top of page
Anchor 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

కథా మధురాలు

కనకాలు

Kanneganti Anasuya

హైమావతి  ఆదూరి

madhuravani.com అంతర్జాల పత్రిక నిర్వహించిన కథలపోటీ లో ప్రశంసా బహుమతి పొందిన కథ

     కార్తీకమాసపు చలి వణికిస్తున్నది. ఎక్కడా చడీ చప్పుడూ లేకుండా జనం ముసుగులు       తన్ని పడుకునున్నారు. కుక్కలు కూడా అరవడంలేదు. ముణగదీసుకుని పడుకునున్నాయి. ఐతే కనకాలు మాత్రం మూడేళ్ళ పసిబిడ్డడ్ని చంకనేసు కుని, ఆ చలిని లెక్కచేయకుండా చకచకా నడుస్తున్నది. వేణుగోపాలస్వామి గుడి గేటు తీసి లోపలికెళ్ళింది. చంకనున్న పిల్లాడ్ని మంటపంలో కూర్చోబెట్టింది. చిరిగిన చీర ముక్కలతో కుట్టిన బొంత వాడి మీద కప్పింది.

    "ఈడ్నేకూసో బిడ్డా! బిరబిరా ఆవరణ సిమ్మొస్తా"అంటూ, గూట్లో భద్రంగా దాచిన ‘తొండం దేవర’ బొమ్మున్న కాయితం, తెచ్చి "సావిని సూస్తా ఉండు బిడ్డా!", అంటూ చేతికిచ్చింది.

  చీర చెంగు నడుం చుట్టూ చుట్టి బిగించి దోపింది. బావి దగ్గరున్న చీపురు తీసుకుని  చకచకా మిషన్ లా చిమ్మసాగింది. ఆవరణలో ఉన్న వేప, రావి , ఇంకా అనేక చెట్ల పూలూ, ఎండాకులు చిమ్ముతుంటే గలగలా శబ్దంచేస్తూనే, విధేయత గల సైనికుల్లా చీపురు వెంట వెళ్లసాగాయి. వంటరితనం పోగొట్టుకోను 'రారా కిట్టయ్యా. రారా కిట్టయ్యా !' అని వచ్చీ రాని భాషలో పాడు కుంటూ ఆవరణ అంతా చిమ్మేసి , ఒక మూల పోసింది.  గుడి వెనక గూట్లో ఒక చిన్న పోలీథిన్ కవర్లో , చెమ్మ పట్టకుండా ఉండను దాచుకున్న అగ్గిపెట్టె తీసి ఆ ఎండాకులకు అంటించి, మంట పెట్టింది.

  కొడుకుని ఎత్తుకుని తెచ్చి అక్కడున్న ఒక రాతి మీద కూర్చోబెట్టింది. "ఈడ కూకోరా! సలి పోతాది" అనిచెప్పింది. వాడు చాలా బుధ్ధిగా తల్లి చెప్పినట్లే వింటానని తలూచాడు.

 గబగబా బావిలోనీళ్ళు చేదతో తోడి గుడి అవరణ అంతా టెంకాయ పుల్లల చీపురుతో కడిగి శుభ్రం చేసింది. ఆవరణ అంతా మిలమిలా మెరిసి పోతున్నది. ముగ్గు డబ్బీ తీసుకుని మూల మూలలా ముగ్గు లేసింది.గుడి ముందు పెద్ద ముగ్గేసి, నిత్యమల్లె పూలు తెచ్చి మధ్యలో పోసింది.

  గర్భగుడి ఎదురుగ్గా నిలబడి చేతులు జోడించి మొక్కుకుంది. మంటపాలన్నీ చిమ్మేసి, తడి గుడ్డ పెట్టి తుడిచేసింది. అది నడుమో స్ప్రింగో గానీ అలసటన్నమాటే ఎరుగనట్లు పని చేసుకు పోతున్నది.  పని పూర్తయ్యేసరికి  అలసట తెలిసిందేమో, కొడుకును చంకనేసుకుని, బావి వద్దకెళ్ళి దాచి ఉంచుకున్న వేప పుల్లతో పళ్ళు బాగా తోముకుని నీళ్ళతో కడుక్కుని, ముఖం, చేతులూ క్రిందున్న రాతికేసి రుద్ది రుద్ది కడిగి నాక ,కొడుకు నోరూతోమి, కడిగింది. వాడ్ని చంక నేసుకుంది.  

 గుడి ముందు ప్రతిష్టించి ఉన్న వినాయకుని విగ్రహానికి వంగి నమస్కరించి,కొడుకు చేతకూడా దణ్ణం పెట్టించి , "తొండం దేవరా! నీవే దిక్కు, నా బిడ్డడికి కాస్తంత సదువియ్యిదొరా!"అని మొక్కు కుంది.   కొడుకును మళ్ళీ చంకనేసుకుంది.   ఊపిరి గట్టిగా పీల్చు కుంటూ, గుడి ముందు అప్పుడే అంగడి తెరిచి టీ కాస్తున్న కామయ్య టీ స్టాల్ దగ్గర నుంచుంది.    

     తలెత్తి కనకాల్ను చూసిన కామయ్య "ఏం కనకాలూ! అప్పుడే గుడి చిమ్మేసినావంటే! ఎంత పెందళ కాడొచ్చినవే బిడ్డా! పసో న్నేసుకుని, నీ ముకాన ఆ దేవుడిట్టా రాసిండేమోనే బిడ్డా!లేపోతే రయిల్వే ఉద్దోగం చేత్తున్న నీమొగుడట్టా తాగితాగి పోతాడంటే! ఆ ఉద్దోగమూ పర్మినెంట్ కాపోయె! లేపోతే అదన్నా వచ్చేది నీకు. ఇంద ఈ టీనీల్లు చినపిలగాడికి తాపిచ్చి, నీవూ తాగు." అంటూ రెండు గ్లాసుల టీ ఇచ్చాడు, తన సానుభూతి కలగలిపి. రోజూ మొదటి టీ రెండు కప్పులూ వారికోసమే చేసి ఇస్తాడు కామయ్య, సొంత కూతురు కాక పోతేనేం , మనసున్న తండ్రి.  

   టీ అందుకుని పిల్లాడి కిచ్చి"తాగరా కన్నా!"అంటూ మరో గ్లాసందుకుని నోరు తడుపుకుని వేడి నాలిక్కు తగిలి ప్రాణం వెచ్చబడ్డాక ," బాబయ్యా! ఏం సేసేదే! గత జనమంలో ఏఏపాపాలు జేసి పుట్టి న్నో! అనుబఇంచక తప్పద్దా! ఈడి ముకాన ఆ తొండం దేవరేం రాసిండో!నా యట్ల కూలినాలీ సేసుకోకుం డా ఇస్కూల్లో ఏసి సదివిద్దారని నా ఆస . సరేగానీ బాబయ్యా! గిన్నె లున్నయేమో గందే! తోమెలతా, లాయరు బాబింటి కెల్లిన్నంటే మద్దినేల వుద్ది రాను. నీవు సూపిన పనే గదేది. నీ పున్నాన ఇంతొన్నం తింటన్నం ఇద్దరమూనూ "అంటూ కొడుకుని టీ స్టాల్ ముందున్న బల్లమీద కూర్చో బెట్టి, టీస్టాల్ వెనకున్న జాగాలో వున్న గిన్నెలన్నీ చకచకా తోమేసి, అక్కడున్న బండరాయి మీద బోర్లించింది.

   "బాబయ్యా! ఎల్లొత్తా. లాయరు బాబుగారింటి కాడ పని లేటవుద్ది. పెద్దమ్మగారు లేచేలకు ముగ్గే సుంచాల." అంటూ బిడ్డను చంక నేసుకుని చకచకా నడవసాగింది.                                          

మూడేళ్ళ పిల్లాడు తనతోపాటే వేగంగా నడవ లేడని వాడినలా మోస్తుంటుంది ఆ తల్లి.  

 ఆ పాటికే తూర్పు దిక్కున వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. సూర్య భగవానుడు, దినకరుడు, లోక బాంధవుడు తన వెలుగులతో, వేడితో లోకాన్ని ఆనందింపజేయను తన ఏడుగుఱ్ఱాల రధంలో కదిలి వస్తున్నట్లున్నాడు. కాంతులు తెరలు తెరలుగా పృధ్వీమాతను తాకి పులకింప జేస్తున్నాయి.

   వెలుఁగుఱేఁని కంటే ముందే  కనకాలు పోటీపడి వేగంగా నడుస్తూ లాయర్ రఘునాధరావు ఇల్లు చేరింది. విభాకరుడు వచ్చేముందే వాకిలి చిమ్మి, పచ్చని ఆవు పేడతో కల్లాపు చల్లి,  మూడురంగుల ముగ్గేసింది. ఆముగ్గు అందం చూడను అందరికంటే ముందు ఇనుడు వచ్చాడు, చిరుచిరు కాంతుల తో ముగ్గు మీద తన కిరణాలు బారచాపి ఫోటోలు తీసుకున్నాక పైపైకి సాగిపోసా గాడు.

    అంత చలిలోనూ వడివడిగా పని చేసిన కనకాలు ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వరండా లో కూర్చుని  తనవైపే చూస్తున్న కొడుకును ముద్దు పెట్టు కుంది.

  "కూకోరయ్యా! పెద్దమ్మగారొత్తే తింటానికో, తాగటానికో ఏవైనా ఇత్తారు "అంటూ, మళ్ళా పెరట్లోకెళ్ళింది అక్కడ చిమ్మి తుడవను.

  ఇంతలో లాయర్ రఘునాధరావు గారి తండ్రిగారు, విశ్రాంత ఉపాధ్యాయులు, అంతా ’పెద్దయ్య గారు ‘ అని గౌరవంగా పిలిచే విశ్వనాధం గారు, బయటికొచ్చి , చిరిగిన బొంత కప్పుకుని  మౌనంగా, ఒద్దిగ్గా కూర్చునున్న  పిల్లాడ్ని చూసి నవ్వారు .

" ఏరా! చలేస్తున్నదా!"అన్నారు ఆదరంగా.

  వాడూ చిరునవ్వే సమాధానంగా ఇచ్చి,"లేదు పెద్దయ్యా!ఈ బొంత ఎచ్చంగుండాది" అన్నాడు. వాడి మాటల్లో ఉన్న తృప్తికి, ఆయనకు ఆశ్చర్యమేసింది. ఎంత ఉన్నాఇంకా కావాలనే ఆరాటం, ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా సంపాదించాలనీ, పొందాలనే కోరికలతో లోకం శరవేగంగా ఇతరులతో పోటీపడుతూ పరుగులు తీస్తుంటే, మూడేళ్ళ గుంటడు తనకున్న చిరుగు చీరల బొంత కప్పు కుని, బావుందని తృప్తిగా చెప్పడమే ఆయన ఆశ్చర్యానికి కారణం.

   కనకాలు కొడుకు వేణు మూడేళ్ళవాడైనా వాడు అన్నీ గమనిస్తూ, తల్లి చెప్పేమాటలు జాగ్రత్త గా     వింటూ, తల్లి పడే కష్టం చూస్తూ  ఆ వయస్సుకు చాలానే నేర్చుకున్నాడు. అవసరమైతేనే మాట్లాడుతాడు, అడిగితేనే ఏదైనా సమాధానం చెప్తడు. లేకుంటే మౌనమే వాడి రాజ్యం. 

   విశ్వనాధం గారు బయటికి వచ్చి భుజాల చుట్టూ శాలువా కప్పుకుని వాలుకుర్చీలో కూర్చో గానే, వాడు బొంత పక్కకు పెట్టి లేచి, గబగబా వెళ్ళి, గేట్లో విసిరేసి పోయిన దినపత్రిక తెచ్చి ఆయనకు అందించాడు. ఆయన నవ్వుతూ అందుకుని చదవడంలో మునిగిపోయారు.

    పదినిముషాలయ్యాక చేతిలో, కాఫీ గ్లాసుతో వచ్చింది ఆయన ఇల్లాలు రుక్మిణమ్మ , నుదుట రూపాయి  బిళ్లంత ఎర్రటి కుంకుమ బొట్టుతో , చిరునవ్వు ముఖంతో ,"ఇక్కడే ఉన్నారా!" అంటూ, కాఫీగ్లాస్ అందించి, అక్కడే పక్కన క్రింద కూర్చునున్న కనకాలు కొడుకు వేణును చూసి, "ఇక్కడే కూర్చునున్నావా ! వేణూ! ఉండు. పాలు తెచ్చిస్తాను " అంటూ లోపలికెళ్ళి ఒక గ్లాసులో పాలు తెచ్చింది.

  వేణు ఆమె వచ్చేలోగా పెరట్లోకెళ్ళి , తాను రోజూ పాలు త్రాగే స్టీల్ గ్లాస్ తెచ్చుకుని కూర్చు న్నాడు. పాలు వాడి గ్లాసులోకి వంపి," చూస్కుని తాగు వేణూ! వేడిగా  ఉన్నాయేమో!" అంటూ  హెచ్చరించి లోని కెళ్ళింది.

   వేణు పాలుత్రాగేసి, గ్లాసు పెరట్లో గిన్నెలు తోముతున్న తల్లికి ఇచ్చి వచ్చి, విశ్వనాధం గారి ఎదురుగ్గా  క్రింద బాసింపెట్లు వేసుక్కూర్చున్నాడు.

  చలి కాస్తకాస్త తగ్గుముఖం పడుతున్నది, బాల భానుని నులి వెచ్చకిరణాలు ప్రకృతిమాత ఆస్వాదిస్తున్నది.  ఆయన మెల్లిమెల్లిగా కాఫీ త్రాగాక ఆ కప్పు తీసుకెళ్లి తల్లి గిన్నెలు తోమే సింకులో పెట్టి వచ్చాడు.

  విశ్వనాధం గారు పేపర్ చదవడం ముగించి, దాన్ని క్రింద ఉంచి, లేచి ఆవరణలోనే ఉదయపు నడక కోసం మెట్లు దిగి క్రిందకు రావడమే ఆలస్యం, వేణు ఆపేపర్ తీసుకుని పెద్దగా ఉన్న అక్ష రాలను ఆశ గా చూడ సాగాడు.ఒక్కోపేజీ మెల్లిగా చిరక్కుండా త్రిప్పుతూ మొదటి పేజీలో చూసి న అక్షరం మరో పేజీలో కనపడగానే ,ఆపేజీ ఈపేజీ సరిపోల్చుకుంటూ ,'అదే అక్షరం ఇదీనీ ' అని మనస్సులో అను కుంటూ పేజీలన్నీ తిప్పితిప్పి చూసుకుని , పేపర్  జాగ్రత్తగా మడిచి అక్కడున్న టీపాయ్ మీద పెట్టి , విశ్వనాధం గారు ఏం చేస్తున్నారో వరండాలోంచీ చూడ సాగాడు. ఆయనా వీడు చేసే పనులన్నీ గమనిస్తూ చెట్లక్రింద ఉన్న కాలిబాటలో నడవసాగారు.

     అది పురాతన కాలపు పెద్ద బంగళా. చాలా విశాలమైన స్థలంలో మధ్యగా భవంతి. చుట్టూ మామిడీ, జామ, సపోటా, బత్తాయి, పనస ఇంకా అనేక పండ్ల చెట్లు, ముందు పూల తోట, వెనుక కిచెన్ గార్డెన్. అన్నీ కనకాలే జాగ్రత్తగా చూస్తూ , ఆ స్థలమంతా బాగుచేస్తుంటుంది.  వేణు పైప్ తో నీళ్ళుపట్టడంలో , చిమ్మిన ఆకులు గంపకెత్తి ఒకమూల పోయడంలో, తన చిన్ని చేతులతో తల్లికి సాయం చేస్తుంటాడు. అక్కడ ఒక రావి, వేప చెట్లు కలసి ఉన్న చోట చుట్టూ ఒక అరుగు కట్టించి, దాని మీద ఒక వినాయకుని ప్రతిమ ప్రతిష్ఠించారు విశ్వనాధంగారు .                       

  వేణు వాళ్లామ్మతో కలిసి పూలుకోసి, రుక్మిణమ్మగారికీ, విశ్వనాధంగారికీ పూజకు ఇచ్చి, ఒకటి రెండు పూలు వాడికి నచ్చినవి తెచ్చి వినాయకుని పాదాలముందుంచి అరుగు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేసి , పదకొండు గుంజీలు తీసి ,ఆ పైనే ఆ ఇంటి వారిచ్చే అన్నమో, టిఫినో తింటాడు. కనకాలు వాడికలా నేర్పింది.

  ఇంతలో విశ్వనాధంగారి మనుమడు, మనుమరాలూ చక్కగా స్కూల్ డ్రెస్ వేసుకుని, షూ, టై , స్కూల్ బ్యాగ్ భుజాలకు తగిలించుకుని బయటికొచ్చారు. స్కూల్ బస్ వచ్చింది.

కనకాలు దగ్గరుండి స్కూల్ బస్ ఎక్కడంలో వారికి సాయపడింది.ఇదంతా వినాయకుని ముందు నిలుచుని చాటు చాటుగా చూట్టం వేణుకు ఆసక్తి. ‘తానుకూడా అలా బడికె ళితే  ఎంత బావుం డు‘ అనుకుంటూంది ఆ చిన్నారి మనసు. కనకాలైతే ‘తన బిడ్డనూ అట్టా బళ్ళోకి పంపాలని‘ కోరుకుంటుంటుంది రోజూ. దాని కోసం కడుపు కట్టుకుని తన సంపాదనలో అంతో ఇంతో దాస్తూ ఉంది కనకాలు. పిచ్చి కనకాలు తాను దాచే డబ్బు 'ఏకాడికీ ' అనితెలీదు. బిడ్దమీద ప్రేమతప్ప.

 ఆరోజు విశ్వనాధం గారు వేణును బాగా గమనించి "ఏరావేణూ ! నీవూ స్కూల్లోచేరతావా!" అన్నారు.

"మా అమ్మ కెట్టా అవుద్ది పెద్దయ్యా! నాకు సదువంటే ఇట్టమే.." అంటూ ఆపాడు.  

 మూడేళ్ళ పసివాడికి వాళ్ళ అమ్మ బాధా,కష్టం తెలీడం వింతే అనిపించిందాయనకు. ‘చదువుకుని ఉద్యోగాలు చేసి పిల్లల్ను పెంచే కుటుంబాల్లో కంటే, ఇలాంటి కూలీ నాలీ చేసుకునే వారి పిల్లలకు అవగాహనాశక్తి అధికం‘ అని ఆయన స్థిరాభిప్రాయం. 'తల్లిదండ్రుల కష్టాలూ, ఇబ్బందులూ ఆ పిల్లలు చక్కగా అర్ధం చేసుకుంటారు.' అని ఆయన తాను ఉద్యోగం చేసి గడించిన అనుభవంతో గమనించారు. 

   "వేణూ! నీకు ఐదేళ్ళు రానీ నిన్ను స్కూల్లో వేస్తాను , ఈ లోగా నీకు ఇంట్లోనే చదువు నేర్పుతాను, సరా! నేను స్నానం, పూజా చేసి వచ్చాక ఈరోజే నీ చదువు మొదలెడదాం" అంటూ లోనికెళ్ళారు.

  అదంతా చెట్లలో ఎండాకులు చిమ్ముతున్న కనకాలు వినింది. సంతోషంతో కొడుకు దగ్గరికి పరుగు పరుగున వచ్చి, వాడిని పెరట్లోకి లాక్కెళ్ళి, పంపు దగ్గర చన్నీళ్లతో స్నానం  చేయించి, తన చీర చెంగుతో తుడిచి, చొక్కాలాగూ తొడిగి వాడి చెయ్యి పట్టి వినాయకుని ప్రతిమ వద్దకు తీసుకెళ్ళి  పూలు పెట్టించి, నమస్కారం చేయించింది. వాడికేవో బుధ్ధిమాటలు మెల్లిగాచెప్పింది. వాడు తల్లి చెప్పిన మాటలకు తలాడించాడు .

   ఇంతలో విశ్వనాధంగారు వరండాలోకొచ్చి "వేణూ!"అంటూ పిలిచారు. వేణూ గబగబా వెళ్లి నిల్చు నున్న ఆయన పాదాల మీద తల పెట్టి నమస్కరించాడు. వెంటనే విశ్వనాధంగారు వంగి వాడిని లేపి, "ఏంట్రా వేణూ! ఇదంతా !" అన్నారు . ఆయన కళ్ళుతడి బారాయి.

 వేణు వాళ్ళ అమ్మకేసి చేయి చూపాడు.

  విశ్వనాధంగారు "కనకాలూ ! నీ కొడుక్కు చదువు నేర్పే బాధ్యత నాది, ఇంకా చిన్నపిల్లాడని ఇంత కాలం చూస్తున్నాను. వాడికి చదువుమీద ఉండే ఆసక్తి ఈ రోజు గమనించాను.ఈ రోజు నుంచీ ఇంట్లోనే చెప్తాను. ఐదో ఏడు నిండగానే ప్రభుత్వ పాఠశాలలో వేద్దాం. సరా!"అన్నారాయన.

 కనకాలు వెంటనే పరుగున వచ్చి ఆయన పాదాలమీద పడి నమస్కరించింది. 

  అప్పుడే అక్కడికొచ్చిన ఆయన సతీమణి రుక్మిణమ్మ అదిచూసి ," పిచ్చిదానా ! పెద్దయ్య గారు ఎందరికి చదువుచెప్పలేదు! ఆయన సుదీర్ఘ ఉద్యోగ కాలంలో.  నీ పిల్లాడి చదువుకేమే ! ఆయన చేత్తో అక్షరాలు దిద్దించుకున్న వాళ్ళంతా ఈనాడు పెద్దపెద్ద పదవుల్లో ఉన్నారే! మీ వాడూ ఒక పెద్ద చదువు చదివి, మంచి పదవికి వెళతాడు" అనగానే కనకాలు రుక్మిణమ్మ పాదాలకు నమస్కరించింది.

  " అంతా  మీ దయమ్మా! ఆ తొండం దేవరే మీకు మంచి మనసిచ్చి నా కొడుక్కు నాలుగచ్చరాలు రాయిత్తే సాలమ్మా!మీ శావ సేసుకుంటా బతకేత్తాను"అంది కళ్ళలో నీరు చెంగుతో అద్దు కుంటూ.

విశ్వనాధంగారు వాడ్ని వినాయకుని ప్రతిమ దగ్గరకు తీసుకెళ్ళి తన మనుమడి పాతపలక ఒకటి తెచ్చి ,అక్కడ వాడికి 'ఒ న మః 'అని వ్రాసి పలికించి అక్షరాభ్యాసం చేశారు.

 అలావాడి చదువు విశ్వనాధం గారి గురుత్వంలో మొదలైంది. తాను పేపర్లో రోజూ చూసే అక్షరాల్ని వాడు ,పేరు చెప్పగానే  చకచకా గుర్తించి అవలీలగా అక్షరాలన్నీ నేర్చేశాడు. అక్షరాలూ, పదాలూ, వాక్యాలూ, అంకెలు, కూడి తీసివేతలూ, శతకపద్యాలూ, ఇంకా విశ్వనాధంగారు సంధ్యవార్చుకుంటూ చేసే గాయత్రీ మంత్రంతో సహా అన్నీ వాడికి కంఠోపాఠమవ సాగాయి.

  కనకాలు ఆనందం అంతా ఇంతాకాదు. రోజూ విశ్వనాధంగారికీ, రుక్మిణమ్మకూ పదాలకు నమస్క రించంది ఇంటికెళ్లదు.

   అలా చదువు దినదినానికీ అంచలంచలుగా పెరిగి పోతున్నది. ఇంట్లోనే సుమారుగా రెండో క్లాస్ వరకూ నేర్వాల్సిన విద్య అంతా నేర్చేశాడు. విశ్వనాధంగారు వాడి ఏకాగ్రతకూ , ధారణా శక్తికీ ఆశ్చ ర్యపడేవారు.తన ఉద్యోగ కాలంలో ఇంత గొప్ప ఏకాగ్రత, ధారణా  ఉన్నవారిని చూసిన ఙ్ఞాపకం ఆయనకు లేదు.  విశ్వనాధంగారి వద్ద చదువు నేర్చుకుంటూనే అటు తల్లికీ సాయపడసాగాడు వేణు.

   వేసవిలో విశ్వనాధం గారు నిద్రపోయేప్పుడు ఆయన ముఖాన చెమట చూస్తే చాలు, వాడు విసిన కర్ర తెచ్చిపెట్టుకుని విసిరేవాడు, ఆయన ఉదయకాలపు నడక సాగించి వచ్చి పడక్కుర్చీలో కూర్చో గానే ,ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన పాదాలు వత్తేవాడు. అనేక మార్లు ఆయన కోప్పడ్డారు.

 "పెద్దయ్యా! మా అమ్మ ‘గురుదక్షిణం’ట , ఇలాసెప్పిందయ్యా! మా అమ్మ మాటినాలి గద య్యా!" అంటూ తల్లికి లింకు పెట్టి తన గురువు సేవ చేసుకుంటూ  శిష్యరికం  కొనసాగించే వాడు. 

  చూస్తుండగానే రెండేళ్ళు పూర్తై  వేణుకు ఐదో యేడు నిండుతుండగానే వేసవి సెలవుల తర్వాత విశ్వనాధం గారు వాడిని మున్సిపల్ స్కూలుకు తీసుకెళ్ళి ఒకటో తరగతిలో పేరు రాయించారు.  వేణుకు సంరక్షకునిగా తన పేరు వ్రాసుకున్నారు.

  బళ్ళోవేసిన రోజు ఆయన అందరి ఎదుటా వేణుకు " వేణూ! ఎవ్వరితో పోట్లాడకు , ఎవరేమన్నా పట్టించుకోకు. ఎవ్వరి వస్తువులూ అడక్కుండా తాకకు. ఎవరైనా ఉచితంగా ఏమైనా ఇస్తే పుచ్చుకోకు. దాన్ని ‘అపరిగ్రహం’ అంటారు. అది చాలాతప్పు. ఏమికావాల్సినా పాఠశాలలో పంతుళ్ళనూ, ఇంట్లో మమ్మల్నీ అడుగు. చక్కగా చదువుకుని నీకు అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకో బాబూ!  సరస్వతీ మాత అనుగ్రహం లేందే చదువురాదు. ఆమెను నిత్యం ప్రార్ధించుకో. పంతుళ్ళను దైవ సమానంగా చూడు." అంటూ నీతిమాటలు అందరికీ ఉపయోగిస్తాయని చెప్పారు విశ్వనాధంగారు. ఆయన 35సం. ప్రభుత్వపాఠశాలల్లో పనిచేసి జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది పదవీ విర మణ చేసినవారు.

    స్కూలై పోగానే విశ్వనాధం గారింటిముందు  చకోరపక్షిలా వాలిపోయే వాడు.ఆయన నీడలా ఆయన్ననుసరిస్తూ ఆయనకు కావాల్సిన చిన్నచిన్నపనులుచేస్తూ, ఆయన్నంటి పెట్టుకుని ఉండసాగాడు.  ఉదయాన్నే ఆయన దేవతార్చన సమయంలో చదివే నమకం, చమకం, రుద్రం అన్నీ దేవుని గది కిటికీ వద్ద కూర్చుని విని వాడు నేర్చేసుకున్నాడు.

కనకాలు, కొడుకు బళ్ళో కెళుతుంటే వెయ్యి కళ్ళుచేసుకుని చూసేది. తన కల నిజమవుతున్నందుకు కనకాలు  ఆనంద పడసాగింది. 

  రుక్మిణమ్మ వాడికీ వేడి వేడి టిఫిన్ ఇంట్లో ఏంచెస్తే అది పెట్టేది. వాడికి కావలసిన బట్టలు, పుస్తకాలూ అన్నీ వారే ఏర్పాటు చేసినందుకు, కనకాలు "పెద్దమ్మా! నాజీతంలో కొంత కోతెయ్యమ్మా !అన్నీ మీరే కొనిచ్చినరు గదమ్మా!"అంటే ఆమె నవ్వింది.

"పిచ్చిదానా! మేమిచ్చేదేంటే ! ఆ భగవంతుడు నీ కొడుకును ఎంత పెద్ద స్థాయికి తీసుకెళతాడో  ఎవరికి తెల్సు? మేం చేసేది అణుమాత్రమే! ఊరికే ఆలోచించక. ఈమధ్య తగ్గిపోతున్నావ్! బాగా తిను , రేపటినుంచీ నీవూ పాలుత్రాగు, చెట్లలో పనెక్కు వైందేమో ఇంకోర్ని పెట్టుకుందా మా కనకం ! "అంది ఆమె ప్రేమగా.

"లేదు పెద్దమ్మగోరూ ! ఎవ్వురూ వొద్దు నాకేం పనెక్కూ కాదమ్మా!" అనిసమాధానం చెప్పేది కనకాలు            

   ఒకరోజున చెట్లకు నీరు పైప్ తోపడుతూ వాడు అలవోకగా పాడుతున్న’ నమకం’ విని విశ్వనాధం గారు  ఆశ్చర్య పడ్డారు.                                                                                          

వాడ్నిపిలిచి "వేణూ! ఈ ‘నమకం’ ఎప్పుడు నేర్చుకున్నావురా!"అని అడిగారు.           

 వాడు "మన్నించండయ్యా! మీరు పూజగదిలో చదువుతుంతే కిటికీ దగ్గర నుంచుని నిన్నా నయ్యా! తప్పాయ్యా!" అని అడిగాడు వినయంగా.

విశ్వనాధంగారు వాడ్ని దగ్గరకు పిలిచి తలమీద చెయ్యి  వేసి నిమురుతూ 'ఏ జన్మ లోనో వీడు మహా పండితుడై ఉంటాడు, వీడు సామాన్యుడు కాదు. మహా విద్వాంసుడై తీరుతాడు ' అనుకున్నారు మనస్సులో.

  స్కూల్లో వాడి చదువు చూసిన పంతుళ్ళంతా పెద్ద పంతులుగారితో మాట్లాడి, వాడి పేరేమో ఒకటో తరగతిలో,  చదువేమో మూడోతరగతిలో ఉండేలా ఏర్పాటు చేశారు. అలాంటి పంతుళ్ళు దొరకడమూ వేణు అదృష్టమే మరి. అలావాడి చదువు దినదినాభి వృధ్ధి చేందే శుక్లపక్ష చంద్రు నిలా సాగిపోసాగింది. అలా వేణు క్రమంగా  తొమ్మిదోక్లాస్ దాటి పదోక్లాస్ లోకి వచ్చాడు. 

    విశ్వనాధంగారు వాడికి పరీక్ష రాయను స్పెషల్ పర్మిషన్ తెచ్చారు .

  అన్నిట్లో ఫస్టే! ఉపన్యాసం చెప్పడంలో వాడి వాగ్ధాటికి అంతా విస్తుపోయేవారు.  ఇహ మిగతా లలిత కళల్లోనూ వేణే మొదటి స్థానంలో ఉండేవాడు. తల్లిప్రేమ, విశ్వనాధం దంపతుల పోషణతో వాడు బలంగా, అందంగా, ఎత్తుగా, పచ్చగా  వయస్సును మించిన పుష్టితో పెరగసాగాడు. వాడి ఉంగరాలజుత్తే వాడి ప్రత్యేక అందం.

  

టెంత్ క్లాస్ పబ్లిక్ పరీక్షలు అయ్యాయి. సేలవుల్లో వేణు విశ్వనాధం గారి వద్ద వేదం  నేర్చుకో సాగాడు.

  పదోతరగతి ఫలితాలు వెలువడ్డాయి .

  వేణు టెంత్ క్లాస్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. విశ్వనాధం గారి ఆనందం అంతా ఇంతా కాదు. వాడ్ని ఆలింగనం చేసుకుని తలమీద ముద్దుపెట్టుకున్నారు. కనకాలు సంతోషం చెప్తే తీరేది కాదు. ఆనందం పట్ట లేక వెక్కి వెక్కి ఏడ్చేసింది.mఆమె విశ్వనాధం దంపతుల పాదాలను కన్నీళ్ళతో అభిషేకించింది. వారే కనకాలు ప్రత్యక్ష దైవాలయ్యారు.     

  వేణు టెంత్ క్లాస్ లో స్టేట్ ఫస్ట్ రావటాన ఎన్నో కార్పొరేట్ కాలేజీల వారు వచ్చి ఇంటర్వ్యూ చేసి, తమ కాలేజ్ లో ఫ్రీగా చదువు చెప్పించి పైకి చదివిస్తామని ఆఫరిచ్చారు.                                            వేణు తల్లినీ, విశ్వనాధం దంపతులనీ వదలి వెళ్లను ఒప్పుకోలేదు.

 విశ్వనాధంగారు వాడికి నచ్చజెప్పి "వేణూ! చదువు ఇంతటితో ఆపేయడం మూర్ఖత్వం, నీ తల్లి ఆశా, మా కోరికా తీర్చవా! నీలాటి ఎందరికో అండగా నిల్చే ధీరునిగా తయారవాలి, సమాజంలో ఎంతో మందికి చేయూత నివ్వాలి. మేమూ నీ అమ్మా ఇక్కడ సంతోషంగా ఉండాలంటే నీవు వెళ్ళి కాలేజీలో చేరి చక్కగా చదువుకుని, నీ గోల్ చేరాకే తిరిగి రావాలి మళ్ళా, తెలిసిందా! మేం అప్పుడప్పుడూ వచ్చి నిన్ను చూసి వస్తుంటాం. నీవు మాత్రం ఇక్కడికి వచ్చి నీ దృష్టిని మళ్ళించుకోకు. నీకు దొరికిన సరస్వతీ మాత కరుణ వృధా చేసుకోకు." అంటూ నచ్చజెప్పి, ఒప్పించి దగ్గరుండి, విశ్వనాధం గారు బలవంతాన వేణును, మంచి కాలేజీ నిర్ణయించి, దాన్లో  చేర్పించారు. స్వయంగా అన్నిఏర్పాట్లూచేశారు. వెళ్లే రోజు కనకాలు కొడుకును అక్కున చేర్చుకుని ముద్దులతో ముంచెత్తింది. కనకాలు గంపెడు సంతోషాన్నీ , కొడుకును వదలి ఉండాలన్న పుట్టెడు దుఃఖాన్నీ కలగలుపుకుని కొద్దిగా ఉన్మత్తురాలైంది.

ఐతే విశ్వనాధం దంపతులు ఆమెకు ధైర్యం చెప్పాక ,తన కడుపున పుట్టిన వాడు అంతంత పెద్ద చదువులు చదవడం అదృష్టంగా భావించి తన బాధను దిగమింగుకుంది. 

 

కాలం గిర్రున తిరుగుతున్నది. కేలెండర్లు మారిపోతున్నాయి.

 

 తొలికోడి కూయగానే బిరబిరాలేచి వెళ్ళి వేణుగోపాల స్వామి ఆలయం శుభ్రం చేయంది కనకాలు మరేపనీ చేయదు.టీకోట్టు కామయ్య బాబాయ్ " బిడ్డా ! కొడుకు సదూకుంటూ పైకొస్తున్నడు గందా, పెద్దయ్య గారు సాయం సేత్తుండరుగందా! ఇంకా ఈ గుడి సిమ్మాలంటే బిడ్దా!"  అనగా, "బాబయ్యా! పాతరోజులు మడిసి , దేవుని సాయం తోసేసుకుంటే ఔతదా బాబయ్యా! రోజూ నిన్నూ, సామోరినీ సూడంది ఉండలేనే బాబయ్యా!"అంది కనకాలు కళ్లనీళ్ళు తుడుచుకుంటూ. కనకాలుకున్న  కృతఙ్ఞతా భావానికి కామయ్య నిర్ఘాంతపోయాడు. నిజానికి లాయరు గారు మంచి పనమ్మాయికావాలంటే, ఎరిగున్నది గనుక కనకాలుకు చెప్పడం తప్ప , తాను చేసిందేం లేదు.  

   ఒకరోజున వేణు గురించీ టీ.వీ వార్తల్లో చూపిస్తున్న దృశ్యం, కేకేసి కనకాలుకు చూపారు విశ్వనాధం గారు. " కనకాలూ! నీ కొడుకు ఇప్పుడు కలెక్టర్ ! మన ఊరికే ఫస్ట్ పోస్టింగ్. రేపే వస్తున్నాడు కలెక్టర్ వేణు. రుక్కూ! వచ్చి చూడూ! కలెక్టర్ వేణు -మనవేణు " అంటూ ఉద్వేగంతో, వేణుతో టీవీలో చేస్తున్న ఇంటర్వ్యూ చూపాడాయన.

సూటూ బూటేసుకుని, మెడలో టై కట్టూకుని, విగా అందంగా వాడి అసలు అందమైన ఉంగ రాల జుత్తుతో చిరునవ్వు నవ్వుతూ అందరితో ఇంగ్లీషులోదడదడా మాట్లాడుతున్న వాడు తన కొడుకా! కలకటేరా! ఇదినిజమా! ఆబాబు తన కొడుకే! కనకాలు గుండెవేగం హెచ్చింది. తట్టుకోలేకపోతున్నది.                                                                                                           

 "అయ్యా! పెద్దయ్యా! వోడు మీ బిడ్దగానీ నా బిడ్డకాదయ్యా! ఆన్ని నీకే ఇచ్చేత్తండానయ్యా! మీ సేవ సేసుకుంటాడయ్యా! ఆడు నీకు అంకితమయ్యా! " అంటూ కనకాలు, విశ్వనాధంగారి పాదాలమీద వాలిపోయింది.                                                        

  ఆ పిచ్చి తల్లి గుండెకు ఆ సంతోషం తట్టుకునే శక్తిలేక పోయిందేమో! మరి లేవలేదు.​

OOO

Bio

హైమావతి  ఆదూరి

గవర్నమెంట్ పాఠశాలల్లో ప్రిన్సిపాల్ గా 40సం. పనిచేసి విశ్రాతిపొంది ఉన్నారు. సుమారుగా 74నుంచీ చిన్న చిన్న వ్యాసాలు,కధలు గేయాలూ వివిధ పత్రిక ల్లో ప్రచురింపబడ్డాయి. కొన్నిటికి బహుమతులూ వచ్చాయి. సుమారు 6 ఈబుక్స్ కినిగెలో అనేక పత్రికల్లో ప్రచురింపబడ్డ కధలు స్వయం పబ్లికేషగా ఉంచారు.

వీరికి ఎక్కువగా బాలలకోసం నీతికధలు వ్రాయడం ఇష్టం.

భగవాన్ శ్రీసత్య సాయి బాబావారి భక్తులయిన వీరు ‘సత్య సాయి బాలవికాస్’ అనే మానవతా విలువలు ఉచితంగా బోధించే తరగతులు నిర్వహిస్తూ, వాటిని బోధించే ఉపాధాయులకు తరగతుల నిర్వహణ కోసం శిక్షణాశిబిరాల్లో పాల్గొంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, పర్యటిస్తుంటారు.

 పూర్వపు ఆంధ్ర పత్రిక. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర భూమి, వర్త, శ్రీవాణి సాహిత్య మాస పత్రిక, గోతెలుగు వంటి  కొన్ని వెబ్ మ్యాగజైన్స్ లో కధలు ,వ్యాసాలు ప్రచురింపబడుతుంటాయి.

రాష్ట్ర ప్రభుత్వం 92లో ‘ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధాయ అవార్డు ‘silver medal,,. 1994లో భారత ప్రభుత్వం జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, Gold medal, 2003 లో కంచి కామకోటి పీఠాధిపతులు ‘జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ’ అవార్డు గోల్డ్ మెడల్ బహూకరించారు.

***

Hymavathi Aduri
bottom of page