top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

'అలనాటి' మధురాలు

సేకరణ: వంగూరి చిట్టెన్ రాజు |  శ్రీనివాస్ పెండ్యాల

sahityam@madhuravani.com 

Anchor 1

పువ్వూ - కాగితం పువ్వూ

వెల్చేరు నారాయణరావు

ఈ కథ మొదటిసారిగా తెలుగు స్వతంత్ర 1954 జనవరి 22 సంచికలో ప్రచురించబడింది.​​

వనస్పతి అంటే పువ్వులు పూయకుండా కాయలు కాసే చెట్టు. డాల్డా అంటే వెన్న అక్కరలేకుండా తయారయ్యే  నెయ్యి. అందుకనే పట్నాల్లో వాళ్లకి "వెన్న కాచిన నెయ్యి" అని ఒక మాట ఏర్పడింది. వెన్న కాచకుండా తయారయే నెయ్యి ఉంటుందని ఎరగని పల్లెటూరు వాళ్లకి యీ మాట అర్ధం కాదు.

డాల్డాని కూడా నెయ్యే అంటారు. వనస్పతిని కూడా చెట్టే అంటారు. ఎంతమంది యంత్రాలని మనం మనుషులనటం లేదు?

సర్ థామస్ గ్రెషాం అని ఒకాయన పూర్వం ఎలిజిబెత్ రాణీగారికి ఆర్ధిక సలహాదారుడుగా ఉండేవాడు. ఆయన, చెడ్డ నాణాలు వచ్చి మంచి నాణాలని మారకంలోని తరిమేస్తాయని ఒక సిద్ధాంతం చేశాడు. ఈ సంగతి డబ్బుకే కాకుండా సామాన్యంగా అన్నింటికీ వర్తిస్తుందని కొంతమంది  అంటారు. కాని యిలాంటి సంగతులేవీ మంచినెయ్యికి తెలియవు. డాల్డా వచ్చి తనని తరిమేస్తుందని మంచి నెయ్యి పసికట్టలేదు. అమాయకురాలు.. పాపం! పల్లెటూరిది.

******

శ్రీపతి చదువుకున్నవాడే.. బాగా చదువుకున్నవాడే. చిన్నప్పటినుంచీ అతని అభిరుచులు విచిత్రంగా ఉండేవి. అతని నమ్మకాలూ, యిష్టాలూ, అనిష్టాలూ, యివేవీ అందరూ పోయేదారిలో ఉండేవి కావు. ఎవరికీ బాగుండని సినిమాలో, ఎవరూ బాగుంటుందని ఊహించని భాగం, శ్రీపతికి ఎందుకో నచ్చేది అది బాగుందని అనుకోడం తప్పితే.. ఎందుకు బాగుందో కారణం అతనికి కూడా తెలియకపోయి ఉండాలి.

శ్రీపతి తెలివైనవాడు. ఈ సంగతి అతని మొహం చూడగానే తెలుస్తుంది. అతను ఎం.ఏ ప్యాసయినా యింకా ఉద్యోగం మాత్రం చెయ్యటం లేదు. చేస్తాడో, చెయ్యడో  తెలియదు. ఉన్నవాడే కాబట్టి, పరవా ఏమీ లేదు.

శ్రీపతి ఎం.ఏ. పాసయ్యేసరికే, బి.ఏ చదువుతున్న వాళ్ల మేనమామ కూతురొకతె ఉంది శ్రీపతికోసం. ఆ అమ్మాయి పేరు ఉదయబాల. శ్రీపతి పరీక్ష ప్యాసయిన తరువాత  నుంచీ మేనమామ పెళ్ళి విషయం తొందరపడుతూనే ఉన్నాడు. శ్రీపతి నాన్నగారూ, యీ సంబంధం చేసుకోవాలనే అనుకుంటున్నాడు. కట్నం కావల్సినంత యిస్తారు.

శ్రీపతి యీనాటివరకూ పెళ్లి విషయంలో  ఏ అభిప్రాయమూ బైట పెట్టలేదు. ఇందులో అతని అభిరుచులు ఎలా ఉంటాయో తెలీదు. వాళ్ల నాన్నగారు అడిగినప్పుడు కూడా శ్రీపతి మౌనంగానే ఉన్నాడు. బహుశా అది అర్ధాంగీకారసూచకం కావచ్చు. కాకపోతే ఉదయబాలవంటి స్త్రీ అర్ధాంగి కాబోతుండగా వద్దంటాడా? కాని, చాలా విషయాలను గురించి స్వంతంగా కొన్ని భావాలు ఏర్పరుచుకోగలిగిన వ్యక్తి, పెళ్లిని గురించి యింత నిర్లిప్తతతో ఎలా ఉంటున్నాడా అని చాలామంది స్నేహితులకి అనిపించిన మాట నిజం.

ఉదయబాల చాలా అందమయినది. అతి నవ్యనాగరికతకి ఆవిడ రూపొందిన ఆకారం, ఎత్తుమడమల బూట్లు వేసుకుని, జుట్టు అందంగా కత్తిరించుకుని, చక్కగా అలంకరించుకుని, చేతిలో చాలా లావణ్యంగా ఒక సంచీ పుచ్చుకుని ఆవిడ కాలు కదిపితే, అనేక వందల యువకుల కళ్లు అటు తిరిగేవి. ఈ యిరవయ్యో శతాబ్దపు సౌందర్యం శ్రీపతిలో ఏదో కదలిక కలిగించే ఉంటుంది. ఉదయబాలకి 'బావ'ని పెళ్లాడాలని ఉన్నమాట వాస్తవం.

ఉన్నట్టుంది శ్రీపతి ఏదో ఊరు వెళ్లాడు. ఒక్కొక్క సమయంలో అతనికొక బుద్ధి. పట్టణంలో ఏమీ తోచటం లేదని ఒక పల్లెటూరు పోతాడు. తరచు ఏ చుట్టాలూ ఉండని పల్లెటూరు పోయి అక్కడ ఎవరినో కాస్త చోటడిగి, తను పట్టుకెళ్ళే ఏ పదార్థమో తిని, పడుకుంటాడు. పల్లెటూరువాళ్లు మంచివాళ్ళంటాడు శ్రీపతి. పడుకోటానికి చోటడిగితే, పట్నం వాళ్ళలా అనుమానపడరు. ఏ చుట్టాలూ లేని ఊరికి ఏ పనీ లేకుండా శ్రీపతి రావడం ఆ పెల్లెటూళ్ళోవారికి విచిత్రంగా తోస్తుంది. శ్రీపతి నిజం చెపుతాడు. యీ వూరు చూద్దామని వచ్చానంటాడు. ఇదేం మహాపట్టణమా.. చూడడానికి. వాళ్లకి శ్రీపతి సమాధానం అర్ధం కాదు. వాళ్ల కర్ధమయ్యేలా చెప్పడానికి శ్రీపతి శ్రమపడడు.

ఈసారి శ్రీపతి ఒక పల్లెటూరు వెళ్లాడు. తెల్లని మామూలు పంచె, తెల్లని చొక్కా, ఆకు చెప్పులు, చేతిలో ఒక సంచీ, ఏ ఆడంబరమూ లేని యీ ఆకారం, పట్టణం నుంచి వచ్చాడని వాళ్లనుకోలేదు. సాయంకాలమయేదాకా ఎక్కడెక్కడో తిరిగి  అన్నీ చూశాడు. పల్లెటూరివాళ్లకి ఏమీ తొందరలేదు. గంటలు, నిముషాలతో నిమిత్తం లేని జీవితం వాళ్లది. పట్టణంలో మల్లే పరిగెత్తవలసిన పని ఉండదు.

ఆ పల్లెటూరు శ్రీపతికి చాలా బాగుంది. ఇంతకుముందొకసారి ఆ రోడ్డంట బస్సులో వెడుతూ చూశాడు. ఊరుముందు ఒక చెరువు. దాని ప్రక్కగా కాలిదారి, చెరువు ప్రక్కన ఒక పెద్ద చెట్టు, అందంగా వంగిన కొమ్మలు, చెట్టు మొదట సిమెంటు దిమ్మ. దాని మీద సావకాశంగా కబుర్లు చెప్పుకునే పురుషులు. యిదేదో అద్భుతంగా కనిపించింది శ్రీపతికి. అందుకనే ఈసారి ఆ వూరు వెళ్లాడు శ్రీపతి. ఆ చెరువు పక్క కాలిదారి మీదుగా ఊరిలోకి దారి. ఆ యిళ్ళూ, వాటి మధ్య పెద్ద పెద్ద చెట్లు, కంచెలు కట్టిన పెద్ద పెద్ద దొడ్లూ, ఎంతో హాయిగా ఉన్నాయి. పట్టణంలో మరీ విసిగెత్తేట్టు ఇళ్లన్నీ ఒక్కలాగే ఉంటాయి. అక్కడ పార్కుల్లో చెట్లు  కూడా మనిషి చెప్పినట్లే పెరుగుతాయి.

చీకటి పడుతోంది. ముసురుకునే మసక చీకట్లలో ఏవో ఆకారాలు అస్పష్టంగా కదులుతున్నాయి. ఎద్దుల మెడ గంటలు వినబడుతున్నాయి. ఎక్కడో ఒక చోట ఒక చిన్న దీపం కనిపించింది. చీకటి ఎంత అందంగా ఉంటుంది.

ఎదురుగుండా కనిపించిన గుమ్మం ఎక్కాడు శ్రీపతి. "ఏమండోయ్" అని పిలిచాడు. ఆయనెవరో ముసలాయన. "ఎవరు నాయనా?" అన్నాడు. "నా పేరు శ్రీపతి అంటారండి. యీ పక్కనే ఉన్న పట్టణం మాది. ఈ రాత్రికి యిక్కడ పడుకోవడానికి వీలుంటుండా అండి?".  "ఉండకేం నాయనా! ఏం భాగ్యం? లోపలికి రా బాబు. రేణూ! కాళ్ళు కడుకోవడానికి  నీళ్లు పట్రా అమ్మా.. "అంటూ ముసలాయన లోపలికి  దారి తీశాడు. శ్రీపతి లోపలికి వెళ్లాడు. ఇంట్లో అందరూ తలో పని చేస్తున్నారు. ముసలాయన  తనతో కబుర్లు చెప్తున్నాడు. శ్రీపతి కాళ్లు కడుక్కుని తుడుచుకుని కూచున్నాడు.

"అయితే.. నువ్వు పట్నంలో ఎవరబ్బాయివి బాబూ.. మీ యింటిపేరు? అల్లాగా! మీరెంతమంది అన్నదమ్ములు?.. అక్కచెల్లెల్లున్నారా? పెళ్ళిళ్ళయినాయా? యిలాంటి లక్ష సంగతులడుగుతాడు ఆయన. శ్రీపతి అన్నింటికీ సమాధానం చెపుతాడు. ఈ ముసలాళ్లకి ప్రపంచమంతా ఒక కుటుంబం. ప్రతి మనిషి వాళ్ల చుట్టం. పట్టణంలో తన పక్కవాడెవడో తనకి తెలియదు. తను తెలుసుకోడు.

"లే బాబూ, కాళ్ళు కడుక్కో. భోజనానికి లే. యిప్పటికే ఆలస్యం అయింది" అన్నాడు ముసలాయన.

"లేదండి. నేను భోజనం చెయ్యను. మీకెందుకు అనవసరపు శ్రమ. నా దగ్గిర బిస్కెట్లూ అవీ ఉన్నాయి. నేను ఏ వూరు వెళ్లినా ఎవ్వరినీ శ్రమపెట్టడం యిష్టం లేదు."

"ఏమిటయ్యా యీ కబుర్లు. యింటికి వచ్చి భోజనం చెయ్యకుండా పడుకోవడం యీ కాలపు నాగరికతా ఏమిటి? మాకామాత్రం దేముడిచ్చాడులే. వచ్చిన అతిథికి భోజనం పెట్టకపోవడం మాకింకా అలవాటు లేదు" శ్రీపతికి భోజనం చెయ్యక తప్పింది కాదు. ఆ ముసలావిడ అచ్చంగా అన్నపూర్ణ. ఆవిడని చూస్తుంటే ఎవరో జ్ఞాపకం వస్తున్నారు. తన చిన్నప్పుడు చచ్చిపోయిన అమ్మమ్మ. కన్నకొడుకులా ఆదరించింది తనని.

ఇంతకీ, తనెవడో యీ యింటివాళ్లకెవ్వరికీ తెలియదు. తను భాగ్యవంతుడని కూడా తెలియదు. ఈ రకమయిన అదరణ కొన్ని కుటుంబాలలో ఉంటూంది కాబోలు. సుఖంగా నిద్రపోయాడు శ్రీపతి. తెల్లవారుఝామునే లేచి వెళ్లిపోదామనుకున్నాడు. కాని గాఢనిద్ర పట్టేసింది. మెలకువ రాలేదు.

రెండో బస్సు చాలా సేపటికి గాని రాదు. తను లేచేసరికి ఊరంతా లేచింది. అందరూ యెవరి పనుల్లో వాళ్ళున్నారు. ముసలాయన పశువులకి దాణా వేస్తున్నాడు. ఆ అమ్మాయి జడ వేసుకుని జడగంటలు పెట్టుకుని పరికిణీ కట్టి, వోణీ వేసుకుని అమ్మకి ఏదో పనిలో సాయం చేస్తోంది. తమ్ముడు చద్దన్నం  తిని చొక్కా లాగు తొడుక్కుని తల దువ్వుకుని పలక, పుస్తకాలు వెతుక్కుంటున్నాడు బళ్ళోకి వెళ్లడానికి. ముందు వాకిటిలో లేత ఎండలో పడకకుర్చీలో పడుకుని అంతా చూస్తున్నాడు శ్రీపతి. అలాంటి వాతావరణంలో సిగరెట్టు కాల్చబుద్ధవలేదు అతనికి. ఇంతట్లో ఆ అమ్మాయి పలహారం తెచ్చిపెట్టింది. గ్లాసుతో పాలు తెచ్చింది. ఎంతో అమాయకంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. నాగుపాములా జడ కదులుతుంటే లోపలికి పరుగెట్టింది. నల్లటి సన్నటి అమ్మాయి. "మీ పట్నంలోకి మల్లె యిక్కడ కాఫీ  హోటళ్ళుండవు. ఏదో యింట్లో చేసిందే తినాలి" అన్నాడు ముసలాయన.

"ఇంత బాగుండవండి మా హోటలు పదార్థాలు" అన్నాడు శ్రీపతి.

వాళ్ల తమ్ముడు పలక పుచ్చుకుని బళ్ళోకి వెళ్తున్నాడు. శ్రీపతి అతన్ని పిలిచాడు.

"నీ పేరు?"

"పాండురంగడు"

"ఏం చదువుకున్నావు"

"మూడో క్లాసు"

"మా పట్నం వస్తావా? ఎంచక్కటి పే...ద్ద బడి ఉంది. బోలెడు మేష్టర్లున్నారు"

"ఊ...హూ."

"ఏం! ఎందుకు రావు?" ఆ అబ్బాయికి సమాధానం తెలియదు. వాళ్లక్కయ్య స్తంభానికి ఆనుకుని ఒక కాలు మడిచి, చేతులు వెనక్కి పెట్టి స్థంబాన్ని పట్టుకుని నిలబడి ఉంది.

"మీ పట్టణంలో వాళ్లు మంచివాళ్లు కారు" అని అమ్మాయి టక్కున సమాధానం చెప్పేసింది. తమ్ముడు ఫకాలున నవ్వాడు.

"నీకెవరు చెప్పారు?" అన్నాడు శ్రీపతి అటు తిరిగి.

ఆ అమ్మాయి లోపలికి  పారిపోయింది.

శ్రీపతి ఆ అబ్బాయికి బిస్కెట్లు పెట్టాడు. "పట్టణం వాళ్లు మంచివాళ్లేనా?" అన్నాడు. ఆ అబ్బాయి సంతోషంతో "చాలా మంచివాళ్ల"న్నాడు. బడిగంట వినిపించింది. అతను లేడిలా పరుగెత్తుకుంటూ బడికి వెళ్ళిపోయాడు.

శ్రీపతి రెండో బస్సుకి వెళ్లిపోతానన్నాడు. రెండో బస్సుకి వెళితే భోజనానికి చెడతావు. అక్కడికి వెళ్ళేసరికి 12 గంటలవుతుంది. భోజనం చేసి బయల్దేరు మూడో బస్సులో" అంది ముసలావిడ. ఆవిడ మాట్లాడుతుంటే అమ్మమ్మ మాటలల్లే ఉన్నాయి. ఏమీ అనలేకపోయాడు శ్రీపతి.

"పట్టణంలో అయితే పార్కులూ, రేడియోలూ, సినిమాలూ. యిక్కడేం ఉన్నాయి. నీబోటివాళ్లకి ఏం తోస్తుంది?" అన్నాడు ముసలాయన. ఆయన పని అంతా అయిపోయింది. ఎవరో రైతులు వచ్చారు. తనూ, ఆయనా, వాళ్లు ఏవో కబుర్లు చెపుతూ కూర్చున్నారు. ఏవేవో చాలా సంగతులు మాట్లాడారు. ప్రొక్యూర్మెంటు, గవర్నమెంటు వాళ్ల పనులు,  యింకో యుద్ధం, ఇలాంటివెన్నో, శ్రీపతి తనకి తోచినవి చెప్పాడు. అతనంతగా మాట్లాడే తరహా వాడు కాదు.

"ఇంక యిలా కబుర్లేనా? భోజనానికి లేవడం ఉందా? నువ్వు లే నాయనా. ఆయనకి కబుర్లుంటే భోజనం అక్కర్లేదు" అంది ముసలావిడ. ముసలాయనా, శ్రీపతి లేచి భోజనం చేశారు.

శ్రీపతికి బస్సు టైమయిపోతోంది. సంచీ తీసుకుని బయలుదేరాడు. యింటిల్లిపాదీ గుమ్మంలోకి వచ్చారు. "మా ఊరొకసారి రండి. మరచిపోకండి. బస్సు స్టాండు కెదురుగుండానే మా యిల్లు. పట్టణంలో వాళ్లు మంచివాళ్లు కారంటుంది మీ అమ్మాయి. మేం ఎంత మంచివాళ్లమో చూపిస్తాము" నవ్వుతూ అన్నాడు శ్రీపతి. ఆ అమ్మాయి ముత్యాలపళ్లకి వోణీ చెంగు అడ్డం పెట్టుకుంది. శ్రీపతి వెళ్లిపోయాడు.

 

*****

శ్రీపతి పట్నం చేరాడు. ఇదొక ప్రపంచం. తను వెళ్లి వచ్చినది మరొక ప్రపంచం.  మళ్లా ట్రాములూ, టాక్సీలూ, బజారులూ, గుండె కొట్టుకున్నంత వేగంగా నడవడాలూ, ఎలక్ట్రిక్ దీపాలూ. పట్టణం అందమైనదే.. అందులో పల్లెల్లో లేని ఎన్నో అవకాశాలున్నాయి. పల్లెటూరు అందమైనదే. అందులో పట్నంలో దొరకని ఎన్నో స్వచ్చమయిన అందాలున్నాయి. శ్రీపతి తన యింటికి వచ్చి చేరాడు. మామూలుగా తన పనుల్లో మునిగిపోయాడు.

ఉదయబాల పరీక్షా ఫలితాలు వొచ్చాయి. బి.యే. పాసయ్యింది. ఆవిడ సంతోషానికి అంతులేదు. వెంటనే ఫోన్‌లో బావని పిలిచి యీ వార్త చెప్పింది. అతను చాలా హృదయపూర్వకంగా అభినందించాడు. "ఏం చేస్తావు?"అన్నాడు. "ఇంకా ఆలోచించాలి" అంది ఉదయబాల.

అవునూ తరవాత ఏదో చెయ్యాలి. బహుశా ఎం.ఏ కి వెళ్లాలా? నాన్న ముందు పెళ్ళి చేయడానికి తొందరపడుతున్నాడు. బావ, తనూ హాయిగా ఉండొచ్చు. తను చదువుకోవడం బావకి యిష్టమేగా, బావ తనని తప్పకుండా చేసుకుంటాడు. తనవంటి అపురూప సౌందర్యవతి, నవనాగరిక లక్షణ, లక్షిత, కోరి వరించితే కాదనగల శ్రీశుకుడు కాదు శ్రీపతి.

ఆవేళ ఉదయబాల శ్రీపతి యింటికి వచ్చింది. శ్రీపతిని తనా రోజు సాయంత్రం చెయ్యబోయే టీపార్టీకి ఆహ్వానించింది. శ్రీపతి సరేనన్నాడు. తను వెళ్లిన పల్లెటూరు చాలా అందంగా ఉందన్నాడు శ్రీపతి. "పల్లెటూరు అందమేమిటో బావా... నీ మాటలు మరీను" అంది ఉదయబాల. ఇలాంటి మాటలు ఆవిడకి నచ్చవు. సరే.. సాయంత్రం తప్పకుండా వస్తావుగా?" అంది ఉదయబాల.. టకటకా వెళ్ళిపోతూ.

శ్రీపతి కళ్లల్లో ఆ పల్లెటూరి అమ్మాయి మెదిలింది. ఆ అమ్మాయి నడిస్తే యిలా టకటకలు వినపడవు.

ఆవేళ శ్రీపతి టీపార్తీకి  వెళ్లలేదు. వెళ్దాం అనుకుంటూ పడుకున్నాడు. ఒక అద్భుతమైన కథకి ఆలోచన తట్టింది. అది ఎంత బాగుందంటే వెంటనే కథ రాసెయ్యక ఉండలేకపోయాడు. అంతే.. కథ పూర్తయ్యేసరికి సాయంత్రం ఆరున్నర అయిపోయింది. అరరె.. ఉదయబాల మనసు కష్టపెట్టానే అని నాలిక కరుచుకున్నాడు. గబగబా ఫోన్ దగ్గిరకెళ్ళి, ఉదయబాలని పిల్చాడు. ఆవిడకి చాలా కోపం వచ్చింది. తను చెప్పిన కారణం ఆవిడకి అర్ధం కాలేదు. అంత ఒళ్ళు మరిచి ఎవరేనా రాసుకుంటూ కూచుంటారని ఆవిడ ఊహించలేదు. మొత్తం మీద ఆవిడని తృప్తి పరచలేకపోయాడు తన మాటల్తో. శ్రీపతి తన పొరపాటుకి చాలా బాధపడ్డాడు.

కొద్దిరోజుల్లో శ్రీపతి పెళ్లి ఊహల్లోంచి మాటల్లోకి దిగింది. శ్రీపతి మేనమామ ఒకరోజున శ్రీపతి నాన్ననడిగేడు. ఆయన అంగీకరించేసినట్టే.. శ్రీపతికి యీ పెళ్లి యిష్టమేనని అతని నాన్నగారికి తెలుసు. అయినా వాడి నోట విందామని  ఒక రోజున ఆయన  శ్రీపతినడిగారు. "ఏమిరా.. మరి మామయ్య తొందరపడుతున్నాడు. .. ఈ నెల్లో ముహూర్తాలున్నాయి."

"నాకిప్పుడు పెళ్ళి వొద్దు నాన్న.. నేను చేసుకోను"

అదిరిపోయాడాయన. ఏమిటిరా? ఆ అమ్మాయి వద్దా? అసలు పెళ్ళే వద్దా?

శ్రీపతికి పెళ్ళి అసలు చేసుకోకూడదనే ఉద్దేశ్యం ఎన్నడూ లేదు. కాని యీ అమ్మాయి, అంటే 'బాల' వద్దు. ఈ అభిప్రాయానికి తను ఎప్పుడు వచ్చాడు? సరిగ్గా చెప్పలేదు. బహుశా నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడే. అయితే ఎవర్ని చేసుకోవాలి? మెఱుపులా ఆలోచన తట్టింది. ఆ పెల్లెటూరి అమ్మాయినే చేసుకోవాలి. ఆలోచించేకొద్దీ ఈ అభిప్రాయం బ్రహ్న్మాండంగా కనిపించింది. ఇందుకనే తను ఉదయబాలని చేసుకోనన్నాడు. ఆ అమ్మాయిని ఊహించుకునేసరికి శ్రీపతికి మత్తెక్కినట్టయింది ఆనందంతో. మెరుపు తీగలాంటి మనిషి. మల్లెపూలు పూసినట్టు నవ్వు. నాగుపాములాంటి జడ. శ్రీపతికి ఈ ఊహ పట్టరానంతగా, లోకోత్తంగా తోచింది. శ్రీపతికి ఆ పేరు .. రేణుక.. తలుచుకునేసరికల్లా వొళ్లు పులకరిస్తుంది. ఎంత స్వచ్చమయిన అందం ఆ  అమ్మాయిది.!

శ్రీపతి నాన్నగారు ఎంత మొత్తుకున్నా తమకు తగని సంబంధం అని ఎంత గోల పెట్టినా, శ్రీపతి వినలేదు. శ్రీపతిలో ఇంత గట్టి పట్టుదల, నిరాఘాటంగా తన యిష్టాలు నెరవేర్చుకునే శక్తి ఉన్నాయని అతని స్నేహితులు ఎప్పుడూ అనుకోలేదు. ఉండి ఉండి, యింత గొప్ప సంబంధం తమ పిల్లకొస్తుందని ఆ తల్లిదంద్రులు అనుకోలేదు. ఏదో గమ్మత్తుగా తమ యింటికొచ్చి, ఒక్క పూట ఉన్న అబ్బాయి అమాంతం అల్లుడైపోతాడని వాళ్ళెప్పుడూ ఊహించలేదు. ఇంక ఆ అమ్మాయి సంగతి చెప్పనక్కరలేదు. తను ఒక మహాపట్టణంలో ఒక ధనవంతుల యింటికోడలు. తన భర్త, ఒక పేద్ద ఉద్యోగి. కలెక్టరో.. ఆ పైనో! ఊరికినే వచ్చినట్టు వచ్చి ఎంత పని చేశారు ఆయన. దొంగ! రేణుకి తనన్న మాటలు తలుచుకుంటే సిగ్గేస్తుంది.. నవ్వొస్తోంది. "పట్టణంలో వాళ్లు మంచివాళ్లు కారు" "నీకెవరు చెప్పారు?" ఆ మాటలే మళ్లా మళ్లా జ్ఞాపకం వొస్తున్నాయి. ఆ దృశ్యమే మళ్లా మళ్లా కళ్ళల్లో మెదుల్తోంది. ఆయనేమనుకున్నారో!

శ్రీపతికి పెళ్ళి అయిపోయింది రేణుకతో. ఉదయబాల అహం దెబ్బ తిన్నది. లేకపోతే తనంతటిది తానుగా వరించితే శ్రీపతి కాదంటాడా? అదీ కాక ఒక పల్లెటూరిదాన్ని ఏం అందంగా ఉందని తెచ్చి కట్టుకున్నాడు. ఉదయబాలలో ఈ భావం చాలా విపరీతమైపోయింది. స్త్రీలు అహం  దెబ్బ తింటే సింహాలైపోతారు. వాళ్లకి ప్రేమైనా, ద్వేషమైనా, ఒక పట్టాన కలగవు. కలిగినాయీ అంటే అవి ఒక పట్టాన పోవు. అందులో ఏది కలిగినా వాటికి మనం చెప్పుకునే కారణాలు ఏమీ ఉండవు. ఇక వివక్షతా, విచక్షణా ఉండదు. ఆ వ్యక్తిని మొదలంటా ద్వేషించడమో, మొత్తమంతా ప్రేమించడమో చేస్తారు. మన తర్కం, విజ్ఞానం, న్యాయం అన్నిచోట్లా రుజువుకి నిలబడతాయి. కాని స్త్రీల విషయంలో ఇవేవీ నిలబడవు.

రేణుక యింటికొచ్చిన దగ్గిర్నుంచీ, ఆవిడని ఏదో రకంగా ఏడిపించడం పనిగా పెట్టుకుంది ఉదయబాల. రేణుకకి పట్టణం దేవేంద్రలోకంలా కనిపించింది. టెలిఫోన్ మోగితే ఏమిటో అనుకుని గాభరాపడింది. రేడియో పాడుతుంటే దాని వెనకాతల మనిషున్నాడేమోనని చూసింది. ఎలక్ట్రిక్ పొయ్యి చూసి నోరి విప్పి ఆశ్చర్యపోయింది. ఉదయబాల రేణుకని ఆడించేది. వేళాకోళం చేసేది. పల్లెటూరి బయతనేది. ఇలా పనికట్టుకుని రేణుకలో ఒక రకమయిన అభిమానం రెచ్చగొట్టింది. రేణుక బాల మల్లే ఇంగ్లీషు నేర్చుకోలేకపోయినందుకు విచారించింది. ఏమయినా సరే తను పట్టుపట్టి బాలమల్లే అన్నీ నేర్చుకోవాలి. అప్పుడు చూపించాలి తడాఖా.

రేణుక వచ్చిన దగ్గరనుంచీ శ్రీపతిని, ఉదయబాల జమదగ్నీ అని పిలిచేది. అతనేది పట్టించుకునేవాడు కాదు. అతనికి రేణుకే ప్రపంచం. ఆ పిల్ల అమాయకత్వం, పల్లెటూరి అలంకరణ, అలవాట్లూ, మువ్వలపట్టీలు, నాగరం, జడగంటలు, పరికిణీ. ఆమె ఏదో కొత్త లోకంలోంచి ఊడిపడ్డట్టు ఆరాధించేవాడు. రేణుక కదిలితే అతనికి మెరుపులు కనపడేవి. రేణుక నవ్వితే పువ్వులు వికసించేవి. ఆమె కళ్లల్లో, పళ్ళల్లో, చెక్కిళ్ళల్లో అతని ముఖం కనపడేది. రేణుక దగ్గిరగా నీలబడితే ఏదో ఆపాదమస్తకం విద్యుత్ప్రవాహానుభూతి పొందేవాడు. రేణుక తను స్వర్గం నుంచి ఏరికోరి తెచ్చుకున్న దేవతలా కనిపించేది. అతనికి యింక మిగతావాళ్ల మాటల్తో పని లేదు. రేణుక చాలు.

కాని రేణుక స్థితి వేరు.. ఆడవాళ్లకి భర్త ప్రేమ  ఒక్కటే కాకుండా యింకా ఏవో కావాలి. అవి, సాటివాళ్లలో గొప్పతనం, హోదా. అప్పుడే పల్లెటూరినించి వచ్చిన అమాయకపు పిల్లలో యీ సహజమైన అభిప్రాయం  ఇంకా బలంగా ఉంది. తనకి తెలిసిన ఆడవాళ్ళంతా తనని ప్రతి నిమిషం పల్లెటూరి గబ్బిలాయి అంటూంటే భరించలేకపోయింది. ఉదయబాలకి తను యింగ్లీషు చదువుకున్నానని, దొరసానిలా ఉంటానని ఎంత గర్వం? అనుకుంది.

శ్రీపతి దగ్గిర రేణుక యింగ్లీషు చదువుకోవదం ప్రారంభించింది. ఈ పని శ్రీపతికీ సరదాగా తోచింది. మెల్లిగా, ఒక్కటొక్కటే పట్నపుటలవాట్లు నేర్చుకుంది. పౌడర్లతో ప్రారంభించిన రేణుక అలంకరణ యిప్పుడు పూర్తిగా పట్నపు పద్ధతిలోకి వచ్చేసింది. ఆమెకి పట్టణం ఒక దేవేంద్ర లోకం. ఎత్తు మడమల బూట్లు, ఎర్రరంగు పెదిమలు, కత్తిరించుకున్న జుట్టు.. యిలా ఒకదాని తరవాత ఒకటి. రేణుక పూర్తిగా మారిపోయింది. తను ఎంతో అభివృద్ధి చెందాననుకుంది. తన పూర్వపుటాకారం, తెలివితక్కువతనం తలుచుకుని నవ్వుకునేది. ఇంగ్లీషు నేర్పినందుకు తన భర్తని అభినందించింది.

ఇప్పుడు రేణుక ఇంగ్లీషు బాగా మాట్లాడగలదు. చకచకా అందరితో వ్యవహరించగలదు. స్వయంగా పట్టణమంతా కొనేసి రాగలదు. పేరు కూడా "మిసెస్ రేణుకా శ్రీపతి" అని రాసుకోగలదు. రేణుక ఆరోగ్యంలో కూడా చాలా మార్పు వచ్చింది. ఇప్పుడావిడ అమెరికానుంచి వచ్చిన ఒక పుస్తకం సహాయంతో వ్యాయామం చేస్తోంది. ఇపుడు రేణుక పౌడరు యింకా ఏవేవో రాసుకు తీరాలి. లేకపోతే మొహం బాగుండదు. ఇప్పుడు రేణుక జుట్టుకి పిన్నులు పెట్టుకోకపోతే భయం వేస్తుంది. "ఎటికేట్"కి భంగమని మునుపులా నవ్వడమూ మానేసింది. ఎత్తు మడమల బూట్లలో దూరి రేణుక పాదాల ఆకారం మారిపోయాయి. రేణుక కళ్ళు యిప్పుడు యింక గుచ్చుకోవు.

శ్రీపతిలో యీలోగా ఎంతో మార్పు వచ్చింది. ఏదేనా వస్తువు విలువ అది పోయాక గాని తెలియదు. రేణుకని ఎందుకని అంతగా ఆరాధించాడో ఆవిడ మారిపోయాకగాని శ్రీపతికి అర్ధం కాలేదు. రేణుక అమాయకత్వం, సహజత్వం పోతుంటే వాటికోసమే రేణుకని తను తెచ్చుకున్నాడని శ్రీపతికి బోధపడసాగింది. కాని రేణుక అలా మారిపోవడానికి తనే కారణం అనుకున్నాడు శ్రీపతి. ఆమెని మ్యూజియంలో అపూర్వ వస్తువులాగా అట్టే పెట్టబోయి విఫలుడయ్యాడు. ఆమె అలా మారిపోతే బాగుండదని తనకి తెలిస్తేగా ఆమెకి బోధపరచడానికి.

బహుశా రేణుకకి కూడా తనలో యీ కొత్త అలవాట్లు వచ్చి, సహజత్వాన్ని తరిమేశాయని కొన్నాళ్లకి తెలుస్తుంది. ఒక రకమైన 'గ్రెషాం సిద్ధాంతం' ఈ విధంగా రేణుకకి కూడా తెలుస్తుంది. కాని అప్పటికే చాలా ఆలస్యమయిపోతుంది.  అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. గడియారం ఎవరూ వెనక్కి నడిపించలేరు. రేణుక తప్పేమీ లేదు. పట్టణంలో ఏమీ తెలియకుండా అడుగుపెట్టిన ప్రతి పల్లెటూరి అమ్మాయి రేణుకలాగే ప్రవర్తిస్తుంది.

కాని.. యిప్పుడు రేణుక శ్రీపతికి మునపట్లా ఆరాధ్యదైవం కావటం లేదు. రేణుకని పలకరించగలడు, కాని మునపట్లా వళ్లు పులకరిస్తుంటే కాదు. ఇపుడు రేణుకని కౌగలించుకున్నా తనకే వికారమూ కలగదు. రేణుక ముందు నించుంటే తానొక స్త్రీ ముందు నించున్నాడనే భావం కలగడం మానేసింది శ్రీపతికి. అయినా రేణుక స్త్రీ.. నవనాగరిక స్త్రీ..

.

***

శ్రీ వేల్చేరు నారాయణరావు విస్కాన్సిన్ విశ్విద్యాలయం మేడిసన్‌లో South Asian Studies విభాగంలో ప్రొఫెసర్.  పువ్వూ - కాగితం పువ్వూ కథ 1954 తెలుగు స్వతంత్రలో మొదటిసారి అచ్చయ్యింది. ఈ కథని ఆధారంగా చేసుకొని కృష్ణంరాజు 'జడగంటలు' అనే సినిమా తీశారు ఈ మధ్యనే...

bottom of page