
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Published & Maintained by Srinivas Pendyala | Mobile version is under construction. Use big screen for better experience.
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
నవరసమేళనం - భక్తిరసోన్మీలనం - ప్రహ్లాదోపాఖ్యానం
తంత్రవహి శ్రీరామమూర్తి
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
'' రాసినది శ్రీరామకోటి, ఆతడు ఆడినది శ్రీకృష్ణుతోటి
తెలుగులకు పుణ్యాలపేటి, హరినామ మందార మకరంద తేటి
సహజ పండితుడన్న పేరున్న మేటి, పోతన్న కెవరయ్య ఇలలోన సాటి ''
అని నుతించబడుతున్న యశశ్శరీరుడు బమ్మెరపోతన. పోతన చేతులలో భక్తి బంగారమై శోభించింది. భాగవత పురాణం కావ్యమై పుష్పించింది. ఇహ పరార్థ ఫలాలను అందించింది. రసజ్ఞులకు ఎంత ఆస్వాదించినా తనివి తీరనిది పోతన భాగవతం. ద్వాదశ స్కంధములుగా విలసిల్లిన భాగవతంలో మహాభారతం వలె ప్రతిపర్వము రసోదయమే. అయితే ప్రత్యేకించి సప్తమ స్కంధంలోని ప్రహ్లాదోపాఖ్యానం
నవరసమేళనం, భక్తి రసోన్మీలనమూ. '' ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీశ శుక శౌనక '' భక్త పరంపరలో అతి పిన్న వయస్కుడై అగ్రేసరుడై విలసిల్లనది ప్రహ్లాదుడే. రసప్లావితం కానిదే కావ్యమూ కాదు,
రసజ్ఞామోదమూ లేదు. ప్రహ్లాదుని కధ ఆమూలాగ్రం పరిశీలించితే నవరసాలు భక్తి రసంతో కలిసి నాట్యమాడినట్లు తెలుస్తోంది.
1.శృంగారం: స్త్రీపురుష సంయోగ భావమే శృంగారం. శృంగారానికి స్థాయీభావం రతి. కావ్యాలలో రసరాజం అనిచెప్పే శృంగారం భక్తి కావ్యమైన భాగవతంలో సమగ్రంగా పోషించే అవకాశం ఉండదు. కానీ కధానుగుణంగా, పాత్రానుగతంగా అక్కడక్కడ పోషింపబడటం మనం గమనించవచ్చు. ఆ దృష్టితో చూస్తే ఈ కథలో ఒక్కచోట శృంగారరసం పోషింపబడిందని చెప్పవచ్చు. లేదా రసస్ఫూర్తిని కలిగిస్తున్నదని అంగీకరించవచ్చు.
హిరణ్యకశిపుడు బ్రహ్మ వలన వరాలను పొంది, మదించి దేవేంద్రాదులను, భయభ్రాంతులను చేస్తుంటే రాక్షసభటులు అందరినీ హెచ్చరిస్తూ రాక్షసరాజుకు కావలి కాస్తున్నారు. అపుడు హిరణ్యకశిపుడు భార్యయైన లీలావతితో చేసిన విహారాన్ని నారదుడు ధర్మరాజుకు చెబుతున్నట్లు పోతన ఒక పద్యం రచించారు.
లీలోద్యాన లతా నివాసములలో లీలావతీయుక్తుడై
హాలాపాన వివర్ధమాన మదలోలావృత్త తామ్రాక్షుడై
కేళిం దేలగ నేనుఁ దుంబురుడు సంగీత ప్రసంగంబులన్
వాలాయంబుగఁ గరంగఁ జేయుదుము దేవద్వేషినుర్వీశ్వరా ! ( 102 పద్యం )
1. గీతమాలిక - తంత్రవహి శ్రీరామమూర్తి (అముద్రితం )
ఇది ఉత్తముని శృంగారం కాదు. ఎందుకంటే నాదయోగలయులైన నారదతుంబురుల గానాన్ని కేవల ఇంద్రియ భోగానుభవ సమయంలో వినిపించమని శాసించిన దుర్జనుడు, దేవద్వేషి హిరణ్యకశిపుడు. అందుకే పద్యంలో రెండుపాదాలకే పోతన ముగించాడనిపిస్తుంది.
2. హాస్యం: హాస్యానికి స్థాయీభావం హాసం. వికృతమైన ఆకారంవల్లకాని, వాక్కులవల్లకాని, చేష్టలవల్లకాని హాస్యం జనిస్తుంది. ఈ కథలో శుక్రాచార్యుల కుమారులైన చండామార్కులు ప్రహ్లాదునితో, హిరణ్య కశిపునితో సంభాషించే సందర్భంలో హాస్యరసస్ఫూర్తి కలుగుతుంది. తమ మాట వినని ప్రహ్లాదునిపట్ల వారు చూపే ఆగ్రహం, హిరణ్యకశిపుని మాటకు ఎదురుచెప్పలేని అమాయకత్వం, రాజాజ్ఞను తృణీకరించారంటారనే భయం, జరిగిన తప్పుని దిద్దుకోవడానికి చేసే ప్రయత్నం, కోపగించవద్దని రాజుకు చేసే విన్నపం, తండ్రీ కొడుకుల మధ్య నలిగిపోయే నిస్సహాయత ఇవన్నీ కలిసిన వారి మాటలు ఒకప్రక్క జాలి పుట్టించి నవ్వుకూడా కలిగిస్తాయి.
ఉ|| త్రిప్పకుమన్న మా మతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్
దప్పకుమన్న! నేడు మన దైత్యవరేణ్యుని మ్రోల మేము మున్
చెప్పినరీతి గాని మఱి చెప్పకుమన్న విరోధినీతులన్
విప్పకుమన్న! దుష్టమగు విష్ణుచరిత్ర కథార్థజాలముల్ (- 158 పద్యం )
సాధారణంగా గురువు శిష్యుని ఆజ్ఞాపిస్తారు. శిష్యులు ఘనకార్యం చేస్తే తమకృషికి, విద్యార్థి ప్రతిభకు గుర్తింపు లభించిందని పరమానంద పడిపోతారు. ఇక్కడ పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఏమి మాట్లాడి ప్రాణాలమీదకు తీసుకువస్తాడోనని అనుభవం మీద గురువులు ప్రహ్లాదుని '' అన్న! అన్న! '' అని బ్రతిమాలుకోవడం చూస్తే కళ్లుమూసుకుని కూర్చున్న ప్రహ్లాదుడు బాపుగారి బుడుగువలె దర్శనమిస్తాడు. నానా తంటాలు పడుతున్న చండామార్కుల విన్యాసాలు అనేక రకాలుగా ఊహించుకోబడి నవ్వు కలిగిస్తాయి. ప్రహ్లాదుడు తాను చెడిపోవడమే కాకుండా రహస్యంగా రాక్షసబాలురను చెడగొడుతున్నాడని తెలుసుకొని హిరణ్యకశిపునికి మొరపెట్టుకొనే సందర్భంలో ......
ఉడుగడు మధురిపు కధనము, విడివడి జడుపగిది దిరుగు; వికసనమున నే
నొడివిన నొడువులు నొడవడు, దుడునిఁ జదివింప మాకు దుర్లభమధిపా!
చొక్కసి రక్కసి కులమున, పెక్కురు జన్మించినారు విష్ణునియందున్
నిక్కపు మక్కువ విడువం డెక్కడి సుతుగంటి? రాక్షసేశ్వర వెఱ్ఱిన్ (- 252, 253 పద్యాలు )
అబ్బబ్బబ్బబ్బా! ఎక్కడి కొడుకయ్యా వీడు? అంటూ హిరణ్యకశిపుని రెండు చెవులూ దద్దరిల్లేలా, మనసు సలసలా కాగిపోయేలా అటూ ఇటూ తిరుగుతూ చెప్పే గురువుల నడక, మాటా తలపుకు వచ్చి పఠితకు నవ్వు వస్తుంది.
3.కరుణం: కరుణ రసానికి స్థాయీభావం శోకం. హృదయ ద్రవీకరణశక్తి కరుణానికున్నంతగా మరి దేనికీ లేదు. ప్రహ్లాద కధలో హిరణ్యకశిపుడు అందరినీ పీడిస్తూ ఉంటే సిద,్ధ సాధ్య, కిన్నర, ఖేచర, దేవ, ఋషి గణాలు ఆర్తితో విష్ణువును తలచుకొనే సందర్భంలో కరుణరసం పోషించబడింది. '' దేవా! మేము విముక్తి
పొందేది ఎపుడు? మేము బాగుపడేది ఎపుడు? అని చింతిస్తూ రహస్య సమావేశం జరుపుకొని ఈవిధంగా
ఉ|| ఎక్కడనున్న వాడు జగదీశ్వరుఁ ? డాత్మమయుండు మాధవుం
డెక్కడి కేగెఁ శాంతులు మునీశులు భిక్షులు రారు క్రమ్మఱం
దిక్కులనెల్ల నెక్కుడు తుదిం జొర దిక్కగునట్టి దిక్కుకై
మ్రొక్కెద మేము హస్తయుగమున్ ముకుళించి మదీయ రక్షకున్ (- 108 పద్యం )
హిరణ్యాక్షుడు మరణించినందుకు దితి దు:ఖిస్తున్నపుడు తల్లిని ఓదారుస్తూ హిరణ్యకశిపుడు అనేక వేదాంత విషయాలు బోధిస్తాడు. అపుడు సుయజ్ఞుడు అనే రాజుగారి కథ చెబుతాడు. ఆ రాజు మరణించినపుడు భార్యలు విలపిస్తుంటే యముడు విప్రబాలుని రూపంలో వచ్చి ఓదారుస్తూ కుళింగపక్షుల కథ చెబుతాడు.పక్షి జంటలో ఆడ పక్షిని కిరాతుడు పట్టి రెక్కలు విరిచి చెట్టుకింద ఉంటే చెట్టుమీదున్న మగ పక్షి '' ఏపాపం చేశామని దేవుడు ఈ బోయవాని చేతిలో చావుమని వ్రాశాడు? అని ఆడపక్షితో మాట్లాడుతూ దు:ఖిస్తుంది.
ఇంకా.....
ఱెక్కలు రావు పిల్లలకు, ఱేపటనుండియు మేఁత గానమిం
బొక్కుచుఁ గూఁటిలో నెగసి పోవఁగ నేరవు, మున్ను తల్లి యీ
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి న
ల్దిక్కులుఁ జూచుచున్న వతిదీనత నెట్లు భరింతు నక్కటా! (-63 పద్యం )
రెక్కలు రాని పిల్లలు తెల్లవారిన దగ్గరనుండి ఆహారం లేక ఏడుస్తూ ఉంటాయి. ఎగిరి వెళదామంటే చాతకాదు. అమ్మ ఏదిక్కు నుండి వస్తుందోనని చూపులార్పకుండా నిక్కి నిక్కి చూస్తుంటాయి. వీరి ముఖాలను ఎలా చూడాలి? ఈ వేదన ఎలా భరించగలను? అని మగపక్షి పడే వేదన హృదయాన్ని కదిలించి కంటనీరు పెట్టిస్తుంది. ఒక్క పద్యంలోనే శోకాన్ని రూపుకట్టించారు పోతన.
4. రౌద్రం: రౌద్ర రసానికి స్థాయీభావం క్రోధం. రౌద్ర రసానికి సంబంధించిన సన్నివేశాలు చాలా చోట్ల కనిపిస్తాయి. ప్రధానంగా నాలుగు సన్నివేశాలను గమనించవచ్చు.
(1). ప్రహ్లాదునిపై గురువులు కోపించుట: రాక్షసబాలురకు ఉండవలసిన గుణాలు ప్రహ్లాదునిలో లేవు ఎందుకని హిరణ్యకశిపుడు అడిగితే ఇనుము అయస్కాంతానికి ఆకర్షింపబడినట్లు నాహృదయం విష్ణువు సన్నిధినే కోరుకొంటుంది అని తండ్రికి సమాధానం చెబితాడు.అది విని గురువుకు కోపం వచ్చింది. ఆరేండ్లు వయస్సు లేని పసిబాలుడివి. ఎందుకు తర్కం చేస్తావు? మేము చెప్పిన శాస్త్రాలలోని ఒక్కవిషయాన్ని కూడా చెప్పవు. మహారాజుముందు మాకు తలవంపులు తెచ్చావు అంటూ కోపించి దండనమే నీకు తగునంటాడు.
చం|| తనయుడు గాడు శాత్రవుడు దానవభర్తకు వీడు, దైత్య చం
దన వనమందుఁ గంటకయుత క్షితజాతము భంగిఁ బుట్టినాఁ
డనవరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి సేయుచుండు దం
డనమునఁ గాని శిక్షలకు డాయుడు పట్టుడు కొట్టుఁ డుద్ధతిన్ (- 153 పద్యం)
(2).గురువులపై హిరణ్యకశిపుడు కోపించుట: ధర్మార్ధ కామాలను బోధించి ప్రహ్లాదుని విద్యాబలమును పరీక్షింపమని తీసుకువస్తే హిరణ్యకశిపుడు ''కుమారా! నీవు చదివిన చదువులో ఒక పద్యాన్ని చదివి అర్థాన్ని వివరించు'' అనగా మరలా విష్ణుతత్వాన్ని ప్రహ్లాదుడు బోధిస్తుంటే తండ్రికి కోపం వచ్చింది. జంకూ గొంకూ లేని కుమారుని పలుకులు ములుకుల్లా గుచ్చుకున్నాయి. కనుబొమలు అదురుతుంటే పళ్ళుకొరుకుతూ గురువును కొరకొరా చూశాడు. ఇదా నీవు చేసిన నిర్వాకం? విరోధి కథలు బాగా చెప్పావని అంటూ....
చం|| పటుతర నీతిశాస్త్ర చయ పారగుఁ జేసెదనంచు బాలు నీ
వటు గొనిపోయి వానికి నర్హములైన విరోధి శాస్త్రముల్
కుటిలతఁ జెప్పినాడవు భృగుప్రవరుండ నటంచు నమ్మితిం
గటకట! బ్రాహ్మణాకృతివి గాక యథార్ధపు బ్రాహ్మణుండవే! (- 173 పద్యం)
నీతిమంతుని చేయమంటే విరోధినీతులు చెప్పి మోసం చేయడం తగునా? శుక్రాచార్యుని కుమారునివని నమ్మితే ఇలా చేస్తావా? బ్రాహ్మణ వేషమే కాని బ్రాహ్మణబుద్ధి ఏముంది? అని కోపంతో నిందిస్తాడు.కనుబొమలు అదరటం, పళ్ళుకొరకటం, కొరకొరా చూడటం రౌద్ర రస సూచకాలే.
(3).హిరణ్యకశిపుడు ప్రహ్లాదునిపై కోపించుట: మాయకు లోబడి సంసారచక్రంలో తిరిగే మూర్ఖులకు విష్ణుభక్తి కలుగుట దుర్లభం. సంసార సాగరాన్ని హరిభక్తి అనే నౌకతోనే దాటగలం కాని, ఇతరోపాయములు పనికిరావని ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి ఉపదేశిస్తాడు. ఆ మాటలతో కొడుకుపై ఉన్న ప్రేమంతా ఒక్కసారిగా పోయింది. ఒక్కమాటుగా ఒడిలోనుండి కుమారుని కిందికి తోసేసి ఎర్రనైన కన్నుల నుండి నిప్పులు రాలుతున్నట్లుండగా కోపోద్రిక్తుడై మంత్రులతో ఇలా అంటాడు.
చం|| క్రోడంబై పినతండ్రిఁ జంపెనని తాఁ గ్రోధించి చిత్తంబులో
వీడం జేయడు, బంటుభంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడై
యోడం డక్కట! ప్రాణవాయువులు వీడొప్పించు చున్నాడు నా
తోడన్ వైరము పట్టె, నిట్టి జనకద్రోహిన్ మహిం గంటిరే? ( -185 పద్యం )
వరాహరూపంతో వచ్చి విష్ణువు పినతండ్రిని చంపాడనే బాధకాని సిగ్గుకానిలేవు. వానిబంటు మాదిరి భజన చేస్తాడే! నాతోనే వైరంపూని ప్రాణాలు తీస్తున్నాడే! తండ్రికే ద్రోహం చేసే కొడుకుని లోకంలో ఎక్కడైనా చూసారా? పుత్ర రూపంలో వచ్చిన వ్యాధి వీడు. వైద్యుడు దుష్టాంగాన్ని ఖండించి మిగిలిన శరీరాన్ని రక్షించినట్లు వీడిని వధించి కులాన్ని రక్షిస్తానని చెబుతాడు. దయతలచి విడిచిపెట్టకుండా వధించి రమ్మని రాక్షసులను ఆజ్ఞాపిస్తాడు.
(4).హిరణ్యకశిపునిపై నరసింహస్వామి కోపించుట: స్తంభం నుండి నరసింహాకృతితో విష్ణువు ఆవిర్భవించాడు. స్వామి చేసిన గర్జనకు దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి.హిరణ్యకశిపుడు గదా దండాన్ని గిరగిరా త్రిప్పి స్వామిపై విసిరాడు. స్వామి గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టుకున్నట్లు పట్టుకున్నాడు. తప్పించుకొనేందుకు, తిరిగి దాడి చేసేందుకు హిరణ్యకశిపుడు ప్రయత్నించాడు. ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరిపడుతున్న రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించాడు నరసింహ స్వామి (-290 వచనం ) అని పోతన రౌద్ర రసాన్ని వర్ణించారు.
5.వీరం: వీర రసానికి స్థాయీభావం ఉత్సాహం. యుద్ధోత్సాహాన్ని వీర రసజనితమని ఆలంకారికుల మతం.
స్తంభంనుండి ఆవిర్భవించిన నరసింహమూర్తి '' శంఖ చక్ర ఖడ్గ కుంత తోమర ప్రముఖమైన అనేక ఆయుధాలు ధరించిన అసంఖ్యాక బాహువులు వీరరసం అనే సాగరానికి చెలియలి కట్టలవలె '' ఉన్నాయని
పోతన వర్ణించారు. నరసింహాకృతి ప్రహ్లాదునికి సంతోషకారణంగా, హిరణ్యకశిపునికి సంతాపకారణంగా ఉంది. నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ, బహిరంగం వీర రసంతోనూ విరాజిల్లుతున్నాయి (- 285
వచనం ) అని వర్ణించారు పోతన.
6. భయానకం: భయానక రసానికి భయం స్థాయీభావం. నరసింహ స్వామినుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటే హిరణ్యకశిపునిపై ఆగ్రహించిన స్వామి భయానక రూపాన్ని పొందాడ
సీ|| పంచాననోద్ధూత పావకజ్వాలలు భూనభోంతరమెల్లఁ బూరితమ
దష్ట్రాంకురభీల ధగధగాయిత దీప్తి నసురేంద్ర నేత్రము లంధములుగఁ
గంటక సన్నిభోత్కట కేసరాహతి నభ్రసంఘము భిన్నమై చలింపఁ
బ్రళయాభ్రచంచలా ప్రతిమభాస్వరములై కరనఖరోచులు గ్రమ్ముదేర
తే|| సటలు జళిపించి గర్జించి సంభ్రమించి, దృష్టి సారించి బొమలు బంధించి కెరలి
జిహ్వ యాడించి లంఘించి చేత నొడిసి, పట్టె నరసింహుఁ డాదితిపట్టి నధిప! (-291 పద్యం )
అగ్నిజ్వాలలు వెలువడే ఉచ్ఛ్వాస నిశ్వాసలు,మెరుపుల కాంతులతో మిరుమిట్లుగొలిపే కోరలు, మేఘాలను చెదరగొట్టే కంటక సమూహముల వంటి కేసరములు, ప్రళయకాలమేఘాలలోని విద్యుల్లతల వంటి నఖకాంతులు స్వామికున్నాయి. ఝళిపించిన జటలతో, ప్రతిధ్వనించే గర్జనలతో ముడిపడిన కనుబొమలతో, వికృతంగా ఆడించే దీర్ఘమైన నాలుకతో కనిపించే భయంకరమూర్తిని హిరణ్యకశిపుని మ్రోల చూపించారు పోతన.స్తంభంనుండి ఆవిర్భవించినపుడే స్వామి ముఖం భయంకరంగా ఉందని పోతన వర్ణించారు.
7. బీభత్సం: బీభత్స రసానికి స్థాయీభావం జుగుప్స. కొన్ని చూసినపుడు, విన్నపుడు మనసు సహించలేక ఏవగింపు కలుగుతుంది. ఇదియే జుగుప్స. నరసింహస్వామి గరుత్మంతుడు నాగుపామును పట్టుకొని చీల్చిన విధంగా హిరణ్యకశిపుని పట్టుకొని బలవంతంగా తన ఊరువులపై అడ్డంగా పడవేసుకుని వాడియైన గోళ్లతో రొమ్మును చీల్చివేశాడు.
శా|| చించున్ హృత్కమలంబు, శోణితము వర్షించున్ ధరామండలిం
ద్రెంచు గర్కశ నాడికావళులు, భేదించున్ మహావక్షముం
ద్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా, దుష్టాసురున్ వ్రచ్చి ద
ర్పించుం, బ్రేవులు కంఠమాలికలు గల్పించున్ నఖోద్భాసియై. (- 296 పద్యం )
హిరణ్యకశిపుని గుండెలు చీల్చి నెత్తురు వర్షింపచేసాడు. కఠోరమైన రక్తనాళాలు తుత్తునియలుగా
త్రుంచి వేశాడు. కఠినమైన వక్షస్థలం పగులగొట్టాడు. కండరాలు ముక్కలు చేసాడు. నెత్తుటి పేగులు లాగి
కంఠలో మాలికలుగా ధరించాడు. నఖాలే ఆయుధాలుగా రాక్షసుని వధించిన స్వామి బీభత్సమూర్తిగా కనిపిస్తున్నాడు.
8. అద్భుతం: అద్భుత రసానికి స్థాయీభావం విస్మయం. అపూర్వం, అనూహ్యం అయిన దృశ్యాలు చూసినపుడు, విన్నపుడు ఆశ్చర్యం కలిగితీరుతుంది.విష్ణువు ఎక్కడున్నాడని తీవ్రంగా అన్వేషించిన హిరణ్యకశిపునికి ఎక్కడా కనిపించలేదు. హరి ఎక్కడున్నాడని ప్రహ్లాదుని అడిగితే అన్నిటా అంతటా ఉన్నా డని చెబుతాడు.ప్రహ్లాదుని వాక్యాలను పరీక్షించటానికి స్తంభమునందు చూపమని వాదించాడు హిరణ్య కశిపుడు. అరచేతితో బలంగామోది స్తంభాన్ని పగులకొట్టాడు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఊహించే రూపం దేవ, మానవాకృతిలో ఉన్న రూపం. లేదా పరిచితమైన వరాహరూపం. కానీ స్తంభంనుండి అపూర్వంగా అనూహ్యంగా వచ్చింది నరసింహాకృతి. అద్భుతమైన ఆ దృశ్యం చూసి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు.
కం|| నరమూర్తిగాదు, కేవల హరిమూర్తియుఁ గాదు మానవాకారముఁ గే
సరియాకారము నున్నది,హరిమాయా రచితమగు యధార్థము చూడన్. (-286 పద్యం )
హిరణ్యకశిపుడు ఇలా అనుకోవడం, నిశ్చేష్టుడవడం విస్మయభావమే.
9. శాంతం: శాంతరసానికి స్థాయీభావం శమం. వైరాగ్య భావం నుండి పుట్టిన నిర్వికార చిత్తవృత్తియే శమం. ఇహలోక సంబంధమైనవన్నీ అశాశ్వతాలనీ పరలోకమే శాశ్వతమైందనే ఆత్మజ్ఞానం అలవరచుకొని, ఇంద్రియ నిగ్రహం అలవరచుకొని మనస్సును అలలు లేని కొలనులా నిశ్చలంగా, నిర్మలంగా ఉంచుకోగలగటమే శమం. ఈ శమం స్థాయిగా కలిగినదే శాంతరసం. వేదాంత విషయాలన్ని శాంతరస ప్రధానాలే.
ఈ కధలో మూర్తీభవించిన శాంతరసమూర్తి ప్రహ్లాదుడు. పంచేంద్రియాలకు పట్టుబడనివాడు. కామ దోషాదులకు కట్టుబడడు. విశ్వమునందు చూసిన, విన్న వ్యవహారాలో వస్తుదృష్టి వాంఛ లేనివాడు. హరిభక్తి లేని వారి జీవితాలు ఎందుకూ పనికిరావని సోదాహరణంగా వివరిస్తాడు. కరములు, జిహ్వ,శిరము, మనము, బుద్ధి, చూపు అన్నీ భగవంతునిపై లగ్నము కావాలంటాడు. ఆయనను గురించి చదివేదే చదువు. ఆ చదువు చెప్పే గురువే గురువు. పరమాత్మ సన్నిధిని చేరమనే తండ్రే తండ్రి అంటాడు. సంసార జీమూతాలు, తాపత్రయాగ్నులు, పాపబడబాగ్నులు విష్ణువు వలననే తొలగుతాయంటాడు. ఆపదలనే అంధకారం హరిసంకీర్తన అనే కాంతులవలనే నశిస్తుందంటాడు. దానవబాలురకు ఈ వేదాంత ప్రతిపాదిత మైన విషయాలనే బోధిస్తాడు. ఈవిధంగా పోతన శాంత రస పోషణ చేసి తన జీవిత పరమార్థాన్ని ప్రహ్లాదముఖంగా ప్రవచించాడు.
నవవిధ భక్తులను ప్రవచించినది ప్రహ్లాదుడే. కాబట్టి భక్తి శాస్త్రవిషయంలోను ప్రహ్లాదుడు జ్ఞాని అని చెప్పవడచ్చు. ఈ నవవిధ భక్తులలో ప్రహ్లాదుడు స్మరణభక్తికి చెందినవాడని పోతనగారి తీర్పు.
తే|| హరిపదాంభోజయుగ చింతనామృతమున, నంతరంగంబు నిండినట్లైన నతడు
నిత్యపరిపూర్ణుఁ డగుచు నన్నియును మరచి, జడత లేకయు నుండును జడుని భంగి.
(-122 పద్యం )
శా|| పానీయంబులు ద్రావుచుం గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లా నిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాద సం
ధానుండై మఱచెన్ సురారిసుతుఁ డేతద్విశ్యమున్ భూవరా!
పోతన ప్రహ్లాదుడు వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడు. (-124 పద్యం ) కేశవ చింతనామృతాస్వాద కఠోరకుడు. (-137 పద్యం )హరి పాదపయోరుహ చింతన క్రియాలోలుడు(-127 పద్యం ) తనది అంబుజోదర దివ్యపాదారవింద చింతనామృతపాన విశేషమత్తచిత్తమని ప్రహ్లాదుని చేతనే పలికిస్తారు. (- 150 పద్యం ) దేవదేవుని చింతించు దినము దినము అని చక్రి చింతనలేని జన్మ క్షణికమైన నీటిబుడగయని(-169, 170 ) పద్యాంతాలలో ప్రవచింపచేస్తారు. కేవల చింతనము అనరు. ''చింతామృతము, చింతనామృతము'' అనే ప్రయోగిస్తారు. లౌకిక విషయాల చింత చితి వంటిది. అది మనిషిని దగ్ధంచేసి మృత్యుముఖంలోనికి నెడుతుంది. కానీ భగవత్ చింతన అమృతము. మృత్యు రహితమైన మోక్షస్థితిని ప్రసాదిస్తుంది. గీతాచార్యుడు ఉపదేశించిన భక్తి యోగంలో....
యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరా: |
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే ||
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ |
భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసామ్ ||
( భగవద్గీత అధ్యాయము 12 )
కర్మలను భగవత్ సమర్పణ చేసి సగుణ రూపాన్ని అనన్యభక్తియోగముతో సతతము చింతనచేసి భజిస్తారో ఆ పరమ భక్తులను మృత్యురూపసంసార సాగరము నుండి ఉద్ధరిస్తానని ప్రతిజ్ఞ చేసాడు. భక్త్తిియోగంలో చెప్పిన భక్తుని లక్షణాలన్నీ ప్రహ్లాదునిలో కనిపిస్తాయి.ఇంకా శ్రవణము, సంకీర్తనము, వందనము సేవ, దాస్యము, ఆత్మనివేదనము మొదలైన భక్తి లక్షణాలు కూడా ప్రకటితమవుతాయి.ఈ విధంగా పోతన భాగవతాన్ని భక్తి వేదాంతాల కలయికలో కళామయమై అమృతమయమైన కావ్యంగా మలచి తెలుగువారిని తరింపజేసాడు.
ఆధారగ్రంధాలు:1.పోతన భాగవతం- సప్తమస్కంధం- టి.టి.డి మరియు రామకృష్ణమఠం ప్రచురణ 2007.
2. శ్రీమద్భగవద్గీత- గీతాప్రెస్ ప్రచురణ 2013.
3. సినిమాపాటల్లో సాహిత్యపు విలువలు-డా|| చిట్టిబోయిన కోటేశ్వరరావు 2012.
.
.
OOO
శివుని రాజేశ్వరిగారు
తంత్రవహి శ్రీరామచంద్రమూర్తి: కాకినాడలో పీ.ఆర్. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాహిత్యపరంగా పరిశోధనావ్యాసాలు రాస్తూంటారు.
పాటలు, డ్యాన్స్ బ్యాలె లు రాయటం వీరి ఇతర ఆసక్తులు..
***
