top of page
hasya.JPG
adannamaata.png

సంపుటి  4   సంచిక  1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

వ్యాస​ మధురాలు

కవితా సంకలనాల ప్రచురణ – ప్రమాణాలు

Vinnakota Ravi Shankar_edited.jpg

విన్నకోట  రవిశంకర్

నేను ప్రధానంగా కవితా సంకలనాల ప్రచురణ, అందులో ప్రమాణాలు నెలకొల్పటంలో ఉన్న సాధక బాధకాల గురించి కొన్ని విషయాలు చర్చిస్తాను. ప్రచురణకు సంబంధించినంత వరకు సమకాలీన తెలుగు కవులు చాలా మంది ‘స్వయం ప్రకాశకుల’ని చెప్పవచ్చు.  అంటే, వారి పుస్తకాలకు వారే ప్రకాశకులు లేదా  ప్రచురణకర్తలు. మరొక విధంగా చెప్పాలంటే  కవితా సంకలనాల విషయంలో కవులు, ప్రచురణకర్తలంటూ విడివిడిగా లేరు. రెండూ ఒకరే. అందువల్ల, ప్రచురణలో ప్రమాణాలన్నది కవులు తమకు తామే పాటించవలసిన స్వయం నియంత్రణ క్రిందకు వస్తుంది. అంటే అది పూర్తిగా వారిపైనే ఆధారపడి ఉంటుంది.

కారణమేదైనా గాని, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు ప్రచురణ సంస్థలు కవితా సంకలనాలు ప్రచురించటానికి పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. ఎప్పుడైనా వార్షిక సంకలనాలు, దశాబ్ది కవితల వంటివి ప్రచురించవచ్చునేమోగాని, విడిగా ఒక కవి కవితల్ని వారు పుస్తకంగా తెచ్చిన సందర్భాలు ఒక చేతి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఉదాహరణకి, ముకుందరామారావు గారు పిల్లల కోసం సేకరించిన కథల్ని రెండు పుస్తకాలుగా కూర్చి విశాలాంధ్ర సంస్థ వారు ప్రచురించారు. పిల్లల కోసం పుస్తకాలు ప్రచురించటం తప్పక హర్షణీయమే. కాని ఆయన ఇప్పటివరకు ఎన్నో కవితా సంకలనాలు వెలువరించినా  నాకు తెలిసి వాటిలో ఏదీ విశాలాంధ్ర ప్రచురణగా వచ్చినట్టు లేదు. ఎం.శేషాచలం&కో వారు అనువాద కవితల సంకలనాలు ఒకటో రెండో ప్రచురించినట్టున్నారు.  విశాలాంధ్ర వారు కూడా తాము ప్రచురించే అనేక మంచి పుస్తకాలతో బాటు, సమకాలీన కవుల కవిత సంకలనాలను కొన్నైనా ప్రచురించగలిగితే  బాగుంటుందని నా అభిప్రాయం.  “మహా ప్రస్థానం”, “అమృతం కురిసిన రాత్రి” ప్రచురించిన స్ఫూర్తితోనైనా అటువంటి సత్కార్యం చెయ్యవచ్చు. పెద్ద ప్రచురణ  సంస్థల్లాగా ప్రచురణ వ్యయం భరించక పోయినా,  ప్రచురణ భారం తదితర బాధ్యలు నిర్వహించే చిన్న సంస్థలు కొన్ని ఉన్నాయి. అమెరికాలో చూస్తే వంగూరి ఫౌండేషన్ వంటివారు ఇక్కడ కవుల రచనలు పుస్తక రూపంలో తీసుకురావటానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే, అనేకమంది కవుల విషయంలో జరుగుతున్నది మాత్రం ప్రచురణ వ్యయం, భారం అన్నీ తామే భరించి , తమ ఖర్చులతోనే దానికి ఆవిష్కరణ జరిపించి, ఆ పుస్తకం కాపీలు కొన్ని నలభై శాతం కమీషన్ తో తమ వద్ద  ఉంచమని విక్రయ కేంద్రాల వారిని అభ్యఅర్థించినా, వారెక్కువ కాపీలు తీసుకోరు. తీసుకున్నవి ఉత్సాహంగా అమ్మటమూ తక్కువే. వెరసి బహుకొద్ది మంది కవులవి తప్పితే, మిగతావారివి అమ్ముడు కావటం సందేహమే. ఈ పరిస్థితి బాగుపడటానికి నాకొక ఉపాయం తోస్తోంది. ఇటీవల డి.ఏం.కె. అధ్యక్షునిగా స్టాలిన్ గారు బాధ్యతలు తీసుకున్నాక, ఇకపై తనను కలవాలని వచ్చేవారందరికీ ఒక సూచన చేసారట. వారు తనను కలిసినప్పుడు, బొకేకు బదులుగా, ఒక పుస్తకం ఇవ్వాలని, తరువాత వాటన్నిటినీ లైబ్రరీలకు పంపిస్తామన్నది ఆ సూచన. తెలుగు భాషాభిమానులైన తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు కూడా అటువంటి చర్య ఏదైనా తీసుకునే విధంగా, ఆయనకు సన్నిహితులైన మన తెలంగాణా కవిమిత్రులు చొరవ తీసుకుని ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇవేవీ  వీలు కానప్పుడు, ఇక మిగిలిన ఒకే ఒక మార్గం ఉచిత పంపిణీ. బహుశా తెలుగులో ఉచిత పంపిణీ జరిగే పుస్తకాల జాబితాలో ‘కొత్త నిబంధన గ్రంధం’ తరువాతి స్థానం కొత్త కవితా సంకలనాలకే దక్కుతుందని నా నమ్మకం! ఈ సమస్య గురించి ఆలోచించినప్పుడు, ఇన్ని వ్యయ ప్రయాసలకోర్చి కూడా తమ కవిత్వాన్ని పాఠకులకందించటానికి కృషి చేస్తున్న కవులకి ప్రమాణాల పేరుతో మరిన్ని ‘కొత్త నిబంధనలు’ సూచించటం సరైన పధ్ధతి కాదేమో అనే సందేహం కలగటం సహజం. ఐతే, అది తమ ప్రచురణే కాబట్టి, అది మరింత మెరుగ్గా రావాలనే కోరిక వారికి ఉంటుంది కాబట్టి, వారు కొన్ని సూచనలకు సానుకూలంగా స్పందించే అవకాశం కూడా  లేకపోలేదు.

ఎటువంటి సూచనలు చెయ్యగలమనేదాని మీద కొంత చర్చ అవసరం. ఆధునిక తెలుగు కవిత్వం ప్రయాణం కథనుంచి ఆత్మకథ వైపు సాగిందని నాకనిపిస్తుంది. కవిత్వం కథనుంచి పూర్తిగా వేరుపడ్డాక కవి తన అనుభవాలు, తన ఆలోచనలు, తన అంతర్మథనం, ఏ విషయం లేదా సంఘటన పైనైనా తన స్పందన చెప్పటం ప్రధానం కావటంతో తన కవిత్వానికి తానే కేంద్ర బిందువుగా మారాడు. దీనివల్ల, కవికి తన కవితతో విడదీయరాని ఒక ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అంటే కవి తన కవితను తన ప్రతిబింబంగానో, తన ప్రతిరూపం లాంటి తన సంతానంగానో భావించటం జరుగుతుంది. ఇటీవలి కాలంలో కొందరు కవులు తమ కవితల్ని, లేదా వాటిలో పదాల్ని తమ పిల్లలతో పోలుస్తూ మాట్లాడటం లేదా రాయటం జరుగుతోంది. కాళోజీ గారు కవిత రూపొందే ప్రక్రియని గురించి చెప్పటానికి conception, carrying & delivery  అనే పదాలు వాడేవారు. అంతేకాకుండా “మన పిల్లలకి చట్టి ముక్కు, చికిలి కళ్ళు రాకూడదని కోరుకుంటాం. కాని, వస్తే ఏం చెయ్యలేం కదా“ అనేవారు. వివిధ కవులు రాసిన కవితల్లో “పద్యపాదంలో ఉంచాలో తీసెయ్యాలో తేల్చుకోలేని పదంలా మధ్యలో ఈ పిల్ల ఒకత్తి” , “అప్పుడే ఎత్తుకోమని, అప్పుడే దించెయ్యమని దొరికిన పదాలు మారాము చేస్తున్నాయి” , “తల్లి తన బిడ్డను మళ్ళీమళ్ళీ చూసుకున్నట్టుగా కవికి కూడా తన కవితను మళ్ళీమళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది” వంటి కవితా వాక్యాలు ఇటువంటి భావాన్నే వ్యక్తపరుస్తాయి.

 

నేను రాసిన ఒక కవితలో ఒకసారి ఈ విధమైన పోలిక వాడాను - “పాత పద్యాన్ని చూసినప్పుడు ఎన్నాళ్ళ క్రితమో ఇల్లు విడిచి వెళ్ళిన కొడుకుని మళ్ళీ కలుసుకున్నట్టుగా ఉంటుంది” అని ప్రారంభమయే ఆ కవిత “పాత పద్యాన్ని చూసినప్పుడు ఒకప్పటి నన్ను నేనే కలుసుకున్నట్టుగా ఉంటుంది” అని ముగుస్తుంది. మొత్తం మీద కవిత్వాన్ని సంతానంగా సంభావించటం కవికి తన కవితతో ఏర్పడిన ఆత్మీయ అనుబంధాన్ని సూచిస్తుంది. దీనివల్ల తన కవితను ఎవరైనా విమర్శించినా, లేదా మార్పులు సూచించినా వారికి ఒక పట్టాన నచ్చదు. కొంతమంది కవుల కవితల్ని విమర్శించటమంటే, బాలింతరాలైన జంతువు చూస్తుండగా దాని పిల్లల్ని ముట్టుకున్నంత ప్రమాదం! ఒకసారి కవిత వెలువడిన తరువాత దానిపై ఒక నిర్లిప్తత పాటించటం, మూడో వ్యక్తిగా దానిని మళ్ళీ పరిశీలించటం కవులు అలవరచుకోవలసిన లక్షణాలుగా నాకు తోస్తాయి. ఐతే, ఇటువంటి మార్పు రావటం అంత తేలిగ్గా జరిగే పనికాదు.

ఈ కారణం వల్లనే, కవితా సంకలనాలను పరిశీలించి, సలహాలిచ్చే బాధ్యత నిర్వహిస్తున్నప్పుడు  విడి కవితల విషయంలో కొంత సంయమనం పాటించవలసి వస్తుంది.  వాటిలో వాస్తవ దూరమైనవిగాని, వ్యాకరణ దోషాలుగాని ఉంటే మాత్రం తప్పక సరిచెయ్యవచ్చు. చాలా కాలం క్రితం రేడియోలో వచ్చిన ఒక కవితలో కవిగారు “చెట్లు మనకు గాలినిస్తాయి” అని చదవటం విన్నాను. గాలికి చెట్లు ఊగటం కాదు, చెట్లు ఊగితేనే గాలి వస్తుందని ఆయన పొరపడినట్టున్నారు. (నిజంగానే ప్రకృతి మొత్తం స్తంభించిన ఒక వేసవి సాయంకాలం వేప చెట్టుకింద కూర్చుని ఉన్నప్పుడు, వింజామర వీచినట్టు ఒక గాలితెమ్మెర సోకితే మనకు అది చెట్టు ఇస్తున్న గాలే అనే భ్రమ కలుగుతుంది. బహుశా కవిగారు అటువంటి స్థితిలోనే ఈ వాక్యం రాసి ఉంటారు.)  అలాగే, పారిభాషిక పదాలు వాడటంలో కూడా జాగ్రత్త అవసరం. ఉదాహరణకి, “సూర్యుడి చుట్టూ తిరిగే ఉపగ్రహాలం” అన్న ప్రయోగం సరిగా అనిపించదు. సూర్యుడి చుట్టూ తిరిగేవాటిని గ్రహాలని, వాటి చుట్టూ తిరిగేవాటిని ఉపగ్రహాలని అనటం ఆచారం. ఇటువంటిదే మరొక వాక్యం “ఈ నగరం గెలాక్సీలో , అదేపనిగా కాటేసే గాలి దుమారాల్లో”. గెలాక్సీలో గాలే ఉండనప్పుడు గాలిదుమారాలకి తావెక్కడ ఉంది? ఐతే, సూర్యుడిలో కూడా గాలి లేదుగాని, solar storms గురించి చెబుతారు కదా. అందువల్ల, storm అనే అర్థం వచ్చే విధంగా గాలి దుమారాన్ని కవి వాడి ఉండవచ్చునా? కవికి భేదం తెలిసి ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తే ఫరవాలేదు. ఆ విషయం నిర్ధారించుకోవటం మంచిది. ఒక పదచిత్రం వాడినప్పుడు దాని సాధ్యాసాధ్యాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవలసి వస్తుంది. అంటే, అధివాస్తవిక ధోరణికి లేదా అసంబద్ధ కవితలకి పేరుపడ్డ కవులవైతే, మనకు తెలుసు కాబట్టి, ఆ విధమైన  విచికిత్స చెయ్యం. అలాగే, ఒక అనుభవాన్ని మనకు వ్యక్తం చెయ్యటానికి, లేదా ఒక విధమైన వాతావరణాన్ని కల్పించటానికి ఒక కాల్పనికమైన దృశ్యాన్ని కవి వర్ణించినప్పుడు కూడా మనం అందులోని సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించం. కాని, మిగతా సందర్భాల్లో  ఈ పరిశీలన తప్పక వర్తిస్తుంది. ఉదాహరణకు, దిగుడు బావిలోకి దిగే మెట్ల పోలిక వాడిన ఒకటి రెండు కవితల గురించి నేనీమధ్య ప్రస్తావించాను. దిగేటప్పుడు, ఒకటొకటిగా మెట్టు పడిపోయి, తిరిగి పైకి రాలేకపోయినట్టుగా ఒక కవిమిత్రుడు రాస్తే, కింద మెట్లు ముందు విరగకుండా పై మెట్టు ఎలా విరుగుతుందని నేనడిగాను. అయితే, అవి విడివిడిగా ఉండే పలకల్లాంటి మెట్లవంటివనుకొంటే అప్పుడది సాధ్యమౌతుందని వేరొకరు దానికి సమర్థన చెప్పారు. ఇటువంటిదే మరొక వాక్యం “‘తవ్వుకున్నకొద్దీ /అడుగు లేని బావిలోకి /ఒక్కొక్క మెట్టు అనేకసార్లు /ఎక్కిపడిపోవడం”. దీనికి కూడా  నాకు స్పురించని అర్థమేదైనా ఉండిఉండవచ్చు. పరిశీలకుని సందేహాలకు కవి వద్ద సమాధాలుంటే ఫరవాలేదు. కవి ఉద్దేశపూర్వకంగా వాడాడని నిర్ధారించుకోవటం, ఈ విషయాలు ప్రచురణకు పూర్వమే చర్చించు కోవటం మంచి సాంప్రదాయమౌతుంది.  ప్రచురణానంతరం సమీక్షలో వీటిని ప్రస్తావించటం సమీక్షకునికి కష్టంగాను, కవికి బాధాకరంగాను ఉంటుంది.

అంతమాత్రంచేత, కవిత్వానికి లాజిక్ సరిపోతే చాలునని చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇటువంటి దోషాలు సంగీతంలో అపశ్రుతుల వంటివి. అపశ్రుతి లేనంత మాత్రానే ఒక పాట గొప్ప సంగీతమైపోదు. దానికి సమకూరవలసిన ఇతర ఆధారువులనేకం ఉంటాయి. కాని, ఒక గొప్ప పాటకి ఒకే ఒక అపశ్రుతి నష్టం కలిగించవచ్చు. ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది.

వ్యాకరణం విషయానికి వస్తే, పద సంయోజనలో, కొత్త పదబంధాలు, నుడికారాలు సృష్టించటంలో, ఉన్నవాటిని విభిన్నంగా వాడటంలో కవికి కొంత స్వేచ్ఛ ఉంటుంది. దానిని గౌరవిస్తూనే, పరిశీలకులు వాటిలోని అన్ని కోణాలను జాగ్రత్తగా పరిగణలోకి తీసుకోవాలి. స్నానించటం, గానించటం వంటి ప్రయోగాలు ఒకప్పుడు కొత్తగా తోచేవి గాని, ఇప్పుడు పాతబడి మొనాటనస్ గా అనిపిస్తాయి,. అటువంటివి పదేపదే వాడటం వాంఛనీయమేనా అన్నది ఆలోచించుకోవాలి. వాడుకైన ప్రతీకలను వేరే విధంగా వాడటం ఒకటి. ఉదాహరణకి, ఆ మధ్య ప్రపంచీకరణను వ్యతిరేకించే కవితలతో వచ్చిన ఒక సంకలనానికి ‘గ్లోబల్ ఖడ్గం’ అని పేరు పెట్టారు. దానిమీద సమీక్ష రాసిన ఒక కవి ఆసక్తికరమైన విషయం చెప్పాడు. సాధారణంగా ఖడ్గమన్నది సాహసానికి, ధర్మనిరతికి ప్రతీక. శ్రీశ్రీ తన సంకలనాన్ని “ఖడ్గ సృష్టి” అన్నాడు. అజంతా “ ఒక కవితలో “దృశ్యం మారకపోతే నిష్క్రమణ లేదా ఖడ్గ ధారణ.” అన్నాడు. అలా కాకుండా, ఖడ్గాన్ని తలపై వేలాడే కత్తికి ఉపయోగించటమన్నది కొత్త ప్రయోగం. అంటే వాడకూడదని కాదు. అందుకు తగిన బలమైన కారణాన్ని చూపగలగాలి. ఇకపోతే, దుష్టసమాసాల విషయంలో కవి ఒక పద్ధతిని అనుకొని, దానినే పాటించటం మంచిది. కొందరు కావాలని, అంటే ఒక అపహాస్యాన్ని పలికించటానికో లేదా కట్టుబాటును ధిక్కరించటానికి ప్రతీకగానో తెలుగు – సంస్కృత పదాల్ని ఆమోదయోగ్యం కాని రీతిలో కలిపి సమాసం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కవికి తెలిసి, ఒక ప్రయోజనం కోసం చేసే అతిక్రమణలను అర్థం చేసుకోవచ్చు. కాని, అటువంటి వ్యాకరణ దోషం ఒకటి ఉంటుందని కూడా తెలియకపోవటం వల్లనో, తను వాడిన రెండు పదాల్లో ఒకటి తెలుగు, మరొకటి సంస్కృతమని తెలియకపోవటం వల్లనో చేసే పొరపాట్లు మాత్రం ప్రమాదకరం. వచన కవిత్వం భాషను సరళీకరించింది. అనేకరకాల యాసలకు, పలుకుబడులకు కావ్య గౌరవం కల్పించింది. అంతమాత్రం చేత, భాషకు సంబంధించినంత వరకు వచన కవులకు అపరిమితమైన స్వేచ్ఛ  ఉందని భావించకూడదు. కవనేవాడికి ముందు తన భాష మీద అపారమైన గౌరవం, ప్రేమ, మక్కువ ఉండాలి. తను వాడకపోయినా, అంతకు ముందు సాహిత్యంలో వచ్చిన అద్భుతమైన పద ప్రయోగాలను గమనించి, ఆస్వాదించగలిగే సహృదయం కలిగి ఉండాలి. అప్పుడే కవిగా రాణిస్తాడు.

అనువాద కవితల గురించి ప్రస్తావించే ముందు ఒక విషయం చెప్పాలి. ఇటీవలి కాలంలో ఆగ్లం నుంచి, ఇతర భాషల నుంచి తెలుగులోకి విరివిగా అనువాదాలు వస్తున్నాయి. ఇది మంచిదేగాని, తెలుగు కవిత్వానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు రావాలంటే , ముందు జరగవలసినది తెలుగు నుంచి ఆంగ్లానువాదాలు. అంతర్జాతీయం వరకు అక్కర్లేదు, భావి తరాల తెలుగు పిల్లలు కూడా రేపు మన కవిత్వాన్ని చదవాలంటే, అది ఇంగ్లీషులో ఉంటేనేగాని చదవలేని పరిస్థితి త్వరలోనే ఏర్పడుతుందని అంటున్నారు. తెలుగు కవిత్వానికి ఆంగ్లానువాద సంకలనాలు చెదురుమదురుగా వస్తున్నమాట నిజమే. అవి మరింత విరివిగా వస్తే బాగుంటుంది. అలాగే, చేరవలసిన వారికి చేరాలిగాని, మళ్ళీ వాటిని తెలుగు కవులకి పంచాటానికే పరిమితమైతే పెద్దగా ప్రయోజనం లేదు. ఆంగ్లంలోకి అనువాదమైన కవిత ప్రభావాన్ని చెప్పటానికి, ఇటీవల యదుకుల భూషణ్ కవిత Indian Literature లో వస్తే, దానిని, గుల్జార్ చూసి, హిందీలోకి అనువదించి, ఆ అనువాదం అర్థయుక్తంగా చదువుతూ వున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చెయ్యటం ఒక ఉదాహరణ. ఒక మంచి కవిత, మంచి అనువాదం ఒక మంచి కవి దృష్టిలో పడినప్పుడు కలిగే అనుకూల ఫలితాలకు ఇదొక తార్కాణం. ఏ భాషలో వచ్చినా, అనువాద కవితల సంకలనాలను చూస్తున్నప్పుడు విడి కవితలను నిశితంగా పరిశీలించటానికి అభ్యంతరం ఉండకూడదు. స్వీయ కవిత ఆత్మకథ వంటిదని అనుకుంటే, అనువాద కవిత వేరొక కవి ఆత్మకథని తన గొంతుతో చెప్పటమౌతుంది. అందువల్ల, మరింత జాగ్రత్త అవసరం. సాధ్యమైనంత వరకు అనువాదం మూల భాష నుంచి చెయ్యటం అభిలషణీయం. ఒకే కవి కవితల్నిగాని, ఒక కావ్యాన్నిగాని అనువదిస్తున్నప్పుడు ఇది సాధ్యం కావచ్చు. కాని, ఏ కవైనా వివిధ కవులు అనేక భాషల్లో రాసిన కవితల్ని అనువదించి, ఒక సంకలనంగా రూపొందించే ప్రయత్నం చేసినప్పుడు ఆ కవికి అన్ని భాషలు వచ్చి ఉండాలని ఆశించలేం కదా! అటువంటి సందర్భంలో ఇంగ్లీషు ద్వారా చెయ్యటం తప్పనిసరి అవుతుంది. కాకపొతే, వీలైనంత వరకు ఒక కవితకు ఇంగ్లీషు అనువాదాలు రెండు మూడు సంపాదించి, వాటిని సరిచూసుకుని తన అనువాదానికి మెరుగులు దిద్దుకుంటే బాగుంటుంది. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. అసలు ఒక కవి కవిత్వాన్నిగాని లేదా ఒక కవితను గాని ఎంతగానో అభిమానించి, అది మనసులో పూర్తిగా ఇంకాకనే అనువాదం చెయ్యాలనే ఆలోచనకు తావివ్వాలని నేననుకుంటాను. అప్పుడు ఎంత శ్రమ పడినా కష్టం అనిపించదు. ఇష్టపడి, పూర్తి సమయం వెచ్చించి  చేస్తున్న పని కాబట్టి పొరపాట్లు జరగటానికి కూడా అవకాశం తక్కువ. ఐతే, అనువాదంలో కొంత రిస్కు ఎప్పుడూ ఉంటుంది. ఒకోసారి ,బాగా ఇష్టపడి చేసిన అనువాదంలో కూడా అనుకోని పొరపాటు దొర్లవచ్చు. కాళోజీ గారెకి ఖలీల్ జీబ్రాన్ ప్రసిద్ధ కావ్యం The Prophet అంటే చాలా అభిమానం. దానిని ఆయన “జీవన గీత” పేరుతో అనువదించారు. అందులో ఒకచోట well అనే పదాన్ని మంచి అనే అర్థంలో కవి వాడితే, అది అనువాదంలో నుయ్యి అనే పదంగా వచ్చింది. క్రూర విమర్శకు పెట్టింది పేరైన రారా గారు ఆ పుస్తకాన్ని సమీక్షిస్తూ దానిపై తీవ్రమైన వ్యాఖ్య చేస్తే, కాళోజీ చాలా బాధ పడ్డారని విన్నాను. ఆయన రాసింది రాసినట్టుగా అచ్చువెయ్యలేదు. తన మిత్రులు, ఇతర కవులు కొంత మందికి చదివి వినిపించాకే ప్రచురించారు. వారెవరూ ముందుగానే ఆ తప్పుని ఎత్తి చూపించకపోవటం ఆయనకు మరింత బాధ కలిగించింది. ఇటువంటి సందర్భంలోనే, సహృదయులైన, బాధ్యత కలిగిన సంపాదకుల ఆవశ్యకత మనకు తెలుస్తుంది. ఆ విధమైన సంపాదకులులెవరైనా ముందు పరిశీలించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అలాగే, అనువాదం ప్రచురించేటప్పుడు మూలం, దాని అనువాదం పక్కపక్కనే ఉండేట్టుగా ప్రచురిస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది. అనువాదం అతి జాగ్రత్తగా చెయ్యటంలోను, దానిని అర్థవంతంగా ప్రచురించటంలోనూ ఇటీవల వేలూరి వెంకటేశ్వరరావు గారు వెలువరించిన సౌభాగ్య కుమార్ మిశ్రా ఒరియా కవితల అనువాద పుస్తకం ‘అవ్యయ’ ఒక ప్రమాణంగా నిలుస్తుంది. అందుకు ఆయన అభినందనీయులు. అలాగే, చాగంటి తులసిగారు ఎంతో ఇష్టపడి చేసిన మహాదేవి వర్మ హిందీ గీతాల అనువాదం కూడా చెప్పుకోదగినదే. ఈ రెండు పుస్తకాలలోనూ మూలం, దాని అనువాదం పక్కపక్కన ఉండటం వాటి ప్రామాణికతకు ఒక ముఖ్య కారణం.

విడి కవితల పరిశీలన తరువాత, కవితలను ఒక సంకలనంగా కూర్చటంలో ఏర్పడే సమస్యల గురించి కొంత చర్చించవచ్చు. వీటిలో ముఖ్యమైనది పునరుక్తి. కవితలకెన్నుకున్న వస్తువు విషయంలోగాని, పదాలు, ప్రతీకల విషయంలోగాని పునరుక్తులు దొర్లటమన్నది కవికి తెలియకుండానే జరగవచ్చు. విడివిడిగా పత్రికలలో వేరువేరు సమయాల్లో అవి వచ్చి ఉంటే, వాటినెవరూ గమనించరు. కాని, ఒక సంకలనంగా ఆ కవితలన్నిటినీ ఒకేచోట చేర్చినప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా చదివేవారికి అవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. నిజానికి, కవే ఆ విషయాన్ని ముందుగా గమనించి ఉండాలి. అప్పుడు కొన్నిచోట్ల వాటిని మార్చటమో, పూర్తిగా తొలగించటమో చెయ్యవచ్చు. ఉదాహరణకి, ఇటీవల నేను చదివిన కవితా సంకలనాల్లో నీడ, చీకటి వెలుగులు, పడవ, మృత్యువు, శరీరం  మొదలైన ప్రతీకలు అనేకసార్లు రావటం గమనించాను. ఈ కవితల్ని విడివిడిగా చూసినప్పుడు కొన్ని మంచి కవితలే కావచ్చు. కొత్తరకం ప్రతీకలు కూడా అనేకం మనకు వాటిలో కనిపించవచ్చు. అయినప్పటికీ సంకలనంగా చదివినప్పుడు ఇటువంటి పునరుక్తులు కొంత ఇబ్బంది పెడతాయి. నేను సంకలనం కూర్చేటప్పుడు పునరుక్తికి సంబంధించిన  విషయాన్ని చాలా జాగ్రత్తగా సరిచూసుకుంటాను. ఎక్కడైనా కనిపిస్తే మార్చటమూ, తొలగింటమో చేస్తూ ఉంటాను. అయినా కూడా, నేను వాడిన ప్రతీకల్లో అటువంటివి దొర్లి ఉండవచ్చు. ఒకసారి చేరాగారు చెప్పారు – ‘నీ కవితల్లో రంగస్థలంపై నటన, పాత్రలు వంటి ప్రతీక ఎక్కువసార్లు వాడుతున్నావు’ అని. అప్పటినుంచి అటువంటి ప్రతీకను వాడే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటాను.

కవికి తన కవితలన్నిటి మీద అభిమానం ఉండటం సహజం. తనే ప్రచురిస్తున్న పుస్తకం కాబట్టి, అప్పటివరకు రాసిన అన్నిటినీ అందులో చేర్చాలనే ఉత్సాహం ఉండటం కూడా సహజం. కాని, సంకలనంగా కూర్చుతున్నపుడు కొన్ని కవితలు మిగతావాటి స్థాయిని అందుకోలేక పోవచ్చు. లేదా వస్తుపరమైన పునరుక్తికి చోటిస్తూ ఉండవచ్చు. అందువల్ల, వాటిని నిష్పక్షపాతంగా, నిర్మమకారంతో పరిశీలించే సంపాదకులెవరైనా చూడటం అవసరం. సంపాదకులు కాకపొతే, కవిత్వం గురించి తెలిసిన మిత్రులెవరైనా ఆ పాత్ర పోషించవచ్చు. నిర్మమకారంతో చూడటం, నిర్మొహమాటంగా తమ అభిప్రాయం చెప్పటం ముఖ్యం. సంకలనం కూర్పులో కవితల వరుస మీద కూడా దృష్టి పెట్టాలి. తెలిసో, తెలియకో కొందరు బలహీనమైన కవితల్ని ముందు చేర్చి, మంచి వాటిని మధ్యకి నెడుతూ ఉంటారు. పాఠకుడు అదే క్రమంలో కవితలు చదువుతాడనే గ్యారంటీ లేదుగాని, ఉన్నవాటిలో బలమైన కవితలతో సంకలనం మొదలుపెడితే బాగుంటుంది. ఈ విషయంలో కూడా సంపాదకుల లేదా మిత్రుల సలహాలు ఉపకరిస్తాయి.

అలాగే, సంకలనంలో కవితల్ని చేర్చేటప్పుడు, వాటి క్రమానికి కొంత ప్రాధాన్యత ఉంటుంది. పాఠకుడు అదేక్రమంలో చడువుతాడనే హామీ లేదుగాని, ఉన్నవాటిలో బలమైన కవితలు కొన్న ముందు చేర్చటం మంచిది. మంచి కవిత్వం గురించి చెప్పేటప్పుడు శివారెడ్డి గారు మాత్రమే వాడే ప్రయోగం ఒకటుంది. అది, ‘విసిరి పారేసే కవిత్వం’. అంటే, బలమైన కవిత పాఠకుణ్ణి ఒక కుదుపు కుదిపి, తెలియని తీరాలకి విసిరేయాలన్నది ఆయన భావం. అటువంటి కవిత ఏదైనా మన దగ్గర ఉంటే, దానిని మొదటి కవితగా చేర్చితే బాగుంటుంది. అంతేగాని, మొదటి కవిత చదవగానే పాఠకుడే పుస్తకాన్ని ఎక్కడికో విసిరేసేలాంటి కవితతో మొదలుపెడితే, ఆతరువాత రెండవ కవిత ఎంత గొప్పదైనా ప్రయోజనం ఉండదు.

కవితల కూర్పు, క్రమం విషయంలో కవులకి కొన్ని సరదాలు, లేదా సెంటిమెంట్లు ఉండటంలో తప్పు లేదు. ఉదాహరణకి, నాకు 29 సంవత్సరాల వయసున్నప్పుడు వచ్చిన నా మొదటి సంకలనంలో 29 కవితలు, దాదాపు 40 సంవత్సరాల వయసులో వచ్చిన రెండవ సంకలనంలో 40 కవితలు ఉంటాయి. వయసు మీదపడే కొద్దీ, ఈ సూత్రం పాటించటం కష్టం కాబట్టి దానికంతటితో స్వస్తి చెప్పాననుకోండి. వేరొకటి మాత్రం మూడింటిలోనూ పాటించాను. అది, పుస్తకం పేరు వచ్చే కవితను మూడవ కవితగా చేర్చటం, మొదటి కవిత ఏదో ఒక పండుగకు సంబంధించినదై ఉండటం – హోలీ, హేలోవిన్, శివరాత్రి -ఇలా. సాహిత్యాభిమానం కలిగిన మిత్రుడొకరికి ఈ విషయం చెప్పినప్పుడు, అతను దానిని  “పుస్తక వాస్తు“ అని వ్యాఖ్యానించాడు. వాస్తు అనేది పెద్ద మాటగాని, దీనిని కేవలం ఒక సరదా, లేదా సెంటిమెంటని చెప్పవచ్చు. సొంత ఖర్చుతో పుస్తకం వేసుకునే కవి అటువంటి చిన్నచిన్న సరదాలు కొన్ని తీర్చుకోవటం మరీ అంత పెద్ద తప్పేమీ కాదు కదా!

 

పుస్తకంలో ప్రతి కవితకు ఒక బొమ్మను చేర్చటం కూడా ఒక సరదా వంటిదేనని చెప్పవచ్చు. వీటివల్ల, పుస్తకానికి అదనపు ఆకర్షణ ఏర్పడవచ్చుగాని, కవితలకు వచ్చే అదనపు విలువ ఏదీ ఉండదని నా అభిప్రాయం. వివిధ కారణాలవల్ల కొన్ని సంకలనాలలో కవులో, లేదా ప్రచురించినవారూ వీటిని చేరుస్తూ ఉంటారు. విశ్వనాథ వారి “కిన్నెరసాని పాటలు” పుస్తకంలో అక్కడక్కడ బొమ్మలుంటాయి. “బొమ్మలు బాపిబావవి” అని రాస్తారు విశ్వనాధ. గూటాల కృష్ణమూర్తిగారు ప్రచురించిన “మహాప్రస్థానం”లో బాపు బొమ్మలుంటాయి. త్రిపురనేని శ్రీనివాస్ అజంతా కవితల్ని “స్వప్నలిపి”గా కూర్చి, మధ్య కొన్ని చిత్రాలతో అందంగా ముద్రించాడు. ఇటీవలి కవులు సిద్ధార్థ, నారాయణ స్వామి సంకలనాల్లో ఆలె లక్షణ్ బొమ్మలు, ఇంద్రప్రసాద్ పుస్తకంలో మోహన్ బొమ్మలు, రవిప్రకాష్ పుస్తకంలో వెంకట్రావు, గిరిధర్ వంటి వారి బొమ్మలు ఉంటాయి. మొత్తానికి, ముఖచిత్రం విషయంలో అందరిదీ ఒకటే దారి అయినా, విడి కవితలకి బొమ్మలన్నది వారివారి అభిరుచికి సంబంధించిన విషయంగా భావించి, విడిచిపెట్టవలసి వస్తుంది. నా అభిరుచికి సంబంధించినంత వరకు ఒక కవిత ద్వారా కవి చెప్పే భావానికి ఆ కవి వాక్యాలే అంతిమం కావాలి గాని, వేరే illustration వల్ల ప్రయోజనం ఉండదని అనిపిస్తుంది. ఐతే, “కూనలమ్మ పదాలు” హాస్య/వ్యంగ్య కవితలతో కూర్చిన పుస్తకంలో మాత్రం బొమ్మలు తప్పక రాణిస్తాయి.

చివరిగా పుస్తకం సైజు గురించి కూడా రెండు ముక్కలు చెప్పుకోవాలి. కవితా సంకలనాలకి 1/8 డెమ్మీ సైజు దాదాపు ప్రమాణంగా స్థిరపడిపోయింది. అప్పుడప్పుడు కొందరు క్రౌను సైజులో వేస్తారు. నా మొదటి పుస్తకం క్రౌను సైజులోనే వచ్చింది. కొన్ని అపవాదులు – అజంతా “స్వప్నలిపి”, మహె జబీన్ “ఆకులు రాలు కాలం”, భూషణ్ “నిశ్శబ్దంలో నీ నవ్వులు”, శ్రీధర్ బాబు “అనేక వచనం” వంటివి. సిద్దార్థ “దీపసశిల”, రమణజీవి “నలుగురు పాండవులు” landscapeలో ప్రచురితమైన పుస్తకాలు.  పెమ్మరాజు వేణుగోపాలరావు గారి కవితల సంగ్రహంగా వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన “ఆత్మార్పణ” కూడా విభిన్నమైన సైజులో ఆకర్షణీయంగా ఉంటుంది. ఒక ప్రామాణికమైన సైజుని పాటించటం పాఠకులకి చదవటానికి, దాచుకోవటానికి అనుకూలంగా ఉంటుందన్నది నిజమే అయినా, కవులు తమ సృజనాత్మకతను బట్టి పుస్తకం సైజులో వైవిధ్యం చూపించటం ఆహ్వానించదగినదే. ఐతే, సైజులో కాదుగాని, పేజీల సంఖ్యలో మాత్రం కవులు కొంత సమయమనం పాటించటం మంచిది. Collected Works పేరుతో బృహద్గ్రంధాలు తీసుకువస్తే చూడటానికి బాగుంటాయిగాని, ఉత్సాహంగా చదవాలనుకునే పాఠకులకి సైతం కొంత ఇబ్బందిని కలిగిస్తాయి.

ఇప్పటివరకు మనం పరిశీలించిన ప్రమాణాలలో కొన్ని స్వయంగా పాటించగలిగినవైతే, మరికొన్నిటికి వేరేవారి సహకారం అవసరమౌతుంది. అటువంటి సహకారంలో పాల్గొనటమే సంపాదకులు నిర్వర్తించ వలసిన బాధ్యత. ఐతే, ముందే చెప్పినట్టు, ఈ పని కవికి అదనపు భారం కాకుండా ఉండాలంటే, ఇది ఎవరో ఒకరు స్వచ్చందంగా నిర్వహించవలసి ఉంటుంది. నా ఉద్దేశంలో కవిత్వ రచన మీద అవగాహన కలిగిన, కవిత నిర్మాణంలోని లోతుపాతులను అర్థం చేసుకోగలిగిన సహ కవులే ఈ పనికి అర్హులు. అటువంటివారు కొందరు ఒక సలహా మండలిగా ఏర్పడి ఈ రకమైన సహకారం అందించవచ్చు. తమ కవితలను పుస్తకంగా తేవాలనుకునే కవులు, వారికిష్టమైతే ముందుగా వ్రాతప్రతిని వీరికి పంపించి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. దీనివల్ల, కనీసం కొన్ని చిన్న, నివార్యమైన దోషాలు ముందే తొలగించగలిగే అవకాశం ఉంటుంది. ఆ దోషాల గురించి పుస్తకం వెలువడ్డాక సమీక్షకుని ద్వారా తెలుసుకోవటం కంటే ఇది ఎన్నో రెట్లు మెరుగు. మొత్తం మీద అందరి ఉద్దేశం కవితా సంకలనాల ప్రచురణ ప్రమాణాలు మెరుగు పరచటమే కాబట్టి, ఆ దిశగా, కవులు, వారికి సహకరించే సంపాదక కవిమిత్రులు ఏ విధమైన ప్రయత్నం చేసినా, అది అభినందనీయమే. 

(డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి వారి 20 వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సదస్సులో చేసిన ప్రసంగం ఆధారంగా)

*****

Bio
bottom of page