top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

విమర్శ- తెలుగు సాహిత్యంలో దాని పాత్ర-ఒక పరిశీలన

BV Shiva Prasad

బి.వి. శివ ప్రసాద్

విమర్శ అంటే లోపాలు ఎత్తి చూపడం లేదా తప్పులను ఎన్నటం అనే అర్ధం వాడుకలో ఉంది. సాహిత్య విమర్శ అంటే కధ(ల)నో, కవిత(ల)నో,  నాటకాన్నో, మరేదైనా సాహిత్య రూపాన్నో వ్రాతపూర్వకంగా విశ్లేషించి మూల్యంకనం చెయ్యడం అని అర్ధం చెప్పుకోవచ్చు. ఒక సాహిత్య రూపం యొక్క మంచి, చెడ్డల్ని వివేచన చెయ్యడం కూడా విమర్శలో భాగమే అవుతుంది. విమర్శలో ప్రధానంగా నాలుగు భేదాలున్నాయి. అవి 1.వివరణాత్మక విమర్శ 2.అభినందాత్మక విమర్శ 3.తులనాత్మక విమర్శ 4.నిర్ణయాత్మక విమర్శ

విమర్శ - పుట్టు పూర్వోత్తరాలు

       ఒక అంచనా ప్రకారం తెలుగు సాహిత్యం వ్రాత రూపంలో తొమ్మిది శతాబ్దాల క్రితం పురుడు పోసుకుంది. తెలుగు సాహిత్య విమర్శ గత శతాబ్దిలోని చివరి భాగంలో వెలుగులోకొచ్చింది. తొలినాళ్ళ తెలుగు సాహిత్యం శాస్త్రీయతతో నిండి సంస్కృతాన్ని ఆధారం చేసుకుని సృజియింపబడింది. తదనుగుణంగానే విమర్శ కూడా ఆ భాషలోనే ఓనమాలు దిద్దుకుంది. ఆదిలో అది పూర్తి విమర్శ రూపాన్ని సంతరించుకోలేదు. మొదట్లో అది ధ్వని, ఔచ్య, వ్యంగ్య, వాచ్య, వక్రోక్తి, స్వభావోక్తి లాంటి రూపాల్లో మాత్రమే ఉండేది. అప్పట్లో విమర్శ, నైషధం, మనుచరిత్ర, వసుచరిత్ర లాంటి గ్రంధాలపై వ్యాఖ్యాన రూపంలో ఉండేది. సాహిత్యాన్ని విశ్లేషించి మూల్యంకనం చేసే ప్రయత్నాలు తొలినాళ్ళలో జరగలేదు.   

       శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారిని ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకు ఆద్యునిగా చెప్పవచ్చు. ఆయన ప్రబంధాలలో అనుసరించిన సాంప్రదాయ రీతులను వ్యతిరేకించాడు. ఆయనచే 1914వ సంవత్సరంలో రచింపబడిన ‘కవిత్వతత్వ విచారము’ ఆధునిక ప్రముఖ విమర్శనాత్మక గ్రంధంగా మన్ననలను అందుకుంది. ఆ గ్రంధము ఆంగ్ల సాహిత్యములో సిడ్నీ వ్రాసిన ‘అపాలజీస్ ఫర్ పొయట్రీ’, షెల్లీ యొక్క ‘డిఫెన్స్ ఆఫ్ పొయసీ’, వర్డ్స్వర్త్ రచించిన ‘ఎ ప్రిఫేస్ టు లిరికల్ బలాడ్స్’, మరియు కాలరిడ్జ్ లిఖించిన ‘లిటరరియా బయోగ్రఫియా’లతో పోల్చబడింది. 1899లో పింగళి సూరన ‘కళాపూర్ణోదయం’పై ఆయన చేసిన విమర్శ తదుపరి వెలువరించిన విమర్శలకు పునాది అని చెప్పవచ్చు. రామలింగారెడ్డి, రచనల్లో పాత్ర చిత్రణ, ప్రకృతికి, వాస్తవానికి అతి దగ్గరగా ఉండాలని  అభిప్రాయపడే వారు. కవిత్వంలో ఊహాశక్తికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిచ్చేవారు.

       కవులు విరివిగా ఉపమానాల్ని వాడడడం వాస్తవాన్ని మరుగుపరుస్తుందని ఆయన భావన. పాత్రలను అతిమంచివారుగానో లేక అతి చెడ్డవారుగానో చూపడాన్ని ఆయన అంగీకరించేవారు కారు. జీవితం మంచి, చెడ్డల, వెలుగు, నీడల సంగమమని, రచనలు కూడా అదే వాస్తవాన్ని వ్యక్తీకరించాలని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ఆయన కాలంనాటి రచనలన్నీ వాస్తవానికి దూరంగా ఉండేవి. సమాజంలో వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు, వారి బాధలు ఆనాటి సాహిత్యంలో ప్రతిఫలించేవి కావు.

విమర్శ - ఉద్దేశం, పరమార్ధం

       విమర్శయొక్క ముఖ్య ప్రయోజనం-అది మరింత మంచి, ఆరోగ్యకరమైన సాహిత్యం సృజియింపబడడానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయడమే. తద్వారా చదువరులకు, సాహిత్యాన్ని సృష్టించేవారికి, అంతిమంగా సమాజానికీ అంతులేని మేలు జరుగుతుంది. అందుచేత  సాహిత్య రంగానికి చెందిన సృష్టి పదుగురి నోళ్ళలో, మెదళ్ళలో నానడం, తూచబడడం తప్పనిసరి.

సృజనాత్మక సాహిత్యంపై విమర్శ ఎలా ఉండాలి?

       సృజనాత్మక సాహిత్యకారులు సహజంగానే సున్నిత మనస్కులు. కాబట్టి విమర్శకులు వ్యక్తిగత దూషణకు దిగకుండా రచనలోని మంచి, చెడ్డలను మాత్రమే ప్రస్తావించాలి. విమర్శకుల సూచనలు రచన చేసేవారికి, మునుముందు వారు చేసే రచనలు మరింత మెరుగ్గా రావడానికి ఉపకరించాలే తప్ప వారిలోని సృజనా తృష్ణను నిస్తేజపరిచే విధంగా ఉండరాదు.  

విమర్శకులంటే ఎవరు?

సాహిత్య సృష్టిని చదివే ప్రతి పాఠకుడు ఒక విమర్శకుడే. అతను(ఆమె) చదువుతున్నపుడు, ఆ రచన బాగుందా? లేదా? సామాజిక స్పృహ ఉన్న రచనయేనా? లాంటి మౌలిక ప్రశ్నలు వారి మనసులో కలుగుతాయి. ఐతే ప్రతి పాఠకుడినీ విమర్శకుడిగా పరిగణించలేము. ఎవరైనా సాధికారిక విమర్శకులు కావాలంటే వారికి తప్పనిసరిగా విస్తృత పఠనానుభవం, ఉన్నత స్థాయికి చెందిన ఇంద్రియ గోచరత, జ్ఞానము, సూక్ష్మ గ్రాహ్యత, ఏది మంచో, ఇంకేది చెడో, ఏది బాగుందో, మరేది బాగలేదో విశ్లేషించగలిగే నైపుణ్యం, ఒక న్యాయనిర్ణేతకుండవలసిన నిష్పాక్షిక దృష్టికోణం కావాలి.

       ఉత్తమ విమర్శకులనగానే మనకు ఓంప్రథమంగా కొన్ని పేర్లు స్ఫురణలోకొస్తాయి. రాళ్ళపల్లి అనంతక్రిష్ణ శర్మ, ఎం. గురుప్రసాదరావ్, ఆర్.సుదర్శనం, శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గార్ల పేర్లు అందులో కొన్ని. పూర్వీకులలో కీ.శే. శ్రీవాస్తవ, డా.కె.వీరభద్రరావులు భాషా విమర్శనా పధ్ధతులను సమకాలీన సాహిత్యాన్ని తూకం వెయ్యడానికి ఉపయోగించినవాళ్ళలో ముఖ్యులుగా నిలుస్తారు. ఇటీవలే స్వర్గస్తులైన శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు శ్రీశ్రీ కవిత్వంపై సాధికారిక విమర్శనా గ్రంధాన్ని వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి, ఆచార్య కొలకలూరి ఇనాక్, కీ.శే ఆచార్య చేకూరి రామారావ్, రాచమల్లు రామచంద్రా రెడ్డి, అక్కిరాజు ఉమాకాంతం, ఆచార్య ఎస్.గంగప్ప, ఆచార్య ఎస్.వి.రామారావు, డా.కత్తి పద్మారావు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మొదలగు వారు ఆంధ్ర సాహిత్యంలో పేరెన్నికగన్న మరికొందరు విమర్శకులు.

ఇతర భాషా సాహిత్య విమర్శ/తెలుగు సాహిత్య భాషా విమర్శ

       తెలుగు సాహిత్యాన్ని విశ్లేషించాడానికి అవసరమైన విమర్శనాత్మక కొలబద్ద ఏమిటి? అని ప్రశ్నించుకున్నప్పుడు మనం పాశ్చాత్య విమర్శకులవైపుకు కొంత దృష్టి సారించక తప్పదనే చెప్పాలి. ఇంగ్లాండ్, అమెరికా దేశాలలో విమర్శనాత్మక వాతావరణాన్ని సృష్టించి, సద్విమర్శ అనే ప్రక్రియ సజీవంగా ఉండడానికి ‘ది టైంస్ లిటరరీ సప్లిమెంట్’, ‘న్యూ స్టేట్స్మన్’, ‘లిసనర్’, ‘ఎన్కౌంటర్’, ‘సాటర్డే రెవ్యూ’, ‘న్యూయార్క్ టైంస్ బుక్ రెవ్యూ’, ‘ఎవర్గ్రీన్ రెవ్యూ’ మరియు ‘పార్టిసన్ రెవ్యూ’ లాంటి పత్రికలు, జర్నల్స్ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఇక విదేశాల్లోని ప్రముఖ విమర్శకులను గమనిస్తే మనకు ముందుగా తట్టే కొన్ని పేర్లు ఇంగ్లండ్ కు చెందిన వి.ఎస్.ప్రిట్చెట్, ఫ్రాంక్ కెర్మోడ్, అమెరికాకు చెందిన కీ.శే. ఎడ్మండ్ విల్సన్, బెనెడెట్టో క్రోస్, ఏ.సి. బ్రాడ్లే, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఫెర్డినాండ్ డి సాసుర్, క్లాడ్ లెవి-స్ట్రాస్ మరియు టి.ఇ. హుల్మే. వీళ్ళు లోతైన మేధా సంపత్తి, సాహిత్యం మీద విపరీతమైన ఆసక్తి, తీక్షణమైన దృష్టికోణము, గ్రహణ శక్తి, మెండైన అవగాహన కలిగిన వారు. వీరి స్థాయికి దగ్గరగా మన తెలుగు సాహిత్య విమర్శకులు రాలేదనే చెప్పాలి.

 

తెలుగులో వెలువడిన కొన్ని విమర్శ గ్రంధాలు

       విశ్వనాధ సత్యనారాయణ- నన్నయగారి ప్రసన్న కథాకవితార్థ యుక్తి, శాకుంతలము యొక్క అభిజ్ఞానత, కల్పవృక్ష రహస్యములు, What is Ramayanatoma, విశ్వనాధ సాహిత్యోపన్యాసములు, ఆచార్య ఎస్.గంగప్ప- క్షేత్రయ్య పదసాహిత్యం, తెలుగుదేశపు జానపద గీతాలు, సాహిత్యామృతం, సాహిత్యానుశీలన, తెలునాటకం సామాజిక చైతన్యం, ఆచార్య కొలకలూరి ఇనాక్- తెలుగు వ్యాస పరిణామం, సాహిత్య దర్శిని, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, డా.కత్తి పద్మారావు- జాషువా సామాజిక తత్వం, భారతీయ సంస్కృతిలో స్త్రీ, సాంఘిక విప్లవ రచయితలు, ఆచార్య ఎస్.వి.రామారావు- తెలుగు సాహిత్య విమర్శ అవతరణం, వికాసం, కీ.శే ఆచార్య చేకూరి రామారావ్- చేరాతలు సాహిత్య విమర్శ – పరామర్శ, చేరా పీఠికలు, రాచమల్లు రామచంద్రా రెడ్డి- సారస్వత వివేచన, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి- మన నవలలు-మన కథానికలు. రంగనాయకమ్మ-రామాయణ విష వృక్షం.

ప్రస్తుత తెలుగు సాహిత్య విమర్శ స్థితి ఎలా ఉంది?

       ‘కవిత్వతత్వ విచారము’ రోజుల్నుంచి విమర్శ కొంత దూరం ప్రయాణించిందని కచ్చితంగా చెప్పవచ్చు. ఐతే అవసరమైనంత మేరకు అది పురోగమిస్తున్నదా? అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానము వస్తుంది. ఉదాహరణగా-ఒక ప్రముఖ కవి వ్రాసిన ‘సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర’ను పరిశీలించవచ్చు. అందులో శ్రీక్రిష్ణదేవరాయలకు చెందిన విభాగంలో, కేవలం రాయల జాతకాన్ని వివరించడానికే 30 పేజీలకు పైగా కేటాయించబడింది. అది పూర్తిగా విమర్శకు సంబంధించిన గ్రంధం కాకపోయినప్పటికీ పైన పేర్కొన్న అంశానికి అన్ని పేజీలు కేటాయించి, పుస్తకం యొక్క పరిమాణాన్ని పెంచడం ఔచిత్యం కాదేమో అనిపిస్తుంది. మనము భారతీయ, పాశ్చాత్య విమర్శనా రీతులలోని మంచి, చెడులను మిళితంచేసి ఒక నిర్మాణాత్మక విమర్శనా శైలిని అలవరించుకొనవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

       ప్రస్తుతం తెలుగులో వస్తున్న సాహిత్య విమర్శను స్థూలంగా రెండు, మూడు వర్గాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది విద్యాసంబంధమైన, సైధ్ధాంతికపరమైన విమర్శ. ఇది కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు, ఇతర జ్ఞాన సంబంధమైన సంస్థలకు చెందినది. ఈ విద్యా సంబంధమైన పరిశోధనలో విద్యార్థి తన పర్యవేక్షకుల (సూపర్వైజర్) సూచనలకనుగుణంగా తన థీసిస్ తయారు చెయ్యడం ఎక్కువగా జరుగుతూ ఉంది. ఆక్రమంలో తన సృజనాత్మకత, సొంత ఆలోచనలను బహిర్గతపరిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఐతే దీనికి మినహాయింపుగా డా.సి. నారాయణ రెడ్డి గారి ‘ట్రెడిషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ ఇన్ మాడర్న్ తెలుగు పొయట్రీ’, డా. జి.వి.క్రిష్ణారావు గారి ‘స్టడీస్ ఇన్ కళాపూర్ణోదయం’, డా.వి.వి.ఎల్ నరసిమ్హారావు గారి ‘నన్నయ మహాభారతం’ నిలుస్తాయి. ఇక ప్రభుత్వ పర్యవేక్షణలో, దాని సహాయ సహకారాలతో నడుస్తున్న విద్యా సంబంధ సంస్థలలో జరిగే సాహిత్య విమర్శకు సంబంధించిన పనులు, పరిశోధనలు మొక్కుబడిగా ఉంటాయి. అవి ప్రభుత్వ విధానాలను ఆకాశానికెత్తడంలో(తమ మనుగడ కోసం) ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఉత్తమ విమర్శకు పేరొందిన భారతి, అభ్యుదయ, పరిశోధన, కిన్నెర, ప్రతిభ, కళాకేళి, ఉదయిని, సృజన, లాంటి పత్రికలు ప్రస్తుతం మనుగడలో లేవు.

విమర్శపై రాజకీయ, సాంఘిక, సామాజిక పరిస్థితుల ప్రభావం ఎంతవరకు సమంజసం?

       తెలుగు సాహిత్య విమర్శపై రాజకీయ, సాంఘిక, సామాజిక, కుల, మత ప్రభావం కొంతవరకు ఉన్నదని అంగీకరించక తప్పదు. పూర్వ కాలంలో రాజులను మెప్పించి లబ్ది పొందడానికి కవులు ప్రయత్నాలు చేసిననట్లుగా ఇప్పుడుకూడా కొన్ని సాహిత్య రూపాలను, కొంతమంది సాహిత్యకారులను భుజాలకెత్తుకోవడం మనకు ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. ఐతే సాహిత్య విమర్శ అనేది పైన పేర్కొన్న ఉపరితల అంశాలకు అతీతమై, సాహిత్య సృష్టిని నిర్మొహమాటంగా, నిష్పక్షపాతంగా నిగ్గు తేల్చినప్పుడే విమర్శకు ఒక సాఫల్యత, ప్రయోజనము సిధ్ధిస్తాయి.

ఉపసంహారము

       మనకు వైద్యులు ఎంత అవసరమో, ఒక ప్రక్రియలో ఉద్భవించిన సాహిత్య రూపం యొక్క స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు అంచనా వెయ్యడంలోనూ, అది సమాజానికి హానికారకం కాకుండా చెయ్యడంలోనూ, విమర్శకుల పాత్ర కూడా అంతే విలువైనది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే సాహిత్యకారునికి దశ, దిశలను నిర్దేశించేదే అసలైన విమర్శ.

OOO

Bio

బి.వి.శివ ప్రసాద్

తెలుగులో,ఆంగ్లంలో కధలు, కవితలు, గజల్స్,వ్యాసాలు వ్రాస్తారు. వీరి రచనలు నవ్య వార పత్రిక, స్వాతి మాస పత్రిక, ఆంధ్ర భూమి వార పత్రిక, రచన, విపుల, చినుకు, బాలభారతం, సారంగ వెబ్ సాహిత్య వార పత్రిక, సాహితీ కిరణం మాస పత్రికలలో, రమ్యభారతి తదితర పత్రికలలోప్రచురింపబడ్డాయి. ఇప్పటి దాకా యాభై తెలుగు కధలు, ఇరవైకి పైగా అనువాద కధలు, వందకి పైగా తెలుగు కవితలు వెలువరించారు. 2016 లో ‘సాదృశ్యం’ అనే తన ప్రథమ కథా సంపుటాన్నివెలువరించారు. తన తొలి తెలుగు కవితల సంపుటాన్ని ప్రచురించే ప్రయత్నంలో ఉన్నారు. వీరు విజయవాడలోని ఒక ప్రైవేట్ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నారు. ప్రయాణాలు చేయడం, సంగీతం, టెన్నిస్ ఆడడం వీరిప్రవృత్తులు​.

***

BV Shiva Prasad
Comments
bottom of page