top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

జీవమున్న నవల ‘ఒక్క వాన చాలు’

Sivuni Rajeswari

ఆచార్య రాజేశ్వరి శివుని

madhuravani.com అంతర్జాల పత్రిక  నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం

Bio

ఒక్క వాన చాలు’ రాయలసీమ రైతు జీవితాన్ని వర్ణించిన నవల రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. ఈ నవల రాయడంలో రచయితకు రెండు ఉద్దేశ్యాలున్నాయి. రాయలసీమ రైతు బతుకు ‘వలస కూలీ బతుకు’ అయ్యింది. అయినా రాయలసీమ రైతులో ఆత్మవిశ్వాసం చావలేదు. ‘ఒక్క వాన చాలు బండ రాతి మీదైనా పిడికెడు అన్నం పుట్టించేందుకు పోరాడుతాడు’. అని చెప్పడమే రచయిత ఉద్దేశం.

ఈ ఉద్దేశ్యాన్ని ఈ నవల పాఠకులకు నేరుగా చేరవేసింది. ఒక్క వాన రైతును కూలీగా ఒకరి కింద పని చేసే నిస్సహాయ స్థితి నుంచి ఆత్మ విశ్వాసం ఉన్న రైతుగా మారుస్తుంది. ఆ వాన కోసం ఎదురు చూడడమే నవల ప్రారంభం నుంచి చివరి దాకా ఉంటుంది. నవల పూర్తయ్యేసరికి పాఠకులకు రాయలసీమ రైతు మీద సానుభూతికంటే అతని ఆత్మవిశ్వాసంమీద గౌరవం కలుగుతుంది. రైతుపట్ల వ్యవసాయంపట్ల ఉన్న చులకన భావం తగ్గి రైతుమీద, వ్యవసాయంమీద ఒక అవగాహన కలుగుతుంది. అందులోని శ్రమ అర్ధం అవుతుంది.

ఇక కథలోకి వస్తే –

శివుడు ఒక వలస కూలీ. వానలు పడక కరువుతో ఊరు వదలి భవన నిర్మాణ పనులకు వచ్చిన ఎందరో వలస కూలీల్లో అతను ఒకడు. ఒక్క వాన పదునైన ఒక్క వాన పడితే చాలు ఊరు వెళ్ళి వ్యవసాయ పనులు చేసుకోవాలని తన ముసలి తల్లిని సాకాలని ఆశతో ఉన్నాడు. అతనితో ఉన్న వలస కూలీలందరూ అంతే. ఇంటి దగ్గర ముసలి తల్లిదండ్రుల్నో, భార్యా పిల్ల్లల్నో వదలి కడపో, తిరుపతో చేరుకుని భవన నిర్మాణ పనుల్లో మునిగి ఉన్నవారే. వానకోసం ఆశగా ఎదురు చూస్తున్నవారే.

వీరందరూ వాన కోసం ఎదురు చూస్తుంటే వాన వద్దనుకునే వారూ ఉన్నారు. ఇంటి పని కాంట్రాక్టుకు తీసుకున్న మేస్త్రీ కేశవులుకు వానవస్తే ఇంటిపని ఆగిపోతుంది. ఈ వలస కూలీలు వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోతారు. అందుకే వానంటే ఏ మాత్రం ఇష్టం లేదు. వాన రావాలని కోరుకుంటున్న శివుడితో గొడవ పెట్టుకుంటాడు. గొడవ పెద్దదై తన దగ్గర నుంచి పని వదలి వెళ్ళిపోమ్మంటాడు కేశవులు. శివుడు కూడా మాటపడే వాడు కాదు. కాయ కష్టం చేసుకునే వాడికి ఎక్కడైనా పని దొరుకుతుందని కోపంగా వచ్చేసాడు.

వాన చుట్టూ జరిగిన ఈ ఘర్షణ కథలో మరో సంఘటనకు దారి తీసింది. పని వెతుక్కునే క్రమంలో శివుడికి ఇంజనీరు రాజారావు పరిచయం అయ్యాడు. అతనింట్లో తోటపని అప్పగించారు. ప్రాణం ఉన్న పని దొరికింది అంటూ ఆ పనిలో ప్రాణం పెట్టాడు శివుడు. ఐదుమంది కూలీలు రెండు రోజులు చేసే పని అతనొక్కడే మూడు రోజుల్లో ముగించాడు ఎక్కవ కూలీ డబ్బు ఇవ్వపోతే తీసుకోకపోవడం, అతని పని తనం, నిజాయితీ, నిక్కచ్చితనం రాజారావుకు నచ్చాయి. అతనిలో అచ్చమైన రైతు కనిపించాడు.

రాజారావు సిద్దవాటం దగ్గర అడవిలో 200 ఎకరాల పొలంలో పండ్ల చెట్లు పెట్టాడు. లక్షలు ఖర్చుపెట్టి ఆ పొలాన్ని తోట చేయాలనుకున్నాడు. సాధ్యపడలేదు. ఆ పని చేయమని శివుడిని కోరాడు. శివయ్య అందుకు ఒప్పుకుని ఉంటే అది కాల్పనిక కథ అయి ఉండేది. శివుడికి గౌరితో పెళ్ళి కావడం, జీవితంలో స్థిరపడడం నాటకీయంగా జరిగిపోయేవి.

కాని రచయిత వాస్తవికతతోనే కథను నడిపాడు. రాజారావు తోటపని చేయడానికి శివుడు ఒప్పుకోలేదు. ఆ పని తన ఒక్కడి వల్లే కాదన్నాడు. మనుషుల్ని పెట్టి చేయించేందుకు తాను భూస్వామి కాదన్నాడు. అలవిమాలిన పొలంతో అవస్థ పడలేనన్నాడు. రాజారావు బతిమలాడాడు. భంగ పడ్డాడు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. అంటే ఈ బిందువు దగ్గరే పాఠకుడు కథలోనికి మానసికంగా ప్రవేసిస్తాడు. అంత వరకు పెద్ద మనిషిగా చెలామణి అయిన రాజారావు నిజస్వరూపం బయపడింది. తాను లంచాలు తిని సంపాదించిన డబ్బుతో కొంత, ఆ ప్రాంతంలోని పేద ప్రజల నుంచి దౌర్జన్యంగా లాక్కున్నది కొంత. అంతా కలిసి 200 ఎకరాల పొలం అది. ఆ పొలాన్ని శివుడు సాగు చేయనన్నందుకు అహం దెబ్బ తినింది. శివుడిని అతనితో పాటు వచ్చిన వలస కూలీల అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నాడు.

కొద్దిరోజుల క్రితం వీళ్ళందరూ మగ దిక్కులేని సరోజమ్మను, ఆమె కూతురు గౌరిని రౌడీల నుంచి కాపాడాడు. అప్పుడు గొడవయ్యింది. రాజారావు దాన్ని పోలీసు కేసుగా మార్చి వీరందరినీ ఆ కేసు నుంచి కాపాడతానని వాళ్ళ కొంత కాలం పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని ఒక కథ అల్లాడు తన పొలం దగ్గరకి తీసుకు వెళ్ళాడు. అక్కడే వ్యవసాయం పనులు చేయించుకున్నాడు. తరువాత నిజం తెలియడం, ఆ ఊభిలోంచి శివయ్య, రైతు కూలీలు బయట పడడం జరుగుతుంది. ఒక పెద్ద వాన, వాగులు, వంకలు పొర్లేంతటి వాన భూమి పడునేక్కే వాన. రైతు కూలీలను రైతులుగా మార్చే వాన. కురిసింది. శివుడు తాను రౌడీ నుంచి కాపాడిన గౌరిని పెళ్ళి చేసుకుని ఊరికి తీసుకు వెళ్ళడంతో కథ ముగుస్తుంది.

భూమిని స్త్రీకి ప్రతీకగా తీసుకున్నాడు రచయిత. రాజారావు తోటకి సుగాలి కాశీ నాయక్ ను కాపలాగా పెట్టుకున్నాడు. అతను ఒక సుగాలీ స్త్రీని డబ్బుపోసి కొన్నాడు. ఆమె ప్రేమించిన వ్యక్తిని ఆమె కళ్ళముందె చంపేసి ఆమెని కొట్టి బలవంతంగా తనతో లాక్కుచ్చి ఆ అడవిలోని ఇంట్లో బందీ చేసాడు. రాజారావు ఆక్రమించుకున్న పొలం వాచమేన్ నాయక్ చెరపట్టిన స్త్రీ లాంటిదైతే ఆ ఆక్రమిచుకోబోతున్న తమ ఊరి పొలం గౌరీ లాంటిది. “ఒక దాన్ని విడిపించాలి, ఒక దాన్ని చెర పట్టకుండా చూసుకోవాలి” అనుకుంటాడు శివుడు. (పుట. 139)

ఈ నవల మన జీవితంలో ఏ ప్రశ్నల్ని లేవనెత్తుతుంది? ఈ నవల్లో కీలకాంశం ఏమిటి? కథా సారాంశాన్ని పట్టించే కీలకాంశం “వ్యవసాయం అంటే ప్రాణం ఉన్న పని” ఆ వ్యవసాయాన్ని, రైతును మన ముందు నిలపెట్టాడు రచయిత

పదిమందిలో చేతులు కలిపి బతికే వాడు రైతు. అరచేతిలో సంగటిముద్ద పెట్టుకొని అందరితో కలసి తినేవాడు, దారిన పోయే వాళ్ళను కూడా పిల్చి ముద్ద తుంచి చేతిలో పెట్టేవాడు రైతు. పైరు ఊపిరైతే తన తోట పని జనమంతా నెత్తురు. ఈ రెండు కలిస్తేనే రైతు (పుట. 87) అని రచయిత రైతును ఆవిష్కరించాడు.

క్రికెట్ బౌలర్, బ్యాట్స్మెన్ అంటే అందరికి తెలుసు.  వాళ్ళు ఆ ఆటలో నిపుణులు.  మరి విత్తనకాడు, వామేటు గాళ్ళు ఎవరు? ఏ పనిలో వాళ్ళు నిపుణులు?  సేద్దెగానితనమంటే ఏమిటి? ఒక రైతు “మంచి విత్తనకాడు” ఆయితే, చుట్టూ ఉన్న చేలకు అతని చేతనే యిత్తించుకుంటారు. ఒకరికొకరు చేలలో కలుపుల్దీస్తారు.  కోతలు కోస్తారు. ‘వామేటుగాళ్ళు’ పోటు, వామి తొక్కి పోతారు. సేద్దెగాడి నాగేలి విరిగిపోతే పక్కవాడి నాగేలి తెచుకుంటారు.  వాళ్లకు గొర్రు లేకుంటే తనది ఇస్తాడు.  అదే “సేద్దెగాని తన” మంటే!          (పుట. 86).

‘రైతులిండ్లలో ఆడమనిషి పని చేయకుంటే సంసారం ముందుకుసాగదు.  పెనిమిటి కాడి కట్టుకుపోతే పైటేలకంతా పెండ్లాం పొలంకాడికి  సంకటి తీసుకుపోవాలి.  ఎద్దులు ఇంటికొచ్చే సరికి గంపనిండ పచ్చిగడ్డి తెచ్చి పెట్టాలి. కూలి మనుషుల వెంట మునంలో వంగాలి.  బర్రేపాలు పిండాలి.  కోడిని పోదిగేయాలి.  దూళ్ళను సాకలి.  ఎద్దుల తొట్టిలోకి కడుగు తయారు చేయాలి. ఒకటేమిటి? మొగాని కంటే ఆడ మనిషే ఎక్కువ పని చేయాలి. అవన్నీ లేకుండా వ్యవసాయం సాగదు”(పుట. 64) అని రచయిత రైతును, వ్యవసాయ జీవితాన్ని ఈ నవలలో ఆవిష్కరించారు.

నేటి జనానికి సెల్ ఫోన్లు, కార్లు లేకపోయినా బతుకుతారు. తిండి గింజలు లేకపోతే బతకలేరు.  అయితే సెల్ ఫోన్లు, కార్లు తయారుచేసే వారిని గౌరవిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు.  తిండి గింజలు పండించే వారిని తిడతారు, తక్కువగా చూస్తారు. వ్యవసాయం అంటే చులకన.  జనం వ్యవసాయదారున్ని చిన్న చూపు చూస్తారు.  ఆవృత్తిని కించ పరుస్తారు. 

కృష్ణయ్య సన్నకారు రైతు యాభై ఏళ్ళ వాడు, కరువు  బారి నుంచి తప్పించుకోలేక, ఎద్దుల్ని, బర్రెల్ని కసాయి వాళ్లకు తోలి. పెండ్లాం పిల్లల్ని ఇంటి వద్దే వదిలేసి, తన పొలంలోకి పనికి వచ్చే కూలీల వెంట తానూ కూలీగా టౌనుకు వచ్చాడు. సిమెంటు బస్తా వీపుమీద వేసుకుని మిద్దె తాపలు ఎక్కుతూ బస్తా కింద పడి సిమెంటు కొంత వ్యర్ధం అయ్యింది. ఎద్దు ముడ్డి పొడుచుకునే నాయాలివి, బరకదున్నే నాయలివి నీకెందుకోయ్ అంటూ బూతులు తిడుతూ ‘పోపో’ అని మెడ బట్టి గెంటాడు మేస్త్రీ. తలొంచుకొని గుడ్లు నీళ్ళు కక్కుతూ ఆ అవమానాన్ని భరిస్తూ నిస్సహాయంగా కదిలాడు ఆ బక్కరైతు.

“ఏ పనికైనా అతనికి నైపుణ్యమున్న రంగంలోనే పనుల్దోరుకుతాయి. ఒక్క వ్యవసాయదారునికి తప్ప” కృష్ణయ్య సేద్యం చేస్తే నూలుకు సాలు పట్టినట్లు ఉంటుంది. ఎండు గడ్డి వామేస్తే ఆ బోతుకోడె విరగబడి నిల్చున్నట్లుంటుంది. గొర్రు తోలితే ఈనే చీల్చినట్లుంది. అంతటి నైపుణ్యమున్న కృష్ణయ్య ఇక్కడ ఇటుకల కిందబడి చావవలసిందే” మేస్త్రి చేత తిట్లు తినాల్సిందే. సేధ్యగాని నైపుణ్యం చేలో సమాధి కావలసిందే”  అంటాడు రచయిత బాధగా (పుట. 80)

ఈ నవలలో రచయిత వాచ్యంగాకాక సూక్ష్మంగా చెప్పిందేమిటి? అని ప్రశ్నించుకుంటే ప్రకృతి మీద మనిషి పెత్తనం చేస్తే జరిగే పరిణామాల్ని రచయిత సూక్ష్మంగా చెప్పాడు. ఐదో, పదో ఎకరాలు ఉన్న వాడు రైతు అవుతాడు కాని వందల ఎకరాలు ఉన్న నీవు ఎలా రైతు అవుతావు? అని శివుడు రాజారావును ప్రశ్నించాడు (పుట. 55) ఇన్నేళ్ళ చెమటను ప్రతిఫలంగా తీసుకుని మనిషికింత పిడచ పెడుతుంది భూమి. నేలతో కొట్లాడే శక్తి ఉండాలి. మట్టి విలువ తెలియకుండా మట్టి మీద మనిషి పెత్తనం చేస్తే ఆ మట్టి ఊరుకుంటుందా? సమయం చూసి తగిన బుద్ధి చెబుతుంది. లేక్కుంది గదాని భూమికి మొగుడై ఆ లెక్కతోనే ఆమెను లొంగదీయాలనుకుని మట్టితో చెలగాటమాడే వాళ్ళు బాగుపడిన దాఖలాలు లేవు. భూమిని ఉంపుడుకత్తేగా మార్చుకోవాలన్న వాళ్ళు మట్టి గోట్టుకు పోయారు. వాళ్ళ చేష్టలు తనకు చిరాకు తెప్పిచినప్పుడు భూమి తల్లి తన వళ్ళు విరుచుకుని వరదల రూపంలోనో, భూకంపాల రూపంలోనో విజ్రుంభించిన దృశ్యం మనిషి మరగుజ్జు తనం స్పష్టంగా అర్ధమౌతుంది. (పుట. 57) భూమి తల్లి తన రూపాన్నికాపాడుకొంటున్న విధానం భూమి సహజత్వాన్నిమారిస్తే కలిగే పరిణామాలు చిత్రించిన రచయిత ఏటిమీద కూడా మనిషి పెత్తనాన్ని చూపాడు. యాభై ఏండ్లు నుంచి ఏటి దరుల్ని ఆక్రమించుకొని ఏటి గర్భంలోకి కూడా దురాక్రమణ చేస్తే తోటలు, చేలు, ఇల్లు నామరూపాల్లేకుండా తుడిచి పెట్టుకుపోయిన వాస్తవ దృశ్యాన్ని రచయిత కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు. 1996 నవంబరులో సగిలేటికి పొంగు వచ్చి తరాల నుంచి ఆక్రమించుకుంటున్నభూముల్ని మరలా తనలోకి గంజుకుంది. కరువు దప్ప నీళ్ళు మొగం సూడని రాళ్ళ భూముల్లో కూడా వరదల రుచి చూపింది ప్రకృతి.

మనిషి దురాశ, దురాక్రమణల్తో ప్రకృతికి జరిగే ముప్పును తద్వారా మానవజాతి వినాశనాన్నిహెచ్చరించాడు రచయిత. పర్యావరణ పరిరక్షణను వాచ్యంగా కాక సూక్ష్మంగా తెలిపాడు రచయిత.

సాహిత్యంలో ప్రతి రచనా తన పూర్వ కాలపు లేదా సమకాలీన రచనతోనో అల్లుకుని ఉంటుంది. ఆ అల్లికని ‘inter texuality’అంటారు. ఒక రచనలో అంతర్వాహినిగా ఉన్న రచనల్ని గుర్తుపట్టడం సాహిత్య విద్యార్ధి లక్షణం.

ఈ నవలకు కన్నడ భాషలో శివరామ కారంత్ రాసిన “మరల మన్నగె” నవలకు సారూప్యం కనిపిస్తుంది. మరల మన్నగె నవలను తెలుగులో “మరలండి సేద్యానికి” అన్న పేరుతో అనువదించారు. గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని వదిలి నగర జీవితానికి వెళ్ళిన రామారావు ఆ జీవితంపై విరక్తితో తన గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా గడపడాన్ని చిత్రించిన నవల ఇది. 1950 ప్రాంతంలో వెలువడింది. దాదాపు 70 సంవత్సరాల కాలం ఈ రెండు నవలల మధ్య ఉంది. మూడు తరాల గడిచేటంతటి కాలం. ఆ నవలలోని రామారావుకు మనవడి వయసులో ఉన్నాడు శివుడు. ఆ నవలలో 3 తరాల జీవితం చిత్రించబడింది. ఆ నవల నుంచి ఈ నవల వరకు ఆరు తరాల జీవితం ఉంది. భారతీయ గ్రామీణ జీవిత నేపధ్యం, ఆరు తరాల జీవిత కాలం గడిచినా రచయితల్ని, రచనల్ని వదలలేదు. వ్యవసాయ జీవితంలోని స్వచ్ఛతను, ఆనందాన్ని రెండు నవలలు ప్రతిబింబించాయి. దాదాపు ఒక శతాబ్ది కాలానికి పూర్వార్థంలో ఒక నవల, ఉత్తరార్థంలో ఒక నవల నిలిచింది. ఈ కాలంలో పట్టణాలు నగరాలుగా నగరాలు మహా నగరాలుగా రూపొందినాయి. ఆ నగర జీవితం జనారణ్యంగా మారి, మానవుడు ఒంటరివాడయ్యాడు. కేవలం బతుకుతున్నాడు, కానీ జీవించడం లేదు.

అయితే గ్రామాల్లో వ్యవసాయ జీవితం ఆనాటి నుండి నేటి వరకు చెక్కు చెదరలేదు. గ్రామాలు జనాలు లేక బోసిపోయాయి. కానీ ఉన్న వాళ్ళు మాత్రం ఒంటరిగా లేరు. సమూహంగా బతుకుతూ జీవిస్తున్నారు.  ఈ విధంగా అంతర్వాహినిగా ఉన్న ఇతర రచనల్ని పరిశీలించడం ద్వారా తెలుగు సాహిత్యం, కన్నడ సాహిత్యం ఇంకా ముందుకు వెళితే భారతీయ సాహిత్యం గ్రామీణజీవితాన్ని వ్యవసాయ జీవితంలోని ఔన్నత్యాన్ని మరచిపోలేదు. ఎందుకంటే అది సార్వకాలీన, సార్వ జనీన సత్యం.

రచయిత శివుడి మనస్తత్వాన్ని సన్నివేశ కల్పనా ద్వారా పరిచయం చేసాడు. మొదటిది మేస్త్రి కేశవులతో వాన అవసరం గురించి గొడవ పడడం. రెండవది రైతులకు పంట పండించడం తెలుసు కానీ ఆ పంట కల్తీ చేయడం తెలీదని వాదించడం. మూడవ సన్నివేశ కల్పన ప్రాణమున్న పని వ్యవసాయం. తోటపని అని కొత్తగా చెప్పడం. ఈ సన్నివేశ కల్పనల ద్వారా శివుడి నిజాయితీ వ్యవసాయ పని పట్ల శ్రద్ద, ఇష్టం ముక్కు సూటిగా పోవడం. అన్యాయాన్ని సహించకపోవడం వంటి స్వభావాల చిత్రణ జరిగింది. నాల్గవ సన్నివేశ కల్పనలో తాను రైతుగా ఉంటాడే తప్ప భూస్వామిగా బతకలేనని రాజారావు భూముల్లో పని చేయనని చెప్పడం.

ఈ నాలుగు సన్నివేశ కల్పనలు ఒక సంఘటనాత్మక శిల్పానికి దారి తీసాయి అది, శివుడు అతని స్నేహితులు సరోజమ్మ, గౌరీలను రౌడీల నుంచి కాపాడడం. మేనమామ రౌడీ తనంతో దౌర్జన్యంగా గౌరీని చేరపట్టాలనీ చూస్తే రక్షించి వారికి అండగా నిలబడ్డాడు శివుడు. ఈ సంఘటన శివుడికి ఇష్టంలేని రాజారావు పొలంపని చేయడానికి కారణమయ్యాయి. ఈ సంఘటన మరో సంఘటనకు దారితీసింది. ఆ ఊబిలోనుంచి బయట పడడానికి రాజారావు ఆక్రమించుకున్నభూమిని, కాశీ నాయక్ చెరపట్టిన స్త్రీకి విముక్తి కలిగించడానికి కారణమయ్యాయి. ఇదే నవలలో శిల్పం.

ఈ నవలను బట్టి రచయితను ఏ విధంగాఅంచనా వేయవచ్చు. సింగమనేని నారాయణ గారి మాటల్లో చెప్పాలంటే సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి ‘పల్లెలో పుట్టి పల్లెలోనే జీవిస్తున్న అసలు సిసలు గ్రామీణ రచయిత. అతడి గ్రామీణ జీవితం అతడి రచనల్లో కళాత్మకంగా ప్రాణం పోసుకుంది. కల్పన నాటకీయతకు ఏ మాత్రం స్థానం ఇవ్వని వాస్తవిక విమర్సనావాద రచయిత. సామాజిక సత్యాన్ని ప్రాదేశిక నిర్దిస్టతను ప్రదర్శించడంతోపాటు భారతీయ గ్రామీణ ఆత్మను పాఠకుడి ముందు నిలబెట్టిన రచయిత సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి’ ఇతను రచించిన 8 నవలల వివిధ సంస్థలు నిర్వహించిన పోటీల్లో బహుమతులు పొందినవే. ఆ నవలల గొప్పతనాన్ని అర్ధం చేసుకుని ఆదరించి స్వాగతించే సంస్థలు,  పాఠకులు ఉన్నారనడానికి ఇది నిదర్శనం.

.

OOO

శివుని రాజేశ్వరిగారు

శివుని రాజేశ్వరిగారు  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలోని తెలుగు అధ్యయన శాఖలో ప్రొఫెసరుగా  పనిచేస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో 14 మంది పిహెచ్.డి. పట్టాను పొందారు. ఆమె 96 పరిశోధక వ్యాసాలు, 4 పుస్తకాలు రచించారు. 85 జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. రేడియో, వివిధ సంస్థలలోనూ ధార్మిక ఉపన్యాసాలిచ్చారు.

***

Sivuni Rajeswari
Comments
bottom of page