top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

మధురవాణి ప్రత్యేకం

అదన్నమాట సంగతి  - మధురమే రఫీ గానం.

Jyothi Valaboju

జ్యోతి వలబోజు

పదోక్లాసు దాటి ఇంటర్ లో చేరిన రోజులు. అడుగడుగునా భద్రతల వలయాలు, అంక్షల బాల్యపు ఛాయలను వదిలించుకుంటూ రంగు రంగుల ప్రపంచంలోకి కొంత అయోమయం, చాలా ఆసక్తితో అడుగిడుతున్నవేళ…  ఎటు చూసినా అందమే... పువ్వులైనా, సీతాకోకచిలుకలైనా చూసినంతనే మనసు పులకించి నాట్యమాడుతుంది. ఏవో ఏవో కొత్త కొత్త భావాలు. ఎవరికి చెప్పాలి? ఎవరిని అడగాలి…?

ఇంతలో ఒక ప్రేమలేఖ అందింది ఒక ఫ్రెండ్ ద్వారా. కాలేజీలో అంతా అమ్మాయిలే మరి నాకు మాత్రమే ప్రత్యేకంగా ఈ ప్రేమలేఖ రాసిందెవరబ్బా??

హసీనా లిఖూ యా దిల్రుబా లిఖూ, హైరాన్ హూ కి ఆప్ కో ఇస్ ఖత్ మే క్యా లిఖూ

అంటూ మొదలైన ఈ ప్రేమలేఖ గుండెలో అలజడి సృష్టించింది. తర్వాత ఏముందో చూడాలన్నా భయమేసింది.  ఇంత అందమైన, మనసును హత్తుకునే మాటలతో కొత్తకొత్తగా గిలిగింతలు కలిగించింది. అమ్మో! ఎవరైనా ఇది చూసారంటే నాకేమో అయిందని అనుమానిస్తారు.  ఎంత మధురమైన గాత్రం అది. అచ్చంగా అమృతం తాగి పాడుతున్నట్టుగా ఉంది. దాదాపు ముప్పై ఏడేళ్ల క్రితం పరిచయమైన అతను ఇప్పటికీ అదే విధంగా నన్ను కలవరపెడుతున్నాడు. అదేం మాయో మరి..

సంగం సినిమాలో యె మేరా ప్రేమ్ పత్ర్ పడ్ కర్ అంటూ పరిచయమైన అతను  ప్రతీ పాటతో మరింత చేరువ కాసాగాడు. అతనెవరో, ఎలావుంటాడో నాకనవసరం. ఆ నటీనటులు, సంగీతం కూడా నాకు అక్కరలేదు. అతని పాట మాత్రం చాలు. ఓ మైమరపు. ఓ తాదాత్మ్యత. ఓ ప్రేమైక భావన… ఇలా ఎన్నో భావోద్వేగాలు పెల్లుబికి వస్తాయి. దీనికి వయసుతో అస్సలు నిమిత్తం లేదు. లోకజ్ఞానం, లౌక్యం అస్సలు తెలీని ఆ పదహారేళ్ల అమ్మాయిగా కాని, మధ్యవయసులో ఉన్న నేటివరకు అతని మీద ప్రేమ పిసరంతైనా తగ్గలేదు.  ఎవరా మాయగాడు. పాటలోడు. ఇంకెవరు ప్రఖ్యాత హిందీ సినీగాయకుడు మహమ్మద్ రఫీ.

సినిమా  పరిజ్ఞానం చాలా తక్కువగా ఉన్న ఆ రోజుల్లో నాన్నగారి అభిరుచి కారణంగా హిందీ, తెలుగు పాటలు ఎల్.పి. రికార్డుల ద్వారా వినడంతో ఆ గాన  మాధుర్యం, సాహిత్య పరిచయం కలగసాగింది. హైదరాబాదులోనే పుట్టి పెరగడంతో హిందీ అర్ధం కావడం అంత కష్టమేమీ కాలేదు.

ఒక అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయికి మొదటిసారి ప్రేమలేఖ రాసినప్పుడు ఎంత బిడియమో, భయమో?  తన ప్రేయసిని ఏమని సంభోదించాలి, ఎవరితో పోల్చాలి అన్న సంశయం.. చంద్రుడితో పోలుద్దామంటే అతనికి మచ్చ ఉంది. సూర్యుడితో పోలుద్దామంటే అతనిలో వేడి ఉంది.  కాని ఒక్కటి మాత్రం చెప్పగలను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు.. ఎంత అద్భుతమైన భావన.. అమ్మో! అప్పుడు గాని మా అమ్మ ఈ రాతలను చూసుంటే ఏదో తేడాగా ఉందని నా చదువే మానిపించేదేమో. ఇప్పుడు సహజీవనం కూడా మరీ అభ్యంతరకరం కాదు. కాని అప్పుడిలాటి రాతలు, అసలు సినిమాలు చూడడం కూడా మంచిది కాదు అని చాలా స్ట్రిక్టుగా ఉండేవాళ్లు. అందుకే కదా చదువు కూడా ఐదో క్లాసునుండి డిగ్రీ వరకు అంతా లేడీస్ స్పెషల్... పెద్దవాళ్ల భయాలు వాళ్లకుంటాయి కదా…

ఈ ప్రేమలేఖ ఎఫెక్ట్ నన్ను వదలలేదు. బయటకు వెళ్లినప్పుడో ఎవరింట్లోనైనా  టేప్ రికార్డర్ ఉందని తెలిసినప్పుడో మహమ్మద్ రఫీ పాటలున్నాయా? అని అడగడం అలవాటు మొదలైంది. మా నాన్నకు కూడా ఇష్టం కాబట్టి ఏమనలేదు.  తను పది కొనుక్కుంటే నాకు ఒక రఫీ కాసెట్ కొనిచ్చేవారు. అప్పట్లో టీవీ లేదు. కాబట్టి రేడియోనే దిక్కు.  ఈ ప్రేమగీతాలను ఇష్టంగా వింటుంటే చూసి  ఇంట్లోవాళ్లు తిడతారని చిన్న కాసెట్ ప్లేయర్ నా పుస్తకాల టేబుల్ లో పెట్టుకునేదాన్ని. ఇక నేను .. రఫీ పాటలు.. అంతే... అందరి సంగతేమో కాని నాకు మాత్రం తన పాటలతో రఫీ ఇంకా సజీవంగానే ఉన్నాడు.

వానాకాలం... జోరున కురుస్తున్న వానలో తుమ్ జో మిల్ గయే హో.. తో యే లగతా హై... అంటూ ఎంత మధురంగా  పాడాడు..  ఉరుములు మెరుపుల మధ్య తన కారులో కూర్చున్న  ప్రేయసికి తన మనసులోని మాటను చెప్తూ  ‘నా అదృష్టం కొద్దీ దొరికావు, నా మీద కోపంతో దూరంగా కూర్చోకు.’ అంటే ఏ అమ్మాయి కరిగిపోదు చెప్పండి.  వాళ్లిద్దరి కలయిక ఒకోసారి భూమ్యాకాశాలు కలిసినట్టుగా ఉంటుందంట. నిజమే కామోసు… మనకెందుకు చెప్పండి.

తనను కలవడానికి వెళ్లాను. ఆలస్యమైందని కాస్త అలిగినా మురిపించి, మరిపించి ముచ్చట్లాడి తిరిగి వెళ్లబోతుంటే... అభీ నా జావో ఛోఢ్ కర్ ..

అంటాడు.  అప్పుడే వెళ్లకు, ఇంకా నా మనసు నిండలేదు.. ఇప్పుడే కదా వచ్చింది  వసంతమై చుట్టేసావు. ఇంకా రాత్రి కూడా కాలేదు. ఇంకా నేను ఏమీ చెప్పలేదు. వినలేదు కూడా అని ఆపేస్తున్నాడు. అమ్మో! రాత్రి వరకా. అప్పుడే తారకలు మెరుస్తున్నాయి.  నన్ను ఆపకు, ఇంకాసేపు ఆగానంటే నేను వెళ్లలేనేమో. అయినా కూడా ఇంకా నా మనసు నిండలేదు. నే వెళ్తా.. ఈ అబ్బాయిలంతా ఇంతే. వాళ్ల ప్రేమతో మరీ మొహమాట పెట్టేస్తారు, నిష్టూరాడతారు బాబు... వాళ్లకేంటి. రాత్రంతా బయట ఉన్నా ఎవరేమనరు. ఆడపిల్లకు అలా కాదు కదా. మనసుతలో తనతోనే ఉండిపోవాలని ఉన్నా తొందరగా ఇంటికెళ్లాలి. వెళ్లక తప్పదు.

ఇంకోసారి ఏం చేసాడో తెలుసా.. ప్రేమించానంటూనే ఆరోపణలు..  ఏయ్ నర్గీసే మస్తానా బస్ ఇతనీ షికాయత్ హై... అంటూ మత్తెక్కించేదానివంటూ పొగుడుతూనే నీ మీద కంప్లెయింట్ అంటాడు.  ఇది దారుణం కదా. నన్ను పరాయివాడిగా చూసినా నా బాధకు ఉపశమనం నీవే, నా ప్రియనేస్తానివి నీవే కాని నీ మీద ఆరోపణలున్నాయి. నీవే ఓ అగ్నిజ్వాలవి, నీవే ఓ మంచుముత్యానివి. కాని నీ మీద ఆరోపణలున్నాయి. అతని కళ్లల్లో, మాటల్లో..ఎంత ప్రేమో తన చెలియ మీద.. ప్రపంచంలోని ప్రేమికులందరూ ఇలాగే అనుకుంటారా అన్న సందేహం నాకు ఈ  పాటలు విన్నప్పుడల్లా అనిపిస్తుంది.

ఎంత సినిమా పాటలైనా అవి మన జీవితంలోని వివిధ సంఘటనలు, భావనలు, సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. రఫీ పాటలనగానే ముందుగా గుర్తొచ్చేది ప్రేమగీతాలే. చౌద్వీన్ కా చాంద్ హో అంటూ హాయిగా నిదురిస్తున్న ప్రేయసిని నింగిలోని చందమామతో పోలుస్తూ ఎంత మృదువుగా, ప్రేమగా పాడుతున్నాడో.  ఒకరిమీద ఒకరికి అవ్యాజమైన ప్రేమ ఉన్నప్పుడు అది ఎంత అందమైన కవితగా రూపు దిద్దుకుంటుంది. అబ్బాయి తన  ప్రేయసిని ఎవరితోనూ పోల్చలేని అందగత్తెగా భావిస్తూంటే అమ్మాయి ఆ మాటలకు మనసులో మురిసిపోతూనే పైకి బెట్టు చూపిస్తూ ఉంటుంది. నువ్వు నిండుపున్నమి జాబిల్లివో, ఆ సూర్యగోళానివో... ఆ దేవుని సాక్షిగా నువ్వు ఎవ్వరితో పోల్చలేని అద్భుతానివి అంటున్నాడు.  ఆ శిరోజాలు ఆమె భుజాలమీద వాలిన నల్లని మేఘాలంట. ఆమె కళ్లేమో ప్రేమ మత్తును కలిగించే మధిర కలశాలంట. ఎంత అందమైన వర్ణన కదా. ఈ మాటలకు ఆ అమ్మాయి సంతోషంతో మరింత అందంగా కనిపిస్తోంది. నాయకుడి హృదయంలోని మాటలను రఫీ తన మధురగానంతో మనదాకా చేర్చాడు అంటే అతిశయోక్తి కాదేమో.

ఇలా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో, ఎన్నెన్నో అద్భుతమైన ప్రేమగీతాలు. వీటిని మనం ఇంతగా ఇష్టపడడానికి గీత రచయిత, సంగీతం, చిత్రీకరణ మాత్రమేనా కారణం. ఎవరేమన్నా కాని, కాదని నేను నిక్కచ్చిగా చెప్తాను. ఈ గీతాలు ఇంతగా ఆనాడు, ఈనాడు ఏనాడూ కూడా మనలని అలరించడానికి కారణం ఆ  పాటలను మహమ్మద్ రఫీ పాడడమే అంటాను.  ఈ పాటల సినిమాలు కూడా బావుండొచ్చు కాని ఈ పాటలు వింటున్నప్పుడు హీరో కంటే ఎక్కువ గాయకుడే కనిపిస్తాడు. బొమ్మ చూడకుండా వింటూ గడిపేసేవారిలో నేనూ ఉన్నాను. అందుకే రేడియోలో, ఫోన్ లో, పెన్ డ్రైవ్ లో, సిస్టమ్ లో వీలైనప్పుడల్లా  రఫీ పాటలు వింటూ,  పని చేసుకుంటూ ఉంటాను.

ప్రేమించి అందరినీ ఎదిరించి  పెళ్లి చేసుకున్న జంట తమ జీవితాన్ని మొదలుపెట్టబోయే తొలిరాత్రి.. చాలా ప్రత్యేకమైన రాత్రి. మరి ఆ రాత్రిలో మైనే పూచా చాంద్ సే అంటూ నాయకుడు పాడే  ఈ పాట చూడండి. ఎంత అందంగా, మధురంగా ఉందో..

ఇందులో ఒక ప్రియుడు తన ప్రియురాలి అందచందాలు మరెవ్వరికి లేవని అంటున్నాడు. దానిని నిర్ధారించుకోవడానికో, తన చెలి కంటే గొప్పవాళ్లు, అందమైనవాళ్లు లోకంలో ఎవ్వరూ లేరు అని నిరూపించడానికో ప్రకృతిలోని అన్ని సుందరమైన వస్తువులను అడుగుతున్నాడు.

మైనే పూచా చాంద్ సే

కె దేఖ హై కహీ

మేరే యార్ సా హసీన్

చాంద్ నే కహా

చాందినీ కి కసం నహి నహి నహీ..

నేను చందమామను అడిగాను, నా చెలి అంత అందమైన వారిని చూసావా అని. అప్పుడా చంద్రుడన్నాడు ఈ వెన్నెల మీద ఒట్టు , ఎవ్వరూ లేరు అని.

 

మైనే యే హిజాబ్ తేర డూండా

హర్ జగాహ్ షబాబ్ తేర డూండా

కలియోన్ సే మిసాల్ తేరి పూచి

ఫూలోన్ సే జవాబ్ తేర డూండా

 

నీ మేలిముసుగులో వెదికా, ప్రతి చోటా నీ యవ్వనాన్ని వెదికా, పూమొగ్గను నీ గురించి అడిగా, పువ్వులను కూడా నీ గురించి జవాబులు అడిగాను. సాధారణంగా నీలాంటివారెవ్వరూ లేరు. నువ్వు అద్వితీయం, అని పొగుడుతారు కదా. అలా నీ హిజాబ్ వెతికానంటే అర్ధం, నీ మేలిముసుగులాంటి మేలి ముసుగుకోసం వెతికానన్న అర్ధం వస్తుంది. అంటే ఆమె కున్న మేలి ముసుగులాంటిదెక్కడాలేదని, అనగా ఆమె అంతటి అందమయిన వదనాన్ని కప్పివుంచే మేలి ముసుగు మరొకటి లేదని, అనగా ఆమె అందంతో సాటీయిన అందగత్తెలెవరూ లేరని భావము.

 

మైనే పూచా బాగ్ సే, ఫలక్ హో యా జమీన్ ఐసా ఫూల్ హై కహీ

బాగ్ నే కహా హర్ కలీ కీ కసం నహి నహి నహీ...

నేను అందమైన తోటను అడిగాను ఈ భూమ్యాకాశాలలో నీలాటి పువ్వు ఉంటుందా అని. కాని ఆ తోట  అంది నా తోటలోని పువ్వులు,మొగ్గల సాక్షిగా లేదు అని..

 

చాల్ హై కి మౌజ్ కి రవానీ , జుల్ఫ్ హై కి రాత్ కి కహానీ

హోంట్ హై కి ఆయినే కవల్ కే, ఆంఖ్ హై కి మేయ్‌ఖదో కి రానీ

 

నీ నడక సముద్రపు అలల్లాగా, నీ కేశాలు రాతిరి కథలుగా, ఆ పెదాలు తామరపూవులాంటి అద్దాలుగా, కళ్ళేమో నిశారాణిలా మత్తు కలిగిస్తూ ఉన్నాయి.

 

మైనే పూచా జామ్ సే  ఫలక్ హో యా జమీన్ ఐసీ మయ్ భీ హై కహీ

జామ్ నే కహా  మయ్‌ఖషీ కి కసం నహి నహి నహీ...

మధిరను అడిగాను నీ అంత మత్తు కలిగించే  మధువు వేరే ఉందా అని. కాని ఆ మధిర అంది పానశాల మీద ఒట్టు, లేదు లేదు ..

 

ఖూబ్‌సూరతి జో తూనే పాయి  లుట్‌గయీ ఖుదాకి  బస్ ఖుదాయీ

మీర్ కి గజల్ కహూ తుజే మై , యా కహూ ఖయ్యం కి రుబాయీ

నువ్వు చాలా అందాన్ని పొందినావు. ఆ అందానికే ఆ దేవుడి దైవత్వమే లూటీ అయ్యింది. నిన్ను ఆ  ప్రఖ్యాత  కవి మీర్ పాడిన గజల్‌తో పోల్చనా, లేక ఖయ్యాం పద్యాలతో పోల్చనా.

 

మై జో పూఛు షాయిరోన్ సే ఐసా దిల్‌నషీన్ కోయి షేర్ హై కహీ

షాయర్ కహే షాయరీ కి కసం నహి నహి నహీ..

ఎందరో కవులను అడిగాను నీలాంటి హృదయాన్ని హత్తుకునే కవిత ఉందా అని. కాని ఆ కవులు తమ కవిత్వం మీద ఒట్టు లేదన్నారు.

 

మైనే పూచా చాంద్ సే...

 

ఈ పాట రఫీ కాకుండా వేరేవాళ్లు పాడి ఉంటే ఇంత హిట్ అయ్యేదా. ఇంతమందికి నచ్చేదా. అదంతే మరి.. ప్రేమికులంతా తమ ప్రేయసి గురించి ప్రేమ వున్నంత కాలం ఇలాగే భావిస్తారు. అయితే ఇవన్నీ భౌతికాలు. కాబట్టి అవి నశిస్తాయి.   భౌతిక ప్రేమను ఆధ్యాత్మిక స్థాయికి ఎదిగించేదే అసలు ప్రేమ. అలాంటి అద్భుతప్రేమను ప్రతిబింబించే పాటలు అరుదు. ఇలాటిదే మరో పాట రుఖ్ సే జరా నఖాబ్ ఉఠా దో మేరే హుజూర్...

బాబుల్ కి దువాయే లేతీ జా

జా తుజ్‌కో సుఖీ సంసార్ మిలే

మైయ్‌కే కి కభీ నా యాద్ ఆయే

ససురాల్ మే ఇత్నా ప్యార్ మిలే

 

బాబుల్ కి దువాయే

 

బీతే తేరే జీవన్ కి ఘడియాన్

ఆరామ్ కి థండీ చావ్ మే

కాంటా భి  న చుప్ నే పాయీ కభీ

మేరి లాడ్లి తేరే పావ్ మే

ఉస్ ద్వార్ సే భీ ధుఖ దూర్ రహే

జిస్ ద్వార్ సే తేరా ద్వార్ మిలే

 

బాబుల్ కి దువాయే

 

నాజోన్ సే తుఝే పాలా మైనే

కలియోన్ కి తరహ్ ఫూలోన్ కి తరహ

బచ్పన్ మే ఝులాయా హై తుజ్‌కో

బాహోన్ నె మేరీ ఝూలోన్ కి తరహ

మేరే భాగ్ కి ఏయ్ నాజూక్ ఢాలి

తుజే హర్ పల్ నయీ బహార్ మిలే

 

బాబుల్ కి దువాయే

 

జిస్ ఘర్ సె బంధే  హై భాగ్ తెరే

ఉస్ ఘర్ మే సదా తేరా రాజ్ రహే

హోంటోన్ పే హసీ కి ధూప్ ఖిలే

మాథే పే ఖుషీ కా తాజ్ రహే

కభీ జిస్ కి జ్యోత్ న హో ఫీకీ

తుఝే ఐసా రూప్ షింగార్ మిలే

బాబుల్ కి దువాయే

ఆడపిల్ల ఎప్పుడూ ఆడపిల్లే. ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకుని వెళ్లిపోతుందని తెలిసినా, ప్రతి తల్లితండ్రి ఎంతో ప్రేమతో  పెంచుతారు. చిన్నప్పటినుండి  ఆ చిట్టి తల్లికి కావలసినవి కొనిచ్చి ఏ కష్టమూ రాకుండా. కాపాడుకుంటూ వస్తారు. ఆమెను తమలా కాక తమకంటే ఎక్కువ ప్రేమతో చూసుకునే అబ్బాయికోసం వెతికి వెతికి పెళ్లి చేస్తారు. ఎంతో సంతోషంగా సకల కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి, చివరకు ఆమెను అల్లుడు అతని కుటుంబ సభ్యుల చేతిలో పెట్టి తమ కూతురిలా చూసుకొని, తప్పులుంటే మన్నించమని కన్నీళ్లతో వేడుకుంటారు. అలాంటిదే ఈ పాట. పాటలోని ప్రతి అక్షరం ప్రతి ఆడపిల్లను, ఆడపిల్లలున్న తల్లితండ్రులను కదిలిస్తుంది.  మామూలుగా ఆడపిల్లకు అమ్మ దగ్గర ఎక్కువ చనువు ఉంటుంది. నాన్న దగ్గర ప్రేమ ఉన్నా, భయం కూడా ఉంటుంది. కాని ప్రతి తండ్రి, తన కూతురిని ప్రేమిస్తాడు కాని వ్యక్తపరచలేదు. ఆమెను సరైన వ్యక్తి చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తాడు. అప్పగించేటపుడు కూడా ఎంతో బాధపడతాడు. అమ్మ ఏడుస్తుంది కాని నాన్న మనసులోనే ఏడుస్తాడు. 

    

పుట్టింటి దీవెనలతో వెళ్లు తల్లీ, సుఖంగా ఉండు. పుట్టింటివారు కూడా జ్ఞాపకం రానంతగా నీకు అత్తారింట ప్రేమ దొరకాలి. కష్టాలు నీ తలుపు దాటి కూడా రాకూడదు. నిన్ను ఒక పువ్వులా నాజూగ్గా పెంచుకున్నాము. మా చేతుల్లో అల్లరుముద్దుగా చూసుకున్నాము. నీ జీవితంలో ఎప్పుడూ వసంతం ఉండాలి.  నీ జీవిత భాగ్యం ఎక్కడుందో అక్కడ నీవు ఎప్పుడూ మహారాణిలా రాజ్యం చేయాలి. పెదవులపై చెరగని చిరునవ్వు ఉండాలి. .. ఇలా ఎన్నో మాటలు చెప్పి పంపిస్తారు కూతురిని.

రఫీ పాటల్లో ఎన్నో హిట్ పాటలున్నా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయే  పాట ఇది. తన కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి  పంపేవేళ ఆ తండ్రి పడే బాధని తన స్వరంలో స్పష్టంగా చూపించాడు రఫీ. సీతారాముల కళ్యాణం చూతము రారండి అన్న పాట లేని తెలుగువారి పెళ్లి ఉండనట్టే బాబుల్ కి దువాయే లేతీ జా అన్న ఈ పాట లేని అప్పగింతలు ఉండవు. పెళ్లంతా అయ్యాక కన్నవారిని, స్నేహితులను అందరినీ వదిలి కొత్త ఇంటికి, అత్తవారింటికి, తన ఇంటికి వెళ్లే ఆడపిల్లకు ఏ తండ్రైనా ఇలాగే జాగ్రత్తలు చెప్తాడేమో.  ఈ పాట మైకులో వినిపిస్తున్నా, సన్నాయివాళ్లు కాని, బాజావాళ్లు కాని వాయించినా. టీవీలో , రేడియోలో విన్నప్పుడు మనసున్న ప్రతీవారి కళ్లు చెమ్మగిల్లక మానవు. పెళ్లి అయిన కూతుళ్లు, పెళ్లి కాని కూతుళ్లు, ఇంకా పసిపాపలు ఉన్న ప్రతి తల్లి తండ్రులను కదిలిస్తుంది ఈ పాట.  

 

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలున్నాయి. వెతకండి. వినండి. వింటూ ఉండండి.. చెదరిన మనసును సంగీతంతో చల్లబరిచి ఆనందపరచండి. సంతోష సమయంలో మరింతగా ఆస్వాదించండి.

 

అదన్నమాట సంగతి...

Bio
bottom of page