల్బోర్న్ లో నివాసం.
సిరివెన్నెల గారి 'దినకరమయూఖ తంత్రులపైన' నాకు భావోదయమైంది.
వేటూరి గారి పదమాయ ' ఆబాలగోపాలం ఆ బాలగోపాలుని అచ్చెరువున అచ్చెరువున' అబ్బురపరిచింది.
కృష్ణశాస్త్రిగారి ప్రశ్న 'ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?' ఒక శోధనలో తోసేసింది.
శ్రీశ్రీగారు 'నేనొక దుర్గం నాదొక స్వర్గం' అని ప్రేరేపిస్తే నాలుగు రాళ్లు పేర్చుకుంటున్నాను.

అజంతా
అజంతాగా ప్రసిద్ధి చెందిన పెనుమర్తి విశ్వనాథ శాస్త్రి (1929-98) అతి ముఖ్యమైన తెలుగు కవులలో ఒకరు. వృత్తిరీత్యా జర్ణలిస్టుగా వివిధ పత్రికలలో పనిచేసారు. మొత్తం జీవితంలో కేవలం నలభై పైచిలుకు కవితలు మాత్రమే రాసినా, నిరంతరం కవిత్వ ధ్యానంలోనే గడిపిన ధన్యజీవి. తరచుగా అధివాస్తవిక ధోరణిలో సాగే ఈయన కవితలలో ప్రయోగించిన భాష, పదసంయోజన, పదచిత్రాల రూపకల్పన అనితర సాధ్యమైనవి. 1993లో ప్రచురించిన స్వప్నలిపి కవితా సంకలనానికి కేేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ప్రస్తుత కవిత అందులోనిదే..
