
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
MADHURAVANI TELUGU MAGAZINE మధురవాణి
మా వాణి ...
రాలే ఆకులు రంగులు తొడిగే కాలం. దసరా దీపావళితో మొదలుపెట్టి, క్రిస్మస్, న్యూ ఇయర్ వరకు వరసగా వచ్చే పండగలతో వివిధ జాతులవారు విభిన్న సంస్కృతులకు నిలయమైన ఈ సువిశాల దేశంలో సరదాగా, ఆనందంగా గడిపే కాలం. అందుకే, సంవత్సరం చివరి మూడు నెలల కాలం ఒక సహజసిద్ధమైన శోభతో అలరారుతూ ఉంటుంది. అటువంటి శోభనే పుణికి పుచ్చుకొని ఈ మధురవాణి సంచిక మీముందు కొస్తోంది.
మేము ప్రకటించిన దసరా దీపావళి-2017 రచనలపోటీకి కవులు, రచయితలూ, వ్యాసకర్తల నుంచి విశేష స్పందన లభించింది. పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న వారందరికీ మా ధన్యవాదాలు. చెయ్యి తిరిగినవారు పంపిన సంతృప్తికరమైన రచనలతో బాటు, ఔత్సాహికులు పంపిన అనేక రచనలు మాకందాయి. అంతకు ముందు కవులు కానివారిని కూడా కవితలు రాయటానికి, రచయితలు కానివారిని కూడా కథలు రాయటానికి ఇటువంటి పోటీలు ప్రోత్సహిస్తాయని దీనివల్ల అర్థమయింది. ఐతే, ఉత్తమ రచనలను ఆకర్షించటంతోబాటు కొత్తవారిని రచనా రంగంలోకి ఆహ్వానించటం కూడా మా ఉద్దేశం కాబట్టి అది నేరవేరిందనే అనుకుంటున్నాము. బహుమతుల ఎంపికలో ప్రమాణాల రీత్యా పాటించిన కొన్ని పరిమితుల కారణంగా ప్రోత్సాహక బహుమతుల సంఖ్యలో కొంత మార్పు జరిగింది. వివరాలు బహుమతి రచనల ప్రకటనలో చూడవచ్చు. బహుమతులు గెలుచుకున్న వారందరికీ మా అభినందనలు. బహుమతి పొందిన కొన్ని రచనలు ఈ సంచికలో ప్రచురింప బడ్డాయి. మిగతావాటిని రాబోయే సంచికల్లో చదవవచ్చు.
వీటితో బాటు రెగ్యులర్ ఫీచర్స్ కింద చేర్చిన వివిధ రచనలు మిమ్మల్ని అలరిస్తాయని ఆశిస్తున్నాము. ముఖ్యంగా, అలనాటి కథగా ప్రచురితమైన ఒక అరుదైన కథ మీకు తప్పక నచ్చుతుందని అనుకుంటాము. ఎంతో శ్రమ తీసుకుని ఈ శీర్షికలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న రచయితలందరికీ మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.
ప్రవాసాంధ్రులుగా ఉన్న మనకి , ఇక్కడా, ఇండియాలోనూ తెలుగు భాష వర్థిల్లాలని, తరతరాలుగా వస్తున్న సుసంపన్నమైన ఈ భాషా సాంప్రదాయం అవిచ్చిన్నంగా కొనసాగాలని ఆకాంక్ష ఉండటం సహజం. దానికి ఒకే ఒక మార్గం కొత్త తరాలు తెలుగు నేర్చుకోవటం. ఈ విషయంలో ఇప్పటివరకు నిరాశాజనకంగా కనిపిస్తున్న పరిస్థితిని చక్కదిద్దుతూ ఇటీవల తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో హర్షదాయకం. పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు తెలుగును ఒక పాఠ్యాంశంగా తప్పక స్వీకరించాలని వారు నిర్ణయించటం వల్ల ఎంతోమంది విద్యార్థులు తెలుగు అభ్యసించే అవకాశం ఏర్పడింది. ఆంగ్లభాషా వ్యామోహంవల్ల ఆదరణ కరువై, రెపరెపలాడుతున్న తెలుగు దీపాన్ని కాపాడటానికి తన రెండు చేతులు అడ్డం పెట్టిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖర రావు గారికి ఈ సందర్భంగా మా అభినందనలు తెలియజేస్తున్నాము.
10వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు సెప్టెంబరు మూడవ వారంలో వాషింగ్టన్ లో దిగ్విజయంగా ముగిసింది. ఇండియా నుంచి వచ్చిన కొంతమంది సాహితీ వేత్తలతో బాటు దేశం నలుమూలల నుంచి అనేక మంది కవులు, రచయితలు ఇందులో పాల్గొన్నారు. విలువైన ప్రసంగాలు చేసారు. ఆ ప్రసంగపాఠాలన్నీ పుస్తక రూపంలో త్వరలో రాబోతున్నాయి. అమెరికాలో కవులు, రచయితలతో బాటు సాహిత్యాభిమానులు ఒకరినొకరు కలుసుకోవటానికి, తద్వారా వారిలో సాహితీ పిపాసని సజీవంగా నిలిపి ఉంచుకోవటానికి ఇటువంటి సదస్సులు ఎంతగానో తోడ్పడతాయి.
మా పాఠకులు, కవులు, రచయిత లందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు!!

మధురవాణి నిర్వాహక బృందం

మధురవాణి.కాం అంతర్జాల పత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దసరా-దీపావళి కథల పోటీకి వందల సంఖ్యలో రచనలని పంపిన రచయితలందరికీ పేరు పేరునా ధన్యవాదములు. తెలుగులో సృజనాత్మక రచనకు పట్టం కడుతున్న సాహిత్యాభిలాషులకి కొదువ లేదన్న సత్యాన్ని ఈ విశేష స్పందన నిరూపిస్తుంది. అన్ని రచనలనీ పరిశీలించి, ఉత్తమ కథలు, ఉత్తమ కవితలు, ఉత్తమ వ్యాసాలతో పాటు కొన్ని ఎన్నదగిన రచనలకి ప్రశంసా బహుమతులు ప్రకటిస్తున్నాము.