top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

వింత న్యాయం

hymavathi-aduri_edited.png

ఆదూరి హైమావతి

వాతావరణం చాలా బాగుంది. పార్కులో  కూర్చుని చుట్టూ ఉన్న పచ్చని చెట్లను చూస్తూ ఆనందిస్తున్నాను. హాయిగా పూల మీది నుంచీ వచ్చే సువాసన  పీల్చు కుంటూ, గాలికి అలవోకగా తలలూపే పూలగుత్తులను చూస్తూ, ప్రకృతిమాత అందచందాలకు పరవసించి, మైమరచి పోయాను. ఆకులన్నీ ఒకే రంగులో పచ్చగా ఉన్నా పూలు మాత్రం వివిధ రంగుల్లో పూస్తుండటం ఎంత చిత్రం, అలాగే  మనుషులంతా  ఆకారంలో పైకి రెండు కాళ్ళూ, చేతులు మిగతా అవయవాలతో  ఒకేలా ఉన్నా మనస్తత్వాలు మాత్రం వేరు వేరు.' అనుకుంటూ కూర్చున్నాను.  

 నా భుజమ్మీద చేయిపడటంతో నా ధ్యానలోకం నుంచీ  ఉలిక్కిపడి తిరిగి చూశాను.

చిరకాల మిత్రుడు మాధవ్. చిన్ననాటి స్నేహితుడు. ఉద్యోగ విరమణ తర్వాత ఇద్దరం పక్కపక్కనే ఇళ్ళు కొనుక్కుని ఉంటూ వచ్చాం. ఐదేళ్ళకు ముందు ఇదే పార్క్ లో రోజూ ఇద్దరం కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ  సాయంత్రాలు గడిపేవాళ్ళం . వాళ్ళ స్వగ్రామానికి వెళ్లాడు ఆస్థి పాస్తులను అమ్ముకోను.  ఇదో ఇప్పుడే చూస్తున్నాను మళ్ళీనీ. 

 "ఎంత కాలానికి కనిపించావ్ మాధవ్! బావున్నావా? ఎప్పుడు వచ్చావ్?"  అంటూ పలకరించాను.

"బావున్నాను  భాస్కర్ ! మా ఊరి నుంచీ కూతురింటికెళ్ళి కొన్నాళ్ళుండి నిన్ననే వచ్చాను. ఇంటికెళితే  పార్కుకెళ్ళావని చెప్పింది చెల్లెమ్మ"  అంటూ నా పక్కనే  సిమెంటు బల్లమీద కూర్చున్నా డు. 

" ఏరా భాస్కర్ ! మీరిద్దరూ  ఎలా ఉన్నారు? "

"ఉండేందుకేముందిరా ! అలా అలా  గడిచిపోతున్నాయ్ రోజులు. ఊరు పొమ్మంటున్నది, కాడు రమ్మటున్నది అన్నట్లుంది. ఎలాగో  గడిపేస్తున్నాం రా, ఇద్దరు పిల్లలున్న మీకు ఎలాగైనా  గడుస్తుంది. పిల్లల్లేని మాకు వృధ్ధాశ్రమాల్లో సేవలూ, అనాధాశ్రమాల్లో మా కొచ్చిన చదువులూ చెప్తూ బాగానే ఉన్నాం రా!   నా విషయం సరే , నీ పిల్లలెలా ఉన్నారు? ఉష ఎలా ఉంది? ‘మామయ్యా!’ అంటూ వచ్చేది" అన్నాను.

" బావుందిరా భగవంతుని దయవల్ల. చాలా సుఖంగా ఉంది."

" మంచిది . అల్లుడు బావున్నాడా! అతడి ఉద్యోగం బావుందా!"

"చాలా బావుందిరా! అల్లుడు చాలా చాలా మంచివాడు.అలాంటి అల్లుడిని ఇచ్చినందుకు భగవంతునికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పు కోవాలి రా!"

"చాలా శుభవార్త చెప్పావు. చిన్నప్పటి ఉషే నాకింకా కనిపిస్తున్నది "

"నిజం రా ! అప్పటికీ ఇప్పటికీ అదే స్వభావం, అనుకుందంటే తిరుగే లేదు. ఆమె అనుకున్నది  జరగాల్సిందే . భగవంతుడు అలాగే ఆశీర్వదించాడు దాన్ని."                                                                                                       

"పోనీలేరా ! పిల్లలు బాగుండటమే కదా మనకు కావాల్సింది. ఉషకు పిల్లలా!"

"ఉషలాంటి ఒక మూడేళ్ల బిడ్డ , పేరు రుమ. చాలా చలాకీ పిల్ల వాళ్ళమ్మ లాగే.  మరో బంగారు తల్లి ఏడాది బిడ్డ, అంతా వాళ్ళ నాన్నలా పగ డంలా ఉంటుంది , పేరు రత్నం.

"భలే రా! ఇద్దరు రత్నాలన్నమాట.“

"ఔనురా ! మంచి ఇల్లు కట్టుకున్నారు. ఉష కాన్పుకు వాళ్ళ అత్తగారే వచ్చి అన్నీ చేశారు.ఆవిడ కూతురికి కనే నెలలని బెంగుళూరు వెళితే మేం వెళ్ళి ఆరు నెలగా హైదరాబాదులోనే ఉష ఇంట్లో ఉన్నాం. నీ మొబైల్ కు చాలాసార్లు ఫోన్ చేశానురా ! నీవు లిఫ్టే చేయలేదు.”

"ఓ అలాగా! నా మొబైల్ పోయిందిరా. ఇలా పక్కన పెట్టుకుని కూర్చుని మరచిపోయి ఇంటికెళ్ళాను. ఒక గంట తర్వాత గుర్తొచ్చి వచ్చిచూస్తే  లేదు. అందరి నెంబర్లూ దాన్లో ఉండటాన ఎవ్వరికీ చేయలేక పోయాను."

"ఓ అదా! అంత మతిమరుపొచ్చిందన్నమాట!"

“పోయే కాలమేకానీ, వచ్చే కాలం కాదుగా! మొత్తానికి చెల్లెమ్మ చాలా కష్టపడిందన్నమాట!”                     

                                              

"దానికేం కష్టం రా !ఊరికే పర్యవేక్షణే, వంటమనిషి. ఒక ఆయా పెద్ద పాపాయిని తయారు చేసి కిండర్ గార్డెన్ స్కూల్ కు పంపేందుకు, చిన్న పాపను చూసుకోను మరో ఆయా. రోజంతా ఉంటారు .ఉష ఆఫీసు నుంచీ వచ్చేవరకూ ఉండి వెళతారు. రెండుకార్లూ,ఇద్దరు పని వారూ,మాకేం పనే లేదు. ఊరికే కూర్చోని చూట్టమే."

"బాగుంది.బాగుంది."

" వాళ్ళ అత్తగారు పదిరోజుల్నాడు వచ్చింది. మేం నిన్న నే బయల్దేరి ఇలా వచ్చాం."

" ఐతే వారంతా ఉషను బాగా చూసుకుంటున్నారన్నమాట. "

"ఊరికే బాగా అనకు, బహుబాగా. రాత్రులు పెద్దపాపాయిని వాళ్ళత్త గారు చూసుకుంటే, చిన్నదాన్ని అల్లుడే చూసుకుంటాడు . ఉషకు మంచి రెస్టు ఇస్తాడు. మేం ఉన్నప్పుడైతే ఇద్దర్నీ అల్లుడే చూసుకునే వాడు రాత్రులు. మమ్మల్ని ‘ హాయిగా నిద్రపొండి మామగారూ ! మీకీ వయస్సులో విశ్రాంతి అవసరం ‘ అనేవాడు. పెద్దపాపాయి బాత్ రూం కెళ్ళినా తనే తీసుకుకెళ్ళేవాడు.ఉషను కాలుకదపనివ్వరు వాళ్ళంతా, ఉద్యోగం చేస్తున్నదికదా! నెలకు రెండు లక్షలు.

"అల్లుడి ఉద్యోగం కూడా బాగానే ఉండి ఉండాలే?"

"ఔను జీతం ఐదు లక్షలు .మంచి హోదాకూడానూ."

"బాగుంది. ఇంతకీ, మీ అబ్బాయి వాసు ఎలా ఉన్నాడురా?"

"వాడా? వాడికేం.బానే ఉన్నాననుకుంటాడు.ఉత్తి వాజమ్మలా, పెళ్ళాం కొంగు పట్టుకు తిరుగుతూ... మాకే బాధంతా."

"అదేంట్రా! వాసు ఎంత మంచివాడు ! చిన్నప్పుడు పనిమనిషి రాక పోతే అమ్మకు సాయంచేసేవాడు, అమ్మను కష్టపడనిచ్చే వాడే కాదు."

"ఆ ఏడ్చాడు చిన్నతనంలో. ఐనా పెళ్ళయ్యాక భార్యను చెప్పుచేతల్లో ఉంచుకోవాలా! భార్య చెప్పుచెతల్లో ఉండాలా?"

" అమ్మాయి అవంతి కూడా ఉద్యోగం చేస్తున్నదనుకుంటాను."

"ఆ ఉధ్ధరిస్తున్నదిలే. ఒక కంపెనీకి మేనేజర్ట!. రోజంతా పనే, రాత్రులు కూడా ఫోన్లే. "

"ఓ! మేనేజరైందా?"

"ఆ ఊరేగుతున్నది.  ఒక అమెరికన్ బేస్డ్ కంపెనీ.."

"అలాచెప్పు, అందుకే రాత్రులూ ఫోన్స్."

"ఐనా ఆడదన్నాక ఇల్లూ పిల్లలూ మామా అత్తా అంటూ చూడద్దూ?"

" ఏం మిమ్మల్ని గౌరవంగా చూడదా!"

"ఏం గౌరవంలేరా! తెల్లారేసరికీ వంటావిడ వచ్చి కాఫీ ఇస్తుంది. ఎనిమిదికల్లా టిఫిన్ చేసి పెడుతుంది. మధ్యాహ్నం వేడివేడిగానే వడ్డి స్తుంది లంచ్. సాయంకాలం స్నాక్స్ ఇస్తుంది. రాత్రికి వేడిగా డిన్నర్ వడ్డిస్తుంది."

"ఓహ్ ! ఇంకేం ఏ వేళకవంతా అమరుతున్నాయన్నమాట."

"ఐనా ఇంటి కోడలు దగ్గరుండి వడ్డించక పోతే అదేం ఇల్లురా! ఉన్నార్లే పనివారు "

"ఇంతకీ వాసు కెంతమంది పిల్లలురా!"

" ఆ ఇద్దరు ఆడ పిల్లల్నికనింది . ఒక్క మగబిడ్డను, వంశోధ్ధారకుడ్ని కనలేకపోయింది."

"అదేమన్నా కోడలు చేతులో ఉందా ఏమన్నానా !"

"ఐతే మాత్రం మగబిడ్డను కనలేని ఆమేం కోడలురా!ఇహ మావాడున్నాడే రోజంతా పగలు పనిచేసి వచ్చి, ఇంటికి రాగానే ఆ పిల్లల్ని వదలడు, వాళ్ళకు అన్నం పెట్టనూ వారితో ఆడుకోనూ అంతా వాళ్ళే లోకం, భార్యను ఒక్కపనీ చేయనివ్వడు. సిజేరియనట వంగలేదుట. క్రింద కూర్చోకూడదుట! అన్నీ ఆడంగిలా చేస్తాడు. ఛీ… మగవాడన్నాక కాస్తైనా బెట్టుండాలా?"          

                                                                                    

"ఇంతకీ కానుపుకు  వాళ్ళమ్మ వచ్చిందా!"                                             

       

"మరి రాక? కోడలికెక్కడ మా ఆవిడ పురుళ్ళుపోస్తుందిరా!వాళ్ళ కూతురికి వాళ్ళే వచ్చి చేసుకోడం విధాయకం కాదూ !"

" నిజమేరా! ఐతే మీరు వెళ్లలేదన్నమాట"

"లేదురా ! వాళ్ళేవచ్చి పురుడు పోసి ఆరునెల్లుండి వెళ్ళారు, ఆపైన మేం వెళ్ళాం లే. ఇద్దరు పిల్లనూ చూడను ఇద్దరు ఆయాలు పగలంతా ఉంటారు. వాళ్ళు రాగానే వెళతారు. వంటమనిషి రోజంతా ఉంటుం ది.  ఐనా పగలంతా ఇద్దరమే ఉండాలి. పైగా పనివాళ్ళూ ఆయాలూ సరిగా చేస్తున్నారాలేదా అని చూడాలి కూడానూ."

" ఏమీ అనుకోకు కానీ నీమాటల్లో చాలా మర్మం ఉందిరా!"

"ఏముందిరా!"

"నీవు కూతురిని గురించీ చెప్పినదంతా అమ్మాయి అదృష్టంగా చెప్పావు. అదే కోడలి దగ్గరికొచ్చేసరికి మారిపోయింది.ఇదేం వింత న్యాయం రా!"

"నీవూ అదే అంటున్నావూ... సరేలే, నీకు చెప్పడమే నా తప్పు. నీవు కోడలి పక్షం వాడివి. " అంటూ లేచి వెళ్ళబోతున్న స్నేహితుని చేయి పట్టి ఆపి, ”కూర్చో, చెప్తాను. మన వయస్సూ, అనుభవమూ దృష్టిలో ఉంచుకుని, మన భావనలూ ,ఆలోచనలూ ఎలా ఉండాలో ఒక్క క్షణం ఆలోచించు. నీకు బదులుగా నేను ఈ మాటలు చెప్పి ఉంటే నీవెలా స్పందించేవాడివో ఆలోచించు. కోడలుని కూతురిలా చూచుకుంటే కోడలు అత్తమామల్ని అమ్మానాన్నల్లా చూసుకుంటుంది. నీ కూతురు చేసినట్లే ఉద్యోగం చేస్తూ ఇంటి పనులు చూసుకుంటున్న కోడలికి కొడుకు సాయంచేస్తే వాజమ్మా! అల్లుడు మాత్రం మంచివాడా! ఏరా! నీ విజ్ఞతా , సంస్కారం ఏమయ్యాయి? చదువులేని పల్లెవారు కూడా ఇలా మాట్లాడరు ఈ కాలంలో. వారు మాట్లాడవలసిన  మాటలు చెప్తున్నావు. కోడలు కష్టం పట్టదా! కూతురి సుఖమే చూస్తావా! మిమ్మేకాక ,ఇంటికి వచ్చినవారందర్నీ ఎంత ఆదరిస్తుంది నీకోడలు. నీ కొడుకెంత మంచివాడు.చిన్నతనం నుంచీ ఇద్దరు నాకుతెల్సు. మారాలిరా ,తప్పురా మరెవ్వరికీ ఇలా చెప్పకు. అంతా నిన్నే సంస్కార హీనుడనుకుంటారు. చాటుగా నవ్వుకుంటారు. ఇలా కఠినంగా మన మధ్య ఉన్న స్నేహ భావంతో మాత్రమే చెప్పాను." అంటున్న నా మాటలువిని, తలవంచుకుని కొద్ది సేపు మౌనంగా కూర్చున్నా డు. 

తర్వాత  " నిజమేరా! నేనిలా  మాట్లాట్టం ధర్మం కాదు. పొరపాటే. నాకు ఇలా ఎవ్వరూ చెప్పినవారే లేరు. మన్నించు. మరెప్పుడూ ఇలా కోడల్నీ, కొడుకునూ తక్కువచేసి మాట్లాడను."అంటూ నా చేతులు పట్టుకున్నాడు మాధవ్.

 

నా మాటలు సరిగా చేరినందుకు తృప్తిగా చిరునవ్వు నవ్వాను.

*****

bottom of page