top of page

సంపుటి 1 సంచిక 1

Website Designed &  Maintained by  Srinivas Pendyala                       www.facebook.com/madhuravanimagazine

ఆహ్వానిత మధురాలు

సనాతనం నిత్య నూతనం

ఎస్. నారాయణస్వామి

మనవాళ్ళకి ‘ఏన్షియంట్’ అనే మాట అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది. మన తోటి భారతీయుల్ని, అందునా హిందూ మతస్తులని ఎవరినైనా కదిలించి చూడండి కావాలంటే - అబ్బో మా దేశం పాతది, మా మతం, మా సంస్కృతి ఇంకా చాలా పాతవి. ఏ.. ఏఏ .. న్షియంట్ అని నొక్కి వక్కాణిస్తారు. దానికి తోడు వేదపురాణాల్లోనే మన జీవన విధానాన్ని సనాతన ధర్మం అని పిలిచారాయెను. సనాతనం అనగానే మన ఛాతీలు ఉప్పొంగుతాయి. ఎవరికీ అర్ధం కాని సంస్కృత స్తోత్రాలూ, నాచుపట్టిన రాతి కట్టడాల దేవాలయాలూ, వాటి గోడల మీద అద్భుతమైన శిల్పాలూ - ఇవన్నీ యమర్జెంటుగా మన కళ్ళ ముందు మెరుస్తాయి. ఇంతలో అనుమానమొచ్చి ఇంగ్లీషు డిక్షనరీ తెరుస్తామా, వాడు చెప్పనే చెబుతాడు, సనాతనమంటే ఏన్షియెంటే కాదురా నాయనా ‘ఎటర్నల్’ కూడా - అని. ఇహ అప్పుడు మొదలవుతుంది మన తంటా.  


ఒక్క మాటలో చెప్పుకోవాలంటే స్థల కాల పరిమితులకి అతీతంగా విలసిల్లవలసినదన్న మాట, మరి సనాతన ధర్మమంటే. అమెరికాకి రావడమంటే వచ్చేశాం, ఏదో నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక కాస్త రామా కృష్ణా అనుకోవడానికి మనకంటూ ఒక చోటుండాలని జాగా దొరికిన చోటల్లా దేవాలయాలు కట్టేసుకున్నాం కానీ, మన పక్కింటి వాడు - చర్చి వాడో, సినగాగు వాడో - ఏవోయి, ఏవిటి మీ పద్ధతులు, ఏం చేస్తున్నారు మీరు, మీ నమ్మకాలేవిటి అని మూడు పుంజీల ప్రశ్నలడిగే సరికి - అప్పుడు మన గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. అప్పుడు పుడుతుంది ప్రశ్న - ఇంత ప్రాచీనమూ, సనాతనమూ అయిన మన ధర్మం నిజంగా ఇప్పుడు మన జీవితానికి పనికొస్తున్నదా? సనాతనం ఎటర్నల్ ఐతే మరి అప్పటిదే ఇప్పుడూ రేపూ ఎల్లుండీ కూడా పని చెయ్యాలి కదా? జంబూద్వీపాన్ని దాటి ఈ క్రౌంచద్వీపంలో కూడా పని చెయ్యాలి కదా?  


చేసింది, చేస్తున్నది, చేస్తుంది అని కనీసం రెండు ఋజువులు మనకి అందుబాటులో ఉన్నాయి. మొదటి ఋజువు స్వామి వివేకానందుల రూపంలో షికాగో మహానగరంలో 1893లో ఈ క్రౌంచద్వీపంలో సాక్షాత్కరించింది. "అమెరికావాసులైన సోదర సోదరీమణులారా!" అనే ఒక్క సంబోధనతో ‘వసుధైక కుటుంబకం’ అనే సనాతన ధర్మపు ఒక మూల సూత్రాన్ని ఆవిష్కరించాడు  మహానుభావుడు. నూట పాతికేళ్ళ తరవాత ఈ రోజున అమెరికాలో యోగా, హోలిస్టిక్ లివింగ్, మైండ్ఫుల్ లివింగ్ వంటివి పడికట్టు మాటలుగా చలామణి కావడమే కాక, పలు నగరాలలో ఆయన పేరిట వివేకానంద సెంటర్లు, వివేకానంద యోగాశ్రమాలు వర్ధిల్లుతున్నాయి. అంతేకాక, ద్వేష కావేషాలతో రగులుతూండి సమన్వయానికి అనువు గాని చోట సర్వ మత సంభాషణకి ఒక వేదికనేర్పాటు చేసి తద్వారా ధర్మం యొక్క సనాతనత్వాన్ని నిరూపించాడు.


మనకి మార్గదర్శకమయ్యే రెండో ఋజువు, ఇంచుమించుగా అదే సమయంలో అటు జంబూద్వీపానికీ ఇటు క్రౌంచద్వీపానికీ రెండిటికీ చాలా దూరంలో - ఆఫ్రికా ఖండంలో, సౌతాఫ్రికా దేశంలో రూపు దిద్దుకున్నది. అక్కడ దిద్దుకున్న చిన్ని రూపం భారతదేశంలో త్రివిక్రమంగా ఎదిగి మహా ప్రభంజనమై రవియస్తమించని బ్రిటీషు సామ్రాజ్యంలో మొట్టమదటి సూర్యాస్తమయానికి తెరతీసింది. ఆ త్రివిక్రమ రూపం మహాత్మా గాంధీ అని వేరే చెప్పనక్కర లేదనుకుంటాను. సనాతన ధర్మానుసారంగా గాంధీ రూపొందించిన సత్యాగ్రహ సరళి ఆ దివ్యతేజం పార్ధివదేహాన్ని విడిచిపోయినా, సుమారు ఇరవయ్యేళ్ళ తరవాత అమెరికాలో సాంఘిక సమానత కోసం ఉద్యమిస్తున్న నల్లజాతి వారికి స్ఫూర్తినిచ్చినాయి. ముఖ్యంగా, వారి నాయకుల్లో ముఖ్యుడైన మార్టిన్ లూథర్ కింగ్ ని విశేషంగా ప్రభావితం చేశాయి. అలా రగిలిన స్ఫూర్తే ఈ రోజున శ్వేతసౌధంలో నల్లవజ్రాన్ని పొదిగిందంటే అతిశయోక్తి కాదు.


ఐతే ఈ రోజున ఈ ఇరవయ్యొకటో శతాబ్దంలో, ఎన్నికలు మనకి కన్ను కొడుతున్న ఈ కొత్త సంవత్సరంలో, ఎన్నో కుతర్కాలు స్వైర విహారం చేస్తున్నాయి. మరెన్నో అనుమానాలు పొంచి ఉన్నాయి. నిజాన్ని మరుగు పరిచే మసకబారినతనం ప్రపంచమంతా వ్యాపిస్తున్న వేళ ఎటర్నల్గా వెలిగే సనాతన ధర్మమే మనకి దారి చూపాలి. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీల మహోజ్జ్వల వ్యక్తిత్వాలు మనకి నిత్య మార్గదర్శకాలు కావాలి.  లోకాస్సమస్తాస్సుఖినోభవంతు!

 

******

Anchor 1

ఎస్. నారాయణస్వామి

ఎస్. నారాయణస్వామి చిరకాలంగా మిషిగన్ వాస్తవ్యులు, ఆటోమోటివ్ రంగంలో వృత్తి. సుమారు ఇరవయ్యేళ్ళుగా కథలు రాస్తున్నారు. 'కొత్తపాళీ' అనే బ్లాగు నిర్వహిస్తున్నారు. సాహిత్యమంటేనే కాక అన్ని రకాల లలిత కళలంటేనూ ఆసక్తి, కొన్నిటిలో ప్రవేశం. ఉద్యోగంలో చేరిన తరువాత మొదలు పెట్టి పన్నెండేళ్ల పైగా భరతనాట్య సాధన చేసి అనేక ప్రదర్శనలు ఇచ్చారు. స్థానిక ధార్మిక కార్యక్రమాలలోనూ లలితకళా కార్యక్రమాలలోనూ  చురుకుగా పాల్గొంటారు.  రెండేళ్ళుగా తానా పత్రిక సంపాదకులుగా ఉన్నారు. 
 

*****

bottom of page