MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
వ్యాస మధురాలు
ఆధునిక కవిత్వంలో ‘మా ఊరు’ భావన
డా. జడా సుబ్బారావు
madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన వ్యాస పోటీ లో ఉత్తమ బహుమతి సాధించిన వ్యాసం
పల్లెటూళ్ళు భారతదేశానికి గుండెకాయ. పల్లెటూళ్ళలోనే అచ్చమైన భారతీయ సమాజం ప్రతి బింబింస్తుంది. మనిషి ఎంత అభివృద్ధిని సాధించినా బాల్యంలోని గతజీవిత గుర్తులన్నీ అతని మనసులో పదిలంగా ఉంటాయి. అందుకే కేరింతలతో భూమిమీద పడినప్పుడే పుట్టిపెరిగిన ఊరితో అతనికి సంబంధం ఏర్పడుతుంది. కొనవూపిరి పోయేవరకు ఊరితో ఆ అనుబంధం కొనసాగుతూనే వుంటుంది. అమ్మఒడి, చదువుకున్న బడి, ఊరిలోని గుడి అన్నీ అతని జీవితంలో కలకాలం మంచి మధుర స్మృతులుగా మిగిలిపోతాయి. అవకాశాలు లేక అవసరాల కోసం మనిషి ఎంత దూరం వెళ్ళినా మన సెప్పుడూ అమ్మవైపు, ఊరివైపు లాగుతూనే ఉంటుంది. స్వచ్ఛమైన ఊరిగాలి పీల్చాలని, కమ్మనైన అమ్మ ప్రేమ పొందాలనీ, బాల్యమిత్రులను కలుసుకోవాలని మనసుపడే ఆరాటాన్ని చెప్పడానికి మాటలు చాలవు. అందుకే ‘మా ఊరు’ అనే ఒకే వస్తువును స్వీకరించి అభివ్యక్తి వైవిధ్యంతో అనేకమంది రచయితలు రాసిన కవితలన్నింటిని కలిపి రంజని సాహితీ సమితి వారు ‘మా వూరు’ కవితా సంకలనంగా తీసుకొచ్చారు. బతుకుతెరువు కోసం, విద్యార్జన కోసం వున్న ఊరు వదిలి ఎంతోమంది పట్టణాలకు వలసవచ్చి స్థిరపడ్డారు. వివిధ సందర్భాలలో పట్టణ పరిస్థితుల్లో ఇమడలేక ఉన్న ఊరుకు తిరిగి వెళ్లలేక నలిగిపోతుం టారు. కన్నతల్లి లాంటి ఉన్న ఊరు జ్ఞాపకాలను మర్చిపోలేక మళ్ళీ ఆ అనుభూతులను, అనుబంధాలను తిరిగిపొందాలని తపించిపోతుండటం సహజం. ఆ క్రమంలో ఆ ఆవేదనకు కవులు ఇచ్చిన అక్షరరూపమే మా వూరు కవితా సంకలనం. ఇక్కడ మా ఊరు అనే భావనను విస్తృతార్థంలో గమనించాలి. ఊరు అంటే సదరు వ్యక్తి యొక్క పుట్టిపెరిగిన ప్రదేశం. అది పల్లె కావచ్చు, పట్టణమైనా కావచ్చు. కాబట్టి ఆ ప్రదేశంలో జన్మించిన వారికి అది వారి సొంత ఊరుగానే పరిగణింపబడుతుంది.
అయితే ఈ కవితా సంకలనంలోని కవులు ఎక్కువమంది పల్లె/గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారు కావడం చేత వీటికి సంబంధించిన కవితలు ఎక్కువగా దీనిలో చోటుచేసుకోవడం గమనించదగిన విషయం. ప్రాచీనకవుల నుండి నేటి కవుల వరకు ప్రతీఒక్కరు ఏదో ఒక సందర్భంలో తను పుట్టిన ఊరి గురించీ తన బాల్యం గురించీ వర్ణించకుండా వుండరు. అందుకే ఒకప్పుడు పచ్చదనానికి ప్రకృతికి నిలయా లుగా ఆత్మీయానుబంధాలకు ప్రతీకలుగా ఉన్న పల్లెటూళ్ళు తర్వాత కాలంలో వాటిని కోల్పోయి కళావిహీ నంగా మారిపోయాయి. ఎంత కళావిహీనంగా మారిపోయినా ఇంకా ఆనాటి సాంప్రదాయాలను సంస్కృ తిని నిలిపి వుంచడంలో పల్లెటూళ్ళు ప్రముఖపాత్రనే పోషిస్తున్నాయి. కన్నతల్లినీ ఉన్నవూరినీ ప్రేమించని మనుషులు ఉండరు. కనుక పల్లెటూళ్ళు ఆయా రచయితల దృష్టిలో ఎంత మనోహరంగా ఉన్నాయో ఈ క్రింది కొన్ని కవితల ద్వారా తెలుసుకుందాం.
1.వ్యవసాయం:
వ్యవసాయం పల్లెసీమల ప్రధానవృత్తి. రైతు దేశానికి వెన్నెమొక. ఏడాది పొడవునా ఏదో ఒక రకమైన వ్యవసాయ పనులతో తీరికలేకుండా ఉంటారు. ఎద్దులకు కట్టిన చిరుగంటలు గణగణ మోగు తుండగా బళ్ళను తోలుకుంటూ పొద్దు పొడవకముందే పొలాలకు వెళ్లే వ్యవసాయదారులు మన పల్లె సీమలకు నిజమైన అలంకారాలు. అందుకే మట్టిని నమ్ముకున్న ప్రతీ వ్యవసాయదారుడి బ్రతుకు మట్టి తోనే ముడిపడి ఉంటుంది.
“నా మట్టి నిస్సారమైంది కాదు / రైతూ సోమరి కాదు
గుంటుకలు కొట్టి దుక్కి చేసి పారకం పెట్టుకోవడమంటే
భూమితో కష్టం సుఖం కలబోసుకున్నట్టుండేది” (ఉలిపిరి ఆశ – వఝల శివకుమార్) వ్యవసాయం రైతుకు ఊపిరి. రోజంతా వ్యవసాయం చేస్తూ గడపడంలోనే రైతులు తమ ఆనందాన్ని వెతుక్కుంటారు. ఎత్తుపల్లాల భూమిని చదునుచేసి సోమరితనం లేకుండా సాగుచేయడం అంతే భూమితో కష్టం సుఖం చెప్పుకున్నట్లుంటుంది అనడం రైతుకూ భూమికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది. తరతరాలుగా అన్నిబంధాలూ, అనుబంధాలూ రైతులకు మట్టితోనే. కాబట్టే వ్యవసాయం పల్లెసీమల రైతులకు ప్రధానమైన వృత్తి మాత్రమే కాకుండా వాళ్ళ జీవనంలో అంతర్భాగంగా కలిసిపోయింది.
2. స్వీయానుభూతి:
ఈ కవితా సంకలనమంతా స్వీయానుభూతికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎందుకంటే కవులు తమ ఊరినీ, ఊరిలోనీ పరిసరాలనూ, కలిసి తిరిగిన వ్యక్తులనూ, స్నేహితులను, సన్నిహితులను, గుడినీ, బడినీ ఇలా ఊరిలోని అణువణువుతో తమకున్న అనుబంధాన్ని, అవి మిగిల్చిన అనుభూతుల్ని కవిత్వీకరిం చారు. ఒక్కొక్కసారి కొన్ని కవితలలో ఊహాశక్తిపాలు అధికంగానే అనిపించినా అది పుట్టిపెరిగిన ఊళ్లతో వారికున్న మమకారం వల్ల మాత్రమే ఆయా కవితలలో ప్రతిఫలించిందని భావించవచ్చు. “ఊరంటే అమ్మచెంగుతో / ముఖం తుడుచుకున్నంత ఊరట
ఊరంటే అమ్మ వెచ్చటి ముద్దు
ఊరంటే నాన్నచేయి పట్టుకుని
అందరివైపు ధీమాగా చూస్తూ ముందుకు నడిచిపోవడం“ (ఊరమ్మ-.పి.చందన్ రావు) చిన్నప్పటి ఊరి జ్ఞాపకాలను మన కళ్ళముందుంచే కవిత ఇది. కడిగిన ముత్యంలా, కల్పవృక్షంలా మన అవసరాలన్నీ తీరుస్తూ ముందుకు నడిపించే ఊరి అనుబంధాలకు అపురూపమైన కానుక అమ్మ. అమ్మచెంగు, నాన్న చెయ్యి అన్నీ వ్యక్తి ఎంత ఎదిగినా ముందుకు నడిపిస్తూనే ఉంటాయి. అమాయకత్వం కలబోసిన కొంటెతనం వ్యక్తిత్వానికి బాటలు వేస్తుంది.
“భూమ్మీద చందమామ మా ఊరు
నక్షత్రాల ఇళ్ళు మేఘాల గుడిసెలు
అదో చంద్రమండలం” (చంద్రమండలం-కందుకూరి శ్రీరాములు)
అందని చందమామను భూమ్మీదకు తెచ్చి దానిని ఊరితో పోల్చడం కవి భావుకతకు నిదర్శనం. ఇళ్ళు నక్షత్రాలు, మేఘాలు గుడిసెలు అంటూ స్వీయానుభూతిని వర్ణిస్తున్నాడు కవి. అంతేకాదు పల్లెటూళ్లు ప్రకృతికి నిలయాలు. ప్రకృతిలో మమేకమైన తన ఊరు ఎలా వుందో ఈ క్రింది కవితలో తెలుస్తుంది.
“మా ఊరు కోయిల పాట వింటూ తనకు తెలియకుండానే వికసించి
సిగ్గుపడిపోయే ఆకుమాటు పువ్వులా ఉంది
ప్రకృతి పాపాయిగా వున్నప్పుడు కట్టుకుని
అపురూపంగా దాచుకున్న పిచ్చుకగూడులా ఉంది” (పొగచూరిన ఆకాశం– అమ్మంగి వేణుగోపాల్)
పల్లెప్రజల జీవితం ప్రకృతితో ఎంతగా ముడివేసుకుని ఉంటుందో తెలిపే కవిత ఇది. సెలయేళ్లు, పిల్లగాలులు, వెన్నెల, ఊరికే కొత్త శోభను చేకూర్చే కోయిల పాత, ఆకుమాటు పువ్వు ఇవన్నీ కలిసి ఊరి ప్రకృతి శోభను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. పల్లెప్రజల ఆలోచనలు, ఊహలు అన్నీ ప్రకృతితో ఎలా ముడిపడి వుంటాయో మనాకు తెలుస్తుంది.
3. బాల్యస్మృతులు:
వ్యక్తి జీవితంలో బ్యాల్యం ఒక మధురస్మృతి. వ్యక్తిగా ఎంత ఎదిగినా బాల్యస్మృతులు విడిచిపెట్టవు. చిన్ననాటి ఆటలు, పాటలు, గోరుముద్దళ్లూ కనిపించే అమ్మ అనురాగం, చిన్నతనంలో చెయ్యి పట్టుకుని నడిపించే నాన్న నిగ్రహం కళ్ళముందు కదులుతాయి.
“అమ్మ తినిపించే గోరుముద్దలు / ఆకాశంలో చందమామ
అదో వెన్నెల పండుగ / మామిడితోటలో ఈతకొట్టే బావులు
ఎండాకాలం ఎంతహాయో
నే పుట్టిన ఊరు / ఇప్పటికీ నా బాల్యాన్ని గుర్తుచేస్తాయి”
(ఊరు పికాసో చిత్రం – టి. కృష్ణమూర్తి యాదవ్)
అందరికీ అనుభూతిని కలిగించే బాల్యాన్ని వర్ణిస్తున్నాడు కవి. ఆకాశం ఉరిమినా, మెరుపులు మెరిసినా బాల్యం ఆనందంతో కేరింతలు కొడుతుంది. ఎండాకాలంలో ఆకల్ని కూడా మర్చిపోయి మామిడి తోటల్లో తిరిగిన బాల్యం మనల్ని మధురానుభూతికి లోనుచేస్తుంది.
“బడి ఎగ్గొట్టి కాగితం పడవల్ని చేసేవాళ్లం / వాన మా పడవల్ని మోసుకెళ్ళేది
మా స్వప్నాలకు మల్లే మా పడవలు / చాలా దూరం పయనించేవి
బడికి సెలవురోజు
గడ్డివాములు మాకు పూలపాన్పులయ్యేవి
గడ్డివాముల మాటున సిన్మా కబుర్లు చెప్పుకునేవాళ్లం” (ఆకుపచ్చని ఊరు – మహెజబీన్)
బాల్యంలోని చిలిపితనాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రించిన కవిత ఇది. చిన్నతనంలో చేసే ఊహలకు హద్దులుండవు. వాన వస్తుంటేబడి ఎగ్గొట్టికాగితాలతో పడవలు చేసి అవి ఆ నీటిలో తేలుతుంటేచిన్నపిల్లల ఆనందానికి అంతే ఉండదు. బడికి సెలవు వస్తే వారికి పండుగ వచ్చినంత సంతోషం. గడ్డివాములు ఎక్కుతూ దిగుతూఅలుపు వచ్చినపుడు సినిమా కబుర్లు చెప్పుకుంటూ గడిపే ఆ రోజులు ప్రతీ వ్యక్తి జీవితంలో తిరిగిరాని జ్ఞాపకాలుగా నిల్చిపోతాయి.
4. సహజీవనం – ఆప్యాయతలు
పల్లెటూళ్ళు సహజీవనానికి అనురాగ ఆప్యాయతలకు చిహ్నాలు. సంప్రదాయంతో పాటు సంస్కృతిని కూడా పల్లెజీవనం అలవాటు చేస్తుంది. ఒకతరం నుండి ఇంకొక తరానికిసామాజిక వారసత్వాన్ని అందించడంలో పల్లెటూళ్ళు పోషించే పాత్ర మరువలేనిది. అందుకే పల్లెటూరి మనుషుల
మనస్తత్వాలు ఈ క్రింది కవితలో చాలా హృద్యంగా చెప్పబడింది.
“కలసి ఉంటే కలదు సుఖం అనేదానికి
ప్రతిరూపంగా ఉండేది మా ఊరు
ఈర్ష్యాద్వేషాలకతీతంగా / అన్యాయాక్రమాలకు దూరంగా
అన్యోన్యతను పెనవేసుకుని ఉండేది” (నాడు నేడు – సి. కామేశ్వరరావు)
సహజీవనం అనేది పల్లెల్లో కనిపించే ముఖ్యాంశం. ఈర్ష్యలు, ద్వేషాలు, అన్యాయాలు, అక్రమాల న్నింటికీ దూరంగా కలిసివుంటే కలదు సుఖం అనేదానికి ప్రతిబింబంగా పల్లెటూళ్ళు అలరారుతుంటాయి. సాదాసీదాగా కనిపించే పల్లెలు సహజ సౌందర్యంతో ప్రకాశిస్తాయి. ఇతరుల కష్టాలలో సుఖాలలో పాలు పంచుకోవడం పల్లెజనుల ప్రత్యేకత.
“ప్రతీ ఇంటి చూరుల్లో / అప్యాయతానురాగాలు గువ్వలై
గూళ్ళు కట్టుకుని ఉండేవి
అప్పుడే పితికిన గోక్షీరంలా
మనుషుల మనసులు తారసిల్లేవి
వాకిళ్ళ ముత్యాల ముగ్గులో మమతలు మాట్లాడుతుండేవి”
(నాడు నేడు – సి. కామేశ్వరరావు)
పల్లెటూరి ప్రేమాప్యాయతలకు అద్దంపట్టే కవిత ఇది. ఇంట్లో ఎవర్ని కదిలించిన వారి మాటల్లో అనురాగం ధ్వనిస్తుంది. మనుషుల మనసుల్ని గోక్షీరంతో పోల్చడం ఆనాటి స్వచ్ఛమైన మనసులకు తార్కాణం. ప్రతీ మనిషి కడిగిన ముత్యంలా ప్రకాశించే స్వచ్ఛత పల్లెటూళ్ళ సంబంధాల్లో కీలకమైనవి. అందుకే ఈ క్రింది కవితా కూడా అటువంటి భావాన్నే వ్యక్తచేస్తుంది.
“కొత్తమనిషి ఊళ్ళోకి వస్తే ఆత్మీయతా జలాన్నిచ్చి
ఆత్మబంధువై ఊసులాడే
మనిషి చెట్టుకు అల్లుకున్న మమకార తీగల
పూల పందిరియై పరిమళించేది”
(నా చిన్నప్పటి చందమామ - సిహెచ్. ఆంజనేయులు)
కొత్తాపాతా, చిన్నాపెద్దా అనే తేడాలేకుండా కలుపుగోలుతనంగా ఉండడం పల్లెప్రజల స్వచ్ఛమైన నైజం. ఎంత తెలియని మనిషి ఊళ్ళోకి వచ్చిన తాగడానికి నీళ్ళిచ్చి కుశలమడిగే ఆనాటి సంబంధాలన్నీ మనిషి చెట్టుకు అల్లుకున్న మమకార తీగలతో పోల్చడం గొప్ప విషయం. ఎందుకంటే మానవ సంబంధా లన్నీ మనిషిని కేంద్రంగా చేసుకుని వుంటాయి కాబట్టి వాటిని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనుషు లదే అనే సందేశం అంతర్లీనంగా కనిపిస్తుంది.
5. ఆటపాటలు:
చిన్నతనంలో పల్లెటూళ్లలో మనకు కనిపించే దృశ్యం, తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న సంపద ఆటలు. ఆటలు శారీరక ధారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా కలిగిస్తాయి. ఈ ఆటలు కూడా పండుగల వలె సంస్కృతీ సంప్రదాయాలను ఆచారవ్యవహారాలను ప్రతిబింబిస్తాయి. భారతదేశం ఆటపాటలకు పుట్టినిల్లు. ఈ సంకలనంలోని కవితలు కూడా ఆటల్ని, మన పండుగల్ని బాగా చిత్రించాయి. “చిర్రగొని చీటికేలాటా / కోటికొమ్మా కోలలాట / చెక్కడుపుల్లా తోక్కూడుబిల్లా/ చెట్టు చెన్నంగిరి ఆటా / పైసలాటా గోటీలాటా / చెలికాళ్లతో చెడుగుడులాటా / తీరొక్కా ఆటాపాటల మధ్యా / తీర్చిదిద్దితి నమ్మరో నన్ను” (జీతగాడు - అందెశ్రీ) పల్లెల్లో పెరిగే పిల్లలు నిత్యం ప్రకృతితో ఆడుకుంటూనే ఉంటారు. చెట్టూపుట్టా గట్టూ కాలువా అన్నీ వాళ్ళ ఆటలకు స్థలాలే. తీరొక్కా ఆటపాటలా మధ్య తీర్చిదిద్దితివి నన్ను అని చెప్పడం పల్లెటూళ్లలో పిల్లలు ఆటలకు ఎంత సన్నిహితంగా ఉన్నారో, ఉగ్గుపాలతోనే ఇటువంటి వాటిపట్ల ఎంత మక్కువ కలిగి ఉంటారో అందెశ్రీ పై కవితలో ఎంతో హృద్యంగా వివరించారు. బాల్యాన్ని భవిష్యత్తులో కూడా మనముందుంచేవి ఆటలు. ఎండా, వానా, వెన్నెల ఏవైనా చిన్నపిల్లలకు సమానమే. ఎండను సైతం లెక్కచేయకుండా పొలా లలో బిళ్లంగోడు ఆడడం, చెడుగుడు, చిర్రగొనే, గోళీలాటలు మొదలగునవన్నీ వారికి ఉత్సాహంతో పాటు చురుకుదనాన్ని, తెలివితేటలను కూడా ఇస్తాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
6. పండుగలు – జాతరలు:
ఆటపాటల తర్వాత పల్లెల్లో కనిపించే మరొక ముఖ్య విషయం పండుగలు. దీనిలోనే జాతరలు కూడా ఆయా సందర్భాలను బట్టి నిర్వహిస్తుంటారు. భారతదేశంలో హిందూమతం తరతరాలుగా ఉన్న మతం. అన్ని మతాల్లో పండుగలు ఉన్నా ఇతరులకంటే హిందువులకే ఎక్కువ పండుగలున్నట్లు తెలుస్తుంది. కాబట్టే పండుగలు, ఉత్సవాలు, జాతరలు మొదలగు వాటిని పల్లెల్లో నెలకొన్న ఆహ్లాదకర, సామరస్య వాతావరణానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
“మసీదైనా మందిరమైనా మఠమైనా
మతాలకు కాదు
మమతలకూ సమతలకూ మారుపేరుగా మసలేది
పాడితో ఆహారధాన్యాల నందించే పంటపొలాలతో
అందరికీ ఆనంద సంధాయకమై వెలిగేది” (మావూరిప్పుడు మారిపోయింది- సుపాణి) పల్లెల్లో ప్రత్యేకించి పండుగల విషయంలో కనిపించే సమతాభావం, సహృదయత కనిపిస్తుంది పై కవితలో. పండుగల ఉద్దేశ్యం ఆనందం ఆహ్లాదమేగానీ కక్షలు కార్పణ్యాలు కాదనే విషయం కూడా ఇక్కడ గమనించాల్సిన అంశంగా మనకు కానిపిస్తుంది.
‘సంకురాత్రి పండుగొచ్చిందంటే
సకినాలే సకినాలు
వాకిట్లో అడుగుపెట్టడం యమకష్టం
ముగ్గు తొక్కినోని వీపు నుగ్గునుగ్గయ్యేది” (చంద్రమండలం- కందుకూరి శ్రీరాములు) శుభ్రంగా కడిగిన ఇళ్లు, తీర్చిదిద్దిన ముగ్గులు సంక్రాంతి పండుగనాడు ఊరికే కొత్తకళను ఆపాది స్తాయి. అమ్మ ముగ్గు లేస్తుంటే దగ్గరుండి తిలకించడం చిన్నతనం మిగిల్చే తీయని అనుభూతి. ఏమాత్రం ఖాళీలేకుండా వాకిలంతా ముగ్గులతో, గొబ్బెమ్మలతో నిండిపోయేది. ముగ్గులు తొక్కినోని వీపు నుగ్గునుగ్గ య్యేది అంటూ చమత్కరిస్తున్నాడు కవి. సంక్రాంతి పండుగే కాకుండా ఉగాది, దసరా, వినాయకచవితి, దీపావళి మొదలైన పండుగలు కూడా పల్లెల్లో చాలా వైభోగంగా జరుపుతారు. ఏ పండుగానూ వదిలిపెట్ట కుండా దాదాపు అన్ని పండుగల్నీ నిర్వహించుకునే సంప్రదాయం పల్లెవాసులది. అంతేగాక సంక్రాంతి సంబరాల్లో కనిపించే కోడిపండేలాట కూడా ఎంతో ప్రముఖంగా కనిపిస్తుంది.
“మా ఊరి సంక్రాంతి సంబరాల్లో / చైతన్య దీప్తి శివమెత్తుతుంది
కోడిపందేలాటల్లో పౌరుషాగ్ని రేఖ ఎద హత్తుతుంది” (సిరిమందారం – పి. నాగేశ్వరరావు) ఈనాటికీ కొన్ని పల్లెల్లో సంక్రాంతి పండుగనాడు కోడిపందేలాట దృశ్యాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. కోడిపందేలాట పౌరుషానికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నా దానివల్ల అనర్థాలు కూడా ఉన్నాయనేది చరిత్ర చెప్పే సత్యం. అయినా ఒక ఆనవాయితీగా ఆహ్లాదమైన క్రీడగా నిర్వహిస్తూ పండుగను ఎంతో వేడుకగా చేసుకుంటారు పల్లెజనులు.
పల్లెజనులలో కనిపించే మరొక ముఖ్యాంశం జాతరలు. పిల్లల ఉత్సాహం, పడుచువారి పరవళ్ళు, ముసలివాళ్ళ భయభక్తులు ఈ జాతర్లలో కనిపిస్తాయి. ఈ జాతర్లలో దొమ్మరి ఆటలు, బహురూపాలు, కోలాటం మున్నగు వినోదాలు ప్రదర్శిస్తారు. అంతేగాక దేవతలు వెలిసాయనే మూఢనమ్మకాలు కూడా మనకు కనిపిస్తాయి.
“అయ్యబాబోయ్ అమ్మోరు వెలిసింది
వయసొచ్చాక మగోళ్లని పురుగుల్లా మింగేసిన ఎల్లమ్మ
ఒంటిని జిగి వొగ్గేశాక వైరాగ్యం పుచ్చుకున్న
నాపసాని ఎల్లమ్మ దేవతై వెలిసింది” (హుర్రే హుర్రే – భైరవయ్య)
ప్రతీ ఊరి చివరలో చెట్టుకింద గట్టుకింద చెరువుగట్టు మీదా గుళ్ళు మనకు కనిపిస్తుంటాయి. నాలుగు బండరాళ్లను ఏర్పాటుచేసి అందులో గ్రామదేవతలను ఉంచి పూజించడం పల్లెటూళ్ళల్లో కనిపించే ఇంకొక అంశం. తమ గ్రామాలను నిత్యం కొంతమంది దేవతలు కాపాడుతుంటారని, అపాయమూ, రోగమూ రాకుండా రక్షిస్తుంటారని వారి నమ్మకం. అందుకనే పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, నూకాలమ్మ, పెద్దమ్మ మొదలగు దేవతలకి చిన్నచిన్న గుళ్ళు ఏర్పాటు చేసి నిత్యం పూజలు చేస్తుంటారు.
పైన వివరించిన విధంగా పల్లెటూళ్ళు స్వచ్ఛతకి, అమాయకత్వానికి, అనుబంధానికి ప్రతీకలుగా భావించవచ్చు. అంతేగాక పచ్చని ప్రకృతికి నిలయంగా ఉండడంతో పాటు మంచినీరు, మంచి ఆహారం వంటి సదుపాయాలకు కూడా పల్లెటూళ్ళు నిలయాలుగా ఉంటున్నాయి. పల్లె తల్లిలాంటిది. తెలుగుదనానికి మూర్తీభవించిన ప్రతిరూపం. చిన్నప్పటి ఆప్యాయతలు, అనుబంధాలు, సహజ ప్రకృతి దృశ్యాలు, స్నేహాలు, కుటుంబసంబంధాల స్థానంలో డబ్బు పాత్ర అధికం అవుతున్నప్పటికీ మనుషులంతా తాము పుట్టిపెరిగిన ఊరి బాగోగుల కోసం ఎంతో కొంత కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే పల్లెటూళ్ళు ప్రశాంతతకు నిలయాలుగా స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా ఉంటాయి.
ఉపయుక్త గ్రంథ/వ్యాససూచి:
1. ‘మా ఊరు’ కవితాసంకలనం: రంజని సాహితీ సమితి, హైదారాబాద్.
2. ప్రాచీన కావ్యాలు – గ్రామీణ జీవన చిత్రణ : మసన చెన్నప్ప
3. తెలుగు కావ్యాలలో ప్రకృతి చిత్రణ : టీవి నారాయణరెడ్డి
4. పల్లెపదాలలో ప్రజాజీవనము : రఘుమారెడ్డి యెల్దండ .
OOO
డా. జడా సుబ్బారావు
డా. జడా సుబ్బారావు గారు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, ఏపీఐఐఐటీ లో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. నూజివీడు, కృష్ణాజిల్లా (ఆంధ్రప్రదేశ్, ఇండియా) వాస్తవ్యులు. ఆయన రాసిన ‘తలరాతలు’ అనే కథా సంకలనాన్ని మధురవాణి మునుపు సంచికలో పరిచయం చేసాము. కథలేకాకుండా ఆయన రాసిన ఎన్నో సాహితీ పరిశోధనా వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి.
***