top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆదిత్య సినీ మధురాలు

V N Aditya

వి.ఎన్. ఆదిత్య

చలన చిత్ర దర్శకులు

సినిమా నిర్మాణంలో మొదట కథ తయారవుతుంది. అది ఒక నిర్మాతకో, దర్శకుడికో చెప్పగలిగితే, వాళ్లకి బాగా నచ్చితే రెండో మెట్టెక్కుతుంది. నిర్మాతకి నచ్చితే హీరోకి చెప్పి, అతనికి నచ్చితే దర్శకుణ్ని హీరో అనుమతితో నియమిస్తాడు. లేదా, నిర్మాత ఒక దర్శకుడికి చెప్పి, అతనికి నచ్చితే తనకు కావల్సిన హీరోకి చెప్పి ఒప్పిస్తారు.

రెండింట్లోనూ హీరో కథని లేదా అది పట్టుకొచ్చిన నిర్మాతని లేదా దర్శకుడిని .. ఈ మూడింటిలో ఏ రెండు తనకి బలంగా నచ్చినా ఎంచుకుంటాడు. ఆ కథ మూడో మెట్టు ఎక్కుతుంది. అప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకుని కథ నుంచి కథనం, అంటే స్క్రీన్ ప్లే, దీన్నే ట్రీట్‌మెంట్ అని కూడా అంటుంటాం. ఆ స్క్రీన్‌ప్లే నుంచి మాటలు/సంభాషణలు తయారౌతాయి. ఈ దశల్లో ఎక్కడైనా, ఎప్పుడైనా నిర్మాతకో, హీరోకో, దర్శకుడికో ఆ ప్రాజెక్టు అంతగా రుచించకపోతే ఆదిలోనే హంసపాదౌతుంది. రుచిస్తే, ముహూర్తం జరిగి మొదటి షెడ్యూల్ మొదలౌతుంది. ఈ మధ్యలో హీరోయిన్ వేట విస్తృతంగా జరుగుతుంది. ప్యారలల్‌గా సంగీత చర్చలు సాగుతాయి. షూటింగ్‌లో మిగిలిన పాత్రలన్నీ ప్రవేశించాక హీరోకి కథ పైనో, కథనం పైనో, మాట తీరుతెన్నులపైనో, మానిటర్‌లో తనకి తాను నచ్చకపోతేనో ఆ ప్రాజెక్టు మళ్లీ అటకెక్కేస్తుంది. ఒకవేళ హీరోకి అవన్నీ తెగ నచ్చేస్తే షూటింగ్ నిర్విఘ్నంగా నడిచిపోతుంది. తెలుగు సినిమాకి సంబంధించి కథానాయకుడే వినాయకుడన్న మాట. విఘ్నరాజ నమస్తుభ్యం అని రోజుకి 108సార్లు దణ్నం పెట్టుకోవల్సిందే.

షూటింగ్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి టీజర్, ట్రైలర్, సోషల్ మీడియా మరియు మీడియాతో ప్రమోషన్ ప్యారలల్‌గా నడుస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడుకుని, థియేటర్ల ఎవైలబిలిటీని, పండగలు, పబ్బాలు, పరీక్షలు లాంటి సీజన్స్‌ని గుణించుకుని ఓ డేట్ ఫిక్స్ అయ్యి, దానికి ఓ వారం, పది రోజుల ముందు ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంటు వగైరాలన్నీ చేసి థియేటర్‌లో మార్నింగ్ షో దాకా తీస్కెల్తారు నిర్మాత, దర్శకుడు కథా(వి)నాయకుడు.

ఇది పెద్ద స్టార్‌ల సినిమా నిర్మాణం. ఇదే చిన్న సినిమా, నాన్ మార్కెటబుల్ హీరో, హీరోయిన్స్‌తో అయితే, నిర్మాతకి కథ నచ్చగానే, దానికి ఒక బడ్జెట్ ఫిక్స్ అయ్యి, తన ఫైనాన్షియల్ పొజిషన్‌ని బట్టి నిదానంగానో, అతి త్వరగానో సినిమాని పూర్తి చేసి మార్కెట్ చుట్టూ రిలీజ్ అవకాశాల కోసం పడిగాపులు పడి,  ఈలోపు పబ్లిసిటీ పెంచుకుంటూ జాగ్రత్తగా మార్నింగ్ షో దాకా తీస్కెళ్తాడు. ఇవి రెండూ హై బడ్జెట్, లో బడ్జెట్ సినిమాల నిర్మాణపు సాధారణ తీరుతెన్నులు. 2005 నుంచి ఈ రెండు రకాల సినిమాలూ ఇలా జరగడం మానేశాయి. తొంభై శాతం సినిమాలు ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా మొదలౌతాయో ఎవ్వరికీ తెలీదు. ముహూర్తం అయ్యాక కూడా తనే దర్శకుడిననే నమ్మకం ఆ దర్శకుడికి ఉండడం లేదు. చిన్న సినిమాలైతే దర్శకుడు, నిర్మాత దాదాపు ఒకటే. డబ్బులు పెట్టినా, పెట్టకపోయినా కథ, స్క్రీన్‌ప్లే, మాటల విభాగాలన్నీ మంట కలిసిపోయాయి. అన్నీ దర్శకుడే. సంగీతం, సాహిత్యం, గాయనీ గాయకులు, వాయిద్యకారులూ అనే ఈ అయిదు విభాగాలూ హుష్ కాకి. అన్నీ ఒక్కడో, ఇద్దరో ఇప్పుడు. నిర్మాత, పంపిణీదారుడు, ప్రదర్శనకారుడు మూడు వ్యవస్థలూ మటుమాయం. ప్రాజెక్టు పిచ్ చేసేదొకడు, టేకోవర్ చేసేదొకడు, రిలీజ్ చేసేదొకడు. బయ్యరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు నిర్మాతే. శాటిలైట్ అనే రిలీజు ముందు గ్యారంటీడ్ మనీ పోయింది. మార్నింగ్ షో ఫుల్ అయిన పెర్సంటేజీని బట్టి శాటి ’లైట్’ తీసుకుంటున్నారు చిన్న సినిమాలకి. అదృష్టవశాత్తు హీరోల సినిమాలకి మిగిలి ఉంది ఆ విభాగం ఇంకా.

 

o    o    o

ఏ హీరోనైనా షూటింగ్‌కెళ్ళి కలవడం ఈ పదేళ్లలో వచ్చిన కొత్త కష్టం. వాళ్లు పిలిస్తే తప్ప. ఏ వ్యవస్థ అయినా వ్యక్తుల సమూహం వల్ల విసిగితే బలంగా ఉంటుంది తప్ప, ఒక్క వ్యక్తి మీదే ఆధారపడి ఎదిగితే బలహీనమవుతుంది. అన్ని విభాగాల్లోనూ తెలుగు పరిశ్రమ బలహీనపడుతుండడం గమనార్హం. కథ ఉంది అంటే ఎవడు కొట్టేస్తాడో అని అర్జంటుగా వినే హీరోయిజం ఇప్పుడు తెలుగులో లేదు. ఈ దశాబ్దంలో లేదు, ముందు తరంలోనే మారిపోయింది ఆ ఆరోగ్యకరపు అలవాటు. ప్రాజెక్టు సెటప్ చేసి, సౌండ్ రెమ్యూనరేషన్ ఉంటే తర్వాత కథ, స్క్రీన్‌ప్లే లాంటి తిప్పలు నిర్మాత, దర్శకుడు పడాల్సిందే. తొంభై శాతం మంది మార్కెటబుల్ హీరోలు కష్టపడి హీరోలవ్వలేదు. డబ్బున్న కుటుంబాలనుంచే హీరోలయ్యారు. వాళ్ల దేహ దారుఢ్యం కోసం మాత్రమే కష్టపడే కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్లకి ఎదుటివాడి డబ్బన్నా, శ్రమన్నా విలువ తెలీదు. అది వాళ్ల తప్పు కాదు. పాతికేళ్ళుగా సినిమాలు నిర్మించిన గొప్ప నిర్మాణ సంస్థలన్నీ గత పదేళ్లలో వేళ్ల మీద లెక్కపెట్టుకోదగినన్ని సినిమాలు కూడా నిర్మించలేదు. అదే మొదటి, మేజర్ వైఫల్యం. నిర్మాత లేని నిర్మాణం ఏ రోజైనా నిర్యాణమే. బడ్జెట్  కంట్రోల్ చేయడం అంతా హీరో, హీరోయిన్లు పారితోషికాలు తగ్గించుకోవటం ఒకటే అన్నట్టు దాన్ని హైలైంట్ చేస్తారు. నిజానికి అది సమస్యే కాదు. మార్కెట్ లేకపోతే అడిగినా ఇస్తారా?

సినిమా నిర్మాణంలో 200 అంశాలు ఉంటాయి. అన్నిటికీ అనవసరం వ్యయం పెరిగింది. సోషల్ రేట్లు అన్ని విషయాల్లోనూ పెరిగినపుడు సినిమాల బడ్జెట్‌లు పెరగకుండా ఎలా ఉంటాయి. బడ్జెట్ ఎంత పెరిగిందో మార్కెట్ అంతకన్నా ఎక్కువ పెరిగింది. నిజానికి ఈ దశాబ్దంలోనే. ప్రపంచ నలుమూలలకీ ప్రాంతీయ సినిమా పాకింది. ఇంతకన్నా లాభసాటి వ్యాపారం లేదు. అందుకే అందరి చూపూ ఈ వ్యాపారం వైపే. ఎప్పుడైతే మదుపుదార్ల హవా పెరిగిందో క్రైమ్ రేట్,  క్రిమినల్ మైండ్స్ కూడా పెరిగాయి. అది తప్పులేదు. వీటన్నింటి మధ్య ఎవరో ఒకరు, ఎపుడో అపుడు  సినిమా ఇలా కూడా తీయొచ్చు అని నిరూపిస్తూ ఉన్నాడు. వాళ్ళే నిజానికి తెలుగు సినిమాకి ఊపిరూలూదుతున్న వాళ్లు. 1000 మీటర్ల రిలే పరుగులు టార్చ్ చేతులు మారుతూ ఉండాల్సిన అవసరం ఎప్పుడూ ఉంది. మారుతున్న సాంఘిక సమీకరణాలకి అనుగుణంగా సినిమా పరిశ్రమలో ప్రతిభావంతుల ప్రభావాలు కూడా మారుతూ ఉంటాయి. ఆరునెలల్లో పెట్టిన డబ్బుకి ఎంతో కొంత ఖచ్చితంగా రాబట్టగలిగే చట్టబద్ధమైన వ్యాపారం వినోద పరిశ్రమ ఒక్కటే. జాగ్రత్తగా తీస్తే సినిమా ఒక మంచి విజిటింగ్ కార్డు కూడా. వేరే రంగాల్లో ప్రవేశానికి.

జనరంజకమైన సినిమా ఏంటో జనం తప్ప పరిశ్రమ ఎప్పటికీ గుర్తించలేదు. అదే ఇందులో ఉన్న మజా.. ఆ జనం వరకు కొన్ని వందల సినిమాలు వెళ్లగలగడం చాలా కష్టం. అన్ని దశలూ దాటి వెళ్ళేసరికి జనానికి ఆ సినిమాలోని నవరసాల్లో ఏదో ఒక రసం మత్తెక్కించిందా, కనకవర్షం. నీరసం తెప్పించిందా కన్నీటి వర్షం.

ఇదే ట్రేడ్. ఇదే ట్రెండ్.  ఫాలో అవుతారా? సెట్ చేస్తారా?

మీ 

వీ.యెన్ .ఆదిత్య .

bottom of page