top of page

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

భువనోల్లాసం - మధురవాణి ప్రత్యేకం

అప్పుడు.. ఇప్పుడు..

భువనచంద్ర

ఎప్పుడో ఒకప్పుడు మీరు మా వూరికొస్తారని తెలుసు. అందుకే  మీరు కంగారుపడకుండా నేనూ మీతో పాటే వస్తా. అన్ని వూళ్ళలానే మా వూళ్ళోనూ మంచోళ్ళు, చెడ్డోళ్ళు, కిలాడీలు, నిక్షేపరాయుళ్ళూ అందరూ వున్నారు. ఆ సంగతలా వుంచితే ఫలానా వూళ్ళో ఫలానా బస్సెక్కితే గంటన్నరకల్లా మా వూరు చేరిపోతాం. పదండి.

మనం బస్సు దిగటం ఓ భాస్కర్రావు చూస్తూనే వుంటాడు. అయినా దిగ్గానే మిమ్మల్ని చూస్తూ, అంటే మీవంక చూస్తూ నన్ను అడుగుతాడు."ఏంటి? ఎప్పుడొచ్చావ్?"

"ఇప్పుడేనండి" నా సమాధానం.

"ఎప్పుడెళ్తావ్?" భాస్కర్రావు. మనిషన్నవాడెవడికైనా చిర్రెక్కకమానదు. "నేనెప్పుడెల్తే నీకెందుకోయ్ కరక్కాయ్" అని గట్టిగా అరవాలనిపించినా మనం 'అరవకూడదు'.

"ఓ పదిరోజుల తరవాతండి" అని మర్యాదగా సమాధానం చెప్పాలి.

"నీతో ఇంకో ఆయన కూడా వచ్చినట్టున్నాదు?" ఈసారి నావంక చూస్తూ అడుగుతాడు."అవునండి" నేను.

"ఏం జేత్తాడేటి ఆయన" భాస్కర్రావు. "నాతోపాటు పని చేస్తుంటాడండి" నేను. "ఆహా!" అంటాడు భాస్కర్రావు.

అంటే ఇహ అక్కడ్నించి మనం కదలొచ్చని అర్ధం చేసుకోవాలన్నమాట. ఈ మాటలన్నీ విన్నా, ఓ గజం దూరం నడిచాక పేకాట వెంకటాద్రి, డొంకాడ పార్వతీశం ఇవే ప్రశ్నలు అడుగుతుంటారు. చిరాకుపడకుండా సమాధానం చెప్పాల.

సెంటర్‌కి రాగానే పోసుకోలు పుల్లన్న మావా, అబ్బిరెడ్డి సత్తినార్ణా కనబడతారు.

"ఏటీ .. డిల్లీలో వున్నావంటగా? "పోసుకోలు పుల్లన్న మావ.

"అవునండి." నేను. "ఎంతిస్తారేటి?" సత్తినార్ణ.

"బాగానే ఇస్తారండి!" నేను. "వందలా వేలా?" సత్తినార్ణ.

"వందలేనండి" నేను. "మంచిది. ఉద్యోగం బాగా చేసుకో. మనూరికి పేరు తేవాల" సత్తినార్ణ.

"ఇందిరాగాంధీని చూశావా?" పుల్లన్న మావ.

"చూశానండి" నేను.

"మనూరికి మంచి తార్రోడ్డు ఏపించమని చెప్పొచ్చుగా?"పుల్లన్న.

"దగ్గరకు వెళ్లనివ్వరండి" నేను.

"సర్లే" అంటే ఆనాటి ప్రశ్నల కార్యక్రమం పూర్తయిందన్నమాట. ఇంటికి చేరేలోగా పాతికమందైనా ఇవే ప్రశ్నలు అడుగుతారు. చాలా వినయంగా సమాధానం చెప్పాలి. వినిపించుకోనట్టు వెళ్లామా... అంతే సంగతి. "మనోడికి డిల్లీ నీళ్లు బాగా వంటబట్టాయిరోయ్. మాటా మాంతీ మానేసి  ఎల్తన్నాడు. బాగా గీరెక్కేసింది" అని ఏ సుందర్రావైనా మన మొహం మీదే కామెంటు చేస్తాడు. పదిగజాలు నడిచేలోగా ఎదురయ్యే మామూల్రావు "ఏంటీ.. నీకు బాగా గీరెక్కిందంటగా.. ఎవరు పలకరించినా తల ఎగరేత్తన్నావంటగా? ఎంతైనా మనూరోడివిగదా అని పలకరిత్తాం గానీ, నీ సొత్తేమైనా అడుగుతామా?" అంటూ మొహం మీదే దులిపేస్తాడు.

నిజం చెప్పొద్దూ మా గోదారోళ్ళు ఏదైనా మొహం మీదే అడుగుతారు గానీ, మనసులో ఏ మాత్రం దాచుకోరూ.

సెంటర్ నించి మా వీధిలోకి తిరిగే కార్నర్‌లో మా లాల్చీ బాబాయో, అడ్రస్ తెలీని ఆదినారాయణో కనిపిస్తారు.

"ఏటి ఎప్పుడొచ్చావ్?" ఆ.నా. "ఇప్పుడేనండి" నేను.

"ఎప్పుడెల్తావ్?" ఆ.నా. "వారం తరవాతండి" నేను.

"సర్లే.. ఎప్పుడెల్తే నాకెందుగ్గానీ, ఎల్తా ఎల్తా మేడుకొండూరోళ్ళ ఇంటి ముందు కొత్తగా హోటల్ పెట్టారు. టీ తాగెళ్లు. నా పేరు చెబితే ఆడు బ్రహ్మాండంగా టీ కాచి ఇస్తాడు. ఆ" అంటాడు.

మా వూళ్ళోకి నేను టీ తాగడానికి యీయన పేరెందుకు చెప్పాలో ఇప్పటికీ నాకు అర్ధం కాదు.

ఓ సారి అందరం, అంటే ఫ్రెండ్స్ అందరం బాలాజీ సింగు హోటల్లో టీ తాగుతున్నాం. ఒకాయన వచ్చాడు.

"నువ్వు ఫలానావోడివి కదూ!" "అవునండీ!"

"డీల్లీలో కదూ ఉజ్జోగం!" " అవునండీ!"

"మీ అన్నయ్య నాకు బాగా తెలుసు. ఆయన పేరేంటీ?” ఆయన.

"ముగ్గురన్నయ్యలండీ. ఎవరి పేరు చెప్పమంటారండీ?" నేను.

" ఆ సంగతి ఇప్పుడెందుకులే.. ఇదిగో సింగుగారూ, డికాక్షనూ పాలూ ఎక్కువేసి ఓ టీ పట్రా. చిన్న గ్లాసులో కాదు. ఆ పెద్ద గ్లాసులో. టీ తాక్కపోతే మనోడు నొచ్చుకుంటాడు" అన్నాడు.

టీ తాగాక నా మొహం కూడా చూడకుండా వెళ్లిపోయాడు. బిల్లు నేనే కట్టానని చెప్పక్కర్లేదుగా."ఎవర్రా యీయన" అని ఎంక్వయిరీ చేస్తే, యీయనసలు మా వూరివాడే కాదని, ఫ్లోటింగ్ బాపతనీ తేలింది.

దర్జాగా టీ తాగి బిల్లు ఎంత 'నేక్'గా నా నెత్తిన పెట్టారో చూశారు గదా..  పైగా, ఆయన టీ తాగకపోతే నేను నొచ్చుకుంటానట. నా మీద ఎంత జాలి!!

మరో టైపు వాళ్లు మీకు మా వూళ్ళో దొరుకుతారు. మా నిమ్మ తోట సూర్నాణ సంగతే చూడండి.

"ఏట్రా నువ్వు డిల్లీవోడివే కదూ!" ఆశ్చర్యంగా అంటాడు.  

"అదేటి సూర్నాణా.. చిన్నప్పటినించీ మనకి తెల్సినోడ్ని పట్టుకుని డిల్లీవోడంటావు!" అడుగుతాడు మరో కుమార్రాజు.

"తెల్సులేవో! ఎంతైనా మనూరోడు డిల్లీలో వుంటే మనకి గ్రేటు కాదా? ఇదో డిల్లీవోడా.. కాఫీ తాగి ఎల్దువురా.. నా ఖాతాలోనే. ఒరే సాయిలూ.. మన డిల్లీవోడొచ్చాడ్రా.. నువ్వు కూడా కాఫీ తాగుదువురా.. డబ్బులు నాయేలే!" అని పదిమందినీ పిలిచి మరీ మనకి పబ్లిసిటీ ఇస్తాడు. ఆ రోజుల్లో టీ ఖరీదు అణా.

అదే నేను లేకుండా మీరు మా ఊరికి వచ్చారనుకోండీ.. ఆ యవ్వారం వేరేలాగా వుంటుంది. ఊళ్ళో దిగి చూడాల్సినవి చూసి మళ్ళీ బస్సు కోసం మీరు బస్టాండ్లో నిలబడతారు.

"ఏటీ.. బస్సుకోసం నిల్చున్నారా?" అమాయకంగా అడుగుతాడో వీరనారాయణ. "అవునండి" అంటారు.

"అదిప్పుడు రాదండీ.. అన్నట్టు మీ మొహం చూస్తే టిఫిన్ చేసినట్టు  కనపడతలేదండి. సత్తుపల్లి బస్సు యమాలేటుగా వస్తాదండీ. వచ్చినా గంటగ్గానీ బయల్దేరదండీ. ఎనిమిదింటికల్లా రాజుగారి హోటల్ కట్టేస్తారండీ. అది గట్టేస్తే యీ వూళ్ళో మీకు టీ నీళ్లు కూడా దొరకవండి. ఇయన్నీ ఎందుకు చెబుతున్నానంటే, రేపు మీ వూరెళ్ళాక మా వూరోళ్లని తిట్టుకోకూడదు కదండీ" అని సమర్యాదగా అంటాడు. అనడమే కాదు, సమర్యాదగా మిమ్మల్ని రాజుగారి హోటల్‌కి వెంటబెట్టుకుని మరీ తీసికెళ్తాడు.

"ఇదిగో రాజుగారూ, యీన మన పొరుగూర్నించి మనూరొచ్చాడు. ఆయనకో రెండిడ్లీ, నాకో రెండు నేతి పెసరా, ఓ చపాతీ, ఓ రవ్వట్టూ పట్టుకురా. టిఫిన్ అదిరిపోవాల" అని మనం కష్టపడకుండా ఆయన ఆర్డరిస్తాడు.

అలా రెండిడ్లీ మీరు తినేలోగానే  ఆయన అతని టిఫిను క్షణాల్లో లాగించేస్తాడు. ఇంతలో బస్ సౌండు వినిపిస్తుంది. "ఇదిగో గురూగారూ, నేనెల్లి మీకోసం సీటు అట్టేబెడతా. విశ్రాంతిగా తిని బేగొచ్చేయండి" అని గబగబా పరిగెడతాడు. మీరు గబగబా బిల్లు చెల్లించి బస్టాండుకి పరిగెడితే అక్కడే వీరనారాయణ కనిపించడు సరిగదా బస్సూ వుండదు.

"ఒరే అన్నారం. యీయన్ని గూడా మన వీర్నారాయణ ఎధవని  చేశాడ్రా.. బిల్లు ఎంత నెత్తిన పెట్టాడు బాబూ" అని ఓ అప్పల్రాజు మిమ్మల్నే మొహం మీద అడుగుతాడూ. ఏం చెప్తారూ? అందుకే నేనూ మీతో బాటే వస్తానన్నది.

అసలు మా వూరోళ్ళంత అమాయకులు మీకు లోకమంతా వెతికినా కనిపించరు. ఆర్నెల్లకో ఏడాదికో ఓ సారి ఏదో విమానం దారితప్పి మా వూరి ఆకాశంలో తచ్చాడేది. ఇళ్ళల్లో వాళ్లందరూ పోలోమని బయటికొచ్చి తలలు పైకెత్తి మరీ ఆకాశంలో విమానాన్ని అబ్బురంగా చూసేవాళ్ళు. ఒక్క మా నామ్ కే వాస్తే బావ తప్ప. ఆయనెప్పుడూ గొడుగులోంచే విమానాన్ని చూసేవాడు. "అదేంటీ బావా? అంటే "ఓరెర్రెదవా.. ఇమానంలోంచి ఏ నా కొడుకో ఉమ్మేసినా, ఉచ్చోసినా మన మీదే గదరా పడేదీ!" అని కూసింత జాలి పడేవాడు.

అదే మా కక్కిరాల పుల్లయ్య అయితే " ఆ ఎల్తంది ఎవురో తెలుసా. ఇందిరాగాంధీ" అని నిఖార్సైన నిజం చెప్పినట్టు చెప్పేవాడు. "కామోసు" అని మిగతా వాళ్లు ఫాలో అయిపోయేవాళ్లు. అరగంట తర్వాత ఎవరి నోట విన్నా ఇందిరాగాంధీ చింతలపూడి (మావూరు)'మీద'నించి డిల్లీ వెళ్ళిందన్న వార్తే.

"ఆవిడ మన తమ్మిలేరు జూడ్దానికొచ్చిందం. అని మా బామ్మరిది చెప్పాడు. ఆడుండేది హైదరాబాదులో. హైదరాబాదోళ్ళకి అన్నీ తెలుస్తై!" అని ఓ రామలింగం పూర్తి వివరాలు అందరికీ అందించేవాడు విమానం కనుమరుగైన పది నిమిషాల్లోనే...

పది నిమిషాల్లో వాళ్ల బామ్మరిది ఎలా ఏ విధంగా చెప్పడని మాత్రం అడక్కండి. చెప్పింది వినాల, విన్నది నమ్మాల. అంతే. అన్నట్టు ఆ రోజుల్లో ఫోన్లు కూడా లేవు మరి. సరేనండి.

అయ్యా, మావూరోళ్ళు అమాయకులే గాదండీ, మహా మర్యాదస్తులు.  తిట్టుకోవడంలో అయితే మహామహా మర్యాదస్తులు. పొల్లుమాట పొరబాట్న కూడా రానివ్వరండి. నమ్మకపోతే మా చెలసాని ప్రసాదరావుకీ, మాగాపు ధర్మారావుడికీ జరిగిన పొట్లాట చిత్తగించండి.

"మీరుత్త ఎదవలండీ!"చెలసాని.

"మీరు మాత్రం తక్కువేటండీ. మహా కిలాడీ నాయాళ్లండీ" మాగాపు.

"మీకసలు బుద్ధి లేదండి" చెలసాని.

"ఆయ్. మీకైతే బుద్ధీ, గ్యానం రెండూ లేవండి" మాగాపు.

"ఇదిగో వదినగారూ.. మీవార్ని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి.." అప్పుడే అక్కడికొచ్చిన చెలసాని భార్య.

"మీవార్ని కూడా నోరూ, ఒళ్ళూ జాగ్రత్త పెట్టుకోమని చెప్పండి వదినగారూ. మావారికి కోపం వస్తే నన్నే లెక్క చెయ్యరు" మాగాపు భార్య.

ఇలాంటివెన్ని గంటలైనా ముచ్చటగా తిట్టుకుంటూనే వుంటారు గానీ పొరబటున కూడా 'యాక్షన్'లోకి దిగరు. అసలు ఎవరింట్లో ఏం జరిగినా అందరికీ తెలియాల్సిందే. ఏ ఇంట్లో కష్టం వచ్చినా "అరేయ్. మన ముత్యాలోళ్ల ఇంట్లో పెళ్ళంట. నేనిచ్చానని ఓ వంద విస్తరాకులు పంపించు" అని కిరాణాకొట్లో ఓ వెంగళ్రావు పురమాయిస్తే, "నువ్వేనేటి పంపేదీ, నేను పంపుతాను. అబ్బాయ్ కుమార్రాజూ, నేనిచ్చానని ఓ రెండు అరటి గెలలూ, ఓ యాభై కొబ్బరికాయలు పంపించు!" అని మరో చిద్విలాసం పురమాయించేవాడు.

"ఏట్రా రామారావ్.. ఉగాదికి మావిడికాయలు బజార్లో కొంటే నా పరువేమవుద్దీ. మా తోట్లో కొచ్చి నీ కావల్సినన్ని కోసుకెళ్ళు. వేప పువ్వు కూడా కావల్సినంతుంది. అట్టాగే అల్లంశెట్టోళ్ళు కొత్త బెల్లం అచ్చులు పంపించార్రా. ఇంటికొచ్చి ఓ పట్టెడు పట్టుకుపో" అని ఉదారంగా అనేవాడు ఉమాకాంతం. అన్ని పండగల్లోనూ అందరూ పాల్గొనేవారు. ఇప్పటి సంగతా..!

 

*   *   *  *   *

 

మనిద్దరం  మావూర్లో బస్టాండ్లో దిగుతాం.

"ఏంటీ ఎప్పుడొచ్చావ్? ఎప్పుడెల్తావ్' అనే భాస్కర్రావు పొరపాట్న కూడా కనిపించడు.

"ఒరే డిల్లీవోడా. కాఫీ తాగుద్దువురా.. ఖర్చు నాదే!" అని నోరారా ఆహ్వానించే సూర్నాణ ఆడుగుజాడలు కనిపించవు.

"అబ్బబ్బా.. వేగిరం.. వేగిరం. అవతల గుళ్ళో శర్మగారి ప్రవచనం వుంది. ఎప్పుడు తెముల్తారు మీరూ" అని ఇంటిల్లిపాదినీ తొందరపెట్టడమేగాక తెలిసినవారందర్నీ కూడా గుడికి తీసుకెళ్లే  రిటైర్డ్ హెడ్మాస్టర్  పేర్రాజారావుగారూ,

"ఇదిగో అబ్బాయ్.. మీ అమ్మలేదని బెంగెట్టుకోకు. నేను బతికే వున్నాగా. పండగపూటా హోటల్‌కి పోకు. మనింట్లోనే మాతోపాటే తిందువుగానీ.. అన్నట్టు నువ్వు మళ్లీ డిల్లీ వెళ్ళేటప్పుడు పచ్చళ్ళు, పొడులూ కూడా చక్కగా సీసాల్లో నింపిస్తా...పట్టుకుపోదువుగాని!" అని ఆప్యాయంగా ఆదరించే అనసూయమ్మలూ, అన్నపూర్ణమ్మలు కూడా మీకు కానరారు.

ఒకే ఇంట్లో పదిమందున్నా, ఎవరి సెల్‌ఫోన్లలో వారు బిజీ. ఎవరి వాట్సప్‌లో, ట్విట్టర్లో వాళ్లు బిజీ. ఎవరి లోకంలో వారు బిజీ.

పండగ భోజనాలన్నీ కేటరింగువీ, ఆఖరికి ఉగాది పచ్చడి కూడా 'రిలయన్స్  క్రష్'వాడిదీ. పంచాంగ శ్రవణాలు టీవీ చానల్సులోనూ, మంత్రాలు సీడీల్లోనూ వినాల్సిందే. ఆఖరికి మామిడాకుల తోరణాలు కూడా ప్లాస్టిక్‌వే.

అయినా పర్లేదు నేస్తం.. ఎవరున్నా లేకపోయినా పల్లెటూరి 'ఆత్మ' మాత్రం మనని రమ్మని పలవరిస్తూనే వుంటూంది. మనం చదివిన స్కూలూ, మనం ఆటలాడిన మైదానం, మన అమ్మానాన్న నాటిన మొక్కలూ ఎప్పుడొస్తామా అని మనకోసం ఎదురుచూస్తూనే వుంటై. అందుకే పదండి. మన నేలని మరోసారి ముద్దాడి వద్దాం. ఏడాదికోసారైనా ఆ నేలకీ, ఆ గాలికీ, మనం మొలకెత్తిన ఆ ధూళికీ గుండె నిండా కృతజ్ఞతలు నింపుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పివద్దాం. నూతన సంవత్సరం ఎప్పుడా అనా? నీ గుండెలో నీ వూరు పల్లవించిన మరుక్షణమే నూతన సంవత్సరం. అందుకే హాయిగా జ్ఞాపకాల్ని నెమరేసుకుందాం.

 

మీ భువనచంద్ర​...

Bio

భువనచంద్ర

నూజివీడు దగ్గర గుల్లపూడిలో జన్మించి, 18 సంవత్సరాలకి పైగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసి, , నాలుగు వార్ మెడల్స్ పొందిన తరువాత భువన చంద్ర పదవీ విరమణ చేశారు.  తరువాత విజయ బాపినీడు గారి “నాకో పెళ్ళాం కావాలి” అనే సినిమాలో 1987 లో పాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసి, సుమారు వెయ్యి చిత్రాలలో 2500 పైగా పాటలు రచించి విలక్షణమైన కవిగా లబ్ధ ప్రతిష్టులయ్యారు. స్క్రీన్ ప్లే, సంభాషణల రచయిత గానూ, నటుడిగానూ రాణించారు. అనేక పత్రికలలో కథలు, వ్యాసాలూ, ఒక ఆధ్యాత్మిక సీరియల్ మొదలైన ప్రక్రియలలో నిత్య సాహితీ కృషీవలుడిగా, మంచి వ్యక్తిగా పేరున్న భువన చంద్ర గారి నివాసం చెన్నై మహా నగరం.

***

Bhuvanachandra
bottom of page