top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

సత్యాన్వేషణ

సత్యం మందపాటి

Bio

ఎన్నో ప్రశ్నలు…

సిధ్ధార్ధుడు ఎంతో సుకుమారంగా, బయట ప్రపంచం చూడకుండా, నాలుగు కోట గోడల మధ్యా పుట్టి, పెరిగి పెద్దవాడయాడు. దానికి కారణం తండ్రి శుధ్ధోధన మహారాజుకి ఆనాటి జ్యోతిష్కులు అతను పెరిగి పెద్దవాడయాక, ఒక మహారాజుగానో, ఒక సన్యాసిగానో అవుతాడని చెప్పారుట. తనలాగా గొప్ప మహారాజు అవవలసిన యువరాజు, అలా సన్యాసి అవటం ఆయనకి నచ్చలేదు. అందుకే ఆయన సిధ్ధార్ధుడిని ఇటు జీవితంలోని కష్టనష్టాలకూ, బాధలకూ, మతాలకూ దూరంగా వుంచి ఎంతో జాగ్రత్తగా పెంచాడుట.

పెద్దవాడయాక మొట్టమొదటిసారిగా తన తండ్రికి తెలియకుండా ఒక్కడే బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాడు సిధ్ధార్ధుడు. ఆరోగ్యం క్షీణించి బాధ పడుతున్న ఒక రోగినీ, వయసుమళ్ళి చావుకి సిధ్ధంగా వున్న ఒక ముసలివాడినీ, కొంతమంది ఏడుస్తూ స్మశానానికి మోసుకు వెడుతున్న ఒక శవాన్నీ అప్పుడే చూశాడు సిధ్ధార్ధుడు. అది చూశాక అతని మనసు కలతపడింది. అతనిలో ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా పెల్లుబికాయి.

 అసలు జీవితమంటే ఏమిటి? దానికి ఒక అర్ధం అంటూ వున్నదా? అందంగా పుట్టిన పెరిగిన మానవ శరీరం క్షీణించటం ఎందుకు? రోగాలతో బ్రతుకు ఎందుకు? చావు అనేది ఎందుకు? ఆ సత్యాన్వేషణలో ఆయన మనసుకి నచ్చిన జవాబులు ఏ గ్రంధంలోనూ కనపడలేదు. ఏ మత ప్రవక్తల దగ్గరా, మేధావుల దగ్గరా సరైన జవాబులు రాలేదు. ఆచార వ్యవహారాల తంతులలో ముణిగిపోయిన వారి భావాలు ఆయన సత్యాన్వేషణకి ఉపయోగపడలేదు.

తర్వాత రాజ్యపాలనని తృణీకరించి, ఆయన తన ప్రశ్నలకు సమాధానాలు తనే వెతుక్కుంటూ బయల్దేరాడు.

ఇది క్రీస్తు పూర్వం నాలుగు వందల యాభై సంవత్సరాలకి ముందుగా జరిగింది.

                             ౦                  ౦                  ౦

దాదాపు రెండు వేల సంవత్సరాల తర్వాత, శ్రీరంగం శ్రీనివాసరావు అనబడే మహాకవి శ్రీశ్రీకి కూడా, ఈ సత్యాన్వేషణలో ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి.

‘ఏది చీకటి? ఏది వెలుతురు? ఏది జీవితం? ఏది మృత్యువు? ఏది పుణ్యం? ఏది పాపం? ఏది నరకం? ఏది నాకం? ఏది సత్యం? ఏదసత్యం? ఏది నిత్యం? ఏదనిత్యం? ఏది ఏకం? ఏదనేకం? ఏది కారణం? ఏది కార్యం? - ఓ మహాత్మా! ఓ మహర్షీ!’ అని ప్రశ్నించాడు.

ప్రపంచంలోని అందరి బాధా ఆయనదే కదా మరి!

                             ౦                  ౦                  ౦

తర్వాత కొన్ని ఏళ్ళకి, చలన చిత్ర వ్యాస మహర్షి సముద్రాలకీ ‘జీవిత సత్యాలకి నిర్వచనం’ మీద ఇలాటివే ఎన్నో ప్రశ్నలు వచ్చాయి.

‘సృష్టి చేసినది మరి దేవుడయితే నాశనాన్ని ఎందుకు సృష్టించాడనీ, వెలుతురు ఇచ్చిన దేవుడు మరి  చీకటిని ఎందుకు ఇచ్చాడనీ, కళ్ళు ఇచ్చిన దేవుడే మరి అంధులని ఎందుకు సృజించాడనీ, జీవితాన్ని ఇచ్చిన దేవుడు మరి చావునెందుకు ఇచ్చాడనీ’.. ఇలాటి ప్రశ్నలని ఎన్నో అడుగుతారాయన. ఆ పాటలోనే, ఆయన ఇచ్చిన జవాబు మాత్రం నాకు ఏమాత్రం నచ్చలేదు. ‘ఎన్నో వేద శాస్త్రాలు చదివినవారికే ఆ సృష్టి రహస్యం బోధపడలేదు, అల్పబుధ్ధితో ఆ జ్ఞానదాతని పరిహాసం చేయకూడదు’ అంటారు ఆయన.

మన పిల్లలు ఏదైనా తెలివైన ప్రశ్న అడిగితే, మనకి జవాబు తెలియదు కనుక, ‘వెధవా, ఇంతున్నావు ఏమిటా పిచ్చి ప్రశ్నలు, కళ్ళు పోతాయి. నోరు మూసుకో’ అన్నట్టుగా వుంది ఆయన జవాబు!  

సత్యాన్వేషణలో ముఖ్యంగా కావలసినవే ప్రశ్నలకి జవాబులు!

పక్షులని చూసి, మనిషి కూడా అలా ఎందుకు ఎగరలేడు అనే ప్రశ్నకి సమాధానమే ఈనాటి విమానాలు. ఆకాశంలో ఏముందో తెలుసుకోవాలనే కుతూహలమే ఈనాటి అంతరిక్ష యానాలు. మానవ శరీర నిర్మాణం గురించి వచ్చిన ప్రశ్నలకి జవాబే ఈనాటి విస్తారమైన వైద్యశాస్త్రం. కాబట్టి మనకి వచ్చే ప్రశ్నలకి జవాబులు తెలుసుకోవటం, కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నించటం ఎంతో అవసరం.

కాకపోతే కొన్ని ప్రశ్నలకి జవాబులు వెంటనే దొరుకుతాయి. కొన్ని పరిశీలనతో దొరుకుతాయి. కొన్ని పరిశోధన వల్ల దొరుకుతాయి. కొన్ని మనకి అందుబాటులో వున్న మాధ్యమాలతో దొరకకపోవచ్చు.

మళ్ళీ మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ఏదీ తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించాలి”.

ఈ విషయాల మీద నాకు తెలిసినవి మీకు చెప్పాలనీ, నాకు తెలియనివి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనీ వుంది. కానీ ఇప్పుడు, వ్రాస్తున్న ఈ వ్యాసం పూర్తిచేయాల్సి వుంది కనుక, ఆ విషయాలని కొన్నిటిని రాబోయే వ్యాసాల్లో వివరంగా చర్చిద్దాం. 

 ౦                 ౦                  ౦

‘మరి నీ సంగతి ఏమిటయ్యా? ఇహ ఏమిటి నీ ప్రశ్నలు?’ అని మీరు అడుగుతారని నాకు తెలుసు.

వస్తున్నా.. వస్తున్నా.. అసలు ఈ వ్యాసమే దాని గురించి కదా మరి.

నాకు చిన్నప్పటినించీ మానవత్వం మీదా, మనుష్యుల భావావేశాల మీదా, అనుబంధాల మీదా, ఆ విషయ సంబంధమైన కథల మీదా, సమాచారం మీదా మక్కువ ఎక్కువ. మనసుని కదిలించే అటువంటి సన్నివేశాలు కొన్ని వింటుంటే, నా కళ్ళల్లో నీటి బొట్లు రావటం కూడా సహజమే. అలాగే, అలాటి మానవత్వం మరచి తమ దానవత్వం చూపించే వ్యక్తుల మీద ఆగ్రహం రావటం కూడా నా తత్వంలో ఒక భాగమే. అదీకాక నాకు సాంస్కృతిక మానవ శాస్త్రం అంటే ఎంతో ఇష్టం కనుక, నేను వ్రాసిన కథలలో, వ్యాసాలలో ఆ ప్రభావం కనిపిస్తూ వుంటుందని అంటుంటారు అవి చదివినవారు, అదేమిటో తెలిసినవారు.

రోజురోజుకీ హరించుకుపోతున్న మానవత్వపు విలువలు, పెరిగిపోతున్న స్వార్ధం, క్షీణించిపోతున్న మనిషికీ మనిషికీ మధ్య వుండవలసిన అనుబంధం, మనిషి మనిషిగా పుట్టినందుకు మనిషిగా ఎందుకు బ్రతకలేకపోతున్నాడనే ఆవేదన ఎన్నాళ్ళనించో నా ఆలోచనలను ఇటూ, అటూ, ఎటో తీసుకువెడుతున్నాయి.

అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా అంతరిక్షం నించీ, భూగోళాన్ని చూస్తూ, “ఇక్కడినించీ చూస్తుంటే, నాకు ఎంతో అందమైన నీలం రంగు భూగోళం కనిపిస్తున్నది. దానిమీద నాకు గీతలు ఎక్కడా కనపడటం లేదు” అన్నది.

అవును, పరిణామ సిధ్ధాంతంలో అవతరించిన ఈ భూగోళం మీద నువ్వూ, నేనూ అనే గీతలు లేనే లేవు.

మనమే గీసుకున్నాం. ‘మనం’ అంటే భూమి మీద బ్రతికే మనుష్యులు అందరూ గీసుకున్న గీతలు అవి.

ఇది ఒక ఖండం, అది ఒక ఖండం.

ఇది ఒక దేశం, అది ఒక దేశం.

ఇది ఒక రాష్ట్రం, అది ఒక రాష్ట్రం.

ఇది మా మతం, అది మీ మతం.

ఇది మా కులం, అది మీ కులం.

మేము తెలుపు, మీరు నలుపు.

మేము గోధుమ రంగు, మీరు పసుపు రంగు.

మేము ధనవంతులం, మీరు పేదవాళ్ళు.

మేము గొప్పవాళ్ళం, మీరు చవటలు.

మేము మేధావులం, మీరు తెలివిలేని వాళ్ళు.

ఇలాటివే మనం గీసుకున్న గీతలు. ఒకటి కాదు, వందలూ వేలూ... ఎన్నో ఎన్నెన్నో..

ఇలా గీతలు గీసుకోమనే, మనిషి నుదుటి మీద గీతలు వ్రాసి వున్నాయేమో!

                             ౦                  ౦                  ౦

‘గీతలు గీసుకుంటే తప్పా? ఒకే రకం పక్షులు ఒక గూటికే చేరతాయని వినలేదా?’ అనేది ఇంకొక ప్రశ్న.

అమెరికాకి 1960, 1970లో వచ్చిన భారతీయులకి, చైనీస్ గ్రోసరీ షాపుల్లో బియ్యం, వంకాయలు, అల్లం, బెల్లం కనిపిస్తే మన భారతీయ భోజనం తినటానికి అవకాశం దొరికిందని ఆరోజుల్లో సంతోషంగా వుండేది. అలాటి చైనీస్, థాయ్లాండ్ షాపులు కనిపిస్తే ప్రాణం లేచి వచ్చేది. అంతేకాదు శ్రీలంక, పాకిస్థానీ దేశాల బ్రౌను దొరలు తారసపడితే ‘వీళ్ళు మనవాళ్ళే’ అని దగ్గరకు తీసుకునే వాళ్ళం కూడాను. 1980లలో ఎక్కడయినా భారతీయులు కనపడితే, మాకు వెంటనే స్నేహం కుదిరేది. గుజరాతీ అయినా, పంజాబు, సింధు, మరాఠీ ఐనా, తమిళ, కేరళ, కన్నడ తమ్ముళ్ళయినా, బంగళా బాబులయినా కలిసిమెలసి ఎంతో ఆప్యాయంగా వుండేవాళ్ళం. తర్వాత అదే అమెరికాలో, తెలుగు వాళ్ళు చిన్న చిన్న వూళ్ళల్లో కూడా ఎక్కువగా కనపడేవారు. రోడ్డు మీద కానీ, షాపుల్లో కానీ తెలుగు మాట వినిపిస్తే ఒళ్ళు పులకరించేది. వెనక్కి తిరిగి చూసి, దగ్గరగా వెళ్ళి పలకరించేవాళ్ళం. ఆరోజుల్లో ‘తెలుగువాళ్ళందరూ’ మన వాళ్ళే!

ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఇది ‘మన వాళ్ళు’ అనే పక్షపాతంతో కాదు. కొంచెం సూక్షంగా చూస్తే, నేను పైన చెప్పిన ‘మన వాళ్ళ’ నిర్వచనం మారుతూ వచ్చింది. మరి ఇది ఏమిటి, దీన్ని ఒక ‘సుఖ స్థితి’ (Comfort Level) అందామా? అలా అంటే, మరి మనం పైన అనుకున్న తెలుపూ, నలుపూ, మతమూ, కులమూ లాటివి కూడా ఆ ‘సుఖ స్థితి’లో భాగాలేనా? లేదా అవి మనల్ని మనమే సమర్ధించుకోవటానికి వాడే మాటలా? ‘మన’ అనే ఆ అభిమానాలు, పెద్ద దురభిమానాలుగా మారేవరకూ ఫర్వాలేదంటారు కొందరు. అదీ నిజమేనా? మీరే చెప్పండి, చూద్దాం!

పైన ‘మన వాళ్ళు’ అనే పద నిర్వచనం మారుతూ వచ్చింది అన్నాను. అది నిజంగా మారుతూ వచ్చిందా, లేక కుదించుకు పోయిందా అనేది ఇంకొక ప్రశ్న.

ఆనాడు ఎంతోమంది తెల్లవాళ్ళ జులుంలో బానిసలుగా ఇరుక్కుపోయిన కొంతమంది నల్లవాళ్ళని చూసినా; ఏమాత్రం పరమత సహనం లేకుండా, తమ స్థాన, సమయ బలాలు చూసుకుని ఒకళ్ళనొకళ్ళు కించ పరుచుకునే మత పిచ్చివాళ్ళనీ, ప్రవక్తలనీ చూసినా; ఎక్కువ సైన్యం వున్న రాజులు, తక్కువ బలంవున్న రాజులను ఓడించినా; ఎన్నో ఆధునిక యుధ్ధ పరికరాలు వున్న దేశాలు, అవి తక్కువగా వున్నవారి మీద దాడి చేసి, ఆ మారణహోమంలో ఇంకొక దేశాన్ని ఆక్రమించటం చూసినా; భారతదేశంలోని భూస్వాముల దోపిడీ బందిఖానాలో తరతరాలుగా కడుపులు ఖాళీ చేసుకుని ఊడిగం చేసిన కొందరు రైతు సోదరులని చూసినా; ప్రపంచ వ్యాప్తంగా మగవారి చేత తొక్కబడి, వారి అడుగుజాడల్లో నీడల్లా బ్రతికిన ఆడవారిని చూసినా; ఈ ప్రశ్నలకి జవాబు ఇట్టే తెలిసిపోతుంది. అధిక సంఖ్యాకులు అల్ప సంఖ్యాకుల మీదా, బలవంతులు బలహీనుల మీదా ఆధిక్యం చేయటం, వారిని అణగదొక్కి వుంచటం.

మళ్ళీ శ్రీశ్రీగారే చెప్పినట్టు

‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం

నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం

నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులని కాల్చుకు తినడం

ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతీ, పీడించే సాంఘిక ధర్మం“ ...ఇలా సాగుతుంది.

మరి ఈ ‘సాంఘిక ధర్మం’ ఎక్కడినించీ వచ్చింది?

మనలాటి మనుష్యుల్లోనించే వచ్చింది.

ఎందుకు?

తన బ్రతుకుతెరువుకి సాధారణంగా అవసరమైన వాటికన్నా ఎక్కువ కోరుకునే మనిషి దురాశ వల్ల వచ్చింది. తను సృష్టించుకున్న వాటికి, తనే బానిస అయిపోయిన మనిషి బలహీనత వల్ల వచ్చింది.

మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి వున్నది.

ఒకే జాతికి చెందిన పశువులూ, జంతువులే ఈనాటికీ కలసి మెలసి వుంటున్నప్పుడు, వాటిలో నించే వచ్చిన మనిషి, వాటి కన్నా తెలివితేటలు ఎంతో ఎక్కువగా వుండి కూడా, తన పక్కవాడినే ఎందుకలా వేధిస్తున్నాడు? ఎందుకు పీక్కుతింటున్నాడు? ఆధిక్యత కోసం ఎందుకు అల్లల్లాడుతున్నాడు? అతనిలో క్షమ, దాక్షిణ్యం, ప్రేమా, అనురాగం, అన్నిటికీ మించి మానవత్వం ఏమయాయి? ఎక్కడికి పోయాయి?

భౌతిక జీవితం అనుభవించటానికి ఈ భౌతిక ప్రప్రపంచంలో పుట్టిన మనిషి, ఇహలో మానవ జీవితాన్ని స్వర్గతుల్యం చేయాలిగానీ, ఇలా ఎందుకు నరకం చేసుకుంటున్నాడు?

దానికి జవాబు స్వార్ధమా?

అహంభావమా?

అభద్రతా భావమా?

మనిషి మళ్ళీ మనిషిగా ఎప్పుడు పుడతాడు?

ఎప్పుడు మళ్ళీ మనిషిగా జీవిస్తాడు?

                             ౦                  ౦                  ౦

ఈ శీర్షికలో ఇది ఇంకా మొదటి వ్యాసమే!

ఈ వ్యాసం మీద మీ స్పందన చూసి, తర్వాత మనందరం కలిసి సమాధానాలు వెతుకుదాం.

“ముందు భోజనం చేయండి, తర్వాత మాట్లాడుకుందాం” అని మిత్రులు ఇంద్రకంటి శ్రీకాంతశర్మగారు, గోదావరి జిల్లాలో ఎక్కువగా వాడే నుడికారంతో, నా కథల పుస్తకం “చెట్టు క్రింద చినుకులు”కి ముందుమాట వ్రాశారు. అందుకే ఈ విషయంలో కూడా, ముందు ‘నేను వ్రాసింది భోంచేయండి, తర్వాత మాట్లాడుకుందాం!’ 

 

వచ్చే సంచికలో మళ్ళీ కలుద్దాం!

అప్పటిదాకా, సమయం చూసుకుని ఈ విషయాల మీద కొంచెం ఆలోచిద్దాం. కనపడ్ద పుస్తకాలు, మన జీవితాలు ఇంకొంచెం చదివి, కాస్త ఆకళింపు చేసుకుని, మన ఆలోచనలు పంచుకుందాం!

౦                  ౦                  ౦

.

సత్యం మందపాటి

తూర్పు గోదావరి జిల్లా లోని ఆత్రేయ పురంలో పుట్టి గుంటూరులో పెరిగిన సత్యం మందపాటి గారు కాకినాడ, విశాఖపట్నం లో ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పట్టభద్రులు. త్రివేండ్రం లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో పదేళ్ళు సీనియర్ ఇంజనీరింగ్ మేనేజర్ గా పనిచేశారు. ఆ నాటి యువ, జ్యోతి ల నుండి ఈ నాటి రచన,  ఆంధ్రభూమి, నవ్య, చతుర, కౌముది, సుజన రంజని మొదలైన అనేక పత్రికలలో ఐదు దశాబ్దాలుగా 200 కథలు, కవితలు, వ్యాసాలు, నాటకాలు, నవలలు, పత్రికలో దీర్ఘకాలిక శీర్షికలు రచించారు. అమెరికాలో అత్యధిక సంఖ్యలో కథలు  రచించిన కథకుడు సత్యం గారే. ఆయన రచనలు ఇంచుమించు అన్ని తెలుగు పత్రికలలోనూ ప్రచురించబడి అనేక పురస్కారాలని అందుకున్నారు. కథా సంపుటులు, నవలలు, కవితా సంపుటి వెరసి 10 పైగా గ్రంధాలు   ప్రచురించారు. గేయ రచయితగా ఆయన రచించి ప్రదర్శించిన సంగీత రూపకం “వేయి వసంతాలు” సాలూరి వాసూ రావు సంగీత దర్శకత్వంలో ఎస్.పి. బాలూ, శైలజ ఆలపించారు. 1998 నుంచి ఆరు నెలలకొకసారి టెక్సస్ లోని అనేక నగరాలలో టెక్సస్ సాహిత్య సదస్సుల నిర్వహణ లో కీలక పాత్ర వహిస్తున్నారు. పిల్లల కోసం తెలుగు బడి, భాషాప్రియులకోసం నెల వారీ ఆస్టిన్ సాహిత్య సమావేశాలూ నిర్వహిస్తున్న సత్యం మందపాటి గారు సతీమణి విమల గారితో నాలుగు దశాబ్దాలుగా ఆస్టిన్ నగర నివాసి..

***

bottom of page